Tag Archives: చరిత్ర

స్వతంత్ర భారత చరిత్రలో తెలుగువాడి గొప్పదనం

మన తెలుగువాళ్ళకి భారతదేశం పార్లమెంటులో మెజారిటీ లేకపోవచ్చు. పలుకుబడి ఇంతింతమాత్రమే కావచ్చు. కానీ, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మూల స్తంభాలు నాటినవాళ్ళు అందరు తెలుగువాళ్ళే. ఒకసారి, వారిని గుర్తు చేసుకుని గర్వపడదాం.

పింగళి వెంకయ్య : స్వతంత్ర భారతానికి గుర్తుగా రెపరెపలాడే మన మువ్వన్నెల పతాకం రూపొందించింది ఒక తెలుగువాడే. దేశభక్తి కాదుకానీ, ప్రపంచంలోని పతాకాలన్నింటిలోనూ, బహు సుందరంగా ఉండేది మన దేశ పతాకమే ! కళా దృష్టిలో చూస్తే, దీనికొక విశేష ప్రాథాన్యత ఉంది. ఇంద్రధనుస్సులోని రంగులలో స్పష్టంగా మూడోవంతు అటు, మూడోవంతు ఇటూ ఉండే రంగులు కాషాయమూ, ఆకుపచ్చ వర్ణాలు. మధ్యలోని తెలుపు రంగు స్పష్టమైన కాంతి, దీనిని పట్టికలోకి పంపిస్తే విడేది ఇంధ్రధనుస్సు ! మన భారతదేశంలోని వైవిధ్యానికి, ఐక్యతకి మరొక్క గుర్తు ఇంకేమి ఉంటుంది చెప్పండి ? ఇక, మధ్యలోని అశొకచక్రం చిరకాలం నిలిచివుండే మన ప్రాచీన నాగరికతకి గుర్తు.

పొట్టి శ్రీరాములు : మన భారతదేశ మాపు ఈ విధంగా ఉంది అంటే దానికి కారణం ఈయనే. భాషా ప్రాతిపదిక మీద రాష్ట్ర విభజన జరగాలి, అప్పుడు అన్ని భాషలు స్వచ్ఛంగా అభివృద్ధి చెంది సంస్కృతి విరాజిల్లుతందనే శాస్త్రీయ సిద్ధాంతం కోసం పోరాడిన ఘనత ఆంధ్రులదే. దేశంలోని భాషలన్ని ఆంధ్రులకి ఈ విధంగా ఎన్నటికీ రుణపడి ఉంటాయి. ముఖ్యంగా, అమరజీవి గాంధీగారి ప్రియ శిష్యుడు అయిన పొట్టి శ్రీరాములు అందరికీ, ఎన్నటికీ పూజనీయూడే.

సర్వేపల్లి రాధాకృష్ణ : మన దేశ ప్రాచీన తత్వశాస్త్రాన్ని సగర్వంగా చాటిచెప్పిన మహనీయుడితడు. ఉదారవాదం, తత్వశాస్త్రం, విజ్ణాన శొధనం పాశ్చాత్యుల సొత్తుకాదు. మన భారతీయులు వీరికెన్నడూ తీసిపోలేదు అని నిరూపించిన వాడితడు. అప్పటివరకు భారతీయులంటే, కేవలం దైవపూజలో నిమిత్తులై ప్రపంచానికి పట్టింపులేని మూఢులు అని విపరీత ప్రచారం ఉండేది, ఇప్పటికీ ఉంది. కాని రాధాకృష్ణుడు దీనిని పటాపంచలు చేశాడు. విజ్ణాన శొధనలో గ్రీకులకి భారతీయులు ఎన్నడూ తీసిపోలేదు,మన తత్వశాస్త్రమూ వారికి ఎన్నడూ తీసిపోలేదు. పైపెచ్చు, మనమే నాలుగంకెలు ముందున్నాము అని నిరూపించి మన నాగరికత ఔన్నత్యాన్ని మళ్ళీ నిలబెట్టిన ఘనత ఈ తత్వవేత్తదే.

