చైనాకి జిందాబాదు కొడుతున్న కమ్యూనిస్టులు

చరిత్రలో చిరకాలం మిత్రులూ ఉండరు. శత్రువులూ ఉండరు. భౌగోళిక-రాజకీయ ప్రభావాలు మారుతూ ఉండడం వల్ల నిన్నటి శత్రువులు ఈనాటి మిత్రులవవచ్చు. నిన్నటి మిత్రుడు ఈరోజు శత్రువూ కావచ్చు. ఈ విషయం గుర్తించలేక ఒక కరడుగట్టిన సిద్ధాంతానికి దాసులవలే సేవచేసేవాళ్ళను ఛాందసులంటారు. మూర్ఖులంటారు. ఈ కాలంలో – డబ్బుకి అమ్ముడిపోయి ఆత్మవంచన చేసుకుని వ్యాసాలు వ్రాసేవారు కొందరు అయితే, సైద్ధాంతిక మత్తులో కళ్ళు కమ్ముకిపోయినా బాకాలు వాయించడం ఆపనివారు మరికొందరు. మొత్తమ్మీద భావకాలుష్యంతో చెవులు పిక్కటిళ్ళుతుంటే, సరైన దిశానిర్దేశ్యం చేసే నాయకులు లేరు మనకి.

కమ్యూనిస్టు సోదరి అంటూ చైనాకి రష్యానే ఆటం బాంబు ఇచ్చిపెట్టింది. తర్వాత సరిహద్దు గొడవలు తలెత్తడంతో శత్రువు అయ్యింది. 1960లలో “అమెరికాతో సంధిచేసుకుని కమ్యూనిస్టు ఉద్యమానికి రష్యా ద్రోహం చేస్తోంది” అని నిందమోపిన చైనాయే, 1970లలో అమెరికాతో చెలిమిచేసింది. రష్యాకి ముకుతాడు వెయ్యడానికి అమెరికాయే ఒకవైపు చైనాకి మరోవైపు పాకీస్తానుకి తాయిలాలు అందిచ్చింది. అమెరికాకి చేసిన ఎగుమతులతోనే చైనా వృద్ధిరేటు సాధిస్తోంది. ప్రపంచం తీరుతెన్నులు ఇంత వేగంగా మారుతున్నా వీరకమ్యూనిస్టులు మనవాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నారు. టిబెట్లో బౌద్ధ సన్యాసులు చైనాకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చెయ్యడం కూడా వాళ్ళకి నచ్చదు. వీళ్ళ దృష్టిలో దీనంతటి వెనకా అమెరికా మోసం ఉంటుంది. సీ.ఐ.ఏ కుట్ర ఉంటుంది. హిందూ, ఫ్రంట్ లైను లాంటి పత్రికలంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఇప్పుడు వాటిలోని సంపాదకీయాలు చూసి వెగటు వస్తోంది.

ప్రపంచంలో ఎక్కడా చైనాని శ్రామికవాద ప్రతినిధిగా చూడట్లేదు. పేరుకిమాత్రమే కమ్యూనిస్టు దేశంకానీ, పెట్టుబడిదారీ దేశంగా చైనా ఎప్పుడో ఫిరాయించేసింది. కానీ, కమ్యూనిస్టు దేశంలో ఉండే ఆంక్షలు, సీక్రెట్ పోలీసులు, విపరీతమైన దేశాభిమానం అన్నీ ఇంకా చైనాలో కలిసిపుచ్చుకుని ఉన్నాయి. ఇప్పటి చైనా నిక్షేపంగా ఒక ఫాసిస్టు దేశం. శ్రామికవాద పత్రికగా పేరుగాంచిన “గార్డియన్” పత్రికలో కూడా చైనాపై విమర్శలేకానీ, మెచ్చుకోలు కనిపించవు.

కానీ, మన కమ్యూనిస్టు పాత్రికేయులు, వ్యాఖ్యాతలు అలుపెరగకుండా ఇంకా చైనాకే ఊడిగం చేస్తున్నారు. వీరి వెర్రి ఎంత దూరం వెళ్ళిందంటే దలైలామా నిజాయితీని హత్యచేసేంతవరకూ. ఈ విచిత్రాన్ని అర్థంచేసుకోవాలంటే ఒకసారి టిబెట్ని మన కాశ్మీరు సమస్యతో పోల్చిచూద్దాం.

