Tag Archives: విశ్వవ్యాప్తిమైన తెలుగు పాట

జీవతజ్ఞాపకం

జీవతజ్ఞాపకం

నిన్ను ముట్టుకున్నప్పుడు కలిగింది ఆనందం
లోతుగా లోతుగా
ఈ తనువు ప్రతి కణంలోకి నరంలోకి
ఇంకుతూ పోయింది

నేను దూరంగా ఉన్నా
మరేదీ నాకు అర్థంకాకపోతున్నా
ఈ జీవితం ముగిసే
సమయం దగ్గరకొచ్చినా

ఈ తరుణంలో సమస్తం
మునుపటి సమస్తం అయ్యింది
కలుస్తాం మనం మళ్ళీ
ఏదో ఒక జ్ఞాపకాల మందిరంలో

నువ్వు నాకందిచ్చిన వెచ్చదనం
లోతుగా, లోతుగా
నా దగ్గరకి రా ఇప్పుడు పూర్తిగా
ఒక అతి పురాతనమైన కాలం నుండి

నా హృదయంలో నిర్మలంగా
ప్రేమ జ్వాలలు కాంతినిస్తున్నాయి
నా బాధని నెమ్మదిగా ఊరడిస్తున్నాయి
నా శోకం లోతులవరకు

ఈ తరుణంలో సమస్తం
భవిష్యత్తుకి ఆశాదీపం
గుర్తుపెట్టుకుంటా, కచ్చితంగా
ఒక జ్ఞాపకాల మందిరంలో

ఈ తరుణంలో సమస్తం
మునుపటి సమస్తం అయ్యింది
కలుస్తాం మనం మళ్ళీ
ఏదో ఒక జ్ఞాపకాల మందిరంలో

ఈ తరుణంలో సమస్తం
భవిష్యత్తుకి ఆశాదీపం
గుర్తుపెట్టుకుంటా, కచ్చితంగా
ఈ జీవితం గుర్తువచ్చినప్పుడు

“ఇనోచి నా కియోకు” (జీవితజ్ఞాపకం) అనే జపనీసు గీతం “కగూయా హిమే నొ మొనొగొతారి” (రాకుమారి కగూయా కథ) అనే అణుప్రాణితచిత్రంలోనిది. ఈ కథ ప్రాచీన జపాను జానపదగాథ అయిన “వెదురు నరికే పనివాడి కథ” నుండి నిర్మితమయ్యింది. పాట పాడింది నికైడో కజూమీ అనే గాయని. పై వీడియోలో చక్కగా పాట సాహిత్యాన్ని, ఆంగ్ల అనువాదాన్ని, చిత్రంలో ముఖ్యఘట్టాలను చూపించారు.

అలలపై ఏకాంతస్వారీ

అలలపై ఏకాంతస్వారీ

ఈ మిగిలిన కాలంలో
ఈ కొంతటి కాలంలో
సంకోచించొద్దు

విరిగిన గోపురం క్రిందకి చూస్తున్న
కుర్రవాడి ముఖం చక్కగా కనిపిస్తోంది నీపైన

ప్రపంచంలో సమస్యలు ఎప్పటికీ అయిపోవు
ఎటూపోలేని రాజు
చోద్యంగా నిధికోసం వెతుకుతున్నాడు

ఇంటికిపోయే బస్సు
మళ్ళీ రాదేమో
రేపటినుండి

ఎల్లప్పటికీ
ఈదలేకపోతున్నా
ముందుకు దూకాలని
ఓ అపరిచితుడా
ఈ ప్రపంచం
అంతా కడిగేస్తుంది

దెబ్బతిన్న రెక్కలు ఇప్పటికే
అంతా అయిపోయిందని అంటున్నాయి
అందుకే మనం
ఈ క్షణం అనుభవించడానికి ఇక్కడనే ఆగాలి

