“తెలుగు” అన్న పదం ఎక్కడినుండి వచ్చింది?

Draksharamam
ద్రాక్షారామంలో శివాలయం: దక్ష ప్రజాపతియొక్క ఆరామం కలింగ జనపదానికి మూలస్థానం
“తెలుగు” అన్న పదానికి అర్ఠం ఏమిటి, మూలం ఏమిటి, అని ఎవ్వరైనా తెలుగువారు ఎప్పుడైనా ఆలోచించక ఉండరు. ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయం ప్రకారం “తెలుగు” అన్న పదం “త్రిలింగము” అన్న ప్రాకృత పదానికి వికృత రూపముగా వుత్పత్తిచెందింది అని. త్రిలింగము అనగా మూడు దిశలలో ఉన్న మూడు శైవక్షేత్రాల మధ్యనున్న ప్రదేశము. ఈ మూడు క్షేత్రాలు ద్రాక్షారామము, కాలేశ్వరము, శ్రీశైలము. ఈ “త్రిలింగము” అన్న పదము 10వ శతాబ్దిలో రాజశేఖరుడు అనే కవిచే రచించబడిన “విద్ధశాలభంజిక” అనే నాట్యశాస్త్ర గ్రంథములోను, తరువాత 13వ శతాబ్దిలో విద్యానాథుడు రచించిన “ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం” అను సాహిత్యశాస్త్ర గ్రంథములోను ప్రస్తావించిబడి ఉన్నది.
ఈ త్రిలింగదేశములోని సముద్రతీరములోనున్న భాగాన్ని “కలింగము” అని కూడా చరిత్రలో ప్రస్తుతించారు. గోదావరి నుండి మహానది వరకు తీరంవెంట నున్న ఈ కలింగదేశమునుండి చాలామంది వర్తకులు సైనికులు ఓడలు వేసుకుని బంగాలాఖాతం అవతలనున్న థాయి, కాంభోజ, మలయ దేశాలు వలసివెల్లి వచ్చారు. ఆ దేశలలొ, భారతదేశాన్ని యావత్తు “కెలింగ్” లేదా “కలింగ్” అని ఇప్పటికీ పిలుస్తారు. పాశ్చాత్యులు భారతదేశాన్ని యావత్తు సింధుసంస్కృతిని అనుసరించి “హిందు”, “ఇందు” లేదా “ఇండియా” అని ఎలా గుర్తించారో, మన పొరుగువారైన ఈ ప్రాచ్య దేశలు “కలింగ” సంస్కృతిని అనుసరించి భారతదేశాన్ని యావత్తు కలింగము అని గుర్తించారు. మహాభారతములో మన భారతదేశములోని వివిధ దిశలలోనున్న వివిధ జనపదాలు ప్రసక్తించబడ్డాయి. అందులో కలింగము, ఆంధ్రము అను రెండు జాతులను ప్రస్తుతించారు. ఆంధ్రులు కొండప్రాంతములలోను, అడవి ప్రాంతములలోను అంధకారమయమైన ప్రదేశాలలోను వసించుచుండగా, కలింగులు తీరప్రాంతములలో మత్స్యకారులుగాను, సేద్యముచేయు రైతులుగాను మలసివున్నారు. ఇందువలన కలింగదేశము సంస్కృతిపరంగా మెచ్చుగా ఉండి, మిగిలిన ప్రాంతాలను తరువాతి కాలములో క్రమక్రమముగా కలుపుగొని ఉండవచ్చు. కలింగదేశముయొక్క సంస్కృతి మిగిలిన ప్రదేశాలలో వెలసబడిన పిమ్మట ఆ ప్రాంతములను కలిపి “మూడుకలింగము” లేదా “ముదుగలింగము” లేదా “త్రికలింగము” అని పిలవబడ్డాయి.
“అంధకారము” లేదా “అంధకారణ్యము” అన్న సంక్స్కృతపదాలనుండి “ఆంధ్రము” అన్న పదము వుత్పత్తి చెందిన అవకాశమున్నది. “కలింగము” అన్న పదము శైవక్షేత్రాన్ని సూచిస్తున్నది. “ఖ” అనగా సంస్కృతములో ఆకాశము, విశ్వము. రోదసిని ఖగోలము అని ఇప్పటికీ నానుడిలో అంటున్న పదము. “లింగము” శైవమతములో శివుడికి చిహ్నము. ఆకాశలింగము అనగా ఋతుక్రమములో ఆకాశమున నక్షత్రములు మెదిలే బాటను కుదుటపరిచే చిహ్నము అని. మన పూర్వీకులు ఈ ఋతుక్రమమును అనుసరించడానికి అనేక నక్షత్రములను గుర్తించారు. అందులో మృగవ్యధ నక్షత్రము (ఇంగ్లీషులో సిరియస్ అని అంటారు) ప్రత్యేక గుర్తుంపు కలిగి ఉన్నది. దీని ఆవర్తన గడువు సుమారుగా 365.25 రోజులు. అందువలన ఏడాదిలో ఋతువుల పునర్ప్రారంభానికి ఈ నక్షత్రము మంచి కొలమానాన్ని అందిస్తుంది. సాంఖ్యశాస్త్రం ప్రకారం ప్రకృతి అంతా పురుషిని చుట్టూ పరిభ్రమిస్తుంది అని నమ్మకము, శైవమతం ఈ పురుషుడిని శివునిగా గుర్తించుతుంది, అందువలన మృగవ్యధ నక్షత్రం శివుని చిహ్నంగా గుర్తింపబడింది.
మనుషులు ఎప్పుడైతే నక్షత్రమానాన్ని కొలవగలిగేరో, అప్పుడు వారు వ్యవసాయం చెయ్యడానికి సామర్థ్యము పొంది ఉంటారు. సరైన సమయములో నారు పెట్టడము, నీరు పొయ్యడము, పంట కోయడము చెయ్యగలుగుతారు. అందువలన ఈ నక్షత్రమానాన్ని సూచించగలిగిన క్రతువులు, ఆచారములు ఎటువంటి నాగరికతకైనా అతిముఖ్యమైనవి. భారతీయులు ఈ ఋతుక్రమమును గణించు సిద్ధాంతములలో అగ్రగణ్యులు అని గ్రీకులు, ప్రథములు అని అరబ్బు శాస్త్రవేత్తలు వారి వారి గ్రంథములలోనే ప్రకటించారు. మన భారతదేశములో కాశీనగరము, కాశ్మీర క్షేత్రము, రాజస్థానులోని పుష్కర నగరము, మధ్య ప్రదేశులోని ఉజ్జయిని నగరము ఇలా బహుప్రదేశాలు ఖగోలశాస్త్రమానానికి ఖ్యాతిచెంది ఉన్నాయి. అందులోని అతి ప్రాచీన ఖగోల పరిశీలనా క్షేత్రాలలో ద్రాక్షారమము కూడా ఒకటి. ఈ “ద్రాక్షారామము” అన్న పదము “దక్షారామము” అనగా “దక్షుని ఆరామము” నుండి వుత్పత్తి చెందింది. దక్షుడు అనగా ప్రజాపతి, జనపదములలో ప్రజలకు ఆధ్యుడు, మొదటివాడు. “ఆరామము” అనగా ఉద్యానవనము. కాలువలలో నీరు పెట్టి పంటలకు మల్లించి సేద్యము చెయ్యడం ఈ “ఉద్యానవనము” లో మొదలైనది. “ఉద” అనగా నీరు, “ఆయనము” అనగా బాట. ఉదకమును ఆయనము పట్టించిన ప్రదేశము ఉద్యానము. గోదావరి నది తీరమున పురాతన కాలములో మన పూర్వీకులు ఎప్పుడో కాలవలు తవ్వి, పంటలు వెయ్యడము మొదలుపెట్టారు. ఆ పంటలను తిని పెరిగిన జాతి కలింగ జాతి. ఈ కలింగ దేశము గోదావరి తీరములోనే మొదలయినది. ఈ తీరములోని రాజమహేంద్రి నగరము దేశానికి ముఖ్యక్షేత్రము. కోరింగ పట్టణము ముఖ్య రేవు పట్టణము. ఆ తరువాతి కాలములో మహానది తీరమువరకూ ఈ కలింగదేశము వ్యాప్తి చెందినది. ఈ దేశములోని వర్తకులు, నావికులు సముద్రవ్యాపారము చేసి ఎంతో ఆస్తిని, ఖ్యాతిని గణించారు. వీరి ప్రభావము వలన థాయి, కాంభోజ, మలయ దేశాలలోని భాషలు, లిపులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించి ఉంటాయి.
ఈ కలింగ దేశము మూడు దిశలుగా విస్తరిల్లి, మూడు శైవక్షేత్రాలు స్థాపించి “త్రికలింగము” లేదా “త్రిలింగము” అని ప్రాచుర్యములోకి వచ్చింది. కానీ ఇది చాలాకాలము తరవాత జరిగిన పరిణామము. “తెలుగు” అన్న భాష ఇంత ఆలస్యముగా వృద్ధి చెంది ఉండదు. మన పురాణములలో కూడా “తిలింగము” లేదా “తెలింగము” అన్న పదము “త్రిలింగము” కంటా చాలా కాలం ముందునుండి ప్రస్తావించబడి ఉంది. ఈ ప్రస్తావన చాలా ప్రాచీన గ్రంథాలైన మార్కండేయ పురాణము, వాయు పురాణములలో ఉంది. కనుక, “త్రిలింగము” అన్న పదం “తెలింగము” లేదా “తెలుగు” అన్న పదానికి మూలము కాదు. కేవలం యాధృచ్చికమైన సంభవము మాత్రమే ! ప్రాచీన తమిళగ్రంథమైన “అగత్తీయం” లో కూడా “తెలుంగము” అని ప్రస్తావించి ఉన్నది.
మరి “తెలుగు” అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ద్రవిడభాష సిద్ధాంతాన్ని అనుసరించి గంటి జోగి సోమయాజి అనే పండితులు తమిళ పదాలనుండి వుత్పత్తి చెయ్యడానికి ప్రయత్నించారు. “తెన్” అనగా తమిళములో దక్షిణము అని అర్థం. “కూ” అనగా ఒక కూత. “తెన్ + కూ” కలిసి “తెనుగు” లేదా “తెలుగు” అయ్యింది అని గంటి సోమయాజూలవారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆచార్య కస్తూరి విశ్వనాథం గారు “తీపి కన్నను తీపి నా తెలుగు పలుకు” అన్న పుస్తకంలో సమర్థించారు.
ఈ ద్రవిడభాషా సిద్ధాంతము 19వ శతాబ్దిలో బ్రిటీషు దొరల వెర్రి జాత్యహంకార సిద్ధాంతాన్ని అనుసరించి తయారయ్యింది. కాల్డ్వెలు అనే ఒక బ్రిటిషు బిషప్పు దక్షిణ భారతీయులు సైబీరియా ప్రాంతములోని షమానులు అనే క్షుద్రోపాసకులనుండి వుత్పత్తి చెందారు అని ప్రతిపాదించాడు. ఈ “డెమోనోలాట్రీ” లేదా దెయ్యాలను, భూతాలను పూజించే క్షుద్రోపాసన ద్రవిడ సంస్కృతికి మూలము అని, కొంతవరకు ఈ క్షుద్రసంస్కృతి ఉత్తరమునుండి వచ్చిన ఆర్యుల వలస వలన కొసరుగా మేలుచెందింది అని ప్రతిపాదించాడు. విడ్డూరం ఏంటంటే ఈ వికృత క్షుద్ర సిద్ధాంతాన్ని తమిళనాడులో ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. ఈ బిషప్పు కాల్డ్వెలు ప్రతిపాదించన క్షుద్ర ద్రవిడజాతి యొక్క మూలము తమిళ జాతిలోనే ఉంది అని, మిగిలిన దక్షిణ భారతీయ భాషలు సంకర భాషలు అని ఇప్పటికీ కూడా చాలామంది విశ్వసిస్తున్నారు. అందువలనే ఆ జోగి సోమయాజులు “తెలుగు”ను దక్షిణపు కూత అని ప్రతిపాదించారు.
ఇదికాక మారేపల్లి రామచంద్రి శాస్త్రి అనే వేరొక పండితులు “తెలుగు” అన్న పదాన్ని గోండు భాషనుంది వుత్పత్తి చెయ్యడానికి ప్రయత్నించారు. భాషా శాస్త్రవేత్తల ప్రస్తుత అంచనాల ప్రకారం కోయ, గోండు భాషలు తెలుగు భాషకు దగ్గర సారూప్యాన్ని కలిగి ఉన్నాయి. గోండు భాషలొ “ఉంగి” అంటే బహువచనం అని “తెలు” అంటే తెల్లటి చర్మము కలిగినవారు అని, అందువలన “తెలుంగు” అంటే “తెల్లటి జాతి” అని వివరణ ఇచ్చారు. ఇది కూడా గొప్ప ప్రయత్నమే కావచ్చు కానీ చివరికి ఒక మూర్ఖ సిద్ధాంతము మాత్రమే.
చోద్యం ఏమిటంటే “తెలుగు” అన్న పదాన్ని ఇప్పటి వరకు తెలుగుభాషనుండే వుత్పత్తి చెయ్యడానికి ఏ భాషా పండితులు ప్రయత్నించి ఉండలేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇది గుర్తించిన తరువాత ! కొంత సూక్ష్మంగా దృష్టి సారిస్తే “తెలుగు” అన్న పదం నిర్మించడం అతి సులువైన పని. తెలుగు భాషలో “తెలుసు” అనగా ఎరుక, అవగాహన కలిగి ఉన్న విషయము. ఇది అతి ప్రాచుర్యంలో ఉన్న పదము. “తెలుపు” అనగా విషయం వివరించుట. కనుక, “తెలుగు” లేదా “తెలుంగు” అంటే “అర్థం అయ్యే భాష” అని ! ఇది అతి సులువుగా నిర్మించదగిన పదము. “గు” అను ప్రత్యయం తెలుగు భాషలో చాలా పదాలలో నిమిడి ఉన్నది. ఇది “అగు” అన్న పదానికి సూక్ష్మీకరణము. “వెలుగు” అనగా “వెలు” (తెలుపుగా, కాంతిగా) అగుబడిన పదార్థము. ఈ “వెలు” మూలమునుండి “వెలుక, వేల్పు, వెల్ల” మొదలైన పదాలు వుత్పత్తి చెందినవి. ఇదేవిధముగా “పెరుగు” అన్న పదము “పెరు” (వృద్ధి చెందు) అగుబడుట అని నిర్మించబడినది. ఈ “పెరు” మూలమునుండి “పేర్చు” మొదలైన పదాలు వుత్పత్తి చెందినవి. “తునుగు” అనగా తునకలుగ చేయు (ముక్కలు ముక్కలుగా నరుకు) అని అర్థము. కనుక “తెలుగు” అన్న పదము “తెలియబడేట్లు అగుబడిన భాష” అని. ఒకసారి ఈ విధముగా గుర్తించిన తర్వాత మిగిలిన వుత్పత్తి సిద్ధాంతాలు అన్ని హాస్యాస్పదముగా కనపడుతున్నాయి నాకు.
“అర్థమయ్యే భాష” లేదా “అర్థమయ్యే మనుషులు” అని చాలా భాషలలో స్వసూచకమైన పదాలు ఉన్నాయి. జర్మను భాషను ఆ భాషలోనే “డాయుట్ష్” భాష అంటారు. “డాయిటెన్” అనగా అర్థమవ్వుట అని అర్థము. “బెడాయిటుంగ్” అనగా అర్థము, తాత్పర్యము. ఈ “ష/ఇష్” అన్న ప్రత్యయమ జర్మను భాషలలో చాలా పదాలలో విశేషణమును సూచిస్తుంది (ఉదాహరణకు “ఇంగ్లీషు”లో “ఇష్” కూడా). ఈ విధముగా “డాయిటె-ఇష్” అన్న మూలమునుండి “డాయిట్ష్” లేదా జర్మను భాష/జాతి సూచకమైన పదము నిర్మించబడింది. “తెలుగు” లేదా “తెలుంగు” ఇదేవిధంగా తయారయ్యింది.

