Tag Archives: విశ్వవ్యాప్తిమైన తెలుగు పాట

సింధూరవృక్షం

సింధూరవృక్షం

ఎక్కడ పెరుగుతున్నావో, ఓ సింధూరవృక్షమా, ఊగు ఊగు
నేను చూడకుండా ఉండేటట్లు, ఊగు ఊగు
వెండి వేరులతో, బంగారపు కొమ్మలతో, ఊగు ఊగు
వెండి ఆకులతో, ఊగు ఊగు

ఒక పవిత్రమైన ఉదయం చూశాను, ఊగు ఊగు
మృధులతావృక్షం సింధూరవృక్షానికి మనసిచ్చింది
సింధూరపుచెట్టుకు వెండివస్త్రాలు, ఊగు ఊగు
ఆకులపై ఉన్నినేతలా అల్లిన మంచు, ఊగు ఊగు

ఆ దట్టమైన సింధూరవృక్షం
మూడుపొరలతో బంగారువడ్డాణం
పాము కాటేసింది, తేనెటీగ కుట్టింది
ఒక్క ఆకు కూడా కదలలేదు

లాట్వియా దేశానికి చెందిన తౌతూమెయితాస్ గాయకీబృందం ఆలపించిన “ఓజోలిస్” (ఓక్ చెట్టు/సింధూరవృక్షం) అనే ఈ పాట పరువంలో ఉన్న ఒక్క యువతి తన ప్రేమికునికి మనసిచ్చిన వైనాన్ని, ఆపై ప్రేమికుడు తనని లొంగదీసుకున్న పరిస్థితిని భావుకంగా ఒక చెట్టుతో పోల్చి వర్ణిస్తోంది. లిండెన్ చెట్టు స్త్రీత్వానికి ప్రతీకగా ఈ తూర్పు ఐరోపా దేశపు సంస్కృతులలో చూస్తారు. ఈ చెట్టుని నేను మృధులతావృక్షం అని అనువదించాను (మునుపు ఇంకొక పాట అనువాదంలోనూ ఇదే పదం వాడాను). దట్టంగా పెరిగే సింధూరవృక్షం (అనగా ఓక్ చెట్టు) పురుషత్వానికి ప్రతీకగా చూస్తారు. ఈ పాట యువతీ యువకుల పరువాన్ని ఆ విధంగా పోల్చిచెబుతోంది.

ఈ గాయనిలు పాటని ఒక బహిరంగప్రదేశంలో ఆలపించిన వైనం క్రిందన చూడవచ్చు. వారు ఉపయోగించిన వాయిద్యాలు గమనించవచ్చు. జాజ్ సంగీతపు సంగతులు ఈ పాటలో అక్కడక్కడా కనపడుతూ ఉంటాయి. అటువంటి పాటను బహిరంగప్రదేశంలో ఆలపించడం చాలాకష్టం, ఎందుకంటే బయటిరొదలో సంగతులను గమనించడం కష్టం.

ముగ్గురు కుర్ర నావికులు

ముగ్గురు కుర్ర నావికులు

ముగ్గురు నావికులు యువకులు, లాలలా లాలలలలా..
ముగ్గురు కుర్రనావికులు నావ నడుపుతూపోయారు
అలా సముద్రంపై వెళ్తూపోయారు, అలా సముద్రంపై వెళ్తూపోయారు

గాలి వాళ్ళని తోసుకునిపోయింది, లాలలా లాలలలలా..
గాలి వాళ్ళని నవద్వారతీరంవరకూ తోసుకొనిపోయింది
అలా నవద్వారతీరంవరకూ, నవద్వారతీరంవరకూ

గాలిమర బండరాతిపక్కన, లాలలా లాలలలలా..
గాలిమర బండరాతిపక్కన లంగరువేసారు
అలా వేసారు లంగరు, అలా వేసారు లంగరు

ఆ గాలిమర మిల్లులో, లాలలా లాలలలలా..
ఆ గాలిమర మిల్లులో ఉంది ఒక కన్నె పనమ్మాయి
ఉంది ఒక కన్నె పనమ్మాయి, ఉంది ఒక కన్నె పనమ్మాయి

తను అడిగింది నన్ను, లాలలా లాలలలలా..
తను ఆడిగింది నన్ను ఎప్పుడు కలిసాం మనం అని
ఎప్పుడు కలిసాం మనం మునుపు? ఎప్పుడు కలిసాం మనం మునుపు?

