Tag Archives: జాతి

కుతూహలమ్మ ద్రౌపదియా, శిఖండినా ?

శాసన సభలో జరుగుతున్న వీర తమాషా మరో అంకంపైకి వచ్చింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటూ ఒక డ్రామా మొదలుపెట్టారు. సరుకు తక్కువ, సణుగుడు ఎక్కువ – సభంతా గోల గోల అయ్యింది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, చొక్కాలు చించుకోవడమే తరువాయి, మిగిలిందంతా ముగించారు. “స్పీకర్ వచ్చే వరకు సభ జరపనివ్వం. డెప్యూటీ స్పీకర్కి సభ నిర్వహించే హక్కు లేదు”, అంటు చంద్రబాబు ఏదో లా పాయింట్లు లేవనెత్తాడు. డెప్యూటీ స్పీకర్ కుతూహలమ్మగారు దళిత మహిళ అయినందువల్ల, కాంగ్రెసువాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది. “ఉత్సవ విగ్రహం లాంటి కుతూహలమ్మనే అవమానిస్తావా ? కులహంకారి”, అంటూ విరుచుకుపడ్డారు. “తేడా వచ్చిందిరో అబ్బాయ్”, అంటూ తెలుగుదేశం వాళ్ళు వెనక్కి తగ్గారు.

“కౌరవ సభలో ద్రౌపదిలా ఫీల్ అయ్యాను”, అంటూ కుతూహలమ్మ కొసమెరుపు. కానీ, కౌరవసభలో మెజారిటీ కౌరవులది, ఇక్కడ శాసనసభలో మెజారిటీ ఎవ్వరిదో ? సరైన పోలిక ద్రౌపదితో కాదు, శిఖండితో. భీష్ముడిని ఎదుర్కోలేక అడ్డుగా శిఖండిని పెట్టుకుని యుద్ధం చేస్తారు పాండవులు. ఒకప్పటి ఆడది అయిన శిఖండితో పోరు చెయ్యలేక భీష్ముడు విల్లు విడుస్తాడు. ఇక్కడ, మన భారతదేశంలో దళితుల విలువ శిఖండికి సమానంగా జమకట్టారు మన రాజకీయనాయకులు. ఎవ్వరూ వీరితో పోరుపెట్టుకోరాదు. ఇది రూలు.

దళితుల ఆత్మగౌరువం రక్షించే పనులా ఇవి !!? అసలు పవరు ఏ కులాల మధ్యన ఉందో అందరికీ తెలుసు. ఈ కామెడీ జనాలు అర్థం చేసుకోలేరా ?

జాత్యహంకారి ఉండవల్లి

బుర్ర ఉన్న రాజకీయవేత్త ఎవ్వడైనా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తాడా !? అందులోనూ, రామోజీరావుకే హడలుపెట్టించిన ఉండవల్లి లాంటి ఉద్ధండుడు ఇంతటి వెర్రి పని ఎందుకు చేస్తాడు ? పైగా, పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో గనక ఒకటికి నాలుగుసార్లు వెనకా ముందూ చూసుకోవాలి, ఇలాంటి ప్రకటనలు చేసే ముందు. ఉండవల్లికి అలాగ మాట్లాడే ఉద్దేశ్యం ఇసుమంతైనా ఉండదు. లోలోపల దళితులపై ప్రేమ ఉన్నా, అసహ్యమున్నా పైకి మాత్రం మల్లెలంత మృధువుగా మాట్లాడడం ఆయన అస్థిత్వానికి అవసరం. మరి ఇలాంటి దిక్కుమాలిన స్థితిలోకి ఎలా ఇరుక్కుంటాడు ?

