సింధూరవృక్షం
ఎక్కడ పెరుగుతున్నావో, ఓ సింధూరవృక్షమా, ఊగు ఊగు
నేను చూడకుండా ఉండేటట్లు, ఊగు ఊగు
వెండి వేరులతో, బంగారపు కొమ్మలతో, ఊగు ఊగు
వెండి ఆకులతో, ఊగు ఊగు
ఒక పవిత్రమైన ఉదయం చూశాను, ఊగు ఊగు
మృధులతావృక్షం సింధూరవృక్షానికి మనసిచ్చింది
సింధూరపుచెట్టుకు వెండివస్త్రాలు, ఊగు ఊగు
ఆకులపై ఉన్నినేతలా అల్లిన మంచు, ఊగు ఊగు
ఆ దట్టమైన సింధూరవృక్షం
మూడుపొరలతో బంగారువడ్డాణం
పాము కాటేసింది, తేనెటీగ కుట్టింది
ఒక్క ఆకు కూడా కదలలేదు
లాట్వియా దేశానికి చెందిన తౌతూమెయితాస్ గాయకీబృందం ఆలపించిన “ఓజోలిస్” (ఓక్ చెట్టు/సింధూరవృక్షం) అనే ఈ పాట పరువంలో ఉన్న ఒక్క యువతి తన ప్రేమికునికి మనసిచ్చిన వైనాన్ని, ఆపై ప్రేమికుడు తనని లొంగదీసుకున్న పరిస్థితిని భావుకంగా ఒక చెట్టుతో పోల్చి వర్ణిస్తోంది. లిండెన్ చెట్టు స్త్రీత్వానికి ప్రతీకగా ఈ తూర్పు ఐరోపా దేశపు సంస్కృతులలో చూస్తారు. ఈ చెట్టుని నేను మృధులతావృక్షం అని అనువదించాను (మునుపు ఇంకొక పాట అనువాదంలోనూ ఇదే పదం వాడాను). దట్టంగా పెరిగే సింధూరవృక్షం (అనగా ఓక్ చెట్టు) పురుషత్వానికి ప్రతీకగా చూస్తారు. ఈ పాట యువతీ యువకుల పరువాన్ని ఆ విధంగా పోల్చిచెబుతోంది.
ఈ గాయనిలు పాటని ఒక బహిరంగప్రదేశంలో ఆలపించిన వైనం క్రిందన చూడవచ్చు. వారు ఉపయోగించిన వాయిద్యాలు గమనించవచ్చు. జాజ్ సంగీతపు సంగతులు ఈ పాటలో అక్కడక్కడా కనపడుతూ ఉంటాయి. అటువంటి పాటను బహిరంగప్రదేశంలో ఆలపించడం చాలాకష్టం, ఎందుకంటే బయటిరొదలో సంగతులను గమనించడం కష్టం.