Category Archives: సమాజం

కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద

“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”, అన్నాడు మహాకవి గుఱజాడ. ఈ మహాసత్యం గుర్తుచేసుకుని ఆచరిద్దాం. కాశ్మీరులో జరుగుతున్న అత్యాచారాలకు స్వస్తి చెబుదాం. అక్కడి మన సోదరులకి సరైన గౌరవం ఇద్దాం.

ఏమిటి మనకి కాశ్మీర్ భూమిపై ఉన్న హక్కు ? అక్కడే పుట్టి, బ్రతుకుతున్న కాశ్మీరీలకంటే ఎక్కువ హక్కు ఉందా మనకి ? వాళ్ళకి కావలసింది ఏమిటొ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అక్కడికి సైనికులని పంపి, కర్ఫ్యూలని పెట్టి, వాళ్ళ ముక్కు పిండి మనం ఏమి సాధించాలి ? ఇదా మన భారత ప్రజాస్వామ్యం ?

అరవై ఏళ్ళుగా సగం భూమి భారత్ లో సగం భూమి పాకిస్తానులో వుండి కుటుంబాలు చెల్లాచెదురయ్యి వాళ్ళు ఏడుస్తుంటే ఎప్పుడు పట్టించుకున్నాం మనం ?

సొంత గొప్ప చెప్పుకోవడం తప్ప అసలు కాశ్మీరులో ఒక్కసారైనా నిఖార్సైన ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసామా ?

ఇప్పుడు అక్కడ టీవీ చానెళ్ళు బందు చేసారు. రేపు ఇంటర్నెట్టు బందు చేస్తారు. ఎవ్వరికి కావాలి కాశ్మీరీల గోడు ?

మన తప్పుని మర్యాదగా ఒప్పుకుని, సరిచేసుకుందాం. లేకపొతే, యుగోస్లావియా దేశం వలే మనదేశం ముక్కచెక్కలయ్యిపోతుంది. మారణహోమం జరిగి లక్షలకొద్ది ప్రజలు చస్తారు. న్యూక్లియర్ యుద్ధం జరగవచ్చు. మూర్ఖత్వం వీడకపోతే అమూల్యమైన మన సంస్కృతిలో ఇక మిగిలేది ఏమీ ఉండదు.

మన భారతదేశం ఒక సంధి దశలో ఉంది. మన భవిష్యత్తు రక్షించుకోవాలంటే మనం కొంత తెలివిగా ఆలోచించి మార్గాలు వెతుక్కోవాలి.

వింత పశువుల వీధిపోరాటాలు

ఆంధ్రజ్యోతి పత్రిక పైకి కృష్ణ మాదిగ అనుచరులు దాడికి దిగడం, తరువాత ఎడిటర్ని పొలీసులు అరెస్టు చెయ్యడం వంటి పరిణామాల వల్ల ఈ మధ్యన బ్లాగులోకంలో దళిత హక్కులపై చర్చ జరుగుతోంది. దళిత రక్షణ చట్టం ఎలా అపహాస్యం చేస్తున్నారో తాడేపల్లి గారు నిర్మొహమాటంగా వివరించారు. మహేశ్ కుమార్ గారు దీనికి ప్రతిగా సమాధానమిచ్చారు.

మరో ప్రక్క పొలీసులను నక్సలైట్లు హత్యచెయ్యడంపై చదువరి, మహేశ్, దిలీప్ గారి బ్లాగులలో కథనాలు వచ్చాయి.

మన సమాజంలో సమానత లేదు. ఇటువంటి పరిస్థితిలో, అణగారిన వర్గాలు పోరాటం చేసి వారి హక్కులను సంపాదించుకొంటారు అని మనం చాలామంది నమ్ముతున్నాం.”నేను దళిత పక్షపాతిని” అని అంటే “నేను బడుగువర్గాల పోరాటాన్ని సమర్ధించుతాను” అని అర్థం. కానీ, ఈ పోరాటమనేది ఎంతవరకూ నిజం ?

నా దృష్టిలో ఈ పోరాటాలకు అర్థం లేదు. విద్యలేని వాడు తన హక్కుల గురించి ఎలా తెలుసుకోగలడు ? ఏది సాధ్యమో తెలియకుండా, ఎటువంటి ఆశయం అర్థవంతం అయినదో తెలియకుండా, ఎవరన్నా పోరాటం చెయ్యగలరా ? వీధిలో పశువులు ఒకదానితో ఒకటి కలబడి కుమ్ముకోవడానికి ఈ పోరాటాలకి తేడా ఏమిటి ?

“విద్యలేనివాడు వింత పశువు” అని మన నానుడి. పశువులకి కూడా బుర్ర ఉంటుంది, మెదడు ఉంటుంది. మనిషికీ పశువుకీ తేడా ఎక్కడ అంటే విజ్ఞానం వద్ద. పరిపూర్ణ మానవత్వం సంపాదించుకోవాలంటే విద్యావంతులు అయివుండాలి. ఇటువంటి కనీస మానవత్వం కూడా మన దేశపౌరులకి మనం ఇవ్వకుండా ఇంకేమి హక్కుల గురించి అడగగలం ? నా దృష్టిలో విద్యకి దూరం చెయ్యడమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన. మన ప్రభుత్వం దీనికి పరిపూర్ణ నైతిక బాధ్యత వహించాలి. చదువులేని పశువులకి కులం తప్ప మరేదీ కనపడదు.

