Tag Archives: నీరు

నీరు, న్యూక్లియర్ విద్యుత్తు రిఫరెన్సులు

జాన్ మెక్కార్థీ స్టాంఫోర్డు యూనివెర్సిటీలో ప్రొఫెసరు. ఈయన కృతిమ మేధస్సు రంగంలో చాలా కృషిచేసారు (LISP భాషను ఈయనే కనుగొన్నారు). ప్రస్తుతం మానవాళి భవిష్యత్తు మీద రచనలు చేస్తూ విజ్ఞానాన్ని ప్రజలకి అందిస్తున్నారు.

ఈయన స్వచ్ఛమైన నీటి అందుబాటు గురించి ఇక్కడ వివరిస్తున్నారు.

న్యూక్లియర్ విద్యుత్తును ఈయన చాలా ప్రోత్సహిస్తున్నారు. దీనిపై ఎంతో వివరంగా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈయన మిత్రుడు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గులో ఫిజిక్సు ఆచార్యుడు అయిన బెర్నార్డు కోహెన్ గారు న్యూక్లియర్ విద్యుత్తు గురించి మరింత వివరంగా ఒక పుస్తకం రచించారు. దీంట్లో ప్రజల భయాలకు నివృత్తిగా ఎంతో సమాచారం పొందుపరిచారు. ఈయన ప్రకారం మన భూమిలోని న్యూక్లియర్ నిల్వలు కొన్ని బిలియన్ సంవత్సరాలు మనుషుల అవసరాలకు సరిపోతాయి !

శాస్త్రవేత్తలు ఇలాగ గణాంకాలతో శ్రద్ధగా వివరిస్తారు. రాజకీయవేత్తలు ప్రజలను భయపెట్టడమేగానీ ఇచ్చే వివరాల్లో నిజాయితీ ఉండదు. ఏది ఏమైనా, మనిషి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంకెలతో ఆలోచించాలి గానీ ఫీలింగులతో కాదు.

150 కోట్ల భారతీయులకి నీరు ఎక్కడ ?

కర్ణాటక, తమిళనాడు సినీతారలు ఒకళ్ళినొకళ్ళు తిట్టుకుంటున్నారు. తెలంగాణకి నీరందనివ్వకుండా ఆంధ్రా వాళ్ళు కాజేస్తున్నారని కొందరు గొంతు చిచ్చుకుంటున్నారు. మహానగరాల్లో ప్రజలు నీరు లేక బిందెల వెనక బిందెలు పెట్టీ ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఈ ఏడాది అందరికీ నీరు దొరుకుతుందా ? ఉగాది రోజున పంచాంగం ఈ ప్రశ్నకి సమాధానం చెబుతుందేమో చూద్దాం.

నీటి కొరత పరివృత్తి :

మనిషికి గాలిలోని ఆక్సిజన్ తరువాత అతి ముఖ్యమైనది నీరు. శరీరంలో 65% నీరే. త్రాగడానికి మాత్రమే కాదు, పారిశుద్ధ్యానికి, ఆహారం కోసం వ్యవసాయానికి, పరిశ్రమలకు, విద్యుత్ ప్లాంట్లకు – అన్నింటికీ స్వచ్ఛమైన నీరే కావాలి. ఒక మనిషి ఏడాది జీవించడానికి సరిపడా ఆహారం, త్రాగునీరు, పారిశుద్ధ్యం సమకూర్చడానికి 1700 క్యూబిక్ మీటర్ల స్వచ్ఛమైన నీరు అవసరం. మన భారతదేశంలో ప్రస్తుత జనాభా 100 కోట్లకి పైమాటే. అయినా, ప్రస్తుతం మనదేశంలో ఉన్న స్వచ్ఛనీటి వనరులు ప్రతి ఒకరికి ఏడాదికి 1800 క్యూబిక్ మీటర్లు సమకూరుస్తున్నాయి. నీటి విషయంలో మన దేశం అత్యద్భుతమైన ధనిక దేశం అన్నమాట.

ఈ నీటి ధనరాశుల వల్లే చరిత్ర శాంతం మనదేశంలో నాగరికత పరిడవిల్లింది. చరిత్ర అంతా, ప్రపంచంలో 1/5 మానవజాతి భరత ఖండంలోనే నివశించేవారు. మన దేశ వైశాల్యం చిన్నదైనా ఇలాగ జరగడానికి కారణం మన నీటి సంపద. మన దేశంలో వ్యవసాయానికి యోగ్యమైన సాగుభూమి 558,080 చదరపు కిలోమీటర్లు. దీంట్లో మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఉదాహరణకు, చైనాలో 545,960 చ.కిలు, అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో 223,850 చ.కిలు, అతిపెద్ద దేశమైన రష్యాలో 46,000 చ.కిలు. మన దేశ వైశల్యంలో కళ్ళు చెదిరేటట్లు 48% భూమి పంటలకు యోగ్యమైన భూమి – దీనికి కారణం మన నదీ సంపద.