జరిగిందేమిటంటే, ఆయన వ్యాఖ్యలని ఈనాడు పత్రిక అమోఘంగా వక్రీకరించింది. “రాజ్యాంగం రచించడం అయిపోయింది. మేము అంతా రాజ్యాంగానికి అనుగుణంగానే చేస్తున్నాం, అది మీ దురదృష్టం” అని అనాల్సింది పోయి, “దురదృష్టవశాత్తు అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు, దానికి అనుగుణంగానే మేం చేశాం” అన్నాడు. పప్పులో కాలేసాడు. భలే భలే !

అసలు, అంబేద్కర్ పేరుని వాడాలంటే, చదరంగం మల్లే ఎత్తులు-పైయెత్తులు ఉపయోగించి అప్పుడు వాడాలి. మన ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉన్నది పేరుకి మాత్రమే. చాలా పదాలు నిషిద్ధాలు – ఆచి తూచి మాట్లాడాలి. నిజాము/ముస్లిము/దళితులు/అంబేద్కరు/జిన్నా/… ఇలా లెక్కకు మిక్కిలి. ఏమన్నా తప్పుగా నోటినుంచి దొర్లితే, దిష్టిబొమ్మలు దహనం చెయ్యడానికి రెడీగా వీధుల్లో ఉంటారు మనదేశంలో, పనీపాటాలేని దేశభక్తులు.

మొత్తం మీద కొంచెం కామెడీ లభించింది జనాలకి :))

————————————————————————-

కామెడీ అనుకున్నా, అంతవరకూ బానే ఉంది. కానీ, జరుగుతున్న అల్లర్ల వైఖరి చూస్తుంటే నిజంగా సిగ్గేస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్సు లోనే వెనక నుండి పొడిచేందుకు రెడీగా ఉన్న అమలాపురం హర్షకుమార్ లాంటి వాళ్ళు దీన్ని భీకరంగా రాజకీయం చేస్తున్నారు.

  1. అంబేద్కర్ పై విమర్శలు చేస్తే ఆటోమెటిగ్గా దళితులకి వ్యతిరేకుడైపోతాడా ? దళితులకి అన్యాయం చేస్తున్న అసలు పెద్దమనుషులు ఎవరు ? అంబేద్కర్ నెత్తి మీద పాలు చిలకరించినంత మాత్రాన దళిత-బాంధవులైపోతారా ? ఏవో రెండు పథకాలకి అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన దళితులని ఉద్ధరించినట్లా ?
  2. దేశప్రజలు నిజంగా ఇంత వెర్రివాళ్ళు అని భావిస్తున్నారా మన రాజకీయనాయకులు ? అసలు ఫ్యూడల్ పద్ధతిలో ఆలోచిస్తున్నదెవరు ?
  3. సరే అంబేద్కర్ని విమర్శించాడనే అనుకుందాం. కానీ, ఎం.పి పదవికి రాజీనామా ఎందుకు చెయ్యాలి ? ఈ విధమైన డిమాండు చెయ్యడంలో అర్థం ఏమిటి ? ఇటువంటి డిమాండు మరేదేశంలోనైనా (అమెరికా, ఇంగ్లాండు, జపాను..) ఎవ్వరైనా చెయ్యగలరా ? ప్రజా ప్రతినిధులకు భావ స్వాతంత్ర్యం లేదా మన భారతదేశంలో ? ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం ఏమిటి ?
  4. తెలుగుదేశం వాళ్ళు మూతులకి నల్లటి తొడుగులు ధరించి ఊరేగింపు చెయ్యడం ఏమిటి !? వీళ్ళ నోర్లు ఎవరన్నా నొక్కేసారా ? జరిగిందంతా రివర్సులో కదా.
  5. దళిత ఉద్యమాల్లో పనిచేస్తున్న మేధావులందరూ ఒకసారి సద్విమర్శ చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ళకు కూడా మీరు దళితల బ్రతుకుల్లో ఎందుకని ఏమీ మార్పూ తీసుకురాలేకపోతున్నారు ? అంబేద్కర్కి వారసులమని గుండె మీద చెయ్యవేసుకుని చెప్పుకోగలరా ?
  6. దేశ జనాభాలో 15% శాతం ప్రజలకి అంబేద్కర్ మించి ఒక ఆరాథ్యుడు / మార్గదర్శి లేడా ? దళిత రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు – వీరిలో ఎంతమందికి విగ్రహాలు కట్టించారు, పాలాభిషేకాలు చేస్తున్నారు ? ఒక మహాసముద్రం లాంటి ప్రజానీకాన్ని ఇలాగ ఒక మనిషితో స్టీరియోటైపు చెయ్యడం ఎంతవరకు సమంజసం ? ఈ స్టిరియోటైపు మించి ఆలోచించలేని వారా మనకు నాయకులు ?
  7. ప్రజలు నిజంగా అంత మొద్దులని భావిస్తున్నారా మన నాయకులు ? కొంత కళ్ళు తెరిచి చూడడం మంచిది. దేశం మారుతోంది. ప్రజలు విద్యావంతులవుతున్నారు. మనం మరో యుగంలో ఉన్నాం. వందేళ్ళ కిందటి ఫ్యూడల్ మనస్తత్వాలతో రాజకీయం నడపడం ఇప్పుడు చేతనవదు. కొంత, వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడడం మంచిది.