దళిత ఉద్యమ మేధావులని చెప్పుకుంటున్నవారు వారి మందీ మార్బలంలో విద్యావంతులు ఎంతమందో చెప్పగలరా ? లేదు. వారే కాదు, రాజకీయ నాయకులని తిరుగుతున్నవారిలో ఎవ్వరూ వారి అనుచరగణంలో విద్యావంతులు ఎందరో చెప్పరు. నక్సలైట్లలోనూ ఇదే సంగతి. వీరి వెనక ఉన్న దండు మనుషులందరివీ గొర్రె-బుర్రలు. “డూ డూ బసవన్న” అని డబ్బుతో పిలిస్తే డూ అని తలాడించే తలకాయలు. మన సమాజంలో అతిపెద్ద గౌరవం తెచ్చిపెట్టేది ధనబలం. ప్రజలు విద్యావంతులు కానంతవరకూ ఇదిలాగే సాగుతుంది.

కృష్ణమాదిగకి వ్యతిరేకంగా రాసినంతమాత్రాన ఆంధ్రజ్యోతి దళిత వ్యతిరేకి అయిపోతుందా ? డబ్బులేని దళితుల జీవితం ఎలావుంటుందో పరిశీలించాలి. భూస్వాముల కింద నొక్కితే నొక్కినట్టు పడి ఉండాలి వీళ్ళు. పిలిస్తే వచ్చి లెట్రిన్లు కడిగిపెట్టాలి. వాళ్ళ అమ్మాయిలని అల్లరిచేస్తే మూసుకుని పడివుండాలి. కించపరిస్తూ జోకులు వేస్తే “అహహో” అని నవ్వాలి. ఒక తెలివైన విద్యార్థిని జాతి పేరుతో వెకిళి చెయ్యడం కంటే దరిద్రమైన విషయం నేను చూడలేదు. పేదవాళ్ళైన దళితులు ఎన్నిసార్లు ఇది అనుభవించారో లెక్కలేదు. ఏ దళిత హక్కుల చట్టం వీరిని కాపాడుతుంది ? డబ్బు, చదువే వీరిని కాపాడగలవు. దీనినే కామన్ సెన్సు అంటారు.

డబ్బున్న దళితులు ఎన్ని అవమానాలు భరించివుంటారు జీవితంలో ? ఏవో అరాకొరా, అసలు కొరగావు. డబ్బు ఉన్న దళితులు చేసే ఇబ్బందులు సాకుగా చూపించి దళితులందరినీ ఒక్కగాటన కట్టివేసి తాడేపల్లి గారు సంబోధిస్తున్నారు. ఇది అసలు సమంజసమేనా ?

బడుగువర్గాలని సమర్ధించే వారు కూడా విద్య యొక్క ఆవశ్యకతని పట్టించుకోవట్లేదు. మనిషిని పశువు కంటే ఎక్కువ చేసేది శ్రమ కాదు, విద్య. సమాజంలో మార్పు తీసుకురావాలంటే వచ్చేది శ్రామిక వర్గం నుండి కాదు, విద్యావంతుల నుండి. ప్రపంచం ఏమిటో తెలియకుండా, విజ్ఞానం లేకుండా తుపాకీలిచ్చినంత మాత్రాన ఎవ్వరు హక్కులు తెచ్చుకోగలరు ?

మనిషి శ్రమజీవి అంటారు. ఇంధనంతో ఇంజనులు నడపడం నేర్చిన తరువాత మనిషి శ్రమకి కాలం చెల్లింది. ఏ విధమైన శారీరిక శ్రమ చెయ్యకుండానే ప్రపంచంలోని మనుషులందరూ గడపవచ్చును. దీనికి సరిపడ ఇంధనం మన వద్ద ఉంది (ప్రస్తుతానికి న్యూక్లియర్ విద్యుత్తు, మన జనాభా తగ్గించుకుంటే కేవలం సోలార్ విద్యుత్తు). ఉండవలసినది సరైన దిశా నేతృత్వం, పట్టుదల మాత్రమే. విద్యుత్తుతో ప్రతీ పనిని చేయపించి మనిషులందరూ విశ్రాంతి తీసుకోవచ్చును. ఇదే తరువాతి యుగం.