నాంత్ నగరంలో సంతలో, లాలలా లాలలలలా..
నాంత నగరం సంతలో ఒక ఉంగరం వెతుక్కున్నాం మనం

ఫ్రాన్సుదేశానికి వాయువ్యదిశలో ఉండే బ్రెతాజ్ఞ్ అను ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునే భాషను బ్రెతోన్ భాష, లేదా బ్రయిఝ్ భాష అంటారు. ఈ భాష ఫ్రెంచిభాషనుగాక, పశ్చిమ ఐరోపా భాషలైన కెల్టిక్ భాషలను పోలివుంటుంది. దీని సోదరభాషలు ఐర్లండులోను, స్కాట్లండులోను, వేల్సులోను, స్పెయిందేశపు పశ్చిమాన ఉన్న గల్లీసియాలోను ప్రజలు మాట్లాడుతారు. చాలామటుకు ఈ భాషలు కృశించిపోయినా ఇంకా పూర్తిగా అంతరించిపోలేదు. ఆ బ్రయిఝ్ భాషలోని “త్రి మార్తలోద్” అను జానపదగానం 18వ శతాబ్దిలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏ కవి వ్రాసాడో తెలియదు, కానీ ఆ కాలంలో బ్రెతాజ్ఞ్ ప్రజలు నావికులవలే దేశదేశాలు తిరిగివెళ్తుండగా వారి జీవనతీరులను వివరిస్తోంది. ముగ్గురు కుర్రనావికులు నడుపుతున్న నావ గాలిలో సముద్రంపై కెనడా వరకూ కొట్టుకుపోయి అక్కడీ “న్యూఫౌండ్ లేండ్” (నవద్వారతీరం) చేరుకుంటుంది. ఈ ప్రాంతాన్ని బ్రయిఝ్ భాషలో “దువర్ నెవెజ్” అంటారు, అందుకే “నవద్వార” అని అనువదించాను (ఈ ఐరోపాభాషలన్నింటికీ సంస్కృతభాషతో కొంత సారూప్యం ఉంటుంది). ఆ నవద్వారదేశంలో మునుపు ఎక్కడో చూసి పరిచయమైన అమ్మాయి కనపడుతుంది ఒక నావికుడికి. అలా మళ్ళీ తిరిగి కలుసుకుంటారు కథలో.

ఈ పాటను పైన పాడింది నోల్వెన్ లెరోయ్ అను ఫ్రాన్సుదేశపు (బ్రెతోన్ జాతికి చెందిన) గాయని. ఈమె మునుపు ఈ పాటని చాలామంది గాయకులు గానం చేశారు. అందులో, అలాన్ స్టివెల్ అను గాయకుడి ఆలాపన చాలా పేరొందింది. అది క్రిందన వినవచ్చు.

కుచ్చెళ్ళపూలు

కుచ్చెళ్ళపూలు

కుచ్చెళ్ళపువ్వు అమ్మాయి, కుచ్చెళ్ళపువ్వు అమ్మాయి
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

ఇప్పుడే తప్పిపోయాడు, ఇప్పుడే తప్పిపోయాడు
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

కుచ్చెళ్ళపూలని పెట్టుకోవు, కుచ్చెళ్ళపూలని తూస్తావు
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

తోటలోకి వెళ్ళాను, కూచ్చెళ్ళపువ్వును త్రొక్కాను
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

కుచ్చెళ్ళపువ్వుని త్రొక్కాను, లావుగుందని తూచాను
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

కుచ్చెళ్ళపువ్వు అమ్మాయి, కుచ్చెళ్ళపువ్వు అమ్మాయి
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

ఇప్పుడే తప్పిపోయాడు, ఇప్పుడే తప్పిపోయాడు
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

నువ్వు రకియా తాగవు, కానీ రకియా వాసనొస్తావు
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