అమ్మిచ్చిన పెద్ద పుస్తకం
పనికొస్తుంది

ఈ రోజు మళ్ళీ రాదు
అందుకే వృధా చెయ్యకు
నీ భాగ్యమేంటో
గొప్ప శకునం కోసం చూస్తూ
కలలుగంటూ

ఏకాంతంగా
అర్థరాత్రి మధ్యన
అలజడిగా రేగితే
ఆ కలలోనే
అలలని సవారీ చెయ్యి

ఏదో మరొకరోజు
ఇక్కడ కలుద్దాం
అదే చిరునవ్వుతో
దూరాన ఉన్న ఎండమావికి
నువ్వు చేరుకున్నాక

ఎల్లప్పటికీ
ఈదలేకపోతున్నా
ముందుకు దూకాలని
ఓ అపరిచితుడా
ఈ ప్రపంచం
నవ్వుతోంది అంతా

జపాను దేశానికి చెందిన ఉవా అనే ఈ గాయని పాడిన “పురైబేతో సాఫా” (అలలపై ఏకాంతస్వారీ) అనే ఈ పాట ముద్రించి ఉన్న సీడీని నాకు చాలా ఏళ్ళక్రితం ఒక జపనీసు అమ్మాయి బహుమతిగా ఇచ్చింది. ఆ స్నేహితురాలి ఆచూకీ ప్రస్తుతం నా దగ్గరలేదు. కానీ, అప్పట్లో నాకు ఈ పాట చాలా బాగానచ్చింది. ఈ పాటలో గాయని కాలప్రవాహంలో ఇట్టే కొట్టుకుపోయే అద్భుతమైన క్షణాలని ఏమరుపాటుగా పోగొట్టుకోకుండా అప్పటికప్పుడే అనుభవించాలని చెప్తోంది. చూపులు కలసిన శుభవేళలో కుర్రవాడు బుర్రలో గజిబిజి ఆలోచనలతో కొట్టుకుపోకుండా అందమైన ఆ సమయాన్ని అప్పడికే ఆస్వాదించాలని చెప్తోంది. దురదృష్టవశాత్తూ ఈ పాటకి నాకు జపనీసు భాషలో మూలం తప్ప, వేరే ఏ భాషలోను అనువాదం దొరకలేదు. అందువలన, ఆంగ్లభాషలోని యాంత్రిక అనువాదం తీసుకుని, దానిని కొద్దిగా సవరించి తెలుగులో వ్రాసాను. బహుశా అక్కడక్కడా తప్పులుండవచ్చు. తెలిసిన తరువాత సరిచేస్తాను.

నీలారుణ మసక

నీలారుణ మసక

నీలారుణ మసక.. నా మెదడంతా కప్పింది

ఈమధ్యన ఏవీ.. వాటిలా కనపడట్లేదు

చిత్రంగా తోస్తోంది.. ఎందుకో తెలియదు

మన్నించండి నన్ను.. నింగిని ముద్దెడుతుంటే

నీలారుణ మసక.. చుట్టూ అంతా కప్పింది

ఎటు పోతున్నానో తెలియట్లేదు.. పైకో క్రిందకో

ఆనందంగా ఉన్నానా? క్షోభలోనున్నానా?

ఏదేమైందో ఆ పిల్ల.. నాపై ఓ మాయచేసింది

కాపాడండి నన్ను.. అయ్యో

ఔను, నీలారుణ మసక.. నాకళ్లంతా కప్పింది

పగలా? రాత్రా? ఏదీ తెలియట్లేదు

నువ్వు నన్ను ఊదావు.. బుర్ర వెర్రిగా చేసావు

అప్పుడే రేపు అయ్యిందా? లేదా ప్రళయమే వచ్చిందా?

లేదు.. కాపాడండి నన్ను..