పారిశ్రామిక విప్లవం అనేది మనిషిని పశువునుండి పూర్తిగా వేరుచేసింది. శ్రమకి అవసరం తీసివేసింది. కానీ, ప్రస్తుతం ఈ ఫలితాలను కేవలం కొంతమంది మాత్రమే అనుభవిస్తున్నారు. వీరిని ధనిక వర్గాలు అంటారు – ఏ పనీ చెయ్యకుండా కులాశాగా గడపుతున్నారు వీళ్ళు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇదేవిధంగా ప్రతి మనిషీ ఉండవచ్చును. పారిశ్రామిక విప్లవం తరువాత మొదటి సారిగా కొన్ని సమాజాలలో పేదరికం నిర్మూలింపబడింది. ప్రజలందరికీ సమానంగా వైద్య, ఆహార సదుపాయాలు దొరికాయి. మునుపటి సమాజంలో కేవలం కొందరికే ఇది దక్కింది. ప్రపంచంలోని మానవ సమాజాలన్నింటినీ పారిశ్రామికం చెయ్యడం ద్వారా మనం మరో యుగంలోకి వెళ్తాం. ఇప్పటి సమస్యలు ఆ యుగంలో హాస్యాస్పదంగా ఉంటాయి.

మనిషి బుద్ధి జీవి. ప్రతి మనిషీ ఈ విధంగా ఉండగలిగేటట్లు మనం ప్రయత్నించాలి. ఇదే అసలైన మానవత్వం. దానికి కనీస అవసరం ప్రజలందరినీ విద్యావంతులు చెయ్యడం. దీనిని గుర్తించక అడ్డదిడ్డమైన ఆశయాలకోసం పనిచెయ్యడం కాలయాపన, మూర్ఖత్వం.

మన తరం ఆలోచించవలసిన ప్రశ్నలు

ఈ పోస్టులో మన తరం ప్రజలు ఆలోచించవలసిన కొన్ని తీక్షణమైన ప్రశ్నలను పరిచయం చేస్తాను. “రాజకీయాలు మనకెందుకులే, దేశం ఎక్కడికిపోతే నాకేంటి” – అని పెదవి విరిచే బదులు, “మన తెలుగు నేలని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు” అని ఆలోచిస్తే, మన తరం యువకులకి ఒక అద్భుతమైన అవకాశం ముందు ఉంది. దేశం ఆర్థిక విధానాలు ఎలాగ పనికి వస్తాయి ? సెజ్ ల ద్వారా అభివృద్ధి సాధ్యమేనా ? ఇలాంటి ప్రశ్నలకి అందరూ తలోరకంగా సమాధానమిస్తున్నారు. ఇక్కడ ఒక సిద్ధాంతం ప్రకారం వీటిని వివరించేందుకు ప్రయత్నం చేస్తాను.

సమాచారం నిక్షిప్తపరచుకునే సాధనాలలో మార్పులు కలిగినప్పుడు, సమాజం మొత్తం అతలావితలమవుతుంది. మునుపు చారిత్రిక విశ్లేషకారులు సామాజిక మార్పులను తెచ్చిపెట్టేవి దృఢ సాంకేతిక విప్లవాలు (ఆవిరి యంత్రం, గాలి మర, ఎలెక్ట్రిక్ బల్బు..) అని భావించేవారు. కానీ ఈ వివరణ తప్పు. అసలైన మార్పులు కల్పించేవి మృధు సాంకేతిక విప్లవాలు – సమాచారం, సందేశం పంపించే సాధనాలలోని విప్లవాలు.

ఇలాంటి విప్లవం ఒకటి మన కళ్ళ ముందరే ఆవిష్కృతమవుతోంది (ఇంటర్నెట్టు) . మిషెల్ సెర్ర్ ఉపన్యాసం పూర్తిగా తర్జుమా చేసేముందు ఈ పోస్టులో ఒకసారి సంక్షిప్తపరుస్తాను.

మానవ నాగరికత పరిణామం మొత్తం నాలుగు దశలలో వివరించవచ్చు :

  • వాచ్య దశ : అన్ని రకాలైన సంభాషణ మాట్లాడడం ద్వారానే జరిగేది
  • లిఖిత దశ : భాషని వ్రాయడానికి ఒక లిపి కనుగొన్న తరువాత
  • ముద్రణా దశ : ముద్రణా యంత్రం కనుగొన్న తరువాత
  • సందేశాత్మక దశ : సమాచారాన్ని పరిమార్చి. ప్రసరించ గలిగే ఒక యంత్రాన్ని కనుగొన్న తరువాత

వీటిలోని ప్రతీ పరిణామం మనుషులు సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారో తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ మృధు పరిణామాలు అక్షరాలా ప్రపంచాన్ని మొత్తం కూల్చివేసి, తిరిగి పునర్నిర్మించాయి. రాజ్యం, వాణిజ్యం, శాస్త్రం, న్యాయం, మతం, సంస్కృతి – ఈ ఆరు రంగాలు మానవ పరివృత్తిని మూలంగా నిర్వచించుతాయి. మృధు విప్లవాలు ఈ రంగాలలో ఎలా మార్పులు తెచ్చిపెట్టాయో అర్థం చేసుకుందాం.

వాచ్య దశ :

రాజ్యం : సమాజం తెగల క్రింద విడవడి ఉంది. ప్రతీ తెగ కొంతమంది పెద్దల ఆధ్వర్యంలో నడుస్తుంది. మనిషి తెగకి బద్ధుడై ఉంటాడు – జాతి సంబంధాలు, బంధుత్వాలపై అతని నడవడిక ఆధారపడి ఉంటుంది.