మేరు పర్వతం – మనిషి అంతరంగం

మేరు పర్వతం అంటే మీకు తెలుసా ? మన పురాణాల ప్రకారం, మేరు పర్వతం విశ్వం మధ్యన నెలవుండి 84,000 యోజనాల ఎత్తుంటుందంట. అంటే 10.8 లక్షల కిలోమీటర్లు. పోలికకి, భూమిపైనున్న అతి పెద్ద పర్వతం ఎవరెస్టు ఎత్తు కేవలం 8.8 కిలోమీటర్లు.  మేరు పర్వతం గురించి మరికొన్ని విశేషాలు :  సూర్య చంద్రులు, విభిన్న గ్రహాలు, నక్షత్రాలు రోజూ మేరు పర్వతం చుట్టూనే ప్రదిక్షణ చేస్తాయట. ఈ పర్వతం పైభాగాలలో ఇంద్రాది దేవతలు నివశిస్తుంటారట. ఈ పర్వతం అష్ట దిక్కులలో అష్ట దిక్పాలకులు రాజ్యం చేస్తుంటారట. కనుక, ఈ మేరు పర్వతం ఆషామాషీ పర్వతం ఏమీ కాదు. లెక్కకు మిక్కిలి మంది చారిత్రీకులు మేరు పర్వతానికిదే మూలం అంటూ వేరు వేరు పర్వతాలను సూచించారు. కానీ ఇవేమీ దీనికి సరిపోవు.  ఖగోళ పరిశోధకుడు, జ్యోతిష్యుడైన వరాహమిహిరుడు 5వ శతాబ్దంలో మేరు పర్వతం అంటే ఉత్తర ధృవం అని ప్రతిపాదించాడు. అదికూడా పోలికకి సరిపోదు.

ఈ బ్లాగుపోస్టులో, మేరు పర్వతం అంటే ఏమిటో రహస్యం మీకు వివరింప ప్రయత్నం చేస్తాను. భారతీయ సంస్కృతి, ఆచారాలు, ఇతిహాసాలు, కళాకృతులు, భక్తిప్రవృత్తులు, తత్వ సిద్ధాంతాలకు అన్నింటికీ ఈ మేరు పర్వతం కథయే మూలం. (ఈ విషయం మీకు బ్లాగులో మరింత స్పష్టమవుతందని నా ఆశ.) కానీ చిత్రమేమిటంటే, భారతీయులకి కొద్దిమందికి కూడా దీని గురించి అవగాహన లేదు ! గుళ్ళూ గోపురాలకి వెళ్ళేవాళ్ళు; వ్రతాలు, ఉపవాసాలు చెసేవాళ్ళు; వాస్తు, జ్యోతిష్యం పాటించేవాళ్ళు; దినదినం దేవతలకి పూజచేసేవాళ్ళు; పితృదేవతలకి ప్రణామం చేసేవాళ్ళు – వీరెవ్వరు దీని గురించి పట్టించుకోరు. కానీ ఈ నియమాలన్నింటికీ మేరుపర్వతం కథయే మూలం ! అతి చిత్రమైన విషయం ఏమిటంటే మా ఇంట్లో ఇవేమీ చెయ్యరు. నేను వ్యావహారికంగా నాస్తికుణ్ణి. కేవలం కుతూహలం కొద్దీ ఈ చిహ్నాలని అధ్యయనం చేశాను.