  1. కాశ్మీరులో వేరే భారతీయులు ఇళ్ళు నిర్ముంచుకునే హక్కు లేదు. టిబెట్లో రోరోజుకీ ప్రవాసీయులు పెరిగిపోతున్నారు. లాసా నగరంలో ఇప్పుడు 40% చైనీయులే.
  2. కాశ్మీరులో హిందీభాషని నిరోధించడం కోసం ప్రత్యేక హక్కులు ఉన్నాయి. కాశ్మీరీ భాష పరిరక్షణకై మన రాజ్యాంగానికి మించి హక్కులు ఉన్నాయి. టిబెట్లో, ప్రాథమికాభ్యాసం తరువాత చదువుకోవాలంటే చైనా భాష నిర్బంధం. టిబెట్ భాష అంతరించిపోయే పరిస్థితిలో ఉంది.
  3. కాశ్మీరులో ఆమ్నెస్టీ మొదలైన అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్నాయి. మానవహక్కుల పరిరక్షణకి కృషి చేస్తూ భారతసైన్యం యొక్క తప్పులని ఎండగడుతూ ఉంటాయి. దినపత్రికలు, వార్తాపత్రికలు సంపూర్ణ స్వేఛ్ఛతో ప్రచురించబడుతాయి. అందులో సగం భారతదేశానికి బహిరంగంగా వ్యతిరేకమైనవి. టిబెట్లో అయితే కాలుపెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రభుత్వమే పత్రికలను అచ్చువేయిస్తుంది.
  4. కాశ్మీరులో ప్రజాస్వామ్యంగా అందరూ వోటు వెయ్యవచ్చు. వారు స్వయంగా ముఖ్యమంత్రిని ఎన్నుకోవడమేగాక ప్రత్యేక కాశ్మీరు పతాకాన్ని కూడా ఎగురవేసుకోవచ్చు. టిబెట్లో అయితే ముఖ్య అధికారిని బీజింగు నియమిస్తుంది.
  5. కాశ్మిరులో విభజనకోసమై సాయుధపోరాటం చేస్తున్నారు. వీటికి లోపల చెరబడిన విదేశీ ఉగ్రవాదులు నాయకత్వం వహిస్తున్నారు. అన్యాయంగా లక్షలకొద్ది కాశ్మీరీ పండిట్లను హతమార్చారు. ఆస్తులు స్వాధీనం చేసుకుని తరిమివేసారు. టిబెట్లో “స్వాతంత్ర్యం” అడగనుకూడా అడగట్లేదు. మైనారిటి టిబెటన్లు (ముస్లిము టిబెటన్లు, ఐయ్ఘర్ టిబెటన్లు) ఎటువంటి జాతివేషమ్యం ఎదుర్కోలేదు. అయినా, అక్కడ “అదృశ్యమైన” టిబెటన్లు ఇక్కడ కాశ్మీరులో మరణించిన తీవ్రవాదులకి సమాపంగా ఉన్నారు.
  6. పాకీస్తానులో ఉగ్రవాద శిబిరాలకి సైన్యం సాయూతనిస్తుంది. అటువంటి పాకీస్తానుకే ఆటంబాంబును, మిస్సైళ్ళను ఇచ్చిపెడుతోంది చైనా. మన భారతదేశంలో ప్రతి పౌరునికి హక్కైన శాంతియుత ప్రదర్శనకూడా జరపనివ్వలేదు మనం అతిథులైన టిబెటన్లని. అయినా మనం ఏదో తప్పుచేసామన్నట్లు, చైనా మన భారత రాయబారికి దారుణంగా అర్థరాత్రి 2 గంటలకి సమన్లు పంపించింది.
  7. “మాకు స్వాతంత్ర్యం వద్దు. సరైన భావ,కళా స్వాతంత్ర్యం చాలు. హింసాయుత ఆందోళన ఆపకపోతే రాజీనామా చేస్తా”, అని అంటున్న దలైలామాని చైనా ఒక ఉగ్రవాదిగా చూస్తోంది. కనీసం చర్చలకి కూడా అంగీకరించడం లేదు. మన భారతదేశం హత్యలు చేసిన ఉగ్రవాదులతో కూడా చర్చలకు స్వాగతం చెబుతోంది.

