నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు
వీధిలో నడిచిపోతున్నారు కలిసి ఇద్దరిద్దరు
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు
ఆనందంగా ఎట్లుండాలో వారికి బాగా తెలుసు
ఆ కళ్ళల్లో కళ్ళుంచి, ఆ చేతిలో చేయుంచి
కలిసి పోతున్నారు, ప్రేమికులై, మర్నాడంటే భయంలేక
ఔను, కానీ నేను
ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో, గుండెదిగులుగా
ఔను, కానీ నేను
ఒంటరిగా పోతాను, నన్ను ప్రేమించేవాడు లేడుగనుక
నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే
రెండూ అన్నివిధాలా ఒకటే
రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి
నా చెవిలో “నిన్ను ప్రేమిస్తున్నా” అని గుసగుసలాడరు ఎవరూ
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు
కలిసి కడుతున్నారు భవిష్యత్తుకి పథకాలు
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు
తెలుసు వారికి బాగా, ప్రేమించడం అంటే ఏమిటో
ఆ కళ్ళల్లో కళ్ళుంచి, ఆ చేతిలో చేయుంచి
కలిసి పోతున్నారు, ప్రేమికులై, మర్నాడంటే భయంలేక
ఔను, కానీ నేను
ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో, గుండెదిగులుగా
ఔను, కానీ నేను
ఒంటరిగా పోతాను, నన్ను ప్రేమించేవాడు లేడుగనుక
నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే
రెండూ అన్నివిధాలా ఒకటే
రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి
నాకోసం ఎప్పుడు ప్రకాశిస్తాడు, దిండుగా మరి సూరీడు?
నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ
తెలుసుకుంటానా మరి ప్రేమంటే ఏమిటో?
నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ
అనుకుంటున్నా ఎప్పుడు వస్తుండా ఆ రోజని
ఆ కళ్ళల్లో కళ్ళుంచే, ఆ చేతిలో చేయుంచే
గుండే నిండుగా ఆనందంగా, మర్నాడంటే భయంలేక
నా గుండె దిగులుగా అసలు ఉండనే ఉండని రోజు
నన్ను కూడా నిండుగా ప్రేమించే ఎవరో కలిగుండే రోజు
1962వ సంవత్సరంలో ఫ్రాన్సువాజ్ హార్డీ అనే గాయని పాడి విడుదల చేసిన “తూ లె గార్సోంజె లె ఫియ్ ద మోనాజ్” (నా వయసులోని అందరు అబ్బాయిలు అమ్మాయిలు) అన్న ఫ్రెంచిపాట ఇది. ఆ 60వ దశకంలో ఫ్రాన్సుదేశంలో వచ్చిన ఈ సంగీతాన్ని యే-యే సంగీతం అంటారు. పడుచు అమ్మాయిలు పాడిన ఈ యే-యే పాటలు అమెరికాదేశం నుండి వస్తున్న సంగీతపద్ధతులను, జావళీలను ఫ్రెంచిభాషలో ఫ్రెంచి సంస్కృతికి అన్వయించాయి. ఎందరో మంచి గాయనులు అప్పుడు వెలుగులోకి వచ్చినా, అందులో ఫ్రాన్సువాజ్ హార్డీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈమె ఎన్నెన్నో దశాబ్దాలుగా మధురమైన పాటలు ఆలపించి ఎందరో అభిమానులను చేగొంది.