ఎడారి ఈ ఇసక రహస్యాలతో కూడి వుంది నీటి బుగ్గ ఈ ఇసకల మధ్యన తెలవబడింది నా యవ్వనమనే వాగు ఉబికి ఉబికి లేస్తోంది ఈ గాలి దుమారంపై ఆడుతోంది రంగురంగులలో రకరకాల గొంతులలో ఈ ఎడారిలో పుట్టిన ఈ వింతలలో చంద్రుని ఆకాశమైనా తిరిగి లేచినా నేను కూర్చునేది లేదు, విరమించేది లేదు నా పెదవులు తడి ఆరవు ఈ ఎడారిని కొలిచి పాడుతూ ఉంటే
ఇజ్రాయెల్ దేశానికి చెందిన “లైట్ ఇన్ బాబిలోన్” (బాబిలోన్ దేశపు కాంతి) అను సంగీతబృందం ఆలపించిన ” యా సహ్రా” (ఓ ఎడారి) అనే పాట ఇది. ఎడారి ఒక మంత్రముగ్ధమైన ప్రదేశమని, అక్కడ ఎన్నెన్నో రహస్యాలు అన్వేషకులకు వెల్లడవుతాయని ఈ పాట సాహిత్యం. పదాల వెనుక లీలగా యూదుమతంలోని మోసెస్ ప్రవక్తకి చెందిన కథ ఆనుతూ కనపడుతూ ఉంటుంది.
ఫే: ధనం తెగ మధ్య తగువులకు మూలం, తోడేలు అడవిలో నివశిస్తుంది ఉర్: తుప్పు హీనమైన ఇనుముపై పుడుతుంది, కొమ్ములేడి మంచుపై పరిగెడుతుంది థుర్స్: బలశాలి ఆడవారికి బాధ కలిగిస్తాడు, దౌర్భాగ్యం ప్రజలకి క్షోభ చేస్తుంది ఆస్: ఉప్పుకయ్య ప్రయాణాలన్నింటికి దారి, ఒర కత్తులతో నిండుంటుంది రైధ్: స్వారీ గుఱ్ఱాలకి కష్టమైనది, రెగిన్ అతిపదునైన కత్తి సాగకొట్టాడు కౌన్: పుండ్లు పిల్లలకి విషమమైనవి, మృత్యువు శవాన్ని తెల్లబారుస్తుంది హగల్: వడగళ్ళు అతిచల్లటి విత్తనాలు, హెర్యాన్ పురాతనలోకం సృష్టించాడు నౌధృ: అవసరం ఎంపికలు వెదకదు, నగ్నమైన మనిషి చలికి వణుకుతాడు
ఈస: మంచుబల్లలని వంతెనలంటాం, గుడ్డివాళ్ళని పట్టుకు తీసుకెళ్ళాలి ఆర్: సమృద్ధి మనుషులకి వరం. ఫ్రోడీ దయాగుణం నిండినవాడు సోల్: సూర్యుడు ప్రపంచానికి వెలుతురు. నేను దైవాజ్ఞకి తలవంచుతాను ట్యుర్: ఒక చేయి కలిగిన దేవత. కుమ్మరి తరుచుగా ఊదాలి
బ్యార్కాన్: భుర్జవృక్షం ఆకులు అతిపచ్చవి. లోకీ వంచనలో అదృష్టవంతుడు మధృ: మనిషి ధూళికి తోడు. డేగ గోరు గొప్పది లోగృ: జలపాతం పర్వతంపై జాలువారు నది, కానీ తన నగలు బంగారం యుర్: జనకవృక్షం శీతాకాలంలో పచ్చగా ఉంటుంది. మండేటప్పుడు చిటపట్లాడదు
ఐరోపాఖండానికి ఉత్తరాన ఒకానొక కాలంలో జానపదులు మాట్లాడిన పురాతన నార్సుభాషలో ఆధునికయుగంలో తిరిగి గేయరచన చేయాలని సంకల్పించి కొన్ని గాయకబృందాలు కృషిచేస్తున్నాయి. అందులో హైలుంగ్ (స్వస్థీకరణ) అను సంగీతబృందం పాడిన “నోరుపో” అను ఒక స్వస్థీకరణ గీతం ఇది. షమానులు అనే ప్రాకృతికమతానికి చెందిన మంత్రగాళ్ళు కృశించిన, రోగాలబారిన పడిన ప్రజలను స్వస్థపరచడానికి వివిధ దేవతల పేరులు, వారి మహిమలు చెబుతూ, మంత్రాలు వల్లిస్తారు. ఈ వైనం ఇక్కడి ఆధునిక యుగంలో తిరిగి పునస్థాపించడానికి ఒక ఉదాహరణగా ఈ పాట చెప్పవచ్చు.