కందకాలు పందెంవేసాను, రకియాని పారవేసాను
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

రకియాని పారవేసాను, నిజమే అని తూచాను
గొర్రెపిల్లని లాలించు, చిన్నవాడిని నడిపించు

“కార్నాఫిచ్చే దెవోచ్చే” అనే ఈ బుల్గారియాదేశపు జానపదగీతాన్ని పాడింది “లాబొరాతోరియం పియెస్నీ” అనే పోలండు దేశపు జానపదగాయకబృందం. ఇందులో “కార్నాఫిచ్చే” అంటే ఎర్రటి రంగు “కార్నేషన్ పుష్పం”. ఇవి ఐరోపాఖండంలో మధ్యధరాసముద్రపు తీరప్రాంతాలలో విరివిగా పెరుగుతాయి. మనదేశంలో కూడా ప్రస్తుతం విరివిగా లభ్యమవుతున్నాయి. కానీ, వీటికి తెలుగు పేరు లేదు, అందుకని “కుచ్చెళ్ళపువ్వు” అని పేరు పెట్టాను. ఈ పాటలో ప్రతీ పాదం తరువాత “గీదో జగ్నే గాలేనో, గీదో మోమె మాలేనో” అని పాడుతారు. ఇదొక రకమైన అనుపల్లవి. దీనిని నేను “గొర్రెపిల్లని లాలించు, పిల్లవాడిని నడిపించు” అని అనువాదించాను. రకియా అంటే ఈ తూర్పు ఐరోపా దేశాలలో పళ్ళతో చేసే ఒక ఘాటైన మద్యం. ఈ పాటలో ఒక కన్నెయువతి ఒక యువకుడిని ప్రేమలో వశించుకున్న వైనం చెబుతున్నారు. పాట సాహిత్యం నేను ఆంగ్లభాషంలో వచ్చిన యాంత్రిక అనువాదాన్ని తీసుకుని, దానిని సవరించి, అక్కడినుండి తెలుగులో వ్రాసాను.

మంత్రగత్తెల రాత్రులు

మంత్రగత్తెల రాత్రులు

నిజమే, నిజమే, అబద్ధం కాదు, ఊగు ఊగు
మన సొంతపు పాత భాషలో, ఊగు ఊగు
మన సొంతపు పాత భాషలో, ఊగు!
నడివేసపు రాత్రిపూట కన్నెపిల్లలౌతారు, ఊగు ఊగు
మంత్రగత్తెలుగా మాయతోడేళ్ళుగా, ఊగు ఊగు
మంత్రగత్తెలుగా మాయతోడేళ్ళుగా, ఊగు!

ఈ రాత్రి ఈ రాత్రి నడివేసవి, ఊగు ఊగు
ఎవరిది ఈ రాత్రి నడివేసవి, ఊగు ఊగు
ఎవరిది ఈ రాత్రి నడివేసవి, ఊగు!
మంత్రగత్తెలది మాయతోడేళ్ళది, ఊగు ఊగు
వాళ్ళది సొత్తు నడివేసవి, ఊగు ఊగు
వాళ్ళది సొత్తు నడివేసవి, ఊగు!

గాలిలో ఎగిరింది మంత్రగత్తె, ఊగు ఊగు
మా ఇంటి వాకిట్లో కాదు, ఊగు ఊగు
మా ఇంటి వాకిట్లో కాదు, ఊగు!
మా ముంగిటి ఇనుములకొలిమి, ఊగు ఊగు
మా పెంకులపై మేకులు మేకులు, ఊగు ఊగు
మా పెంకులపై మేకులు మేకులు, ఊగు!

మా పెంకులపై మేకులు మేకులు, ఊగు ఊగు
తెప్ప వాట్లో చిక్కుకుంది, ఊగు ఊగు
తెప్ప వాట్లో చిక్కుకుంది, ఊగు!
మేకులు మొత్తం గుచ్చుకున్నాయి, ఊగు ఊగు
తెప్ప కాస్తా చిరిగిపోయింది, ఊగు ఊగు
తెప్ప కాస్తా చిరిగిపోయింది, ఊగు!

