Category Archives: Uncategorized

జీవతజ్ఞాపకం

జీవతజ్ఞాపకం

నిన్ను ముట్టుకున్నప్పుడు కలిగింది ఆనందం
లోతుగా లోతుగా
ఈ తనువు ప్రతి కణంలోకి నరంలోకి
ఇంకుతూ పోయింది

నేను దూరంగా ఉన్నా
మరేదీ నాకు అర్థంకాకపోతున్నా
ఈ జీవితం ముగిసే
సమయం దగ్గరకొచ్చినా

ఈ తరుణంలో సమస్తం
మునుపటి సమస్తం అయ్యింది
కలుస్తాం మనం మళ్ళీ
ఏదో ఒక జ్ఞాపకాల మందిరంలో

నువ్వు నాకందిచ్చిన వెచ్చదనం
లోతుగా, లోతుగా
నా దగ్గరకి రా ఇప్పుడు పూర్తిగా
ఒక అతి పురాతనమైన కాలం నుండి

నా హృదయంలో నిర్మలంగా
ప్రేమ జ్వాలలు కాంతినిస్తున్నాయి
నా బాధని నెమ్మదిగా ఊరడిస్తున్నాయి
నా శోకం లోతులవరకు

ఈ తరుణంలో సమస్తం
భవిష్యత్తుకి ఆశాదీపం
గుర్తుపెట్టుకుంటా, కచ్చితంగా
ఒక జ్ఞాపకాల మందిరంలో

ఈ తరుణంలో సమస్తం
మునుపటి సమస్తం అయ్యింది
కలుస్తాం మనం మళ్ళీ
ఏదో ఒక జ్ఞాపకాల మందిరంలో

ఈ తరుణంలో సమస్తం
భవిష్యత్తుకి ఆశాదీపం
గుర్తుపెట్టుకుంటా, కచ్చితంగా
ఈ జీవితం గుర్తువచ్చినప్పుడు

“ఇనోచి నా కియోకు” (జీవితజ్ఞాపకం) అనే జపనీసు గీతం “కగూయా హిమే నొ మొనొగొతారి” (రాకుమారి కగూయా కథ) అనే అణుప్రాణితచిత్రంలోనిది. ఈ కథ ప్రాచీన జపాను జానపదగాథ అయిన “వెదురు నరికే పనివాడి కథ” నుండి నిర్మితమయ్యింది. పాట పాడింది నికైడో కజూమీ అనే గాయని. పై వీడియోలో చక్కగా పాట సాహిత్యాన్ని, ఆంగ్ల అనువాదాన్ని, చిత్రంలో ముఖ్యఘట్టాలను చూపించారు.

నల్లటి నల్లటి కాకులు

నల్లటి నల్లటి కాకులు

ఎత్తైన పర్వతాల నుండి ఈ లోయకి దిగివచ్చాను
వచ్చీ వచ్చి నీ ముందు ఓ గులాబీ మొగ్గలా ఒదిగాను

నీకు తెలుసున్నా లేకున్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను
ఈ జ్వలించే ప్రేమాగ్నితో నేను చనిపోతే, ఆ పాపం నీపైనే

నల్లటి నల్లటి కాకులు తిరుగుతూ పైకెగిరాయి
నా వాకిలిలోని చినారుచెట్టుపైకి వాలాయి

ప్రతివొక్కరు ప్రియునితో ఉన్నారు గుసగుసలాడుకుంటున్నారు
నా ప్రియుడు దూరంగా ఉన్నాడు కంటిముందులేడు

ఓ ప్రియతమా, నిన్ను ఆశ్రయంగా చేసుకుని
నీ ఇంటిముందు వాకిలిలో పడుకోనా

ఆరు రోజులలో సృష్టించబడిన ఈ విశ్వంలో
నీకోసం ఇంతగా బాధ అనుభవించాలా?