లేదు.. ఔను.. నీలారుణ మసక

అయ్యో.. లేదు లేదు

అయ్యో.. కాపాడండి

చెప్పండి.. చెప్పండి

ఎంతకాలం ఇలా పోవడం.. కుదరదు

నువ్వు నా బుర్రంతా వెర్రిగా చేసావు

లేదు.. లేదు.. లేదు

లేదు లేదు.. నీలారుణ మసక

అమెరికా దేశానికి చెందిన జిమ్మీ హెండ్రిక్స్ గత శతాబ్దిలో అతిగొప్ప గిటారు వాద్యకారులలో ఒకడు. తను వ్రాసిన “పర్పుల్ హేజ్” (నీలారుణ మసక) అన్న ఈ గీతం ఆనాటి కాలంలోని మాదకద్రవ్యాల ప్రభావాన్ని, స్వేచ్ఛా విహంగాలుగా చెలరేగిన ఆనాటి కుర్రకారు సంస్కృతిని చూపిస్తోంది. హెండ్రిక్స్ దురదృష్టవశాత్తూ అతిచిన్న వయసులోనే చనిపోయాడు. ఈనాటికి యాభై ఏళ్ల పూర్వం. కానీ అతని ప్రభావం, ఉద్యమంలా తీసుకువచ్చిన సంగీత ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సంగీత సంస్కృతిని ముందుకు తీసుకువెళ్తూ నీలారుణ స్వప్నాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనకి కూడా ఉంది. ఏదేమైనా జాగ్రత్తగా మసులుతూనే చైతన్యపు కాంతులను అందుకోగలుగుతేనే హెండ్రిక్స్ వారసులని నిరూపించుకోగలరు సాహసికులైన ఈనాటి సంగీతకారులు. అంత సుళువు కాదు.

చెరోకీ ప్రాతఃవందనం

చెరోకీ ప్రాతఃవందనం

బ్రహ్మంతో ఒకటైయాను అహో
బ్రహ్మంతో ఒకటైయాను అహో
బ్రహ్మంతో ఒకటైయాను

అద్గది. అహో
అద్గది. అహో
బ్రహ్మం. అహో
బ్రహ్మం. బ్రహ్మం.

ప్రాతఃకాలాన సూర్యభగవానుని చూసి చెరోకీ జాతి ప్రజలు చేసే వందనం ఈ పాట. అమెరికా ఖండంలోని ఆదివాస జాతులైన ఈ చెరోకీ ప్రజల భాష ఇరోక్వా భాషాసముదాయానికి చెందినది. అమెరికా ఖండంలోని ఇల్లినోయి మొదలైన మహాసరస్సుల దక్షిణాన ఉన్న ప్రాంతంలో ఈ జాతులు నివశించేవారు. వారి సంస్కృతిలో ప్రకృతితో అతి సన్నిహిత బాంధవ్యాన్ని కలిగివుండేవారు. ఆ ప్రత్యక్షమైన “అహో” అని అచ్చెరువొందే ఆ భావనే ఈ పాటలో కనపడుతోంది.

ఇంకా జీవించాలనుంది (పెయోటే స్వస్థీకరణ గానం)

ఇంకా జీవించాలనుంది తండ్రి అని నీతో అంటున్నాను
విన్నవించుకుంటున్నాను
బాబా, ఇంకొంత జీవించాలని

క్షోభలోనున్నాను, ప్రార్థిస్తున్నాను
ఇంకా జీవించాలనుంది తండ్రి అని నీతో అంటున్నాను
ఇంకా జీవించాలనుంది తండ్రి
ప్రార్థిస్తున్నాను

రాబోయే జీవితం, కాబోయే జీవితం
రాబోయే జీవితం, ఆ దారిలో ఉండాలనిపిస్తోంది
విన్నవించుకుంటున్నాను

కరుణగలుగు నాపై, దయజూపు నాపై
కరుణగలుగు నాపై, జీవించాలనుకుంటున్నాను
కరుణగలుగు నాపై, విన్నవించుకుంటున్నాను
ఓ పరమాత్మా, కరుణగలుగు నాపై
కరుణగలుగు నాపై, విన్నవించుకుంటున్నాను

