Category Archives: సంస్కృతి

ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు అనొచ్చా ?

పదాహారవ శతాబ్దంలో నికోలా దా కొంతి అనే ఒక ఇటలీ వర్తకుడూ సాహసికుడు భారతదేశానికి ప్రయాణించి వచ్చాడు. ఎన్నో ప్రయాసలనోర్చి, బందిపోట్లనెదుర్కుని అతడు సాగించిన ఈ సాహసయాత్ర తరువాతి తరాలలో చాలమందికి ప్రేరణనిచ్చింది. నికోలా మొదట సిరియాలోని డమాస్కసులో స్థిరపడి ముస్లిము మతం స్వీకరించాడు. ఆ పై, భారతదేశం గురించి ఎన్నో కథలు విని ఇక్కడికి ప్రయాణం కట్టాడు. అరేబియా సముద్రం దాటి గుజరాతులో అడుగెట్టాడు. తిరిగి తిరిగి విజయనగర సామ్రాజ్య రాజధానికి చేరుకున్నాడు. దక్షిణభారతం అత్యుత్తమ దశలో ఉన్న సమయమది. బ్రిటీషువారి పాలన ఇంకో వంద ఏళ్ళకు కాని మొదలవదు. ఆ సమయంలో నికోలా విజయనగర వీధులలో నడుస్తుండగా వర్తకులు రత్నాలను రాళ్ళవలే అమ్ముతున్నారట. చూసి విస్తుపోయాడు. ఈ విజయనగర దేశం ప్రపంచం మొత్తంలోనే అత్యున్నతమైన సంస్కృతి, ధనరాశి, వైభవాలతో వెలుగొందుతోందనిి, ఒక్క ఇటలీ దేశం తప్ప ఈ సంస్కృతితో పోల్చదగ్గ దేశమేలేదని పేర్కొన్నాడు. ఆ పదహారవ శతాబ్దంలో రెనైజాన్సు అనే ఉద్యమం ఇటలీ లోని ఫ్లోరాన్సు పట్టణంలో మొదలైంది. అద్భుతమైన కట్టడాలు, శిల్పకళా వైభవాలు ఐరోపాఖండంలో ఇక్కడే మొదలయ్యాయి. మైఖలాంజెలో, లెయొనార్డో దావించీ మొదలైన కళాకారులు ఈ సమయంలోనే పుట్టారు. ఇటువంటి ఇటలీదేశం ఐరోపాఖండానికే సాంస్కృతిక రాజధాని. దానికి సరితోడు ప్రపంచం మొత్తంలోను విజయనగరమేనని నికోలా చెప్పడం చూడాలి.

మధురమైన తెలుగు భాషని విన్న తరువాత, అతడికి తన మాతృభాషైన ఇతాలియానా గుర్తొచ్చింది. కారణం మన తెలుగులో ఇటాలియన్నుకు మళ్ళే కఠువైన పదాంతాలుండవు. అన్నీ అచ్చులతో ముగిస్తాము తప్ప, హళ్ళులతో కాదు. ఇటాలియన్ను కూడా ఇట్లాగే ఉంటుంది. ఈ పద్ధతివల్ల భాష వీనులవిందుగా, మాట్లాడుతుంటే సంగీతం పాడుతున్నట్టుగా ఉంటుంది.

తెలుగుభాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు అన్నది నికోలాయో కాదో తెలీదు కాని, రెండువందల ఏళ్ళ పిమ్మట మచిలీపట్నంలో అడుగిడిన ఐరోపా వర్తకులు అక్కడి జాలర్ల భాషని చూసి ఇదే మాట అన్నారు. ప్రస్తుతమున్న తెలుగు భాష ఈ బిరుదుని కోల్పోతోందని నాభిప్రాయం. కారణం ఏమిటంటే పదాలను హళ్ళులతో ముగించడం పాటి అవుతోంది. ఎక్కువగా ఇంగ్లీషుపదాలని ఈవిధంగా పలుకుతున్నారు జనాలు. తెలుగు పద్ధతి ప్రకారం “కంప్యూటరు” అని పలకాలి, కానీ “కంప్యూటర్” అని కఠువుగా పలుకుతున్నారు. కారణం ఏమిటంటే న్యూసుపేపర్లు ఈవిధంగా పొల్లుతో అంతిస్తున్నాయి పదాలని – “పార్లమెంట్, లీడర్, మినిస్టర్” అంటూ. ప్రజలు ఇలాగే పలకడానికి ప్రయత్నిస్తున్నారు. క్రమేణా, తెలుగుభాష తీయదనం కోల్పోతోంది.