కానీ, రానున్న ఏళ్ళలో ఒక ఉపద్రవం ముంచుకు రాబోతోంది. జనాభా పెరుగుదల వల్ల ఒక మనిషికి కనీస అవసరమైన 1700 క్యుబిక్ మీటర్ల నీటిని ఇక మన నదులు,వర్షపాతాలు సమకూర్చలేవు. తరువాయి 20 ఏళ్ళలో సగటు మనిషికి లభ్యమయ్యే నీరు 1000 క్యుబిక్ మీటర్లకి కుదించుకుపోతుంది. 21వ శతాబ్ది మధ్యమానికి మన దేశజనాభా 150 కోట్ల నుండి 180 కోట్ల మధ్య స్థిరపడుతుంది. అప్పుడు మనదేశం తీవ్రమైన 30% నీటికొరతని ఎదుర్కోబోతోంది.

నీటి కొరత వల్ల ప్రత్యక్ష పరిణామం దప్పిక కాదు, ఆకలి. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలు ఇక కిందకి దిగిరావు, పైగా మరింత పెరుగుతాయి.

మన నీటి అవసరాలలో అత్యధిక భాగాన్ని మింగివేసేది వ్యవసాయమే – ఉదాహరణకి యమునా నదిలో 85% నీరు వ్యవసాయ భూములకే వెళుతోంది. దీనివలన, ఢిల్లీ నగరంలోని జలాశయాలకి యమున నీరు ఇవ్వలేకపోతోంది. మన రాజధానిలో పారిశుద్ధ్యానికి సరిపడా నీరులేక విపరీతమైన కుళ్ళు, కాలుష్యం మోతబడుతున్నాయి. ఇదే కథ ప్రతీ మహానగరంలోనూ పునరావృతమవుతోంది. పారిశుద్ధ్యం లేకపోవడం వలన చాలా రోగాలు మరలా మనదేశంలో విజృంభించుతున్నాయి.

నదులకు సంస్కృతికి సమానతను గుర్తించిన దేశం మనది. పురాతనమైన సరస్వతీ నదీ తీరాననే మొహెంజొదారో నాగరికత వెలసింది. ఈ నాగరికత వెలసింది సింధులోయలలో కాదు సరస్వతీ తీరాన. భౌగోళిక మార్పుల వల్ల ఆ మహానది ఎండిపోయింది. నాగరికత అంతా ధ్వంసమైపోయింది. కానీ, భారతీయులు ఈ నదిని మరచిపోకుండా తమ విద్యా దేవతకి సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు, మన తరంలో నదులు ఎండిపోవడం వలన ఇండియానే అంతరించిపోయే ప్రమాదంలో పడింది. అలనాటి సరస్వతీ-నాగరికతకి వారసులు తప్పులు తెలుసుకుంటారో, లేదో మరి !

నీటి కొరతకి కారణాలు :

ప్రథమ కారణం జనాభా యొక్క విచ్చలవిడి పెరుగుదల. వేదాలు రచించిన కాలంలో మన దేశ జనాభా 40వేలు. స్వతంత్రం నాటికి 25 కోట్లు. గత 60 ఏళ్ళలో ఇది అతి ఘోరంగా 100 కోట్లయ్యింది. మరో 50 ఏళ్ళకి 180 కోట్లు కాబోతోంది. ఈ పెరుగుదల చిత్రాన్ని బీ.బీ.సీ లో గమనించండి. మొదట్లో మన జనాభాకి సరిపడే ఆహారం అందివ్వడానికి భూమి సరిపోదనుకునేవారు. కానీ, హరిత విప్లవం వల్ల పంట రాబడి బాగా పెరిగింది. భూమి కొరత ప్రస్తుతానికి ఒక అంశం కాదు. కానీ, నీటి కొరత ఖచ్చితంగా దెబ్బకొట్టబోతోంది.

మనదేశంలో నీరు సరిసమానంగా లేదు. మేఘాలయలో 2818 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండగా, రాజస్థానులో 100 మిల్లీమీటర్లే. ఈ వైవిధ్యం వలన నీటి కొరత ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఎదురవుతోంది.

