ఉష్ట్రపక్షి అంటే నిప్పుకోడి, ఆస్ట్రిచ్ పక్షి. దీని గురించి ఒక వింతైన నానుడి ప్రచారంలో ఉంది. ఎప్పుడైనా క్రూరమృగాలు వేటాడుతున్నాయేమోనన్న భయం వేస్తే, ఇది మహా తెలివిగా తన బుర్రకాయని ఇసకలో దాచేసుకుంటుంది. తనకి ఏమీ కనపడకపోతే, తను ఎవ్వరికీ కనపడనేమోనని దాని ధైర్యం. ఇది కేవలం నానుడి అయినా, మన తెలుగుభాషని రక్షించుకోవడం కోసం భాషాభిమానుల పాట్లని ఈ విధంగా వర్ణించక తప్పదు.
మొన్న మాతృభాష ఉత్సవాలు అని ఏదో హడావుడి నడిచింది. పనిలోపనిగా, పత్రికలన్ని ఎవరికో పురమాయించాయి – తెలుగు ఉద్ధరించడం ఎలా అంటూ వ్యాసాలు వ్రాయండంటూ. మనవాళ్ళు వివిధ రకాలుగా రెచ్చిపోయారు. మూల సారాంశం ఏమిటంటే, ప్రభుత్వం ఏదో నడుం బిగించాలి, శాసనసభల్లో తెలుగు మాట్లాడాలి, జివోలు తెలుగులో జారీ చెయ్యాలి, తెలుగు మీడియంలో పిల్లలని చదివించెయ్యాలి. ఇలా చేస్తే మన తెలుగు విరాజిల్లుతుందంట. ఉష్ట్రపక్షులకి ఒకసారి జిందాబాద్.
దేశ ఆర్థిక పరిపుష్టికి ఒక తలమానిక తలసరి ఆదాయం. అలాగే, ఒక భాష యొక్క పరిపుష్టికి సరైన తలమానిక తలసరి-సాంస్కృతిక-దిగుబడి. కృష్ణదేవరాయలు పాలించిన స్వర్ణయుగంలో, తెలుగు భాష ఒకానొక ఉచ్ఛదశకి చేరిందనుకుందాం. అప్పుడు, తెలుగువాళ్ళు ఎంతమంది ? మచ్చుకి జనాభా 30 లక్షలకి మించదు. ప్రస్తుతం దీనికి 30 రెట్లు ఎక్కువమంది ఉన్నాం. అంతాకలిపి 8 కోట్లకి పైమాటే మన జనాభా. కేవలం జనాభా ఒకటే కాదు, సగటు మనిషి ఆదాయం/జీవనా విధానం కూడా 30 రెట్లు మెరుగైంది. అతిముఖ్యంగా, జనాభాలో అక్షరాస్యత శాతం 30 రెట్లు మెరుగైంది. ఈ మూడు దిశలని కూడిపెట్టుకుంటే, మన తెలుగు కళాకారుల దిగుబడి 30*30*30 = 27,000 రెట్లు పెరగాలి. కానీ, మొత్తం దిగుబడి అప్పటితో పోలిస్తే ఇంకా తగ్గువగా కుదించుకుపోయింది. అందులోనూ, కళ యొక్క నాణ్యత ఎంత ఉంది అంటే ముక్కుపై వేలేసుకోవాలి.
పత్రికలకి పత్రికలు, టీవీలకి టీవీ ఛానళ్ళు, సినిమాలకి సినిమాలు, సంగీతానికి సంగీతం – మన సంస్కృతిలో నాణ్యత అనేది మృగ్యం. తెలుగు అనేదే ఈ అఘోరమైన పరిస్థితిలో ఉంటే, “మీ కోస్తా తెలుగు మా తెలంగాణ తెలుగుని దెబ్బతీస్తోంది”, అని వాపోతున్నారు మన సోదరులు కొంతమంది. మొత్తం (కోస్తా తెలుగు + తెలంగాణ తెలుగు )దిగుబడిని మన జనాభాతో భాగించుకుంటే వచ్చే సంఖ్య 0.0000001
పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించాలంటే, ఒకసారి ఇంగ్లండు దేశంతో మనల్ని పోల్చి చూసుకుందాం. కేవలం ఇంగ్లండు వారి జనాభా 6 కోట్లు (మన తెలుగు వారికంటే తక్కువమంది). కళా-సాంస్కృతిక రంగాలలో వారి దిగుబడి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఈ చిన్న దీవి నుండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పత్రికలు (టైంసు, గార్డియన్), టీవీ ఛానళ్ళు (బీ.బీ.సీ) పాప్ గాయకులు (బీటిల్స్, పింక్ ఫ్లాయిడ్, లెడ్ జెప్పెలిన్ …) నటులు (ప్రస్తుత ఆస్కారు విజేత సహా), రచయితలు, విద్యాలయాలు (ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జి) – ఏ విధంగా చూసినా తలసరి-సాంస్కృతిక-దిగుబడి మన తెలుగువారికి పోల్చి చూస్తే 1,000,000 రెట్లు అధినంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది ?