పారింది నది మజ్జిగలాగ, ఊగు ఊగు
మా ఆవులు మేసే పచ్చికదొడ్లో, ఊగు ఊగు
మా ఆవులు మేసే పచ్చికదొడ్లో, ఊగు!
అక్కడ వేటగాడి మెడవిరిగింది, ఊగు ఊగు
తొమ్మిది మంత్రగత్తెలు నుంచున్నారు, ఊగు ఊగు
తొమ్మిది మంత్రగత్తెలు నుంచున్నారు, ఊగు!
మునిగిపోతోంది లౌమాగత్తె, ఊగు ఊగు
సాయంత్రం సూర్యుడు లేక, ఊగు ఊగు
సాయంత్రం సూర్యుడు లేక, ఊగు!

లాట్వియా దేశపు గాయనీబృందం “తౌతూమెయితాస్” పాడిన “రగనూ నాక్ట్స్” (మంత్రగత్తెల రాత్రులు) అన్న ఈ పాట ఆ దేశపు జానపదసంస్కృతిని ప్రజల నమ్మకాలని ప్రస్తావిస్తోంది. నడివేసవి సమయంలో ప్రకృతి అంతా మాయామంత్రభరితం అవుతుందని, అప్పుడు మంత్రగత్తెలు తిరుగుతూ ఉంటారని అక్కడి ప్రజల నమ్మకాలు. లౌమా అను ఒక రాక్షసి అడవుల్లో తిరుగుతూ మగవాళ్ళని పట్టుకుతింటుందని, చిన్నపిల్లలను ఎత్తుకుపోతుందని ప్రతీతి. కానీ అదే రాక్షసి చిన్నపిల్లలని దీవించగలదని, లేదా శపించగలదని కూడా నమ్మకం. ఈ లౌమా యక్షిణులకు ఆవుపాలు, మజ్జిగ గుర్తు. ఈ పాటలో ఈ యక్షిణుల, మంత్రగత్తెల ప్రస్తావన ఉంటుంది. లాట్వియా భాషలో “లీగ్వ” అంటే “ఊగు” అని అర్థం. కానీ, ఇదే పదం నడివేసవి సమయంలో జరిగే పండుగ సంబరాలని కూడా సూచిస్తుంది.

నీలో నమ్మకం ఉంచాను

నీలో నమ్మకం ఉంచాను

నా అంతరాత్మలో వినిచూడు
స్వయంగా చూశాను హెరాయిన్ నేను
ఆ వీధుళ్లో అంత యవ్వనంలో నాశనమై పడి ఉండి
సరిపోయిందా, ఇంకా సరిపోలేదా?
కాళ్ళు విరిగిపోయిన ప్రపంచమా
అది మళ్ళీ మొదలవడం తిరిగి చూసి భరించలేను నేను

చెప్పు.. అదంటే ఎలా భయపడుతున్నానో
ఆరోగ్యంకోసం చూడకుండానే నిర్ణయించుకుంటాను
అంత విలువా, అది రుచి చూడడం అంటే?
చాలు, ఇంక చాలదా లోలోపల కుమిలిపోవడం
నిన్ను నువ్వే అమ్ముకునే సమయం
అలా గడిచిపోతుండే సమయం
(ఇంక చాలదా?)

టాక్ టాక్ (మాట్లాడు మాట్లాడు) అను ఆంగ్ల సంగీతబృందం 1988వ సంవత్సరంలో విడుదలచేసిన “ఐ బిలీవ్ ఇన్ యూ” (నీలో నమ్మకం ఉంచాను) అను గేయం ఇది. మాదకద్రవ్యాలకి అలవాటుపడి, వ్యసనపరులై జీవితం మొత్తం వ్యర్థం చేసుకున్న అభాగ్యులు ఎంతమందో. అలాగే తన యవ్వనంలో హెరాయిన్ అనే అతి భయంకరమైన మత్తుమందుకి లోలుడై ఎంతో క్షోభ అనుభవించిన తరువాత, తిరిగి ఆ సమయాన్ని గుర్తుచేసుకుంటూ గాయకుడు మార్క్ హోలిస్ పాడిన పాట ఇది. తన స్నేహితులు ఎందరో ఈ హెరాయిన్ వ్యసనం బారినపడాడం, చివరికి తన మానసిక బలహీనతలలో కూడా ఈ హెరాయిన్ మీద ఆశ ఉండటం చూసి, మనోవిచారణ చేసుకుంటున్న సాహిత్యం ఇది. లేతగొంతుతో అతిమధురంగా పాడుతూ, మనస్సుని అర్థంచేసుకున్నట్టు ఉంటుంది ఈ పాట. వ్యసనాలనుండి స్వేచ్ఛ కావాలని కోరుకునే ప్రజలకి ఈ పాట సాహిత్యం ఒక తోడ్పాటుగా ఉంటుంది.

