నిజమే, నిజమే, అబద్ధం కాదు, ఊగు ఊగు మన సొంతపు పాత భాషలో, ఊగు ఊగు మన సొంతపు పాత భాషలో, ఊగు! నడివేసపు రాత్రిపూట కన్నెపిల్లలౌతారు, ఊగు ఊగు మంత్రగత్తెలుగా మాయతోడేళ్ళుగా, ఊగు ఊగు మంత్రగత్తెలుగా మాయతోడేళ్ళుగా, ఊగు!
ఈ రాత్రి ఈ రాత్రి నడివేసవి, ఊగు ఊగు ఎవరిది ఈ రాత్రి నడివేసవి, ఊగు ఊగు ఎవరిది ఈ రాత్రి నడివేసవి, ఊగు! మంత్రగత్తెలది మాయతోడేళ్ళది, ఊగు ఊగు వాళ్ళది సొత్తు నడివేసవి, ఊగు ఊగు వాళ్ళది సొత్తు నడివేసవి, ఊగు!
గాలిలో ఎగిరింది మంత్రగత్తె, ఊగు ఊగు మా ఇంటి వాకిట్లో కాదు, ఊగు ఊగు మా ఇంటి వాకిట్లో కాదు, ఊగు! మా ముంగిటి ఇనుములకొలిమి, ఊగు ఊగు మా పెంకులపై మేకులు మేకులు, ఊగు ఊగు మా పెంకులపై మేకులు మేకులు, ఊగు!
పారింది నది మజ్జిగలాగ, ఊగు ఊగు మా ఆవులు మేసే పచ్చికదొడ్లో, ఊగు ఊగు మా ఆవులు మేసే పచ్చికదొడ్లో, ఊగు! అక్కడ వేటగాడి మెడవిరిగింది, ఊగు ఊగు తొమ్మిది మంత్రగత్తెలు నుంచున్నారు, ఊగు ఊగు తొమ్మిది మంత్రగత్తెలు నుంచున్నారు, ఊగు! మునిగిపోతోంది లౌమాగత్తె, ఊగు ఊగు సాయంత్రం సూర్యుడు లేక, ఊగు ఊగు సాయంత్రం సూర్యుడు లేక, ఊగు!
లాట్వియా దేశపు గాయనీబృందం “తౌతూమెయితాస్” పాడిన “రగనూ నాక్ట్స్” (మంత్రగత్తెల రాత్రులు) అన్న ఈ పాట ఆ దేశపు జానపదసంస్కృతిని ప్రజల నమ్మకాలని ప్రస్తావిస్తోంది. నడివేసవి సమయంలో ప్రకృతి అంతా మాయామంత్రభరితం అవుతుందని, అప్పుడు మంత్రగత్తెలు తిరుగుతూ ఉంటారని అక్కడి ప్రజల నమ్మకాలు. లౌమా అను ఒక రాక్షసి అడవుల్లో తిరుగుతూ మగవాళ్ళని పట్టుకుతింటుందని, చిన్నపిల్లలను ఎత్తుకుపోతుందని ప్రతీతి. కానీ అదే రాక్షసి చిన్నపిల్లలని దీవించగలదని, లేదా శపించగలదని కూడా నమ్మకం. ఈ లౌమా యక్షిణులకు ఆవుపాలు, మజ్జిగ గుర్తు. ఈ పాటలో ఈ యక్షిణుల, మంత్రగత్తెల ప్రస్తావన ఉంటుంది. లాట్వియా భాషలో “లీగ్వ” అంటే “ఊగు” అని అర్థం. కానీ, ఇదే పదం నడివేసవి సమయంలో జరిగే పండుగ సంబరాలని కూడా సూచిస్తుంది.
చుంచు తోలుతోంది, బండి గొణుగుతోంది బండినిండా నిద్రపు మూటలు ఓ మూరెడు నిద్ర ఇక్కడా, ఓ మూరెడు నిద్ర అక్కడా ఓ దోసెడు నిద్ర పాపాయికి
ఉయ్యాలూపుతూ బువ్వపెడుతూ పిట్ట పాపాయిలకి కొమ్మ పట్టుకున్నాను తల్లి పిట్టని ఉడతొచ్చింది పరిగెట్టి, కింద పడేసింది అందుకో, అందుకో చేతితో, అందట్లేదు నాకు పిలుస్తున్నా, గొంతు పిలుస్తున్నా, పిలవలేకపోతున్నా ఉయ్యాలూపు చిట్టికొమ్మతో పిట్టపాపాయి నేను ఇక్కడ తమ్ముణ్ణి బజ్జోపెడుతున్నాను
లాట్వియా దేశంలోని తౌతూమెయితాస్ గాయనీబృందం ఆలపించిన “పెలీతె” (చుంచు) అను సొంపైన జోలపాట ఇది. ఈ పాటలో ఒక చుంచుపిల్ల బండితో నిద్రమూటలని లాగుతూ, పాపాయిలకి పంచి ఇస్తోంది అని కథ.
ఒక మాత్ర నిన్ను పెద్దదిగా చేస్తుంది, ఒక మాత్ర చిన్నదిగా చేస్తుంది నీ అమ్మ నీకిచ్చే మాత్రలు మాత్రం, ఏవీ ఏమీ చెయ్యవు
ఏలిస్ ని అడుగు, తను పదడుగుల పొడువైనప్పుడు
కుందేళ్ళని వెదుక్కునే వేటలో నువ్వు, ఎప్పుడు క్రింద పడతావో తెలియదు వాళ్ళకి చెప్పు హుక్కా కాలుస్తున్న ఓ గొంగళీపురుగు నిన్ను పిలిచిందని
ఏలిస్‌ని పిలిచాడు, తను చిన్నదిగా ఉన్నప్పుడు
చదరంగం బల్లపై మనుషులు లేచి నీకు ఎటు వెళ్ళాలో చెప్పినప్పుడు ఏదో పుట్టగొడుగుని నివ్వు తిన్నప్పుడు, నీ మతి నెమ్మదిగా కదుల్తుంటే
వెళ్ళు, ఏలిస్‌ని అడుగు, తనకి తెలుసనుకుంటాను
తర్కపరిమాణాలు చచ్చిపడుండగా తెల్లశకటం యోధుడు తిరగేసి మాట్లాడుతుండగా ఎరుపు రాణి తలకాయి లేకుండా తిరుగుతుండగా గుర్తించుకో పందికొక్కు ఏం చెప్పిందో నీ తలకాయికి తిండిపేట్టు, నీ తలకాయకి తిండిపెట్టు
జెఫర్సన్ ఎయిర్‌ప్లేన్ (జెఫర్సన్ విమానం) అనే అమెరికాదేశపు సంగీతబృందం 1967వ సంవత్సరంలో విడుదలచేసిన “తెల్ల కుందేలు” అనే గీతం ఇది. ఈ సంగీతం మనోలోలిత (సైకడెలిక్) సంగీతచరిత్రలో ఒక పునాదిరాయిగా పేర్కొంటారు. గ్రేస్ స్లిక్ అను గాయని పాడిన ఈ పాట సాహిత్యం ఎల్.ఎస్.డి మొదలైన మనోలోలిత పదార్థాలు మింగిన తరువాత కళ్ళముందు కనపడే వింత అనుభూతులని వర్ణిస్తోంది. పాట సాహిత్యంలో లూయిస్ కారొల్ అను రచయిత రచించిన “ఏలిస్ ఇన్ ద వండర్లేంద్” (వింతప్రపంచంలో ఏలిస్) అను ఒక చిన్నపిల్లల కథని అనేకమార్లు ఉల్లేఖిస్తున్నారు. ఈ కథలో తర్కశాస్త్రంలోని గణితశాస్త్రంలోని కిటుకైన విషయాలను గమ్మత్తైన కథాసందర్భాలు సృష్టించి వాటిద్వారా వ్యాఖ్యానిస్తాడు రచయిత. ఈ కథావిషయాలను, అక్కడ మాట్లాడే జంతువులు, జరిగే వింత సందర్భాలను ఈ పాట మనోలోలిత భ్రాంతిలో కనపడే దృశ్యాలతో పోల్చిచూస్తోంది.
నా అంతరాత్మలో వినిచూడు స్వయంగా చూశాను హెరాయిన్ నేను ఆ వీధుళ్లో అంత యవ్వనంలో నాశనమై పడి ఉండి సరిపోయిందా, ఇంకా సరిపోలేదా? కాళ్ళు విరిగిపోయిన ప్రపంచమా అది మళ్ళీ మొదలవడం తిరిగి చూసి భరించలేను నేను
చెప్పు.. అదంటే ఎలా భయపడుతున్నానో ఆరోగ్యంకోసం చూడకుండానే నిర్ణయించుకుంటాను అంత విలువా, అది రుచి చూడడం అంటే? చాలు, ఇంక చాలదా లోలోపల కుమిలిపోవడం నిన్ను నువ్వే అమ్ముకునే సమయం అలా గడిచిపోతుండే సమయం (ఇంక చాలదా?)
టాక్ టాక్ (మాట్లాడు మాట్లాడు) అను ఆంగ్ల సంగీతబృందం 1988వ సంవత్సరంలో విడుదలచేసిన “ఐ బిలీవ్ ఇన్ యూ” (నీలో నమ్మకం ఉంచాను) అను గేయం ఇది. మాదకద్రవ్యాలకి అలవాటుపడి, వ్యసనపరులై జీవితం మొత్తం వ్యర్థం చేసుకున్న అభాగ్యులు ఎంతమందో. అలాగే తన యవ్వనంలో హెరాయిన్ అనే అతి భయంకరమైన మత్తుమందుకి లోలుడై ఎంతో క్షోభ అనుభవించిన తరువాత, తిరిగి ఆ సమయాన్ని గుర్తుచేసుకుంటూ గాయకుడు మార్క్ హోలిస్ పాడిన పాట ఇది. తన స్నేహితులు ఎందరో ఈ హెరాయిన్ వ్యసనం బారినపడాడం, చివరికి తన మానసిక బలహీనతలలో కూడా ఈ హెరాయిన్ మీద ఆశ ఉండటం చూసి, మనోవిచారణ చేసుకుంటున్న సాహిత్యం ఇది. లేతగొంతుతో అతిమధురంగా పాడుతూ, మనస్సుని అర్థంచేసుకున్నట్టు ఉంటుంది ఈ పాట. వ్యసనాలనుండి స్వేచ్ఛ కావాలని కోరుకునే ప్రజలకి ఈ పాట సాహిత్యం ఒక తోడ్పాటుగా ఉంటుంది.
ఇదే పాటని ఒక ఫ్రెంచి చిత్రకారుడు అనుప్రాణితంగా మలచాడు. ఆ వీడియోని కూడా క్రిందన చూడండి.
నీయాన్ కాంతి, మిణుకుతున్న నీయాన్ కాంతి రాత్రిపడేవేళ, ఈ నగరం అంతా కాంతి
(రాత్రిపడేవేళ, ఈ నగరం పుట్టింది కాంతినుండి)
క్రాఫ్ట్‌వెర్క్ (కర్మాగారం) అను జర్మను సంగీతబృందం ఎలెక్ట్రానిక్ సంగీతంలో ఒక విప్లవం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ వారి “నీయాన్ లిచ్ట్” (నీయాన్ కాంతి) అను పాట ఇది. అదే పాటను వారు “నీయాన్ లైట్స్” అని ఆంగ్లంలో కూడా పాడారు. జర్మను మూలాన్ని పైన అనువాదం చేసాను. ఆంగ్ల సాహిత్యంలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. అది క్రింద అనువదిస్తున్నాను.
నీయాన్ దీపాలు, మిణుకుతున్న నీయాన్ దీపాలు రాత్రిపడేవేళ, ఈ నగరం దీపాలపాలు
లపుటా అను ఆకాశద్వీపం కృత్రిమమేధ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. హయావో మియాజాకీ దర్శకత్వం వహించిన “టెంకూనో షిరో రప్యుతా” అను జపానుదేశపు అనుప్రాణితచిత్రంలోని దృశ్యం.
ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (ఏ.ఐ) సాంకేతిక విజ్ఞానాన్ని తెలుగులోకానీ, ఇతర భారతీయభాషలలో కానీ ఎలా అనువదించాలి? నేను కృత్రిమమేధ అని వాడుతున్నాను. ఇటివల భారతప్రభుత్వం ఏ.ఐ పరిశ్రమపై నిర్వహించిన రెయిజ్ సదస్సును ప్రస్తావిస్తూ దూరదర్శనం వారి సంస్కృతవార్త కార్యక్రమంలో “కృత్రిమ బుద్ధిమత” అని అనువదించారు. బుద్ధి అంటే తెలుగులో వివేకము, తలపు, శ్రద్ధ అనే అర్థాలు స్ఫురిస్తాయి. “బుద్ధిమంతుడు” అంటే నిదానము కలవాడు, శ్రద్ధగా విద్యాసాధనను నెరపువాడు అని భావము. మరి ఏ.ఐ సాంకేతజాలాన్ని కృత్రిమబుద్ధి అని అనాలా, లేదా కృత్రిమమేధ అని అనాలా? కొందరు కృత్రిమప్రజ్ఞ అని కూడా ఉటంకించుతున్నారు. ఈ పదాలన్నీ “ఇంటెల్లిజెన్స్” అను ఆంగ్లపదానికి సమానార్థాలుగా వాడవచ్చు. సంస్క్ర్తాంధ్ర భాషలలో ఇంకెన్నో పదాలు ఉన్నాయి, కానీ వీటన్నింటి మధ్యన స్వల్ప భావవ్యత్యాసాలు కూడా ఉన్నాయి. అటువంటి సూక్ష్మ విచక్షణ ఐరోపా భాషలలో లేదు. ఈ వ్యాసంలో ఈ అనువాదాలు అన్నీ అసంతృప్తికరంగానే ఉంటాయని, పునాదులనుండి కృత్రిమమేధ భావజాలాన్ని పరీక్షించదగిన ఒక ప్రామాణికమైన భారతీయదృష్టి లోపించిందని వివరిస్తాను.
ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ మొదలైన ఆంగ్లపదాల సృష్టి వెనుక శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక విలువలు ఉన్నాయి. మనం వాడే భాషని అనుసరించి మదిలో భావనలు అంతర్లీనంగా ఒక పక్షపాతదృష్టిని అలవర్చుకుంటాయి, ఆశాయాలని ఒకానొక వైపు మొగ్గేటట్లు చేస్తాయి. కానీ, ఆ భవిష్యత్తు మన భారతీయసంస్కృతికి, నెలకొల్పుకున్న ధార్మిక సాంస్కృతికవిలువలకు అనుగుణంగా ఉందా, లేదా విరుద్ధంగా ఉందా అని ప్రశ్నించే వివేకం అందరిలోనూ ఉండదు. అందువలన ఈ విషయంపై సూక్ష్మంగా పరిశీలనచేసి, సాంకేతికపరిభాషద్వారా వెల్లడయ్యే భావాలను సద్విమర్శ చేసి, మన స్వంత ఆలోచనలను పదునుపెట్టుకోవలసిన అవసరం ఉంది. నిజాయితీగా కృషిచేసి మన విలువలను సాంకేతిక విజ్ఞానానికి అన్వయించుకోగలిగితే ఈ ప్రపంచానికే భావనిర్దేశ్యం చెయ్యగలిగినవాళ్లమవుతాము.
బాధ్యతాయుతకృత్రిమమేధనిర్మాణం: గమనించవలసిన అంశాలు
కృత్రిమమేధ సాధనాలు ప్రస్తుతం పరిశోధనాశాలలనుండి బయటికొచ్చి సామాన్య ప్రజానీకం వినియోగించే రోజువారీ సాధనాలుగా వృద్ధిచెందాయి. అనేక పరిశ్రమలలో, ప్రభుత్వ విభాగాలలో, విద్యావైద్యాదిరంగాలలో నిర్ణయాలు తీసుకునేందుకు, విషయాలను విశ్లేషించేందుకు తరుచుగా కృత్రిమమేధని ఇప్పటికే వినియోగిస్తున్నారు. కానీ, దీనివలన తీసుకున్న నిర్ణయాలు మనుషులకు గానీ, సమాజానికి గానీ హాని కలిగించవనే ధీమా లేదు. అందువలన బాధ్యతాయుతమైన కృత్రిమమేధ (రెస్పోన్సిబుల్ ఏ.ఐ) ఒక ప్రముఖ పరిశోధనాంశంగా గుర్తింపులోకి వచ్చింది. ఉదాహరణకు వైద్యరంగంలో, రోగనిర్ధారణ చేసేటప్పుడు కానీ, రోగుల వైద్యచరిత్రను విశ్లేషిస్తున్నప్పుడు కానీ, కృత్రిమమేధని బాధ్యతాయుతంగా వాడాలంటే దానికి ఐదు గుణాలు ఉండాలని పేర్కొంటున్నారు:
పారదర్శకత (ట్రాన్స్పరెన్సీ): తీసుకునే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నామో భేరీజు చేసుకోదగిన సదుపాయం
ఉపరిదృష్టి (ఓవర్సైట్): కృత్రిమమేధని ఎప్పటికైనా ఒక మానవ నిపుణుడిచే నియంత్రించగల అవకాశము
సత్తువ (రోబస్ట్నెస్): కృత్రిమమేధను అనుచితంగా ఉపయోగించిన సందర్భాలలో, లేదా మలినభరితమైన దత్తాంశాలు ఇచ్చిన సందర్భాలలో కూడా ఘోరమైన ఫలితాలు ఇవ్వకుండా, సున్నితముగా ప్రవర్తించుట
మర్యాద (ఫెయిర్నెస్): సమాజంలో ఎటువంటి ప్రజలతోనైనా న్యాయపూర్వకమైన, మర్యాదపూర్వకమైన పద్ధతిలో వ్యవహరించుట. జాతి, కుల, మత, లింగ భేదాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయమైన ఫలితాలు అందివ్వుట. అదే సమయంలో సమయోచితముగా వివిధ వినియోగకులకు వారికి తగిన సహాయం అందివ్వుట.
వీటిలో ప్రతీ అంశం మీదనా సందర్భానుసారంగా ఎన్నో విషయాలు చర్చించవచ్చును. ఈ అంశాలన్నింటిమీదనా కృత్రిమమేధ సంతృప్తికరంగా ప్రవర్తించేటట్టు చూడటం అనేది ఒక నిరంతర పరిశ్రమ. కాలం మారుతుండేకొద్దీ, సమాజం కానీ సాంకేతికజాలం పరిణామం చెందుతుండేకొద్దీ, ఈ అంశాలను భేరీజు వెయ్యవలసిన సందర్భాలు కూడా మారుతూ ఉంటాయి. ఎలా ప్రవర్తించాలనే ఔచిత్యం, ఆ ప్రవర్తనలో మనకి సంతృప్తి కలిగించగలిగే కనీస ఫలితాలు, సమయానుసారంగా పునర్నిర్ణయించవలసి ఉంటుంది. ఎటువంటి కృత్రిమమేధ సాధనమైన ఒక ఏకాకియైన వస్తువుగాకాక, యావత్తు సాంకేతికజాలంతో ముడివడిన, సమాజానికి అందుబాటులో ఉన్న అవస్థాపన యంత్రాంగంలోని ఒక భాగంగా గుర్తించాలి. అందువలననే, రోడ్లు, రేవులు, విద్యుత్ సరఫరా యంత్రాంగము, నీటికాలువలు మొదలైన ప్రాథమిక సౌకర్యాలతోబాటు పరికరాల సంసాధనత, అంతర్జాల లభ్యత, కృత్రిమమేధ యంత్రతంత్రజాలం అంతా సాంకేతిక అవస్థాపన యంత్రాంగమని గుర్తించి, దానిని నిర్మించి నిర్వహించే బాధ్యత ప్రభుత్వబాధ్యతయని గుర్తించాలి.
ప్రభుత్వం ఇటువంటి భారీ యంత్రాంగం నిర్మించేటపుడు దానికి తగిన జవాబుదారీతనం, వివిధ విభాగాల మధ్యన అధికారాల వేర్పాటు, కృత్రిమమేధతో ప్రజల నేర్పరితనం పెంపొందించే విద్యాసౌకర్యాలు, వాణిజ్యసంస్థలు ఆర్థికవికాసం చెంది సమాజానికి సేవచెయ్యగలిగేందుకు తగిన సౌలభ్యం, అదే సమయంలో అమానుష అధర్మ ప్రవర్తనలని కట్టిపెట్టేందుకు చట్టనియంత్రణ: అన్నీ సరైన మోతాదులో నిర్మించాలి. ప్రస్తుతం కృత్రిమమేధ పరిజ్ఞానం చాలామటుకు అమెరికా, చైనా దేశాలలో కేంద్రీకృతమై ఉంది. అక్కడ విచ్చలవిడిగా దత్తాంశాలు సేకరించడం, విపరీతమైన అధికారాలు కొన్ని కొన్ని సంస్థలలోనే కేంద్రీకృతమవడం (ప్రభుత్వ సంస్థలు కావచ్చు, వాణిజ్య సంస్థలు కావచ్చు), సైన్య, గూఢచారివిభాగాలలో హద్దులనేవే లేకుండా కృత్రిమమేధ వినియోగించుతుండం ఆందోళన కలిగిస్తున్నాయి. అభివృద్ధిచెందిన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలలో ఈ పరిణామాలకు తిరుగుబాటుగా సామాజిక ఉద్యమాలు నెమ్మదిగా తొలకరిస్తున్నాయి. అప్రజాస్వామిక దేశమైన చైనాలో సాంకేతికవృద్ధి ఇటువంటి హద్దులు కూడా లేకుండా చెలరేగుతోంది. కృత్రిమమేధకి సంబంధించిన వైజ్ఞానిక సదస్సులలో ప్రచురింపబడిన శాస్త్రీయపత్రాలలో చైనా ఇప్పటికే అగ్రస్థానం సంపాదించింది. అమెరికా, చైనాలను పోల్చిచూస్తే మనదేశం విపరీతంగా వెనకబడి ఉంది. కానీ, అదృష్టవశాత్తూ మనదేశంలో అనేక శాస్త్రవేత్తలు విద్యార్థులు ఈ రంగంలో త్వరగా ముందంజలు వేస్తున్నారు. అదేవిధంగా మనదేశపౌరసమాజం కూడా తమ ప్రజాస్వామ్యహక్కులపైన, వాటికి కృత్రిమమేధ వలన కలుగబోయే ఆపదపైన అప్రమత్తులై ఉన్నారు. క్రితంవారం భారతప్రభుత్వం నిర్వహించిన “సామాజిక సాధికారత కోసం బాధ్యతాయుతమైన కృత్రిమమేధ” (రెయిజ్ 2020) సదస్సులో ఈ అంశాలు స్పష్టంగా బయటపడ్డాయి.
బాధ్యతాయుతమైన కృత్రిమమేధకి తగిన అవస్థాపన యంత్రాంగం నిర్మించుకోవాలంటే కొన్ని అంశలు నిశితంగా పరిశీలన చెయ్యవలసి ఉందని రెయిజ్ 2020 సదస్సులో కొందరు వక్తలు సూచించారు.
అసలు కృత్రిమమేధ అంటే ఏమిటి?
కృత్రిమమేధ అంటే మనిషికి ప్రత్యుమ్నాయమా, లేదా మనిషికి సహకారమంధించే సాధనమా?