మంత్రవశమై, పడున్నా నేను పడున్నా నేను పట్టి మాంత్రికుడు, పడేసాడు నన్ను పడేసాడు నన్ను మంత్రవశమై పడున్నా, మనసు లోతుల్లో, మనసు లోతుల్లో మండుతోంది హృదయంలో, చిటపట అగ్ని చిటపట అగ్ని
మంత్రవశమై, పడున్నా నేను పడున్నా నేను పట్టి మాంత్రికుడు, పడేసాడు నన్ను పడేసాడు నన్ను మంత్రవశమై పడున్నా, గుండె వేర్లలో, గుండె వేర్లలో నా కనుచూపు నించుంది, మాంత్రికుడు ఎక్కడ నించున్నాడో
ఐఫోర్ పాలాస్దోతిర్ అను గాయని ఫారోవేస్ భాషలో పాడిన “ట్రొల్లాబుండిన్” (మంత్రవశమై పడున్నా) అను పాట ఇది. ఫారోవేస్ భాషను ఉత్తర ఐరోపా ఖండంలో ఆర్కిటిక్ మహాసముద్రానికి ఆనుకుని, నార్వే ఐస్లాండు దేశాలకు నడుమున ఉన్న ఫారో ద్వీపాలు అను ద్వీపసముదాయంలో మాట్లాడుతారు. ఈ ఫారో ద్వీపాలు డెన్మార్కు దేశానికి చెందినవి. ఈ ఫారోవేస్ భాష నార్వే, ఐస్లాండు మొదలైన దేశాలకి చెందిన నార్సు (ఔత్తరేయ) భాషాసముదాయంలో ఒక భాగం. ఈ పాట సంగీతం మధ్యలో గాయని కంఠకంపన ఆలాపన కూడా చేస్తోంది. ఇటువంటి కంఠకంపనగానం ఇన్యూవిట్ మొదలైన ఆర్కిటిక్ మంచుప్రాంతపు తెగలవారు వారి జానపదసంగీతంలో ఉపయోగిస్తారు.
చుంచు తోలుతోంది, బండి గొణుగుతోంది బండినిండా నిద్రపు మూటలు ఓ మూరెడు నిద్ర ఇక్కడా, ఓ మూరెడు నిద్ర అక్కడా ఓ దోసెడు నిద్ర పాపాయికి
ఉయ్యాలూపుతూ బువ్వపెడుతూ పిట్ట పాపాయిలకి కొమ్మ పట్టుకున్నాను తల్లి పిట్టని ఉడతొచ్చింది పరిగెట్టి, కింద పడేసింది అందుకో, అందుకో చేతితో, అందట్లేదు నాకు పిలుస్తున్నా, గొంతు పిలుస్తున్నా, పిలవలేకపోతున్నా ఉయ్యాలూపు చిట్టికొమ్మతో పిట్టపాపాయి నేను ఇక్కడ తమ్ముణ్ణి బజ్జోపెడుతున్నాను
లాట్వియా దేశంలోని తౌతూమెయితాస్ గాయనీబృందం ఆలపించిన “పెలీతె” (చుంచు) అను సొంపైన జోలపాట ఇది. ఈ పాటలో ఒక చుంచుపిల్ల బండితో నిద్రమూటలని లాగుతూ, పాపాయిలకి పంచి ఇస్తోంది అని కథ.