ఉయ్ఘర్ జానపదగీతమైన “ఖారా ఖారా ఖఘ్లర్ ” (నల్లటి నల్లటి కాకులు) ఒక పడుచు అమ్మాయి పాడే ప్రేమగీతం. మిహిర్గ్యుల్ హస్సన్ అనే తురక దేశపు గాయని ఈ పాటని మధురంగా ఆలపించింది.

పువ్వులాంటి గుల్యార్

పువ్వులాంటి గుల్యార్

నా పువ్వు గుల్యార్ కాదా? నా ఊరిపేరు కుచా కాదా? (2)
మనపై చెడుమాటలనేవారు వారే బికారులు కాదా? (2)

నా పువ్వు గుల్యార్ కాదా? నా తోట నిండా పూలు లేవా?
గుల్యార్ఖన్, ఓ నా ప్రియమైన సుందరీ
మనని నీచులనేవారు వారే బికారులు కాదా?
గుల్యార్ఖన్, ఓ నా ప్రియమైన సుందరీ

సోసెర్తుమాక్ కుచ్చుటోపీలు పెట్టుకున్నే కన్నెలనే సొగసైన ధీరులు ప్రేమించి వరిస్తారు
ఆ కన్నెపిల్లే నావద్దకు మాటిమాటికీ రాక నా మనసు విరిచేస్తుంది
గుల్యార్ఖన్, ఓ నా ప్రియమైన సుందరీ

నేను రాను, నేను రాను, నేను నీతోపాటు రాను
నీతో ఉండే బదులు, ఏకాంతంగా ఉండి ఆడుకుంటాను
గుల్యార్ఖన్, నీ వంటివంపులు ఎంత సొంపు.. ఓ అబ్బబ్బో

ఓ, నా దుతార్ వాయిద్యం మీటడానికి ఒక తీగ ఉంది
నిన్న రాత్రి తాగిన టీ నా వలపు ఉసిగొల్పుతోంది

డొప్పా టోపీలు పెట్టుకుని చీనఫలం పళ్లచెట్టు కొమ్మను పట్టుకున్న
అమ్మాయిలు వాళ్ళ చిన్ననాటి ప్రేమని ఎక్కడో పోగొట్టుకున్నవారు

పొద్దుట తెల్లవారిన వేళ, ఒక మసక రంగు తోక కుందేలు పరిగెడుతోంది
ఆ సుందరాంగి కన్నెపిల్లనే నా అందమైన గుల్యార్ఖన్

చైనా పశ్చిమప్రాంతంలో నివశించే తురకజాతివారైన ఉయిఘర్ ప్రజల జానపద గీతం ఇది.

మనకి అనవసరం

మనకి అనవసరం

మొదటి శ్రేణిలో ప్రయాణించడం ఇష్టం
ఇంకెవ్వడో టికెట్టుకి డబ్బులు కట్టాలి
జుర్రుగుండే పళ్ళు తినడం మనకిష్టం
పళ్ళు ఏరే పని మనకి లేనంతవరకూ

ఫాస్ట్ ఫుడ్ గడ్డి తినడం మనకిష్టం
గుండెనొప్పి గురించి మనకనవసరం
అందరితో సొళ్ళువాగడం మనకిష్టం
ఏ విషయంలో నిజమేంటో మనకనవసరం

మనకి బంగారం కావాలి
తవ్వే గోల మనది కానంతవరకూ
ఎవడెక్కడ బాధపడుతున్నాడో అనవసరం
ఏ ముఠా దీని వెనకనుందో అనవసరం

చెంగుచెంగుమని పరిగెత్తే జోళ్ళు కావాలి
ఎవడు వాటిని తయారుచేశాడో మనకనవసరం
వాళ్ళకి బడికెళ్ళే యోగ్యముందో మనకనవసరం
ఆ కంపెనీ వాళ్ళకి ఏం జీతమిచ్చిందో మనకనవసరం

మనకనవసరం
మనకనవసరం
మనకనవసరం (2)