కృత్రిమమేధ పనితీరుని పరీక్షించాలంటే, దాని ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించాలంటే (ఉదాహరణకు పైన చర్చించిన 5 బాధ్యతాయుత అంశాలలోను) భారతపౌరులు ఆంగ్లభాషలో ప్రావీణ్యం చెంది ఉండాలా, లేదా ఈ పరిజ్ఞానం మరియు సాధనాలు భారతీయభాషలలో అందుబాటులోకి రాగలవా? ఎంతవరకు రాగలవు?
కృత్రిమమేధ నిర్మాణం కొరకై ప్రజలు తమ దత్తాంశాలను సమర్పించేటప్పుడు అంగీకారపత్రం ఏ విధంగా ఉండాలి? అసలు ప్రజలలో ఎంతమందికి ఈ అంగీకారం తెలపగలిగే జ్ఞానం కానీ నైపుణ్యం కానీ ఉంటుంది? ఈ నిపుణత్వంలో వివిధ శ్రేణులుగా కృత్రిమమేధ వినియోగకులను విడదీయవలెనా?
కృత్రిమమేధకి సంబంధించిన నైతికమైన ప్రవర్తనపైన (ఎథికల్ బిహేవియర్), వాడే మానవుల హక్కులపైన చర్చ అంతా ప్రస్తుతం పాశ్చాత్య తత్వశాస్త్రపరంగా జరుగుతోంది. మన భారతదేశ ధార్మికచింతన ప్రకారం ఈ చర్చని నడుపుకోగలమా?
మన భారతదేశ ఆర్థిక సామజిక స్థితిగతుల మూలముగాను, మన దేశంలోని అపార మానవవైవిధ్యము వలనను కృత్రిమమేధ యంత్రాంగానికి ప్రత్యేకమైన ఆచరణా పరిమితులు ఏమన్నా నిర్ణయించవలెనా?
ఈ విషయాలపై సరైన అవగాహనతో చర్చించాలంటే ముందు “కృత్రిమమేధ” (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అన్న పదానికి పాశ్చాత్య సమాజంలో గల చరిత్రను, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజు వరకు ఎదిగిన విధానాన్ని అర్థంచేసుకోవాలి. అదే సమయంలో, మన భారతదేశ తత్వచింతనలో జ్ఞానానికి ఎటువంటి స్థానం ఉంది, “ఇంటెలిజెన్స్” అన్న పదానికి అనుబంధమైన బుద్ధి, ప్రజ్ఞ తదితర పదాలకు ఎటువంటి భావాలు ఉన్నాయి, వేటిని కృత్రిమంగా నిర్మించుకోగలము, వేటిని నిర్మించుకోలేము అని అభిప్రాయాలను పరిశీలించాలి. ఆ అభిప్రాయాలు ఈనాటి సాంకేతిక యుగంలో ఎంతవరకు సమంజసము, అని శోధించాలి.
పాశ్చాత్య తత్వచింతనలో మేధ, కృత్రిమమేధ
గ్రీకు తాత్వికుడైన అరిస్టోటిల్ తన రాజనీతిశాస్త్ర గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు “కొంతమంది మనుషులు పాలకులుగాను, మిగిలినవారు ఆధీనులైన పాలితులుగాను ఉండటమనేది సహజము, యోగ్యము కూడాను. పుట్టుకను బట్టి కొందరు రాజులవుతారు, కొందరు వశమయిన పాలితులవుతారు. రాజుకి చిహ్నం నిర్వికారంగా విచారణ జరుపగల మేధాశక్తి. తెలివైన మగవారిలో ఈ మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది కనుక, వారు సహజంగానే ఆడువారిని శాసించాలి, అదేవిధంగా శారీరిక శ్రమనే వృత్తిగా ఉండటంవలన సహజ బానిసలుగా మారిన అధములైన మగవారిని కూడా శాసించాలి. అదే న్యాయం. అన్నింటికన్న అధమమైనవి మానవేతర జంతుజీవాలు. వాటికి మనుషుల ఆధీనములో బందీలుగా ఉండటంవలనే శ్రేయస్సు కలుగుతుంది.” దీనిని బట్టి మేధాశక్తి (ఇంటెలిజెన్స్) అనేది అధికారం (పవర్) సంపాదించడానికి సాధనం అని అరిస్టోటిల్ నిర్వచించాడు అని విదితమవుతోంది. పాశ్చాత్య తత్వచింతనలో ఇటువంటి దృక్పథం చాలా కాలం దృఢంగా కొనసాగింది. 17వ శతాబ్దిలో రెనే దెకార్త్ అను ఫ్రెంచి తాత్వికుడు “మేధాశక్తి”ని మనుషులకే ప్రత్యేకమైన అంగమని, అది జంతువులకి ఉండదని నిర్ధారించాడు. ఎందుకంటే “ఎవరు నేను” అని ఆలోచించగల చైతన్యం మనుష్యులలోనే ఉంటుందని, అవి లేని జీవాలు యంత్రాలకు సమానమైనవి అని పేర్కొన్నాడు. మనస్సు (సోల్) అన్న పదార్థం కేవలం మనుష్యులకే పరిమితమని వాదించాడు. 18వ శతాబ్దిలో ప్రముఖ జర్మను తాత్వికుడైన ఇమ్మాన్యువెల్ కాంట్ ఇంకొంత ముందుకి వెళ్లి “ధర్మం” (మొరాలిటీ) కేవలం విచారణశక్తి (రేషనాలిటీ), చైతన్యం కలిగిన మనుష్యులకే పరిమితమని, మిగిలిన జీవాలు ధర్మశూన్యమైనవి అని వాదించాడు. విచారణశక్తి లోపించిన జీవాలు కేవలం వస్తువుల వంటివి మాత్రమేనని, వాటికి స్వతహాగా విలువ లేదని, కేవలం సాధనాలుగా ఒకదానితో ఒకటి పోల్చిచూడడం వలన వచ్చిన సాపేక్ష విలువ (రెలటివ్ వేల్యూ) మాత్రమే కలవని పేర్కొన్నాడు. “కొందరు సహజంగానే పాలకులు, కొందరు సహజంగానే బానిసలు. మేధాశక్తి (ఇంటెలిజెన్స్) వారి మధ్యన అంతరం.” అని అరిస్టోటిల్ వేల ఏళ్ళ మునుపు వెలబుచ్చిన అభిప్రాయంతో కాంట్ ఏకీభవించనట్టే లెక్క. జర్మను తత్వవేత్త అయిన హెగెల్ ధీశక్తిని ఉపయోగించి మనిషి ప్రకృతిని లొంగదీసుకుని చరిత్రను నడిపించుకోవాలని పేర్కొన్నాడు. ప్రాచ్యదేశసమాజాలకు అటువంటి శక్తిలేదని ఆయన నిరసించాడు. అతని ఆలోచనలను కొనసాగించిన మార్క్సు కూడా ఇదే అభిప్రాయం వెలబుచ్చాడు.
ఈ దృక్పథం తాత్వికుల వాదోపవాదాలతో ముగిసిపోలేదు. ఇతరజాతులవారికి మేధాశక్తి లోపించింది అని, వారు సహజబానిసలని సమర్థించుకుని ఐరోపావారు జాత్యహంకారవాదం, వలసవాదం ప్రబల్చుకుని, మిగిలిన జాతులను బానిసలుగా చేసుకున్నారు, లేదా సమస్తం జాతిహత్యచేసారు. స్త్రీలకు మేధాయుతమైన మనసు (సోల్) ఉందా లేదా, వారికి పౌరహక్కులు ఇవ్వడం ఎంతవరకూ సమంజసం అని తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. స్త్రీలకు మేధాశక్తి లోపించందని, కనుక వారిని పురుషులకు ఆధీనమైన సంపదగా చూడాలని చాలామంది పాశ్చాత్యులు వాదించారు. అదేవిధంగా, పిల్లలకు మేధాశక్తి ఎప్పడినుండి వ్యక్తమవుతుంది అని కూడా చర్చలు జరిగాయి. ఆ వయస్సుకు మునుపు పిల్లలు పెద్దలైన పురుషులు ఏది శాసిస్తే అది చెయ్యాలి అని, ఎలా శిక్షించినా సమంజసమే అని వాదించినవారు ఉన్నారు. పిల్లల హక్కులు, జంతువుల హక్కులు ఇటివలికాలంలోనే పాశ్చాత్యమేధావుల అంగీకృతిలోకి వచ్చాయి. మేధాలేమి అన్న అనుమానంతో ఈ హక్కులను చాలాకాలంపాటు వారు గుర్తించలేదు. కృత్రిమమేధ అంటే పాశ్చాత్యదేశాలలో ప్రస్తుతం పుడుతున్న భయోత్పాతాలకి అంతర్లీనమైన కారణం కూడా మేధస్సుని అధికారం చలాయించడానికి సాధనంలా చూసే ఆ భావనయే. ఇది విశ్లేషించవలసివుంది.
ఐరోపా తత్వవేత్తల సిద్ధాంతాలకి అనుగుణంగానే 18వ శతాబ్దిలో వచ్చిన పారిశ్రామిక విప్లవంలో వైజ్ఞానిక యంత్రాలను నిర్మించడం మొదలుపెట్టారు. దీనికి మునుపు 15వ శతాబ్దినుండే సమయాన్ని సూచించే గడియారాలకీ కీ ఇచ్చి తిప్పే యంత్రాంగం తయారుచేసారు. ఆ గడియారపు సామాగ్రిలో ఆటబొమ్మలు వివిధ భంగిమలతో కదులుతున్నట్టు స్వచలిత వస్తువులు (ఆటొమేటా) తయారుచేసారు. వోకాన్సోన్ అను ఫ్రెంచి వైజ్ఞానికుడు 1739వ సంవత్సరంలో “జీర్ణించుకోగల బాతు” అను యంత్రాన్ని తయారుచేసాడు. ఈ బాతు మరబొమ్మ గోధుమ గింజలను మూతితో తిని, మల విసర్జన చేసేటట్టు కనపడుతుంది. నిజానికి తిన్న గింజలు బొమ్మలోపల ఒక పాత్రలో వెళ్తే, మరో పాత్రలోంచి కాల్పనిక మలాన్ని బొమ్మ విసర్జిస్తుంది. వోకాన్సొన్ ఆషామాషీ శిల్పకారుడు కాదు. ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేసాడు. యాంత్రిక మగ్గాలను నిర్మించడంలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది, ఆ నేతయంత్రాలే ఐరోపా పారిశ్రామిక విప్లవానికి ఆద్యం చుట్టాయి. ఈ మరబొమ్మ సరదాగా నిర్మించిన ఆటవస్తువే కాదు, అప్పటి సమాజంలోని దృష్టిని బహిర్గతం చేస్తోంది. ఆ దృష్టిలో నిజమైన ప్రాణి అయిన బాతు కూడా ఒక మర యంత్రాంగం తప్ప మరొకటి కాదు. ఈ దృష్టితో శరీరంలోని అవయువాలని యంత్రాలవలే చూడటం ద్వారా వైద్యరంగం గొప్ప విప్లవం సాధించింది. మనుషులకి శరీరయంత్రాంగం కాక మనసు (సోల్) అను ఒక పారలౌకిక (స్పిరిచువల్) అంగం ఉండవచ్చు కానీ, మిగతా ప్రాణులకి అదికూడా లేదు. ఈ ప్రాణులని యంత్రాలవలే భావించి వాటిని పెంచే వృత్తి అంతటినీ పారిశ్రామీకరించవచ్చు. అదే ప్రస్తుతపు పారిశ్రామిక పశుపోషణకి ఆద్యం. అడవులు, నదులు, చెట్లు, జంతువులు వీటన్నింటినీ యాంత్రీకరణ చెయ్యవచ్చు అను, మనుష్యుల మేలుకోసం విచ్చలవిడిగా వినియోగించవచ్చు అని నిర్ధారించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా ఘోరమైన వనాల నరికివేత జరిగింది.
