Category Archives: సంస్కృతి

మేరు పర్వతం – మనిషి అంతరంగం

మేరు పర్వతం అంటే మీకు తెలుసా ? మన పురాణాల ప్రకారం, మేరు పర్వతం విశ్వం మధ్యన నెలవుండి 84,000 యోజనాల ఎత్తుంటుందంట. అంటే 10.8 లక్షల కిలోమీటర్లు. పోలికకి, భూమిపైనున్న అతి పెద్ద పర్వతం ఎవరెస్టు ఎత్తు కేవలం 8.8 కిలోమీటర్లు.  మేరు పర్వతం గురించి మరికొన్ని విశేషాలు :  సూర్య చంద్రులు, విభిన్న గ్రహాలు, నక్షత్రాలు రోజూ మేరు పర్వతం చుట్టూనే ప్రదిక్షణ చేస్తాయట. ఈ పర్వతం పైభాగాలలో ఇంద్రాది దేవతలు నివశిస్తుంటారట. ఈ పర్వతం అష్ట దిక్కులలో అష్ట దిక్పాలకులు రాజ్యం చేస్తుంటారట. కనుక, ఈ మేరు పర్వతం ఆషామాషీ పర్వతం ఏమీ కాదు. లెక్కకు మిక్కిలి మంది చారిత్రీకులు మేరు పర్వతానికిదే మూలం అంటూ వేరు వేరు పర్వతాలను సూచించారు. కానీ ఇవేమీ దీనికి సరిపోవు.  ఖగోళ పరిశోధకుడు, జ్యోతిష్యుడైన వరాహమిహిరుడు 5వ శతాబ్దంలో మేరు పర్వతం అంటే ఉత్తర ధృవం అని ప్రతిపాదించాడు. అదికూడా పోలికకి సరిపోదు.

ఈ బ్లాగుపోస్టులో, మేరు పర్వతం అంటే ఏమిటో రహస్యం మీకు వివరింప ప్రయత్నం చేస్తాను. భారతీయ సంస్కృతి, ఆచారాలు, ఇతిహాసాలు, కళాకృతులు, భక్తిప్రవృత్తులు, తత్వ సిద్ధాంతాలకు అన్నింటికీ ఈ మేరు పర్వతం కథయే మూలం. (ఈ విషయం మీకు బ్లాగులో మరింత స్పష్టమవుతందని నా ఆశ.) కానీ చిత్రమేమిటంటే, భారతీయులకి కొద్దిమందికి కూడా దీని గురించి అవగాహన లేదు ! గుళ్ళూ గోపురాలకి వెళ్ళేవాళ్ళు; వ్రతాలు, ఉపవాసాలు చెసేవాళ్ళు; వాస్తు, జ్యోతిష్యం పాటించేవాళ్ళు; దినదినం దేవతలకి పూజచేసేవాళ్ళు; పితృదేవతలకి ప్రణామం చేసేవాళ్ళు – వీరెవ్వరు దీని గురించి పట్టించుకోరు. కానీ ఈ నియమాలన్నింటికీ మేరుపర్వతం కథయే మూలం ! అతి చిత్రమైన విషయం ఏమిటంటే మా ఇంట్లో ఇవేమీ చెయ్యరు. నేను వ్యావహారికంగా నాస్తికుణ్ణి. కేవలం కుతూహలం కొద్దీ ఈ చిహ్నాలని అధ్యయనం చేశాను.

ఇంతకీ మేరు పర్వతం అంటే ఏమిటి ? మేరు పర్వతం అంటే మనిషి అంతరంగం, మరేమీ కాదు.

ప్రాచీన కాలంలో మన పూర్వీకులైన ఋషులు చేసినదేమన్నా ఉంటే అది తపస్సు (5 వేల సంవత్సరముల మునుపు హరప్పా నాగరికత కాలం నుండే, తపస్సుకి యోగ ముద్రలకి ఆధారాలు లభ్యం అవుతున్నాయి). ఈ ఋషులు యోగ నియమాలు పాటిస్తూ, ఓపికగా క్రమంగా అంతరంగ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఈ శాస్త్రానికి చక్కని చిహ్నమే మేరు పర్వతం.

అంతరంగానికి ఐదు తలాలు

మనిషికి పంచ కోశాలు (శరీరాలు) ఉన్నాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. బొమ్మలో చూపించిన వృత్తాలవలే ఇవి ఒకదానిలో మరొకటి ఒదిగి ఉంటాయట. అన్నిటికంటే బయట వుండేది (ఊదారంగులో చూపించిన) 3D వ్యాప్తిలో ఉండే ఐహిక శరీరం. దీనినే మనం సాధారణంగా శరీరం అని అంటాం, దీనినే వైద్యులు చికిత్స చేస్తారు. దీనిలోపల వేరే సూక్ష్మ శరీరాలు వేరే సూక్ష్మ-తలములలో ఉంటాయట. ఈ ఐదు తలాలకి సంస్కృతంలో చక్కని పేర్లున్నాయి. అవేమిటంటే,

అన్నమయం : ఇది భౌతిక తలం – అంటే అణువులు, శక్తి తరంగాలతో కూడి ఉన్న 3D వ్యాప్తి. దీనినే భౌతిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. నిర్జీవ పదార్థాలైన రాళ్ళు, రప్పలు కేవలం ఈ తలంలోనే నిమిడి ఉంటాయి. సంస్కృతంలో “అన్నం” అనగా నిర్జీవ పదార్థం అని అర్థం. ఏదైనా తిండి భుజించేటప్పుడు దానికి జీవం ఉండదు కాబట్టి దానిని అన్నం అని అంటాం.

ప్రాణమయం : ప్రాణంతో నివశించే మొక్కలు, వృక్షాలు అన్నమయ తలంతో పాటు ప్రాణమయ తలంలో ఉంటాయట. కనుక వీటికి రెండు కోశాలు (శరీరాలు). మునుపటి తలం ఈ తలం కన్నా హెచ్చింపు వ్యాప్తి కలిగి ఉంటుంచి. విశ్వం యొక్క పరిణామంతో పోలిస్తే ప్రాణులు నివశించే ప్రదేశం (ప్రస్తుతానికి భూమి తక్కించి వేరే గ్రహాలు మనకు తెలియవు) అతిచిన్నది కదా ! ప్రాణమయ తలం అంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. వ్యాప్తిలో చిన్నదైనా, ప్రాణమయతలం అన్నమయతలంతో పోలిస్త్ హెచ్చింపు క్లిష్టమైనది. ఇది జీవ అణుసముదాయాల క్లిష్టత్వంలో మనకు కనపడుతుంది.

మనోమయం : మెదడు కలిగి ఉండే జంతువులు ఈ మూడవ తలంలోకి సారించి ఉంటాయి. జీవశాస్త్రంలో దీనిని ఇంద్రియ-యాంత్రిక వలయం అని అంటారు. అంటే పరిశరాలని గ్రహించి వెనువెంటనే ప్రతికృతి చెయ్యడం అన్నమాట. వ్యాప్తిలో చిన్నదైనా, మనోమయం ప్రాణమయం కంటే హెచ్చింపు క్లిష్టమైనది. జంతువుల మెదడులోని నరాల అల్లికలో ఈ క్లిష్టత్వం మనకి కనపడుతుంది.

విజ్ఞానమయం : విజ్ఞానం అనగా భాషతో వ్యక్తీకరింపగలిగే జ్ఞానం అని అర్థం. ప్రకృతిలోని వస్తుధర్మాలను వేటినైనా మానవ భాషలలో వివరించవచ్చు. ఈ భావాలను ఆవృత్తి చేసుకోగలరు గనక మనుషులు విజ్ఞానమయతలంలో సారించి నివశించుతుంటారు. ఈ తలం మనోమయతలం కన్నా హెచ్చింపు క్లిష్టమైనది. మానవ భాషలలోని పదాల పొందికలోను, మనుషుల మధ్య సందేశాల పొడవులోను ఈ క్లిష్టత్వం మనకు అగుపడుతుంది. కంప్యూటరు భాషలు కూడా పెక్కు క్లిష్టమైనవి కనుక మనం కంప్యూటర్లను కూడా ఈ తలంలో ఊహించుకోవచ్చు.

చిన్మయం : “ఇది నేను” అని తర్కించగల నేర్పథ్యం మనుషులకి కలదు. దీనిని సంస్కృతంలో అహంకారం అని అంటారు (“అహం” అనగా “నేను”). ఈ తలం విజ్ఞానమయ తలం కన్నా హెచ్చింపు క్లిష్టమైనది. ఎందుకంటే మునుపటి తలంలో కేవలం వస్తుధర్మాలనే తర్కించగలము, ఈ తలంలో స్వధర్మాలను కూడా తర్కించవచ్చు. మనుషులు ఆలోచించి అమలుజరపగల పథకాలలో ఈ క్లిష్టత్వం మనకు అగుపడుతుంది. అహంకారం అనేది మనిషి జ్ఞప్తికి ముడిపడి ఉంటుంది. ఇది అతిసూక్ష్మ శరీరం. దీనిపైన వేరువేరు వివేచన కార్యాలను ఒకదానికి మించి మరొకటి క్లిష్టమైనవి విడగొట్టవచ్చు. చాందోగ్య ఉపనిషత్తులో వీటినిలా వివరిస్తారు : నామం, వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, ఆత్మ విజ్ఞానం, బలం, స్మరణ, ఆశ, శ్రద్ధ, నిష్ట, కృతి, సుఖం.

ఈ ఐదు తలాలలోను మనిషి వేటిమీదనైనా దృష్టిపెట్టి ఫలం పొందవచ్చును. కానీ, క్రింది తలాలకన్నా పై తలాలలో సుఖం హెచ్చింపు దొరుకుతుందట. ఆ ఫలం పరిణామం బట్టి ఈ ఐదు వృత్తాలను ఒక పర్వతం వలే ఊహించుకోవచ్చు (ఈ శిఖరాగ్రం పైనుండి చూస్తే ఈ పర్వతం ఐదు వృత్తాలవలే కనపడుతుంది). ఇదే మేరు పర్వతం.

