Tag Archives: రాజకీయం

కుతూహలమ్మ ద్రౌపదియా, శిఖండినా ?

శాసన సభలో జరుగుతున్న వీర తమాషా మరో అంకంపైకి వచ్చింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటూ ఒక డ్రామా మొదలుపెట్టారు. సరుకు తక్కువ, సణుగుడు ఎక్కువ – సభంతా గోల గోల అయ్యింది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, చొక్కాలు చించుకోవడమే తరువాయి, మిగిలిందంతా ముగించారు. “స్పీకర్ వచ్చే వరకు సభ జరపనివ్వం. డెప్యూటీ స్పీకర్కి సభ నిర్వహించే హక్కు లేదు”, అంటు చంద్రబాబు ఏదో లా పాయింట్లు లేవనెత్తాడు. డెప్యూటీ స్పీకర్ కుతూహలమ్మగారు దళిత మహిళ అయినందువల్ల, కాంగ్రెసువాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది. “ఉత్సవ విగ్రహం లాంటి కుతూహలమ్మనే అవమానిస్తావా ? కులహంకారి”, అంటూ విరుచుకుపడ్డారు. “తేడా వచ్చిందిరో అబ్బాయ్”, అంటూ తెలుగుదేశం వాళ్ళు వెనక్కి తగ్గారు.

“కౌరవ సభలో ద్రౌపదిలా ఫీల్ అయ్యాను”, అంటూ కుతూహలమ్మ కొసమెరుపు. కానీ, కౌరవసభలో మెజారిటీ కౌరవులది, ఇక్కడ శాసనసభలో మెజారిటీ ఎవ్వరిదో ? సరైన పోలిక ద్రౌపదితో కాదు, శిఖండితో. భీష్ముడిని ఎదుర్కోలేక అడ్డుగా శిఖండిని పెట్టుకుని యుద్ధం చేస్తారు పాండవులు. ఒకప్పటి ఆడది అయిన శిఖండితో పోరు చెయ్యలేక భీష్ముడు విల్లు విడుస్తాడు. ఇక్కడ, మన భారతదేశంలో దళితుల విలువ శిఖండికి సమానంగా జమకట్టారు మన రాజకీయనాయకులు. ఎవ్వరూ వీరితో పోరుపెట్టుకోరాదు. ఇది రూలు.

దళితుల ఆత్మగౌరువం రక్షించే పనులా ఇవి !!? అసలు పవరు ఏ కులాల మధ్యన ఉందో అందరికీ తెలుసు. ఈ కామెడీ జనాలు అర్థం చేసుకోలేరా ?

మన తరం ఆలోచించవలసిన ప్రశ్నలు

ఈ పోస్టులో మన తరం ప్రజలు ఆలోచించవలసిన కొన్ని తీక్షణమైన ప్రశ్నలను పరిచయం చేస్తాను. “రాజకీయాలు మనకెందుకులే, దేశం ఎక్కడికిపోతే నాకేంటి” – అని పెదవి విరిచే బదులు, “మన తెలుగు నేలని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు” అని ఆలోచిస్తే, మన తరం యువకులకి ఒక అద్భుతమైన అవకాశం ముందు ఉంది. దేశం ఆర్థిక విధానాలు ఎలాగ పనికి వస్తాయి ? సెజ్ ల ద్వారా అభివృద్ధి సాధ్యమేనా ? ఇలాంటి ప్రశ్నలకి అందరూ తలోరకంగా సమాధానమిస్తున్నారు. ఇక్కడ ఒక సిద్ధాంతం ప్రకారం వీటిని వివరించేందుకు ప్రయత్నం చేస్తాను.

సమాచారం నిక్షిప్తపరచుకునే సాధనాలలో మార్పులు కలిగినప్పుడు, సమాజం మొత్తం అతలావితలమవుతుంది. మునుపు చారిత్రిక విశ్లేషకారులు సామాజిక మార్పులను తెచ్చిపెట్టేవి దృఢ సాంకేతిక విప్లవాలు (ఆవిరి యంత్రం, గాలి మర, ఎలెక్ట్రిక్ బల్బు..) అని భావించేవారు. కానీ ఈ వివరణ తప్పు. అసలైన మార్పులు కల్పించేవి మృధు సాంకేతిక విప్లవాలు – సమాచారం, సందేశం పంపించే సాధనాలలోని విప్లవాలు.

ఇలాంటి విప్లవం ఒకటి మన కళ్ళ ముందరే ఆవిష్కృతమవుతోంది (ఇంటర్నెట్టు) . మిషెల్ సెర్ర్ ఉపన్యాసం పూర్తిగా తర్జుమా చేసేముందు ఈ పోస్టులో ఒకసారి సంక్షిప్తపరుస్తాను.

మానవ నాగరికత పరిణామం మొత్తం నాలుగు దశలలో వివరించవచ్చు :

 • వాచ్య దశ : అన్ని రకాలైన సంభాషణ మాట్లాడడం ద్వారానే జరిగేది
 • లిఖిత దశ : భాషని వ్రాయడానికి ఒక లిపి కనుగొన్న తరువాత
 • ముద్రణా దశ : ముద్రణా యంత్రం కనుగొన్న తరువాత
 • సందేశాత్మక దశ : సమాచారాన్ని పరిమార్చి. ప్రసరించ గలిగే ఒక యంత్రాన్ని కనుగొన్న తరువాత

వీటిలోని ప్రతీ పరిణామం మనుషులు సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారో తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ మృధు పరిణామాలు అక్షరాలా ప్రపంచాన్ని మొత్తం కూల్చివేసి, తిరిగి పునర్నిర్మించాయి. రాజ్యం, వాణిజ్యం, శాస్త్రం, న్యాయం, మతం, సంస్కృతి – ఈ ఆరు రంగాలు మానవ పరివృత్తిని మూలంగా నిర్వచించుతాయి. మృధు విప్లవాలు ఈ రంగాలలో ఎలా మార్పులు తెచ్చిపెట్టాయో అర్థం చేసుకుందాం.

వాచ్య దశ :

రాజ్యం : సమాజం తెగల క్రింద విడవడి ఉంది. ప్రతీ తెగ కొంతమంది పెద్దల ఆధ్వర్యంలో నడుస్తుంది. మనిషి తెగకి బద్ధుడై ఉంటాడు – జాతి సంబంధాలు, బంధుత్వాలపై అతని నడవడిక ఆధారపడి ఉంటుంది.

వాణిజ్యం : ఇచ్చిమార్పిడల ద్వారా వాణిజ్యం నడుస్తుంది. బంగారం మొదలైన విలువైన లోహాలు – ఈ ఇచ్చిమార్పిడికి ఒక తులమానికగా పనికివస్తాయి.

శాస్త్రం : ఆదిమ సిద్ధాంతాలు ప్రకృతి ప్రవర్తనని వివరించే ప్రయత్నం చేస్తాయి. పనిముట్లు, ఆయుధాలు తయారీ చెయ్యడం ఇంకా ఒక కళగా భావించబడుతుంది. విద్య కేవలం కుటుంబం లోపలనే అందించబడుతుంది.

న్యాయం : వంశ గౌరవం, తెగ గౌరవం కాపాడడం అనేది సారాంశం. ఇంతకు మించి న్యాయ రంగం వేరే ఉండదు. ప్రతీ మనిషి ఈ గౌరవం కాపాడేందుకు ఆయుధాలు చేపట్టాలి.

మతం : ప్రకృతి దేవతలని ఆరాథించే బహుళేశ్వర మతాలు ప్రకృతి వైపరీత్యాలని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తాయి. ప్రకృతితో ప్రశాంత సహజీవనం చెయ్యడం నేర్పుతాయి.

సంస్కృతి : దేశ సంచారం చేసే పాటగాళ్ళు కావ్యాలను అల్లిపెడతారు.

ఉదాహరణలు : వైదిక భారతం (క్రీ.పూ. 600 వరకు), పైథాగొరాస్ మునుపటి గ్రీసు (క్రీ.పూ. 580 వరకు), రోము సామ్రాజ్యపు మునుపటి యూరపు (క్రీ.శ. 200 వరకు), అక్షరాస్యత లేని సమాజాలు (40% భారత ప్రజానీకం, 64% ఆఫ్ఘనిస్తాను)

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : జాతి

లిఖిత దశ :

రాజ్యం :
ఒక రాతిపై వ్రాయబడిన న్యాయ శాసనం ద్వారా రాజ్యం అనేది మొదటిసారిగా కనిపెట్టబడుతుంది (అశోకుని శిలాశాసనాలు, హమ్మురబీ శాసనం). రాజ్య సరిహద్దు ఖచ్చితంగా నిర్వచించబడి ఉంటుంది, దాని భద్రతకై ఒక సైన్యం అవసరమవుతుంది. రాజ్యనిర్వహణ తెగల యొక్క గణతంత్రాలని విడిచి ఒక రాచరికంగా అవతరిస్తుంది. రాచసేవ చెయ్యడానికి ఒక వర్ణక్రమం తయారవుతుంది.