ఇంతకీ మేరు పర్వతం అంటే ఏమిటి ? మేరు పర్వతం అంటే మనిషి అంతరంగం, మరేమీ కాదు.

ప్రాచీన కాలంలో మన పూర్వీకులైన ఋషులు చేసినదేమన్నా ఉంటే అది తపస్సు (5 వేల సంవత్సరముల మునుపు హరప్పా నాగరికత కాలం నుండే, తపస్సుకి యోగ ముద్రలకి ఆధారాలు లభ్యం అవుతున్నాయి). ఈ ఋషులు యోగ నియమాలు పాటిస్తూ, ఓపికగా క్రమంగా అంతరంగ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఈ శాస్త్రానికి చక్కని చిహ్నమే మేరు పర్వతం.

అంతరంగానికి ఐదు తలాలు

మనిషికి పంచ కోశాలు (శరీరాలు) ఉన్నాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. బొమ్మలో చూపించిన వృత్తాలవలే ఇవి ఒకదానిలో మరొకటి ఒదిగి ఉంటాయట. అన్నిటికంటే బయట వుండేది (ఊదారంగులో చూపించిన) 3D వ్యాప్తిలో ఉండే ఐహిక శరీరం. దీనినే మనం సాధారణంగా శరీరం అని అంటాం, దీనినే వైద్యులు చికిత్స చేస్తారు. దీనిలోపల వేరే సూక్ష్మ శరీరాలు వేరే సూక్ష్మ-తలములలో ఉంటాయట. ఈ ఐదు తలాలకి సంస్కృతంలో చక్కని పేర్లున్నాయి. అవేమిటంటే,

అన్నమయం : ఇది భౌతిక తలం – అంటే అణువులు, శక్తి తరంగాలతో కూడి ఉన్న 3D వ్యాప్తి. దీనినే భౌతిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. నిర్జీవ పదార్థాలైన రాళ్ళు, రప్పలు కేవలం ఈ తలంలోనే నిమిడి ఉంటాయి. సంస్కృతంలో “అన్నం” అనగా నిర్జీవ పదార్థం అని అర్థం. ఏదైనా తిండి భుజించేటప్పుడు దానికి జీవం ఉండదు కాబట్టి దానిని అన్నం అని అంటాం.

ప్రాణమయం : ప్రాణంతో నివశించే మొక్కలు, వృక్షాలు అన్నమయ తలంతో పాటు ప్రాణమయ తలంలో ఉంటాయట. కనుక వీటికి రెండు కోశాలు (శరీరాలు). మునుపటి తలం ఈ తలం కన్నా హెచ్చింపు వ్యాప్తి కలిగి ఉంటుంచి. విశ్వం యొక్క పరిణామంతో పోలిస్తే ప్రాణులు నివశించే ప్రదేశం (ప్రస్తుతానికి భూమి తక్కించి వేరే గ్రహాలు మనకు తెలియవు) అతిచిన్నది కదా ! ప్రాణమయ తలం అంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. వ్యాప్తిలో చిన్నదైనా, ప్రాణమయతలం అన్నమయతలంతో పోలిస్త్ హెచ్చింపు క్లిష్టమైనది. ఇది జీవ అణుసముదాయాల క్లిష్టత్వంలో మనకు కనపడుతుంది.

మనోమయం : మెదడు కలిగి ఉండే జంతువులు ఈ మూడవ తలంలోకి సారించి ఉంటాయి. జీవశాస్త్రంలో దీనిని ఇంద్రియ-యాంత్రిక వలయం అని అంటారు. అంటే పరిశరాలని గ్రహించి వెనువెంటనే ప్రతికృతి చెయ్యడం అన్నమాట. వ్యాప్తిలో చిన్నదైనా, మనోమయం ప్రాణమయం కంటే హెచ్చింపు క్లిష్టమైనది. జంతువుల మెదడులోని నరాల అల్లికలో ఈ క్లిష్టత్వం మనకి కనపడుతుంది.

విజ్ఞానమయం : విజ్ఞానం అనగా భాషతో వ్యక్తీకరింపగలిగే జ్ఞానం అని అర్థం. ప్రకృతిలోని వస్తుధర్మాలను వేటినైనా మానవ భాషలలో వివరించవచ్చు. ఈ భావాలను ఆవృత్తి చేసుకోగలరు గనక మనుషులు విజ్ఞానమయతలంలో సారించి నివశించుతుంటారు. ఈ తలం మనోమయతలం కన్నా హెచ్చింపు క్లిష్టమైనది. మానవ భాషలలోని పదాల పొందికలోను, మనుషుల మధ్య సందేశాల పొడవులోను ఈ క్లిష్టత్వం మనకు అగుపడుతుంది. కంప్యూటరు భాషలు కూడా పెక్కు క్లిష్టమైనవి కనుక మనం కంప్యూటర్లను కూడా ఈ తలంలో ఊహించుకోవచ్చు.

చిన్మయం : “ఇది నేను” అని తర్కించగల నేర్పథ్యం మనుషులకి కలదు. దీనిని సంస్కృతంలో అహంకారం అని అంటారు (“అహం” అనగా “నేను”). ఈ తలం విజ్ఞానమయ తలం కన్నా హెచ్చింపు క్లిష్టమైనది. ఎందుకంటే మునుపటి తలంలో కేవలం వస్తుధర్మాలనే తర్కించగలము, ఈ తలంలో స్వధర్మాలను కూడా తర్కించవచ్చు. మనుషులు ఆలోచించి అమలుజరపగల పథకాలలో ఈ క్లిష్టత్వం మనకు అగుపడుతుంది. అహంకారం అనేది మనిషి జ్ఞప్తికి ముడిపడి ఉంటుంది. ఇది అతిసూక్ష్మ శరీరం. దీనిపైన వేరువేరు వివేచన కార్యాలను ఒకదానికి మించి మరొకటి క్లిష్టమైనవి విడగొట్టవచ్చు. చాందోగ్య ఉపనిషత్తులో వీటినిలా వివరిస్తారు : నామం, వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, ఆత్మ విజ్ఞానం, బలం, స్మరణ, ఆశ, శ్రద్ధ, నిష్ట, కృతి, సుఖం.

ఈ ఐదు తలాలలోను మనిషి వేటిమీదనైనా దృష్టిపెట్టి ఫలం పొందవచ్చును. కానీ, క్రింది తలాలకన్నా పై తలాలలో సుఖం హెచ్చింపు దొరుకుతుందట. ఆ ఫలం పరిణామం బట్టి ఈ ఐదు వృత్తాలను ఒక పర్వతం వలే ఊహించుకోవచ్చు (ఈ శిఖరాగ్రం పైనుండి చూస్తే ఈ పర్వతం ఐదు వృత్తాలవలే కనపడుతుంది). ఇదే మేరు పర్వతం.

ఈ విశ్వంలోని ప్రతి జీవరాశి అధికమైన సుఖం ఆశిస్తూ ఈ పర్వతం పైకి ఎక్కటానికి ప్రయత్నం చేస్తుంటుందంట. ఈ వృత్తాల మధ్యనున్న బిందువే ఈ పర్వతం యొక్క శిఖరం. ఆ చిన్న బిందువు చుట్టూ మేరు పర్వతం విరిగిపోయిందట. అంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ బిందువు వద్ద దొరికే సుఖం అనంతమైనది అన్నమాట. ఈ అనంత సుఖమునే “ఆనందం” అని మన పూర్వీకులు అన్నారు. ఆ బిందువు చుట్టున్న వలయాన్ని ఆనందమయం అని అన్నారు.

ఈ సిద్ధాంతం అనాది కాలం నుండీ భరతఖండంలో ప్రాచుర్యంలోనున్నది. బౌద్ధమతంలో కూడా ఈ మేరుపర్వతం అతి ముఖ్యమైనది. బౌద్ధులు వారి స్థూపాలను మేరుపర్వతం వలే మలచుకొన్నారు. ఏ బౌద్ధస్థూపముకన్నా అందుకనే ఐదు తలాలు గలవు. బౌద్ధం తరువాత శైవ, వైష్ణవ మతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వారి ఆలయాలను కూడా స్థూపములవలే మేరుపర్వతానికి ప్రతిబింబం వలే కట్టుకున్నారు. అందుకనే ఏ హైందవ దేవాలయం చూసినా  గుడి గోపురం మేరుపర్వతానికి ప్రతిబింబంవలే ఉంటుంది. గోపురం చుట్టు వేరు వేరు తలాలలో వివిధ మృగాల, రాక్షసుల, మనుషుల, దేవతల విగ్రహాలు ఉంటాయి. గోపురం పైన కళశం బ్రహ్మానందానికి చిహ్నమై అమరి ఉంటుంది. సరిగ్గా కళశం క్రింద గర్భ గుడిలో ఈశ్వరుని విగ్రహం ఉంటుంది – ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నట్టు. గుడిలోని భక్తులు విగ్రహం చుట్టు ప్రదిక్షణ చేస్తారు – మేరు పర్వతం చుట్టూ సూర్యచంద్రాది దేవతలు ప్రదిక్షణ చేసినట్టే. కానీ అసలు రహస్యం – ఈ పర్వతం ఒక మనిషి అంతరంగంలోనే చూడవచ్చన్నమాట.