భారతదేశాన్ని బ్రిటిషువాడు కాకుండా ఇంకేదేశం వాడు స్వాధీనం చేసుకున్నా, ఆదేశం ప్రపంచంలో అగ్రగామి అయ్యుండేది. ఒకవేళ ఫ్రెంచివాడు స్వాధీనుంచుకుంటే ప్రపంచమంతా ఇప్పుడు ఫ్రెంచి మాట్లాడేవాళ్ళం ! ఇటలీవాడు స్వాధీనుంచుకుంటే ఇటాలియన్ను మాట్లాడేవాళ్ళం. ఈ లాటినుభాషలు మనదేశ భాషలకి మరింతగా పోలివుంటాయని నాభిప్రాయం. ఉదాహరణకి కొన్ని పదాలు తెలుగు-హిందీ-ఫ్రెంచి భాషలలో “రెండు – దో – దూ”, “ఏడు – సాత్ – సెత్”, “పది – దస్ – దిస్”, “జనాలు -జన్- జాన్”, “ఏమిటి -క్యా- క్వా”. ఆర్యభాషలలోని పోలిక అది. ఇంగ్లీషులోకొచ్చేసరికి పదాలన్ని కఠువుగా మారతాయి కనుక పోలిక తెలియదు. మనతెలుగులో యూరపు భాషలలో చాలావాటినుండి పదాలని తీసుకున్నాం. తాళానికి చెవి ఎలా వచ్చిందని మీకెప్పుడూ డౌటురాలేదా ? పోర్చుగీసు భాషలో “చాబిస్” అంటారు, తెలుగులోకి దిగి “చెవి” అయ్యింది. అన్నట్టు పవన్ కళ్యాణ్ పాట “ఏయ్ చికీతా, కొమేస్తాస్” అంటే స్పానిషు భాషలో “ఏయ్ పిల్లా, ఎలా ఉన్నావ్” అని. “మొహ్రబా..” అని ప్రేమికుడు సినిమాలో “ఊర్వశి ఊర్వశి” పాట మొదలవుతుంది. ఆ పదానికి టర్కిషు భాషలో “నమస్తే” అని అర్థం. మన తెలుగుకి పదాలని తీసుకోవడంలో బిడియాలు లేవు.నా ఉద్దేశ్యంలో, మిగతా భాషలతో పోల్చి చూస్తే ఇటాలియన్ను భాషైతే మరింత తీపిగా ఉంటుంది. దీనినుంచి తీసుకోవాలి పదాలని.

నేను ప్రస్తుతముంటున్నూరు ఇటలీ బోర్డరుకి అతిసమీపంలో ఉంటుంది. కొందరు ఇటాలియను ఫ్రెండ్సున్నారు నాకు. వారి భాష అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీదానికి పాడుతూ మాట్లాడతారు. ఎగ్జాక్టుగా చెప్పాలంటే అమలాపురం యాసలా ఉంటుంది. ఎల్బీ శ్రీరాము కారెక్టరు ఉంది కదా ఓ సినిమాలో, అలాగ. మాది గోదావరి జిల్లా కాబట్టి ఆ యాస ఎలా ఉంటుందో నాకు బాగ ఎరుక “ఏంటో, వచ్చేత్తన్నాది వచ్చేత్తనాది అంటన్నారు కానీ ఎంంంంంంంత సేపటికీ రాదేంటి ఈ ట్రెయినూ”, “ఏంంంంంంంంటండీీ మమ్మల్ని బొత్‌త్‌త్‌త్‌త్‌త్‌తిగా మర్చేపోయారూ.”, “ఓలమ్మో, ఈ రంగులరాట్నం ఎక్కితే నాకు కళ్ళు గిర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌రన తిరిగేత్తాయి” అలాగ అన్నమాట.