వాణిజ్యం : ధనం (రాగిపై, మరేదైనా లోహంపై వ్రాయబడిన ఒక విలువ) కనిపెట్టపడుతుంది. ధన, వాణిజ్యాలు నిర్వహించడానిక ఒక వైశ్య తరగతి పుడుతుంది.

శాస్త్రం : రేఖాగణితం కనిపెట్టబడుతుంది. గణితం ఒక్క ఉపయోగం వల్ల వృత్తిపనులు కళలుగా కాక సాంకేతిక పరిశ్రమలుగా అవతరిస్తాయి. కొలతలు, పరిశీలనల ఆధారంగా ప్రకృతిని వివరించడానికి సిద్ధాంతాలు పుడతాయి. మతశిబిరాలలో విద్యాబోధన జరుగుతుంది. చెదురుమదురుగా ఉండే కొన్ని గ్రంథాలయల వద్ద విశ్వవిద్యాలయాలు వెలుస్తాయి. ఉపాధ్యాయుని వృత్తి మొదటిసారిగా అవతరిస్తుంది. గ్రంథాల లేమి వల్ల ఉపాధ్యాయుడు చాలా విషయాలు జ్ఞప్తిలో ఉంచుకోవలసి వస్తుంది.

న్యాయం : వ్రాయబడని వంశ గౌరవంగా కాక ఒక ఖచ్చితమైన న్యాయ శాసనంగా అవతరిస్తుంది. దీనిని అమలుచెయ్యడానికి, నేరస్థులని దండించడానికి ఒక దళం తయారవుతుంది.

మతం : గ్రంథాల ఆధారితమైన ఏకేశ్వరోపాసక మతాలు పుడతాయి. ప్రజల కట్టుబాట్లను ఇవి ఖచ్చితంగా వ్రాసి నిర్ధారించడంతో, ఈ మతాలలో స్వేచ్ఛ తగ్గి మరింత కఠినంగా మారుతాయి.

సంస్కృతి : కళాకారులు రాజుల సంస్థానాలలో పోషించబడుతారు. సంగీతం వ్రాయడానికై ఒక భాష అవతరిస్తుంది. చిత్రలేఖనం, శిల్పకళ ఒక ఖచ్చితమైన కొలతలతో నేర్పబడుతాయి.

ఉదాహరణలు : కులం చేత వ్యక్తీకరించదగిన బ్రిటిషు రాక మునుపటి ఇండియా (క్రీ.శ. 1600 వరకు : మౌర్యులు, గుప్తులు, మొఘళ్ళు..), సామాజిక తరగతి చేత వ్యక్తీకరించదగిన రెనైసాన్సు మునుపటి యూరపు (క్రీ.శ. 1500 వరకు : పైథాగొరాస్ తరువాతి గ్రీసు, రోము సామ్రాజ్యము ..), క్రీ.శ. 1950 మునుపటి వరకూ టిబెట్, క్రీ.శ 1900 మునుపటి వరకూ అరేబియా, ప్రస్తుత భారత దేశంలో కులం ఎక్కడ ఇంకా గట్టిగా నడుస్తోందో.

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : మతం

ముద్రణా దశ :

రాజ్యం : పుస్తకాలు జ్ఞానాన్ని ప్రజలలో పంచిపెడతాయి. దీనితోనే “ప్రజలందరూ సమానులే” అన్న భావం వెల్లివిరుస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్యం అవతరిస్తుంది. ప్రజా ప్రతినిధులు ఎన్నికలచే నియమింపబడతారు. “దేశం” అనే భావన ఏర్పడి, ప్రపంచం దేశాలుగా విడివడి ఉంటుంది.

వాణిజ్యం : బ్యాంకు కనిపెట్టబడుతుంది. డబ్బుతో నమ్మకస్తుడిగా ఉండటం అనే ఆలోచన పుడుతుంది. దీనిని బట్టి బ్యాంకులు అప్పు ఇస్తాయి, వాణిజ్యం నడుస్తుంది. బ్యాంకు చెక్కు, ముద్రితమైన డబ్బు పెట్టుబడిదారీ విధానాన్ని ఆవిష్కరిస్తాయి.

శాస్త్రం : ముద్రితమైన పుస్తకాలు చెంతనుండగా ఉపాధ్యాయుడు అన్ని విషయాలను జ్ఞప్తికి ఉంచుకోనక్కర్లేదు. ఈ పుస్తకాల ఆధారంగా పాఠశాలలు, కళాశాలలు నడుపబడతాయి. మొదటిసారిగా ప్రజానీకం మొత్తం విద్యావంతులవుతారు. ప్రయోగాలచే నిర్ధారించడం అనే ప్రాతిపదిక పైన ఆధునిక శాస్త్రీయ పద్ధతి పుడుతుంది. విజ్ఞాన శాస్త్రం వేల విభాగాలుగా వెల్లివిరుస్తుంది.

న్యాయం : లిఖించబడిన రాజ్యాంగం ఆధారంగా న్యాయ విశ్లేషణ జరుగుతుంది. మతం నుండి న్యాయం విదగొట్టబడుతుంది.

మతం : “చేతిలో బైబిలు ఉండగా ప్రతి మనిషి పోపుకి సమానుడే”, అంటూ లూథర్ క్రైస్తవంలో పునర్నిర్మాణ ఉద్యమం మొదలుపెడతాడు. మతం ఒక వ్యక్తిగతమైన విషయంగా మారుతుంది. దైవానికి మనిషికి మధ్యన పూజారుల అధికారం తగ్గిపోతుంది. మతానికి ఆర్థిక అధికారాలు నశించిపోతాయి.

సంస్కృతి : కళ అనేది అంగడిలో ఒక సరుకుగా మారుతుంది. ప్రతి మనిషి కళా వస్తువులను కొనడం ద్వారా కళాకారులను ప్రోత్సహించగలుగుతాడు. ఈ కళా సంతలో దుకాణాలపై ఆజమాయిషీ చేసే దళారులు ఒక కొత్త సంపన్న వర్గంగా అవతరిస్తారు.

ఉదాహరణలు : రెనైసాన్సు పిదప ఆధునిక యూరపు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆధునిక జపాను, అభివృద్ధి చెందుతున్న దేశలలోని (చైనా, ఇండియా, బ్రెజిలు..) చదువుకున్న మధ్య తరగతి వర్గాలు.

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : మార్కెట్

సందేశాత్మక దశ :

మానవ చరిత్రలో మొదటిసారిగా ప్రపంచం మొత్తం ఒక్క మౌస్-క్లిక్కు దూరంతో కలవబడి ఉంది. ఈ కొత్త యుగంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాము. మునుపు సంభవించిన విప్లవాల వల్లే, ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం త్రెంచివేయబడుతుంది. సరిహద్దులు లేని ప్రపంచంలో ఒక కొంగొత్త ఆర్థిక, రాజకీయ పద్ధతి సృష్ఠించబడుతుంది.

ఈ మార్పులని కొన్ని ఇప్పుడే గమనించవచ్చు : ఏ.టీ.యెం, ఈ-కామెర్సు వాణిజ్యం ఎలా జరుగుతుందో పునర్నిర్వచించాయి. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం యొక్క ఆర్థిక బలం తూర్పు దిశగా మళ్ళుతోంది. ఇంటర్నెట్ యుగంలో డబ్బుని దొంగిలించడానికి కొత్త మోసగాళ్ళు తయారయ్యారు, వీరివల్ల వాణిజ్యం ఎలా నడపాలి అనే విషయంలో కొత్త దిశలలో ఆలోచించటం మొదలుపెట్టాము. విద్యా, శాస్త్రీయ రంగాలలో : ఇంటర్నెట్, గూగుల్ వల్ల ఉపాధ్యాయుని పాత్ర మొత్తం మార్చబడింది. శాస్త్రీయ అన్వేషణ ఒక అద్వితీయమైన వేగంతో వృద్ధి చెందుతోంది : కంప్యూటర్ సిమ్యులేషన్, ఇంటర్నెట్ ద్వారా కలిసికట్టుగా పరిశోధన – ఇవి శాస్త్రీయ రంగాలలో పెనుమార్పులు తెచ్చిపెడుతున్నాయి.