సాంఘిక పురాతత్వ శాస్త్రీయ విభాగాలలో కూడా పాశ్చాత్యులు యాంత్రికదృష్టితో మానవసమాజాలని విశ్లేషించడం మొదలుపెట్టారు. ప్రాచీన సమాజాలు ఎలా జీవించేవో విశ్లేషించడానికి, అవి నిర్మించిన కట్టడాలు, పాత్రలు, విగ్రహాలు మొదలైన జడవస్తువుల అవశేషాలు పరిశీలించడం మొదలయింది. ఈ వస్తువులని “ఆర్టేఫాక్టొ” అని లాటిను భాషలో సంబోధిస్తారు. ఈ పదానికి నైపుణ్యంతో (ఆర్స్) నిర్మించినది (ఫాక్టొ) అని అర్థం. తెలుగులో “నైపుణ్యీకృతి” అని అనువదించుకోవచ్చు. ఆర్టెఫాక్టో అన్న పదంనుండే “ఆర్టిఫిషియల్” అన్న భావం ఉత్పత్తి అయ్యింది. మనం దీనిని “కృత్రిమమైన” అని అనువదించుకోవచ్చు, కానీ దాని వెనుక “నైపుణ్యము” (ఆర్స్) అన్న భావం అప్పటికే కోల్పోయింది. “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” అన్న పదానికి వెనుక ఎవడో నైపుణ్యంతో నిర్మించాడు అను అర్థం లీలగా ఉంది. భౌతిక యంత్రాలను, స్వచలిత బొమ్మలను ఎలా నిపుణులు రూపొందించారో, అదేవిధంగా ఆలోచనాపద్ధతులను, మేధాశక్తిని కూడా రూపొందించవచ్చు అనే భావం 19వ శతాబ్దిలో ఏర్పడింది. దెకార్త్ మనుష్యలకని ప్రత్యేకించి ప్రక్కన పెట్టిన మనసు కూడా యాంత్రీకరణం చెయ్యవచ్చు అని ప్రస్తుతం పాశ్చాత్య వైజ్ఞానిక సమాజం స్థూలంగా అంగీకరిస్తోంది. ఈ యాంత్రికదృష్టిని భారతీయ శాస్త్రీయ సంప్రదాయంతోను, తత్వచంతనతోను ఎలా పోల్చవచ్చు?
భారతీయ తత్వచింతనలోమేధ, కృత్రిమమేధ
భారతీయ సంస్కృతిలో జ్ఞానానికి విశిష్ఠస్థానం ఉంది. మానవ అస్థిత్వం యొక్క అంతిమ లక్ష్యం ప్రజ్ఞానం అని, దానిద్వారానే విముక్తి, మోక్షం సాధ్యమని హైందవ సంప్రదాయాలలో నమ్మకం. “ప్రజ్ఞానం బ్రహ్మ” అనే అద్వైత మహావాక్యం ఉపనిషత్తులలో ప్రకటించి ఉంది. బౌద్ధ సంప్రదాయాలలో కూడా బుద్ధత్వం జ్ఞానవిచక్షణ ద్వారానే సాధ్యమని ఉన్నది. ప్రాచీన విద్యావిధానాలలో తర్కవిచక్షణకున్న ప్రాముఖ్యత, సంప్రదాయపరంగా మేధావుల మధ్యన సభానిబద్ధతతో సంవాదాలు జరిగిన తీరులు గమనిస్తే భారతీయ సంస్కృతిలో జ్ఞానానికి ఉన్న గౌరవం వెల్లడవుతుంది. కానీ, భారతీయ దృష్టిలో మేధాశక్తిని చూసిన విధానం పాశ్చాత్యదృష్టికి బహుభిన్నంగా ఉంటుంది. అధికారము రాచరికము కాకుండా ఐహికబంధాల త్యాగము, ధ్యానంతో కూడిన వివేకము మేధాశక్తికి మూలమని ఇక్కడి సంస్కృతిలో గుర్తించబడి ఉంది.
బౌద్ధమతంలోని ధర్మపాదాలలో (ధమ్మపాదం) బ్రాహ్మణవర్గం (బమ్మనవగ్గం) అనే అధ్యాయంలో గౌతమబుద్ధుడు మేధాశక్తి యొక్క అత్యుత్తమ ప్రతిరూపం బ్రాహ్మణుడని, వానికి గల గుణాలు ఎలావుండాలో నిర్వచించాడు. జన్మతః పుట్టినంతమాత్రాన ఎవడూ బ్రాహ్మణుడు అయిపోడని, ధ్యానంద్వారా, విచక్షణద్వారా శారీరిక బంధాలన్నింటినీ విడనాడి, ఆ తేజస్సుతో ప్రకాశించువాడే బ్రాహ్మణుడని బౌద్ధుల నిర్వచణ. కోరికలనే సంకెళ్ళను త్రెంచి, క్రోధం నుండి విముక్తుడై, ద్వేషాలను అణుమాత్రమైనా మిగల్చకుండా సమస్తం ప్రక్షాలనం కావించి, అజ్ఞానమనే గుదిబండను విసిరివేసి, సంపూర్ణంగా వివేకమూర్తి అయినవాడు నిజమైన బ్రాహ్మణుడని బుద్ధుని ఉవాచ. ఈ అభిప్రాయం అరిస్టోటిల్, కాంట్ మొదలైన పాశ్చాత్యుల దృక్పథంలోని మేధాశక్తికి ఎంత విరుద్ధంగా ఉందో గమనించవచ్చు.
సాంఖ్యశాస్త్రం ప్రకారం మానవచైతన్యం పురుషుడు, ప్రకృతి అను రెండు అంశాలుగా విభజించబడి ఉంది. ఇందులో, శారీరిక ఇంద్రియచైతన్యం, మనస్సు, బుద్ధి, చిత్తము, జ్ఞాపకశక్తి, సంకల్పబలము, చివరికి “ఇది నేను” అను చైతన్యభావన (దీనినే తత్వశాస్త్రంలో అహంకారము అని, ఆంగ్లంలో “ఈగో” అని అంటారు) అంతా ప్రకృతిలోనే నిక్షిప్తమై ఉంది. పాశ్చాత్య తత్వవేత్తల “సోల్” కానీ, “ఇంటెలిజెన్స్” కానీ అంతా ప్రకృతిలోనే ఉంది. మరి పురుషుడు అనగా ఏమిటి? క్రియాశక్తికి కర్మఫలాలకి అతీతంగా, కేవలం ప్రత్యక్షంలోకి వచ్చిన అనుభవాలని దర్శించే పురుషుడు ఒక సాక్షీభూతం మాత్రమే. ఆడవారు మగవారు ఇరువరిలోను ప్రకృతిపురుషులు అంతర్లీనంగా ఉన్నారని, మనుష్యులేకాదు సమస్తజీవాలలోను ఉన్నారని ఇక్కడి సిద్ధాంతం. సాంఖ్యశాస్త్రప్రకారం శరీరం, మనస్సు, బుద్ధి ఇలా ప్రకృతిలో వేటిపైనన్నా మమకారం పెంచుకున్నప్పుడు అజ్ఞానమని, తద్వారా శోకం తప్పదు అని సిద్ధాంతం. వీటన్నింటినీ తోసిరాజని కేవలం పురుషుడినే ప్రత్యక్షించుకున్నప్పుడు దానిని కైవల్యము అంటారు. అదే ఆత్మసిద్ధి. సాంఖ్యమును అనుసరించి యోగదర్శనం అటువంటి మోక్షప్రదమైన ఆత్మసిద్ధిని సమాధి అని నిర్వచిస్తుంది. వేదాంతులు దీనిని బ్రహ్మత్వమని అంటారు. బౌద్ధులు నిర్వాణము అంటారు. వీటన్నింటిమధ్యనా స్వల్పబేధాలు ఉన్నా, సాంఖ్యము యొక్క కైవల్యసాధనయే అన్నింటికీ ఆధారము. ఈ సాధనలన్నింటికీ ఇంద్రియానుభూతులని, మమకారాలని త్యజించడం అత్యవసరం. కనుక మేధాశక్తిని అధికారం సంపాదించడానికి సాధనమని ప్రకటించిన పాశ్చాత్య తత్వశాస్త్రం వీటన్నింటికీ విరుద్ధంగా ఉంది.
సాంఖ్యం ప్రకారం ప్రకృతిలోని ప్రతి వస్తువు సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణముల కలగలుపుగా ఉండి, వాటి మోతాదులను బట్టి ఎలాంటి వస్తువు అయినా రూపరీతులను మార్చుకుంటూ పరిమాణం చెందుతూ ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. ఈ త్రిగుణములలో తమస్సు నిస్తేజమునకు, అలుపుకు, కూలబడి ఉండటానికి ప్రతీక కాగా, రజస్సు శక్తికి, అధికారానికి, ఉద్రేకానికి ప్రతీక. పాశ్చాత్యుల తత్వశాస్త్రం కేవలం ఈ రెండు గుణాలతోనే పరిమితమై ఉంటుంది. అందువలనే, మేధాశక్తిని రజస్సుకు సమానార్థంగా ఉపయోగించారు. కానీ, భారతీయులు సత్వము అనే మూడో గుణాన్ని రజస్సుకు తమస్సుకు అతీతంగా గుర్తించారు. ఈ సత్వము తేటదనానికి, నిరంతర యవ్వనానికి, త్యాగశీలతకి ప్రతీక. శరీరానికి చెందిన స్థూల అనుభూతులని తిరస్కరించి, సూక్ష్మమైన ఆత్మానుభూతులకి మనస్సుని మరల్చడాన్ని సత్వము అంటారు. కనుక, సత్వగుణము మేధాశక్తికి ప్రతీకగా గుర్తించడమైనది. రజస్సును భారతీయులు కేవలం బాహుశక్తికి ప్రతీకగా గుర్తించారు.
భారతీయ తత్వచింతన ఆరు ఆస్తికదర్శనాలతోను, మూడు నాస్తికదర్శనాలతోను అనాదికాలం నుండి పరిఢవిల్లుతోంది. ఆరు ఆస్తికదర్శనాలని మూడు జతలుగా విభజిస్తారు. వీటిలో న్యాయదర్శనం వస్తువుల నిర్వచనం, తర్కవిచారణకు సంబంధించిన ప్రమాణాల విశదీకరణం చేస్తుండగా, దానికి జోడైన వైశేషికదర్శనం విశ్వంలోని పదార్థాల భౌతిక ధర్మాలను విశ్లేషిస్తుంది. వీటిని గణితభౌతికశాస్త్రాలతో పోల్చవచ్చు, ఈ దర్శనాలలోని సిద్ధాంతాలు మాత్రం ఆధునికదృష్టికి పలువిధాలుగా భిన్నంగా ఉంటాయి. సాంఖ్యదర్శనం విశ్వం యొక్క పుట్టుకను, ప్రకృతి పరిణామాలను ప్రకాశిస్తుండగా, దానికి జోడైన యోగదర్శనం మనిషి (జీవి) బాధాక్రోధాలనుండి విముక్తిచెంది మహదానందంతో ఆత్మసాయుజ్యత చెందడానికి నిజజీవితంలో ఉండవలసిన ప్రవర్తనను విశదీకరిస్తోంది. ఈ తర్కవిశ్లేషణ యోగదర్శనంలో దైనిక అలవాట్లు, ఆచారాలు నెలకొల్పడానికి తోడ్పడుతుంది. అంతేకాదు, నాస్తికదర్శనాలైన జైన, బౌద్ధ దర్శనాలకి కూడా సాంఖ్యవిశ్లేషణమే ఆద్యము. ఇప్పటివరకూ వివరించిన ఆస్తికదర్శనాలు వ్యక్తిగత తత్వచింతనకి సంబంధించినవికాగా, మీమాంసవేదాంతదర్శనాలు యావత్ సమాజానికి, యావత్ విశ్వానికి తత్వబోధని చెయ్యడానికి, విశ్వంలోని ప్రతి అణువుతోను ఆత్మసాయుజ్యత అనే ఆశయాన్ని సాధించడానికి బోధననందిస్తాయి. మీమాంసదర్శనం సమాజంలో దేశకాలోచితమైన క్రతువులను, విశ్వంలోని వివిధ సృజనాత్మకతలకి ప్రతిరూపాలని విశ్వదేవతలను ప్రసన్నులను చేసుకోవడం వివరిస్తుండగా , దానికి జోడైన వేదాంతదర్శనం అన్ని విభాగాలను అధిగమించి విశ్వంతో జీవుడు ఒకటయ్యే మార్గాన్ని చెబుతోంది. దానినే వివిధ వేదాంతసంప్రదాయాలవారు అద్వైతానుభూతి అని, లేదా ద్వైత భగవత్సన్నిధి అని పలురకాలుగా పేర్కొంటున్నాయి.