ఇదే పాటని ఒక ఫ్రెంచి చిత్రకారుడు అనుప్రాణితంగా మలచాడు. ఆ వీడియోని కూడా క్రిందన చూడండి.

నీయాన్ కాంతి

నీయాన్ కాంతి, మిణుకుతున్న నీయాన్ కాంతి
రాత్రిపడేవేళ, ఈ నగరం అంతా కాంతి

(రాత్రిపడేవేళ, ఈ నగరం పుట్టింది కాంతినుండి)

క్రాఫ్ట్‌వెర్క్ (కర్మాగారం) అను జర్మను సంగీతబృందం ఎలెక్ట్రానిక్ సంగీతంలో ఒక విప్లవం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ వారి “నీయాన్ లిచ్ట్” (నీయాన్ కాంతి) అను పాట ఇది. అదే పాటను వారు “నీయాన్ లైట్స్” అని ఆంగ్లంలో కూడా పాడారు. జర్మను మూలాన్ని పైన అనువాదం చేసాను. ఆంగ్ల సాహిత్యంలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. అది క్రింద అనువదిస్తున్నాను.

నీయాన్ దీపాలు, మిణుకుతున్న నీయాన్ దీపాలు
రాత్రిపడేవేళ, ఈ నగరం దీపాలపాలు

(రాత్రిపడేవేళ, ఈ నగరం కాంతితో తయారౌతుంది)

ఏదొలాగ ఏదోచోట ఏదోవేళ

ఏదొలాగ ఏదోచోట ఏదోవేళ

పడుతుండగా దిగంతరంలో కాలంలో
ఎడతగని అనంతంవైపు
నిప్పులోకి చిమ్మటలు ఎగురుతూపోతాయి
అచ్చు నీలాగా నాలాగ

ఏదోలాగ మొదలౌతుంది ఏదోవేళ
ఏదోచోట భవిష్యత్తు అలా
నేను ఇంకా వేచుండేది లేదు
ప్రేమ తయారయ్యేది ధైర్యంతోనే
ఇంకా ఆలోచిస్తూ కూర్చోను నేను
అగ్నిచక్రాలు తోలుతూ పోతాం మనం
చీకట్లో గుండా భవిష్యత్తువైపు

నీ చెయ్యి ఇవ్విలా నాకు
ఇసుకతో ఓ కోట కడతాను నీకు
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
కాలం పక్వానికొచ్చింది కొంచెం లేతదనంకోసం
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ

దిగంతరంలో కాలంలో పడుతుండగా
ఒక స్వప్నంలోంచి మెలకువ వచ్చింది
కేవలం ఒక రెప్పపాటుకి
తరువాత రాత్రి తిరిగొస్తుంది

ఏదోలాగ మొదలౌతుంది ఏదోవేళ
ఏదోచోట భవిష్యత్తు అలా
నేను ఇంకా వేచుండేది లేదు
ప్రేమ తయారయ్యేది ధైర్యంతో
ఇంకా ఆలోచిస్తూ కూర్చోను నేను
అగ్నిచక్రాలు తోలుతూ పోతాం మనం
చీకట్లో గుండా భవిష్యత్తువైపు

నీ చెయ్యి ఇవ్విలా నాకు
ఇసుకతో ఓ కోట కడతాను నీకు
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
కాలం పక్వానికొచ్చింది కొంచెం లేతదనంకోసం
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ

నీ చెయ్యి ఇవ్విలా నాకు
ఇసుకతో ఓ కోట కడతాను నీకు
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
కాలం పక్వానికొచ్చింది కొంచెం లేతదనంకోసం
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ

ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ

జర్మనుదేశపు గాయని నేనా 1984వ సంవత్సరంలో విడుదల చేసిన “ఇర్గెండ్వీ ఇర్గెండ్వో ఇర్గెండ్వాన్” (ఏదోలా ఎక్కడో ఎప్పుడో) అను జనరంజకగీతం ఇది.