ఇక్కడతో సెర్ర్ ఉపన్యాసం సంక్షిప్తం. ఇప్పుడు నేను నా ఆలోచనలు, అభిప్రాయాలు బయటపెడతాను. ఇప్పుడు మనం కొన్ని దృఢమైన ప్రశ్నలు అడగాలి : మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అసలు ప్రతినిధులు అవసరమా ? ఇంటర్నెట్టు ఆధారంగా ప్రజలచే మరింత స్వేచ్ఛగా, పారదర్శకంగా ప్రభుత్వ పాలన చెయ్యగలమా ? వ్యక్తికి సంపూర్ణమైన స్వేచ్ఛ లభించగలదా ? వ్యక్తిగతమైన స్వేచ్ఛకి భంగం కలిగించకుండా వ్యక్తికి రక్షణ కల్పించగలమా ? మనలో ప్రతి ఒక్కరూ కళాకారులు కాగలరా ? ఒక కళాకారుడు డబ్బు గురించి ఆలొచించనవసరం లేకుండా, సంపూర్ణమైన భావ వ్యక్తీకరణా స్వేచ్ఛ పొందగలడా ?

ఇవి మన తరం యువకులు ఆలోచించవలసిన ప్రశ్నలు.

ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు పైన వివరించబడిన 3 యుగాలలో బ్రతుకుతున్నారు. కానీ అంతిమంగా, అందరూ 4వ యుగంలోకి రావలసిందే. ఈ వివిధ యుగాలు అన్నీ ఒకదానితో మరొకటి వ్యతిరేకతను కలిగి ఉంటాయి. ఈ విషయం సుళువుగా అర్థమవుతుంది. మార్పుకు ఎంతో వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. ఒక యుగం దాని తరువాతి యుగంతో కలబడుతున్నప్పుడు, దాని సొంతటి చిన్నతనంలో పూర్వ యుగానికి విరుద్ధంగా ఉపయోగించిన ఆయుధాలనే వాడుతుంది.

లిఖిత యుగంలో నడుస్తున్న సమాజం దాని మునుపటి వాచ్య యుగం యొక్క హింసని, అలజడిని బూచిగా చూపిస్తుంది. “రాజు నశించిపోతే మిగిలేది అరాచకమే. మతం లేకపోతే మిగిలేది అరణ్యమే”, అంటూ కలబడుతుంది. కానీ, యుద్ధంలో చివరకి నెగ్గేది పెట్టుబడిదారీ ముద్రణా యుగం మాత్రమే. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం నెగ్గుకు వస్తాయి.

ఉదాహరణ : 16వ శతాబ్దంలో చర్చి యూరపులో ప్రజాస్వామ్య, శాస్త్రీయ ఉద్యమాలని అణచివెయ్యడాని బహువిధాలుగా ప్రయత్నించింది. ప్రస్తుత ఇస్లామిక్ సమాజంలో ఛాందస వాదులు “ప్రజాస్వామ్యం అంటే విగ్రహాధారనతో సమానం, వచ్చేది వఠ్ఠి అరణ్య పాలనే” అని పురాతన బూచిని చూపెట్టి ఆస్తికులను బయపెడుతున్నారు.

ముద్రణ-యుగంలో నడుస్తున్న సమాజం మత ఛాందసత్వం, ఫ్యూడల్ రాజ్యం వంటి లిఖిత-యుగ బూచులని చూపెట్టి ప్రజలను బెదరగొడుతుంది. ఇదంతా, సందేశాత్మక-యుగం నుండి జనాలని దారి మళ్ళించడం కోసం.

ఉదాహరణ : ఈ యుద్ధం ప్రస్తుతం మన కళ్ళ ముందరే అమెరికాలోను, యూరపులోను జరుగుతోంది. యధాస్థితివాద పార్టీలు “ఇస్లాం యొక్క ఛాందసత్వం, ఉగ్రవాదం” అని ప్రజలను భయపెడుతున్నాయి. సంగీతం, సినిమాలు, టీవీ, దినపత్రికలు – వీటిని శాసిస్తున్న మీడియా ధనిక వర్గం “ఇంటర్నెట్టు పైరసీ” అని ప్రజలను బెదరగొడుతోంది. అసలు ఉద్దేశ్యం మన తరం నాటి ప్రశ్నల నుండి మనల్ని దారి మళ్ళించడం కోసమే.

మిషెల్ సెర్ర్ కి మునుపు మరో తత్వవేత్త కార్ల్ మార్క్సు మానవ సామాజిక పరిణామాన్ని ఈ పద్ధతిలో వివరించే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన సిద్ధాంతమైన మార్క్సిజానికి సత్యానికీ మధ్య వ్యత్యాసం – లామార్కు థియరీకి డార్విను యొక్క అసలు పరిణామవాద సిద్ధాంతానికి మధ్య వ్యత్యాసమంత. లామార్కు ఆలోచన విప్లవాత్మకమైనదే – జీవులు కాలంతో పరిణామం చెందుతున్నాయి అని. ఆయన దృష్ఠిలో, జిరాఫీ చెట్ల చిగురుటాకులను అందుకోవడం కోసం మెడను సాగదీసింది – అలా సాగతీయగా, సాగతీయగా మెడ పొడవయ్యింది అని. కానీ ఇది నిజం కాదు. పరిణామాం జరిగేది జంతువుపైన కాదు (phenotype) కానీ జన్యువు పైన (genotype).

మానవ సామాజిక పరివర్తనని శాస్త్రీయ దృక్పథంతో వర్ణించాలి అనే ధైర్యం ఉంది కానీ, మార్క్సు ఒక తప్పు సిద్ధాంతం రచించాడు. ఆయన దృఢ టెక్నాలజీలు (phenotype) సామాజిక మార్పులు తెస్తాయని భావించాడు. కానీ, అసలు కారణం మృధు టెక్నాలజీలు (genotype). సోవియట్ యూనియనులోని కమ్యూనిస్టు సైద్ధాంతికులు లామార్కు నిజమైతే బాగుండునని ఎంతో ఆశించారు. కమ్యూనిస్టు విప్లవం నాటికి రష్యా ఏ విధంగానూ ఒక పెట్టుబడిదారీ దేశం కాదు. అది ఒక పురాతన దశలోని ఫ్యూడలు దేశం. కమ్యూనిస్టు ఉద్యమం విజయవంతమైన మరేదేశమూ కూడా (చైనా, క్యూబా, ఇండియాలోని నక్సలైటు ప్రాంతాలు) పెట్టుబడిదారీ దేశంకా దు. అవి ఫ్యూడాల్ సమాజాలు. రష్యాలోని కమ్యూనిస్టులు ఆశించినదేమిటంటే, వారి మెడలని బాగా సాగదీస్తే సోషలిజం యొక్క చిగురుటాకులు దక్కుతాయి అని. కాని, అవి ఎప్పటికీ దక్కలేదు.

ప్రతీ కమ్యూనిస్టు విప్లవం మానవ ప్రగతిలో ఒక వెనకడుగు అయ్యింది : ముద్రణా-యుగంలోని పెట్టుబడిదారీ దశని చంపివేసి లిఖిత-యుగంలోని రాచరికాన్ని తిరగతోడింది. కమ్యూనిస్టు దేశాలలోని విపరీతమైన సెన్సార్షిప్పు, సీక్రెట్ పొలీసులు, భావ వ్యక్తీకరణ నిర్బంధాలు – ఇవేవీ ఫ్యూడల్ సమాజంలో ఆశ్చర్యం కలిగించవు. జరిగినదది. మన భారతదేశంలోని కమ్యూనిస్టులు ఇంకా అవే సిద్ధాంతాలను పట్టుకు వేళ్ళాడుతుండడం నిజంగా మన దురదృష్టం. ఇంకా ఎన్ని సార్లు ఇవి తప్పని నిరూపించబడాలో తెలియదు. వేపకాయంత వెర్రి ముదిరి తాటిపండంత అయ్యింది అన్నట్టు – వీరు ఇప్పుడు ఇరాన్, చైనా లాంటి దేశాలను సమర్థిస్తున్నారు. ఇరాన్లో ఇస్లాం మతపెద్దలు కమ్యూనిస్టలనందరినీ చంపేసిన విషయం తెలుసునో, తెలియదో మరి !

సమాజంలోని ప్రగతిశీల వ్యక్తుల కర్తవ్యం – టెక్నాలజీకి అణువుగా సమాజం తీర్చిదిద్దటం.అంటే, వాచ్య దశ కంటే లిఖిత దశని పెంపొందించటం (జాతి కంటే మతం మెండు), లిఖిత దశ కంటే ముద్రణా దసని పెంపొందించటం (మతం కంటే మార్కెట్ మెండు), ముద్రణా దశ కంటే సందేశాత్మక దశని పెంపొందించటం (మార్కెట్ కంటే ఇంటర్నెట్ మెండు).

సమాజం యొక్క పరిణామం ఈ విధంగా జరుగుతుంది. ఉత్సాహమున్న తెలుగు యువకులని, యువతులని నేను అడిగేది ఏమిటంటే “మన జీవితకాలంలోగా తెలుగునేలని ఈ దశలన్నీ దాటించి సందేశాత్మక యుగంలోకి తీసుకురావాలి” అని.