కుల-మ్యూజికలు-ఛైర్సు

తెలుగునేలమీద బ్రతికే కమ్మవాల్లకి నమస్కారాలు,రెడ్డి కులస్తులకి విడిగా వేరొక నమస్కారాలు, కాపులకి నమస్కారాలు, శెట్టి-బలిజ కులస్తులకి నమస్కారాలు. మాలవారికి నమస్కారము, మాదిగలకు విడిగా మరొక నమస్కారము, బ్రాహ్మణులకి (మిమ్మలినెలా మర్చిపోతాము) నమస్కారాలు. చిన్నపాటి సంఖ్యలతో వేగుతూ మెజారిటీ లేని “వగైరా” కులస్థులకి వేవేల ప్రత్యేక నమస్కారాలు.

స్టేజిమీద పెద్దలందరికి పేరు పేరుగా దండాలు చెప్పడం మన సంప్రదాయం కనుక, ఒక బ్లాగుటపా రాసేముందు ఈ విధంగా బ్లాగోదండకం చదవక తప్పదు. క్షమించండి.

ఇక విషయమేమిటంటే, మన ఆంధ్రదేశంలోని రాజకీయకుళ్ళు యొక్క వెగటి వాసనలు ఎక్కడో దేశాలుదాటి బ్రతుకుతున్న మాలాంటివాళ్ళ ముక్కుప్రుటలని కూడా అధరగొట్టేస్తున్నాయి. అస్థిత్వం ఏమిటొ అర్థంకాక “మాజీ తెలుగువాళ్ళం” అయిపోతామేమోనన్న బెంగతో కాలం గడుపుతున్న మాలాంటివాళ్ళ నాలికలకు “అసలు తెలుగు అస్థిత్వం అనేదే లేదురా గురుడా” అనే నిఖార్సైన నిజం చాలా తీపిగా తగులుతోంది.

చిరంజీవి పార్టి పెడతడంట ! మంచిది. రానివ్వండి ముందుకి !! సీ.యెం అయ్యే హక్కు ఒక్క రెడ్డి కులానికి, కమ్మ కులానికి రాసిపెట్టిన హక్కు ఏమీకాదుగదా. దక్షిణాన ఉన్న తమిళనాడులో ఇప్పటికే మూడువేల మున్నేట్ర-కజిగాలు రాజకీయంలో రాటుదేలి ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో రెంటితో సరిపెట్టుకోవడం ఎందుకు ?