ఛాందోగ్య ఉపనిషత్తులో సనత్కుమారుడు నారదునికి భూమవిద్య ఉపదేశించిన ఘట్టం వర్ణింపబడి ఉంది. అందులో మేధాశక్తి ఎన్ని పొరలుగా విభజించబడి ఉందో వర్ణించి, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, వివేకము మొదలైన పదాలను స్పష్టంగా నిర్వచించి వాటి మధ్య అంతరాలను విశ్లేషించారు. వస్తువులకి స్థిరమైన పేరులు ఆపాదించే నామం జ్ఞానానికి అతి స్థూలమైన గుణమని ఇక్కడ చెప్పబడివుంది. ఈ అతిస్థూలమైన నామంనుండి వరుసగా వివిధ సూక్ష్మమైన గుణాలు ఈ వరుసలో వర్ణించారు: నామానికన్నా గొప్పది ఆధారమైన అది పలికే వాక్కు, వాక్కుకన్నా గొప్పది మనస్సు, మనసుకన్నా గొప్పది సంకల్పము, సంకల్పానికన్నా గొప్పది చిత్తము, చిత్తానికన్నా గొప్పది ధ్యానము, ధ్యానానికన్నా గొప్పది విజ్ఞానము, విజ్ఞానానికన్నా గొప్పది (మనో)బలము, బలానికన్నా గొప్పది (ఆలోచనలు పారే)జలము, జలానికన్నా గొప్పది (ఆలోచనలను రగిల్చే) తేజస్సు, ఆ వేడిమికన్నా గొప్పది (సమస్త మనోవస్తువులను నిలిపే) ఆకాశము, ఆ ఆకాశముకన్నా గొప్పది (వాటిని మనస్సులో తిరిగిరప్పించగల) స్మరణము, ఆ స్మరణకన్నా గొప్పది (మనోవస్తువలను రప్పించాలన్న) ఆశ, ఆ ఆశకన్నా గొప్పది (మనోకాలాన్ని గణించే) ప్రాణం, ప్రాణానికన్నా గొప్పది నిశ్చలమైన ఆత్మదృష్టి, దానినే సత్యం అంటారు, ఆ సత్యానికన్నా గొప్పది మతీవిజ్ఞానం (ఆలోచించే మతి, అది రప్పించే విజ్ఞానం, రెండూ ఒకటే అనే ప్రగాఢదృష్టి), ఆ మతీవిజ్ఞానానికన్నా గొప్పది (నిశ్చలధ్యానంపై) శ్రద్ధ, ఆ శ్రద్ధకన్నా గొప్పది నిష్ఠ, ఆ నిష్ఠకన్నా గొప్పది (ధ్యానం నడిపే) కృతి, ఆ కృతికన్నా గొప్పది (ధ్యానం కలిగించే) సుఖం, ఆ సుఖంకన్నా గొప్పది (అనంతానుభూతిపై మతిని నిలిపే) భూమం, ఆ భూమంకన్నా గొప్పది న-అన్యత్వం (మరేమీ లేదు అనే అనుభూతి), ఆ నాన్యత్వంకన్నా గొప్పది అది గమనించి “అహం పురుషం” అని చూడగల ఉత్తమపురుషత్వం, ఆ ఉత్తమపురుషత్వం కన్నా గొప్పది అన్నింటికీ ఆధారభూతమైన ఆత్మత్వం. ఈ ఛాందోగ్య ఉపనిషత్తులోని ఉపదేశం ప్రకారం మనిషి జ్ఞానమూర్తిగా ఉదయించడం అంటే ధ్యానమార్గంద్వారా జ్ఞానానికి స్థూలమైన అంశాలనుండి జాగ్రత్తగా సూక్ష్మమైన అంశాలపై దృష్టి మరల్చి, వాటిపైనే ధ్యానం నిలుపుకోవడం. అదే మేధాశక్తి.
ఈ ఇచ్చిన వరుసలో కృత్రిమమేధ కేవలం నామరూపమైన మేధకాగా, ఈ సాధనాలని ఉపయోగిస్తున్న వినియోగకుడు వాక్కు రూపంలో మేధని ప్రసన్నం చేసుకున్నట్టు లెక్క. ఈ రెండూ కూడా మంచివే, ధ్యానమార్గానికి సాధనాలుగా చూడవచ్చు. కానీ, అక్కడతో ఆగిపోదు. సాధన ఎన్నో మెట్లు పైకి ఉంది. ఈ మెట్లన్నింటినీ ఎక్కడానికి కృతిమమేధ ఉపయోగపడగలదా? ఈ ప్రశ్న హాస్యాస్పదంగా తోచవచ్చు. ప్రస్తుతం వినియోగాలలో కృత్రిమమేధను కేవలం మనుష్యులను పరధ్యానం కలిగించడానికే వాడుతున్నారు. ధ్యానానికి సాధనమైన ఒక తంత్రజాలంలా వాడట్లేదు. కానీ, అలా ఎందుకు కాకూడదు? భారతీయ సంస్కృతి ప్రకారం, తత్వచింతన ప్రకారం కృత్రిమమేధ నిర్మాణానికి ఇలా ఒక అమూల్యమైన ఆశయం ఉంది. ఇది భారతీయశాస్త్రవేత్తలమైన మనం గుర్తించలేదు. కృత్రిమమేధను కేవలం పాశ్చాత్యదృష్టిలోనే చూడడంవలన ఈ ఆశయం గోచరించదు.
క్రైస్తవమత చింతనలో జీవనవిలువలు, కృత్రిమమేధపై విమర్శలు
కృత్రిమమేధ వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించేముందు, మానవజీవితం యొక్క అత్యుత్తమ విలువలు ఏమిటి అని నిర్ణయించాలి. మనిషి యొక్క శారీరిక లేదా మానసికశ్రమని తగ్గించే సాధనాలుగా యంత్రాలు నిర్మించినప్పుడు, తద్వారా దొరికిన వెసులుబాటుతో మనుష్యులు ఏమి చేస్తారు అనేది ఆ జీవనవిలువలే నిర్ణయిస్తాయి. పాశ్చాత్య ఆలోచనాశైలిలో కృత్రిమమేధను చూడడానికి గ్రీకు తత్వవేత్తల సిద్ధాంతాలతోపాటు క్రైస్తవమతం యొక్క గాఢమైన ప్రభావం చూపింది. కృత్రిమమేధ అంటే ఈశ్వరుడు సృష్టించిన జీవసృష్టికి పోటీగా మరొక్క మనస్సుని సృష్టించడమని, అది మనిషి తనే దేవుడని విర్రవీగే అహంకారానికి చిహ్నమని, దానివలన పతనం తప్పదని భయం కల్పించడంతోపాటు, క్రైస్తవమతం ఈ కృత్రిమమేధను సరిదిద్దడానికి కొన్ని సూచనలు కూడా అందిస్తుంది. ఇది మూడు విధాలుగా ప్రభావం చూపుతోంది.
కారణత్వం: మొదటగా, విశ్వానికి సృష్టికర్త అయిన ఈశ్వరుడు విశ్వానికి అతీతంగా విడబడి ఉన్నాడని, అందువలన విశ్వంలోపల ఎటువంటి వస్తువుకైనా దైవత్వం లేదని యూదుమతం నుండి సిద్ధాంతం పుట్టింది. ఇదే ఆలోచన క్రైస్తవ, ఇస్లామిక మతాలలో కూడా ప్రబలి ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం మిగిలిన వృక్ష, జంతుజీవాలకు అతీతంగా కేవలం మనుష్యులలో మాత్రమే మేధాయుతమైన చైతన్యం (సోల్) సృష్టికర్తచే ఇవ్వబడింది. మిగిలిన ప్రాణులన్నీ మనుష్యుల అవసరాలకు వినియోగించబడేందుకు సృష్టించబడ్డాయి. వాటికి స్వతహాగా ధర్మంకానీ, జీవనవిలువకానీ లేదు. మనుష్యులకు కూడా వారి అత్యుత్తమ జీవనవిలువ సృష్టికర్తను పూజించడంలోను, అతని సృష్టిపైన అతని అధికారంపైన నమ్మకం ఉంచడంలోను నిమిడి ఉంది. సృష్టిలో ఏర్పడే ప్రతీ పరిణామం వెనుక ఒక కారణం ఉందని, ఈ కారణాలు ఒకదాని వెనుక ఒకటి గొళుసులా పట్టుకునివెళ్తే అంతంగా ప్రాథమిక కారణం (ప్రైమల్ కాజ్) సృష్టికర్త వద్దకు వెళ్తామని, అందువలన కారణవిచారణ జరుపగల మేధస్సు సృష్టికర్తను పూజించడంవినా మరొక ఏ విధమైన అంశం దగ్గర ఆగినా, అది అల్పబుద్ధియని ఈ మతాల సిద్ధాంతం. ఇప్పటికీ కూడా కృత్రిమమేధ పరిశోధనలో కారణత్వం (కాజాలిటీ) అనే విభాగం ప్రముఖంగా అధ్యయనంలో ఉంది. పాశ్చాత్య గణితశాస్త్రంలో కూడా సిద్ధాంతం (థీరం) ప్రవచించడం, తరువాత దాని నిరూపణ (ప్రూఫ్) మెట్లవలే ఎక్కి రప్పించడం, అన్నింటికీ మునుపు ప్రాథమిక నిబంధనలతో (ఏగ్సియం) అంగీకృతి చూపించడం ఈ కారణత్వాన్నే అనుసరించి ఉన్నాయి. భౌతికశాస్త్రంలో విశ్వం యొక్క భౌతిక నియమాల పుట్టుక, వాటి పరిణామం, విశ్వంలోని వివిధ నక్షత్రాల గ్రహాల ఎదుగుదల, ఆ పైన భూమిలోని జీవజాలపుట్టుక జీవపరిణామం అంతా ఒక నిలువాటి చరిత్రరేఖ మీదుగా రావాలి. ఈ కారణాలన్నీ గొళుసులా ఒకదానికొకటి జోడించి ఉంటే, అన్నింటికీ అంతిమంగా ప్రాథమిక కారణం ఒకటి ఉండాలి (దానిని ఈశ్వరుడు అన్నా, అనకపోయినా అసందర్భం). ఈ కారణత్వదృష్టిలో కృత్రిమమేధను మెరుగుపరుచుకోవాలంటే, అది ఉత్పాదించే ఫలితాలను, వివరించే స్థితిగతులను మునుపు స్థాపించిన సిద్ధాంతాలకు కారణప్రదంగా అన్వయించాలి. కానీ ఈ రేఖీయమైన కారణత్వం (లీనియర్ కాజాలిటీ) అన్ని సంస్కృతులలోను లేదు, భారతీయ తత్వచింతనలో అది ఖండించబడి ఉంది.