వాణిజ్యం : ఇచ్చిమార్పిడల ద్వారా వాణిజ్యం నడుస్తుంది. బంగారం మొదలైన విలువైన లోహాలు – ఈ ఇచ్చిమార్పిడికి ఒక తులమానికగా పనికివస్తాయి.

శాస్త్రం : ఆదిమ సిద్ధాంతాలు ప్రకృతి ప్రవర్తనని వివరించే ప్రయత్నం చేస్తాయి. పనిముట్లు, ఆయుధాలు తయారీ చెయ్యడం ఇంకా ఒక కళగా భావించబడుతుంది. విద్య కేవలం కుటుంబం లోపలనే అందించబడుతుంది.

న్యాయం : వంశ గౌరవం, తెగ గౌరవం కాపాడడం అనేది సారాంశం. ఇంతకు మించి న్యాయ రంగం వేరే ఉండదు. ప్రతీ మనిషి ఈ గౌరవం కాపాడేందుకు ఆయుధాలు చేపట్టాలి.

మతం : ప్రకృతి దేవతలని ఆరాథించే బహుళేశ్వర మతాలు ప్రకృతి వైపరీత్యాలని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తాయి. ప్రకృతితో ప్రశాంత సహజీవనం చెయ్యడం నేర్పుతాయి.

సంస్కృతి : దేశ సంచారం చేసే పాటగాళ్ళు కావ్యాలను అల్లిపెడతారు.

ఉదాహరణలు : వైదిక భారతం (క్రీ.పూ. 600 వరకు), పైథాగొరాస్ మునుపటి గ్రీసు (క్రీ.పూ. 580 వరకు), రోము సామ్రాజ్యపు మునుపటి యూరపు (క్రీ.శ. 200 వరకు), అక్షరాస్యత లేని సమాజాలు (40% భారత ప్రజానీకం, 64% ఆఫ్ఘనిస్తాను)

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : జాతి

లిఖిత దశ :

రాజ్యం :
ఒక రాతిపై వ్రాయబడిన న్యాయ శాసనం ద్వారా రాజ్యం అనేది మొదటిసారిగా కనిపెట్టబడుతుంది (అశోకుని శిలాశాసనాలు, హమ్మురబీ శాసనం). రాజ్య సరిహద్దు ఖచ్చితంగా నిర్వచించబడి ఉంటుంది, దాని భద్రతకై ఒక సైన్యం అవసరమవుతుంది. రాజ్యనిర్వహణ తెగల యొక్క గణతంత్రాలని విడిచి ఒక రాచరికంగా అవతరిస్తుంది. రాచసేవ చెయ్యడానికి ఒక వర్ణక్రమం తయారవుతుంది.

వాణిజ్యం : ధనం (రాగిపై, మరేదైనా లోహంపై వ్రాయబడిన ఒక విలువ) కనిపెట్టపడుతుంది. ధన, వాణిజ్యాలు నిర్వహించడానిక ఒక వైశ్య తరగతి పుడుతుంది.

శాస్త్రం : రేఖాగణితం కనిపెట్టబడుతుంది. గణితం ఒక్క ఉపయోగం వల్ల వృత్తిపనులు కళలుగా కాక సాంకేతిక పరిశ్రమలుగా అవతరిస్తాయి. కొలతలు, పరిశీలనల ఆధారంగా ప్రకృతిని వివరించడానికి సిద్ధాంతాలు పుడతాయి. మతశిబిరాలలో విద్యాబోధన జరుగుతుంది. చెదురుమదురుగా ఉండే కొన్ని గ్రంథాలయల వద్ద విశ్వవిద్యాలయాలు వెలుస్తాయి. ఉపాధ్యాయుని వృత్తి మొదటిసారిగా అవతరిస్తుంది. గ్రంథాల లేమి వల్ల ఉపాధ్యాయుడు చాలా విషయాలు జ్ఞప్తిలో ఉంచుకోవలసి వస్తుంది.

న్యాయం : వ్రాయబడని వంశ గౌరవంగా కాక ఒక ఖచ్చితమైన న్యాయ శాసనంగా అవతరిస్తుంది. దీనిని అమలుచెయ్యడానికి, నేరస్థులని దండించడానికి ఒక దళం తయారవుతుంది.

మతం : గ్రంథాల ఆధారితమైన ఏకేశ్వరోపాసక మతాలు పుడతాయి. ప్రజల కట్టుబాట్లను ఇవి ఖచ్చితంగా వ్రాసి నిర్ధారించడంతో, ఈ మతాలలో స్వేచ్ఛ తగ్గి మరింత కఠినంగా మారుతాయి.

సంస్కృతి : కళాకారులు రాజుల సంస్థానాలలో పోషించబడుతారు. సంగీతం వ్రాయడానికై ఒక భాష అవతరిస్తుంది. చిత్రలేఖనం, శిల్పకళ ఒక ఖచ్చితమైన కొలతలతో నేర్పబడుతాయి.