రాబోయే జీవితం, కాబోయే జీవితం
రాబోయే జీవితం, ఆ దారిలో ఉండాలనిపిస్తోంది
విన్నవించుకుంటున్నాను

అమెరికా ఖండంలోని లకోటా జాతి ప్రజలు రోగనివారణకి, ఉపశమనానికి ఉపయోగించే “వాని వచిన్ యేలో” (ఇంకా జీవించాలనుంది) అనే స్వస్థీకరణ గానం ఇది. ఇంగ్లీషు అనువాదంగుండా లకోటా భాష నుండి తెలుగులోకి అనువదించాను. పెయోటే అనే మనోప్రేరిత మాదకద్రవ్యం ఉపయోగించి వారు వారి దేవతలని ఇంకా బ్రతికుండాలని ఉంది అని ప్రార్థిస్తారు. ఈ స్వస్థీకరణ గానం వారి జాతి సాంస్కృతిక సంపదలో ఒకటి. ముఖ్యంగా వివిధ మాదకద్రవ్యాలకి బానిసలై శరీరాన్ని క్షోభలో భరిస్తున్న రోగులకు పెయోటే అనే ఈ మనోప్రేరితం ఉపశమనాన్నిస్తుంది అని, వ్యసనాలనుండి వ్యాధులనుండి దూరం చేస్తుందని ఆ ప్రజలు నమ్ముతారు. అమెరికా దేశంలోని తెల్లజాతి ప్రజలు కూడా కొందరు ఈనాటికాలంలో ఇటువంటి ప్రాచీన స్వస్థీకరణ క్రతువులను పాటిస్తూ లకోటా జాతి వారి సంస్కృతిని ఆచరిస్తున్నారు.

బ్రతికుండడం, శూన్యంలోకూడా నిలిచుండడం

బ్రతికుండడం, శూన్యంలోకూడా నిలిచుండడం

నవ్వడం
బాధపడుతున్నా నవ్వడం

ప్రేమించడం
ఏకాంతంలో ప్రేమించడం

ప్రతిఘటించడం
భయపడుతున్నా ప్రతిఘటించడం

నమ్ముండడం
చీకట్లోనున్నా నమ్ముండడం

పాడడం
నిశ్శబ్దంగానైనా పాడడం

ఇవ్వడం
అవసరమున్నా ఇవ్వడం

చూడడం
కళ్ళు మూసున్నా చూడడం

మారడం
సుఖంగానున్నా మారడం

బ్రతికుండడం
ఊపిరాడకుంటున్నా బ్రతికుండడం

శూన్యంలోకూడా నిలిచుండడం
రణగొణిలోకూడా నిలిచుండడం

రెబెక్కా ఉంబోంగూ అనే గాయని “కోలింగా” అనే తన సంగీతబృందంతో ఆలపించిన “కొజాలా” (అస్థిత్వం నిలుపుకోవడం) అనే ఈ పాట ఖండంలోని కోంగో దేశంలోని లింగాలా అనే భాషలో ఉంది. కోంగో దేశపు సంప్రదాయకమైన సంగీతాన్ని ఆధునిక రాక్, జాజ్ సంగీతాలతో మేళవించి ఆలపించిన రీతి చాలా చక్కగా ఉంది. ఈ సాహిత్యం జీవితపయనంలో ఎదుర్కొనే ఆటుబోట్లను, ఎగుడుదిగుడులను అధిగమించి మానవ అస్థిత్వాన్ని ఎలా అనుభవించాలో చెబుతోంది. ముక్తసరిగా మూడు ముక్కల్లో చెప్పినా ఈ సూచనలు తత్వశాస్త్ర సారాన్ని విడదీసి ఆరబోసిన సుట్రాలవలే ఉన్నాయి. వలసరాజ్య వ్యవస్థలో, బానిసత్వం ఆపాదించిన పరాయివారి ఆక్రమణలో ఎన్నో కష్టాలు పడిన లింగాలా జాతి ప్రజల భాషాసంస్కృతులు ఇప్పటికీ నిలదొక్కుకుని అస్థిత్వం కాపాడుకోగలగడమే కాదు, నవ్వుతూ ఇంతింతగా వృద్ధిచెందుతున్నాయి అని చూపించిన ఈ పాటకు జేజేలు చెప్పక తప్పదు.