చవుకగా పెట్రోలు కావాలి
కార్లో ఎగరడం బయల్దేరాలి
ప్రపంచం ఏం ఒప్పుకొందో మనకనవస్రం
ఆ క్యోటో ఒప్పందంలో

మనం నీళ్ళు వృధాకాకుండా చూడాలి
కనీసం ప్రయత్నించడమన్నా లేదే
మనకి అరగంట స్నాహ్నం చెయ్యాలి
అలా నూతిలో నీళ్ళు ఇంకిపోతుంటే

మనకనవసరం
మనకనవసరం
మనకనవసరం (2)

వ్యత్యాసం పెరుగుతూ పొతోందే
డబ్బున్నోళ్ళు లేనోళ్ళ మధ్యన
మనక్కావలిసిందంతా ఉందే
కానీ మనకింకా ఇంకా కావాలి

మనం పట్టించుకోం
మనం పట్టించుకోం
మనం పట్టించుకోం (2)

అమెరికాకి చెందిన ఎరిక్ బిబ్ మరియు మాలీ దేశానికి చెందిన హబీబ్ కొయితే జోడీ కలిసి “బ్రదర్స్ ఇన్ బమాకో” (మాలీ దేశపు రాజధాని బమాకోలో సోదరులు) అని విడుదల చేసిన సంగీతముద్రణలోని “వీ డోంట్ కేర్” (మనకి అనవసరం) అనే ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. బిబ్ అమెరికా సంప్రదాయమైన నీలిసడి (బ్లూస్) సంగీత తరహాలో వాయిస్తుంటే, కొయితే మాలీ సంప్రదాయబద్ధమైన జానపద సంగీతం వినిపించాడు. అద్భుతంగా సమ్మిళితమైనది ఈ పాట. పాట సాహిత్యం మనుష్యులలోని నిర్లిప్తతకి, స్వార్థపూరితమైన బద్ధకాన్ని మోటుదనాన్ని ఎండగడుతోంది.

నేను ఆంగ్లభాషలోని సాహిత్యం మాత్రమే అనువదించాను. దురదృష్టవశాత్తూ కొయితే మాలీ దేశపు ఖస్సొంకే, లేదా బంబరా భాషలో ఆలపించిన రెండు మూడు వాక్యాలకు సాహిత్యం కానీ, అనువాదం కానీ దొరకలేదు. దొరికితే వీలైతే ఈ పుటని తర్వాత సవరిస్తాను.

పాపం పసిపిల్లలు

పాపం పసిపిల్లలు

చలి గాలి వీస్తోంది వడిగా, షీహు షీహాంగ్ లను గుర్తుకు తెస్తోంది
ఓ పాపం పిల్లలారా, అమ్మా నాన్నకి దూరంగా విలలలాడుతున్నారా, చెట్టుపై చిగురుటాకులని అటూ ఇటూ కొడుతున్న పెనుగాలి లాగ
చెట్లు ఒరిగి ఊగుతున్నాయి, బెదిరి వణుకుతున్నాయి, పిల్లలారా, మీరు ఆ చలివానకి తడిసిన చెట్ల ఆకులయ్యారే !

మీరు ఆ వణుకుతున్న చెట్ల ఆకులయ్యారే, అయ్యో, అమ్మ దగ్గరకి త్వరగా తిరిగొచ్చెయ్యండి
ఈ ఎండ వెచ్చగా ఉంది, షీహూ షీహాంగ్ లను గుర్తుకు తెస్తోంది
ఓ పాపం పిల్లల్లారా, అమ్మ నాన్న వళ్ళో వెచ్చగా లేకుండాపోయారే, కాలమెలా క్రూరంగా గడచిపోతుందో
మీ చిన్నదనం ఎత్తుకుపోయారు, కాలం కొల్లగొట్టారు. పిల్లలు ఇలా ఎప్పుడూ బాధపడకూడదే
పిల్లలు అమ్మానాన్నకి దూరంగా ఎప్పుడూ ఉండకూడదే.. హా .. రండి త్వరగా అమ్మదగ్గరికి వచ్చేయండి !