పర్వతం ఎక్కడానికి మూడు అడుగులు

పైకి : అధికమైన సుఖం కావాలంటే పర్వతంపైకి ఎక్కడం మంచి తరహానే. దీనినే రాజస గుణం అని అంటారు. కానీ ఏ తలంలో ఉన్నా, ఆ తరువాతి తలం హెచ్చింపు ఎత్తులో ఉంటుంది. ఎంత ఎక్కప్రయత్నం చేసినా, తలందాటి ముందుకు వెళ్ళలేము. కనుక, ఈ రాజస గుణం ఎక్కువైతే, పర్వతం యొక్క అసలునైజం (ఇది మన అంతరంగంలోనే ఉంటుందని) మరచిపోయి సంపాదన కోసం (లోభి) జీవితం గడుపుతాము. ఈ సంపాదన ఎప్పటికి నిజమైన ఆనందం అందించలేదు. ఈ అతి-రాజసత్వాన్ని అన్నమయతలంలో కామం అని, మనోమయతలంలో లోభం అని, చిన్మయతలంలో గర్వం అని అంటారు. రాజసగుణానికి చక్కని ప్రతిబింబం సర్పం. తిన్న తిండిని బట్టి సర్పం పొడవు పెద్దదవుతూ ఉంటుంది. కానీ దాని జీవిత చరమకాలం వచ్చేటప్పటికి, ఎంత సర్పమైనా చావక తప్పదు.

లోనికి : ఒక తలంలో నుండి బయటపడి పై తలంలోకి ప్రవేశించాలంటే అంతరంగంలోకి దృష్టి సారించాలి. దీనినే సాత్విక గుణం అని అంటారు. భారతదేశంలో కనుగొన్న గణక పద్ధతి దీనికి చక్కని ఉపమానం చూపిస్తుంది. అంకెలు 1,2,3,.. తీసుకోండి. పైతలంలోకి అంకె ప్రవేశించాలంటే మునుపటి తలాలలో సున్నా పెట్టాలి – 9, 10, 11,… 99, 100, .. ఇదే విధంగా మన ప్రాచీనులు మనిషి ఆ తలాలలో సుఖాన్ని సన్యసించి తరువాతి తలం యొక్క సుఖం ఆశించాలని అభిప్రాయపడ్డారు. అందుకని ఈ అడుగుని లోనికి, లేదా క్రిందకు అనికూడా అనవచ్చు. గమ్మత్తుగా క్రిందకు వస్తే మరింత వేగంగా మేరు పర్వతం పైకి వెళ్ళవచ్చు !విపరీతమైన కామం తప్పించుకొనాలంటే తరువాతి మనోమయతలంలోని ఆస్తిని ఆశించాలి. విపరీతమైన లోభాన్ని తప్పించుకోవాలంటే తరువాతి చిన్మయతలంలోని (పలువురిలో) గుర్తింపుని ఆశించాలి. విపరీతమైన గర్వాన్ని తప్పించుకోవాలంటే ఆత్మజ్ఞానాన్ని వాంఛించాలి. సత్వగుణం తనంత తను ఉండలేదు, కొంత (పైతలంలోని) రాజసగుణం తోడ్పుకావాలి. సత్వగుణానికి చక్కని ప్రతిబింబం సూర్యుడు. తన లోపల తనని తపించుకోవడం వల్ల ప్రపంచానికి అంతటికీ కాంతిని ప్రసరిస్తాడు.

సమతలంగా : సమతలంగా ఉండటం అంటే ఏ అడుగు వెయ్యకపోవడం. దీనినే తామస గుణం అని అంటారు. మనిషి జీవితకాలం పరిమితమైనది కనుక, ఈ గుణానికి అర్థం ఒకటే – చావు. కనుక, ఇది మంచిది కాదని మన ప్రాచీనుల అభిప్రాయం.కానీ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, ఏ అడుగు వెయ్యకపోయినా మనం మేరు పర్వతం చుట్టూ ప్రదిక్షణ చేస్తాము. ఈ విశ్వంలో ప్రతీ వస్తువుకి ఒక అవధికాలం ఉంటుంది. ఆ సమయం ముగిసిన తరువాత మళ్ళీ అదే ప్రవర్తన కొనసాగుతుంది. దీనికి చక్కని ఉదాహరణ ఊపిరి (ప్రాణ వాయువు).ఈ ఊపిరిలో మనసు లీనమైతే మేరుపర్వతం ఒక భ్రమవలే మాయమవుతుందట.

ఈ మూడు గుణాలు ఏవీ చెడ్డవి కావు, మంచివి కావు. అతిదేంట్లోనన్నా ఎక్కువైతే అది చివరికి చేటు చేస్తుంది. సృష్టిలోని ఏ వస్తువైనా మేరుపర్వతంలో ఏదో ఒక తలంలో వశిస్తూ, ఈ గుణాలను ఒక మోతాదులో కలిగి ఉంటుంది. ఈ గుణాల పొందికవల్ల పైకో క్రిందకో కదుల్తుంది. దీనినే సాంఖ్య సిద్ధాంతం అని అంటారు. వేరు వేరు దేవతలు ఈ గుణాలనే కలిగి మేరు పర్వతం పైతలాలలో నివశిస్తారట. వీరే రకరకాలైన రాజసమూర్తులైన సర్పదేవతలు (నాగులు), సత్వమూర్తులైన సూర్యదేవతలు (ఆదిత్యులు), తామసమూర్తులైన వాయుదేవతలు (మారుతులు) – వేదాల్లోను, పురాణాల్లోను కనపడతారు. రాజస గుణం అతి ఎక్కువైతే నాగులు కాస్తా అసురులుగాను, యక్షులు కాస్తా రాక్షసులు గాను మారుతారు. అతి ఎక్కువైతే ఆదిత్యులు (ఉదాహరణకి కర్ణుడు), మారుతులు కూడా చెడ్డవారవుతారు.

మేరు పర్వతం శిఖరాగ్రం వద్ద ఈ మూడు గుణాలు అనన్యమైన దేవతాముర్తులవుతాయి. వీరినే త్రిమూర్తులంటారు – బ్రహ్మ (రాజస), విష్ణు (సత్వ), శివ (తామస). వీరి సతీమణులు వీరి ప్రతిబింబాలు – భర్తలు క్రియాకారులైతే భార్యలు వారి క్రియాశక్తులు. వాక్కు (సరస్వతి) అతి గొప్ప సర్పము – ఇంతకన్నా వేగంగా ఏదీ పెద్దదవలేదు. విష్ణువు ఆదిత్యులలో అనన్యుడు. శివుడు మారుతుల్లో అనన్యుడు. ఈ త్రిమూర్తులు మేరుపర్వతంపైన శిఖరాగ్ర బిందువు వద్దనుండంవల్ల ఒకరికొకరు కలిసిపోయి ఉంటారు. మిగిలిన గుణాలను కూడా వారి ఆభరణాలవలెనో (శివుని ఆభరణమైన సర్పము, విష్ణువు ఆభరణమైన శంఖము / వాయువు), అనుచరులవలెనో (విష్ణువు పవళించే ఆదిశేషుడు, శివుని కుమారుడైన కార్తికేయుడు ఆదిత్యులకు సేనాపతి) కలిగి ఉంటారు. అందుకనే శివకేశవులు ఒకరికొకరు ప్రతిబింబాలని అంటారు. బ్రహ్మ రాజసమూర్తి గనుక అతనిని విష్ణువుతో (సత్వము) కలిపి మాత్రమే భక్తులు ఊహిస్తారు. శివుడు తామస స్వరుపుడు గనుక విశ్వాంతములో కూడా తనే మార్పులేక నిశ్చలముగా ఉంటాడు – త్రిమూర్తులు ముగ్గురు శివునిలోనే అంతర్ధానమవుతారు.

ఇది మేరు పర్వతం కథ !

తెలంగాణా ఆంధ్రా తస్సాదియ్య డిస్కో

ఈ మధ్యన నా పీ.హెచ్.డి పనిలో బిజీగా ఉండి బ్లాగు వ్రాయడం కుదరట్లేదు..

ఈ రెండు మూడు వారాలూ.. తెలంగాణా, సమైక్యాంధ్ర గొడవలు చూసి ఒక బ్లాగు బ్లాగాలనిపించింది.. కానీ, ఏమి వ్రాయడం ? అందరు పోలిటిషన్లు కంత్రీలు.. దద్దమ్మలు. వీళ్ళని తలుచుకుంటే బీ.పీ పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు.. ప్రజాస్వామ్యం అన్న తరువాత ప్రతీ పార్టీకి ఒక ప్రణాళిక ఉండాలి. ఒకళ్ళకు ఒకళ్ళు పడనప్పుడు కనీసం నమస్తే చెప్పుకునే సంస్కారం.. వివాదాలను సామరస్యంగా చర్చించుకోవడం కావాలి.. దీనికి కొంత ఓపిక, నిబద్ధత ఉండాలి.

ఇదేమీ లేకుండా బందులు, రాజినామాలు, నిరాహారదీక్షలు, ఆత్మహత్యలు, హత్యలు.. ఏంటి ఈ సినిమా ?

పరమానందయ్య శిష్యులు లా మన పోలిటీషన్లు ఇలా సరిగమలు పలికిస్తుంటే, ఇక పరమానందయ్య గారు (అదేనండి గవర్నరు) వారి శృంగార సౌధంలో పదనిసలు వాయుస్తున్నారు..

ఈ రోజు బోరుకొట్టి సరదాగా యూట్యూబులో సంచరిస్తుంటే ఒక వీడియో దొరికింది. పదిహేనేళ్ళ క్రితం సినిమా.. అప్పట్లో తెలంగాణా విజయశాంతి, ఆంధ్రా చిరంజీవి ఓ మాంచి స్టెప్పు వేసుకున్నారు.. మనం ఒక స్టేటు లో ఉన్నా, రెండు స్టేట్లలో ఉన్నా.. భవిష్యత్తులో కూడా మన మధ్య సంబంధాలు ఇలాగే తస్సాదియ్య డిస్కోలా ఉండాలని నా మనవి..

కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద

“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”, అన్నాడు మహాకవి గుఱజాడ. ఈ మహాసత్యం గుర్తుచేసుకుని ఆచరిద్దాం. కాశ్మీరులో జరుగుతున్న అత్యాచారాలకు స్వస్తి చెబుదాం. అక్కడి మన సోదరులకి సరైన గౌరవం ఇద్దాం.