నీటి సమస్యపై మన దేశంలో సరైన అవగాహన లేదు. ఢిల్లీలో మంచి నీటి పంపులలో కన్నాల వల్ల 40% నీరు నేలపాలవుతోంది. ఇదే ధోరణి చాలా చోట్ల ఎదురవుతోంది. ప్రజలు కూడా నీటిని వృధాగా పారబోస్తున్న ఉదంతాలు చాలా ఎక్కువ.

జనాభా పెరుగుదలతో పాటు నీటి లభ్యతని దెబ్బతీస్తున్న మరో అంశం గ్లోబల్ వార్మింగు. భూమి ఉష్ణోగ్రత పెరగడం వలన హిమనదాలు కరిగిపోతున్నాయి. జీవనదులకి నీరు తగ్గిపోతోంది. భూమిలోని నీటిలో మరింత భాగం ఆవరి రూపంలో ఉండిపోతోంది.

ఆర్థిక వృద్ధి వలన మధ్య తరగతి ప్రజలు తినే ఆహారం విషయంలో కూడా మార్పులు వస్తున్నాయి. మునుపటికంటే ప్రజలు మరింత ఎక్కువ మాంసాహారం తింటున్నారు. మాంసానికి అవసరమయ్యే నీరు శాకాహారానికంటే చాలా ఎక్కువ (6-7 రెట్లు ఎక్కువ). ఉదాహరణకి, ఒక కిలో గొడ్డుమాంసం తయారి చెయ్యడానికి 15,500 లీటర్ల నీరు పడుతుంది. మాంసాహారం తింటున్నప్పుడు ప్రజలు ఈ విషయం గమనించరు.

నీటి కొరత వల్ల రాజకీయ పరిణామాలు :

ప్రస్తుతం ప్రపంచంలోని యుద్ధాలలో పెక్కువాటికి నీటి కొరతే కారణం. ఇజ్రాయెలు-పాలస్తీను సమస్య మూలం జలాశయాల ఆజమాయిషీ రాజకీయంలో ఉంది. సుడానులోని మారణకాండ వెనుకా ఇదే కారణం. ఆఫ్రికాలో వర్షపాతం తక్కువ నమోదు అయినప్పుడు యుద్ధాలు ఖచ్చితంగా పెరుగుతున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

పాకిస్తాను, బంగ్లాదేశు, చైనాలతో ఇప్పటికే నీటి వినియోగంపై గొడవలు ముదురుతున్నాయి. దీనికంటే తీవ్రంగా, విపరీతమైన వైవిధ్యం ఉన్న మన దేశంలో నీటికొరత భయంకరమైన విచ్ఛిన్నతలకి దారితీసి దేశాన్ని ముక్కలు చెయ్యగలదు.

జనాభా పెరుగుదల మనదేశంలో సమానంగా లేదు. దక్షిణాన, కుటుంబంలో సగటున 2.2 పిల్లలను కంటుండగా, ఉత్తరాన కొన్ని రాష్ట్రాలలొ 6 పిల్లలను కంటున్నారు. దీనికి, మూల కారణం నిరక్షరాస్యత, విద్యలేమి. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలలో ఇప్పటికే జనాభా మించిపోయి ఉండడంతో ఎందరో ఉపాధి కోసమై ముంబాయికి, పంజాబుకి, దక్షిణానికి తరలి వస్తున్నారు. ఈ కాందిశీకుల వల్ల రాజకీయాల్లో చాలా అసూయ, అలజడి పుడుతోంది. ముంబయి లోని రాజ్ థాకరే అల్లర్లకి ఇదే కారణం. ఇలాంటి గొడవలు మరీ ఉధృతమవ్వగలవు.

టెక్నాలజీ పరిష్కారాలు :

దేశంలో నదులని అనుసంధానం చెయ్యడం వలన నీటి కొరతని కొంతవరకు తగ్గించుకోగలమని కొంతమంది శాస్త్రవేత్తల అంచనా. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ మొత్తంలో నిధులని మంజూరు చెయ్యడం మొదలు పెట్టింది. వరదల సమయంలో తేరగా సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను మిగతా నదులకి మళ్ళించాలనేది క్లుప్తంగా దీని ఐడియా.

కానీ పర్యావరణం అనేది చాలా క్లిష్టమైనది. ఒకదానితొ మరెన్నో అంశాలు ముడివడి ఉంటాయి. ఉగ్రమైన బ్రహ్మపుత్ర, గంగా వరదల వల్ల బంగాళాఖాతంలో స్వచ్ఛమైన నీరు ఎంతో చేరుతోంది. దీని వలన సముద్రం యొక్క ఆవిరి మబ్బులు ఏర్పడడం జరుగుతోంది. ఈ వరదలు కలగకపోయినట్లైతే, ఈ మబ్బులు ఉండకపోవచ్చు. మనదేశంలో ఋతుపవనాలు దెబ్బతినవచ్చు. ఈ విషయంపై పర్యావరణ శాస్త్రవేత్తలకు ఇంకా సంపూర్ణ అవగాహన లేదు.