1960వ దశకంలో రోస్ సెరేయ్సోథియా అనే కాంభోజదేశపు గాయని ఖ్మేర్ భాషలో గానం చేసిన “కౌం కొంసొట్ట్” (దీనుడైన బాలుడు) అనే ఈ పాట ఎంతో ప్రజాదరణను పొందింది. ఈమె బాగా పేరుపొందిన గాయని, ఎన్నో సభలు కచేరీలూ ఇస్తూ తిరుగుతూ ఉండడంవలన తన స్వంత పిల్లలకు దూరమై ఉండడంతో, ఆ పిల్లలను తలుచుకుంటూ ఈ పాట పాడింది. ఈ వాత్సల్యభావంతో గానంచెయ్యడం పాశ్చాత్యసంగీతంలో ఎక్కువగా ఉండకపోయినా మన భారతీయ సంస్కృతికి చాలా పోలి ఉంటుంది. ఈ పాట సంగీతం కూడా కాంభోజదేశపు జానపదఝరులతోపాటు 1960,70వ దశకాలలో ఉప్పెనగా వచ్చిన ఆధునిక మనోలోలిత (సైకడెలిక్) సంగీతపు ప్రభావాలు కూడా చూపిస్తోంది.

దురదృష్టవశాత్తూ కాంభోజదేశంలో కమ్యూనిస్టులు ఆక్రమించిన తరువాత ఎందరో కళాకారులను హత్యచెయ్యడమో, బంధించడమో, మారుమూలకి తరిమివెయ్యడమో చేశారు. ఎంతోమంది ప్రముఖులు ఆ కాలంలో గల్లంతయ్యారు. అలాగే రోస్ సెరేయోస్థియా కూడా కనపడకుండా మాయమైపోయింది. ఏమైందో తెలియని దుష్పరిణామం. చాలామంది ఈమె 1975వ సంవత్సరంలో హత్య కాబడిందని నమ్ముతున్నారు. ఈమె పాడిన పాటలు మాత్రం కాంభోజ దేశంలో ఇప్పటికీ ప్రజల వీనులని అలరిస్తున్నాయి. “కౌం కొంసొట్ట్” అనే ఈ పాట వివిధ మిశ్రితగీతాలలో వినియోగింపబడింది. ఒక హిప్ హాప్ సరాగోచ్ఛారణలో ఈ పాట ఎలా వినియోగించారో క్రింద చూడండి.

కడలి, నా హృదయాన్ని తట్టింది

కడలి

కడలి
మనం చూస్తుండగా లేతటి అగాధాలపై నాట్యమాడుతోంది
వెండి వన్నెల మెరుపులతో
కడలి
తళుకుమంటున్న మెరుపులతో
ఆ సన్నటి వానలో

కడలి
వేసవి ఆకాశాన్ని కలుపుకొంది
తెల్లటి గొర్రెల్లాంటి మబ్బులతో
స్వచ్ఛమైన అప్సరలతో
కడలి
అనంతమైన
నీలిపగడాల గొర్రెలకాపరి

చూస్తున్నారా
ఆ చెరువులపక్కన
తడిసిన పొడుగాటి గడ్డికంకెలని
చూస్తున్నారా
ఆ తెల్లటి పక్షులని
ఒడ్డునున్న తుప్పురంగు ఇళ్ళని

కడలి
అలలతో వాటిని తాడిస్తోంది
లేతటి ఆ అగాధం వెంటనంతా
ఇంకా ఒక ప్రేమగీతం
కడలి
నా హృదయాన్ని తట్టింది జీవితాంతం గుర్తుండేలా