ఒక మాత్ర నిన్ను పెద్దదిగా చేస్తుంది, ఒక మాత్ర చిన్నదిగా చేస్తుంది నీ అమ్మ నీకిచ్చే మాత్రలు మాత్రం, ఏవీ ఏమీ చెయ్యవు
ఏలిస్ ని అడుగు, తను పదడుగుల పొడువైనప్పుడు
కుందేళ్ళని వెదుక్కునే వేటలో నువ్వు, ఎప్పుడు క్రింద పడతావో తెలియదు వాళ్ళకి చెప్పు హుక్కా కాలుస్తున్న ఓ గొంగళీపురుగు నిన్ను పిలిచిందని
ఏలిస్ని పిలిచాడు, తను చిన్నదిగా ఉన్నప్పుడు
చదరంగం బల్లపై మనుషులు లేచి నీకు ఎటు వెళ్ళాలో చెప్పినప్పుడు ఏదో పుట్టగొడుగుని నివ్వు తిన్నప్పుడు, నీ మతి నెమ్మదిగా కదుల్తుంటే
వెళ్ళు, ఏలిస్ని అడుగు, తనకి తెలుసనుకుంటాను
తర్కపరిమాణాలు చచ్చిపడుండగా తెల్లశకటం యోధుడు తిరగేసి మాట్లాడుతుండగా ఎరుపు రాణి తలకాయి లేకుండా తిరుగుతుండగా గుర్తించుకో పందికొక్కు ఏం చెప్పిందో నీ తలకాయికి తిండిపేట్టు, నీ తలకాయకి తిండిపెట్టు
జెఫర్సన్ ఎయిర్‌ప్లేన్ (జెఫర్సన్ విమానం) అనే అమెరికాదేశపు సంగీతబృందం 1967వ సంవత్సరంలో విడుదలచేసిన “తెల్ల కుందేలు” అనే గీతం ఇది. ఈ సంగీతం మనోలోలిత (సైకడెలిక్) సంగీతచరిత్రలో ఒక పునాదిరాయిగా పేర్కొంటారు. గ్రేస్ స్లిక్ అను గాయని పాడిన ఈ పాట సాహిత్యం ఎల్.ఎస్.డి మొదలైన మనోలోలిత పదార్థాలు మింగిన తరువాత కళ్ళముందు కనపడే వింత అనుభూతులని వర్ణిస్తోంది. పాట సాహిత్యంలో లూయిస్ కారొల్ అను రచయిత రచించిన “ఏలిస్ ఇన్ ద వండర్లేంద్” (వింతప్రపంచంలో ఏలిస్) అను ఒక చిన్నపిల్లల కథని అనేకమార్లు ఉల్లేఖిస్తున్నారు. ఈ కథలో తర్కశాస్త్రంలోని గణితశాస్త్రంలోని కిటుకైన విషయాలను గమ్మత్తైన కథాసందర్భాలు సృష్టించి వాటిద్వారా వ్యాఖ్యానిస్తాడు రచయిత. ఈ కథావిషయాలను, అక్కడ మాట్లాడే జంతువులు, జరిగే వింత సందర్భాలను ఈ పాట మనోలోలిత భ్రాంతిలో కనపడే దృశ్యాలతో పోల్చిచూస్తోంది.
కళ్ళకి దూరంగా, గుండెకి దూరంగా ఉంటే అన్నావు నువ్వు అన్నిట్లోకి అందమైనది ఏమిటో మరచిపోతామని అన్నావు నువ్వు ఆ దూరాలు ఆకాశపుటంచులు ఎలా ఉన్నా తను నన్ను ఇప్పటికీ ప్రేమిస్తోందని నాకు తెలుసు ఆ అమ్మాయికి నేను పెట్టిన ముద్దుపేరు
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
మహాసముద్రం, అది చిన్నది, చాలా చిన్నది ప్రేమ చిగురించిన రెండు హృదయాలకు నువ్వు చెప్పిందంతా ఎలా ఉన్నా చూస్తున్నావుగా తను నన్నింకా ప్రేమిస్తోందని నేను కౌగిలించిన ఆ అమ్మాయి పేరు
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
మన ప్రేమ అంత పెద్దది, అవును అంత పెద్దది ఆకాశం కిందంతా పట్టేంత చోటంత పెద్దది నువ్వు చెప్పిందంతా ఎలా ఉన్నా నాకు తెలుసు తను నన్నింకా ప్రేమిస్తోందని నేను ముద్దాడిన ఆ అమ్మాయి పేరు
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
దాన్యెల్ జెరార్డ్ జర్మను భాషలో పాటను విడుదలచేసిన తరుణంలోనే, 1971వ సంవత్సరంలోనే, ఫ్రెంచి భాషలో కూడా “బటర్‌ఫ్లై” (సీతాకోకచిలుక) అని గీతం విడుదల చేసాడు. ఈ పాట సాహిత్యం జర్మను పాటతో పోలిస్తే కొద్దిగా తేడాగా ఉంటుంది. దానిని కూడా నేను తెలుగులో అనువాదించాను. ఈ రెండు పాటలు నాకు ఇష్టమైనా, ఫ్రెంచి పలుకులు అందంగా ఉంటాయని అనిపిస్తుంది నాకు. ఫ్రెంచి భాషలో సీతాకోకచిలుకను పాపియ్యోన్ అంటారు.