చైనాకి జిందాబాదు కొడుతున్న కమ్యూనిస్టులు

చరిత్రలో చిరకాలం మిత్రులూ ఉండరు. శత్రువులూ ఉండరు. భౌగోళిక-రాజకీయ ప్రభావాలు మారుతూ ఉండడం వల్ల నిన్నటి శత్రువులు ఈనాటి మిత్రులవవచ్చు. నిన్నటి మిత్రుడు ఈరోజు శత్రువూ కావచ్చు. ఈ విషయం గుర్తించలేక ఒక కరడుగట్టిన సిద్ధాంతానికి దాసులవలే సేవచేసేవాళ్ళను ఛాందసులంటారు. మూర్ఖులంటారు. ఈ కాలంలో – డబ్బుకి అమ్ముడిపోయి ఆత్మవంచన చేసుకుని వ్యాసాలు వ్రాసేవారు కొందరు అయితే, సైద్ధాంతిక మత్తులో కళ్ళు కమ్ముకిపోయినా బాకాలు వాయించడం ఆపనివారు మరికొందరు. మొత్తమ్మీద భావకాలుష్యంతో చెవులు పిక్కటిళ్ళుతుంటే, సరైన దిశానిర్దేశ్యం చేసే నాయకులు లేరు మనకి.

కమ్యూనిస్టు సోదరి అంటూ చైనాకి రష్యానే ఆటం బాంబు ఇచ్చిపెట్టింది. తర్వాత సరిహద్దు గొడవలు తలెత్తడంతో శత్రువు అయ్యింది. 1960లలో “అమెరికాతో సంధిచేసుకుని కమ్యూనిస్టు ఉద్యమానికి రష్యా ద్రోహం చేస్తోంది” అని నిందమోపిన చైనాయే, 1970లలో అమెరికాతో చెలిమిచేసింది. రష్యాకి ముకుతాడు వెయ్యడానికి అమెరికాయే ఒకవైపు చైనాకి మరోవైపు పాకీస్తానుకి తాయిలాలు అందిచ్చింది. అమెరికాకి చేసిన ఎగుమతులతోనే చైనా వృద్ధిరేటు సాధిస్తోంది. ప్రపంచం తీరుతెన్నులు ఇంత వేగంగా మారుతున్నా వీరకమ్యూనిస్టులు మనవాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నారు. టిబెట్లో బౌద్ధ సన్యాసులు చైనాకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చెయ్యడం కూడా వాళ్ళకి నచ్చదు. వీళ్ళ దృష్టిలో దీనంతటి వెనకా అమెరికా మోసం ఉంటుంది. సీ.ఐ.ఏ కుట్ర ఉంటుంది. హిందూ, ఫ్రంట్ లైను లాంటి పత్రికలంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఇప్పుడు వాటిలోని సంపాదకీయాలు చూసి వెగటు వస్తోంది.

ప్రపంచంలో ఎక్కడా చైనాని శ్రామికవాద ప్రతినిధిగా చూడట్లేదు. పేరుకిమాత్రమే కమ్యూనిస్టు దేశంకానీ, పెట్టుబడిదారీ దేశంగా చైనా ఎప్పుడో ఫిరాయించేసింది. కానీ, కమ్యూనిస్టు దేశంలో ఉండే ఆంక్షలు, సీక్రెట్ పోలీసులు, విపరీతమైన దేశాభిమానం అన్నీ ఇంకా చైనాలో కలిసిపుచ్చుకుని ఉన్నాయి. ఇప్పటి చైనా నిక్షేపంగా ఒక ఫాసిస్టు దేశం. శ్రామికవాద పత్రికగా పేరుగాంచిన “గార్డియన్” పత్రికలో కూడా చైనాపై విమర్శలేకానీ, మెచ్చుకోలు కనిపించవు.

కానీ, మన కమ్యూనిస్టు పాత్రికేయులు, వ్యాఖ్యాతలు అలుపెరగకుండా ఇంకా చైనాకే ఊడిగం చేస్తున్నారు. వీరి వెర్రి ఎంత దూరం వెళ్ళిందంటే దలైలామా నిజాయితీని హత్యచేసేంతవరకూ. ఈ విచిత్రాన్ని అర్థంచేసుకోవాలంటే ఒకసారి టిబెట్ని మన కాశ్మీరు సమస్యతో పోల్చిచూద్దాం.

 1. కాశ్మీరులో వేరే భారతీయులు ఇళ్ళు నిర్ముంచుకునే హక్కు లేదు. టిబెట్లో రోరోజుకీ ప్రవాసీయులు పెరిగిపోతున్నారు. లాసా నగరంలో ఇప్పుడు 40% చైనీయులే.
 2. కాశ్మీరులో హిందీభాషని నిరోధించడం కోసం ప్రత్యేక హక్కులు ఉన్నాయి. కాశ్మీరీ భాష పరిరక్షణకై మన రాజ్యాంగానికి మించి హక్కులు ఉన్నాయి. టిబెట్లో, ప్రాథమికాభ్యాసం తరువాత చదువుకోవాలంటే చైనా భాష నిర్బంధం. టిబెట్ భాష అంతరించిపోయే పరిస్థితిలో ఉంది.
 3. కాశ్మీరులో ఆమ్నెస్టీ మొదలైన అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్నాయి. మానవహక్కుల పరిరక్షణకి కృషి చేస్తూ భారతసైన్యం యొక్క తప్పులని ఎండగడుతూ ఉంటాయి. దినపత్రికలు, వార్తాపత్రికలు సంపూర్ణ స్వేఛ్ఛతో ప్రచురించబడుతాయి. అందులో సగం భారతదేశానికి బహిరంగంగా వ్యతిరేకమైనవి. టిబెట్లో అయితే కాలుపెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రభుత్వమే పత్రికలను అచ్చువేయిస్తుంది.
 4. కాశ్మీరులో ప్రజాస్వామ్యంగా అందరూ వోటు వెయ్యవచ్చు. వారు స్వయంగా ముఖ్యమంత్రిని ఎన్నుకోవడమేగాక ప్రత్యేక కాశ్మీరు పతాకాన్ని కూడా ఎగురవేసుకోవచ్చు. టిబెట్లో అయితే ముఖ్య అధికారిని బీజింగు నియమిస్తుంది.
 5. కాశ్మిరులో విభజనకోసమై సాయుధపోరాటం చేస్తున్నారు. వీటికి లోపల చెరబడిన విదేశీ ఉగ్రవాదులు నాయకత్వం వహిస్తున్నారు. అన్యాయంగా లక్షలకొద్ది కాశ్మీరీ పండిట్లను హతమార్చారు. ఆస్తులు స్వాధీనం చేసుకుని తరిమివేసారు. టిబెట్లో “స్వాతంత్ర్యం” అడగనుకూడా అడగట్లేదు. మైనారిటి టిబెటన్లు (ముస్లిము టిబెటన్లు, ఐయ్ఘర్ టిబెటన్లు) ఎటువంటి జాతివేషమ్యం ఎదుర్కోలేదు. అయినా, అక్కడ “అదృశ్యమైన” టిబెటన్లు ఇక్కడ కాశ్మీరులో మరణించిన తీవ్రవాదులకి సమాపంగా ఉన్నారు.
 6. పాకీస్తానులో ఉగ్రవాద శిబిరాలకి సైన్యం సాయూతనిస్తుంది. అటువంటి పాకీస్తానుకే ఆటంబాంబును, మిస్సైళ్ళను ఇచ్చిపెడుతోంది చైనా. మన భారతదేశంలో ప్రతి పౌరునికి హక్కైన శాంతియుత ప్రదర్శనకూడా జరపనివ్వలేదు మనం అతిథులైన టిబెటన్లని. అయినా మనం ఏదో తప్పుచేసామన్నట్లు, చైనా మన భారత రాయబారికి దారుణంగా అర్థరాత్రి 2 గంటలకి సమన్లు పంపించింది.
 7. “మాకు స్వాతంత్ర్యం వద్దు. సరైన భావ,కళా స్వాతంత్ర్యం చాలు. హింసాయుత ఆందోళన ఆపకపోతే రాజీనామా చేస్తా”, అని అంటున్న దలైలామాని చైనా ఒక ఉగ్రవాదిగా చూస్తోంది. కనీసం చర్చలకి కూడా అంగీకరించడం లేదు. మన భారతదేశం హత్యలు చేసిన ఉగ్రవాదులతో కూడా చర్చలకు స్వాగతం చెబుతోంది.