చార్ల్ త్రెనే అనే గాయకుడు ఆలపించిన “లా మేర్” (కడలి) అనే ఈ గీతం నాకు ఎంతగానో ఇష్టమైన పాట. ఫ్రాన్సుదేశంలోని సముద్రతీరపు సౌందర్యాన్ని ఈ పాట చాలా చక్కగా వర్ణిస్తుంది. ఫ్రాన్సు దక్షిణాన ఉన్న మధ్యధరా సముద్రం వెంబట ట్రైనులో ప్రయాణం చేస్తుండగా త్రెనేకు ఈ పాట సాహిత్యాం మదిలో స్ఫురించిందంట. నేను కూడా ఈ ట్రైను ప్రయాణాన్ని పలుమార్లు చేశాను. నాకెంతో ఇష్టమైన దారి అది. ఇంతటి మధురమైన పాట స్ఫురించడం ఆశ్చర్యమేమీ కాదు. ఈ పాట మధ్యలో యధాలాపంగా వచ్చిపోతుండే “లా మేర్” (కడలి) అనే ఉచ్ఛారణ ప్రభావం సముద్రంలోని అలలవలే ఉంటుంది.

వేసవికాలపు సమయంలో ఫ్రాన్సు దేశపు సముద్రతీరం వెంట సమయాన్ని మరిచిపోయేటట్టు ఆనందంగా గడపడం నిజంగా ఈ భూలోక సౌభాగ్యాలలో ఒకటి. ఇదే పాట సంగీతాన్ని ఫ్రాన్సుదేశానికి చెందిన జాజ్ గిటారుకారుడు జాంగో రెయిన్ హార్డ్త్ పలికించిన విధానం క్రింద వీడియోలో చూడండి.

ఎండుటాకులు

ఓహ్. నువ్వు గుర్తుంచుకుండుంటే ఎంత బాగుణ్ణు
మన స్నేహం విరిసిన ఆ ఆనందపు రోజులని
జీవితం ఇంకా అందంగా ఉండిన ఆ సమయాన్ని
సూర్యుడు ఇంకా మెండుగా ప్రకాశించిన ఆ తరుణాన్ని

కిందరాలిన ఎండుటాకులు పారతో ఎత్తడానికున్నాయి
చూస్తున్నావా, నేను మరిచిపోలేదింకా
కిందరాలిన ఎండుటాకులు పారతో ఎత్తడానికున్నాయి
అలాగే మన జ్ఞాపకాలు పశ్చాత్తాపాలు కూడా

ఉత్తరపు గాలి వాటిని లేపుకొస్తోంది
చలిరాత్రి మరుపులలోంచి తెస్తోంది
చూస్తున్నావా, నేను మరిచిపోలేదేమీ
నాకోసం నువ్వు పాడేవాడివి ఆ పాటని

ఆ పాట మనల్నే కదూ పోలి ఉండేది
నన్ను ప్రేమించేవాడివి, నిన్ను ప్రేమించేదానిని
మనమిద్దరం ఒకరికొకరు బతికేవాళ్ళము
నేను ప్రేమించే నువ్వు, నువ్వు ప్రేమించే నేను

కానీ జీవితం ప్రేమించేవాళ్ళని విడదీసేది
చాలా నెమ్మదిగా, సవ్వడి చెయ్యకుండా
వచ్చే సముద్రపుటలలు ఇసకని తుడిచేస్తాయి
కింద ఒకటిగా నడిచిన ప్రేమికల అడుగులని