జర్మనుభాషలో ప్రశ్నసూచకపదాలు ఆంగ్లభాషతో పోలిస్తే ఇంకాచాలా విస్తృతంగా సందర్భోచితంగా ఉంటాయి. ఉదాహరణకు, ఆంగ్లంలో “వై” (ఎందుకు) అన్న పదానికి సమానార్థంగా “వారుం” (ఎందుకు) అన్న పదంతో పాటు “వీసో” (ఎలాగని), “వెస్‌హాల్బ్” (ఎందువలన), “వెస్వేగెన్” (ఎందుగుండా, ఏవిధంగా) అన్న పదాలు ఉంటాయి. తెలుగులో పైకి సమానార్థంగా ఇచ్చిన పదాలతో పాటు ఎందుకోసం, ఎందుమూలంగా, ఎందుఫలితంగా, ఎందునుండి, ఎందుప్రకారంగా.. ఇలా ఎన్నెన్నో పదాలు ఉన్నాయి. ఆంగ్లభాషలో ఆలోచించడడానికి అలవాటు పడినవాళ్ళు ఈ విస్తృతమైన పదరాశిని కేవలం ఒకముక్కలో కుచించి ఆలోచిస్తున్నారు అన్నమాట. కారణవాక్యాలను “ఎందుకు, అందుకు” అని ఎలాగ నిర్మించగలమో జర్మను భాషలో కూడా “వారుం, దారుం”, “వెస్వేగెన్, దెస్వేగెన్”, “వెస్‌హాల్బ్, దెస్‌హాల్బ్” అని సూచించగలం. ఇదికూడా ఆంగ్లంలో కుదరదు. తెలుగులో దీనికంటా భావవ్యక్తీకరణకి కచ్చితత్వానికి వీటికంటా పెద్ద భాషాకౌశలం ఉంది. “ఎందుకు, అందుకు” అనేకాక “ఇందుకు” అని కూడా వ్యత్యాసం వ్యక్తీకరించగలం. అదేవిధంగా “ఎందువలన, అందువలన, ఇందువలన” ఇలాగ వందలకొద్దీ పదరాశి మనభాషలో అందుబాటులో ఉంది.

ఈ పైని గీతంలో నేనా ఉపయోగించిన “ఇర్గెండ్‌వీ ఇర్గెండ్‌వో ఇర్గెండ్‌వాన్” అన్న పదాలను సాధ్యమైనంత పోలికగా పదనిర్మాణాన్ని అనుసరించి నేను “ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ” అని అనువదించాను.

తొంభైతొమ్మిది గాలిబుడగలు

తొంభైతొమ్మిది గాలిబుడగలు

నాకోసం కొంచెం సమయముందా నీకు
ఉంటే నీకోసం ఒక పాట పాడుతా నేను
ఓ తొంభైతొమ్మిది గాలిబుడగలు
ఆకాశపుటంచులకి వెళ్ళే దారిలో
నాగురించి అప్పుడే తలుచుకుంటున్నావా?
ఉంటే నీకోసం ఒక పాట పాడుతా నేను
ఓ తొంభైతొమ్మిది గాలిబుడగలు
అటువంటిదాంట్లోంచి అటువంటిది వస్తుంది

ఓ తొంభైతొమ్మిది గాలిబుడగలు
ఆకాశపుటంచులకి వెళ్ళే దారిలో
గ్రహాంతరవాసులేమో అనుకోవచ్చు వాటిని
అందుకని పంపించాడు వాటి వెనకో సేనాని
వెనకనే ఒక యుద్ధవిమానాల దండుని
అలా అయిటట్టు ఐతే హెచ్చరిక ఇవ్వమని
కానీ ఆకాశపుటంచులన ఆని ఉన్నాయి
కేవలం తొంభైతొమ్మిది గాలిబుడగలు