శాసనాల ద్వారా ప్రవర్తనానియంత్రణ: రెండవది, క్రైస్తవమతం ప్రకారం మనుష్యులకు సహజంగా దైవత్వం లేదుగనుక సృష్టి రహస్యాలను ఛేదించడానికి శబ్దరూపంలో ఒక సమాచారం అవసరం అని నమ్మకం. ఈశ్వరుడినుండి అటువంటి సమాచారం అందించడానికి ప్రవక్తలు (ప్రోఫెట్) పుడతారు అని, వారి ఉవాచద్వారా భాషారూపంలో సమాచారం వెల్లడవుతుంది అని, అత్యుత్తమ జీవనవిలువలు ఏవైనా సాధించటానికి ఆ ఉవాచ సరిపోతుంది అని నమ్మకం. ప్రవక్తల సంగతి ప్రక్కన పెడితే, సరిపడే సమాచారం అంతా ఒక పరిమితమైన భాషరూపంలో బంధించడం కుదురుతుందా అన్న ప్రశ్న అక్కడ ఉదయించలేదు. భాష యొక్క సంపూర్ణతను ఎప్పుడైతే ప్రశ్నించలేదో ఒక ప్రతిపాదనం కచ్చితంగా నిజమో లేదా అబద్ధమో అవుతుంది, తప్ప మరేదీ కాదు. ఈ రెండు వైపులు ప్రపంచంలోని అన్ని సంభావనీయతలను వివరించగలవని నమ్మకం. దీనిని ద్విపక్షతర్కం (రెండువైపుల తర్కము) అనవచ్చు. భారతీయ తత్వచింతనలో ఇది తీవ్రంగా ఖండించబడినది. పరిమితమైన భాషలో తర్కపరిశీలన చెయ్యడం భాషాదాశ్యత్వం అవుతుందని హైందవ సిద్ధాంతము. భారతీయ తర్కవిచక్షణలో ఒక ప్రతిపాదనముకు రెండువైపులు కాకుండా, అనేకవైపులు ఉన్నట్టు గుర్తించారు. దీనిని బహుపక్షతర్కం అనవచ్చు. ఉదాహరణకు చతుష్కోటి అను బౌద్ధతర్కంలో ఒక ప్రతిపాదనముకు నాలుగువైపులు ఉన్నట్టు గుర్తించారు (నిజము, అబద్ధము, నిజము మరియు అబద్ధము, నిజమూకాదు అబద్ధమూ కాదు). చీనా తత్వసంప్రదాయంలో కూడా ఇ-చింగ్ అను తర్కవిచారణలో బహుపక్షతర్కం వాడతారు. ఇందుకు విరుద్ధంగా, క్రైస్తవులు కానీ, మహమ్మదీయులు కానీ ఒక పుస్తకాన్ని ప్రమాణంగా పెట్టుకుని, అత్యుత్తమ జీవనవిలువలకి అవసరమైన విశ్వరహస్యాలన్నింటికీ అది సరిపోతుందని నమ్ముతారు. ఈ పుస్తకాన్ని వేరొక భాషలోకి అనువదించేడప్పుడు కూడా, భావసారాంశం అంతా మరొక భాషలోకి పంపించడం వీలవుతుందని నమ్ముతారు. ఎటువంటి భాషకైనా పరిమితులు ఉంటాయా అని గుర్తించరు. ఈ మతప్రచారపద్ధతులు ధార్మికదృష్టికి విరుద్ధంగా ఉంటాయి. క్రైస్తవదృక్పథం ప్రకారం కృత్రిమమేధకి సంబంధించిన వ్యవహారాలు ఈశ్వరుడు ప్రవక్తరూపంలో అందించిన బైబులు తదితర గ్రంథాలలో క్రోడికృతమైన కట్టుబాట్లకు అనుగుణంగా ఉన్నాయా లేదా విరుద్ధంగా ఉన్నాయా అని పరిశీలించాలి. లౌకికదృక్పథంలో బైబిలు బదులు దేశరాజ్యాంగం వాడుతారు, కానీ అదే రీతిలో న్యాయవిచారణ జరపాలి. కానీ, భారతీయతత్వచింతన దృష్ట్యా ఇటువంటి పరిమితమైన న్యాయవిచారణ నిష్ప్రయోజకమైనది.
ప్రత్యేకత్వం, అది నిలిపే హక్కులు: మూడవది, క్రైస్తవమతదృక్పథం ప్రకారం ప్రతి మనిషికి ప్రత్యేకమైన “సోల్” (మనస్సు) అనేది ఈశ్వరునిచే ఇవ్వబడి ఉంది. వివిధ ప్రజల మనసుల మధ్యన, లేదా మనుష్యుల మనస్సులకి ప్రకృతికి మధ్యన సంబంధాలు లేవు. ఈ విధమైన ఒంటరిపాటు వలన ప్రతిమనిషికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం (ఇండివిడ్యువాలిటీ) జీవనహక్కులు ఉంటాయి. ఇదే దృష్టిలో కృత్రిమమేధని చూసినప్పుడు, ఆ కృత్రిమమేధ కూడా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగివున్నట్టు తోచుతుంది. దానికి ప్రక్కనున్న మనుష్యులతోగానీ, ప్రకృతితోగానీ అవినావసంబంధం ఏమీ ఉండదు. అలాంటి కృత్రిమమేధ శాసిస్తున్న ప్రపంచంలో మనుషులకు, ఇతరజీవాలకు ఏవన్నా హక్కులు కల్పించాలంటే, అది కూడా ప్రత్యేకమైన వ్యక్తిగతమైన మానవహక్కులుగా కల్పించాలి. వీటిని శాసనాలలోను, చట్టాలలోను క్రోడీకరించాలి. కానీ, ఇటువంటి వ్యక్తిగతమైన ఒంటరిపాటు అస్థిత్వం భారతీయ తత్వచింతనలో ఖండించబడి ఉంది. చీనా తాత్వికసంప్రదాయంలో జీవనవిలువలు మానవకేంద్రీకృతంగా, వ్యక్తిగత ప్రత్యేకత్వంగాను ఉండవుగనుక వారి తాత్వికదృష్టిలో కృత్రిమమేధ వేరేగా ఉంటుంది.
క్రైస్తవజీవనవిలువల ప్రకారం కృత్రిమమేధ విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. బాధ్యతాయుతంగా కృత్రిమమేధ నడుచుకోవాలంటే అవసరమైన పారదర్శకత, ఉపరిదృష్టి ఈ విలువలను అనుసరించి ఉండాలి, ఈ నడవడిక వారి ధార్మికగ్రంథాలలో వెల్లడైన నియమాలకు అనుగుణంగా ఉందో లేదో పరీక్షించగలిగేట్లు ఉండాలి. ఈ పరీక్ష కేంద్రీకృతమైన అధికారంద్వారా చెయ్యవచ్చు, అభ్యంతరం లేదు. కృత్రిమమేధ యొక్క సత్తువ, మర్యాద, శ్రేయస్సు మానవజీవితానికి ఈ క్రైస్తవవిలువల ప్రకారం నిర్ణయించవచ్చు. ఇదే నిర్ణయాలు ఇతరసంస్కృతుల నైతికవిలువలపరంగా తీసుకుంటే సహజంగానే వైవిధ్యంగా ఉంటాయి.
భారతీయసంస్కృతిలో జీవనవిలువలను పురుషార్థాలుగా గుర్తించారు. ఇవి నాలుగు: కామము, అర్థము, ధర్మము, మోక్షము. శారీరికసుఖాలను కామం సూచిస్తుంటే, మానసికసుఖాలను అర్థం సూచిస్తోంది. డబ్బు కేవలం ఒక ఆలోచన మాత్రమే. డబ్బు అనే ఆలోచనను సంఘం మొత్తం అంగీకరిస్తే, ఆ డబ్బుని కలిగియుండడంద్వారా వివిధ ఐహికసుఖాలను మనిషి పొందవచ్చు. కృత్రిమమేధ ఉపయోగించి అర్థకామాలను నెరవేర్చుకోవచ్చు, అవి నాణ్యమైన పురుషార్థాలే. కానీ, ఈ యత్నంలో మిగిలిన రెండు పురుషార్థాలను మరిచిపోరాదు. ధర్మం అనగా ఒక మనిషికానీ, ప్రకృతిలో ఎటువంటి జీవి అయినాకానీ జీవించడానికి అవసరమైన నియమాలు. దీనినే ఆధునికకాలంలో సుస్థిరత్వం, నిత్యపుష్టిత్వం (సస్టెయినబిలిటీ) అంటున్నారు. కృత్రిమమేధ ఉపయోగించడం వలన ప్రకృతి ఎక్కడైనా దెబ్బతింటోందా, మనుష్యుల సంబంధాలు ఏవన్నా దెబ్బతింటున్నాయా అని పరిశీలించాలి. ధర్మవిరుద్ధంగా కృత్రిమమేధ వినియోగించరాదు. ప్రతిమనిషికి తనపుట్టుకను అనుసరించి, దేశకాలసమయాలను అనుసరించి ధర్మం ఉంటుంది. ప్రకృతిలో ప్రతిజీవికి ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది. ధర్మబద్ధంగా ప్రపంచం మొత్తం నడుచుకుంటే అందరికీ సుఖసౌఖ్యాలు అందుతాయి. ఏ జీవి ధర్మానికైన విశ్వం యొక్క ఋతం ఆధారం. ఋతధర్మం అనుసరించి వానలు పడుతాయి, పంటలు పండుతాయి, కాలచక్రం ముందుకు నడుస్తుంది. ఆ ఋతధర్మాన్ని గౌరవించి, ప్రకృతిలో పవిత్రతను గౌరవించి, పుణ్యకార్యాలు చేస్తూ ప్రతిమనిషి తన స్వధర్మం ఆచరించాలి. కృతిమమేధను ఈ ధర్మాచరణకు ఒక సాధనంగా మలుచుకోవచ్చు. మోక్షం అనగా ఐహికదుఃఖాలనుండి విముక్తి. ఇది ముందు వివరించనట్టు జ్ఞానామృతాన్ని ఆశ్వాదించడంవలనే వస్తుంది. వివిధ సంప్రదాయాలు ధ్యానమార్గాలను సూచిస్తున్నాయి. కృత్రిమమేధ సాధనాలు వీటికి తోడ్పాటులా ఉండాలంటే, మనిషి శారీరిక ధృఢత్వానికి, మానసిక ధృఢత్వానికి వ్యాయామసాధనాలుగా ఉండాలి. జ్ఞాపకశక్తి, ధారణాశక్తి, నిశ్చలమైన ధ్యానపటుత్వాన్ని పెంపొందించేటట్టు ఉండాలి. కానీ, అవి మానసికవ్యసనాలను అలవర్చి, యాంత్రికసాధనాలను మనిషి ఊతకర్రలుగా వాడేటట్టు చేసి, మానవసహజమైన మేధాశక్తులను ధ్వంసంచెయ్యరాదు. కృత్రిమమేధను మెరుగుపరుచుకోవడానికి పైన పరిశీలించిన పాశ్చాత్య నైతికవిలువలకు తారతమ్యంగా భారతీయ ధార్మిక నైతికవిలువలను ప్రతిష్టింపుకోవచ్చు.