ఉదాహరణలు : కులం చేత వ్యక్తీకరించదగిన బ్రిటిషు రాక మునుపటి ఇండియా (క్రీ.శ. 1600 వరకు : మౌర్యులు, గుప్తులు, మొఘళ్ళు..), సామాజిక తరగతి చేత వ్యక్తీకరించదగిన రెనైసాన్సు మునుపటి యూరపు (క్రీ.శ. 1500 వరకు : పైథాగొరాస్ తరువాతి గ్రీసు, రోము సామ్రాజ్యము ..), క్రీ.శ. 1950 మునుపటి వరకూ టిబెట్, క్రీ.శ 1900 మునుపటి వరకూ అరేబియా, ప్రస్తుత భారత దేశంలో కులం ఎక్కడ ఇంకా గట్టిగా నడుస్తోందో.

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : మతం

ముద్రణా దశ :

రాజ్యం : పుస్తకాలు జ్ఞానాన్ని ప్రజలలో పంచిపెడతాయి. దీనితోనే “ప్రజలందరూ సమానులే” అన్న భావం వెల్లివిరుస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్యం అవతరిస్తుంది. ప్రజా ప్రతినిధులు ఎన్నికలచే నియమింపబడతారు. “దేశం” అనే భావన ఏర్పడి, ప్రపంచం దేశాలుగా విడివడి ఉంటుంది.

వాణిజ్యం : బ్యాంకు కనిపెట్టబడుతుంది. డబ్బుతో నమ్మకస్తుడిగా ఉండటం అనే ఆలోచన పుడుతుంది. దీనిని బట్టి బ్యాంకులు అప్పు ఇస్తాయి, వాణిజ్యం నడుస్తుంది. బ్యాంకు చెక్కు, ముద్రితమైన డబ్బు పెట్టుబడిదారీ విధానాన్ని ఆవిష్కరిస్తాయి.

శాస్త్రం : ముద్రితమైన పుస్తకాలు చెంతనుండగా ఉపాధ్యాయుడు అన్ని విషయాలను జ్ఞప్తికి ఉంచుకోనక్కర్లేదు. ఈ పుస్తకాల ఆధారంగా పాఠశాలలు, కళాశాలలు నడుపబడతాయి. మొదటిసారిగా ప్రజానీకం మొత్తం విద్యావంతులవుతారు. ప్రయోగాలచే నిర్ధారించడం అనే ప్రాతిపదిక పైన ఆధునిక శాస్త్రీయ పద్ధతి పుడుతుంది. విజ్ఞాన శాస్త్రం వేల విభాగాలుగా వెల్లివిరుస్తుంది.

న్యాయం : లిఖించబడిన రాజ్యాంగం ఆధారంగా న్యాయ విశ్లేషణ జరుగుతుంది. మతం నుండి న్యాయం విదగొట్టబడుతుంది.

మతం : “చేతిలో బైబిలు ఉండగా ప్రతి మనిషి పోపుకి సమానుడే”, అంటూ లూథర్ క్రైస్తవంలో పునర్నిర్మాణ ఉద్యమం మొదలుపెడతాడు. మతం ఒక వ్యక్తిగతమైన విషయంగా మారుతుంది. దైవానికి మనిషికి మధ్యన పూజారుల అధికారం తగ్గిపోతుంది. మతానికి ఆర్థిక అధికారాలు నశించిపోతాయి.

సంస్కృతి : కళ అనేది అంగడిలో ఒక సరుకుగా మారుతుంది. ప్రతి మనిషి కళా వస్తువులను కొనడం ద్వారా కళాకారులను ప్రోత్సహించగలుగుతాడు. ఈ కళా సంతలో దుకాణాలపై ఆజమాయిషీ చేసే దళారులు ఒక కొత్త సంపన్న వర్గంగా అవతరిస్తారు.

ఉదాహరణలు : రెనైసాన్సు పిదప ఆధునిక యూరపు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆధునిక జపాను, అభివృద్ధి చెందుతున్న దేశలలోని (చైనా, ఇండియా, బ్రెజిలు..) చదువుకున్న మధ్య తరగతి వర్గాలు.

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : మార్కెట్

సందేశాత్మక దశ :

మానవ చరిత్రలో మొదటిసారిగా ప్రపంచం మొత్తం ఒక్క మౌస్-క్లిక్కు దూరంతో కలవబడి ఉంది. ఈ కొత్త యుగంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాము. మునుపు సంభవించిన విప్లవాల వల్లే, ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం త్రెంచివేయబడుతుంది. సరిహద్దులు లేని ప్రపంచంలో ఒక కొంగొత్త ఆర్థిక, రాజకీయ పద్ధతి సృష్ఠించబడుతుంది.