ఎప్పుడో అరవై ఏళ్ళకిందట, తెల్లవాడిముందు అందరూ సమానంగా సిగ్గుపడింది ఎవ్వడికి గుర్తుంటుంది ? ఆ అవమానాలు భరించడానికి రెడ్డి/కమ్మ/కాపు తారతమ్యం ఏమన్నా అడ్డొచ్చిందా ? మన స్వాతంత్ర్యపోరాటంలో, అందరూ కలిసికట్టుగా ఎదురునిల్చాము గనకే చివరికి ఒక భారతీయత అనేది దక్కింది. ఇంత సాధించిందెందుకు ? అరవై ఏళ్ళ తరువాత కూడా ఇలాగ కులాలంటూ ఎలెక్షను గేములు ఆడుకోవడానికి మరి !

చిన్నప్పుడు “మ్యూజికలు ఛెయిర్సు” అంటూ మూడు ఛైర్ల చుట్టూ నలుగురం పరిగెట్టేవారము. మ్యూజిక్కు ఆగిపోవగానే అందరూ చైర్లమీద పడతారు. ఒక్కడుు అభాగ్యుడు చైరులేక బయటకి పోతాడు. ఈ ఆట ఆడగా ఆడగా, ఒక్క లక్కీ ఫెలోకి రాజభొగ్యం లాంటి ఆఖరి చైరు దొరుకుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తమాష ఒక పెద్ద కుల-మ్యూజికలు-ఛైర్సు ఆటలాగ ఉంది. ప్రజాస్వామ్యము అంటూ డాంభికాలు పోవడమే తప్ప, కొద్దిగానన్నా ప్రజలచే పాలన చేయించడం ఇప్పటి సరుకుగాదు. కనీసం ఒక టార్గెట్టు కూడా కాదు.

కళాకారులన్నాక ఒక ఆశయంకోసం పనిచేయడం పాతపద్ధతి. బుర్రలో ఏమీ ఉండనవసరంలేదు. మాటగడసరితనం ఉంటే చాలు, రైటర్లయిపోవచ్చును. భావ వ్యక్తీకరణా లాస్యం అక్కర్లేదు, కొంత ఎర్రగా-బుర్రగా ఉంటే చాలు, ఏక్టర్లయిపోవచ్చును. రాజనీతి తెలియనక్కర్లేదు, సరైన చుట్టరికాలుంటే చాలు, మినిష్టర్లయిపోవచ్చును. ఇదీ ప్రస్తుతం మన తెలుగు సమాజ సంపద.

సినీ అభిమాన సంఘాలు కులసంఘాలు. ప్రవాసాంధ్ర సంఘాలు కుల సంఘాలు. ఇప్పుడు చివరికి న్యూసుపేపర్లు కూడ కుల పేపర్లుగా తయారవుతున్నాయి. ఇలాంటి ఔన్నత్యం వెలగబోస్తున్నందుకు వారి వారసులను చూసి, మన స్వాతంత్ర్య సమరయోధులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు అక్కడ స్వర్గంలో !!

తెలుగువాడినైనందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఈ బ్లాగుముందు, నా నమస్కారాలని అందిపుచ్చుకున్న వారందరికీ ఇందుకని కృతజ్ఞతలు.

కుల అస్థిత్వం చీదరించుకుని నా నమస్కారం పుచ్చికోనివారికి నా ఆలింగనలు.

సినిమాలలో కూడా కులజాడ్యం

కంప్యూటర్లు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఈ యుగంలో, ఆ పెనగలుపు నుండి ఎక్కడి సినిమాలనైను ఎక్కడివారైనా దించుకుని చూసుకోవచ్చు. మన సంస్కృతి, వారి సంస్క్కృతి అన్న అడ్డుగోడలింకేమీ లేవు. నాసిరకం సినిమాలను, సంగీతాన్ని మనదేశంలో చెల్లుబాటు చెయ్యవచ్చు, పిచ్చివాళ్ళవలే కేరింతలు కొట్టే వీర ఫేనులు ఉన్నారు. కానీ ఇదే సరుకుని మిగతా దేశంవాళ్ళ విమర్శలనుండి వేర్పెట్టలేము. ఇది యూట్యూబు యుగం. ఎవ్వడైనా వీడియోలు పెట్టవచ్చు, మరింకెవ్వడైనా వాటిని దిలోడించుకోవచ్చు. ఎలాంటి కామెంట్లైనా పబ్లిగ్గా రాసుకోవచ్చు.