ఇటాలియన్ను భాషలో ఇటలీని “ఇతాలియా” అంటారు. మనలాగే ఇతాలియానోలు కూడా భోజనప్రియులు. యూరోపు మొత్తమ్మీద మసాలాలతో రుచికరంగా వండుకుతినేది ఇతాలియానోలే. ఇతాలియా టీవీ చానెళ్ళు పెడితే ఎప్పుడూ డాన్సు ప్రోగ్రాములే. వాళ్ళకో వీరపిచ్చి అబ్బాయి-అమ్మాయి డాన్సులంటే. జనాలు ఎప్పుడూ గెంతుతూ తెగ హుషారుగా ఉంటారు. చాల స్నేహస్వభావులు మనకు మళ్ళే. కాని, గోదావరి జిల్లాల వాళ్ళలాగ మృధుస్వభావులు కాదు. నా ఇతాలియన్ను ఫ్రెండు ఒకడు ఇలా చెప్పాడు “ఫ్రెంచివాళ్ళు రూల్సు పాటించరు అని మిగతా యూరపువాళ్ళు గోలపెడుతుంటారు. ఇటలీకొస్తే తస్సాదియ్యా, రూల్సు గురించి ఎత్తేవాడిని ముందే చితగ్గొడతారు. రోడ్డుమీద అడ్డంగా నడిచివెళ్తుంటే వెనకొస్తున్న లారీ వాడు హారనుకొట్టి ఏంటని అడిగితే ‘నా ఇష్టం, నే రోడ్డుమీదనే నడుస్తా, మీ అమ్మదగ్గరకెళ్ళి చెప్పుకో’ అని అంటారు”, అని చెప్పాడు. ఇటలీకింకా వెళ్ళలేదు నేను, వెళ్ళినప్పుడు చూడాలి ఆ సంగతులు 🙂

అమ్మా ఐ లవ్ యూ అని చెప్పండి

తెలుగువారికి బిగుసుతనం ఎక్కువా ? అమ్మా, నువ్వంటే నాకిష్టం అని చెప్పేవాళ్ళెంతమంది ? తెలుగుపదం లిస్టులో నేను రాసిన మెసేజిలను కొన్ని ఇటు పోస్టు చేస్తున్నాను.

… అమ్మ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక సింపులు ఛాలెంజి. పొద్దుటే లేచిన తరువాత అమ్మ కనిపడితే “శుభోదయం మాతా” అని చెప్పడానికి ట్రై చెయ్యండి. రిప్లై ఎలా ఉంటుందో ఊహించండి. పోనీ, అచ్చ తెలుగులోకి దిగి “మంచి పొద్దు అమ్మా” అని ప్రయత్నించండి !! ఇక్కడ తెలుగు పదాల అనువాదంలో ఇలాగ జరుగుతోంది.

ఈసారి అమ్మావాళ్ళు ఫొను చేసినప్పుడు, నాకు “mom, I love you” అని చెప్పాలని ఉంది. మన తెలుగులో ఎలా చెప్తారు ? మనం బొత్తిగా మర్చిపోయాం. ఇప్పుడు “అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్తే గంజిలో ఆరబెట్టిన మాటలవలే ఉంతాయి. సింపులుగా “అమ్మ ఐ లవ్ యూ” అంటే గడిచిపోతుంది 🙂 ….

… “mom, I love you” అనే మాటను ఆంధ్రదేశంలో ఎవరైనా వారి తల్లులకు తెలుగులో చెప్పిఉంటారా? “I love you” అనే మాటను ఇంగ్లీషువాళ్లు వాడగా మన పట్నాల్లో ప్రజలు అనుకరిస్తున్నారేగానీ పల్లెల్లో పుట్టి పెరిగినవారు I love you వాడుతున్నట్టు కనిపించదు. మనవాళ్లు ప్రేమను తెలపడానికి చాలామాటలేవాడతారు. చిన్న పిల్లలమీద ప్రేమ పొంగితే మురిపెంగా “మా బాబు బంగారం” అంటారు. అమ్మకు ఫోనుచేసి “బాగున్నావా అమ్మా, ఆరోగ్యం బాగుందా” అని అడిగితే ప్రేమను ప్రకటించినట్లుగా అర్థంచేసుకుంటుంది.నాకు తెలిసినంతవరకూ, “నేను నిన్ను ప్రేమించుచున్నాను” అని తెలుగువాళ్లు నేరుగా చెప్పరనుకుంటాను. “అమ్మా, ఐ లవ్యూ” అన్నానంటే కొత్తగా సినిమాటిక్గా అనిపించి, నేనేదైనా ప్రమాదంలో ఉన్నానేమో అని మా అమ్మ కంగారుపడుతుంది. …