ఈ విశ్వంలోని ప్రతి జీవరాశి అధికమైన సుఖం ఆశిస్తూ ఈ పర్వతం పైకి ఎక్కటానికి ప్రయత్నం చేస్తుంటుందంట. ఈ వృత్తాల మధ్యనున్న బిందువే ఈ పర్వతం యొక్క శిఖరం. ఆ చిన్న బిందువు చుట్టూ మేరు పర్వతం విరిగిపోయిందట. అంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ బిందువు వద్ద దొరికే సుఖం అనంతమైనది అన్నమాట. ఈ అనంత సుఖమునే “ఆనందం” అని మన పూర్వీకులు అన్నారు. ఆ బిందువు చుట్టున్న వలయాన్ని ఆనందమయం అని అన్నారు.

ఈ సిద్ధాంతం అనాది కాలం నుండీ భరతఖండంలో ప్రాచుర్యంలోనున్నది. బౌద్ధమతంలో కూడా ఈ మేరుపర్వతం అతి ముఖ్యమైనది. బౌద్ధులు వారి స్థూపాలను మేరుపర్వతం వలే మలచుకొన్నారు. ఏ బౌద్ధస్థూపముకన్నా అందుకనే ఐదు తలాలు గలవు. బౌద్ధం తరువాత శైవ, వైష్ణవ మతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వారి ఆలయాలను కూడా స్థూపములవలే మేరుపర్వతానికి ప్రతిబింబం వలే కట్టుకున్నారు. అందుకనే ఏ హైందవ దేవాలయం చూసినా  గుడి గోపురం మేరుపర్వతానికి ప్రతిబింబంవలే ఉంటుంది. గోపురం చుట్టు వేరు వేరు తలాలలో వివిధ మృగాల, రాక్షసుల, మనుషుల, దేవతల విగ్రహాలు ఉంటాయి. గోపురం పైన కళశం బ్రహ్మానందానికి చిహ్నమై అమరి ఉంటుంది. సరిగ్గా కళశం క్రింద గర్భ గుడిలో ఈశ్వరుని విగ్రహం ఉంటుంది – ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నట్టు. గుడిలోని భక్తులు విగ్రహం చుట్టు ప్రదిక్షణ చేస్తారు – మేరు పర్వతం చుట్టూ సూర్యచంద్రాది దేవతలు ప్రదిక్షణ చేసినట్టే. కానీ అసలు రహస్యం – ఈ పర్వతం ఒక మనిషి అంతరంగంలోనే చూడవచ్చన్నమాట.

పర్వతం ఎక్కడానికి మూడు అడుగులు

పైకి : అధికమైన సుఖం కావాలంటే పర్వతంపైకి ఎక్కడం మంచి తరహానే. దీనినే రాజస గుణం అని అంటారు. కానీ ఏ తలంలో ఉన్నా, ఆ తరువాతి తలం హెచ్చింపు ఎత్తులో ఉంటుంది. ఎంత ఎక్కప్రయత్నం చేసినా, తలందాటి ముందుకు వెళ్ళలేము. కనుక, ఈ రాజస గుణం ఎక్కువైతే, పర్వతం యొక్క అసలునైజం (ఇది మన అంతరంగంలోనే ఉంటుందని) మరచిపోయి సంపాదన కోసం (లోభి) జీవితం గడుపుతాము. ఈ సంపాదన ఎప్పటికి నిజమైన ఆనందం అందించలేదు. ఈ అతి-రాజసత్వాన్ని అన్నమయతలంలో కామం అని, మనోమయతలంలో లోభం అని, చిన్మయతలంలో గర్వం అని అంటారు. రాజసగుణానికి చక్కని ప్రతిబింబం సర్పం. తిన్న తిండిని బట్టి సర్పం పొడవు పెద్దదవుతూ ఉంటుంది. కానీ దాని జీవిత చరమకాలం వచ్చేటప్పటికి, ఎంత సర్పమైనా చావక తప్పదు.

లోనికి : ఒక తలంలో నుండి బయటపడి పై తలంలోకి ప్రవేశించాలంటే అంతరంగంలోకి దృష్టి సారించాలి. దీనినే సాత్విక గుణం అని అంటారు. భారతదేశంలో కనుగొన్న గణక పద్ధతి దీనికి చక్కని ఉపమానం చూపిస్తుంది. అంకెలు 1,2,3,.. తీసుకోండి. పైతలంలోకి అంకె ప్రవేశించాలంటే మునుపటి తలాలలో సున్నా పెట్టాలి – 9, 10, 11,… 99, 100, .. ఇదే విధంగా మన ప్రాచీనులు మనిషి ఆ తలాలలో సుఖాన్ని సన్యసించి తరువాతి తలం యొక్క సుఖం ఆశించాలని అభిప్రాయపడ్డారు. అందుకని ఈ అడుగుని లోనికి, లేదా క్రిందకు అనికూడా అనవచ్చు. గమ్మత్తుగా క్రిందకు వస్తే మరింత వేగంగా మేరు పర్వతం పైకి వెళ్ళవచ్చు !విపరీతమైన కామం తప్పించుకొనాలంటే తరువాతి మనోమయతలంలోని ఆస్తిని ఆశించాలి. విపరీతమైన లోభాన్ని తప్పించుకోవాలంటే తరువాతి చిన్మయతలంలోని (పలువురిలో) గుర్తింపుని ఆశించాలి. విపరీతమైన గర్వాన్ని తప్పించుకోవాలంటే ఆత్మజ్ఞానాన్ని వాంఛించాలి. సత్వగుణం తనంత తను ఉండలేదు, కొంత (పైతలంలోని) రాజసగుణం తోడ్పుకావాలి. సత్వగుణానికి చక్కని ప్రతిబింబం సూర్యుడు. తన లోపల తనని తపించుకోవడం వల్ల ప్రపంచానికి అంతటికీ కాంతిని ప్రసరిస్తాడు.

సమతలంగా : సమతలంగా ఉండటం అంటే ఏ అడుగు వెయ్యకపోవడం. దీనినే తామస గుణం అని అంటారు. మనిషి జీవితకాలం పరిమితమైనది కనుక, ఈ గుణానికి అర్థం ఒకటే – చావు. కనుక, ఇది మంచిది కాదని మన ప్రాచీనుల అభిప్రాయం.కానీ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, ఏ అడుగు వెయ్యకపోయినా మనం మేరు పర్వతం చుట్టూ ప్రదిక్షణ చేస్తాము. ఈ విశ్వంలో ప్రతీ వస్తువుకి ఒక అవధికాలం ఉంటుంది. ఆ సమయం ముగిసిన తరువాత మళ్ళీ అదే ప్రవర్తన కొనసాగుతుంది. దీనికి చక్కని ఉదాహరణ ఊపిరి (ప్రాణ వాయువు).ఈ ఊపిరిలో మనసు లీనమైతే మేరుపర్వతం ఒక భ్రమవలే మాయమవుతుందట.

ఈ మూడు గుణాలు ఏవీ చెడ్డవి కావు, మంచివి కావు. అతిదేంట్లోనన్నా ఎక్కువైతే అది చివరికి చేటు చేస్తుంది. సృష్టిలోని ఏ వస్తువైనా మేరుపర్వతంలో ఏదో ఒక తలంలో వశిస్తూ, ఈ గుణాలను ఒక మోతాదులో కలిగి ఉంటుంది. ఈ గుణాల పొందికవల్ల పైకో క్రిందకో కదుల్తుంది. దీనినే సాంఖ్య సిద్ధాంతం అని అంటారు. వేరు వేరు దేవతలు ఈ గుణాలనే కలిగి మేరు పర్వతం పైతలాలలో నివశిస్తారట. వీరే రకరకాలైన రాజసమూర్తులైన సర్పదేవతలు (నాగులు), సత్వమూర్తులైన సూర్యదేవతలు (ఆదిత్యులు), తామసమూర్తులైన వాయుదేవతలు (మారుతులు) – వేదాల్లోను, పురాణాల్లోను కనపడతారు. రాజస గుణం అతి ఎక్కువైతే నాగులు కాస్తా అసురులుగాను, యక్షులు కాస్తా రాక్షసులు గాను మారుతారు. అతి ఎక్కువైతే ఆదిత్యులు (ఉదాహరణకి కర్ణుడు), మారుతులు కూడా చెడ్డవారవుతారు.

మేరు పర్వతం శిఖరాగ్రం వద్ద ఈ మూడు గుణాలు అనన్యమైన దేవతాముర్తులవుతాయి. వీరినే త్రిమూర్తులంటారు – బ్రహ్మ (రాజస), విష్ణు (సత్వ), శివ (తామస). వీరి సతీమణులు వీరి ప్రతిబింబాలు – భర్తలు క్రియాకారులైతే భార్యలు వారి క్రియాశక్తులు. వాక్కు (సరస్వతి) అతి గొప్ప సర్పము – ఇంతకన్నా వేగంగా ఏదీ పెద్దదవలేదు. విష్ణువు ఆదిత్యులలో అనన్యుడు. శివుడు మారుతుల్లో అనన్యుడు. ఈ త్రిమూర్తులు మేరుపర్వతంపైన శిఖరాగ్ర బిందువు వద్దనుండంవల్ల ఒకరికొకరు కలిసిపోయి ఉంటారు. మిగిలిన గుణాలను కూడా వారి ఆభరణాలవలెనో (శివుని ఆభరణమైన సర్పము, విష్ణువు ఆభరణమైన శంఖము / వాయువు), అనుచరులవలెనో (విష్ణువు పవళించే ఆదిశేషుడు, శివుని కుమారుడైన కార్తికేయుడు ఆదిత్యులకు సేనాపతి) కలిగి ఉంటారు. అందుకనే శివకేశవులు ఒకరికొకరు ప్రతిబింబాలని అంటారు. బ్రహ్మ రాజసమూర్తి గనుక అతనిని విష్ణువుతో (సత్వము) కలిపి మాత్రమే భక్తులు ఊహిస్తారు. శివుడు తామస స్వరుపుడు గనుక విశ్వాంతములో కూడా తనే మార్పులేక నిశ్చలముగా ఉంటాడు – త్రిమూర్తులు ముగ్గురు శివునిలోనే అంతర్ధానమవుతారు.

ఇది మేరు పర్వతం కథ !

సహనం సంస్కృతికి ఆధారం

మనిషికి అతిపెద్ద శత్రువులు అరి షడ్వర్గాలు అని మన పురాణాలు చెబుతాయి. కోపం, కామం వగైరా .. అట్లే, క్రైస్తవంలో 7 అతి పెద్ద పాపాలున్నాయంటారు.