ఈ మార్పులని కొన్ని ఇప్పుడే గమనించవచ్చు : ఏ.టీ.యెం, ఈ-కామెర్సు వాణిజ్యం ఎలా జరుగుతుందో పునర్నిర్వచించాయి. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం యొక్క ఆర్థిక బలం తూర్పు దిశగా మళ్ళుతోంది. ఇంటర్నెట్ యుగంలో డబ్బుని దొంగిలించడానికి కొత్త మోసగాళ్ళు తయారయ్యారు, వీరివల్ల వాణిజ్యం ఎలా నడపాలి అనే విషయంలో కొత్త దిశలలో ఆలోచించటం మొదలుపెట్టాము. విద్యా, శాస్త్రీయ రంగాలలో : ఇంటర్నెట్, గూగుల్ వల్ల ఉపాధ్యాయుని పాత్ర మొత్తం మార్చబడింది. శాస్త్రీయ అన్వేషణ ఒక అద్వితీయమైన వేగంతో వృద్ధి చెందుతోంది : కంప్యూటర్ సిమ్యులేషన్, ఇంటర్నెట్ ద్వారా కలిసికట్టుగా పరిశోధన – ఇవి శాస్త్రీయ రంగాలలో పెనుమార్పులు తెచ్చిపెడుతున్నాయి.

ఇక్కడతో సెర్ర్ ఉపన్యాసం సంక్షిప్తం. ఇప్పుడు నేను నా ఆలోచనలు, అభిప్రాయాలు బయటపెడతాను. ఇప్పుడు మనం కొన్ని దృఢమైన ప్రశ్నలు అడగాలి : మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అసలు ప్రతినిధులు అవసరమా ? ఇంటర్నెట్టు ఆధారంగా ప్రజలచే మరింత స్వేచ్ఛగా, పారదర్శకంగా ప్రభుత్వ పాలన చెయ్యగలమా ? వ్యక్తికి సంపూర్ణమైన స్వేచ్ఛ లభించగలదా ? వ్యక్తిగతమైన స్వేచ్ఛకి భంగం కలిగించకుండా వ్యక్తికి రక్షణ కల్పించగలమా ? మనలో ప్రతి ఒక్కరూ కళాకారులు కాగలరా ? ఒక కళాకారుడు డబ్బు గురించి ఆలొచించనవసరం లేకుండా, సంపూర్ణమైన భావ వ్యక్తీకరణా స్వేచ్ఛ పొందగలడా ?

ఇవి మన తరం యువకులు ఆలోచించవలసిన ప్రశ్నలు.

ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు పైన వివరించబడిన 3 యుగాలలో బ్రతుకుతున్నారు. కానీ అంతిమంగా, అందరూ 4వ యుగంలోకి రావలసిందే. ఈ వివిధ యుగాలు అన్నీ ఒకదానితో మరొకటి వ్యతిరేకతను కలిగి ఉంటాయి. ఈ విషయం సుళువుగా అర్థమవుతుంది. మార్పుకు ఎంతో వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. ఒక యుగం దాని తరువాతి యుగంతో కలబడుతున్నప్పుడు, దాని సొంతటి చిన్నతనంలో పూర్వ యుగానికి విరుద్ధంగా ఉపయోగించిన ఆయుధాలనే వాడుతుంది.

లిఖిత యుగంలో నడుస్తున్న సమాజం దాని మునుపటి వాచ్య యుగం యొక్క హింసని, అలజడిని బూచిగా చూపిస్తుంది. “రాజు నశించిపోతే మిగిలేది అరాచకమే. మతం లేకపోతే మిగిలేది అరణ్యమే”, అంటూ కలబడుతుంది. కానీ, యుద్ధంలో చివరకి నెగ్గేది పెట్టుబడిదారీ ముద్రణా యుగం మాత్రమే. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం నెగ్గుకు వస్తాయి.

ఉదాహరణ : 16వ శతాబ్దంలో చర్చి యూరపులో ప్రజాస్వామ్య, శాస్త్రీయ ఉద్యమాలని అణచివెయ్యడాని బహువిధాలుగా ప్రయత్నించింది. ప్రస్తుత ఇస్లామిక్ సమాజంలో ఛాందస వాదులు “ప్రజాస్వామ్యం అంటే విగ్రహాధారనతో సమానం, వచ్చేది వఠ్ఠి అరణ్య పాలనే” అని పురాతన బూచిని చూపెట్టి ఆస్తికులను బయపెడుతున్నారు.

ముద్రణ-యుగంలో నడుస్తున్న సమాజం మత ఛాందసత్వం, ఫ్యూడల్ రాజ్యం వంటి లిఖిత-యుగ బూచులని చూపెట్టి ప్రజలను బెదరగొడుతుంది. ఇదంతా, సందేశాత్మక-యుగం నుండి జనాలని దారి మళ్ళించడం కోసం.

ఉదాహరణ : ఈ యుద్ధం ప్రస్తుతం మన కళ్ళ ముందరే అమెరికాలోను, యూరపులోను జరుగుతోంది. యధాస్థితివాద పార్టీలు “ఇస్లాం యొక్క ఛాందసత్వం, ఉగ్రవాదం” అని ప్రజలను భయపెడుతున్నాయి. సంగీతం, సినిమాలు, టీవీ, దినపత్రికలు – వీటిని శాసిస్తున్న మీడియా ధనిక వర్గం “ఇంటర్నెట్టు పైరసీ” అని ప్రజలను బెదరగొడుతోంది. అసలు ఉద్దేశ్యం మన తరం నాటి ప్రశ్నల నుండి మనల్ని దారి మళ్ళించడం కోసమే.