ప్రొద్దుట పూట లేచాను నేను ఓ సుందరీ రావే రావే రావే ప్రొద్దుట పూట లేచాను నేను వరి పొలాల పాటికి పోవాలి నేను
ఆ పురుగుల మధ్య, ఆ దోమల మధ్య ఓ సుందరీ రావే రావే రావే ఆ పురుగుల మధ్య, ఆ దోమల మధ్య కాయ కష్టం పని చెయ్యాలి నేను
కర్రపట్టుకుని పాలెగాడు నించున్నాడు ఓ సుందరీ రావే రావే రావే కర్రపట్టుకుని పాలెగాడు నించున్నాడు నడుములు వంచుకుని పని చేస్తున్నాం మనం
ఇక్కడ గడిపే ప్రతీ ఘడియా ఓ సుందరీ రావే రావే రావే ఇక్కడ గడిపే ప్రతీ ఘడియా యవ్వనం పోగొట్టుకుంటామే
ఓ నాయమ్మ, ఎంత సలుపే ఓ సుందరీ రావే రావే రావే ఓ నాయమ్మ, ఎంత సలుపే ప్రతిపూటా నిన్ను పిలుస్తుంటే
కానీ ఆ రోజు వస్తుందే మనకి అందరికి ఓ సుందరీ రావే రావే రావే కానీ ఆ రోజు వస్తుందే మనకి అందరికి స్వేఛ్ఛా విముక్తులై పనిచేసుకోవడానికి
“బెల్లా చావ్” (సుందరీ రావే) అనే ఈ పాట ఇటలీ దేశంలోని ఉత్తరప్రాంతాలలో వరిపొలాలలో కూలీపనులు చేసిన “మొందీనా” మహిళల జానపదగీతం. విపరీతమైన కాయకష్టం చేసి ఎన్నో బాధలు అనుభవించిన ఈ పేదమహిళలు ఇటువంటి పాటలతో పనికష్టం మరిచిపోవడానికి ప్రయత్నించేవారు. ప్రస్తుతం ఈ ఉత్తర ఇటలీ ప్రాంతం ప్రపంచంలోనూ, ఐరోపా ఖండంలోనూ అతిధనికప్రదేశాలలో ఒకటి. కానీ 19వ శతాబ్ది చివరలో ఈ ప్రాంతం అతిబీదస్థితిలో ఉండటంవలన, పెక్కు కరువుకాటకాలు భరించడంవలన ఎందరో పేదవాళ్ళు కూలి నాలి వెతుక్కుంటూ ఇటువంటి పనులు చేసేవారు. ఏ మాత్రం కూలి పెంచమని అడిగినా, పని ఒత్తిడి తగ్గించమని అడిగినా యజమాని పనిలోంచి తీసివేసేవాడు. మరెందరో దౌర్భాగ్యులు ఇదే పని కోసం ముందుకొచ్చి నిలబడేవారు. ఈ దుర్లభ దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడటానికి ఎన్నో ఉద్యమాలు చెయ్యవలసి వచ్చింది. కూలీకార్మిక సంఘాలు కనీస రోజు కూలీ సంపాదించడానికి ఎంతో కృషిచెయ్యవలసి వచ్చింది.