కానీ, రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఏమని చెబుతాడు అంటే “మనిషికి గల పాపాలు కేవలం రెండే – అసహనం, అత్యాశ. అత్యాశ ద్వారా అతడు స్వర్గానికి దూరమయ్యాడు. అసహనం వల్ల అతను ఎప్పటికీ స్వర్గం చేరలేకపోతున్నాడు.” ఇలా చెప్పిన వెనువెంటనే కాఫ్కా అంటాడు. “కాదు, అసలు మనిషికి గల పాపం ఒక్కటే – అసహనం. అసహనం ద్వారానే అతను స్వర్గానికి దూరమయ్యాడు, అసహనం ద్వారానే తిరిగి స్వర్గం చేరలేకపోతున్నాడు”.

జీవితంలో ఏమి సాధించాలన్నా సహనం కావాలి. సహనశీలి అయినవాడు మనుషుల్లో అత్యుత్తముడు. ఓర్పుగలవాడు మేరుపర్వతంతో పాలసముద్రాన్నే మధించగలడు.

మనదేశ సంస్కృతిలో అతి గొప్ప విషయం మన సహనం. ఈ సహనం ఉండవల్లే భిన్న మతాలు, భాషలు, కళలు, సంగీతాలతో మనదేశం వెలుగొందుతోంది. ఇంతటి అద్భుతం ప్రపంచం మొత్తంలో ఎక్కడా మీకు కనపడదు. సహనానికి సరైన సూత్రం మన దేశచిహ్నంలోనే ఉంది. “సత్యమేవ జయతే”, అనే ఈ వాక్యం ముండక ఉపనిషత్తు నుండి సంగ్రహించి మన దేశ చిహ్నంలో పొందుపరిచారు. “సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండు, దేనికీ తొందరపడకు”, అని దీని అర్థం.

మనకు నిజంగా ఈ వాక్యం పై నమ్మకం ఉంటే “ఏదో ఆకాశం వచ్చి మీదపడిపోతోంది, మన సంస్కృతి నశించిపోతోంది, చీడపురుగులని తగలబెట్టాయాలి”, అంటూ ఆవేశపడిపోము. ఈ ఆవేశమే అన్ని అనర్థాలకు మూలదాయకం. “హుస్సేన్ కళాచిత్రాలు మన సంస్కృతిని కించపరుస్తున్నాయి.”, అని ఒకడు. “తస్లీమా నస్రీన్ మా మతాన్ని కించపరుస్తోంది”, అని ఇంకొకడు, ఇలా మనం రెచ్చిపోము.

సహనం అంటే ఏమిటి ? ఇది అర్థం చేసుకోవడం చాలా సుళువు. బయట ప్రపంచం మీ ఆలోచనలకి అనుగుణంగా లేదు, కలియుగమో ఏమో కానీ అంతా తల్లకిందులవుతోంది. మీ మాట ఎవ్వరూ వినట్లేదు. మీరు అనుకున్నట్టు, ప్రయత్నిస్తున్నట్టూ ఏమీ జరగట్లేదు. మీకు చిర్రెత్తుకొస్తోంది. ఈ సమయంలో మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వడమే సహనం అంటే.

ఈ సద్గుణం మీకు ఉంటే మిగిలిన మనుషులు ఏమి చేసినా మీ మనోనిర్మలం చెదరదు. చెప్పడానికి సుళువుగానే చెప్పేసినా ఇది ఆచరించడం అంత సుళువు కాదు.

మీరు మిమ్మల్ని సహనశీలురు అని అనుకున్నా, కొన్ని హద్దులు దాటి ఉండలేరు. ఉదాహరణలు :

 • మీ అమ్మాయి తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాను అంది.
 • పోనీ, మీకు కులం మీద పట్టింపు లేదు అనుకుందాం, మీ అమ్మాయి ఒక అవిటివాడిని ముసలివాడిని, బీదవాడిని ప్రేమించింది. అప్పుడు, మీరు ఒప్పుకోగలరా ?
 • మీ అమ్మాయి నాకు పెళ్ళి ఇష్టం లేదు, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అంది. అప్పుడు మీరు ఒప్పుకోగలరా ?
 • మీ అబ్బాయి మతం మార్చుకుని, వేరే దేశం అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అన్నాడు. ఒప్పుకుని ఆశిర్వదించగలరా ?
 • మీ అబ్బాయి స్వలింగ సంపర్కం తప్ప స్త్రీలపై ఇష్టం లేదు అని చెప్పాడు. అప్పుడు ఒప్పుకోగలరా ?
 • మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. వారిని మీరు ఆదరించగలరా ?
 • మీ చెల్లెలు పెళ్ళికి ముందు గర్భవతి అయ్యింది. ఆదరించగలరా ?

మన సమాజంలో ఇటువంటి ప్రశ్నలు రోజూ ఎదురుపడుతున్నాయి. ఇవి ఏమీ ఇష్టం లేకపోయినా వీటిని అధిగమించి మనుషలని ప్రేమించగలడం చాలా కష్టం. మనుషుల్లో అత్యుత్తములే దీనిని చెయ్యగలరు. వీళ్ళు ఏసుక్రీస్తుకు, గౌతమ బుద్ధునికి, మహ్మద్ ప్రవక్తకి, శ్రీరామునికి ప్రతిబింబాలు.

ఇంతటి కఠినమైన ప్రశ్నలు రాకపోయినా, చిన్నవాటికే అసహనం తెచ్చుకునే వారు కోట్లమంది ప్రజలు. వీరు రెడ్లు అయితే కమ్మవారంటే పడదు. వీరు హిందువులైతే ముస్లిములంటే పడదు. ఎవ్వరైనా బట్టలు కురచగా వేసుకునే స్త్రీలంటే పడదు. ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళంటే పడదు, తెలుగు మాట్లాడే వాళ్ళంటే పడదు. వేరే ప్రదేశం నుండి వలస వచ్చిన వాళ్ళంటే పడదు. స్వలింగ సంపర్కులంటే పడదు.

అన్ని రకాల వారు వచ్చి సమాజాన్ని కలుషితం చేసేస్తున్నారని ఒకటే టెన్షను. నిజానికి అసలు సమస్య బయట వాళ్ళ దగ్గర కాదు, మన మెదడులోనే ఉంది, అదే అసహనం.అసహనం అనేది ఒక వ్యాధి వంటిది. ఈ తెగులు పట్టిన సమాజం అక్కడే ముగిసిపోతుంది.

సహనం అనేది కళకి, సంస్కృతికి ములాధారం. కొత్తని స్వాగతించాలి, అప్పుడే కొత్త కొత్త కళలు, సంగీతాలు పుడతాయి. పుట్టినవన్నీ గొప్పవి కాకపోవచ్చు, కానీ వేలలో ఒకటి మంచిది బయటకి వస్తుంది. కానీ, ఇది రావాలి అంటే ముందు అన్నింటికీ స్వాగతం చెప్పాలి.

ఆధునిక యుగంలో లోకం వెనువేగంగా మారిపోతోంది. ప్రతి రోజు ఒక కొత్త ఆవిష్కరణ వచ్చి సమాజాన్ని ముంచెత్తుతోంది. మన గమ్యం ఎటు పోతున్నామో ఏమీ అర్థం కాదు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి మనిషికి ఇంత తీవ్రంగా ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇటువంటి సమయంలో సహనం యొక్క అవసరం మరింత పెరిగి ఉంది. అంతేకాక, సహనం కోల్పోతే దారుణమైన ప్రాణహాని చెయ్యడానికి సరిపోయే తుపాకులు, బాంబులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక, మనం మరింత జాగ్రత్తతో ఉండాలి.

చదువుకున్నవారు కూడా సమాజం ఎంతవేగంగా మార్పు చెందుతోందో అంచనా వెయ్యలేకపోతున్నారు. నేను చెప్పేవి ఏవో సైన్సు ఫిక్షనులాగ అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మన జీవితకాలంలోనే జరుగుతాయి.

 1. వర్చువల్ రియాలిటీ ద్వారా సుదూర ప్రాంతాల నుండే స్త్రీపురుషులు సెక్సు అనుభవించగలుగుతారు. అప్పుడు భార్య-భర్త అన్న పదాలకి నిర్వచనం ఏమవుతుంది ?
 2. జన్యు టెక్నాలజీ ద్వారా పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో, ఎలాంటి రోగాలకి నివారణ ఉండాలో తల్లిదండ్రులు ముందే డిసైను చెయ్యగలుగుతారు. అప్పుడు జాతి, ఆచారాలకి అర్థం ఏముంటుంది ?
 3. ఒక బిడ్డ జన్యువులు కేవలం తల్లి నుండి, తండ్రి నుండే కాక మొత్తం మానవ జీనోము నుండీ వస్తాయి. అప్పుడు తల్లి, తండ్రి అన్న సంబంధానికే అర్థం ఏముంటుంది ? మానవజాతి మొత్తం బిడ్డకి తల్లి కాదా ?
 4. ఒక స్త్రీ చిత్రం / వీడియో చూసి, ఆమె నగ్న సౌందర్యం ఎలా ఉంటుందో అంచనా వెయ్యగలిగే సాఫ్టువేరు తయారవ్వుతాయి. అప్పుడు ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చర్చకి అర్థం ఏమిటి ?
 5. మీరు ఒకసారి వీడియోలో మాట్లాడితే, మిమ్మల్ని మరో మనిషిగా మార్చివేసి అతడు మాట్లాడాడు అని మోసం చెయ్యగల సాఫ్టువేరు వస్తుంది. ఈ పరిస్థితిలో ఎవ్వరు చెప్పేది నిజమో. అతడు నిజంగా అనుకున్న మనిషో కాదో, ఎలా తెలుసుకోగలం ?

నేను చెప్పింది నమ్మకపోతే మీరు సెర్చిచేసి తెలుస్కోండి. (4) ఇప్పటికే తయారయ్యి ఉంది, నేను వెళ్ళబోయే కాంఫరెన్సులో ఒక విద్యార్తి దీనిపై తన పరిశోధనని సమర్పించబోతున్నాడు. ఇక (5) మీద నేను స్వయంగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 7-8 కెమేరాలు ఉండే ఒక గదిలో పనిచేస్తోంది. మరో ఐదేళ్ళలో సాధారణ వీడియోపై పనిచెయ్యగలదు.