మిషెల్ సెర్ర్ కి మునుపు మరో తత్వవేత్త కార్ల్ మార్క్సు మానవ సామాజిక పరిణామాన్ని ఈ పద్ధతిలో వివరించే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన సిద్ధాంతమైన మార్క్సిజానికి సత్యానికీ మధ్య వ్యత్యాసం – లామార్కు థియరీకి డార్విను యొక్క అసలు పరిణామవాద సిద్ధాంతానికి మధ్య వ్యత్యాసమంత. లామార్కు ఆలోచన విప్లవాత్మకమైనదే – జీవులు కాలంతో పరిణామం చెందుతున్నాయి అని. ఆయన దృష్ఠిలో, జిరాఫీ చెట్ల చిగురుటాకులను అందుకోవడం కోసం మెడను సాగదీసింది – అలా సాగతీయగా, సాగతీయగా మెడ పొడవయ్యింది అని. కానీ ఇది నిజం కాదు. పరిణామాం జరిగేది జంతువుపైన కాదు (phenotype) కానీ జన్యువు పైన (genotype).

మానవ సామాజిక పరివర్తనని శాస్త్రీయ దృక్పథంతో వర్ణించాలి అనే ధైర్యం ఉంది కానీ, మార్క్సు ఒక తప్పు సిద్ధాంతం రచించాడు. ఆయన దృఢ టెక్నాలజీలు (phenotype) సామాజిక మార్పులు తెస్తాయని భావించాడు. కానీ, అసలు కారణం మృధు టెక్నాలజీలు (genotype). సోవియట్ యూనియనులోని కమ్యూనిస్టు సైద్ధాంతికులు లామార్కు నిజమైతే బాగుండునని ఎంతో ఆశించారు. కమ్యూనిస్టు విప్లవం నాటికి రష్యా ఏ విధంగానూ ఒక పెట్టుబడిదారీ దేశం కాదు. అది ఒక పురాతన దశలోని ఫ్యూడలు దేశం. కమ్యూనిస్టు ఉద్యమం విజయవంతమైన మరేదేశమూ కూడా (చైనా, క్యూబా, ఇండియాలోని నక్సలైటు ప్రాంతాలు) పెట్టుబడిదారీ దేశంకా దు. అవి ఫ్యూడాల్ సమాజాలు. రష్యాలోని కమ్యూనిస్టులు ఆశించినదేమిటంటే, వారి మెడలని బాగా సాగదీస్తే సోషలిజం యొక్క చిగురుటాకులు దక్కుతాయి అని. కాని, అవి ఎప్పటికీ దక్కలేదు.

ప్రతీ కమ్యూనిస్టు విప్లవం మానవ ప్రగతిలో ఒక వెనకడుగు అయ్యింది : ముద్రణా-యుగంలోని పెట్టుబడిదారీ దశని చంపివేసి లిఖిత-యుగంలోని రాచరికాన్ని తిరగతోడింది. కమ్యూనిస్టు దేశాలలోని విపరీతమైన సెన్సార్షిప్పు, సీక్రెట్ పొలీసులు, భావ వ్యక్తీకరణ నిర్బంధాలు – ఇవేవీ ఫ్యూడల్ సమాజంలో ఆశ్చర్యం కలిగించవు. జరిగినదది. మన భారతదేశంలోని కమ్యూనిస్టులు ఇంకా అవే సిద్ధాంతాలను పట్టుకు వేళ్ళాడుతుండడం నిజంగా మన దురదృష్టం. ఇంకా ఎన్ని సార్లు ఇవి తప్పని నిరూపించబడాలో తెలియదు. వేపకాయంత వెర్రి ముదిరి తాటిపండంత అయ్యింది అన్నట్టు – వీరు ఇప్పుడు ఇరాన్, చైనా లాంటి దేశాలను సమర్థిస్తున్నారు. ఇరాన్లో ఇస్లాం మతపెద్దలు కమ్యూనిస్టలనందరినీ చంపేసిన విషయం తెలుసునో, తెలియదో మరి !

సమాజంలోని ప్రగతిశీల వ్యక్తుల కర్తవ్యం – టెక్నాలజీకి అణువుగా సమాజం తీర్చిదిద్దటం.అంటే, వాచ్య దశ కంటే లిఖిత దశని పెంపొందించటం (జాతి కంటే మతం మెండు), లిఖిత దశ కంటే ముద్రణా దసని పెంపొందించటం (మతం కంటే మార్కెట్ మెండు), ముద్రణా దశ కంటే సందేశాత్మక దశని పెంపొందించటం (మార్కెట్ కంటే ఇంటర్నెట్ మెండు).

సమాజం యొక్క పరిణామం ఈ విధంగా జరుగుతుంది. ఉత్సాహమున్న తెలుగు యువకులని, యువతులని నేను అడిగేది ఏమిటంటే “మన జీవితకాలంలోగా తెలుగునేలని ఈ దశలన్నీ దాటించి సందేశాత్మక యుగంలోకి తీసుకురావాలి” అని.

తరలి రాద తనే వసంతం ?

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగు కదా ?
వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగు కదా ?
ఎల్లలు లేని చల్లని గాలి, అందరికోసం అందును కాదా ?