ఇలాంటి అతి భయంకర ప్రమాదంలో మన భాష ఉంటే, మనవాళ్ళు ఉష్ట్రపక్షులకి మల్లే గవర్నమెంటు అనే ఇసకలో వాళ్ళ తలకాయలని దూర్చేసుకుని ఏదో గట్టెక్కేస్తామని అనుకుంటున్నారు.
తెలుగుకి ప్రాచీనభాష హోదా ఇవ్వాలంట. ఇది మూల కోరిక. అంటే, ఏదో పురాతత్వ శాస్త్రం చదువుకునేవాళ్ళు తవ్వకాలు చేసుకోవడానికి మన తెలుగుని అప్పగించాలన్నమాట. ఆ పై,గవర్నమెంటు జీవోలని తెలుగులో వ్రాయించాలంట. ఇంగ్లీషు మీడియం బడులని మూయించెయ్యాలంట. గవర్నమెంటు ఎన్ని రకాలుగా ఇసకలో తల దూర్చగలదో, అన్ని రకాలుగాను దూర్చాలంట. ఇలా చేస్తే, మన తెలుగుకున్న ఆపద పోతుందంట. తలసరి-సాంస్కృతిక-దిగుబడి తిరిగి వర్ధిల్లుతుందంట. ఇలాంటి వాళ్ళతో పోలుస్తున్నందుకు, ఉష్ట్రపక్షులు ఎంత ఫీల్ అవతుంటాయో !
ఏమన్నా పోలిక చూసుకోవాలంటే, మనవాళ్ళకి దక్షిణాన అరవం, పశ్చిమాన కన్నడం మించి కనపడదు. అక్కడ ఛాందసులు ఏదో భాషా సేవ చేసేస్తున్నారు – దుకాణాల సైను బోర్డులని తిరగరాసేస్తున్నారు, బస్సుల నంబర్లని తిరగరాసేస్తున్నారు .. ఎక్కడో మనం వెనకపడిపోతున్నాం అని బెంగ. నేను చెప్పిన తలసరి-సాంస్కృతిక-దిగుబడి లో అటు కన్నడం కానీ, ఇటు తమిళం కానీ మనకన్నా ఏమన్నా ముందంజలో ఉన్నాయా ? ఉహుం, అంత సీనులేదు. మనమందరం ఒకే లెవెల్లో ఉన్నాం.
ప్రపంచంలో ఇంగ్లీషు తప్ప మిగతా భాషలన్నీ మనలాగే అంతరించిపోతున్నాయా ? లేదు. జపనీసు భాషలో కామిక్సు చదువుకోవడానికి అమెరికాలో జపనీసు నేర్చుకుంటున్నారు. స్కాండినావియా దేశాలలో రాక్-సంగీతం అర్థం చేసుకోవడం కోసం జపానులో స్వీడిషు భాష నేర్చుకుంటున్నారు. ఈ దేశాల్లో, ఇంగ్లీషు భాషని బహిష్కరించారా ? లేదు. స్వీడన్లో, ఇంగ్లీషుని ప్రతీ ఒక్కరు యాస కూడా లేకుండా మాట్ళాడగలరు. టీవీ లో ఇంగ్లీషు కార్యక్రమాలే అనువాదం లేకుండా చూస్తారు. మరి అయినా, వారి భాషలో ఎలాగ సంస్కృతి పరిఢవిల్లుతోంది ? తలసరి-సాంస్కృతిక-దిగుబడి ఎలాగ ఉరకలు పరవళ్ళు వేస్తోంది ?
కారణం తెలుసుకోవాలంటే, భాషని పక్కని పెట్టి, తెలుగులో కానివ్వండి / హిందీలో కానివ్వండి / చివరికి ఇంగ్లీషులో కానివ్వండి. అసలు మనదేశంలో తలసరి-సాంస్కృతిక-దిగుబడి ఎంత ? ఇంచుమించు సున్న. దోషం అక్కడ ఉంది. భాషలో కాదు. కళాకారులు విజృంభించితే, మేఘాల నుండి అమృతవర్షం కురిసినట్టు. భాషలు నదులవంటివి. వాన పడగా, నదులన్నీ ఒకేసారి నిండుతాయి. భూమి పులకరిస్తుంది. వాన పడనంత కాలం కరువు తప్పదు.
వరుణుడు అనుగ్రహించాలంటే, మనం ఏమి చెయ్యాలి ? బస్సులపై తింగర-తింగరగా నంబర్లు రాస్తే సరిపోతుందా ? గవర్నమెంటు జీవోలు జారీ చేస్తే సరిపోతుందా ? తెలుగుకి ప్రాచీన హోదా కల్పించితే సరిపోతుందా ?
ఒకసారి ఉష్ట్రపక్షి వైనం విడనాడి ఇసక నుండీ తల బయటకి తీస్తే, ప్రమాదం ఎక్కడుందో గమనిస్తే, బయటపడడానికి మార్గం ఇట్టే అగుపడుతుంది.