… మన తెలుగువాళ్ళు “Mom, I love you” అని అసలు చెప్పేవారేకాదు అంటే నేను నమ్మలేను. ఈ వాడుక ఏదొ ఉండి ఉంటుంది, ప్రస్తుతం మూలనపడి ఉంటుంది. అయినా, “Mom, I love you” అని చెప్పలేని భాషా ఒక భాషేనా ! “ఐ లవ్ యూ” అని చెప్పడమేదో ఆంగ్ల సంప్రదాయమన్నట్టు అంటున్నారు. ప్రతీ మనిషికి ఉండే అత్యల్పమైన కోరిక ఇది – ప్రేమని ఇచ్చి పుచ్చుకోవడం. ఇది చేయడానికి వీలు కల్పించని భాష ఆటొమేటిక్గా చచ్చిపోతుంది. … మనుషుల మధ్య “ఐ లవ్ యూ” కూడా చెప్పుకోలేని భాష సుద్ధ వేస్టు. ఆ లైఫే వేస్టు. …

… ఇక్కడ కిరణ్గారు ఏదో కంఫ్యూజన్లో ఉన్నట్టున్నారు.

శుభోదయం మాతా! అని వారు ఎందుకు చెప్పలేరో నాకు అర్ధంకావట్లేదు. శుభ్రమైన
రెండు తెలుగు పదాలని ఉచ్ఛరించడానికి ఏమిటి కష్టం? వినే వారికి అర్ధం
కాకపోడానికి అవేమీ ఎవరికీ అర్ధంకాని సంస్కృత సమాసాలు కావే! గుడ్
మోర్నింగ్ అంటే లేని ఎబ్బెట్టు తనం శుభోదయం అంటే ఎందుకొచ్చింది? అలాగే
“అమ్మా నాకు నువ్వంటే ప్రేమ” అన్న నాలుగు పదాలు తెలుగులో చెప్పలేరా?

చెప్పలేరు. ఎందుకంటే అది భాషకి సంబంధించిన సమస్య కాదు కాబట్టి.
అది మన జీవన విధానానికి సంబంధించిన విషయం. ఈ ముఖప్రీతి మెచ్చుకోలు ఐ
లవ్యూలూ, థేంక్సులూ, గుడ్ మోర్నింగ్లూ ఎరువు తెచ్చుకున్న వ్యవహారాలు కనక!
మన జీవన విధానం నచ్చకో, పరాయి వాళ్ళ సంగతులు గొప్ప అనుకునో మనం వాళ్ళని
అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాం కనక! భాష మన జీవన విధానం ఆధారంగా
నిర్మించబడినది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఆ పలుకులలో జీవం కనపడక మనకి
ఎబ్బెట్టుగా అనిపించడంలో చిత్రమేమీ లేదు. అంత మాత్రం చేత ఐ లవ్యూ అనికూడా
చెప్పలేని భాష దండగమారిది అనుకుంటూ స్టేట్మెంట్లివ్వడం దుందుడుకుతనాన్ని
ఆలోచనలేమిని మాత్రమే సూచిస్తుంది. ఇంగ్లీషు వాడిని ఎంగిలి ని మీ భాషలో
ఏమంటారు అని అడిగితే ఏం చెప్తాడు? ఏమీ చెప్పలేడు. వాడికసలు అదేంటో కూడా
తెలీదు మరి. అంత మాత్రాన ఇంగ్లీషు మీద కామెంట్ చేసేస్తారా? …

… శిరము మూర్కొనుట అంటే ఏమిటో తెలుసా మీకు ? రామాయణంలో శ్రీరాముడు అడవికి వెళ్ళేముందు భరతుణ్ణి ఒంట్లో కూర్చోపెట్టుకుని శిరస్సుపై ముద్దు పెడతాడు. భరతుడేమీ పిల్లవాడు కాదప్పుడు. ప్రేమని వ్యక్తం చెయ్యడానికి మనకేమి ఎబ్బెట్టు, తిబ్బెట్టులుండేవి కావు.