మేము పనిచేసే చిన్నపాటి టెక్నాలజీలతోనే ఇన్ని పెద్ద మార్పులు వస్తుంటే ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు పనిచేస్తున్న టెక్నాలజీలు అన్నీ ఎలాంటి మార్పులు తేగలవో ఊహించగలరా ? ఇలాంటి టెక్నాలజీలు మనల్ని ముంచెత్తినప్పుడు మనకి మరో మార్గం ఉండదు. అందుకని, ఇప్పటినుండే సహనం అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఎమర్జెన్సీ రూములో విద్యా రంగం

మా అమ్మనాన్నలిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు. పచ్చని గోదావరి జిల్లాలలో పనిచేస్తున్నారు. ఇక్కడ అక్షరాస్యత శాతం కేవలం 70% (అంటే 30% మందికి చదవడం, వ్రాయడం కూడా చేతనవదు అన్నమాట). మా అమ్మనాన్నలు పనిచేసే స్కూళ్ళలో తరగతికి 100 మందికి పైబడి విద్యార్థులు. ఇక్కడ కూర్చోడానికి బల్లలు లేవు. పిల్లలకి తినడానికి సరైన ఆహారం లేదు. ఏమాత్రం వర్షాలొచ్చినా స్కూలు ప్రాంగణం బురదమయం. వ్యవసాయంలో కోతపనులు జరిగేటప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళ ఇళ్ళలో సాయంచేయడానికి స్కూలు ఎగ్గొడతారు. ప్రతి తరగతికి ఒక 10% మంది పై తరగతికి వెళ్ళకుండానే బడి మానేస్తుంటారు. చివరికి పదవ తరగతి పాస్ అయ్యేది కేవలం సగం మంది మాత్రమే. ఆడపిల్లలో అయితే చాలామంది పదవ తరగతికి ముందునే పెళ్ళిల్లు చేసుకుంటారు. మా అమ్మనాన్నలకి పెళ్ళి శుభలేఖలు వస్తుంటాయి.

మా అమ్మగారి స్కూలులో చాలామంది హాస్టలు పిల్లలు. చాలా వెనకబడిన సామాజిక తరగుతులనుండి వచ్చినవారు. హాస్టలులో నడిచే రాజకీయాలు, అవకతవకలు చాలా ఎక్కువ. చదువుపై శ్రద్ధ లేకపోవడం వలన ఈ పిల్లల ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువ. ప్రభుత్వం అందించే టెక్స్టు పుస్తకాలని వీరిలో కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్మివేస్తుంటారు. ఇలాంటి పిల్లలు ఇంజనీరింగు, వైద్యం లాంటి వృత్తి విద్యలను చేజిక్కించుకోగలరా ? ప్రవేశ పరీక్షలలో గెలుపొందగలరా ? మనదేశంలో 90% పిల్లలు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు.

రిజర్వేషన్లను విమర్శించేముందు ఒకసారి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వీటివల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసేముందు, మనదేశంలో విద్యారంగాన్ని సమూలంగా అభివృద్ధిచెయ్యడానికి మనకి ఒక ఐడియా కావాలి.

విద్య – మనదేశానికి ఆఖరి ఛాన్సు :

మన దేశ జనాభాలో పెక్కుమంది యువతరం. వీరికి సరైన విద్యనందిస్తే దేశం పెనువేగంగా అభివృద్ధి చెందుతుంది. జనాభా పెరుగుదల మందగించగానే, సమాజంలో వృద్ధులు మరీ ఎక్కువైపోతారు. మనం వృద్ధులమయ్యాక మనకి పెన్షన్లు ఇవ్వడంకోసమై మన తరువాతి తరం వాళ్ళు పనిచెయ్యాల్సి వస్తుంది. దేశ ఆర్థిక ప్రగతి విపరీతంగా కుంటుపడుతుంది.

చైనాలో ఇప్పుడు ఇదే ప్రోబ్లం వస్తోంది. కానీ, ఆ దేశం ఇప్పటికే విద్యారంగంలో బాగా పెట్టుబడి పెట్టి 100% అక్షరాస్యత సాధించింది. అభివృద్ధి రేసులో చివరి అంకంలో వారి ఆర్థిక వృద్ధి రేటు 10%గా మరికొంత కాలం కొనసాగుతుంది.

మనదేశంలో చాలామందికి అర్థంకాని విషయం ఏమిటంటే, మనంకూడా రేసు చివరి అంకంలో ఉన్నాం. రాబోయే 30 ఏళ్ళలో మనం పేదరికాన్ని నిర్మూలించలేకపోతే, వృద్ధుల శాతం పెరగడం వల్ల, మనదేశం చిరకాలం పేదదేశంగా మగ్గిపోతుంది. మాలవాడు కానీ, బ్రాహ్మణుడు కానీ – చదువు విడిచిపెడుతున్న ప్రతి చిన్నారికి మన గుండె కళుక్కుమనాలి. ఈ విషయంలో మన తరం ఒక్కరిని కూడా అలక్ష్యం చెయ్యడానికి వీలులేదు.

మనదేశంలో విద్య దౌర్భాగ్యం :

రాజ్యాంగంలో విద్యకి బడ్జెట్లో కనీసం 6% ఇవ్వాలి అని రాసివుంది. నా దృష్టిలో విద్య అనేది అతి ముఖ్యమైన సమస్య, కనీసం 10% ఖర్చుపెట్టాలి. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంత, ఎంత వేగంగా అయితే అంత – మన ప్రజలని విద్యావంతులని చెయ్యాలి. కానీ ఎప్పుడూ మనదేశ బడ్జెట్లో 4% మించి విద్యకి డబ్బులు కేటాయించలేదు. ఇప్పటి కేంద్రీయ బడ్జెట్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యకోసం అంతా కలిపి ఇచ్చినది 24,115 కోట్ల రూపాయిలు. అదే రక్షణకోసమై 1,00,0000 కోట్ల రూపాయిలు. రైతులకి వ్యవసాయ రుణాల మాఫీపై ఇచ్చిన సబ్సిడీ 60,000 కోట్ల రూపాయిలు.

విద్య అంటే ఇంత నిర్లక్ష్యం ఉండడం వలననే మనదేశానికి స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళయినా ప్రతి భారతీయునికి ప్రాథమిక హక్కైన విద్యని అందించలేకపోతున్నాం.

100 మంది పిల్లలకి కనీసం ఒక ఉపాధ్యాయుడు కూడా లేడు. ఇంతమంది విద్యార్థులను పర్యవేక్షించడం మన ఉపాధ్యాయులకి చేతగాని పని. ఎన్నికలకి, ప్రభుత్వ పండగలకి ఈ ఉపాధ్యాయులచే వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. పబ్లిక్ పరీక్షలప్పుడు వేలకొద్దీ జవాబుపత్రాలను దిద్దిస్తుంటారు. ఇంతటి ఒత్తిడి తట్టుకుని పనిచెయ్యడం అసాధ్యం. చాలామంది టీచర్లు అందుకనే వారి ఉద్యోగ ధర్మాన్ని మొత్తంగానే అలక్ష్యం చేస్తున్నారు.

మన ప్రభుత్వ విద్యా బడ్జెట్టు 90% టీచర్లకి జీతాలివ్వడానికే సరిపోతోంది. ఇంత తక్కువమందికి చాలీచాలని జీతాలిస్తూంటేనే, ఉన్న డబ్బులు అయిపోతున్నాయి. అంటే విద్యకి ఎంత తక్కువ ఖర్చుపెడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. చాలా స్కూల్లలో త్రాగునీరు, టాయిలెట్ సదుపాయాలు లేవు. ఆటస్థలం ఉండదు. కొన్నిసార్లు చెప్పుకోవడానికి ఒక భవనం కూడా స్కూలుకి ఉండదు. దేశంలో 9.54% స్కూళ్ళలో స్కూలు మొత్తానికీ ఒకటే గది ! దేశంలో 10 కోటి స్కూళ్ళు ఉండగా, లక్ష స్కూళ్ళలో బ్లాక్ బోర్డు లేదు. 20 వేల స్కూళ్ళలో ఒక ఉపాధ్యాయుడు కూడా లేడు. మరి వీటిని స్కూలు అని పిలవడం ఎందుకో.

ప్రాథమిక విద్య కందకం లోతుల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఉన్నత విద్య పాతాళంలోనే అఘోరిస్తోంది.

మన దేశ జనాభాలో పట్టభద్రులు 0.5%. వీరిలోనే సగం మంది ఏ విధమైన ఉద్యోగానికి పనికిరాని వారు. మిగిలిన 0.25% మందిలో ఇంటర్నెట్టు ఉపయోగించడం తెలిసినవారు కేవలం 5%, అంటే మొత్తం జనాభాలో 0.01% అన్నమాట. దేశంలో సాఫ్టువేరు పరిశ్రమ వెలుగు జిలుగులు చూసి సంబరపడిపోయేముందు తెలుసుకోవలసింది ఏమిటంటే ఇది ఉపాధి కల్పించేది కేవలం 0.01% జనాభాకి అని. రాబోయే పదేళ్ళలో కంప్యూటరు పరిశ్రమకి సరిపడే మనుషులు దొరక్క కంపెనీలన్నీ ఫిలిప్పీన్సు, చైనా లాంటి దేశాలు తరలిపోగలవని నాస్కాం ఇప్పటికే హెచ్చరికలు మోగిస్తోంది. మనుషుల కొరత వలననే సాఫ్టువేరు కంపెనీ ఉద్యోగుల జీతాలు కూడా అసాధారణంగా 20% పెరుగుతున్నాయి.

మన దేశంలో 10,000 మందికి ఒక డాక్టరు ఉన్నాడు. అమెరికాలో అయితే ఇంతమందికి 546 డాక్టర్లున్నారు. మనం 1/500 అన్నమాట. అర్జెంటుగా మనదేశానికి 6 లక్షల డాక్టర్లు కావాలి.