నాకు లింగాలా భాష రాదు కనుక, ఈ పాట తెలుగు అనువాదం గాయకులే సమర్పించిన ఫ్రెంచి భాష అనువాదం మూలంగా వ్రాసాను.

ఆ రోజుల్లో, అలనాటి రోజుల్లో (గిల్గమేషుని కథ)

ఆ రోజుల్లో, ఆ అలనాటి రోజుల్లో..

ఆ రాత్రుల్లో, ఆ పురాతన రాత్రుల్లో..

ఆ ఏళ్లలో, ఆ కడుదూరపుటేళ్లలో..

అన్నింటినీ సృష్టిరప్పించిన ఆ అలనాటి రోజుల్లో..

అన్నింటికీ వాటి చోటు కల్పించిన ఆ పురాతన కాలంలో..

పవిత్ర దేవాలయాలలో రొట్టెను తొలిసారి రుచిచూసిన వేళ..

ఆ పొయ్యలలో అగ్ని వెలిగించిన వేళ..

భూమినుండి భువనం విడదీసిన వేళ..

దివినుండి భువిని విడదీసిన వేళ..

మానవజాతి మన్నుపై స్థిరపడిన వేళ..

గిల్గమేషుని కథ అని సుమేరు నాగరికతకు చెందిన అతిప్రాచీన జానపదకథా వృత్తాంతం. మట్టి పలకలపై ఉలితో చెక్కి ఈ కథను వ్రాసిపెట్టారు ఆ పూర్వీకులు. ఆ పలకలను కనుగొన్న తరువాత శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి శబ్దార్థాలను ఛేదించారు. ఆ పలకల్లో ముద్రించబడిన ఒకటైన ఈ పాటను సంగీతయుక్తంగా ఆలపించినది పీటర్ ప్రింగిల్ అను గాయకులు. ఒళ్ళు జివ్వనిపించేంత ముగ్ధమోహనంగా లేదూ ఈ పాట!?

మా గుండెలు నిండుగా ఉన్నాయి

మా గుండెలు నిండుగా ఉన్నాయి
మా మనసులు మంచిగా ఉన్నాయి
మా పూర్వీకులు వస్తారు
మాలో బలం నింపుతారు
ఎత్తుగా నించో, ఆడు, పాడు
నువ్వెవ్వరో ఎప్పటికీ మర్చిపోకు
ఎక్కడినుంచొచ్చావో మర్చిపోకు

“మాక్ చీ” (మా గుండెలు) అనే ఈ పాట “ఉలాలీ” అనే అమెరికాదేశానికి చెందిన ఆదివాసుల యుగళగాయనిల బృందం ఆలపించినది. ఈ పాట సాహిత్యం తుతేలో మరియు సపోనీ భాషల కలయికలో ఉంటుంది. ఈ భాషలు అమెరికా దేశంలోని ఒహాయో రాష్ట్రమున్న ప్రాంతంలో ఒకానొక సమయంలో నివిశించుచుండిన సియూక్స్ జాతివారి భాషలు. దురదృష్టవశాత్తూ తెల్లవారి జాత్యహంకార ఆక్రమణ వలన ఈ ఆదివాసులు వారి మాతృభూమిని కోల్పోయారు. వారి భాషలను, అస్థిత్వాన్ని, సంస్కృతులను అంతటినీ కోల్పోయారు. ఇప్పటికి కొంతలో బతికున్న వీరి వారసులైన ప్రజలు ఇలా పాటలలోను, ఆచారక్రతువులలోను, అమెరికాదేశపు పర్వతాలలోను, అడవులలోను, ప్రకృతి సౌందర్యంలోను వారి పూర్వీకుల ఆనలని వెతుక్కుంటూ వారి అస్థిత్వాన్ని తిరిగి పునరుద్థీపనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఇటువంటి మధురమైన గేయాలు ఎంతో బలం నింపుతున్నాయి. ఉలాలీ అనే ఈ బృందం వివిధదేశాలలో ఇంకా ఎందరో గాయకబృందాలను ఉత్తేజితం చేసింది. క్రింద ఇటలీ దేశంలో గాయనిలు ఇదే పాటని ఆలపించిన వైనం చూడవచ్చు.