మన కమ్యూనిస్టుల దృష్ఠిలో 1970లో మనపైకి చైనా దొంగచాటు యుద్ధం మోగించడానికి కారణం మనం దలైలామాకి ఆశ్రయం ఇవ్వడమే. ఇప్పుడు, ఈ బౌద్ధ సన్యాసులనందరినీ మన దేశం నుండి తరిమివెయ్యాలంట ! అమెరికా సమర్థించినంత మాత్రాన టిబెటన్లు ఉగ్రవాదులైపోతారా ? మన ప్రజలకి బుర్రలేదనుకుంటున్నారా ? మనదేశంలో కమ్యూనిస్టులు చైనాకి బానిసలవలే వ్రాతలు వ్రాస్తున్నారు. శాంతికాముకుడైన బుద్ధుని మనం మరచిపోయినా, మన సంస్కృతిని పెంచుతున్న టిబెటన్లు మనకి సోదరులవంటి వాళ్ళు. ఈ పాత్రికేయులు, వ్యాఖ్యాతలు ఎంత విషం వెదగక్కినా భారతీయులు ఆ అనుబంధాన్ని ఎప్పటికీ మరచిపోరు.

మనదేశంలో ఆర్.ఎస్.ఎస్ లాంటి సంస్థలు వేళ్ళూనుకోవడానికి ఈ కమ్యూనిస్టు మూర్ఖత్వమే కారణం.

5 responses to “చైనాకి జిందాబాదు కొడుతున్న కమ్యూనిస్టులు

  1. బాగా చెప్పారు. నాకు కమ్యునిస్ట్ లంటే చాలా గౌరవం . కాని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది.అమెరికాని గుడ్డిగా వ్యతిరేకించటం,చైనాకు వత్తాసు పలకడం మానుకొవలి.

  2. ఈ అంశం పై నాకు ఏమీ తెలీదు. కానీ మీ విశ్లేషణ నచ్చింది.

    టిబెటన్లంటే నాకు గౌరవం ఉంది.

    చైనా అంటే గిట్టదు. కానీ అమెరికాకి ముక్కుతాడు వేయాలంటే చైనా, రష్యా, భారతదేశం కలిసి ఒక సమూహం లాగా (విధి విధానాలు అందరికీ ప్రయోజనకర రీతిలో ఉండాలి) ఏర్పడితే అమెరికాకి భయం కలుగుతుంది. ఈ వాదాన్ని నేను నమ్ముతాను.

  3. కిరణ్,
    మీ వ్యాసం చాలా బాగుంది. ఇంకా మరికొంచెం మెటీరియల్ ఇస్తే బాగుంటుంది. దీని మీద బోలెడంత చర్చ జరుగుతుందని అనిపిస్తోంది.

  4. కమ్యునిజం పాటిసున్నవాళ్ళని… గబుక్కున చోక్కాపట్టుకుని నువ్వు ఎందుకు communist అని అడిగితే… ఏదొ పేదల కష్టాలు తీరుస్తున్న వాడిలా ఎదొ అరుస్తారు తప్పించి… కమ్యునిజంని మనసావాచా పాటించే సన్నాసులు ఒక్కరూకనబడరు.. ఎవరుబట్టిన భావదాస్యంకి లొబడి ఉటంకించేవారు అవటం వల్లన ఇలా జరుగుతుంది అని నేనూనమ్ముతున్నాను. ఇక్కడ మీడియాని బాగ దుయ్యబట్టాల్సిన అవసరం ఉంది.. ఇది జనాలకు అవసరమాలేక…publicity కొసరం చేస్తున్న అరవగోడా అన్న విచక్షణ లేని పత్రికలు,టివి మాద్యమాలు ఉన్నంతవరకు ..ఇలా మనం గెంతులెయ్యాల్సిందే కాని ..అక్కడ వీసమంత మార్పు కూడా రాదు.

  5. nenu telugulo rayalekapotunnanduku nannu kshamichali(naa daggara telugulo rache parignanam ledu)…kiran garu mee vishleshana adbutam ga undhi … naa abhinandanalu andukondi

Leave a reply to sandeepchilukuri స్పందనను రద్దుచేయి