ఏ పరిశ్రమ చూసినా చదువుకున్న నిపుణుల కొరత మన దేశంలో అత్యధికంగా ఉంది. ఇలాంటి దేశంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎవ్వరు ముందుకు వస్తారు ? పరిస్థితి ఇలావుంటే, విద్యలో నాణ్యత తగ్గిపోతోంది అంటూ వృద్ధాచార్యులు పేపర్లలో సంపాదకీయాలు వ్రాస్తున్నారు – ‘కాలేజీలు ఇష్టమొచ్చినట్లు కట్టేస్తున్నారు, వీటి నాణ్యత మరుగుపడిపోతోంది” అని. నాణ్యత అదేవస్తుంది, ముందు సాధ్యమైనన్ని వృత్తివిద్య కాలేజీలు కట్టాలి.

నేను రీసెర్చి విద్యార్థిని గనుక, చివరిగా కొంత పరిశోధనా రంగం గురించి కూడా చెబుతాను. మన దేశంలో అన్నిరకాల ఇంజనీరింగు విభాగాలు కలిపి పీ.హెచ్.డి పట్టా పొందేవారు ఎంతమందో తెలుసా ? ఏడాదికి 400 ! ఇందులో అత్యధికులు సరైన పరిశోధనా పత్రాలు సమర్పించకుండానే పట్టా పొందుతున్నారు. ఐ.ఐ.టీ లాంటి మేటి సంస్థలలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు గలిగిన పరిశోధనా పత్రాలు అతి తక్కువ. చైనాను గమనిస్తే, ఈ దేశం ఇప్పటికే అమెరికా కంటే ఎక్కువ పీ.హెచ్.డి పట్టాలను తయారుచేస్తోంది. పరిశోధన నైపుణ్యంకూడా అంతర్జాతీయ ప్రమాణాలలో ఉంది.

ప్రజాస్వామ్యానికి విద్య అవసరం :

చైనా కంటే మనం ఎందులో గొప్ప, అని అడిగితే ఠక్కున చెప్పే జవాబు – మనం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని. కానీ అబ్రహాం లింకన్ అన్నట్లు “విద్య లేని ప్రజాస్వామ్యం మితం లేని వంచన”. ప్రజాస్వామ్యమనేది పనిచెయ్యాలంటే ప్రజలకి చదువు వచ్చి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా నిరక్షరాస్యులతో ప్రజాస్వామ్యం పనిచెయ్యలేదు. పైకి షోకు చెప్పుకోవడమే కానీ, మనదేశంలో నిజంగా నడుస్తున్నది కులస్వామ్యం. ఒకరకమైన ఫ్యూడల్ రాజ్యం. ప్రజల్లో 100% అక్షరాస్యత వచ్చేవరకు ప్రజాస్వామ్యపు ఆలోచనలు వారికి అర్థం కావు.

ప్రపంచంలోని పెనువిప్లవాలు అన్నీ విద్య-సమాచారం ఆధారంగా వచ్చాయి.

 1. వ్రాత అనేది కనుగొనేముందు సమాజంలో అక్షరాస్యుల శాతం 0%. మనుషుల ఆలోచనలన్నీ తిరిగినవి జాతి, తెగ, గోత్రం మీదనే.
 2. వ్రాత కనుగొన్న తరువాత మతం పుట్టింది. రాజ్యం పుట్టింది. డబ్బు అనేది పుట్టింది. సమాజంలో అక్షరాస్యుల శాతం 5%. సమాజం ఫ్యూడల్ పద్ధతిపై నడిచేది.
 3. పుస్తకాలు ముద్రించడం మొదలు పెట్టిన తరువాత ప్రజలలో అక్షరాశ్యత మొదటిసారిగా 100% అయ్యింది. ఈ దెబ్బకి రాచరికం పోయింది. ఫ్యూడల్ ప్రభువులు పోయారు. ప్రజాస్వామ్యం వచ్చింది. పెట్టుబడిదారీ సమాజం తయారయ్యింది.

మనదేశంలో కులం ప్రకారం పార్టీలు తయారవుతున్నాయి. రాజకీయ నాయకులు మత ఉద్రేకాలను రెచ్చగొడుతున్నారు. ప్రజలు గొర్రెలవలే ఓట్లు వేస్తూ తోడేళ్ళ లాంటి నాయుకులను కుర్చీలనెక్కిస్తున్నారు. ఇవన్నీ ఏమీ ఆశ్చర్యం కలిగించే అంశాలు కావు. వ్రాత తెలియని వాడు జాతి-కులం గురించే ఆలోచిస్తాడు. పుస్తకాలను ఎరగని వాడు మతాన్నే నమ్ముతాడు.

జ్ఞాన యుగంలోకి 100% మంది అడుగుపెడితే, అటువంటి సమాజం ఆలోచించే విధానమే తేడాగా ఉంటుంది. మనం బ్లాగర్లు కనుక అటువంటి సమాజంలో ఉన్నాం అనుకోవచ్చు. కానీ, తప్పు. మనం జీవితంలో 60% నుండి 99% వరకు అజ్ఞానులతో సంభాషణ సాగిస్తున్నాం. ఈ ప్రభావం మన ఆలోచనా-సరళిపై ఉంటుంది. నేను సమాజాన్ని మార్చాలనుకుంటున్నాను. సంపూర్ణమైన సహనం, స్వేఛ్ఛ కలిగిన మనుషులమధ్య ఉండాలనుకుంటున్నాను. ఇది జరగాలంటే, ఒకటే మార్గం. ప్రజలందరూ విద్యావంతులు కావాలి. అసలైన విప్లవం ఇదే. కమ్యూనిస్టులదీ కాదు. ప్రాంతీయవాదులదీ కాదు. మతోద్రేకులదీ కాదు.

అతివేగంగా భారతీయులను విద్యావంతులను చెయ్యడం ఎలా ?

చరిత్రలో సమాచారం చేరవెయ్యడానికి కొత్త మార్గాలు కనుగొన్న ప్రతిసారీ, విద్యా రంగంలో ఒక విప్లవం వచ్చింది.

వేదాలు వల్లించే కాలంలో వ్రాత కనుగొనబడలేదు. అందుకని, వేదం మొత్తం బట్టివేసేవారు. వ్రాత కనుగొన్న తరువాత, మొదటిసారిగా టీచరు అనే వృత్తి అవతరించింది. కానీ, గ్రంథాలయాలు ఎక్కడనో కానీ ఉండేవి కావు. బట్టీవెయ్యడం అనేది ఇంకా కొనసాగింది. పుస్తకాలు ముద్రించిన తరువాత మొదటిసారిగా ఒక టీచరు వివిధ సబ్జెక్టులని వివరించడం మొదలయ్యింది. విద్యాబోధనలో పుస్తకాలని సంప్రదించగలిగిన తరువాత తప్పులకి ఆస్కారం తక్కువ. యూరపు-అమెరికా విద్యలో పుస్తకాల ఇంపార్టెన్సుని గుర్తించింది. చారిత్రిక కారణాల వల్ల మనదేశంలో ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకి, అమెరికాలో ఓపెన్-బుక్ పరీక్షలు ఎక్కువ (పరీక్షలో నువ్వు నీకు కావలసిన పుస్తకం పట్టుకు వెళ్ళవచ్చు). మనదేశంలో బట్టీవెయ్యగలిగిన వాడే పరీక్షలో నెగ్గగలడు.

ప్రస్తుతం మనం పుస్తకాలని కూడా వెనక్కి పెట్టేసి ఒక సరికొత్త ఇంటర్నెట్టు యుగంలోకి అడుగుపెట్టాము. విద్యార్థికి ఇప్పుడు తరగతి గదిలో కూర్చుని పాఠం నేర్చుకోవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్టులో సెర్చి చేసి అనేక విషయాలను తనంతట తానే తెలుసుకోగలుగుతున్నాడు.

డబ్బులు ఎక్కువగా లేని మనదేశంలో విద్యని పెంపొందించడానికి సాధ్యమైనంత పదునుగా బాణాలు సంధించాలి. ఉన్న డబ్బుని అతిజాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. ఇప్పుడు దేశంలో మంగళివాడు మొదలుకొని పాలవాడివరకూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఇదే విధమైన విప్లవం విద్యలో కూడా కలిగించాలంటే ఏది మార్గం ?

ప్రతి గ్రామానికి ఆప్టికల్-ఫైబరు కలిపితే అయ్యే ఖర్చు, రోడ్లు వెయ్యడానికి అయ్యే ఖర్చులో 1%. ఇంటర్నెట్టు వాడుకకి మనదేశంలో ముఖ్య సమస్య విద్యుత్ సరఫరా. సరైన కరెంటు ఉన్నంతకాలం ప్రజలు దీనిని అద్వితీయంగా ఉపయోగించుకోగలరు.

ప్రస్తుతం డిజిటల్ వీడియో కెమారాల వలన, ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నప్పుడు దానిని వీడియోలో బంధించడానికి అయ్యే ఖర్చు అతి తక్కువ. హార్డు డిస్కులు చవుక గనుక, ఇటువంటి వీడియోలు సేకరించి, సర్వర్లలో పొందుపరచడం కూడా చాలా సుళువు. మన స్కూళ్ళలో టీచర్లు విపరీతమైన కొరతలో ఉన్నారు. చాలా మందికి విద్యాబోధనలో అలక్ష్యం. వారి సబ్జెక్టు మీద వారికే సరైన అవగాహన లేదు. ఇటువంటి పరిస్థితిలో, ఈ వీడియోలు అద్భుతంగా పనికివస్తాయి.

ఆప్టికల్ ఫైబరు లేనంతవరకూ, పట్టణాలలో ఔత్సాహికులు ఇటువంటి వీడియోలను సీ.డీ.ల్లో భద్రించి పల్లెటూళ్ళకి తిరిగి స్కూళ్ళకి అప్పగించవచ్చు. వికిపీడియా నిర్మించడానికి మన తెలుగు బ్లాగర్లు కృషిచేసినట్లే, ఒక వీడియో వికిపీడియాని ఆవిష్కరించవచ్చు.

కానీ, వీడియోలు చూపించినంత మాత్రాన చదువు ఎవ్వరికీ అబ్బదు. విద్యార్థులతో ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకుని సంభాషణ నడపగలిగే మెంటర్లు కావాలి. విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చెయ్యగలుగుతూ ఉండాలి. ప్రశ్నలకి “వీడియో/వెబ్ వికిపీడియాలలో” సమాధానాలు ఎలా వెతుక్కోవచ్చో పిల్లలకి నేర్పగలగాలి.