జాక్ ప్రెవే అనే కవి రచించిన “లే ఫయ్యి మోర్త్” (మృతపర్ణాలు, అనగా ఎండుటాకులు) అనే ఈ గీతం ఫ్రెంచి భాషలో ఎంతగానో పేరొందింది. జోసెఫ్ కోస్మా అనే సంగీతకారుడు మొదటగా సంగీతకృతి చేశాడు. ఇలాంటి గీతాలను ఫ్రెంచి భాషలొ “షాన్సోన్” అంటారు. అవి పాడే సంగీతపద్ధతి అక్కడి జానపద గీతాలలో ఒకటి. ఎందరో గాయనీగాయకులు ఈ పాటని మధురంగా ఆలపించారు. పైన వీడియోలో జూలియత్ గ్రెకో పాడిన వైనం చూడవచ్చు. ఈమె ఎన్నెన్నో షాన్సోన్ గీతాలు ఆలపించి ఎన్నో దేశాలలో అభిమానుల ఆదరణను పొందింది. నిన్ననే 82 సంవత్సరాల వయసులో కాలంచేసింది. ఆమె గుర్తుగా ఈ పాటను తెలుగులోకి అనువదించాను. క్రింద వీడియోలో ఇదే పాటను ఈవ్ మోర్తాన్ అనే ప్రసిద్ధుడైన గాయకుడు ఆలపించిన వైనం చూడవచ్చు.

పర్జన్యా అగ్నివదనా

పర్జన్యా అగ్నివదనా

పితృలర్చించిన దేవతలు
ప్రజలు పిలుస్తున్నారు
దివ్యశక్తులారా, ఏకంకండి
ఇక దాగుండేదిలేదు, పనికి సమయం అయ్యింది

పర్జన్యా అగ్నివదనా
పర్జన్యా మేఘగర్జనసమ్యక
పరిఢవిల్లు నీ దివ్యకాంతులని
పరిఘోషించు నీ ఉరుముల సవ్వడిని

తా – తా – తో

పిడుగు పడుతుండగా చూస్తున్నాను
ప్రజలకు న్యాయం తేవగా చూస్తున్నాను
ప్రకృతీ, నీ గొంతు మహత్తు
ధైర్య వివేకాలను రమ్మంటోంది
దివ్యమూర్తులు ఐక్యమవ్వగా
దేవసైన్యం దండు కదలగా
మా తల్లి ప్రకృతి మమ్ము కాపాడుతుంది
మా తండ్రి నీలాకాశం సాక్షిగా

ఊ – ఊ – ఊ
తా – తా – తో

పర్జన్యా, పితృలర్చించిన దేవా
జ్ఞానపుణ్యరక్షకా
ధర్మఖడ్గాన్ని ఎత్తగా
శక్తిస్వరం పిక్కటిల్లగా
సత్యమేంటో ప్రజలకు నేర్పవా !

పిడుగు పడుతుండగా చూస్తున్నాను
ప్రజలకు న్యాయం తేవగా చూస్తున్నాను
ప్రకృతీ, నీ గొంతు మహత్తు
ధైర్య వివేకాలను రమ్మంటోంది
దివ్యమూర్తులు ఐక్యమవ్వగా
దేవసైన్యం దండు కదలగా
మా తండ్రి ధర్మేంద్రుడు మమ్ము కాపాడతాడు
మా హృదయంలో ప్రేమ సాక్షిగా

లిథువానియా దేశానికి చెందిన రుగీలే దౌజోతైతే అనే గాయని ఆంగ్ల-లిథువానియా భాషలను సమ్మిళితంచేసి ఆలపించిన “పెర్కునే ఉగ్నియావెయిది” (పర్జన్యా అగ్నివదనా) అన్న పాట జానపద సంప్రదాయాలను ఆధునిక సంగీతపద్ధతులను మిశ్రమం చేసి లిథువానియా ప్రజల పురాతన మతారాధనలలో ప్రముఖుడైన దేవుని పర్జన్యుని (పెర్కునే) కీర్తిస్తోంది. ఈ పాట ఆలాపనలో అక్కడక్కడా రాక్ సంగీత ప్రభంజనలు కనపడుతుండగా, అదే సమయంలో లిథువానియా సంప్రదాయక బహుళయుగళ సుతర్తీనే కూడా వినియోగించడం విశేషం.