తొంభైతొమ్మిది రివ్వువిమానాలు
ప్రతిదాంట్లో ఒకడు రాటుదేలిన వీరుడు
తనొక కేప్టన్ కర్క్‌నని అనుకుంటున్నాడు
ఒక పెద్ద బాణాసంచా మారుమోగింది
ఇరుగుపొరుగుకి ఏమీ అర్థంకాలేదు
వెంటనే మనసు పాడుచేసుకున్నారు
ఆ సందడిలో పేల్చారు ఆకాశపుటంచులకి
తొంభైతొమ్మది గాలిబుడగలపైకి

తొంభైతొమ్మిది యుద్ధమంత్రులు
అగ్గిపుల్లలు పెట్రోలుడబ్బాలు
తెలివైనవాళ్ళమని అనుకుంటున్నారు
బలిసిన నిధికని ముక్కుపెట్టి ఉన్నారు
యుద్ధం అని అరిచి, అధికారంకోసం చూస్తున్నారు
ఓరినీ, ఎవడు అనుకున్నాడు ఇది
ఇంత దూరం తతంగం నడుస్తుందని
తొంభైతొమ్మిది గాలిబుడగల వలన

తొంభైతొమ్మిది గాలిబుడగల వలన
తొంభైతొమ్మిది గాలిబుడగలు

తొంభైతొమ్మిది ఏళ్ల యుద్ధం
విజేతలకి ఎక్కడా మిగలలేదు చోటు
యుద్ధమంత్రులు ఇంకెవ్వరూ లేరు
రివ్వువైమానికులు కూడా ఇంకేమీ లేరు
ఈరోజుకి నావంతు ఓ చుట్టొస్తున్నాను
లోకం అంతా ధ్వంసమై పడుంది
మొత్తానికి కనపడింది ఒక గాలిబుడగ
నీగురించి తలుచుకుని పోనిచ్చాను దానిని

జర్మను దేశపు గాయని అయిన నేనా 1983వ సంవత్సరంలో విడుదలచేసిన “నాయ్న్ ఉండ్ నాయింత్సిగ్ లుఫ్ట్‌బలోన్స్” (తొంభై తొమ్మిది గాలిబుడగలు) అనే ఈ పాట అద్భుతమైన ఆదరణ సంపాదించింది. అప్పట్లో తూర్పు పశ్చిమ జర్మనీ దేశాలమధ్య, రష్య అమెరికా మహాసైన్యాల మధ్యన విపరీతమైన ఉద్రిక్తత ఉండేది. ఈ సమయంలో యువతీయువకులకి ఆ యుద్ధ ఉద్రిక్తతో విసుగెత్తి ఇటువంటి పాటలని పాడి గాలి పీల్చుకునేవారు.

వెన్నటీగ

వెన్నటీగ

పచ్చికపైన పూసింది ఒక తెల్లటి మల్లెపువ్వు
నడుస్తూ పోతున్నాను, లక్ష్యమేదీ లేక అలా నేను
ఒక కలలో ఉన్నట్టు చూశాను, నిన్ను దారిలో ఒంటరిగా
సూరీడి వెలుగులో సీతాకోకచిలుకలా

వెన్నటీగా, ఓ నా వెన్నటీగ
నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది
వెన్నటీగా, ఓ నా వెన్నటీగ
మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను

నీ ప్రతిమాట నాకు సంగీతంలా పలికింది
సముద్రమంత లోతుగా ఉండింది ఆనందం
కవిత్వంతో నిండిన లోకం, కాలం మనకోసం ఆగింది
శెలవిచ్చే సమయం తప్పలేదు, నేను వెళ్ళవలిసి వచ్చింది

వెన్నటీగా, ఓ నా వెన్నటీగ
నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది
వెన్నటీగా, ఓ నా వెన్నటీగ
మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను

నిశ్శబ్దంగా ఉంది, గాలి మాత్రం తనపాట పాడుతోంది
చూశాను నేను, ఒక పక్షి అటు ఎగురుతూ పోతోంది
పైపైకి ఎగురుతోంది, సముద్రం మీదుగా, సూరీడి కాంతిలోకి
తన సహచరుడినవ్వాలని నాకు అనిపిస్తోంది