ఆ ఉద్యమాల ఉత్తేజం, సాంఘిక చైతన్యం వల్లనే ఈ పాట 20వ శతాబ్ది మధ్యలో వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధసమయంలో ఫాసిస్టుల, నాజీలా దుష్టపాలనకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన “పార్టీజానో” ఇటలీదేశభక్తుల గీతంగా రూపొందింది. ఈ రెండవ కృతి ప్రపంచవ్యాప్తంగా సామ్యవాద ఉద్యమాలలో అభ్యుదయవాదుల వద్దన బహు ఆదరణ సంపాదించి దేశదేశాలా అనువదింపబడి మారుమోగింది. ఉత్సవప్రియులైన ఇటలీప్రజలు ప్రస్తుతం పండగచేసుకునే ఎటువంటి సమయంలోనైన సంబరంగా “బెల్లా చావ్” అని ఆలపించడం చాలా రివాజు. ఫుట్ బాల్ పోటీలలో కూడా అభిమానుల మధ్యన తరుచుగా ఈ పాట వినపడుతూ ఉంటుంది. ఈ రెండవ కృతి సాహిత్యం క్రిందన చూడండి. ఇటలీ భాషలోని “పార్టీజానో” (పక్షస్థుడు) అన్న పదాన్ని “తోడుగాడు” అని అనువదించాను. ఈ “పక్షస్థుడు” అన్న పదం విప్లవపోరాట పక్షస్థుడిని సూచిస్తోంది.
ప్రొద్దుట పూట లేచాను నేను ఓ సుందరీ రావే రావే రావే ప్రొద్దుట పూట లేచాను నేను ఆక్రమిస్తున్న దుండగులని కనుగొన్నాను
ఓ తోడుగాడా, మోసుకుపో నన్ను ఓ సుందరీ రావే రావే రావే ఓ తోడుగాడా, మోసుకుపో నన్ను ప్రాణం పోతోందని తెలుస్తోంది నాకు
ఒక తోడుగాడిలా నేను చనిపోతే ఓ సుందరీ రావే రావే రావే ఒక తోడుగాడిలా నేను చనిపోతే నన్ను సమాధి చెయ్యాలి నువ్వు
పర్వతంలోన సమాధి చెయ్యి ఓ సుందరీ రావే రావే రావే పర్వతంలోన సమాధి చెయ్యి అందమైన ఒక పువ్వు నీడన
ఆ ప్రక్కన పోయే ప్రతివొక్కరూ ఓ సుందరీ రావే రావే రావే ఆ ప్రక్కన పోయే ప్రతివొక్కరూ “ఎంత చక్కని పువ్వు” అని నాతో అంటారు
ఇదొక తోడుగాడి గుర్తుకి పువ్వు ఓ సుందరీ రావే రావే రావే ఇదొక తోడుగాడి గుర్తుకి పువ్వు స్వాతంత్ర్యం కోసం ఒరిగినవాడి గుర్తుకి
ఈ పాటని పైన వీడియోలో చిత్తూరు సరస్వతీ రాధ అని ఎవరో తెలుగు గాయని చాలా చక్కగా ఇటలీభాషలో ఆలపించారు. “బెల్లా చావ్” పాటని విశ్వవ్యాప్తంగా ఎందరో గాయనీగాయకులు ఆలపించి సంగీతముద్రణలు విడుదలచేసారు. బహుశా మొదట బహుళప్రాచుర్యంలోకి వచ్చిన గానముద్రణ జియొవాన్నీ దఫ్ఫినీ అనే ఇటలీ గాయని స్వరమ్నుండి. ఆవిడ మొదటి మొందీనా పాఠాంతరాన్ని, తరువాతి పార్టీజానో పాఠాంతరాన్ని రెంటినీ పాడి విడుదల చేసింది. ఆ తరువాత చాలా మంది ఐరోపా గాయకులు, ప్రపంచవ్యాప్తంగా గాయకులు ఎందరో ఈ పాటని ఇటలీభాషలోనూ, లేదా వారి వారి భాషలలోని అనువాదకృతులను పాడారు.
“బిజినెస్‌మేన్” అనే ఒక తెలుగు సినిమాలో ఈ పాటని ఖూనీ చేసి “పిల్లా చావ్” అని అనువదించి, అతి అసహ్యమైన నికృష్టమైన సాహిత్యం తగిలించి తెలుగులోకూడా విడుదల చేసారు. ఆ పాట సాహిత్యం అంతా గజ్జిపట్టిన ఊరికుక్కల వలే ఆంగ్ల, హిందీ భాషతో సంకరం చేసి తెలుగులో పదాలు కూడా లేకుండా ఉంటుంది. “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని పేరొందిన మన తెలుగు భాషకి ఇటువంటి దౌర్భాగ్యం పట్టించిన నికృష్ట రచయితలను ఎంత చీకొట్టినా సరిపోదు.