రుగిలే దౌజోతైతే భారతీయ పూజావిధులచే సంస్కృతిచే ఎంతో ప్రభావితురాలయ్యింది అని ఆమె ప్రచురించిన ఇతర వీడియోలనుబట్టి గమనించవచ్చును. ఆమె వేణుగానం కూడా అతిమధురంగా ఆలపిస్తుంది. ఈ క్రింది వీడియోలో శ్రీకృష్ణుని స్ఫూర్తిగా వేణువును పలికించడం చూడవచ్చు.

ఓయి నదీవే, ఎందుకు నిండుగా లేవు?

ఓయి నదీవే, ఎందుకు నిండుగా లేవు?

ఓయి నదివే, నదివే,
ఎందుకు నిండుగా లేవు?
ఓయి లూలి లూలి లూలి
ఎందుకు నిండుగా లేవు?

ఓయి, ఎలా నిండుగా ఉంటాను?
జనాలు నీళ్ళు తాగడానికొస్తారు
ఓయి లూలి లూలి లూలి
జనాలు నీళ్ళు తాగడానికొస్తారు

జనాలు నీళ్ళు తాగడానికొస్తారు
జాసియెంకో గుఱ్ఱానికి నీళ్ళుపట్టడానికొస్తాడు
ఓయి లూలి లూలి లూలి
జాసియెంకో గుఱ్ఱానికి నీళ్ళుపట్టడానికొస్తాడు

జాసియెంకో గుఱ్ఱానికి నీళ్ళుపట్టడానికొస్తాడు
కాసియెంకా మంటలు ఆర్పడానికి వస్తుంది
ఓయి లూలి లూలి లూలి
కాసియెంకా మంటలు ఆర్పడానికి వస్తుంది

పోలండు దేశానికి చెందిన “ఓయ్ తి ర్యేకో” (ఓయి నువ్వు నదివే) అన్న పోలిషు జానపద గీతం పల్లెప్రజలతో నదికి కలిగున్న సన్నిహిత సంబంధాన్ని చూపిస్తోంది. ఆ పాటని మధురంగా గానం చేసినవారు కరోలినా చిచా మరియు సహాయకులైన సంగీత బృందం. ఈ సన్నివేశం వారు రాజస్థాను పర్యటించినప్పుడు చిత్రీకరించిన ఘట్టం. పాట అంతంలో అక్కడి రాజస్థానీ స్త్రీ ఆనందించి నాట్యం చేస్తుంది, అది సంగీతకారులకు మనసుకి హత్తుకున్నట్లు నచ్చింది. సంగీతానికి దేశవేషబేధం లేదంటారు అందుకే.

పోలండు దేశాని గురించి ఒక గమ్మత్తైన విషయం ఉంది. వారి పోలిషు భాషలో “పోల్స్కీ” అంటారు. “పొల” అంటే వారి భాషలో పంటపొలం అని అర్థం. పొలంలో పనిచేస్కునే రైతులు ఉండే ప్రదేశం కాబట్టి “పొలదేశం” అనగా “పోలండు” అయ్యింది. ఇదేంటి వాళ్ళ పొలం మన తెలుగుభాషలో పొలం లాగ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? రెండు పదాలు సంస్కృతంలోని “పొలతి” (అంటే పెరుగుతున్నది) అన్న పంటమొక్కలను సూచిస్తున్న పదం నుండి వ్యుత్పత్తి చెందినవి. అందుకనే వారి సంస్కృతిలోను మనలాగే నదితో కబుర్లాడుకునే వైనాలు కనపడుతున్నాయి. మన జానపదగీతాల్లో గోదారితోటి కృష్ణమ్మతోటి పల్లెపడుచులు కబుర్లాడుకునే సందర్భాలు ఎన్ని లేవు?