మన కమ్యూనిస్టుల దృష్ఠిలో 1970లో మనపైకి చైనా దొంగచాటు యుద్ధం మోగించడానికి కారణం మనం దలైలామాకి ఆశ్రయం ఇవ్వడమే. ఇప్పుడు, ఈ బౌద్ధ సన్యాసులనందరినీ మన దేశం నుండి తరిమివెయ్యాలంట ! అమెరికా సమర్థించినంత మాత్రాన టిబెటన్లు ఉగ్రవాదులైపోతారా ? మన ప్రజలకి బుర్రలేదనుకుంటున్నారా ? మనదేశంలో కమ్యూనిస్టులు చైనాకి బానిసలవలే వ్రాతలు వ్రాస్తున్నారు. శాంతికాముకుడైన బుద్ధుని మనం మరచిపోయినా, మన సంస్కృతిని పెంచుతున్న టిబెటన్లు మనకి సోదరులవంటి వాళ్ళు. ఈ పాత్రికేయులు, వ్యాఖ్యాతలు ఎంత విషం వెదగక్కినా భారతీయులు ఆ అనుబంధాన్ని ఎప్పటికీ మరచిపోరు.

మనదేశంలో ఆర్.ఎస్.ఎస్ లాంటి సంస్థలు వేళ్ళూనుకోవడానికి ఈ కమ్యూనిస్టు మూర్ఖత్వమే కారణం.

జాత్యహంకారి ఉండవల్లి

బుర్ర ఉన్న రాజకీయవేత్త ఎవ్వడైనా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తాడా !? అందులోనూ, రామోజీరావుకే హడలుపెట్టించిన ఉండవల్లి లాంటి ఉద్ధండుడు ఇంతటి వెర్రి పని ఎందుకు చేస్తాడు ? పైగా, పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో గనక ఒకటికి నాలుగుసార్లు వెనకా ముందూ చూసుకోవాలి, ఇలాంటి ప్రకటనలు చేసే ముందు. ఉండవల్లికి అలాగ మాట్లాడే ఉద్దేశ్యం ఇసుమంతైనా ఉండదు. లోలోపల దళితులపై ప్రేమ ఉన్నా, అసహ్యమున్నా పైకి మాత్రం మల్లెలంత మృధువుగా మాట్లాడడం ఆయన అస్థిత్వానికి అవసరం. మరి ఇలాంటి దిక్కుమాలిన స్థితిలోకి ఎలా ఇరుక్కుంటాడు ?

జరిగిందేమిటంటే, ఆయన వ్యాఖ్యలని ఈనాడు పత్రిక అమోఘంగా వక్రీకరించింది. “రాజ్యాంగం రచించడం అయిపోయింది. మేము అంతా రాజ్యాంగానికి అనుగుణంగానే చేస్తున్నాం, అది మీ దురదృష్టం” అని అనాల్సింది పోయి, “దురదృష్టవశాత్తు అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు, దానికి అనుగుణంగానే మేం చేశాం” అన్నాడు. పప్పులో కాలేసాడు. భలే భలే !

అసలు, అంబేద్కర్ పేరుని వాడాలంటే, చదరంగం మల్లే ఎత్తులు-పైయెత్తులు ఉపయోగించి అప్పుడు వాడాలి. మన ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉన్నది పేరుకి మాత్రమే. చాలా పదాలు నిషిద్ధాలు – ఆచి తూచి మాట్లాడాలి. నిజాము/ముస్లిము/దళితులు/అంబేద్కరు/జిన్నా/… ఇలా లెక్కకు మిక్కిలి. ఏమన్నా తప్పుగా నోటినుంచి దొర్లితే, దిష్టిబొమ్మలు దహనం చెయ్యడానికి రెడీగా వీధుల్లో ఉంటారు మనదేశంలో, పనీపాటాలేని దేశభక్తులు.

మొత్తం మీద కొంచెం కామెడీ లభించింది జనాలకి :))

————————————————————————-

కామెడీ అనుకున్నా, అంతవరకూ బానే ఉంది. కానీ, జరుగుతున్న అల్లర్ల వైఖరి చూస్తుంటే నిజంగా సిగ్గేస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్సు లోనే వెనక నుండి పొడిచేందుకు రెడీగా ఉన్న అమలాపురం హర్షకుమార్ లాంటి వాళ్ళు దీన్ని భీకరంగా రాజకీయం చేస్తున్నారు.

 1. అంబేద్కర్ పై విమర్శలు చేస్తే ఆటోమెటిగ్గా దళితులకి వ్యతిరేకుడైపోతాడా ? దళితులకి అన్యాయం చేస్తున్న అసలు పెద్దమనుషులు ఎవరు ? అంబేద్కర్ నెత్తి మీద పాలు చిలకరించినంత మాత్రాన దళిత-బాంధవులైపోతారా ? ఏవో రెండు పథకాలకి అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన దళితులని ఉద్ధరించినట్లా ?
 2. దేశప్రజలు నిజంగా ఇంత వెర్రివాళ్ళు అని భావిస్తున్నారా మన రాజకీయనాయకులు ? అసలు ఫ్యూడల్ పద్ధతిలో ఆలోచిస్తున్నదెవరు ?
 3. సరే అంబేద్కర్ని విమర్శించాడనే అనుకుందాం. కానీ, ఎం.పి పదవికి రాజీనామా ఎందుకు చెయ్యాలి ? ఈ విధమైన డిమాండు చెయ్యడంలో అర్థం ఏమిటి ? ఇటువంటి డిమాండు మరేదేశంలోనైనా (అమెరికా, ఇంగ్లాండు, జపాను..) ఎవ్వరైనా చెయ్యగలరా ? ప్రజా ప్రతినిధులకు భావ స్వాతంత్ర్యం లేదా మన భారతదేశంలో ? ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం ఏమిటి ?
 4. తెలుగుదేశం వాళ్ళు మూతులకి నల్లటి తొడుగులు ధరించి ఊరేగింపు చెయ్యడం ఏమిటి !? వీళ్ళ నోర్లు ఎవరన్నా నొక్కేసారా ? జరిగిందంతా రివర్సులో కదా.
 5. దళిత ఉద్యమాల్లో పనిచేస్తున్న మేధావులందరూ ఒకసారి సద్విమర్శ చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ళకు కూడా మీరు దళితల బ్రతుకుల్లో ఎందుకని ఏమీ మార్పూ తీసుకురాలేకపోతున్నారు ? అంబేద్కర్కి వారసులమని గుండె మీద చెయ్యవేసుకుని చెప్పుకోగలరా ?
 6. దేశ జనాభాలో 15% శాతం ప్రజలకి అంబేద్కర్ మించి ఒక ఆరాథ్యుడు / మార్గదర్శి లేడా ? దళిత రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు – వీరిలో ఎంతమందికి విగ్రహాలు కట్టించారు, పాలాభిషేకాలు చేస్తున్నారు ? ఒక మహాసముద్రం లాంటి ప్రజానీకాన్ని ఇలాగ ఒక మనిషితో స్టీరియోటైపు చెయ్యడం ఎంతవరకు సమంజసం ? ఈ స్టిరియోటైపు మించి ఆలోచించలేని వారా మనకు నాయకులు ?
 7. ప్రజలు నిజంగా అంత మొద్దులని భావిస్తున్నారా మన నాయకులు ? కొంత కళ్ళు తెరిచి చూడడం మంచిది. దేశం మారుతోంది. ప్రజలు విద్యావంతులవుతున్నారు. మనం మరో యుగంలో ఉన్నాం. వందేళ్ళ కిందటి ఫ్యూడల్ మనస్తత్వాలతో రాజకీయం నడపడం ఇప్పుడు చేతనవదు. కొంత, వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడడం మంచిది.

కుల-మ్యూజికలు-ఛైర్సు

తెలుగునేలమీద బ్రతికే కమ్మవాల్లకి నమస్కారాలు,రెడ్డి కులస్తులకి విడిగా వేరొక నమస్కారాలు, కాపులకి నమస్కారాలు, శెట్టి-బలిజ కులస్తులకి నమస్కారాలు. మాలవారికి నమస్కారము, మాదిగలకు విడిగా మరొక నమస్కారము, బ్రాహ్మణులకి (మిమ్మలినెలా మర్చిపోతాము) నమస్కారాలు. చిన్నపాటి సంఖ్యలతో వేగుతూ మెజారిటీ లేని “వగైరా” కులస్థులకి వేవేల ప్రత్యేక నమస్కారాలు.

స్టేజిమీద పెద్దలందరికి పేరు పేరుగా దండాలు చెప్పడం మన సంప్రదాయం కనుక, ఒక బ్లాగుటపా రాసేముందు ఈ విధంగా బ్లాగోదండకం చదవక తప్పదు. క్షమించండి.