సంస్కృత కావ్యాలన్నింటిలోని “ప్రియ సఖే” అని మొదలెడతారు మామూలు వాక్యాలని. ఇప్పుడు మనము “ఓసేయి కాఫీ పట్రా” అంటే అదేదో తెలుగులో ప్రేమ ఒలకబోయడం అనుకుంటున్నాం.

“మాతా వందనములు” అనేది సంస్కృతంలో సాధారణ ఉచ్ఛరణ. ఈ ఎబ్బెట్లన్నీ కల్పించేది బానిస మనస్తత్వం. ఉత్తర భారతంలో ముస్లిముల దండయాత్రల పిదప పరదాలు, సతీ సహగమనాలు అంటూ మతం ఎలా కర్కశమయ్యింది ? ఏదో మన కల్చరుకేదో వీర డేంజరు అంటూ ఛాందసులు లేని పోని రూల్సు పెట్టి జనాల బానిస మనస్తత్వాన్ని సొమ్ము చేసుకుంటారు.

ఇప్పుడు మీరు తెలుగుకి చేస్తోందీ అదే. ఇంగ్లీషు వాడు వెళ్ళిపోయి అరవై ఏళ్ళయ్యినా మన బానిస మనస్తత్వాలని మనం వదల్లేదు. ఎక్కడ ఏ ఇంగ్లీషు పదం లోపలికొచ్చేస్తుందో ఏంటో అంటూ వీర టెన్షను. ఇలాంటి టెన్షనుపడే జనాల చేతుల్లో తెలుగుని పెడితే అన్నీ ఎబ్బెట్టు-తిబ్బెట్టుగానే తయారవుతాయి.

“అమ్మా నువ్వంటే నాకిష్టం” అని మాత్రం చెప్పే మనుషులెంతమంది ఈ రోజుల్లో ? కొన్ని రోజుల్లో ఈ వాక్యం కూడా “అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటే ఎంత వికారంగా ఉందో అలా తయారవుతుంది. కారణం మీరు తెలుగు పదాల పరిరక్షణ అంటూ తెలుగు కల్చరు మీదనే దెబ్బ కొడుతున్నారు.

తెలుగు కల్చరునుద్ధరించడం అనేది తెలుగు భాషనుద్ధరించడం కన్నా చాల ఉత్తమమైన ఆశయం. ప్రస్తుతం అధమాధమ పాతాళంలో ఉన్నాం మనం. “ఐ లవ్ యూ” అనొద్దు, “గుడ్ మార్నింగ్” అనొద్దు అంటూ మూతులు కట్టిపడేసి కళాకారులను కోల్పోతున్నాం . ఈవిధంగా కోల్పోయే ప్రతీ కళాకారునికి తెలుగుభాష లోటయ్యినట్లే.

నేను చెప్పిన “ప్రేమ” ఉదాహరణలకి ప్రతిగా శ్రీరాం గారు “ఎంగిలి” గురించి ఎత్తారు. అంతకంటే మించిన కన్సెప్టే లేదా ఉదహరించడానికి !! ఆలోచన్లన్నీ ఇలాంటి ద్వేష భావాలతో కమ్ముకుపోయినప్పుడు మదికీ ఇంకేమి స్ఫుటించవు. “మైలపడడం” గురించి ఉదహరించలేదు సంతోషం.

ఫ్రెంచిలో ప్రతీ చిన్న దానికి “శుభ అది” “శుభ ఇది” అంటూ చెప్తారు. భోజనం చేస్తుంటే ముందు “బోన్ అపెతీ” (శుభ ఆకలి) అని కాసేపటి తరువాత “బోన్ కొంతిన్యువాశియోం” (శుభంగా కంటిన్యూ చెయ్యండి) ఫైనలుగా “బోన్ దెస్సేర్” (శుభ ఐస్క్రీము) అని అంటారు. మన తెలుగులో వీటికేవన్నా పదాలుంటాయా ? కాని, అంతా తిన్న తరవాత “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అనే సంప్రదాయం మనకే ! 🙂 …