వెన్నటీగా, ఓ నా వెన్నటీగ
నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది
వెన్నటీగా, ఓ నా వెన్నటీగ
మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను

వెన్నటీగా, ఓ వెన్నటీగ
నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది
వెన్నటీగా, ఓ వెన్నటీగ
మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను

డాన్యెల్ జేరార్ద్ అను జర్మను గాయకుడు 1971వ సంవత్సరంలో విడుదలచేసిన బటర్‌ఫ్లై (సీతాకోకచిలుక) అన్న పాట ఇది. జర్మను పాటలో సాహిత్యం ఉన్నా బటర్‌ఫ్లై అన్న పదం మాత్రం ఆంగ్లంలో ఉంటుంది. నేను సరదాగా ఈ ఆంగ్లపదాన్ని తెలుగులొ యదాతథంగా “వెన్నటీగ” అని అనువదించాను. జర్మను భాషలో సీతాకోకచిలుకను “ష్మెటర్లింగ్” అంటారు.

నీ కనురెప్పలని చూడు (తాతార్ జానపద గీతం)

నీ కనురెప్పలని చూడు

నీ కనురెప్పలని చూడు ఎలా ఉన్నాయో
నీకు కళ్ళు నల్లగా లేనప్పుడు
ఎందుకు ఈ కోడెగుండెని రగిల్చావు?
నువ్వు అగ్నిజ్వాలలో జీవించనప్పుడు

ఆ .. అహ ..
ఎందుకు ఈ కోడెగుండెని రగిల్చావు?
నువ్వు అగ్నిజ్వాలలో జీవించనప్పుడు

టప్ టప్ మని సూటిగా నడిచే గుర్రం
గుర్రపు గిట్టలు ఆకుపచ్చటి మంటలు
నీ కళ్ళతో ఈ తీరాలపై చూడమాకు
ఎప్పటికీ ఆగే మంటలు కాకపోతే

ఆ .. అహ ..
నీ కళ్ళతో ఈ తీరాలపై చూడమాకు
ఎప్పటికీ ఆగే మంటలు కాకపోతే

చంద్రుడు నా వంక శోకంగా చూస్తున్నాడు
నీకు తెలుసుగా, నా మనసు
ప్రియమైన మనిషితో జీవితాంతం
ఉండాలని ఎవడికి అనిపించదు?

ఆ .. అహ ..
ప్రియమైన మనిషితో జీవితాంతం
ఉండాలని ఎవడికి అనిపించదు?

విడిపోతే నీతో, చీకటిలో ఓ మిత్రమా
మనం కొట్టుకునేది లేదు త్వరలో
నేనెప్పటికీ నిన్ను మరిచిపోను
నువ్వే నన్ను మరిచిపోయేది

ఆ .. అహ.. ఏ.. ఎహె
నేనెప్పటికీ నిన్ను మరిచిపోను
నువ్వే నన్ను మరిచిపోయేది

రష్యా దేశంలోని ఓల్గా నదికి దక్షిణాన నివశించే తాతార్ ప్రజల జానపద గీతం ఇది. ఈ తాతార్ ప్రజలు తురక జాతికి చెందిన వారు, వారి భాష తుర్కమెన్ దేశంలోని తురక భాషని పోలి ఉంటుంది. ఈ పాటలో ప్రేమలోపడ్డ ఓ యువకుడు తన ప్రేమికురాలితో ఎందుకు తనని ఈ స్థితిలోకి తెచ్చావు అని అడుగుతున్నాడు.

ఈ పాటను పాడింది పోలండు దేశానికి చెందిన కరోలినా చిచా అను గాయని, బార్ట్ పలిగా అను సంగీతకారుని సహకారంతో. వీరి పాటను మరొకటి ముందు నా బ్లాగులో అనువదించాను. అనుబంధితమైన చిత్రణలో తాతార్ ప్రజల జీవనశైలిని, జానపద సంప్రదాయాలను చాలా చక్కగా చూపించారు.