ఏమిటి మనకి కాశ్మీర్ భూమిపై ఉన్న హక్కు ? అక్కడే పుట్టి, బ్రతుకుతున్న కాశ్మీరీలకంటే ఎక్కువ హక్కు ఉందా మనకి ? వాళ్ళకి కావలసింది ఏమిటొ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అక్కడికి సైనికులని పంపి, కర్ఫ్యూలని పెట్టి, వాళ్ళ ముక్కు పిండి మనం ఏమి సాధించాలి ? ఇదా మన భారత ప్రజాస్వామ్యం ?

అరవై ఏళ్ళుగా సగం భూమి భారత్ లో సగం భూమి పాకిస్తానులో వుండి కుటుంబాలు చెల్లాచెదురయ్యి వాళ్ళు ఏడుస్తుంటే ఎప్పుడు పట్టించుకున్నాం మనం ?

సొంత గొప్ప చెప్పుకోవడం తప్ప అసలు కాశ్మీరులో ఒక్కసారైనా నిఖార్సైన ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసామా ?

ఇప్పుడు అక్కడ టీవీ చానెళ్ళు బందు చేసారు. రేపు ఇంటర్నెట్టు బందు చేస్తారు. ఎవ్వరికి కావాలి కాశ్మీరీల గోడు ?

మన తప్పుని మర్యాదగా ఒప్పుకుని, సరిచేసుకుందాం. లేకపొతే, యుగోస్లావియా దేశం వలే మనదేశం ముక్కచెక్కలయ్యిపోతుంది. మారణహోమం జరిగి లక్షలకొద్ది ప్రజలు చస్తారు. న్యూక్లియర్ యుద్ధం జరగవచ్చు. మూర్ఖత్వం వీడకపోతే అమూల్యమైన మన సంస్కృతిలో ఇక మిగిలేది ఏమీ ఉండదు.

మన భారతదేశం ఒక సంధి దశలో ఉంది. మన భవిష్యత్తు రక్షించుకోవాలంటే మనం కొంత తెలివిగా ఆలోచించి మార్గాలు వెతుక్కోవాలి.

సహనం సంస్కృతికి ఆధారం

మనిషికి అతిపెద్ద శత్రువులు అరి షడ్వర్గాలు అని మన పురాణాలు చెబుతాయి. కోపం, కామం వగైరా .. అట్లే, క్రైస్తవంలో 7 అతి పెద్ద పాపాలున్నాయంటారు.

కానీ, రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఏమని చెబుతాడు అంటే “మనిషికి గల పాపాలు కేవలం రెండే – అసహనం, అత్యాశ. అత్యాశ ద్వారా అతడు స్వర్గానికి దూరమయ్యాడు. అసహనం వల్ల అతను ఎప్పటికీ స్వర్గం చేరలేకపోతున్నాడు.” ఇలా చెప్పిన వెనువెంటనే కాఫ్కా అంటాడు. “కాదు, అసలు మనిషికి గల పాపం ఒక్కటే – అసహనం. అసహనం ద్వారానే అతను స్వర్గానికి దూరమయ్యాడు, అసహనం ద్వారానే తిరిగి స్వర్గం చేరలేకపోతున్నాడు”.

జీవితంలో ఏమి సాధించాలన్నా సహనం కావాలి. సహనశీలి అయినవాడు మనుషుల్లో అత్యుత్తముడు. ఓర్పుగలవాడు మేరుపర్వతంతో పాలసముద్రాన్నే మధించగలడు.

మనదేశ సంస్కృతిలో అతి గొప్ప విషయం మన సహనం. ఈ సహనం ఉండవల్లే భిన్న మతాలు, భాషలు, కళలు, సంగీతాలతో మనదేశం వెలుగొందుతోంది. ఇంతటి అద్భుతం ప్రపంచం మొత్తంలో ఎక్కడా మీకు కనపడదు. సహనానికి సరైన సూత్రం మన దేశచిహ్నంలోనే ఉంది. “సత్యమేవ జయతే”, అనే ఈ వాక్యం ముండక ఉపనిషత్తు నుండి సంగ్రహించి మన దేశ చిహ్నంలో పొందుపరిచారు. “సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండు, దేనికీ తొందరపడకు”, అని దీని అర్థం.

మనకు నిజంగా ఈ వాక్యం పై నమ్మకం ఉంటే “ఏదో ఆకాశం వచ్చి మీదపడిపోతోంది, మన సంస్కృతి నశించిపోతోంది, చీడపురుగులని తగలబెట్టాయాలి”, అంటూ ఆవేశపడిపోము. ఈ ఆవేశమే అన్ని అనర్థాలకు మూలదాయకం. “హుస్సేన్ కళాచిత్రాలు మన సంస్కృతిని కించపరుస్తున్నాయి.”, అని ఒకడు. “తస్లీమా నస్రీన్ మా మతాన్ని కించపరుస్తోంది”, అని ఇంకొకడు, ఇలా మనం రెచ్చిపోము.

సహనం అంటే ఏమిటి ? ఇది అర్థం చేసుకోవడం చాలా సుళువు. బయట ప్రపంచం మీ ఆలోచనలకి అనుగుణంగా లేదు, కలియుగమో ఏమో కానీ అంతా తల్లకిందులవుతోంది. మీ మాట ఎవ్వరూ వినట్లేదు. మీరు అనుకున్నట్టు, ప్రయత్నిస్తున్నట్టూ ఏమీ జరగట్లేదు. మీకు చిర్రెత్తుకొస్తోంది. ఈ సమయంలో మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వడమే సహనం అంటే.

ఈ సద్గుణం మీకు ఉంటే మిగిలిన మనుషులు ఏమి చేసినా మీ మనోనిర్మలం చెదరదు. చెప్పడానికి సుళువుగానే చెప్పేసినా ఇది ఆచరించడం అంత సుళువు కాదు.

మీరు మిమ్మల్ని సహనశీలురు అని అనుకున్నా, కొన్ని హద్దులు దాటి ఉండలేరు. ఉదాహరణలు :

 • మీ అమ్మాయి తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాను అంది.
 • పోనీ, మీకు కులం మీద పట్టింపు లేదు అనుకుందాం, మీ అమ్మాయి ఒక అవిటివాడిని ముసలివాడిని, బీదవాడిని ప్రేమించింది. అప్పుడు, మీరు ఒప్పుకోగలరా ?
 • మీ అమ్మాయి నాకు పెళ్ళి ఇష్టం లేదు, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అంది. అప్పుడు మీరు ఒప్పుకోగలరా ?
 • మీ అబ్బాయి మతం మార్చుకుని, వేరే దేశం అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అన్నాడు. ఒప్పుకుని ఆశిర్వదించగలరా ?
 • మీ అబ్బాయి స్వలింగ సంపర్కం తప్ప స్త్రీలపై ఇష్టం లేదు అని చెప్పాడు. అప్పుడు ఒప్పుకోగలరా ?
 • మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. వారిని మీరు ఆదరించగలరా ?
 • మీ చెల్లెలు పెళ్ళికి ముందు గర్భవతి అయ్యింది. ఆదరించగలరా ?

మన సమాజంలో ఇటువంటి ప్రశ్నలు రోజూ ఎదురుపడుతున్నాయి. ఇవి ఏమీ ఇష్టం లేకపోయినా వీటిని అధిగమించి మనుషలని ప్రేమించగలడం చాలా కష్టం. మనుషుల్లో అత్యుత్తములే దీనిని చెయ్యగలరు. వీళ్ళు ఏసుక్రీస్తుకు, గౌతమ బుద్ధునికి, మహ్మద్ ప్రవక్తకి, శ్రీరామునికి ప్రతిబింబాలు.

ఇంతటి కఠినమైన ప్రశ్నలు రాకపోయినా, చిన్నవాటికే అసహనం తెచ్చుకునే వారు కోట్లమంది ప్రజలు. వీరు రెడ్లు అయితే కమ్మవారంటే పడదు. వీరు హిందువులైతే ముస్లిములంటే పడదు. ఎవ్వరైనా బట్టలు కురచగా వేసుకునే స్త్రీలంటే పడదు. ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళంటే పడదు, తెలుగు మాట్లాడే వాళ్ళంటే పడదు. వేరే ప్రదేశం నుండి వలస వచ్చిన వాళ్ళంటే పడదు. స్వలింగ సంపర్కులంటే పడదు.

అన్ని రకాల వారు వచ్చి సమాజాన్ని కలుషితం చేసేస్తున్నారని ఒకటే టెన్షను. నిజానికి అసలు సమస్య బయట వాళ్ళ దగ్గర కాదు, మన మెదడులోనే ఉంది, అదే అసహనం.అసహనం అనేది ఒక వ్యాధి వంటిది. ఈ తెగులు పట్టిన సమాజం అక్కడే ముగిసిపోతుంది.

సహనం అనేది కళకి, సంస్కృతికి ములాధారం. కొత్తని స్వాగతించాలి, అప్పుడే కొత్త కొత్త కళలు, సంగీతాలు పుడతాయి. పుట్టినవన్నీ గొప్పవి కాకపోవచ్చు, కానీ వేలలో ఒకటి మంచిది బయటకి వస్తుంది. కానీ, ఇది రావాలి అంటే ముందు అన్నింటికీ స్వాగతం చెప్పాలి.

ఆధునిక యుగంలో లోకం వెనువేగంగా మారిపోతోంది. ప్రతి రోజు ఒక కొత్త ఆవిష్కరణ వచ్చి సమాజాన్ని ముంచెత్తుతోంది. మన గమ్యం ఎటు పోతున్నామో ఏమీ అర్థం కాదు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి మనిషికి ఇంత తీవ్రంగా ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇటువంటి సమయంలో సహనం యొక్క అవసరం మరింత పెరిగి ఉంది. అంతేకాక, సహనం కోల్పోతే దారుణమైన ప్రాణహాని చెయ్యడానికి సరిపోయే తుపాకులు, బాంబులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక, మనం మరింత జాగ్రత్తతో ఉండాలి.