తాగి తందనాలాడిన సన్యాసి

తాగి తందనాలాడిన సన్యాసి

దేశాటనం చేసి వస్తున్నాడు సన్యాసి
మంచు ముసిరి చలిగాలి కోస్తుండగా
చచ్చేటంతగా కొర్రుబారిపోయాడు

ఎటెళ్ళాలో తెలియక పూటకోళ్ళింటికి
వెచ్చగా ఏదో తాగడానికొచ్చాడు
తన కాపుగుడ్డలు విప్పదీసాడు

కళ్ళజోడు, కోటూ విప్పదీసాడు
తన కోసాక్ కోటుని ముక్కలుచేసాడు
నాట్యం చేద్దామని పోయాడు

తనివితీరా ఆడిపాడాక
అందరికీ శెలవని చెప్పి
అరుగు బయటకి ఉరికాడు
పశువులకొట్టం తలుపు తన్నాడు
ఒక గుఱ్ఱం ఎక్కాడు
గుఱ్ఱం తనకింద సర్రున దుమికింది
పచ్చటి మైదానంలో గంతులేసి పోయింది

పచ్చటి మైదానంపైన గుఱ్ఱం
కన్నెపిల్లలు చుట్టూ నడుస్తూపోతున్నారు
కానీ తన కన్నెపిల్ల కనపడలేదు
కనుక ఒక విధవ దగ్గరకి పోయాడు
ముద్దాడాడు, లాలించి మురిపించాడు
తనే తన మనసన్నాడు
భళా ఈ జీవితం అని అరిచాడు

భళిరా భళిరా భళిరా
దుర్విధి కాటేసింది
కష్టం చిన్నపాటిది కూడా కాడు

ఈస్టర్ పర్వదినం నాడు
అందరు పనులు మానేసి
మద్యం తాగడానికి పోయారు

తేనెలు తిన్నారు, మధువులు తాగారు
పూటకూళ్ళ యజమానికి టోపీ వేసి
పొగాకు చుట్టలు కాల్చారు

తనివితీరా చుట్టలు కాల్చాక
కింద పడి పక్కలపై వాలారు
ఓ ఈ పాట అంతటా మోగుతోంది

సముద్రం వెచ్చగా ఉంది
నీళ్ళు లోతుగా ఉన్నాయి
ఉప్పెన రావాలని వేడుకుంటున్నాం
అద్గదిగో, గాలి దుమారం వచ్చింది

ఏముంది ఈ జీవితం, చింతలు తిప్పలతో నిండుంటే
కాస్త నించుని అలా చూడ్డానికే సమయం లేకపోతే
ఎంత దీనమైన జీవితం ఇది, చింతలు తిప్పలతో నిండాయె
కాస్త నించుని అలా చూడ్డానికే సమయం లేదాయె

ఉక్రాయీను భాషలోని “మొనాఖ్” (సన్యాసి) అను ఈ గీతం పాదింది “దర్ఖా బ్రఖా” అనే జానపద సంగీతబృందం. ఈ పాటలో వడివడిగా శబ్దాలు పలకడం (అనగా రేప్ సంగీతం) దాని మధ్యలో తీవ్రస్థాయిలో ఆలాపన చెయ్యడం చేసి, జానపద సంగీతానికి ఆధునిక తీరులు సమ్మిళితం చేసి వీనులవిందైన ప్రయోగం చేశారు. ఈ పాట సాహిత్యంలో మనసు ఎప్పుడూ నియమాలు, చింతలు అని తిప్పలతో వేగుతూ ఉంటే జీవితంలో ఆనందానికి అనుభవాలకి చోటుండదు, అందువలన ఉప్పెనలాగ జీవితం విరుచుకుపడినా అదే ఆట-పాటలనుకొని ముందుకు నడిపించుకుపోవాలి అని పాడుతున్నారు. ఈ పాటలో ఉక్రాయిన్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ సన్యాసి, తన నియమాలను, అందునా అతి ముఖ్యమైన ఈస్టర్ పండుగ నాడు, విడనాడి, తాగి తందనాలాడాడు అని కథ.