అన్నట్టు, తెలుగును ఇటాలియన్ భాషతో మొదట పోల్చినది నికోలా దా కొంతీ అనే ఒక ఇటలీ అన్వేషకుడు. ఆయన 15వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్య సమయంలో భారతదేశాన్ని, అందునా దక్షిణభారతదేశాన్ని సందర్శించాడు. ఆ సమయంలో బహుభాషాభ్యూష్యమైన విజయనగరసామ్రాజ్యంలో తెలుగుభాషను గౌరవప్రదంగా చూడడమూ, మిగిలిన భాషలవారు తెలుగుభాషలో మాట్లాడడానికి కృషిచేస్తుండడం చూసి నికోలో దా కోంతీ యూరపులో వివిధ ప్రాంతాలవారు 15వ శతాబ్దిలో ఇటాలియన్ భాషని మాట్లాడడానికి ఎలా చూసేవారో తెలుగు అలా ఉంది అని అభిప్రాయం వెలబుచ్చాడు. యూరపులో ఇటాలియన్ అంత అభిమానం పొందడానికి కారణం సంప్రదాయకమైన లాటిను భాషకి ఇటాలియన్ అతిదగ్గరగా ఉండటమే. ఇప్పుడు కూడా వివిధ దక్షిణ ఐరోపా దేశీయులకు (వారి వారి ఫ్రెంచి, స్పానిషు, పోర్చుగీసు మొదలైన భాషలు తెలిసినవాళ్ళు) ఇటాలియన్ భాష అర్థం కావడం సుళువు. నేను ఫ్రెంచి భాష ధారాళంగా మాట్లాడగలను కనుక, ఇటాలియన్ నాకు కూడా కొంచెం అర్థం అవుతుంది. కానీ, అంతే సులభతరంగా స్పానిషు అర్థంకాదు. స్పానిషు వారికి ఇటాలియన్ అర్థం అయినంత సులభతరంగా ఫ్రెంచి భాష అర్థంకాదు. ఎందువలన అంటే లాటినుభాష జన్యమైన వివిధ దక్షిణ ఐరోపా భాషలన్నింటికీ లాటినుమూలాలు పదిలంగా నిక్షెపించిన ఇటాలియన్ భాష సుళువుగా ఉంటుంది. ఇదేవిధంగా సంస్కృతభాష జన్యమైన వివిధ భారతదేశభాషలకు సంస్కృతభాష మూలాలను విస్తృతవాడుకలో వినియోగించిన తెలుగుభాష మధురంగా తోస్తుంది. అందుకే కృష్ణదేవరాయలు కూడా “దేశ భాషలందు తెలుగు లెస్స” అని అన్నాడు. 15వ శతాబ్దిలో రెనయిసాన్సు (సాంస్కృతిక పునరుజ్జీవనం) ఇటలీలో మొదలైన సమయంలో అంత గౌరవం ఉండిన ఇటాలియన్ భాషకి తగునైన పొలికైన భాష అని తెలుగు భాషని ఇటాలియన్ అన్వేషకుడైన దా కోంతీ పోల్చడం ఔచిత్యమైన విషయం.
ఇటువంటి తెలుగు భాషని ఇలా నీచ నికృష్ట దశలోకి తెచ్చి పాడికట్టేస్తున్న మూర్ఖ రచయితలు ఇదే ఇటాలియన్ భాష పాటని వినియోగించడం పైశాచిక ఔచిత్యం కాక మరేమిటి?
భాషకి రుచి లేదు, మతి లేదు కేవలం గుచ్చే రెండు కళ్ళే, సీమసంపంగి రేకులలా మనసు లేదంటే లేదు
నిన్ను స్పృశిస్తున్నాను, సంగీతం నెమ్మదిగా సాగుతోంది కానీ నాలో ఒక బ్రహ్మాండం బద్దలవుతోంది నిన్ను స్పృశిస్తున్నాను, నా వెన్నులో ఒక వణుకు అదురుతోంది ఒక వేటు సూటిరాయి మధ్యన పడింది
నన్ను ప్రేమిస్తున్నావా? లేదా? నన్ను ప్రేమిస్తున్నావా? లేదా? నన్ను ప్రేమిస్తున్నావా?