చదువుకున్నవారు కూడా సమాజం ఎంతవేగంగా మార్పు చెందుతోందో అంచనా వెయ్యలేకపోతున్నారు. నేను చెప్పేవి ఏవో సైన్సు ఫిక్షనులాగ అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మన జీవితకాలంలోనే జరుగుతాయి.

 1. వర్చువల్ రియాలిటీ ద్వారా సుదూర ప్రాంతాల నుండే స్త్రీపురుషులు సెక్సు అనుభవించగలుగుతారు. అప్పుడు భార్య-భర్త అన్న పదాలకి నిర్వచనం ఏమవుతుంది ?
 2. జన్యు టెక్నాలజీ ద్వారా పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో, ఎలాంటి రోగాలకి నివారణ ఉండాలో తల్లిదండ్రులు ముందే డిసైను చెయ్యగలుగుతారు. అప్పుడు జాతి, ఆచారాలకి అర్థం ఏముంటుంది ?
 3. ఒక బిడ్డ జన్యువులు కేవలం తల్లి నుండి, తండ్రి నుండే కాక మొత్తం మానవ జీనోము నుండీ వస్తాయి. అప్పుడు తల్లి, తండ్రి అన్న సంబంధానికే అర్థం ఏముంటుంది ? మానవజాతి మొత్తం బిడ్డకి తల్లి కాదా ?
 4. ఒక స్త్రీ చిత్రం / వీడియో చూసి, ఆమె నగ్న సౌందర్యం ఎలా ఉంటుందో అంచనా వెయ్యగలిగే సాఫ్టువేరు తయారవ్వుతాయి. అప్పుడు ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చర్చకి అర్థం ఏమిటి ?
 5. మీరు ఒకసారి వీడియోలో మాట్లాడితే, మిమ్మల్ని మరో మనిషిగా మార్చివేసి అతడు మాట్లాడాడు అని మోసం చెయ్యగల సాఫ్టువేరు వస్తుంది. ఈ పరిస్థితిలో ఎవ్వరు చెప్పేది నిజమో. అతడు నిజంగా అనుకున్న మనిషో కాదో, ఎలా తెలుసుకోగలం ?

నేను చెప్పింది నమ్మకపోతే మీరు సెర్చిచేసి తెలుస్కోండి. (4) ఇప్పటికే తయారయ్యి ఉంది, నేను వెళ్ళబోయే కాంఫరెన్సులో ఒక విద్యార్తి దీనిపై తన పరిశోధనని సమర్పించబోతున్నాడు. ఇక (5) మీద నేను స్వయంగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 7-8 కెమేరాలు ఉండే ఒక గదిలో పనిచేస్తోంది. మరో ఐదేళ్ళలో సాధారణ వీడియోపై పనిచెయ్యగలదు.

మేము పనిచేసే చిన్నపాటి టెక్నాలజీలతోనే ఇన్ని పెద్ద మార్పులు వస్తుంటే ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు పనిచేస్తున్న టెక్నాలజీలు అన్నీ ఎలాంటి మార్పులు తేగలవో ఊహించగలరా ? ఇలాంటి టెక్నాలజీలు మనల్ని ముంచెత్తినప్పుడు మనకి మరో మార్గం ఉండదు. అందుకని, ఇప్పటినుండే సహనం అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం.

నగరాలు వర్ధిల్లాలి

నాగరికత తొలిగా బుడి బుడి అడుగులు పెట్టిన దేశం మనది. నాగరికత అంటే నగరాలలో నివశించడం. అతి పురాతనమైన హరప్పా నాగరికతలో మన పూర్వీకులు సామాజిక జీవనం చేసారు. ఈజిప్టు, మెసోపొటామియా నాగరికతలకి హరప్పా తోబుట్టువు. కానీ మిగతా నగరాలలో మహారాజులు పిరమిడ్లు కడితే హరప్పాలో పౌరప్రజలు సామాజిక ధాన్యాగారాలు, స్నాహ్నశాలలు కట్టారు. సామరస్యానికి మొదటి పుట్టినిల్లు ఈ భూమియే. హరప్పా నాగరికతలోని నగర నిర్మాణం చూస్తే ఇప్పటి ఇంజనీర్లకే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అతిచక్కగా ఆలోచించి అన్ని అవసరాలనూ తీర్చేటట్లు మన పూర్వీకులు నగరాలు నిర్మించారు.

వీరికి మనం ఇప్పుడు వారసులు కావాలి. మన జనాభాని అతివేగంగా నగరాలలోకి మళ్ళించాలి. అద్భుతమైన ప్లానింగుతో మహానగరాలు నిర్మించాలి.

ఈ మధ్యన చాలామంది పత్రికలలో, బ్లాగులోకంలో నగరాలు వచ్చి మన పల్లెటూళ్ళను చెడగొడుతున్నాయని వాపోతున్నారు. పచ్చని పంటచేలు, పిచ్చుకలు అంటూ కవిత్వం చెబుతున్నారు. నగరాలు వచ్చి అన్నింటినీ మంట కలిపేస్తున్నాయి అని గోలచేస్తున్నారు. విచిత్రంగా పర్యావరణవాదం ముందుకి తెస్తున్నారు. ఈ అపోహని చూసి ఇక బ్లాగు వ్రాయక తప్పదని నేను నిర్ణయించుకున్నాను.

పర్యావరణానికి ప్రాణస్నేహితులు ఎవరో తెలుసా ? నగరాలు.

పర్యావరణానికి అతిపెద్ద శత్రువు ? వ్యవసాయం.

ఇదేమి నేను చెప్తున్నది కాదు. ప్రపంచంలోని పర్యావరణవేత్తలు అందరూ మూకుమ్మడిగా చెప్తున్న విషయం. నమ్మకం కుదరకపోతే గ్రిస్టు సైటులోకి వెళ్ళి శోధించండి.

పర్యావరణంలోని జీవవైరుధ్యం అతి భయంకరంగా హత్య కావించబడినది మనిషి వ్యవసాయం చెయ్యడం నేర్చిన తరువాత. అడవులు నరికివేసి వన్యప్రాణులని అంతం చేసాడు మనిషి. అభివృద్ధి చెందిన దేశాలలో పల్లెటూళ్ళలో ఇంధన వినియోగం చూస్తే కళ్ళు తిరుగుతాయి. నగరప్రజలకి పది రెట్లు ఎక్కువ ఇంధనం వాడుతారు అక్కడ. దీనిద్వారా కాలుష్యం, గ్లోబల్ వార్మింగు మరింత పెరిగిపోతాయి.

మనుషులందరూ ఆకాశహర్మ్యాలలో నివశిస్తూ, ఇంధనానికి సోలార్ విద్యుత్తును వినియోగించుకుంటూ, కొద్దిపాటి భూమిలో వారి వ్యవసాయ అవసరాలు తీర్చుకుంటూ, మిగతా భూమినంతటినీ వన్యప్రాణులకి వదిలిపెడితే ఎలాగ ఉంటుందో ఊహించుకోండి !

ఇదే మనకి కావలిసిన భవిష్య నాగరికత. ఇదే పర్యావరణవాదం. నగరాలు దీనికి జీవనాధారం.

భారతదేశం పల్లెటూళ్ళలో నడుస్తుంది అని, మన సంస్కృతి పల్లెటూళ్ళలో క్రోడీకృతమై ఉంది అని చాలామంది ప్రచారం చేస్తుంటారు. ఇది పచ్చి అబద్ధం.

ఇప్పటి నగరాలలో ప్రపంచానికే అతిప్రాచీనమైనది వారణాసి. ఇది మా ఇంటిపేరు, నేను భారతీయుడిని. పల్లెటూరి వాదాన్ని పటాపంచలు చెయ్యడానికి ఇది సరిపోతుందా ?

పల్లెటూళ్ళని పొగుడుకునే వారు ఒక ముఖ్యమైన విషయం మరిచిపోతుంటారు – మన దేశ జనాభా. వేదాలు వ్రాసినప్పుదు మన జనాభా 40 వేలు, కాళిదాసు కాలానికి 40 లక్షలు, స్వాతంత్ర్య సమయానికి 30 కోట్లు, ఇప్పుడు 110 కోట్లు. దీనిని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని అంటారు. మన సంస్కృతి అంటూ చిలక పలుకులు చెప్పేముందు ఒకసారి దీనిగురించి ఆలోచించాలి.

ఇంతమంది జనాభాని పల్లెటూళ్ళలో పెడితే నెమళ్ళకి, చిరుతపులులకి, ఎలుగుబంట్లకి స్థలం మిగలదు ! జనాభా పెరుగుదల కూడా పల్లెటూళ్ళలో ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయ పనులకి పిల్లలు పనికివస్తారు కనుక. నగరాల్లో పిల్ల సైన్యం అవసరం ఉండదు కనుక ఎక్కువ పిల్లలని కనరు.  ప్రజలందరినీ తీసుకొచ్చి నగరాలలో పెడితే జనాభా పెరుగుదల ఆటోమేటిక్కుగా ఆగిపోతుంది.

న్యూక్లియర్ విద్యుత్తుని వ్యతిరేకించేవారు కూడా మన జనాభా గురించి మరిచిపోతుంటారు. పారిశ్రామిక యుగంలో సుఖజీవనానిికి ప్రతి మనిషికి ప్రతి రోజుకి 125 KWH కావాలి అని డేవిడ్ మెకేయ్ లెక్కగట్టారు (ఆయన బ్లాగులో, పుస్తకంలో పర్యావరణం గురించి వింత సూచనలు చేసే వారి చెవి గిల్లిపెట్టారు. చదివి ఆనందించండి). 110 కోట్లమందికి సోలార్ విద్యుత్తుతో ఇంధన అవసరాలు సమకూర్చాలంటే మనదేశం మొత్తం గాలిమరలతో, సోలార్ పానెళ్ళతో నింపెయ్యాలి. అప్పుడు కానీ, దేశ పర్యావరణం మొత్తం సర్వనాశనం కాదు.