ఇక విషయమేమిటంటే, మన ఆంధ్రదేశంలోని రాజకీయకుళ్ళు యొక్క వెగటి వాసనలు ఎక్కడో దేశాలుదాటి బ్రతుకుతున్న మాలాంటివాళ్ళ ముక్కుప్రుటలని కూడా అధరగొట్టేస్తున్నాయి. అస్థిత్వం ఏమిటొ అర్థంకాక “మాజీ తెలుగువాళ్ళం” అయిపోతామేమోనన్న బెంగతో కాలం గడుపుతున్న మాలాంటివాళ్ళ నాలికలకు “అసలు తెలుగు అస్థిత్వం అనేదే లేదురా గురుడా” అనే నిఖార్సైన నిజం చాలా తీపిగా తగులుతోంది.

చిరంజీవి పార్టి పెడతడంట ! మంచిది. రానివ్వండి ముందుకి !! సీ.యెం అయ్యే హక్కు ఒక్క రెడ్డి కులానికి, కమ్మ కులానికి రాసిపెట్టిన హక్కు ఏమీకాదుగదా. దక్షిణాన ఉన్న తమిళనాడులో ఇప్పటికే మూడువేల మున్నేట్ర-కజిగాలు రాజకీయంలో రాటుదేలి ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో రెంటితో సరిపెట్టుకోవడం ఎందుకు ?

ఎప్పుడో అరవై ఏళ్ళకిందట, తెల్లవాడిముందు అందరూ సమానంగా సిగ్గుపడింది ఎవ్వడికి గుర్తుంటుంది ? ఆ అవమానాలు భరించడానికి రెడ్డి/కమ్మ/కాపు తారతమ్యం ఏమన్నా అడ్డొచ్చిందా ? మన స్వాతంత్ర్యపోరాటంలో, అందరూ కలిసికట్టుగా ఎదురునిల్చాము గనకే చివరికి ఒక భారతీయత అనేది దక్కింది. ఇంత సాధించిందెందుకు ? అరవై ఏళ్ళ తరువాత కూడా ఇలాగ కులాలంటూ ఎలెక్షను గేములు ఆడుకోవడానికి మరి !

చిన్నప్పుడు “మ్యూజికలు ఛెయిర్సు” అంటూ మూడు ఛైర్ల చుట్టూ నలుగురం పరిగెట్టేవారము. మ్యూజిక్కు ఆగిపోవగానే అందరూ చైర్లమీద పడతారు. ఒక్కడుు అభాగ్యుడు చైరులేక బయటకి పోతాడు. ఈ ఆట ఆడగా ఆడగా, ఒక్క లక్కీ ఫెలోకి రాజభొగ్యం లాంటి ఆఖరి చైరు దొరుకుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తమాష ఒక పెద్ద కుల-మ్యూజికలు-ఛైర్సు ఆటలాగ ఉంది. ప్రజాస్వామ్యము అంటూ డాంభికాలు పోవడమే తప్ప, కొద్దిగానన్నా ప్రజలచే పాలన చేయించడం ఇప్పటి సరుకుగాదు. కనీసం ఒక టార్గెట్టు కూడా కాదు.

కళాకారులన్నాక ఒక ఆశయంకోసం పనిచేయడం పాతపద్ధతి. బుర్రలో ఏమీ ఉండనవసరంలేదు. మాటగడసరితనం ఉంటే చాలు, రైటర్లయిపోవచ్చును. భావ వ్యక్తీకరణా లాస్యం అక్కర్లేదు, కొంత ఎర్రగా-బుర్రగా ఉంటే చాలు, ఏక్టర్లయిపోవచ్చును. రాజనీతి తెలియనక్కర్లేదు, సరైన చుట్టరికాలుంటే చాలు, మినిష్టర్లయిపోవచ్చును. ఇదీ ప్రస్తుతం మన తెలుగు సమాజ సంపద.

సినీ అభిమాన సంఘాలు కులసంఘాలు. ప్రవాసాంధ్ర సంఘాలు కుల సంఘాలు. ఇప్పుడు చివరికి న్యూసుపేపర్లు కూడ కుల పేపర్లుగా తయారవుతున్నాయి. ఇలాంటి ఔన్నత్యం వెలగబోస్తున్నందుకు వారి వారసులను చూసి, మన స్వాతంత్ర్య సమరయోధులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు అక్కడ స్వర్గంలో !!

తెలుగువాడినైనందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఈ బ్లాగుముందు, నా నమస్కారాలని అందిపుచ్చుకున్న వారందరికీ ఇందుకని కృతజ్ఞతలు.

కుల అస్థిత్వం చీదరించుకుని నా నమస్కారం పుచ్చికోనివారికి నా ఆలింగనలు.

ఇది ముగింపు కాదు

గోకుల్ ఛాట్ లో సమోసా రగడా తినడం, సాయంకాలపు చిరుగాలిలో హుస్సేన్ సాగరం వీక్షించడం.. నాకున్న చిన్నపాటి సంపదలు. తీపి జ్ఞాపకాలు. ఇవేమీ ఎవ్వరినీ హాని కలిగించేవి కావే ! వీటిని ప్రేమించడమే పాపమైపోయిందా ?

నిన్నటి న్యూసులో చదివినది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నలభై మంది అకాలమరణం చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారు మరెంతోమంది. శరీరానికి కాకపోయినా, మనసుకి గాయాలైనవారు ఇంకెంతమందో !

ఏమిటీ అఘాయిత్యం ! మొన్నటికి మొన్న మక్కా మసీదులో బాంబులు. ఇప్పుడు నగరమంతా పేళుల్లు. ఎక్కడికి పోతోంది మన భాగ్యనగరం ? భారతదేశం ఆధునిక యుగంలోకి ముందడుగు పెట్టే కుడికాలు ఈ హైదరాబాదు నగరమని కలలు కన్నామే. ఈ కాలుని నరికేద్దాం అనుకుంటున్నారా ? ఎవ్వరు ఈ రాక్షసులు ?

మన నాయకులందరు కులాలు అంటూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. కమ్మ, రెడ్డి, కాపు .. ఎవిరికివారు వేరు పత్రికలు, వేరు రాజకీయ పార్టీలు, వేరు సినీ తారలు. వీటితో చాలదన్నట్టు మతం కోసం పార్టీలు (మజ్లిస్, భాజపా) తెలంగాణాఅంటు ఇంకొకళ్ళు (తెరాస) అమెరికాని ఎదిరించాలంటూ ఇంకొకళ్ళు (కమ్యూనిస్టులు) మన నాయకత్వ శిఖామణులు ఏమి సాధిస్తున్నారు ? ఎవ్వరిని సాధిస్తున్నారు ?

ఎక్కడో గుజరాతులో ఎలక్ట్రానిక్సు చదువుకుంటూ హైదరాబాదుకి టూరు వేసుకుని వచ్చారు విధ్యార్థులు కొందరు. అందులో నలుగురు మృతి. ఇంజనీరింగులో రాంకు తెచ్చుకుని, కాలేజీలో సీటు ఖరారు చేసుకుని అకాలంగా చనిపోయినవాడు ఇంకొకడు. మెడిసిను పూర్తి చేసుకుని దేశానికి వైద్యసేవలందించాల్సినవాడు ఇంకొకడు మృతి. రాఖీ కొనుక్కుందామని వెళ్ళిన అన్నాచెల్లెళ్ళు ఇద్దరు. కోఠీలో పుస్తకాలు కొనుక్కుందామని వెళ్ళి బలైన విద్యార్థులు ఇంకొందరు. సరదాగా గోకుల్ ఛాట్ తిందామనుకోవడమే పాపమైపోయిందా ? ఇలాంటి పసివాళ్ళను, భావి భారత ఆశాకిరణాలను చంపేసారు ఎవ్వరో ఈ రాక్షసులు !!

ఎవ్వరు మనకి ఈ ప్రప్రథమ శత్రువులు ? సర్వమత సామరస్యానికి వేదికై, పేదవాళ్ళు కూడా ప్రజాస్వామ్యం నిలుపుకోగలరు అని నిరూపించిన మన భారతదేశం అభివృద్ధిని చూసి ఓర్వలేని ఈ రాక్షసులు ఎవ్వరై ఉంటారు ? నాయకులమని చెప్పుకుంటున్నవారు కొంత బుర్రపెట్టి ఆలోచించాలి.
ఇది ఒక యుద్ధం. మన భారతదేశానికి స్వాతంత్ర్యం తేరగా రాలేదు. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలిన కూడా తేరగా రాబోదు. రాబందులలాంటి శత్రువులు ఎప్పటికీ కాపేసి ఉంటారు. ఈ బాంబు పేళుల్లు ముగింపు కాదు, ఇలాంటివింకెన్నో కష్టాలు మనం భరించక తప్పదు.