కార్నెగీమెలన్లో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజ్ రెడ్డిగారు ఈ విషయంపై ఇప్పటికే చాలా ఐడియాలు ఆచరణలోకి పెట్టారు. కొంతకాలం ఆయన స్టుడెంటుగా పనిచేసిన అదృష్టం నాది. ఈ విద్యాబోధనని “లెర్నింగ్ బై డూయింగ్” అంటారు.

ప్రస్తుతం “21వ శతాబ్ది గురుకులం” అని మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో కంప్యూటర్ పర్జిజ్ఞానాన్ని మాస్టర్ డిగ్రీగా అందిస్తున్నారు. ఒకసారి డిగ్రీ పుచ్చుకున్న తరువాత, ప్రతీ విద్యార్థి మెంటరు క్రింద పనిచెయ్యవచ్చు. టిచర్ల కొరతని కొంతవరకూ ఇలా భర్తీ చెయ్యవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మనదేశంలోని కంప్యూటర్ నిపుణుల కొరతని అరికట్టవచ్చు.

ఇదేవిధమైన ఆలోచనలు పాఠశాల-కళాశాల లెవల్లో కూడా మనం అమలు జరపాలి.

మన తరం ఆలోచించవలసిన ప్రశ్నలు

ఈ పోస్టులో మన తరం ప్రజలు ఆలోచించవలసిన కొన్ని తీక్షణమైన ప్రశ్నలను పరిచయం చేస్తాను. “రాజకీయాలు మనకెందుకులే, దేశం ఎక్కడికిపోతే నాకేంటి” – అని పెదవి విరిచే బదులు, “మన తెలుగు నేలని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు” అని ఆలోచిస్తే, మన తరం యువకులకి ఒక అద్భుతమైన అవకాశం ముందు ఉంది. దేశం ఆర్థిక విధానాలు ఎలాగ పనికి వస్తాయి ? సెజ్ ల ద్వారా అభివృద్ధి సాధ్యమేనా ? ఇలాంటి ప్రశ్నలకి అందరూ తలోరకంగా సమాధానమిస్తున్నారు. ఇక్కడ ఒక సిద్ధాంతం ప్రకారం వీటిని వివరించేందుకు ప్రయత్నం చేస్తాను.

సమాచారం నిక్షిప్తపరచుకునే సాధనాలలో మార్పులు కలిగినప్పుడు, సమాజం మొత్తం అతలావితలమవుతుంది. మునుపు చారిత్రిక విశ్లేషకారులు సామాజిక మార్పులను తెచ్చిపెట్టేవి దృఢ సాంకేతిక విప్లవాలు (ఆవిరి యంత్రం, గాలి మర, ఎలెక్ట్రిక్ బల్బు..) అని భావించేవారు. కానీ ఈ వివరణ తప్పు. అసలైన మార్పులు కల్పించేవి మృధు సాంకేతిక విప్లవాలు – సమాచారం, సందేశం పంపించే సాధనాలలోని విప్లవాలు.

ఇలాంటి విప్లవం ఒకటి మన కళ్ళ ముందరే ఆవిష్కృతమవుతోంది (ఇంటర్నెట్టు) . మిషెల్ సెర్ర్ ఉపన్యాసం పూర్తిగా తర్జుమా చేసేముందు ఈ పోస్టులో ఒకసారి సంక్షిప్తపరుస్తాను.

మానవ నాగరికత పరిణామం మొత్తం నాలుగు దశలలో వివరించవచ్చు :

 • వాచ్య దశ : అన్ని రకాలైన సంభాషణ మాట్లాడడం ద్వారానే జరిగేది
 • లిఖిత దశ : భాషని వ్రాయడానికి ఒక లిపి కనుగొన్న తరువాత
 • ముద్రణా దశ : ముద్రణా యంత్రం కనుగొన్న తరువాత
 • సందేశాత్మక దశ : సమాచారాన్ని పరిమార్చి. ప్రసరించ గలిగే ఒక యంత్రాన్ని కనుగొన్న తరువాత

వీటిలోని ప్రతీ పరిణామం మనుషులు సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారో తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ మృధు పరిణామాలు అక్షరాలా ప్రపంచాన్ని మొత్తం కూల్చివేసి, తిరిగి పునర్నిర్మించాయి. రాజ్యం, వాణిజ్యం, శాస్త్రం, న్యాయం, మతం, సంస్కృతి – ఈ ఆరు రంగాలు మానవ పరివృత్తిని మూలంగా నిర్వచించుతాయి. మృధు విప్లవాలు ఈ రంగాలలో ఎలా మార్పులు తెచ్చిపెట్టాయో అర్థం చేసుకుందాం.

వాచ్య దశ :

రాజ్యం : సమాజం తెగల క్రింద విడవడి ఉంది. ప్రతీ తెగ కొంతమంది పెద్దల ఆధ్వర్యంలో నడుస్తుంది. మనిషి తెగకి బద్ధుడై ఉంటాడు – జాతి సంబంధాలు, బంధుత్వాలపై అతని నడవడిక ఆధారపడి ఉంటుంది.

వాణిజ్యం : ఇచ్చిమార్పిడల ద్వారా వాణిజ్యం నడుస్తుంది. బంగారం మొదలైన విలువైన లోహాలు – ఈ ఇచ్చిమార్పిడికి ఒక తులమానికగా పనికివస్తాయి.

శాస్త్రం : ఆదిమ సిద్ధాంతాలు ప్రకృతి ప్రవర్తనని వివరించే ప్రయత్నం చేస్తాయి. పనిముట్లు, ఆయుధాలు తయారీ చెయ్యడం ఇంకా ఒక కళగా భావించబడుతుంది. విద్య కేవలం కుటుంబం లోపలనే అందించబడుతుంది.

న్యాయం : వంశ గౌరవం, తెగ గౌరవం కాపాడడం అనేది సారాంశం. ఇంతకు మించి న్యాయ రంగం వేరే ఉండదు. ప్రతీ మనిషి ఈ గౌరవం కాపాడేందుకు ఆయుధాలు చేపట్టాలి.

మతం : ప్రకృతి దేవతలని ఆరాథించే బహుళేశ్వర మతాలు ప్రకృతి వైపరీత్యాలని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తాయి. ప్రకృతితో ప్రశాంత సహజీవనం చెయ్యడం నేర్పుతాయి.

సంస్కృతి : దేశ సంచారం చేసే పాటగాళ్ళు కావ్యాలను అల్లిపెడతారు.

ఉదాహరణలు : వైదిక భారతం (క్రీ.పూ. 600 వరకు), పైథాగొరాస్ మునుపటి గ్రీసు (క్రీ.పూ. 580 వరకు), రోము సామ్రాజ్యపు మునుపటి యూరపు (క్రీ.శ. 200 వరకు), అక్షరాస్యత లేని సమాజాలు (40% భారత ప్రజానీకం, 64% ఆఫ్ఘనిస్తాను)

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : జాతి

లిఖిత దశ :

రాజ్యం :
ఒక రాతిపై వ్రాయబడిన న్యాయ శాసనం ద్వారా రాజ్యం అనేది మొదటిసారిగా కనిపెట్టబడుతుంది (అశోకుని శిలాశాసనాలు, హమ్మురబీ శాసనం). రాజ్య సరిహద్దు ఖచ్చితంగా నిర్వచించబడి ఉంటుంది, దాని భద్రతకై ఒక సైన్యం అవసరమవుతుంది. రాజ్యనిర్వహణ తెగల యొక్క గణతంత్రాలని విడిచి ఒక రాచరికంగా అవతరిస్తుంది. రాచసేవ చెయ్యడానికి ఒక వర్ణక్రమం తయారవుతుంది.

వాణిజ్యం : ధనం (రాగిపై, మరేదైనా లోహంపై వ్రాయబడిన ఒక విలువ) కనిపెట్టపడుతుంది. ధన, వాణిజ్యాలు నిర్వహించడానిక ఒక వైశ్య తరగతి పుడుతుంది.

శాస్త్రం : రేఖాగణితం కనిపెట్టబడుతుంది. గణితం ఒక్క ఉపయోగం వల్ల వృత్తిపనులు కళలుగా కాక సాంకేతిక పరిశ్రమలుగా అవతరిస్తాయి. కొలతలు, పరిశీలనల ఆధారంగా ప్రకృతిని వివరించడానికి సిద్ధాంతాలు పుడతాయి. మతశిబిరాలలో విద్యాబోధన జరుగుతుంది. చెదురుమదురుగా ఉండే కొన్ని గ్రంథాలయల వద్ద విశ్వవిద్యాలయాలు వెలుస్తాయి. ఉపాధ్యాయుని వృత్తి మొదటిసారిగా అవతరిస్తుంది. గ్రంథాల లేమి వల్ల ఉపాధ్యాయుడు చాలా విషయాలు జ్ఞప్తిలో ఉంచుకోవలసి వస్తుంది.

న్యాయం : వ్రాయబడని వంశ గౌరవంగా కాక ఒక ఖచ్చితమైన న్యాయ శాసనంగా అవతరిస్తుంది. దీనిని అమలుచెయ్యడానికి, నేరస్థులని దండించడానికి ఒక దళం తయారవుతుంది.

మతం : గ్రంథాల ఆధారితమైన ఏకేశ్వరోపాసక మతాలు పుడతాయి. ప్రజల కట్టుబాట్లను ఇవి ఖచ్చితంగా వ్రాసి నిర్ధారించడంతో, ఈ మతాలలో స్వేచ్ఛ తగ్గి మరింత కఠినంగా మారుతాయి.

సంస్కృతి : కళాకారులు రాజుల సంస్థానాలలో పోషించబడుతారు. సంగీతం వ్రాయడానికై ఒక భాష అవతరిస్తుంది. చిత్రలేఖనం, శిల్పకళ ఒక ఖచ్చితమైన కొలతలతో నేర్పబడుతాయి.

ఉదాహరణలు : కులం చేత వ్యక్తీకరించదగిన బ్రిటిషు రాక మునుపటి ఇండియా (క్రీ.శ. 1600 వరకు : మౌర్యులు, గుప్తులు, మొఘళ్ళు..), సామాజిక తరగతి చేత వ్యక్తీకరించదగిన రెనైసాన్సు మునుపటి యూరపు (క్రీ.శ. 1500 వరకు : పైథాగొరాస్ తరువాతి గ్రీసు, రోము సామ్రాజ్యము ..), క్రీ.శ. 1950 మునుపటి వరకూ టిబెట్, క్రీ.శ 1900 మునుపటి వరకూ అరేబియా, ప్రస్తుత భారత దేశంలో కులం ఎక్కడ ఇంకా గట్టిగా నడుస్తోందో.