అందుకే ముక్కు మూసుకుని మనం ప్రస్తుతం న్యూక్లియర్ విద్యుత్తు వినియోగించుకోవాలి. ప్రజలందరినీ నగరాలకి రప్పించి ఆకాశ హర్మ్యాలు కట్టాలి. మన ప్రజలందరికీ 20 వేల ఏళ్ళకు పైగా సరిపడే థోరియం నిల్వలు మన దేశంలో ఉన్నాయి. వీటితో విద్యుత్తు తెచ్చుకుని మన పనులు చేయపించుకుంటే కాయకష్టం చెయ్యవలసిన అవసరం ఏ భారతీయుడికి ఉండదు.

ఒకసారి ధనికులమైనాకా, జాగ్రత్తగా ఓ 500 ఏళ్ళలో మన జనాభాని 10వ వంతుకి తగ్గించుకోవచ్చు. అప్పుడు ఇంక మనకి న్యూక్లియర్ విద్యుత్తు అవసరమే ఉండదు . కేవలం సోలర్ విద్యుత్తుతోటే గడపవచ్చు !

ఈ ఆధునిక భారతీయ నాగరికత మన ఆశయం కావలి. అప్పుడే మనం మన పూర్వీకులకి వారసులం అని అనిపించుకోగలం.

వింత పశువుల వీధిపోరాటాలు

ఆంధ్రజ్యోతి పత్రిక పైకి కృష్ణ మాదిగ అనుచరులు దాడికి దిగడం, తరువాత ఎడిటర్ని పొలీసులు అరెస్టు చెయ్యడం వంటి పరిణామాల వల్ల ఈ మధ్యన బ్లాగులోకంలో దళిత హక్కులపై చర్చ జరుగుతోంది. దళిత రక్షణ చట్టం ఎలా అపహాస్యం చేస్తున్నారో తాడేపల్లి గారు నిర్మొహమాటంగా వివరించారు. మహేశ్ కుమార్ గారు దీనికి ప్రతిగా సమాధానమిచ్చారు.

మరో ప్రక్క పొలీసులను నక్సలైట్లు హత్యచెయ్యడంపై చదువరి, మహేశ్, దిలీప్ గారి బ్లాగులలో కథనాలు వచ్చాయి.

మన సమాజంలో సమానత లేదు. ఇటువంటి పరిస్థితిలో, అణగారిన వర్గాలు పోరాటం చేసి వారి హక్కులను సంపాదించుకొంటారు అని మనం చాలామంది నమ్ముతున్నాం.”నేను దళిత పక్షపాతిని” అని అంటే “నేను బడుగువర్గాల పోరాటాన్ని సమర్ధించుతాను” అని అర్థం. కానీ, ఈ పోరాటమనేది ఎంతవరకూ నిజం ?

నా దృష్టిలో ఈ పోరాటాలకు అర్థం లేదు. విద్యలేని వాడు తన హక్కుల గురించి ఎలా తెలుసుకోగలడు ? ఏది సాధ్యమో తెలియకుండా, ఎటువంటి ఆశయం అర్థవంతం అయినదో తెలియకుండా, ఎవరన్నా పోరాటం చెయ్యగలరా ? వీధిలో పశువులు ఒకదానితో ఒకటి కలబడి కుమ్ముకోవడానికి ఈ పోరాటాలకి తేడా ఏమిటి ?

“విద్యలేనివాడు వింత పశువు” అని మన నానుడి. పశువులకి కూడా బుర్ర ఉంటుంది, మెదడు ఉంటుంది. మనిషికీ పశువుకీ తేడా ఎక్కడ అంటే విజ్ఞానం వద్ద. పరిపూర్ణ మానవత్వం సంపాదించుకోవాలంటే విద్యావంతులు అయివుండాలి. ఇటువంటి కనీస మానవత్వం కూడా మన దేశపౌరులకి మనం ఇవ్వకుండా ఇంకేమి హక్కుల గురించి అడగగలం ? నా దృష్టిలో విద్యకి దూరం చెయ్యడమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన. మన ప్రభుత్వం దీనికి పరిపూర్ణ నైతిక బాధ్యత వహించాలి. చదువులేని పశువులకి కులం తప్ప మరేదీ కనపడదు.

దళిత ఉద్యమ మేధావులని చెప్పుకుంటున్నవారు వారి మందీ మార్బలంలో విద్యావంతులు ఎంతమందో చెప్పగలరా ? లేదు. వారే కాదు, రాజకీయ నాయకులని తిరుగుతున్నవారిలో ఎవ్వరూ వారి అనుచరగణంలో విద్యావంతులు ఎందరో చెప్పరు. నక్సలైట్లలోనూ ఇదే సంగతి. వీరి వెనక ఉన్న దండు మనుషులందరివీ గొర్రె-బుర్రలు. “డూ డూ బసవన్న” అని డబ్బుతో పిలిస్తే డూ అని తలాడించే తలకాయలు. మన సమాజంలో అతిపెద్ద గౌరవం తెచ్చిపెట్టేది ధనబలం. ప్రజలు విద్యావంతులు కానంతవరకూ ఇదిలాగే సాగుతుంది.

కృష్ణమాదిగకి వ్యతిరేకంగా రాసినంతమాత్రాన ఆంధ్రజ్యోతి దళిత వ్యతిరేకి అయిపోతుందా ? డబ్బులేని దళితుల జీవితం ఎలావుంటుందో పరిశీలించాలి. భూస్వాముల కింద నొక్కితే నొక్కినట్టు పడి ఉండాలి వీళ్ళు. పిలిస్తే వచ్చి లెట్రిన్లు కడిగిపెట్టాలి. వాళ్ళ అమ్మాయిలని అల్లరిచేస్తే మూసుకుని పడివుండాలి. కించపరిస్తూ జోకులు వేస్తే “అహహో” అని నవ్వాలి. ఒక తెలివైన విద్యార్థిని జాతి పేరుతో వెకిళి చెయ్యడం కంటే దరిద్రమైన విషయం నేను చూడలేదు. పేదవాళ్ళైన దళితులు ఎన్నిసార్లు ఇది అనుభవించారో లెక్కలేదు. ఏ దళిత హక్కుల చట్టం వీరిని కాపాడుతుంది ? డబ్బు, చదువే వీరిని కాపాడగలవు. దీనినే కామన్ సెన్సు అంటారు.

డబ్బున్న దళితులు ఎన్ని అవమానాలు భరించివుంటారు జీవితంలో ? ఏవో అరాకొరా, అసలు కొరగావు. డబ్బు ఉన్న దళితులు చేసే ఇబ్బందులు సాకుగా చూపించి దళితులందరినీ ఒక్కగాటన కట్టివేసి తాడేపల్లి గారు సంబోధిస్తున్నారు. ఇది అసలు సమంజసమేనా ?

బడుగువర్గాలని సమర్ధించే వారు కూడా విద్య యొక్క ఆవశ్యకతని పట్టించుకోవట్లేదు. మనిషిని పశువు కంటే ఎక్కువ చేసేది శ్రమ కాదు, విద్య. సమాజంలో మార్పు తీసుకురావాలంటే వచ్చేది శ్రామిక వర్గం నుండి కాదు, విద్యావంతుల నుండి. ప్రపంచం ఏమిటో తెలియకుండా, విజ్ఞానం లేకుండా తుపాకీలిచ్చినంత మాత్రాన ఎవ్వరు హక్కులు తెచ్చుకోగలరు ?

మనిషి శ్రమజీవి అంటారు. ఇంధనంతో ఇంజనులు నడపడం నేర్చిన తరువాత మనిషి శ్రమకి కాలం చెల్లింది. ఏ విధమైన శారీరిక శ్రమ చెయ్యకుండానే ప్రపంచంలోని మనుషులందరూ గడపవచ్చును. దీనికి సరిపడ ఇంధనం మన వద్ద ఉంది (ప్రస్తుతానికి న్యూక్లియర్ విద్యుత్తు, మన జనాభా తగ్గించుకుంటే కేవలం సోలార్ విద్యుత్తు). ఉండవలసినది సరైన దిశా నేతృత్వం, పట్టుదల మాత్రమే. విద్యుత్తుతో ప్రతీ పనిని చేయపించి మనిషులందరూ విశ్రాంతి తీసుకోవచ్చును. ఇదే తరువాతి యుగం.

పారిశ్రామిక విప్లవం అనేది మనిషిని పశువునుండి పూర్తిగా వేరుచేసింది. శ్రమకి అవసరం తీసివేసింది. కానీ, ప్రస్తుతం ఈ ఫలితాలను కేవలం కొంతమంది మాత్రమే అనుభవిస్తున్నారు. వీరిని ధనిక వర్గాలు అంటారు – ఏ పనీ చెయ్యకుండా కులాశాగా గడపుతున్నారు వీళ్ళు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇదేవిధంగా ప్రతి మనిషీ ఉండవచ్చును. పారిశ్రామిక విప్లవం తరువాత మొదటి సారిగా కొన్ని సమాజాలలో పేదరికం నిర్మూలింపబడింది. ప్రజలందరికీ సమానంగా వైద్య, ఆహార సదుపాయాలు దొరికాయి. మునుపటి సమాజంలో కేవలం కొందరికే ఇది దక్కింది. ప్రపంచంలోని మానవ సమాజాలన్నింటినీ పారిశ్రామికం చెయ్యడం ద్వారా మనం మరో యుగంలోకి వెళ్తాం. ఇప్పటి సమస్యలు ఆ యుగంలో హాస్యాస్పదంగా ఉంటాయి.