నీనుండి నాకు మిగిలినదేమిటి? నా కవితలనుండి నిద్ర నీడ జాయిగా జారిపోతోండగా దానికి మనసు లేదంటే లేదు
నిన్ను స్పృశిస్తున్నాను, అద్భుత నిమజ్జిత విగ్రహం అలా మనం క్రింద కూర్చుండగా ఇబ్బందిగా నిన్ను స్పృశిస్తున్నాను, మరుమాయమైన అట్లాంటిస్ ద్వీపం ప్రేమికులగానే ఆనుతున్న ఆకారం
నన్ను ప్రేమిస్తున్నావా? లేదా? నన్ను ప్రేమిస్తున్నావా? లేదా? నన్ను ప్రేమిస్తున్నావా?
నిన్ను స్పృశిస్తున్నాను, సుదూర ఎడారిలో ఎండమావి ఆ రేణువులు నన్ను బంధించాలని చూస్తున్నాయి నిన్ను స్పృశిస్తున్నాను, గాలిలో ఒక ఆటవిక ప్రేమలా నిన్ను కలవాలని ఉంది
నన్ను ప్రేమిస్తున్నావా? లేదా? నన్ను ప్రేమిస్తున్నావా? లేదా? నన్ను ప్రేమిస్తున్నావా?
నిన్ను స్పృశిస్తున్నాను, కలవాలని ఉంది
ఆంతోనెల్లా రుజ్జియేరో అనే ఇటలీ గాయని “మాతియా బజార్” అనే తన సంగీతబృందంతో కలిసి ఆలపించిన ” తి సెంతో” (నిన్ను స్పృశిస్తున్నాను) అనే పాట 1985వ సంవత్సరంలో ఉప్పొంగిన విద్యుత్సంగీత గీతాలఝరిలో విడుదలయ్యింది. ఆ దశాబ్దంలో అనేకదేశాలలోని సంగీతబృందాలు ఎలెక్ట్రానిక్ సంగీత పరికరాలను వినియోగించి నవీన గానరీతులని ఆవిష్కరించాయి. ఇటలీ దేశంలో కూడా ఈ సంగీత తరంగాలు ప్రభవించాయని మనం చూడవచ్చు. “ఆర్కిడే” పుష్పాలను పాట సాహిత్యంలో ప్రస్తావించిన సందర్భంలో “సీమసంపంగి” అని అనువదించాను.
ఆ పాత వీధులమధ్య అతిరద్దీయైన పేటలో మధ్యాహ్నానికి కానీ, సూర్యాస్తమయానికి కానీ తీగలు సరిలేని ఒక వయోలినో అకోర్డియనో వాయిస్తుంటే తరుచుగా వింటూ ఉంటాం
ఆ వాద్యాలు సహకారంగా అప్పుడప్పుడు ఓ పాటగాడు చిల్లరక్కూడా తక్కువకోసం ఏదో పాటని పాడుతూ ఉంటాడు
రెండు పైసాల కోసం పాడే ఓ మామూలు పాట అది ఆవల పేటల వీధులలో తిరిగుతూ పాడే పాట అది కానీ మనసు లోతుల్లో తడుతుంది జ్ఞాపకాలని ఓ తియ్యటి జులాయి యవ్వనపు గుర్తులని
యదకోసం పలికే ఓ మామూలు పాట అది ఏవో కొద్ది స్వరాలు పదాలు కలిసుండే పాట కానీ కొందరు జనాలు అలాగే నించుండి వింటూంటారు తిరిగిరాని కాలాన్ని తలుచుకుంటూ ఆలోచనల్లో పడతారు
అలా చూస్తుండగా కొంచెం కొంచెం దూరంగా కిటికీలు తెరుచుకుంటున్నాయి కొందరు జనాలు వస్తారు విండానికి నిట్టూర్చడానికి
రెండు పైసాల కోసం పాడే మామూలు పాట అది ఆవల పేటల వీధులలో తిరిగుతూ పాడే పాట అది కానీ ఆశపడేవాళ్ళకి, ప్రేమించేవాళ్ళకి, కలలుగనేవాళ్ళకి అదొక తియ్యనైన నిత్యమైన ప్రేమకథ
ఆరువందల ఆర్కెస్ట్రాలు వాయిస్తాయి అదే పాటని అదే స్వరాలని ఆ మరుసటి రోజు లోకం ముస్తాబులని అంతా వెంటేసుకుని ఎటుపోతాయో అటు