కులాలు, మతాలు లాంటి వేషమ్యాలు విడిచిపెట్టి మనం కొంత స్వాతంత్ర్య స్ఫూర్తిని చూపించాలి. ముఖ్యంగా హైదరాబాదులో ఉన్న ముస్లిం సోదరులని దగ్గర చేసుకోవాలి. ఇస్లాంకి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి అంతరంగానికి సంబంధించిన మతం. రెండోది పరుషమైన రాజకీయ రంగం. ఈ రెండింటినీ విడదీయాలి. ఇస్లాంతో రాజకీయం చేస్తున్నవారు అందరూ పాముతో చెలగాటమాడుతున్నవాళ్ళు. ఈ పార్టీలను వెంటనే నిర్మూలించాలి – మజ్లిస్ లాంటి పార్టీలను, స్టూడెంటు పార్టీలను, లైబ్రరీలు అంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న పార్టీలను అందరినీ నిర్మూలించాలి. ముస్లిం ప్రజలను ప్రథాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావాలి. ముస్లిం అవ్వడం భారతీయతకు ఏమాత్రం అవరోధం కాదని, వారందరూ పదహారణాల భారతీయులని నమ్మకం కలిగించాలి. లేదంటే ముస్లిం చంచా పార్టీలు – వెనకాల ఊపందించే పాకిస్తాను, బంగ్లాదేశు – ఆ చెంచాలకి పాలుపెట్టి పోషిస్తున్న అరేబియ, చైనా ఇంకా మిగతా దేశాలు – వాటికి ఆకర్షితులవుతారు. ఇది చెయ్యలేని పార్టీలు ఉండి దండగ. కులాలు అంటు కొట్టుకోవడం తప్ప నిజమైన శత్రువులని ఏమాత్రం ఎదిరించలేని చేతగాని దద్దమ్మలు మన రాజకీయ నాయకులు.

ఒకనాటి స్వాతంత్ర్య పోరాటంలో కులాలు అంటూ కొట్టుకుని వుంటే బ్రిటీషువారిని ఎప్పటికైనా ఎదిరించగలిగి ఉండేవాళ్ళమా ? టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి, అల్లూరి సీతారామరాజు లాంటివాళ్ళు కావాలి మనకి నాయకుల క్రింద.

రాజకీయాలకు ఆచార్యమండలి దూరంగా ఎలా ఉంటుంది ?

ఆచార్యమండలి గురించి నేను రాసిన ఇదివరకటి పోస్టుకి కొన్ని కామెంట్లు వచ్చాయి. వాటికి ఇక్కద సమాధనమిస్తున్నాను. ప్రత్యేకించి అందరూ అడిగిందేమిటంటే ఈ కొత్త ఆచార్య మండలి మాత్రం రాజకీయలకతేతంగా ఎందుకుంటుంది అని.

సో, ఇప్పుడు ఆచార్యమండలి గురించి ఇంకొంత వివరిద్దామనుకుంటున్నాను.

నేను ఆచార్యులను ఎంపిక చేసుకునేటప్పుడు ఎలెక్షన్లు పెట్టాలని అనలేదు. వీరిని ఎన్నికలకి, పార్టీలకి, రాజకీయాలకి సాధ్యమైనంత దూరంగా ఉంచాలని చెప్పాను. మరి వీరిని ఎలా ఎన్నుకోవాలంట ? ఒక యూనివర్సిటీలో ఆచార్యులకింద పనిచెయ్యడానికి ఎలా ఎంపిక చేసుకుంటారో అలా చెయ్యాలి అని నా అభిమతం. ఇది ఎలా జరుగుతుందంటే వచ్చిన దరఖాస్తులనన్నింటినీ ఒక సీనియర్ కమిటీ పరిశీలిస్తుంది. దరఖాస్తుదారుల అర్హతలేమిటి, అనుభవం ఏమిటి అని పరిశీలించి చూసిన తరువాత, కొంతమందిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. కేండిడేటు చేత ఒక ప్రసంగం కూడా ఇప్పించుతారు. అన్ని విధాలుగాను సరిపోతారనుకున్నాకనే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ప్రస్తుతం మన ఐ.ఏ.యెస్ అధికారులను ఎలా ఎంపిక చేసుకుంటున్నాం అలా చెయ్యాలి అన్నమాట. ఇలా చేస్తే, రాజకీయాల రొంపిలో రాణించేవారు వచ్చేస్తారోమోనని భయపడనక్కర్లేదు. కాని ఒక కామెంటులో, మన యూనివర్సిటీలు కూడా పోలిటిక్సుతో అఘోరిస్తున్నాయి కదా, ఒక వీ.సీ ని ఎంచుకోవాలి అన్నప్పుడు కులం, మతం ఇవన్నీ చూసే రికమెండేషన్లు ఇస్తున్నారు కదా అని పాఠకుడు అరుణ్ గారు అడిగారు.

నేను దీనికి సమాధనం చెప్పేదేమిటంటే, కాంపెటీషను ఉన్న తరువాత, ఇలాంటి గొడవలేమీ రాబోవు. ఉదాహరణకు, విదేశాలలో యూనివర్సిటీలు నిర్వహించే తీరు చూడండి. ఒక మంచి అభ్యర్ధిని కులం, జాతి వంతి ప్రాతిపదికల మీద నిరాకరించితే యూనివర్సిటీ నష్టపోతుంది. అతడు వేరే విద్యాలయానికి అప్లికేషను పెట్టుకుని ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఆ రెండో విద్యాలయం బాగుపడుతుంది. మనదేశంలోని యూనివర్సిటీలలో ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదంటే ప్రొఫెసర్లందరికీ తేరగా జీవితాంతం ఉద్యోగం అప్పగించి కూర్చోపెడుతున్నారు (వారు సరిగా పని చేసినా, చేయకున్నా) ఇదే పరిస్థితి స్కూళ్ళలోనూ కొనసాగుతోంది. అందుకే, మన విద్యావిధానం ఇలా అఘోరిస్తోంది.

వివిధ రాష్ట్రాలలో ఆచార్యమండళ్ళను పెట్టి, ఆచార్యులకింద పనిచేసే అవకాశం అన్ని రాష్ట్రాలవారికి సమానంగా ఇవ్వాలి. అప్పుడు, ఒక రాష్ట్రం మంచి అభ్యర్ధిని నిరాకరించితే ఇంకో రాష్ట్రం లబ్ధి పొందుతుంది. అంతేకాక ప్రతీ రాష్ట్రంలోనూ, ప్రజలు తమకు ఎవరైతే గర్వకారణంగా ఉంటారో అలాంటి వారినే ఎంచుకోవడానికి సుముఖత చూపుతారు.

ఈ ఆచార్యులకింద పనిచేసే వారికి అధికారాలు ఏమీ ఎక్కువ ఇవ్వరాదు. హంగులు, ఆర్భాటాలు కల్పించరాదు. తమకున్న అర్హతలతో వేరే ఉద్యోగాలు చేసుకుంటే వారికి బొలెడంత ధనం వస్తుంది. అయినా, కేవలం ఈ ఆచర్యమండళ్ళలో పనిచేస్తున్నారంటే కేవలం దేశభక్తి ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు.

ఇలాంటి పరిస్థితి కల్పించినప్పటికీ పనిచెయ్యటానికి సుముఖంగా ఉండే ఉద్ధండులు మనదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. మన దేశంలో దేశభక్తులకు కొదవేమీ లేదు. ఎంతో తెలివితేటలుండీ ఎం.బీ.ఏ చేసుకోకుండా ఐ.ఏ.యెస్ లకు ఎంతమంది ట్రై చెయ్యట్లేదు ? అట్లాగే, వివిధ రంగాలలో రాణించినవారు ధనవ్యామోహాలు విడిచిపెట్టి దేశసేవ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. అవకాశం ఇవ్వట్లేదంతే వారికి మన దేశంలో !

శాసనమండలి అనే బదులు ఆచార్యమండలి అని పిలిస్తే పేరులోనే హుందాతనం ఉంటుంది. ఈ మండలిలోని సభ్యులను “ఆచార్యా” అని గౌరవంగా సంబోధించాలి, అర్హతలు లేని వారు ఈ మండలిలో కూర్చుంటే ఈ పిలుపే వెక్కిరింతలా ఉంటుంది.

ఆచార్య మండలి అవసరం

ఇప్పుడు ప్రెసిడెంటు ఎన్నికల సందర్భంగా చాలా తమాషా జరుగుతోంది. మూడో ఫ్రంటు సడెన్ గా కలాం పేరు పైకి తెచ్చి ప్రెసిడెంటు పదవికి రాజకీయాలకు అతీతుడైన వ్యక్తి ఐతేనే బాగుంటుంది, విద్యావంతుడైన కలాంకి మళ్ళీ అవకాశం ఇద్దాం, అని మిగతా పార్టీలని అడిగింది. పైకి చెప్పేది ఏదైనా ఈ ప్రయత్నాలన్నీ ఉనికి పోతుందేమోనన్న గుబులుతో ఉన్న మూడో ఫ్రంటు స్వయం అస్థిత్వ తపనతో చేసిన యత్నాలే. మొత్తం మీద కలాం ఒప్పుకుని చివరకి ఖంగుతిన్నారు. కాంగ్రెసు పార్టీ ససేమిరా కలాంకి సపోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. ఇక లెఫ్టు పార్టీల సంగతి సరే సరి. వారి వాదన ఏమిటంటే ప్రెసిడెంటు పదవికి రాజకీయ ప్రవేశం ఉండి, రాజ్యంగం గురించి తెలిసిన వ్యక్తి అయితేనే మంచిది అని.