మనిషి బుద్ధి జీవి. ప్రతి మనిషీ ఈ విధంగా ఉండగలిగేటట్లు మనం ప్రయత్నించాలి. ఇదే అసలైన మానవత్వం. దానికి కనీస అవసరం ప్రజలందరినీ విద్యావంతులు చెయ్యడం. దీనిని గుర్తించక అడ్డదిడ్డమైన ఆశయాలకోసం పనిచెయ్యడం కాలయాపన, మూర్ఖత్వం.

పెట్రోలు ధరలపై నీచ రాజకీయం

మీలో ఎవ్వరైనా పెట్రోలు ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా రోడ్డుపై నిరశన ప్రదర్శనలు జరిపారా ? అయితే, తక్షణంగా ఈ పోస్టు చదవండి.

రాష్ట్రంలో జరుగుతున్న నీచ రాజకీయాలు చూసి నాకు కొంత మాట మూగవోయింది. రాయాలనుకున్న పోస్టు రాయలేకపోయాను. కానీ “పర్ణశాల” బ్లాగులో ఒక కామెంటు వ్రాసాను. ఇప్పటికి దీనితో సరిపుచ్చుతాను.

పర్ణశాల బ్లాగులో క్రూడు పెట్రోలు ధర లీటరుకి 25 రూపాయలు, శుద్ధికి 2 రూపాయలు, రవాణాకి 10 రూపాయలు కలుపుకున్నా 37 రూపాయలే ఉంటుంది. మిగిలిన సొమ్మంతా ప్రభుత్వం పన్నులుగా దండుకుంటోంది అని వ్రాసారు. గుండెలు మండుతున్నాయి అని వ్రాసారు. మొన్న నీచ రాజకీయాలకి ప్రతిరూపమైన ఈనాడు పత్రికలోనూ ఇదే విధంగా సంపాదకీయం వచ్చింది.

ఒకసారి నిజాలని వెలికి చూద్దాం.

1 లీటరు క్రూడు ఆయిలు శుద్ధిచేసిన తరువాత 1 లీటరు పెట్రోలు వచ్చేస్తుందా ? రాదు. కొంత భాగం పోతుంది. శుద్ధి చేసిన పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి కారణం అది.

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు ధర పెరగడానికి కారణం డాలరు విలువ క్షీణించడం (పెట్రోలు అమ్మకాలన్నీ డాలర్లలో నడుపుతున్నారు అమెరికా ఒత్తిడి మూలంగా).

ఫ్యూచర్ ట్రేడింగు ద్వారా పెట్రోలు ధరలని స్పెక్యులేటర్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇంకో రెండేళ్ళలో క్రూడు ధర బేరెల్ కి 200 డాలర్లు చేరుకుంటుందని ఉవాచా (అంటే పెట్రోలు ధర రెట్టింపు అవుతుందన్నమాట).

ప్రభుత్వం పన్నులన్నీ తీసిపడేసినా పెట్రోలు ధరలు పెరగడం ఖాయం. దీనికి మూలకారణం మన భూమిలో శిలాజ ఇంధన నిల్వలు చాలా పరిమితంగా ఉండడమే (మహా వస్తే పెట్రోలు మరో 60 ఏళ్ళు, బొగ్గు మరో 200 ఏళ్ళు వస్తాయి). దీనికి తోడు గ్లోబల్ వార్మింగు బెడద పొంచి ఉంది.

పెట్రోలు ధరలపై పన్ను అధికంగా ఉండడం వల్ల ఇతర ఇంధనాల వినియోగం ప్రోత్సహించగలుగుతాము. మన భవిష్యత్తుకి ఇది అత్యవసరం. పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం పెట్రోలు లాభాలని కొంత ప్రజలకి తిరిగి మళ్ళించగలుగుతోంది (అవినీతితో ఈ డబ్బులు హుళుక్కి అయిపోతున్నది వేరే విషయం). సమాజంలో ధనిక వర్గాలు పెట్రోలుని మరింత ఎక్కువగా వినియోగించుతారు. సామాన్య ప్రజానీకంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందుకని పెట్రోలు భారం పడేది ధనిక వర్గం పైనే, మధ్యతరగతి వర్గంపై కూడా కొంత పడుతుంది. కానీ పేదవర్గంపై అతి తక్కువ. థియరీలో, ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు పేదలపై ఖర్చు పెట్టవచ్చు.

బుర్ర ఉన్న కమ్యూనిస్టులు ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ఎందుకు డిమాండు చేస్తారు ? పేదలపై ప్రేమ ఉంటే ధనికులకి సబ్సిడీ ఇవ్వడమేమిటి ? వాతావరణాన్ని నాశనం చెయ్యమని డబ్బు బాబులకి ప్రోత్సాహం ఎందుకు ? ప్రస్తుతం అంతా సిగ్గులేని రాజకీయం నడుస్తోంది.

ప్రజలపై పెట్రోలు భారం తగ్గించాలంటే అత్యవసరమైన పని రైలు నెట్వర్కుని ఆధునీకరించడం. మొత్తం విద్యుత్తుతో నడిపిస్తే పెట్రోలు భారం సరుకుల రవాణాపై పడదు. అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. ద్రవ్యోల్పణం అదుపులోకి వస్తుంది. దీర్ఘకాలికంగా, మన దేశానికి ఇది అత్యవసరం.

ఇది జరగాలంటే విద్యుత్తు ఉత్పత్తి అతివేగంగా పెరగాలి. దీనికి రెండే మార్గాలు – ఒకటి బొగ్గు, రెండు న్యూక్లియర్ విద్యుత్తు. బొగ్గు 200 ఏళ్ళు మాత్రమే వస్తుంది. మన దేశ అవసరాలకి లక్ష ఏళ్ళు సరిపడేంత థోరియం నిల్వలు మన దేశంలో నిమిడి ఉన్నాయి. థోరియం వినియోగించుకుంటే ప్రపంచంలోనే మనదేశం అతి ధనిక దేశం అన్నమాట. సౌదీ అరేబియాకి తాతలం మనం. గ్లోబల్ వార్మింగుపై మనం నిజాయితీగా ఉంటే బొగ్గుని మనం విడిచిపెట్టి న్యూక్లియర్ విద్యుత్తుని ప్రోత్సహిస్తాము. ఈ విషయం లోనూ కమ్యూనిస్టులు ప్రజా శ్రేయస్సుకి రివర్సులో పనిచేస్తున్నారు.

ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బులన్నీ (పెట్రోలుపై లక్షల కోట్లు నష్టాపోతోంది ప్రభుత్వం) సబ్సిడీలంటూ చివరకి ధనిక, మధ్యతరగతి వర్గాలకి అప్పగిస్తే ఇంక భవిష్యత్తు సంగతేమిటి ?

హైదరాబాదుకి వస్తున్నా, మిత్రులు కలుద్దామా ?

శెలవులు దొరికి మొత్తం మీద భారతదేశం వచ్చాను.  మూడు రోజుల క్రితం శంషాబాదులో దిగాను.  ఓ నెల రోజులపాటు కుటుంబం, చుట్టాలు, పాత మిత్రులు అందరినీ కలవాలని నా ప్లాను. ఈ సారి సరదాగా, నా బ్లాగు మిత్రులని కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది.

మా అమ్మనాన్న ఉండేది తూర్పుగోదావరి జిల్లాలో కనుక నాకు సాధారణంగా కుదరదు. కానీ, కాలేజీ స్నేహితులని కలవడం కోసం హైదరాబాదు, బెంగుళూరు ట్రిప్పులు వేస్తున్నాను. హైదరాబాదుకి 11వ తారీఖు ఆదివారం వద్దామని నా ప్లాను. ఒక మూన్నాలుగు రోజులు అక్కడుంటాను.

మరి 11వ తారీఖు సాయంత్రం, సరదాగా కలవడానికి మీలో ఎవ్వరికన్నా  వీలు దొరుకుతుందా ? ఎక్కడా, ఏమిటి అనేది కలిసి నిర్ణయించుకుందాం.

నీరు, న్యూక్లియర్ విద్యుత్తు రిఫరెన్సులు

జాన్ మెక్కార్థీ స్టాంఫోర్డు యూనివెర్సిటీలో ప్రొఫెసరు. ఈయన కృతిమ మేధస్సు రంగంలో చాలా కృషిచేసారు (LISP భాషను ఈయనే కనుగొన్నారు). ప్రస్తుతం మానవాళి భవిష్యత్తు మీద రచనలు చేస్తూ విజ్ఞానాన్ని ప్రజలకి అందిస్తున్నారు.

ఈయన స్వచ్ఛమైన నీటి అందుబాటు గురించి ఇక్కడ వివరిస్తున్నారు.

న్యూక్లియర్ విద్యుత్తును ఈయన చాలా ప్రోత్సహిస్తున్నారు. దీనిపై ఎంతో వివరంగా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈయన మిత్రుడు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గులో ఫిజిక్సు ఆచార్యుడు అయిన బెర్నార్డు కోహెన్ గారు న్యూక్లియర్ విద్యుత్తు గురించి మరింత వివరంగా ఒక పుస్తకం రచించారు. దీంట్లో ప్రజల భయాలకు నివృత్తిగా ఎంతో సమాచారం పొందుపరిచారు. ఈయన ప్రకారం మన భూమిలోని న్యూక్లియర్ నిల్వలు కొన్ని బిలియన్ సంవత్సరాలు మనుషుల అవసరాలకు సరిపోతాయి !

శాస్త్రవేత్తలు ఇలాగ గణాంకాలతో శ్రద్ధగా వివరిస్తారు. రాజకీయవేత్తలు ప్రజలను భయపెట్టడమేగానీ ఇచ్చే వివరాల్లో నిజాయితీ ఉండదు. ఏది ఏమైనా, మనిషి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంకెలతో ఆలోచించాలి గానీ ఫీలింగులతో కాదు.