ఈ “మాక్ చీ” పాట విడుదల చేసిన ముద్రణలో పాట సాహిత్యంతో పాటు “హండ్రెడ్ ఇయర్స్” (నూరేళ్ళు) అనే ఒక ఆంగ్లభాషలో కవితను కూడా ముద్రించారు. ఆ కవితను క్రింద నేను తెలుగులో అనువదిస్తున్నాను.

నూరేళ్ళు గడిచిపోయాయి
కానీ దూరంగా మ్రోగుతున్న మా నాన్న డప్పుల మోత ఇంకా వింటున్నా.
ఆ డప్పుల మోతనే ఈ నేలంతా వింటున్నా.
ఆ డప్పుల సడే నా గుండె సడిగా కంటున్నా.
ఆ డప్పులు ఇంకా మ్రోగుగాక !
నా గుండె ఇంకా మ్రోగుగాక !
నేనింకో నూరు వేల ఏళ్ళు బ్రతికుండుగాక !

చంటితమ్ముడూ జాయిగా బజ్జోరా

చంటితమ్ముడూ జాయిగా బజ్జోరా

చంటితమ్ముడూ, జాయిగా బజ్జోరా
ఏడుస్తున్నావు కానీ, ఎత్తుక్కోవడానికెవరూ లేరు
ఎత్తుకోవడానికెవరూ లేరు, మనం అనాథలయ్యాంరా

పోయినవాళ్ళుండే దీవినుండి వాళ్ళ ఆత్మ మనల్ని చూస్తోందిరా
అక్కడి బుద్ధిస్ఫూర్తులతో వారు మనల్ని రాజుల్లాగా చూస్తున్నారురా

చంటితమ్ముడూ, అడవుల్లోనూ తోటల్లోనూ కూడా
ఈ జోలపాట అన్నిచోట్లా చేరుతుందిరా
పోయినవాళ్ళుండే దీవినుండి వాళ్ళ ఆత్మ చల్లగా చూస్తోందిరా

చంటితమ్ముడూ, జాయిగా బజ్జోరా
ఏడుస్తున్నావు కానీ, ఎత్తుక్కోవడానికెవరూ లేరు
ఎత్తుకోవడానికెవరూ లేరు, మనం అనాథలయ్యాంరా