- కళాకారులకి ప్రోత్సాహం కల్పించాలి. డబ్బులు వెచ్చించాలి.
- కళామందిరాలు స్థాపించాలి.
- విద్యాలయాల్లో రచన, నటన, సంగీతం, చిత్రలేఖనం – మొదలైన కళలు అభ్యసించేవారికి సరైన మొత్తంలో స్కాలర్షిప్పులు కల్పించాలి. ఒక్క తెలుగు డిపార్టుమెంటుకి మాత్రమే కాదు
- కళాత్మక సినిమాలు తియ్యడానికి ప్రభుత్వం/ప్రజలు డబ్బులు వెదజల్లాలి.
- రచయితలకి సంపాదనా మార్గం కల్పించాలి. ఉదాత్తమైన పత్రికలు స్థాపించాలి.
- ఇంటర్నెట్టు యుగంలో ప్రజలు ఒకరితో ఒకరు సుళువుగా తెలుగులో మాట్లాడుకునే సౌకర్యం కల్పించాలి.
- డిస్కషన్ బోర్డులు ఏర్పడాలి.
- తెలుగు పాఠకులను తెలుగు కళాకారులకు దగ్గర చెయ్యగలగాలి.
ఒక భాషకి అవశేష దశ నుండి సంపూర్ణంగా పునరుజ్జీవన చేసిన ఘటన ఇజ్రాయెల్ దేశంలో ఒకటి జరిగింది. నాజీల వేధింపుల నుండి బయటపడి ఇజ్రాయెల్ కి వచ్చిన యూదులకు, వారి సంస్కృతిపై విపరీతమైన ప్రేమ కలగడం సహజం. కానీ, హీబ్రూ భాషని వారు పునర్మించిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యున్నతమైన వారి శాస్త్రవేత్తలు శాస్త్ర-సంబంధిత-పదాలను హీబ్రూవే వాడతారు. వారి కళాకారులు హీబ్రూలోనే సంగీతం ఆలపిస్తారు. కేవలం 70 యేళ్ళ క్రిందట, పురాతనమైన తాల్ముడ్ గ్రంథాల ఆథారంగా ఈ భాషని ఇటకపై-ఇటక వేసి నిర్మించారు అంటే మరి ఆశ్చర్యం కలగదా ? ఇజ్రాయెలీలు చేసిన మొదటి పని వారి భాషకి ఒక ఆధునిక నిఘంటువు నిర్మించడం. ఈ నిఘంటువును ప్రతీ ఏడాది తాజాకరించడం. రెండవ పని ప్రజలు హీబ్రూలో మాట్లాడాలి – ఇది ఒక ఆత్మగౌరవప్రదమైన విషయం – అని అందరూ భావించడం.
ఇప్పుడు మన తెలుగులో మాట్లాడాలన్న ఆశ ఉన్నా, ప్రక్కవాళ్ళతో మాట్లాడడానికి పనికివచ్చే ఒక నిఘంటువు లేదు. మనతో చర్చ సాగించడానికి ప్రస్తుతం శ్రీనాథుడు, లక్ష్మణకవి మన ముంగిట్లో తిష్టించుకుని లేరు కదా ! మరి, మన నిఘంటువులు ఇంకా అదే భాష పట్టుకుని వేలాడుతున్నాయేమిటి ? ఈ నిఘంటువులు పనికివచ్చేది ఎవరికి ? పాప్ సంగీతం వ్రాద్దామనుకుంటే పనికివస్తాయా ? తెలుగులో అద్భుతమైన ఉపన్యాసం ఇద్దాం అనుకుంటే పనికివస్తాయా ? ఒక శాస్త్ర-సంబంధమైన వ్యాసం వ్రాద్దాం అంటే పనికివస్తాయా ? కళాకారులకి ఒక నోరు ఇవ్వకుండా నొక్కిపెట్టి, ఏదో భాషని ఉద్ధరించేద్దాం అనుకుంటే ఏమి సాధించగలం చివరికి ?
మన ఆర్థిక మంత్రి రోశయ్య ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్టు అక్షరాలా లక్ష-కోటి రూపాయలది. పాకీస్తాను దేశం బడ్జెట్టుని మించిన లెవలు అది. మన తెలుగువారికి డబ్బు లేమి ఏమీ లేదు. ఇదిగాక, ప్రవాసాంధ్రుల సంపాదన కూడా కలిపి చూస్తే, మనం ఎంతో ఔన్నత్యంలో ఉన్నవాళ్ళం. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో సగం మంది మన తెలుగువాళ్ళు ! మన పరిస్థితి 70 ఏళ్ళ క్రిందటి ఇజ్రాయెల్ పరిస్థితితో పోల్చిచూస్తే, అమోఘంగా ఉంది. కానీ, వాళ్ళు సాధించినట్టు మనం ఆ అద్భుతాన్ని సాధించగలమా ?
ఉష్ట్రపక్షులని అడగాలి సమాధానాల కోసం !