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : మతం

ముద్రణా దశ :

రాజ్యం : పుస్తకాలు జ్ఞానాన్ని ప్రజలలో పంచిపెడతాయి. దీనితోనే “ప్రజలందరూ సమానులే” అన్న భావం వెల్లివిరుస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్యం అవతరిస్తుంది. ప్రజా ప్రతినిధులు ఎన్నికలచే నియమింపబడతారు. “దేశం” అనే భావన ఏర్పడి, ప్రపంచం దేశాలుగా విడివడి ఉంటుంది.

వాణిజ్యం : బ్యాంకు కనిపెట్టబడుతుంది. డబ్బుతో నమ్మకస్తుడిగా ఉండటం అనే ఆలోచన పుడుతుంది. దీనిని బట్టి బ్యాంకులు అప్పు ఇస్తాయి, వాణిజ్యం నడుస్తుంది. బ్యాంకు చెక్కు, ముద్రితమైన డబ్బు పెట్టుబడిదారీ విధానాన్ని ఆవిష్కరిస్తాయి.

శాస్త్రం : ముద్రితమైన పుస్తకాలు చెంతనుండగా ఉపాధ్యాయుడు అన్ని విషయాలను జ్ఞప్తికి ఉంచుకోనక్కర్లేదు. ఈ పుస్తకాల ఆధారంగా పాఠశాలలు, కళాశాలలు నడుపబడతాయి. మొదటిసారిగా ప్రజానీకం మొత్తం విద్యావంతులవుతారు. ప్రయోగాలచే నిర్ధారించడం అనే ప్రాతిపదిక పైన ఆధునిక శాస్త్రీయ పద్ధతి పుడుతుంది. విజ్ఞాన శాస్త్రం వేల విభాగాలుగా వెల్లివిరుస్తుంది.

న్యాయం : లిఖించబడిన రాజ్యాంగం ఆధారంగా న్యాయ విశ్లేషణ జరుగుతుంది. మతం నుండి న్యాయం విదగొట్టబడుతుంది.

మతం : “చేతిలో బైబిలు ఉండగా ప్రతి మనిషి పోపుకి సమానుడే”, అంటూ లూథర్ క్రైస్తవంలో పునర్నిర్మాణ ఉద్యమం మొదలుపెడతాడు. మతం ఒక వ్యక్తిగతమైన విషయంగా మారుతుంది. దైవానికి మనిషికి మధ్యన పూజారుల అధికారం తగ్గిపోతుంది. మతానికి ఆర్థిక అధికారాలు నశించిపోతాయి.

సంస్కృతి : కళ అనేది అంగడిలో ఒక సరుకుగా మారుతుంది. ప్రతి మనిషి కళా వస్తువులను కొనడం ద్వారా కళాకారులను ప్రోత్సహించగలుగుతాడు. ఈ కళా సంతలో దుకాణాలపై ఆజమాయిషీ చేసే దళారులు ఒక కొత్త సంపన్న వర్గంగా అవతరిస్తారు.

ఉదాహరణలు : రెనైసాన్సు పిదప ఆధునిక యూరపు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆధునిక జపాను, అభివృద్ధి చెందుతున్న దేశలలోని (చైనా, ఇండియా, బ్రెజిలు..) చదువుకున్న మధ్య తరగతి వర్గాలు.

రాజ్యం నిర్వచించడానికి ఒక్క పదం : మార్కెట్

సందేశాత్మక దశ :

మానవ చరిత్రలో మొదటిసారిగా ప్రపంచం మొత్తం ఒక్క మౌస్-క్లిక్కు దూరంతో కలవబడి ఉంది. ఈ కొత్త యుగంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాము. మునుపు సంభవించిన విప్లవాల వల్లే, ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం త్రెంచివేయబడుతుంది. సరిహద్దులు లేని ప్రపంచంలో ఒక కొంగొత్త ఆర్థిక, రాజకీయ పద్ధతి సృష్ఠించబడుతుంది.

ఈ మార్పులని కొన్ని ఇప్పుడే గమనించవచ్చు : ఏ.టీ.యెం, ఈ-కామెర్సు వాణిజ్యం ఎలా జరుగుతుందో పునర్నిర్వచించాయి. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం యొక్క ఆర్థిక బలం తూర్పు దిశగా మళ్ళుతోంది. ఇంటర్నెట్ యుగంలో డబ్బుని దొంగిలించడానికి కొత్త మోసగాళ్ళు తయారయ్యారు, వీరివల్ల వాణిజ్యం ఎలా నడపాలి అనే విషయంలో కొత్త దిశలలో ఆలోచించటం మొదలుపెట్టాము. విద్యా, శాస్త్రీయ రంగాలలో : ఇంటర్నెట్, గూగుల్ వల్ల ఉపాధ్యాయుని పాత్ర మొత్తం మార్చబడింది. శాస్త్రీయ అన్వేషణ ఒక అద్వితీయమైన వేగంతో వృద్ధి చెందుతోంది : కంప్యూటర్ సిమ్యులేషన్, ఇంటర్నెట్ ద్వారా కలిసికట్టుగా పరిశోధన – ఇవి శాస్త్రీయ రంగాలలో పెనుమార్పులు తెచ్చిపెడుతున్నాయి.

ఇక్కడతో సెర్ర్ ఉపన్యాసం సంక్షిప్తం. ఇప్పుడు నేను నా ఆలోచనలు, అభిప్రాయాలు బయటపెడతాను. ఇప్పుడు మనం కొన్ని దృఢమైన ప్రశ్నలు అడగాలి : మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అసలు ప్రతినిధులు అవసరమా ? ఇంటర్నెట్టు ఆధారంగా ప్రజలచే మరింత స్వేచ్ఛగా, పారదర్శకంగా ప్రభుత్వ పాలన చెయ్యగలమా ? వ్యక్తికి సంపూర్ణమైన స్వేచ్ఛ లభించగలదా ? వ్యక్తిగతమైన స్వేచ్ఛకి భంగం కలిగించకుండా వ్యక్తికి రక్షణ కల్పించగలమా ? మనలో ప్రతి ఒక్కరూ కళాకారులు కాగలరా ? ఒక కళాకారుడు డబ్బు గురించి ఆలొచించనవసరం లేకుండా, సంపూర్ణమైన భావ వ్యక్తీకరణా స్వేచ్ఛ పొందగలడా ?

ఇవి మన తరం యువకులు ఆలోచించవలసిన ప్రశ్నలు.

ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు పైన వివరించబడిన 3 యుగాలలో బ్రతుకుతున్నారు. కానీ అంతిమంగా, అందరూ 4వ యుగంలోకి రావలసిందే. ఈ వివిధ యుగాలు అన్నీ ఒకదానితో మరొకటి వ్యతిరేకతను కలిగి ఉంటాయి. ఈ విషయం సుళువుగా అర్థమవుతుంది. మార్పుకు ఎంతో వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. ఒక యుగం దాని తరువాతి యుగంతో కలబడుతున్నప్పుడు, దాని సొంతటి చిన్నతనంలో పూర్వ యుగానికి విరుద్ధంగా ఉపయోగించిన ఆయుధాలనే వాడుతుంది.

లిఖిత యుగంలో నడుస్తున్న సమాజం దాని మునుపటి వాచ్య యుగం యొక్క హింసని, అలజడిని బూచిగా చూపిస్తుంది. “రాజు నశించిపోతే మిగిలేది అరాచకమే. మతం లేకపోతే మిగిలేది అరణ్యమే”, అంటూ కలబడుతుంది. కానీ, యుద్ధంలో చివరకి నెగ్గేది పెట్టుబడిదారీ ముద్రణా యుగం మాత్రమే. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం నెగ్గుకు వస్తాయి.

ఉదాహరణ : 16వ శతాబ్దంలో చర్చి యూరపులో ప్రజాస్వామ్య, శాస్త్రీయ ఉద్యమాలని అణచివెయ్యడాని బహువిధాలుగా ప్రయత్నించింది. ప్రస్తుత ఇస్లామిక్ సమాజంలో ఛాందస వాదులు “ప్రజాస్వామ్యం అంటే విగ్రహాధారనతో సమానం, వచ్చేది వఠ్ఠి అరణ్య పాలనే” అని పురాతన బూచిని చూపెట్టి ఆస్తికులను బయపెడుతున్నారు.

ముద్రణ-యుగంలో నడుస్తున్న సమాజం మత ఛాందసత్వం, ఫ్యూడల్ రాజ్యం వంటి లిఖిత-యుగ బూచులని చూపెట్టి ప్రజలను బెదరగొడుతుంది. ఇదంతా, సందేశాత్మక-యుగం నుండి జనాలని దారి మళ్ళించడం కోసం.

ఉదాహరణ : ఈ యుద్ధం ప్రస్తుతం మన కళ్ళ ముందరే అమెరికాలోను, యూరపులోను జరుగుతోంది. యధాస్థితివాద పార్టీలు “ఇస్లాం యొక్క ఛాందసత్వం, ఉగ్రవాదం” అని ప్రజలను భయపెడుతున్నాయి. సంగీతం, సినిమాలు, టీవీ, దినపత్రికలు – వీటిని శాసిస్తున్న మీడియా ధనిక వర్గం “ఇంటర్నెట్టు పైరసీ” అని ప్రజలను బెదరగొడుతోంది. అసలు ఉద్దేశ్యం మన తరం నాటి ప్రశ్నల నుండి మనల్ని దారి మళ్ళించడం కోసమే.

మిషెల్ సెర్ర్ కి మునుపు మరో తత్వవేత్త కార్ల్ మార్క్సు మానవ సామాజిక పరిణామాన్ని ఈ పద్ధతిలో వివరించే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన సిద్ధాంతమైన మార్క్సిజానికి సత్యానికీ మధ్య వ్యత్యాసం – లామార్కు థియరీకి డార్విను యొక్క అసలు పరిణామవాద సిద్ధాంతానికి మధ్య వ్యత్యాసమంత. లామార్కు ఆలోచన విప్లవాత్మకమైనదే – జీవులు కాలంతో పరిణామం చెందుతున్నాయి అని. ఆయన దృష్ఠిలో, జిరాఫీ చెట్ల చిగురుటాకులను అందుకోవడం కోసం మెడను సాగదీసింది – అలా సాగతీయగా, సాగతీయగా మెడ పొడవయ్యింది అని. కానీ ఇది నిజం కాదు. పరిణామాం జరిగేది జంతువుపైన కాదు (phenotype) కానీ జన్యువు పైన (genotype).