మన చిరంజీవి ప్రస్తుతం యూట్యూబులో మహా పాపులర్ అయ్యివున్నాడు. ఏదన్నా మంచి విషయమా అంటే కాదు. 1980లో ఎప్పుడో దొంగ అనే సినిమాలో మనవాళ్ళు మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ వీడియోని మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం పాట పాడేశాడు, చిరంజీవి డాన్సు ఆడేసాడు. వీర ఫేనులు జైజైలు కొట్టేసారు. కానీ, పాతికేళ్ళ తరువాత సీను ఇలా తయారవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు, ఆ వీడియోలో ప్రతీ అడ్డమైనవాడు “భలే ఉంది, చింపాంజీ డాన్సు. సిగ్గులేని ఇండియన్లు, కాపీ కొట్టడంలో కూడా నాసిరకమే” అంటూ వందలకొద్దీ కామెంట్లు.

ఏదో సరదాగా తెలుగు పాటలు చూసుకుందాం అని యూట్యూబు తెరిచిన నాలాంటి వాళ్ళకి ఇదీ కనపడేది. మన సంస్కృతి పరువు మర్యాదలని ఇలా తేరగా గంగలో కలుపిన ఆ డైరెక్టరుని ఏం చెయ్యాలి ? తమ అభిమాన హీరో పరువుని ఆ వీర ఫేనులు ఎలా కాపాడుకుంటారో వారికే తెలియాలి ఇప్పుడు. రుద్రవీణ, స్వయంకృషి లాంటి మంచి సినిమాలు చేసిన చిరంజీవిని చివరికి ప్రపంచమంతా చూసేది ఈ వీడియో ద్వారా.

పదేళ్ళనాటి సంగతి. కాకినాడలో ఇంటర్ చదువుకునే రోజులు. ఓసారి బాలకృష్ణ సినిమా ఒకటి, చిరంజీవి సినిమా ఒకటి ఒకేసారి థియేటర్లలో రిలీజయ్యాయి. వీరఫేనులు ఒకరితో ఒకరు తెగ దెబ్బలాట పెట్టుకున్నారు. వారితో ఆగితే బానే ఉండేది. రోడ్డుమీద వెళ్తున్న మనుషులని పట్టుకుని “నువ్వు చిరు ఫేన్వా, బాలయ్య ఫేన్వా ? ” అని అడిగేవారు. తప్పు ఆన్సరు చెప్తే నాలుగు ఉతుకులు ఉతికేవారు ! ఈ దెబ్బకి జడిసి రోడ్డుమీద నడిచివెళ్ళాలంటే భయమేసి కూర్చున్నారు అందరు. చివరికి, పొలీసులకి తిక్కరేగి రౌడీమూకల్ని తన్ని బొక్కలో తోసారు కొన్ని రోజులు.

ఇదేదో పిచ్చ ఫేనుల వెర్రి అనుకున్నాను నేను. తరువాత తెలిసింది, దీనికి ఇంకా లోతు ఉందని. చిరు ఫేన్లందరు కాపులు, బాలయ్య ఫేన్లు కమ్మవాళ్ళు. కులపోరుని ఇలాగ రోడ్డుమీదకి తెచ్చి వాళ్ళ హీరోలకి అంటగట్టారు. ఏవనాలి వీళ్ళని !!? ఇప్పుడు వీరందరికీ రోజూ ఆ యూట్యూబు పేజీలు చూపించాలి.

ఇప్పుడు ఈ చిరంజీవి యూట్యూబు వైభోగం చూసి బాలయ్య ఫేన్లకి పారాహుషార్గా ఉండుంటుంది. ఇంకా బాలయ్య తొడకొడితే ట్రెయిను వెనక్కి పరిగత్తే సీను కనుగొనలేదు జనాలు. దాన్ని చూసిన తరువాత ఎవ్వడికన్నా నోరు పెగుల్తుందా ?