కానీ ఆ రెండు పైసాల కోసం పాడే మామూలు పాట ఎక్కడ పుట్టిందో అక్కడకే తిరిగెళ్తుంది ఆ వీధుల్లోకి, పాడుతుంటే ఆనందం కలలుగనే పాటని ప్రేమించే నోట్లోకి
అదో రెండు పైసాల పాట రెండు పైసాల ఆనందపు మూట
ఇటలీ లోని సంగీతకృతికారులైన పించీ (అసలు పేరు గిసెప్పే పెరోటీ) కార్లో దోనీదా కలిసి విరచించిన “కాంజోనే ద దువే సోల్దీ” (రెండు పైసాల పాట) అనే గీతం ఎందరో గాయనీ గాయకుల మెప్పు పొందింది. ఎందరో ఈ పాటని పాడ సంగీతముద్రణలు విడుదల చేశారు. ఈ పైన, నిల్లా పిజ్జీ అనే ఇటలీ గాయని పాదుతున్న వైనం చూడవచ్చు. కల్మషాలులేని, డాంభికాలు ఆర్భాటాలు లేని వీధిగాయకుల పాటలను, వాటిని విని మైమరచే ప్రజల నిర్మల హృదయాలను ఈ పాట నెమరువేసుకుంటోంది. వీధుల్లో అలలాగ సాగుతూ పోయే ఆ పాట పాతకాలపు జ్ఞాపకాలను, చిన్ననాటి ఆశయాలను, యవ్వనపు మధురిమలను గుర్తు తెస్తుంది అని సాహిత్యం చెప్తోంది. దురదృష్టవశాత్తూ మనదేశం సంస్కృతికి చెందిన ఎన్నో అటువంటి జానపదగీతాలు, వీధిసంగీతకారులు ప్రస్తుతం మాయమైపోతున్నారు. కనీసం రెండు పైసాలు వేసే దీనుడు కూడాలేక అటువంటి రెండు పైసాల పాటలు మననుండి దూరమైపోతున్నాయి.
ఓ నాన్నా, ప్రియమైన నాన్నా నాకు నచ్చింది, ఎంతో బాగుంది, బాగుంది పోర్తా రోస్సాకి (ఎర్రటి తలుపులు అను ప్రదేశం) వెళ్లాలని ఉంది ఆ ఉంగరాన్ని కొనాలని ఉంది
ఔను, ఔను, అక్కడికి వెళ్లాలని ఉంది తనని ప్రేమించింది వ్యర్థమైనా వెచ్చియో వంతెన పైకి వెళ్తాను (ఫిరెంజె/ఫ్లోరెన్సు నగరంలో ఒక చూడచక్కనైన పేరొందిన వంతెన. దానిపైన వన్నెవన్నెల కట్టడాలు, దుకాణాలు ఉంటాయి) కానీ ఆర్నో నదిలోకి దూకడానికి
ఈ కోరికలతో కృశించిపోతున్నాను భగవంతుడా, చనిపోవాలని ఉంది నాన్నగారు, దయచేసి పంపించండి నాన్నగారు, దయచూపండి
జియకోమో పుచ్చీనీ అను సంగీతకారుడు ఇటలీదేశానికి చెందిన అతిగొప్ప సంగీతకల్పకారులలో ఒకడు. ఆయన 20వ శతాబ్ది ప్రారంభంలో ఎన్నో వీనులవిందైన సంగీతనాటకాలు విరచించాడు. ఈ నాటకాలలో పాడడానికి ఎంతో గానకౌశలం ఉన్న గాయనీగాయకులు ప్రాణమిచ్చేవారు. ఆయన విరచించిన “జియాన్నీ స్కిక్కీ” అనే హాస్యనాటకంలోని కృతి ఇది “ఓ మిఓ బొబ్బీనో కారో” (ఓ నా ప్రియమైన నాన్న). ఇందులో గాయని తన తండ్రిని అనుమతి అడుగుతూ ఉంటుంది, తను వరించిన ప్రేమికుడిని కలవడానికి వెళ్లాలని. పాట పాడిన మరియా కల్లాస్ అను గాయని ఎంతో పేరొందిన సంగీతనాటక (ఓపెరా) గాయనులలో ఒకరు.