కారణత్వం బదులు యజ్ఞబంధం: ధార్మికచింతన ప్రకారం ప్రకృతి స్వయంభువు. వేరే ఎవరూ సృష్టించలేదు. ప్రకృతిలోని ప్రతి పరిణామానికి కారణం ఉండదు. స్థూల విషయాలకు సూక్ష్మ విషయాలు కారణభూతంగా ఉన్నా, సూక్ష్మవిషయాలన్నింటికీ కారణాలు వెతికి గొళుసులా పట్టి, అన్నింటికీ కారణం భగవంతుడేనని నిర్ధారించలేము (ఒక ద్వైత సంప్రదాయంలోనే ఈ తీవ్రమైన కారణత్వదృష్టి ఉంటుంది). ప్రకృతిలో అగ్ని, జలం, నక్షత్రాలు, సూర్యచంద్రులు అన్నింటిలోను దైవత్వం ఉంది. వివిధ అంశాలమధ్యన అవినాభావసంబంధం ఉంది. కలిసికట్టుగా ఒకరినొకరు సహకరించుకుంటూ ఋతమనే కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తారు ఈ దేవతలు. దేనినీ ఆశించని ఈ నిర్మలమైన సహకరింపునే యజ్ఞం అంటారు. మనుష్యులు కూడా ఈ దైవత్వం తమ అంతరాత్మలో నిలుపుకుని తమ జీవితాన్నే యజ్ఞంలా మరల్చుకోవాలి. మనుష్యులేకాదు, అనంతమైన ఈ యజ్ఞంలో విశ్వంలోని ప్రతి జీవి, ప్రతి వస్తువు భాగస్వామినే. కృత్రిమమేధ కూడా అందులో ఒక సహభాగమే. ధార్మికదృష్టి ప్రకారం కృత్రిమమేధను మెరుగుపరుచుకోవాలంటే వివిధ సాధనాలని ఒంటరి యంత్రాలుగా భావించక, వాటిమధ్యన సాయుజ్యం పెంచుకోవాలి. ఒకటికొకటి సమాచారం అందించుకొంటూ, పనితీరును భేరీజువేసుకుంటూ, సత్వమైన జ్ఞానసంపదని రప్పించుకోవాలి. ప్రకృతిలోని వివిధజీవుల ధర్మానికి కృత్రిమమేధలు కూడా తోడ్పాటుగా ఉండాలి.
చట్టాల నియంత్రణ బదులు ఆర్యభాషాసంవృద్ధి: ఆర్యసంస్కృతి అంటే పైన వివరించిన యజ్ఞబంధాలను సమాజంలో దైనిక జీవనంలో ఎల్లవేళలా ప్రదర్శించడమే! ఆర్యము అన్న పదము ప్రవాహము అన్న మూలం నుండి వ్యుత్పత్తి అయ్యింది. “ఋ గతికరణే” (ప్రవహించుట) అను అర్థమున్న “ఋ” ధాతువుకు “న్యత్” ప్రత్యయం జోడించి “ఋహలోన్యత్” అను పాణిని సూత్రం ద్వారా సంస్కృతంలో “ఆర్యం” అన్న పదం పుడుతుంది. నదులకు కాలువలు నిర్మించి, భూమిని సస్యశ్యామలం చేసి, పంటలు పండుతుంటే సమస్తజీవాలు సుఖంగా జీవించటమే ఆర్యసంస్కృతి. జ్ఞానానికి ప్రతిరూపం ఒక మహానదియైన సరస్వతి అని ఈ సంస్కృతి గుర్తించింది. ఉత్తరభారతంలోని గంగా, సింధూ మహానదుల పర్యవ్యాప్తమైన సస్యభూమిని ఆర్యావర్తం అని మన చరిత్రలో పేర్కొన్నారు. మూర్ఖులైన పాశ్చాత్యులు దీనికి జాత్యహంకారసిద్ధాంతాలు జోడించుట వేరొక తతంగం. కానీ, భారతీయసంస్కృతికి సరైన సమానార్థం ఆర్యసంస్కృతి. అటువంటి ఆర్యసంస్కృతి ఎటువంటి కృత్రిమమేధ సాధనాలనైనా జ్ఞానరూపమైన సరస్వతి యొక్క జలాలను అందించే కాలువలుగా చూస్తుంది. ఈ కాలువలు కల్మషము అవకూడదు. ఈ కాలుష్యాన్ని అరికట్టాలంటే సహజంగానే చట్టాలు, శాసనాలు కావాలి. కానీ, అంతకంటే మిన్నగా, ఒకదానితో ఒకటి ఈ జ్ఞానసంపదను కలుపుకుంటూ, సరస్సులవలే నిర్మలమైన జ్ఞానభాండాగారాలను నిర్మించుకుంటూ, సమస్తజీవాలకోసం ఉద్యానవనాలవంటి సామాజిక వినియోగసాధనాలు కల్పించుకుంటూ, జీవనాన్ని పండుగగా చేసుకోవచ్చు. అంతమంది ప్రజలు కృత్రిమమేధ వాడడంలో నేర్పరులైనప్పుడు, వారి భాషలోనే ఆ పాండిత్యం కనపడుతుంది. క్లిష్టమైన భావాలను కూడా సులభంగా వ్యక్తీకరించగలిగే ఆర్యభాషగా రూపాంతరం చెందుతుంది. అవే భాషలని ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, కృత్రిమమేధని నిర్మించుకోవడానికీ ఉపయోగిస్తారు. భాషలోని పదజాలం దత్తాంశాలను సంశోధించడానికి సాధనంగా ఉండి, సంక్షిప్తమైన ఆదేశాలతోనే క్లిష్టమైన విశ్లేషణలు చెయ్యడానికి తోడ్పడుతుంది. అంతమంది కళ్ళు, నాలుకలు చురుకుగా పనిచేస్తుండగా భావకాలుష్యం రాదు. ఆ ఆర్యభాషసంవృద్ధియే ధర్మసంరక్షణకి పునాది.
ప్రత్యేకత్వం నిలిపే హక్కుల బదులు ప్రకృతివిజ్ఞానం: ధార్మికదృష్టిలో ప్రకృతిలోని సమస్తజీవాలు వాటి అస్థిత్వాలను ఒకదానితో ఒకటి ముడివేసుకుని ఉన్నాయి. ఈ బంధుత్వాన్నే వేదాలు ఇంద్రజాలం అని వర్ణించాయి. ఒక శాలిగూడుపైన కురిసిన వర్షబిందువులు ఒకదానినొకటి ఎలా ప్రతిబింబించి మెరుస్తూ ఉంటాయో, అదే విధంగా జీవుల అంతరంగాలు కూడా ఒకదానినొకటి అద్దాలమేడలా ప్రతిబింబించి నిర్మిస్తాయి అని బౌద్ధుల అభిప్రాయం. ఆయుర్వేదం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సర్వం ఆరోగ్యంగా ఉండాలని చెబుతోంది. ఇదే స్వస్థత మన మానసిక వ్యాపకాలలోను కూడా ఉండాలి. కృత్రిమమేధ ఉపయోగించే మనుష్యులకు హక్కులు, అధికారాలు ఏమున్నాయి అని నిర్ణయించవచ్చు. కానీ, దీనికంటే విస్తృతంగా మనుష్యులయొక్క ధర్మం గురించి బాధ్యతలగురించి చర్చించాలి. ధర్మాచరణకు శాసనాలు సరిపోవు. సహనంతో కూడిన శిక్షణ అవసరం. కృత్రిమమేధ పురుషార్థాలను సముపార్జించేందుకు ఒక సాధనంగా రూపొందితే, వివిధ ధార్మిక సాంప్రదాయాలు ఈ సాధనాలను వారి విధులలోను, క్రతువులలోను, ధ్యానముద్రణలలోను ఒక భాగంగా ఉపయోగిస్తారు. అటువంటి సమాజంలో ధర్మం అన్నిచోట్లా ధృఢంగా నిలబడుతుంది. ప్రకృతివిజ్ఞానానికి ఋతం ఆనగా ఉంటుంది.
ప్రస్తుతమున్న కృత్రిమమేధసాధనాలు ఆర్యప్రజ్ఞ అనే ఆశయానికి పలువిధాలుగా విరుద్ధంగా ఉన్నాయి: దత్తాంశాలను విపరీతంగా సేకరించడం, వాటిని ప్రజలకంటబడకుండా ఒక చీకటిచోట కేంద్రీకృతించడం ఆర్యసంస్కృతినిగాక ఒక గనులలో ఖనిజాలను పెళ్లగించే ఒక నిష్కర్షక సంస్కృతిని సూచిస్తున్నాయి. ఎడారులలో నీటిని ఒకచోట మూటగట్టి మిగతా ప్రాణులకు అందకుండా చేసే ఒక దోపిడీసంస్కృతిని సూచిస్తున్నాయి తప్ప నీరు (దత్తాంశాలు) నిర్మలంగా ప్రవహింపజేసి అందరికీ పంచే ఆర్యసంస్కృతిని సూచించటం లేదు. ఈ దత్తాంశాలు మురికికూపంలో పడి కదలకుండా ఉండటం వలన వివిధ మనోవికారాలతో కలుషితమై పక్షపాతఫలితాలు పుట్టిస్తున్నాయి. ఇవి నదులవలే ప్రవహిస్తూ సూర్యరశ్మివంటి మానవవివేక తేజస్సుతో ప్రక్షాళితమై వర్షరూపంలో అంతటా కురవట్లేదు. ఆర్యసంస్కృతిలో ప్రజ్ఞ ప్రతిష్టాపించుకోవాలంటే దత్తాంశాలద్వారా నిర్మితమైన కళారూపాలు సమాజం అంతటా కురిసి ప్రజల చిత్తాలను పంటపొలాలవలే హరితభరితం చెయ్యాలి. ప్రజలందరి భాషాపాటవంలోను విజ్ఞానకౌశల్యాన్ని ధ్యానశీలతను పెంపొందించాలి, దానికి విరుద్ధంగా వారిని రకరకాల మనోవ్యసనాలకు దాసులను చెయ్యగూడదు.
పురుషార్థాలను అనుసరించిన ఈ నైతికవిలువాలను కృత్రిమమేధ సాధనాలలో ప్రతిష్టింపుకోవడానికి సహజంగానే మనం చాలాకృషి చెయ్యవలసివుంది. ప్రస్తుతమున్న యంత్రతంత్రజాలాన్ని సాంతం సద్విమర్శ చెయ్యాలి, నవీన సాధనాలను సృష్టించుకోవాలి. కృత్రిమమేధ శిక్షణకు నిర్మాణానికి ప్రజలకు వారి మాతృభాషలలోనే విద్యాసాధనాలు కల్పించాలి. ఈ సమస్తయంత్రాంగం మన సంస్కృతిలో భాగంగా, మన కళలకు భాషలకు ఆర్యప్రజ్ఞాసాధనాలుగా అమర్చాలి. తద్వారా మన ధర్మశాస్త్రాలను, తత్వచింతనను ఆధునికయుగంలోకి నడిపించుకోవాలి. కానీ, ఈ బాధ్యత భారతీయులదే. ఎవరి సంస్కృతిని బట్టి వారు యంత్రాలను, పరిశ్రమలను నిర్మించుకుంటారు. ఒక ప్రామాణికమైన భారతీయాదృష్టిని వీటిని నిర్మించుకునే యత్నం మనం ఇంకా మొదలిడలేదు. శ్రీఘ్రమేవ కార్యసిద్ధిరస్తు!
ఏదోలాగ మొదలౌతుంది ఏదోవేళ ఏదోచోట భవిష్యత్తు అలా నేను ఇంకా వేచుండేది లేదు ప్రేమ తయారయ్యేది ధైర్యంతోనే ఇంకా ఆలోచిస్తూ కూర్చోను నేను అగ్నిచక్రాలు తోలుతూ పోతాం మనం చీకట్లో గుండా భవిష్యత్తువైపు
నీ చెయ్యి ఇవ్విలా నాకు ఇసుకతో ఓ కోట కడతాను నీకు ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ కాలం పక్వానికొచ్చింది కొంచెం లేతదనంకోసం ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
దిగంతరంలో కాలంలో పడుతుండగా ఒక స్వప్నంలోంచి మెలకువ వచ్చింది కేవలం ఒక రెప్పపాటుకి తరువాత రాత్రి తిరిగొస్తుంది
ఏదోలాగ మొదలౌతుంది ఏదోవేళ ఏదోచోట భవిష్యత్తు అలా నేను ఇంకా వేచుండేది లేదు ప్రేమ తయారయ్యేది ధైర్యంతో ఇంకా ఆలోచిస్తూ కూర్చోను నేను అగ్నిచక్రాలు తోలుతూ పోతాం మనం చీకట్లో గుండా భవిష్యత్తువైపు
నీ చెయ్యి ఇవ్విలా నాకు ఇసుకతో ఓ కోట కడతాను నీకు ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ కాలం పక్వానికొచ్చింది కొంచెం లేతదనంకోసం ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
నీ చెయ్యి ఇవ్విలా నాకు ఇసుకతో ఓ కోట కడతాను నీకు ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ కాలం పక్వానికొచ్చింది కొంచెం లేతదనంకోసం ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ
జర్మనుదేశపు గాయని నేనా 1984వ సంవత్సరంలో విడుదల చేసిన “ఇర్గెండ్వీ ఇర్గెండ్వో ఇర్గెండ్వాన్” (ఏదోలా ఎక్కడో ఎప్పుడో) అను జనరంజకగీతం ఇది.