ఇంతకీ ఇదా మన తెలుగు సంస్కృతి, మనం చూసి గర్వపడాల్సినది ? మనకేమన్నా బ్రెయిను డామేజీయా ఇలాంటి సరుకుని మార్కెట్లో ఆడించడానికి ? ఇంకా 80లే నయము. ప్రస్తుతమున్న తెలుగు సినిమాలు చూస్తుంటే వాంతి వస్తోంది. నేను బొత్తిగా సినిమాలే చూడడం మానేసాను. ఎప్పుడో బస్సులో హైదరాబాదు నుండి ఇంటికి కాకినాడ వెళ్తుంటే టీవీ పెట్టేసేవారు, గత్యంతరం లేక చూడాల్సివచ్చింది కొన్ని ఆణిముత్యాలని.

ఎనభై మిలియన్లమంది జనాలట తెలుగువాళ్ళు. ఇంతమంది కలిసి సాధించేది ఏమిటి ? ఇన్ని డబ్బులు సంపాదించుకుని అమెరికాలలో కులుకుతున్న వాళ్ళందరూ ఈ చివాట్లు, అగచాట్లు పడాల్సిందేనా ? మనకేమి తక్కువ, ఐఐటీ ప్రవేశ పరీక్షలలో అన్ని రాంకులు కొట్టేది మనమేగా. ఐఏయెస్ పరీక్షలో ఈసారి ఫస్టు రాంకు కొట్టింది మనవాడే.

ప్రతి తెలుగువాడికి నేను చేసే విన్నపం ఏమిటంటే బుర్ర ఉపయోగించండి. ఏమాత్రం టాలెంటు ఉన్నా ఖాలీగా కూర్చోవద్దు. సృజనాత్మకమైన జీవితమే సరైన జీవితం. మూసపద్ధతిలో బండిలాగడానికి మనమేమి చాకలోడి గాడిదలం కాదు. మెదడున్న మనుషులం.

ఇంక కులం సంగతికొస్తే ఇది మనకి అతి సిగ్గుచేటు. ఏంటి మనలో మనకి తేడాలు ? ఈ రోజుల్లో ? ఇంకా ప్రతీవొక్కడు వాడి కులం అమ్మయిలనే పెళ్ళి చేసుకుంటున్నాడు. వాళ్ళ కులం నాయకులకే ఓట్లు వేస్తున్నాడు. వాళ్ళ కులం వారికే ఉద్యోగాలిస్తున్నాడు. ఇక వాడికులం హీరోకే జైజైలు కొడుతున్నాడంటే పిచ్చి ఎంతముదిరి ఉందో తెలిసొస్తుంది.

నా అదృష్టం బాగుండి ఒక మంచి ఇంజనీరింగు కాలేజీలో పడ్డాను. మా ఫ్రెండ్సు కులమేమిటో ఇప్పటికీ తెలియదు. కానీ ఇంటర్ ఫ్రెండ్సు చెప్పేవారు వాళ్ళ కాలేజీలలో సంగతి – రాగింగు టైములో అడిగే మొదటి ప్రశ్న “ఏంట్రా నీ బ్రాండు ?” అని. అదేంటో వెనకేసిన స్టాంపు లాగ. ఇలాంటి వాళ్ళు బతికి ప్రయోజనం ఏమిటి, వెంటనే చచ్చిపోవడం మేలు, కొంత జనాభా తగ్గుతుంది.

శ్రీశ్రీ పుట్టిన రాష్ట్రమేనా మనది ? కందుకూరి వీరేశలింగం పుట్టింది ఇక్కడేనా ? కులం పేరుతో పెళ్ళి ప్రకటనలేంటి ? ఇది ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచించి చూడండి.