పోయినవాళ్ళుండే దీవినుండి వాళ్ళ ఆత్మ మనల్ని చూస్తోందిరా

“రోరోగ్వేలా” అనే ఈ కమ్మని జోలపాట సోలోమన్ దీవులలో ఉత్తరానికి ఉన్న మలైతా దీవిలోని బాయెగ్గు భాషలోని ఒక సంప్రదాయకమైన లాలిపాట. అఫునాక్వా అనే మహిళ 1970వ దశకంలో పాడినప్పుడు మానవసమాజాలని అధ్యయనంచేసే హ్యూగో జెంప్ అనే స్విట్జర్లాండుకు చెందిన శాస్త్రవేత్త అభిలేఖించి, యునెస్కోవారి ద్వారా సంగీతం ముద్రించారు. అలా ముద్రించిన ఈ సంగీతం ఏదో కొందరు ఔత్సాహికుల దృష్టికి వచ్చి అట్టే ఉండిపొయేది, కానీ, 1990వ దశకంలో “కారడవి” (డీప్ ఫారెస్ట్) అనే ఫ్రాన్సుదేశానికి చెందిన ఒక ఎలెక్ట్రానిక్ పాప్ సంగీతబృందం ఈ పాటని విద్యుత్సాంకేతిక నాదాలతో సమ్మిళితం చేసి పునర్ముద్రించింది. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతల ఆదరణాభిమానాలను చేకొంది, పాప్ బృందానికి ఎంతో కీర్తిని తెచ్చింది. కానీ, మొదట ఆద్యంగా పాడిన అఫునాక్వాకు మాత్రం ఏవిధమైన గుర్తింపు రాలేదు. కడుబీదతనంతో పాపం ఈవిడ 1995వ సంవత్సరంలో చనిపోయింది. ప్రపంచ సంస్కృతి తరంగాలను పునర్సమ్మిళితం చేస్తూ కొత్త సంస్కృతిని సృష్టించుకోవడమన్నది సహజమూ, మన బాధ్యతకూడానూ. కానీ, కళాకారులెవ్వరైనా ఎక్కడివారైనా వారికి గుర్తింపునివ్వడం, వారి అనుమతితోనే కళాతరంగాలను ముందుకి తీసుకువెళ్ళడం చెయ్యాలి. ఈ భావాన్ని వ్యాసరూపంలో ఈథన్ జుక్కర్మాన్ గారు ఇక్కడ చక్కగా వ్రాసారు.

ఒకవైపు ఈ పాప్ సంగీతం సోలోమన్ దీవివాసుల సంస్కృతి సాంప్రదాయాలను, గానవిశేషాలను పలువురికి పరిచయంచేసిందని మెచ్చుకోవాలి. కానీ అదే సమయంలో మరోవైపు, అమాయకులైన వీరి సంస్కృతిసౌరభాలను ఒకరకంగా కొల్లగొట్టి ఊరూపేరు లేపేసి అన్యాక్రాంతం చేసిందని కూడా గుర్తించాలి. వనవాసులు, దీవులలో నివశించే ఆదివాసులు అమాయకమైన ప్రజలు. వారికి ఆధునికయుగంలోని వ్యాపారవిశేషాలు, కలుషితమైన డాంభికార్భాటాలు తెలియదు. వీరి సంస్కృతిని, అస్థిత్వాన్ని మనం గౌరవించి గుర్తించాలి. లేకపోతే సభ్యసమాజానికి అర్థం ఏమిటుంటుంది. బానిసరాజ్యాలు, వలసరాజ్యాలు స్థాపించి ఐరోపావాసులు ఎన్నో జాతులను, సంస్కృతులను అంతంచేసేసారు. ఇప్పటికీ కూడా, వారి గుండెమూలాల్లోనుండి పెల్లుబికివచ్చే భాషలను, సంస్కృతులను, సంగీతాలను ఒక యాంత్రిక తతంగంలా వినియోగించడానికి చూస్తున్నారే తప్ప, ఆ సంస్కృతిమూలాలను గుర్తించి సాంప్రదాయాలను కొనసాగించుకోగలిగిన సహకారం, సదుపాయం ఇవ్వట్లేదు. ఇలాగే మన భారతదేశ సంస్కృతులు కూడా ఎన్నో కొల్లగొట్టబడ్డాయని, తద్వారా చరిత్రలో గుర్తింపులేక మనం నష్టపోయామని చెప్పకతప్పదు. ఈనాటి కాలంలో కూడా మూలసంస్కృతి అయిన ప్రజల ఆయుప్రాణాలను, వారి సంస్కృతిసౌరభాలను గుర్తించి కాపాడుకోవలసిన అవసరం ఉంది. బతికున్న భాషలను,వాటిలోని భావాలనైన రక్షించుకుందాం. కలిసి కాపాడుకుందాం. అప్పుడే వసుధైక కుటుంబమని చెప్పుకోగలం. చోద్యంగా ఈ పాప్ వీడియో ఈ వసుధైకకుటుంబ భావననే మనకి కళ్ళకిగట్టినట్టు చూపెడుతోంది. కథ ఎలా జరిగినా ఈ సంగీతాన్ని, వీడియోని సృష్టించిన “డీఫ్ ఫారెస్ట్” బృందానికి కూడా అభిమానం తెలుపుకుందాం.