జర్మనుభాషలో ప్రశ్నసూచకపదాలు ఆంగ్లభాషతో పోలిస్తే ఇంకాచాలా విస్తృతంగా సందర్భోచితంగా ఉంటాయి. ఉదాహరణకు, ఆంగ్లంలో “వై” (ఎందుకు) అన్న పదానికి సమానార్థంగా “వారుం” (ఎందుకు) అన్న పదంతో పాటు “వీసో” (ఎలాగని), “వెస్‌హాల్బ్” (ఎందువలన), “వెస్వేగెన్” (ఎందుగుండా, ఏవిధంగా) అన్న పదాలు ఉంటాయి. తెలుగులో పైకి సమానార్థంగా ఇచ్చిన పదాలతో పాటు ఎందుకోసం, ఎందుమూలంగా, ఎందుఫలితంగా, ఎందునుండి, ఎందుప్రకారంగా.. ఇలా ఎన్నెన్నో పదాలు ఉన్నాయి. ఆంగ్లభాషలో ఆలోచించడడానికి అలవాటు పడినవాళ్ళు ఈ విస్తృతమైన పదరాశిని కేవలం ఒకముక్కలో కుచించి ఆలోచిస్తున్నారు అన్నమాట. కారణవాక్యాలను “ఎందుకు, అందుకు” అని ఎలాగ నిర్మించగలమో జర్మను భాషలో కూడా “వారుం, దారుం”, “వెస్వేగెన్, దెస్వేగెన్”, “వెస్‌హాల్బ్, దెస్‌హాల్బ్” అని సూచించగలం. ఇదికూడా ఆంగ్లంలో కుదరదు. తెలుగులో దీనికంటా భావవ్యక్తీకరణకి కచ్చితత్వానికి వీటికంటా పెద్ద భాషాకౌశలం ఉంది. “ఎందుకు, అందుకు” అనేకాక “ఇందుకు” అని కూడా వ్యత్యాసం వ్యక్తీకరించగలం. అదేవిధంగా “ఎందువలన, అందువలన, ఇందువలన” ఇలాగ వందలకొద్దీ పదరాశి మనభాషలో అందుబాటులో ఉంది.
ఈ పైని గీతంలో నేనా ఉపయోగించిన “ఇర్గెండ్‌వీ ఇర్గెండ్వో ఇర్గెండ్‌వాన్” అన్న పదాలను సాధ్యమైనంత పోలికగా పదనిర్మాణాన్ని అనుసరించి నేను “ఏదోలాగ ఏదోచోట ఏదోవేళ” అని అనువదించాను.
నాకోసం కొంచెం సమయముందా నీకు ఉంటే నీకోసం ఒక పాట పాడుతా నేను ఓ తొంభైతొమ్మిది గాలిబుడగలు ఆకాశపుటంచులకి వెళ్ళే దారిలో నాగురించి అప్పుడే తలుచుకుంటున్నావా? ఉంటే నీకోసం ఒక పాట పాడుతా నేను ఓ తొంభైతొమ్మిది గాలిబుడగలు అటువంటిదాంట్లోంచి అటువంటిది వస్తుంది
ఓ తొంభైతొమ్మిది గాలిబుడగలు ఆకాశపుటంచులకి వెళ్ళే దారిలో గ్రహాంతరవాసులేమో అనుకోవచ్చు వాటిని అందుకని పంపించాడు వాటి వెనకో సేనాని వెనకనే ఒక యుద్ధవిమానాల దండుని అలా అయిటట్టు ఐతే హెచ్చరిక ఇవ్వమని కానీ ఆకాశపుటంచులన ఆని ఉన్నాయి కేవలం తొంభైతొమ్మిది గాలిబుడగలు
తొంభైతొమ్మిది రివ్వువిమానాలు ప్రతిదాంట్లో ఒకడు రాటుదేలిన వీరుడు తనొక కేప్టన్ కర్క్‌నని అనుకుంటున్నాడు ఒక పెద్ద బాణాసంచా మారుమోగింది ఇరుగుపొరుగుకి ఏమీ అర్థంకాలేదు వెంటనే మనసు పాడుచేసుకున్నారు ఆ సందడిలో పేల్చారు ఆకాశపుటంచులకి తొంభైతొమ్మది గాలిబుడగలపైకి
తొంభైతొమ్మిది యుద్ధమంత్రులు అగ్గిపుల్లలు పెట్రోలుడబ్బాలు తెలివైనవాళ్ళమని అనుకుంటున్నారు బలిసిన నిధికని ముక్కుపెట్టి ఉన్నారు యుద్ధం అని అరిచి, అధికారంకోసం చూస్తున్నారు ఓరినీ, ఎవడు అనుకున్నాడు ఇది ఇంత దూరం తతంగం నడుస్తుందని తొంభైతొమ్మిది గాలిబుడగల వలన
తొంభైతొమ్మిది గాలిబుడగల వలన తొంభైతొమ్మిది గాలిబుడగలు
తొంభైతొమ్మిది ఏళ్ల యుద్ధం విజేతలకి ఎక్కడా మిగలలేదు చోటు యుద్ధమంత్రులు ఇంకెవ్వరూ లేరు రివ్వువైమానికులు కూడా ఇంకేమీ లేరు ఈరోజుకి నావంతు ఓ చుట్టొస్తున్నాను లోకం అంతా ధ్వంసమై పడుంది మొత్తానికి కనపడింది ఒక గాలిబుడగ నీగురించి తలుచుకుని పోనిచ్చాను దానిని
జర్మను దేశపు గాయని అయిన నేనా 1983వ సంవత్సరంలో విడుదలచేసిన “నాయ్న్ ఉండ్ నాయింత్సిగ్ లుఫ్ట్‌బలోన్స్” (తొంభై తొమ్మిది గాలిబుడగలు) అనే ఈ పాట అద్భుతమైన ఆదరణ సంపాదించింది. అప్పట్లో తూర్పు పశ్చిమ జర్మనీ దేశాలమధ్య, రష్య అమెరికా మహాసైన్యాల మధ్యన విపరీతమైన ఉద్రిక్తత ఉండేది. ఈ సమయంలో యువతీయువకులకి ఆ యుద్ధ ఉద్రిక్తతో విసుగెత్తి ఇటువంటి పాటలని పాడి గాలి పీల్చుకునేవారు.
కళ్ళకి దూరంగా, గుండెకి దూరంగా ఉంటే అన్నావు నువ్వు అన్నిట్లోకి అందమైనది ఏమిటో మరచిపోతామని అన్నావు నువ్వు ఆ దూరాలు ఆకాశపుటంచులు ఎలా ఉన్నా తను నన్ను ఇప్పటికీ ప్రేమిస్తోందని నాకు తెలుసు ఆ అమ్మాయికి నేను పెట్టిన ముద్దుపేరు
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
మహాసముద్రం, అది చిన్నది, చాలా చిన్నది ప్రేమ చిగురించిన రెండు హృదయాలకు నువ్వు చెప్పిందంతా ఎలా ఉన్నా చూస్తున్నావుగా తను నన్నింకా ప్రేమిస్తోందని నేను కౌగిలించిన ఆ అమ్మాయి పేరు
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
మన ప్రేమ అంత పెద్దది, అవును అంత పెద్దది ఆకాశం కిందంతా పట్టేంత చోటంత పెద్దది నువ్వు చెప్పిందంతా ఎలా ఉన్నా నాకు తెలుసు తను నన్నింకా ప్రేమిస్తోందని నేను ముద్దాడిన ఆ అమ్మాయి పేరు
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
వెన్నటీగ, ఓ నా వెన్నటీగా ఓ మాసంలో, నేను తిరిగొస్తానే వెన్నటీగా, ఓ నా వెన్నటీగా నీ దగ్గరనే నేను వచ్చుంటానే
దాన్యెల్ జెరార్డ్ జర్మను భాషలో పాటను విడుదలచేసిన తరుణంలోనే, 1971వ సంవత్సరంలోనే, ఫ్రెంచి భాషలో కూడా “బటర్‌ఫ్లై” (సీతాకోకచిలుక) అని గీతం విడుదల చేసాడు. ఈ పాట సాహిత్యం జర్మను పాటతో పోలిస్తే కొద్దిగా తేడాగా ఉంటుంది. దానిని కూడా నేను తెలుగులో అనువాదించాను. ఈ రెండు పాటలు నాకు ఇష్టమైనా, ఫ్రెంచి పలుకులు అందంగా ఉంటాయని అనిపిస్తుంది నాకు. ఫ్రెంచి భాషలో సీతాకోకచిలుకను పాపియ్యోన్ అంటారు.
పచ్చికపైన పూసింది ఒక తెల్లటి మల్లెపువ్వు నడుస్తూ పోతున్నాను, లక్ష్యమేదీ లేక అలా నేను ఒక కలలో ఉన్నట్టు చూశాను, నిన్ను దారిలో ఒంటరిగా సూరీడి వెలుగులో సీతాకోకచిలుకలా
వెన్నటీగా, ఓ నా వెన్నటీగ నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది వెన్నటీగా, ఓ నా వెన్నటీగ మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను
నీ ప్రతిమాట నాకు సంగీతంలా పలికింది సముద్రమంత లోతుగా ఉండింది ఆనందం కవిత్వంతో నిండిన లోకం, కాలం మనకోసం ఆగింది శెలవిచ్చే సమయం తప్పలేదు, నేను వెళ్ళవలిసి వచ్చింది
వెన్నటీగా, ఓ నా వెన్నటీగ నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది వెన్నటీగా, ఓ నా వెన్నటీగ మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను
నిశ్శబ్దంగా ఉంది, గాలి మాత్రం తనపాట పాడుతోంది చూశాను నేను, ఒక పక్షి అటు ఎగురుతూ పోతోంది పైపైకి ఎగురుతోంది, సముద్రం మీదుగా, సూరీడి కాంతిలోకి తన సహచరుడినవ్వాలని నాకు అనిపిస్తోంది
వెన్నటీగా, ఓ నా వెన్నటీగ నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది వెన్నటీగా, ఓ నా వెన్నటీగ మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను
వెన్నటీగా, ఓ వెన్నటీగ నీతో ప్రతిరోజు నాకు అందంగా అనిపించింది వెన్నటీగా, ఓ వెన్నటీగ మళ్ళీ ఎప్పుడు చూస్తాను నిన్ను
డాన్యెల్ జేరార్ద్ అను జర్మను గాయకుడు 1971వ సంవత్సరంలో విడుదలచేసిన బటర్‌ఫ్లై (సీతాకోకచిలుక) అన్న పాట ఇది. జర్మను పాటలో సాహిత్యం ఉన్నా బటర్‌ఫ్లై అన్న పదం మాత్రం ఆంగ్లంలో ఉంటుంది. నేను సరదాగా ఈ ఆంగ్లపదాన్ని తెలుగులొ యదాతథంగా “వెన్నటీగ” అని అనువదించాను. జర్మను భాషలో సీతాకోకచిలుకను “ష్మెటర్లింగ్” అంటారు.