భారతీయులకి మాత్రం కలాం అంటే చాలా గౌరవం ఉంది. ప్రెసిడెంటు పదవికి ఔన్నత్యం తెచ్చి ఇచ్చేందుకు ఒక విద్యావంతుడిని నిలబెట్టడం అంటే పెక్కుమందికి ఇష్టం. రాజకీయలన్ని కుళ్ళుతో నిండిపోయాయని బహుళ జన అభిప్రాయం.

ఈ పోస్టులో నేను ఈ ముఖ్యమైన విషయంపై రాయాలని నిశ్చయించుకున్నాను. భారతదేశంలో ఒక మెరిటోక్రసీ (విద్యావంతులకు ఉన్నత పదవులను ఇచ్చే ప్రభుత్వం) ఉండటం వలన ఏమిటి ప్రయోజనం అనేది నా పోస్టు ఉద్దేశ్యం.

మన సంప్రదాయంలో ఉన్నత పదవులను ఒక ఆచార్యుడికి ఇవ్వడం అనేది పెక్కు తరాలుగా వస్తున్నది. రాజుల కాలంలో కూడా మంత్రి పదవికి ఒక ఆచార్యుడిని ఎన్నుకునేవారు. కీలకమైన విషయాలలో వారి అభిప్రాయం తీసుకోవడం, వాటిని గౌరవించడం అనేది ప్రభుత్వానికి మంచిది అని వారి నమ్మకం. మన ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంటు పదవి కూడా ఒక సలహాదారుణి పదవి వంటిదే. డైరెక్టుగా అధికారాలు ఏమీ లేకపోయినా, శాసన సభకి సూచనలివ్వడం, మార్గ నిర్దేశం చెయ్యడం ఉపన్యాసాలివ్వడం ప్రెసిడెంటు విధులు. ఆ పనులని కలాం అద్భుతంగా నిర్వహించారు. ఒక శాసనసభకే కాక దేశ ప్రజానికానికి కూడా మంచి ఉపన్యాసాలిచ్చారు. ఇటువంటి ప్రెసిడెంటు ఉండటం వలన దేశంలోని ప్రజలందరికి ఎంతో గర్వకారణం.

మన దేశంలో విద్యావంతులందరూ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు. దేశానికి సేవ చెయ్యాలన్న తపన ఉన్నా, రాజకీయల కుళ్ళు లో ముందుకు సాగలేమన్న నిజం అందరికీ తెలుసు. మన దేశం ప్రస్తుతం ఎందరో దేశభక్తుల సేవలను ఈ విధంగా కోల్పోతోంది. చాల మంది తెలివైనవారు విదేశాలకు వలస పోతున్నారు. ఇటువంటి ఉన్నత విద్యావంతుల సేవలను దేశానికి రప్పించాలంటే ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధించలేము. మన ఎన్నికలన్నీ కుల, మత రాజకీయల కంపులో మగ్గిపోతున్నాయి. అమాయకులైన ప్రజానికం వారి ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించలేకపోతోంది.

ఇటువంటి సమయంలో ఒక జనరంజకమైన ఆలోచన విద్యావంతులకు రాజ్యనిర్వహణ అధికారాలను ఇవ్వడం. కానీ, ప్రజాస్వామ్యానికి కట్టుపడ్డ మనం అటువంటి పరిస్థితిని కల్పించలేము. పదవిలో ఉన్నవారు ఎలాంటి వారైనా దుర్వినియోగం చెయ్యగలరు. కానీ, గౌరవప్రదమైన సలహాదారుని పదవులలో అధికార దుర్వినియోగానికి అవకాశమే ఉండదు. అటువంటి పదవులకుకు విద్యావంతులను ఎంపిక చెయ్యడం అనేది అద్భుతమైన ఆలోచన. అది మన భారతీయ సంప్రదాయానికి చెందిన పద్ధతి.

ప్రస్తుతం, మన ప్రజాస్వామ్యంలో రెండు సభలు ఉన్నాయి – మొదటిదైన శాసన సభలో ప్రజా ప్రతినిధులు ఉంటారు. వీరు ఎన్నికలలో ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నుకోబడినవారు. రాజ్య నిర్వహణ అధికారాలన్నీ వీరి చేతుల్లోనే ఉంటాయి. కానీ, రెండవదైన శాసన మండలిని మనం సరిగా వినియోగించుకోవటం లేదు. ఈ రెండవ సభ ముఖ్య విధులు మొదటి సభకు దిశానిర్దేశం చెయ్యటం, తప్పులను సవరించటం. ఇటువంటి సలహాదారుని విధులు కలిగిన ఈ సభకు ఉత్సాహవంతులైన విద్యావంతులను ఎంచుకోవడం అనేది ఒక మెండైన ఆలోచన. ఈ మండలి సభ్యుల కింద పెక్కురంగాలలో బాగా రాణించినవారిని తీసుకోవడం జరగాలి. వీరిని రాజకీయాలకు, పార్టీలకు, ఎన్నికలకు సాధ్యమయినంత దూరంగా ఉంచాలి. అధికారాలు డైరెక్టుగా ఏమీ లేనందువల్ల, అధికార దుర్వినియోగం జరుగుతుందేమో అని భయపడనవసరం లేదు. కాని, ఇటువంటి విద్యావంతులు ఆచార్యుల వలే ఉపన్యసిస్తూ, ప్రజలందరికీ (ముఖ్యముగా మొదటి సభలోని ప్రజా ప్రతినిధులకు) దిశా నిర్దేశం చెయ్యగలరు. సామన్యముగా జనాలకు తెలిసి లేకపోయినా, ఈ విధముగా పరిచయం కాగలరు. అప్పుడు, వీలైతే డైరెక్టుగా ఎన్నికలకు కూర్చోగలరు, శాసన సభకు ఎంపిక కాగలరు.

ఈ విధంగా మన రాజకీయల లోని కుళ్ళును నిర్మూలించవచ్చు.

శాసనమండలికి ఎంపిక కావాలంటే, వారి వారి తెలివితేటల మీద మాత్రామే ఆధారపడాలి. ఆచార్య సమోన్నతులైన వీరు, విద్యాలయాలలో ఆచార్యులు ఏ విధముగా ఎంపిక కాగలుగుతారో ఆ విధముగా మండలికి ఎంపిక కాగలగాలి. ప్రస్తుతం విద్యాలయాలో, ఆచారులను ఎంపిక చేసేటప్పుడు వారి సీ.వీ, ఎక్స్పీరియెన్సు మొదలైన అర్హతలను చూసి ఉన్నతపదవలులోనున్న ఆచార్య మండలి ఎంపిక చేస్తుంది. ఇదే విధంగా, శాసనమండలిని ఏర్పాటు చెయ్యాలి.

ప్రస్తుతం ఐ.ఏ.యెస్ మొదలైన విధులకు పరీక్షల ద్వారా విద్యావంతులను ఎంపిక చేసుకుంటున్నారు. కానీ, వీరు కేవలం రాజ్య నిర్వహణ యొక్క పనులను చెయ్యటంలో ఉద్యోగులకింద వ్యవహిరించుటకు మాత్రమే. అందుకని, ఈ విధమైన నిర్వహణావిద్యలను, నైపుణ్యాన్నీ పరిగణలోకి తీసుకుని వీరిని సెలెక్టు చేసుకుంటున్నాము. కాని, నేను చెప్పిన ఈ శాసన మండలి ఆలోచన దీనికి సంబంధించినది కాదు. దీనికి సమాంతరంగా, కేవలం సలహాదారుని పదవిలో మొదటి సభకు సూచనలు చెయ్యడం గురించి నేను దానిని ప్రస్తావించాను.

రాష్ట్రాలలో ఈ విధమైన శాసనమండళ్ళను, కేంద్రంలో ఆచార్యసభను (ప్రస్తుతం రాజ్య సభగా ఉన్నది) ఏర్పాటు చెయ్యాలి. ప్రెసిడెంటు పదవికి కేవలం ఈ ఆచార్యమండళ్ళలో పనిచేసిన వారిని మాత్రమే ఎన్నుకోవాలి. వీలైతే, ఈ ఎన్నికను ప్రజలందరిచేతా జరిపించాలి. మన రాజ్యాంగానికి ఈ విధమైన సవరణ తీసుకురావడం అనేది తప్పనిసరి.