భూమిలోపల నిలవ ఉండే ఇంకుడు నీళ్ళు మరొక పరిష్కారం. వీటిని మరింత అనువుగా ఉపయోగించుకోవాలి. వర్షపు నీరు భూమిలోకి సరిగ్గా ఇంకేటందుకు శాస్త్రీయమైన ఇంకుడు గుంటలు తవ్వించాలి. నదులలోని నీటి కొరతను కొంత అప్పుడు తట్టుకోవచ్చు.

పంట పొలాలలో మనం ప్రస్తుతం నీటిని సరిగ్గా వాడటంలేదు. పెక్కుభాగం వృధా చేస్తున్నాము. ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా కలపడం వలన చాలా నీరు పనికిరాకుండా పోతోంది. మేలైన పద్ధతుల ద్వారా దీనిని కొంతవరకూ తగ్గించవచ్చు. ఇజ్రాయెల్ దేశంలో ప్రతీ నిటిబొట్టుని డ్రిప్ ఇర్రిగేషన్ పద్ధతి ద్వారా సమర్దవంతంగా ఉపయోగించుతున్నారు. ఈ విధానాలలో మనదేశం నేర్చుకోవలసినది చాలా ఉంది.

విద్యుత్ అవసరాలకు స్వచ్ఛమైన నీరు అవసరం. హైడ్రో-ఎలక్ట్రిక్ ప్లాంట్లలో నీటిని పునర్వినియోగించే సదుపాయాలు చెయ్యాలి. న్యూక్లియర్ ప్లాంట్లలో విడుదలయ్యే వేడిని చల్లబరచడం కోసం ప్రస్తుతం స్వచ్ఛమైన నీటిని వాడ్తున్నారు. ఈ వేడి నీటిని వెనువెంటనే నదులలో కలుపుతున్నారు. ఇలా చెయ్యడం నదుల జీవరాశికి ఏమంత మంచిది కాదు. బొగ్గు-విద్యుత్ కేంద్రాలలో కూడా స్వచ్ఛమైన నీటినే వాడుతున్నారు. ఈ ప్లాంట్లలో స్వచ్ఛమైన నీటిని బదులు ఉప్పునీరు, లేదా కలుషితమైన నీరు వాడేందుకు ప్రయోగాలు చెయ్యాలి. తద్వారా, న్యూక్లియర్ ప్లాంట్లలో విడుదలయ్యే వేడిని తెలివిగా త్రాగే నీరు తెచ్చుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధమైన మార్పులు చేస్తే, ప్లాంట్ల నిర్మాణ ఖరీదు మరీ పెరుగుతుంది. కానీ, ఈ విధమైన దిశగా మనం అడుగులు వెయ్యక తప్పదు.

చివరగా, జన్యు మార్పులు చెయ్యడం వలన నీటిని మరింత సమర్ధవంతంగా వాడే వంగడాలు సృష్ఠించవచ్చు. దీనిపై, శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. కొత్త పద్ధతులైన బయో-టెక్నాలజీ, ఇంఫర్మేటిక్సు లనే కాక పాత పద్ధతులైన స్టెం-కల్చరు తో కూడా మనం ప్రోత్సహించాలి. పాత పద్ధతులని ఉపయోగించే ఒక 50% దాకా మార్పులు తీసుకురావచ్చు

సామాజిక పరిష్కారాలు :

నీరు అనేది బంగారంతో సమానం అని ప్రజలు గుర్తించాలి. సాధ్యమైనంత పొదుపుగా వాడాలి.

మాంసాహారం బదులు వీలైనంత ఎక్కువగా శాకాహారం భుజించాలి. నీటిని ఎక్కువగా వాడే వరి బదులు రాగి, జొన్నలు వంటి పంటలను ప్రోత్సహించాలి.

నీటి వినియోగం ఎక్కువగా ఉండే ఆహారాలను ఉత్పత్తి చెయ్యడం తగ్గించి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాలి.

అన్నింటికన్నే ముఖ్యంగా, జనాభా నియంత్రణకు నడుం బిగించాలి. ఉత్తరాది రాష్ట్రాలలో మరింత విస్తృతంగా ప్రచారం చెయ్యాలి.

(గణాంకాలు నేచర్ పత్రిక మార్చి 20, 2008 సంచిక నుండి స్వీకరించబడినవి)