జిడ్డు కృష్ణమూర్తి : ఆధునిక తత్వవేత్తల్లొ ఆధ్యుడిగా ప్రపంచమంతా ప్రశంసలు పొందిన జ్ణాని ఇతడు. భారతీయుల తత్వశాస్త్రం పురాతనంలో మిగిలిపోలేదు, ఆధునికంలో కూడా ఎప్పటికీ ముందంజ వేస్తూనే ఉంటుంది అని నిరూపించినవాడితడు. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవనయాన లక్ష్యం, మానవసంబంధాలు మొదలైనవాటిమీద విశేషంగా ప్రవచించిన ఇతని రచనలు ప్రపంచమంతా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధునికజీవితంలోని ఇబ్బందులు, ప్రజలమధ్య ఎడబాట్లు – వీటిని అర్థం చేసుకోవడానికి సరైన సిద్ధాంతాలకు రూపకల్పన జరుగుతోంది అంటే దానికి ఆధ్యుడు మన కృష్ణమూర్తే.

పాములపర్తి నరసింహారావు : భారతదేశంలో ఎప్పటికైనా పేదరిక నిర్మూలన జరుగుతుంది అంటే దానికి కారణం ఇతడే. సరళికృత ఆర్థికవిధానాలకు మార్గాలు తెరిచి స్వతంత్రభారత చరిత్రలో అతిముఖ్యమైన ఘట్టానికి సూత్రధార్యం చేసింది మన పీవీనే. విజ్ణానుల్లో పెక్కుమంది అభిమానించే భారతదేశ ప్రథాని ఎవ్వరంటే, నిస్సందేహంగా పీవీనే అని సమాధానం వస్తుంది. సామాన్య ప్రజానీకానికి తెలిసిలేకపోవచ్చుగాక, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, సూటిపోట్లను చూసివుండవచ్చుగాక – కానీ, చరిత్రలో పీవీ ఎప్పటికీ ఒక మహనీయుడుగా మిగిలిపోతాడు. ఇంతటి బహుభాషాప్రావీణ్యం, తెలివితేటలు, అపర చాణుక్యం కలిగిన దేశనేత మరొకరు ఇప్పట్లో మనదేశానికి లభించడం కల్ల. పీవీ సూత్రధారిగా నడిపించిన మరికొన్ని అతిముఖ్యమైన ఘటనలు – ఆంధ్రదేశంలో వ్యవసాయభూములను సంస్కరించడం, భారతదేశ రక్షణా విభాగంలో చైతన్యం తేవడం. ఆధునికయుగంలోకి భారతదేశం ప్రయణిస్తోంది అంటే ఆ మార్గం సూచించిన పీవీ చలవే !

రాజ్‌రెడ్డి : ఆధునిక భారతదేశ చరిత్ర కంప్యూటర్ విప్లవంతో ముడివడి ఉంది. తరువాయి 50 ఏళ్ళలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది, దానికి కారణం సమాచార-సాంకేతిక రంగంలో కీర్తిపతాకలెగరవేస్తున్న భారతీయులే. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే, భారతదేశంలోని పాతికశాతం ఇంజనీర్లు ఆంధ్రులే. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో 50 శాతం మంది ఆంధ్రులు ! దీనినిబట్టి సమాచార విప్లవంలో చక్రం తిప్పుతున్నది ఎవ్వరో గ్రహించవచ్చు. కంప్యూటర్ రంగంలో నోబెల్ ప్రైజు అంతటి కీర్తి గలది ట్యూరింగు అవార్డు. ఈ అవార్డు ఇప్పటివరకు ఒక్క భారతీయుడినే వరించింది. ఆ శాస్త్రవేత్తే రాజ్‌రెడ్డి. రోబోటిక్సు, కృతిమ మేధస్సు రంగాలలో ఆధ్యుడిగా పరిశొధనలు నిర్వహించి, ఎందరికో దారిచూపిన ఇతడు ఎక్కడివాడో మీకు సందేహంగా ఉందా ? ముమ్మూటికీ మన తెలుగువాడే. ఇలాంటి శాస్త్రవేత్తలు ఎందరో మన తెలుగువాళ్ళు, వాళ్ళందరికీ జైజేలు 🙂