ఆవల కడలిపైన

ఆవల కడలిపైన

కడలిపైన కడలిపైన..
కడలిపైన.. కారునీలమైన కడలిపైన
తేలుతున్నాయి తేలుతున్నాయి..
తేలుతున్నాయి ఓ గుంపు తెల్లటి హంసలు
ఎట్నుంచొచ్చింది? ఎట్నుంచొచ్చింది?..
ఎట్నుంచొచ్చింది ఆ బూడిదరంగు డేగ?
ఆ గుంపు హంసల్ని.. ఆ గుంపు హంసల్ని..
ఆ గుంపు హంసల్ని నీలి కడలిచుట్టూ చెదరగొట్టింది
తెల్లటి బూది తెల్లటి బూది ..
తెల్లటి బూది నింగి మిన్నుపైకి లేచింది
బూడిద ఈకలు బూదిద ఈకలు..
బూడిద ఈకలు పచ్చటి నేలపై పడ్డాయి
మరి ఈ ఈకలని.. మరి ఈ ఈకలని..
మరి ఈ ఈకలని తెచ్చుకొచ్చేది ఎవరే?
తెచ్చుకొచ్చేది తెచ్చుకొచ్చేది ..
తెచ్చుకొచ్చేది ఒక అందమైన కన్నెపిల్ల

“లాబొరాతోరియం పీష్నీ” అనే ఈ బృందం పోలండు దేశానికి గాయనులబృందం. “ఆవల కడలిపైన” (స్తోయ్ పా మోరు) అనే ఈ పాట మాత్రం తెల్లరష్యా (బెలారుస్) దేశానికి చెందిన ఒక జానపదగీతం. బెలారష్యా భాష పురాతనమైన రష్యను భాషని పోలి ఉంటుంది. ఈ జానపదగీతాలు ఎంతోకాలంనాటి ఆ పల్లెప్రజల సంస్కృతిని కమ్మటి సంగీతంలో నిక్షేపించాయి. ఈ పాటలో సముద్రంపై ఎగురుతున్న ఒక హంసల గుంపుని ఒక గద్ద వేటాడుతుండగా అవన్నీ చెదిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాయి. గూఢంగా ఈ కథలో జానపదంలోని ప్రజలను ముష్కరులైన పరాయిదేశంవారు వేటాడుతుండగా వారి భాషలను, సంస్కృతిని కోల్పోయి ఎక్కడెక్కడికో చెదరగొట్టబడిపోయారు అని స్ఫురిస్తోంది. ఇది స్లావు జాతి ప్రజల కన్నీటికథను గుర్తుకుతెస్తోంది. ఈ స్లావు జాతివారిని ఆక్రమించి బానిసలుగా ఎక్కడెక్కడో విపణులలో అమ్మేసారు పరాయిజాతులవారు. ఇది చరిత్రలో ఒక చీకటిఘట్టం. ఈ భాషలు మాట్లాడే ప్రజలు ప్రస్తుతం తూర్పు ఐరోపా ఖండమంతా చెదరగొట్టిబడి ఉన్నారు: రష్యా మొదలుకొని పోలండు వరకు, ఉత్తరాన బెలారష్యా మొదలుకొని దక్షిణాన సెర్బియా వరకు. స్లొవాకులు, స్లొవేనులు వీరందరు ఈ స్లావుజాతి వారే. మధురమైన ఈ జానపదగానం తెల్లటి హంసల గుంపు అని వీరిని స్ఫురిస్తోంది. ఈ పాటకు అనుబంధితమైన ఈ వీడియోలో పురాతనకాలంనాటి ప్రకృతి ఆరాధనా క్రతువులు, పడుచులు కలిసి నాట్యం చేసే తీరు చక్కగా చూపించారు.