ప్రతీమదిని లేపే ప్రభాతరాగం, పదే పదే చూపే ప్రథాన మార్గం ..

ఏదీ సొంతంకోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం !

ఇది తెలియని మనుగడ కథ – దిశలెరుగని గమనము కద !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

బ్రతుకునలేని శృతికలదా ? ఎదసడిలోనే లయలేదా ?
బ్రతుకునలేని శృతికలదా ? ఎదసడిలోనే లయలేదా ?

ఏ కళకైనా, ఏ కళకైనా జీవితరంగం వేదికకాదా ?

ప్రజాధనం కాని కళావిలాసం, ఏ ప్రయోజనం లేని వృధా విలాపం.

కూసే కోయిల పోతే రాగము ఆగిందా ? పారే ఏరై పాడే మరో పదం రాదా ?

మురళికిగల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?
గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

నాకు బాగా ఇష్టమైన సినిమా పాట 🙂

చిట్టీ చిట్టీ పాపల్లారా – 2వ చరణం

మా నాన్నగారితో ఫోనులో మాట్లాడినప్పుడు నా బ్లాగులో ఆయన పాటని వ్రాసిన విషయం చెప్పాను, ఇప్పటికే చూసారంట ! కాని ఒక ముఖ్యమైన చరణం నేను మరచిపోయాను. కానీ పరవాలేదు. ఎందుకు పరవాలేదో ఆ చరణంలోనే ఉంది – చూడండి 🙂

తెలిసిన విషయం మరచిపోతే
ఆటల్లో అరటిపండు
తెలియని విషయం ఛేదిస్తే
చిలక్కొట్టిన జాంపండు

చిట్టీ చిట్టీ పాపల్లారా

మా నాన్నగారు ఒకప్పుడు కథలు వ్రాసేవారు, ఆ విషయం నాకు పదో తరగతికొచ్చినంత వరకూ తెలియదు. ఒకసారి మా ఇంట్లో పాత అల్మరాలో వెతుకుతుండగా కొన్ని శిథిలావస్థలో ఉన్న వారపత్రికలు కనపడ్డాయి, పాతికేళ్ళ కిందటివి. సరదాగా లోపలేముందో చూద్దామని కథలు చదవడం మొదలుపెట్టాను. మా నాన్నగారి పేరుతో కొన్ని కథలు కనపడ్డాయి – అదే మొదటి సారి చదవటం.

మా నాన్నగారు ఎప్పుడూ మాకు దేని గురించి ఉపన్యాసలివ్వలేదు. తన ఆలోచనలని తనకే అట్టేపెట్టుకునేవారు. “పిల్లలు వారంత వారే ఎదగాలి”, అన్నది ఆయన సిద్ధాంతం.

మా అమ్మా, నాన్న ఇద్దరు స్కూలు టీచర్లు. పొద్దుటే అందరూ స్కూళ్ళకి వెళ్ళే హడావుడిలో తలమునకలై ఉండేవాళ్ళం. ఆ సమయంలో, మా నాన్నగారు చిన్నగా ఈలపాటలు పాడేవారు. ఆ సంగీతం నాకు బాగా గుర్తు. అప్పుడప్పుడు పదాలతో పాటనే పాడేవారు. నాకు గుర్తున్న పాట ఇది

“చిట్టీ చిట్టీ పాపల్లారా
బుల్లి బుల్లీ పూవుల్లారా
మళ్ళి మళ్ళీ నవ్వండర్రా
నవ్వుతూ బతకండర్రా”

తను ఎప్పుడో వ్రాసుకున్న పాట అది. సరదాగా పాడుతూ ఉండేవారు. ఈ పాట మా నాన్నగారే వ్రాసారన్న విషయం కూడా నాకు పెద్దయ్యేంతవరకూ తెలియదు.

“కులం మతమని దేబుర్లాడితే
బతుకేమో గంజాయి మొక్క
మానవత్వమే నా మతం అంటే
మనిషిగా తులసి మొక్క

తెలిసిన విషయం మరచిపోతే
ఆటల్లో అరటిపండు
తెలియని విషయం ఛేదిస్తే
చిలక్కొట్టిన జాంపండు

చిట్టీ చిట్టీ పాపల్లారా
బుల్లి బుల్లీ పూవుల్లా
రా
మళ్ళి మళ్ళీ నవ్వండర్రా
నవ్వుతూ బతకండర్రా ”

ఇదొక్కటే మా నాన్నగారు పాటరూపంలో మాకు తెలియకుండానే ఇచ్చిన సందేశం.

ఇప్పుడు ఇంట్లో మేమెవ్వరం లేక అమ్మ,నాన్నకి చాలా బోరుగా ఉంటోంది. మళ్ళీ కథలు వ్రాయండి అని నేను చెప్పినా మా నాన్నగారు “కష్టం రా, ఇప్పుడంత తీరికా ఓపికా లేవు” అంటున్నారు. ఎప్పటికైనా ఈ బ్లాగులు ఉపయోగించడం నేర్చుకుంటారేమో అని నా ఆశ.