మానవ సామాజిక పరివర్తనని శాస్త్రీయ దృక్పథంతో వర్ణించాలి అనే ధైర్యం ఉంది కానీ, మార్క్సు ఒక తప్పు సిద్ధాంతం రచించాడు. ఆయన దృఢ టెక్నాలజీలు (phenotype) సామాజిక మార్పులు తెస్తాయని భావించాడు. కానీ, అసలు కారణం మృధు టెక్నాలజీలు (genotype). సోవియట్ యూనియనులోని కమ్యూనిస్టు సైద్ధాంతికులు లామార్కు నిజమైతే బాగుండునని ఎంతో ఆశించారు. కమ్యూనిస్టు విప్లవం నాటికి రష్యా ఏ విధంగానూ ఒక పెట్టుబడిదారీ దేశం కాదు. అది ఒక పురాతన దశలోని ఫ్యూడలు దేశం. కమ్యూనిస్టు ఉద్యమం విజయవంతమైన మరేదేశమూ కూడా (చైనా, క్యూబా, ఇండియాలోని నక్సలైటు ప్రాంతాలు) పెట్టుబడిదారీ దేశంకా దు. అవి ఫ్యూడాల్ సమాజాలు. రష్యాలోని కమ్యూనిస్టులు ఆశించినదేమిటంటే, వారి మెడలని బాగా సాగదీస్తే సోషలిజం యొక్క చిగురుటాకులు దక్కుతాయి అని. కాని, అవి ఎప్పటికీ దక్కలేదు.

ప్రతీ కమ్యూనిస్టు విప్లవం మానవ ప్రగతిలో ఒక వెనకడుగు అయ్యింది : ముద్రణా-యుగంలోని పెట్టుబడిదారీ దశని చంపివేసి లిఖిత-యుగంలోని రాచరికాన్ని తిరగతోడింది. కమ్యూనిస్టు దేశాలలోని విపరీతమైన సెన్సార్షిప్పు, సీక్రెట్ పొలీసులు, భావ వ్యక్తీకరణ నిర్బంధాలు – ఇవేవీ ఫ్యూడల్ సమాజంలో ఆశ్చర్యం కలిగించవు. జరిగినదది. మన భారతదేశంలోని కమ్యూనిస్టులు ఇంకా అవే సిద్ధాంతాలను పట్టుకు వేళ్ళాడుతుండడం నిజంగా మన దురదృష్టం. ఇంకా ఎన్ని సార్లు ఇవి తప్పని నిరూపించబడాలో తెలియదు. వేపకాయంత వెర్రి ముదిరి తాటిపండంత అయ్యింది అన్నట్టు – వీరు ఇప్పుడు ఇరాన్, చైనా లాంటి దేశాలను సమర్థిస్తున్నారు. ఇరాన్లో ఇస్లాం మతపెద్దలు కమ్యూనిస్టలనందరినీ చంపేసిన విషయం తెలుసునో, తెలియదో మరి !

సమాజంలోని ప్రగతిశీల వ్యక్తుల కర్తవ్యం – టెక్నాలజీకి అణువుగా సమాజం తీర్చిదిద్దటం.అంటే, వాచ్య దశ కంటే లిఖిత దశని పెంపొందించటం (జాతి కంటే మతం మెండు), లిఖిత దశ కంటే ముద్రణా దసని పెంపొందించటం (మతం కంటే మార్కెట్ మెండు), ముద్రణా దశ కంటే సందేశాత్మక దశని పెంపొందించటం (మార్కెట్ కంటే ఇంటర్నెట్ మెండు).

సమాజం యొక్క పరిణామం ఈ విధంగా జరుగుతుంది. ఉత్సాహమున్న తెలుగు యువకులని, యువతులని నేను అడిగేది ఏమిటంటే “మన జీవితకాలంలోగా తెలుగునేలని ఈ దశలన్నీ దాటించి సందేశాత్మక యుగంలోకి తీసుకురావాలి” అని.

మాతృభాషకి ఉష్ట్రపక్షుల సేవలు

ostrich bury head ఉష్ట్రపక్షి అంటే నిప్పుకోడి, ఆస్ట్రిచ్ పక్షి. దీని గురించి ఒక వింతైన నానుడి ప్రచారంలో ఉంది. ఎప్పుడైనా క్రూరమృగాలు వేటాడుతున్నాయేమోనన్న భయం వేస్తే, ఇది మహా తెలివిగా తన బుర్రకాయని ఇసకలో దాచేసుకుంటుంది. తనకి ఏమీ కనపడకపోతే, తను ఎవ్వరికీ కనపడనేమోనని దాని ధైర్యం. ఇది కేవలం నానుడి అయినా, మన తెలుగుభాషని రక్షించుకోవడం కోసం భాషాభిమానుల పాట్లని ఈ విధంగా వర్ణించక తప్పదు.

మొన్న మాతృభాష ఉత్సవాలు అని ఏదో హడావుడి నడిచింది. పనిలోపనిగా, పత్రికలన్ని ఎవరికో పురమాయించాయి – తెలుగు ఉద్ధరించడం ఎలా అంటూ వ్యాసాలు వ్రాయండంటూ. మనవాళ్ళు వివిధ రకాలుగా రెచ్చిపోయారు. మూల సారాంశం ఏమిటంటే, ప్రభుత్వం ఏదో నడుం బిగించాలి, శాసనసభల్లో తెలుగు మాట్లాడాలి, జివోలు తెలుగులో జారీ చెయ్యాలి, తెలుగు మీడియంలో పిల్లలని చదివించెయ్యాలి. ఇలా చేస్తే మన తెలుగు విరాజిల్లుతుందంట. ఉష్ట్రపక్షులకి ఒకసారి జిందాబాద్.

దేశ ఆర్థిక పరిపుష్టికి ఒక తలమానిక తలసరి ఆదాయం. అలాగే, ఒక భాష యొక్క పరిపుష్టికి సరైన తలమానిక తలసరి-సాంస్కృతిక-దిగుబడి. కృష్ణదేవరాయలు పాలించిన స్వర్ణయుగంలో, తెలుగు భాష ఒకానొక ఉచ్ఛదశకి చేరిందనుకుందాం. అప్పుడు, తెలుగువాళ్ళు ఎంతమంది ? మచ్చుకి జనాభా 30 లక్షలకి మించదు. ప్రస్తుతం దీనికి 30 రెట్లు ఎక్కువమంది ఉన్నాం. అంతాకలిపి 8 కోట్లకి పైమాటే మన జనాభా. కేవలం జనాభా ఒకటే కాదు, సగటు మనిషి ఆదాయం/జీవనా విధానం కూడా 30 రెట్లు మెరుగైంది. అతిముఖ్యంగా, జనాభాలో అక్షరాస్యత శాతం 30 రెట్లు మెరుగైంది. ఈ మూడు దిశలని కూడిపెట్టుకుంటే, మన తెలుగు కళాకారుల దిగుబడి 30*30*30 = 27,000 రెట్లు పెరగాలి. కానీ, మొత్తం దిగుబడి అప్పటితో పోలిస్తే ఇంకా తగ్గువగా కుదించుకుపోయింది. అందులోనూ, కళ యొక్క నాణ్యత ఎంత ఉంది అంటే ముక్కుపై వేలేసుకోవాలి.

పత్రికలకి పత్రికలు, టీవీలకి టీవీ ఛానళ్ళు, సినిమాలకి సినిమాలు, సంగీతానికి సంగీతం – మన సంస్కృతిలో నాణ్యత అనేది మృగ్యం. తెలుగు అనేదే ఈ అఘోరమైన పరిస్థితిలో ఉంటే, “మీ కోస్తా తెలుగు మా తెలంగాణ తెలుగుని దెబ్బతీస్తోంది”, అని వాపోతున్నారు మన సోదరులు కొంతమంది. మొత్తం (కోస్తా తెలుగు + తెలంగాణ తెలుగు )దిగుబడిని మన జనాభాతో భాగించుకుంటే వచ్చే సంఖ్య 0.0000001

పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించాలంటే, ఒకసారి ఇంగ్లండు దేశంతో మనల్ని పోల్చి చూసుకుందాం. కేవలం ఇంగ్లండు వారి జనాభా 6 కోట్లు (మన తెలుగు వారికంటే తక్కువమంది). కళా-సాంస్కృతిక రంగాలలో వారి దిగుబడి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఈ చిన్న దీవి నుండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పత్రికలు (టైంసు, గార్డియన్), టీవీ ఛానళ్ళు (బీ.బీ.సీ) పాప్ గాయకులు (బీటిల్స్, పింక్ ఫ్లాయిడ్, లెడ్ జెప్పెలిన్ …) నటులు (ప్రస్తుత ఆస్కారు విజేత సహా), రచయితలు, విద్యాలయాలు (ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జి) – ఏ విధంగా చూసినా తలసరి-సాంస్కృతిక-దిగుబడి మన తెలుగువారికి పోల్చి చూస్తే 1,000,000 రెట్లు అధినంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది ?

ఇలాంటి అతి భయంకర ప్రమాదంలో మన భాష ఉంటే, మనవాళ్ళు ఉష్ట్రపక్షులకి మల్లే గవర్నమెంటు అనే ఇసకలో వాళ్ళ తలకాయలని దూర్చేసుకుని ఏదో గట్టెక్కేస్తామని అనుకుంటున్నారు.

తెలుగుకి ప్రాచీనభాష హోదా ఇవ్వాలంట. ఇది మూల కోరిక. అంటే, ఏదో పురాతత్వ శాస్త్రం చదువుకునేవాళ్ళు తవ్వకాలు చేసుకోవడానికి మన తెలుగుని అప్పగించాలన్నమాట. ఆ పై,గవర్నమెంటు జీవోలని తెలుగులో వ్రాయించాలంట. ఇంగ్లీషు మీడియం బడులని మూయించెయ్యాలంట. గవర్నమెంటు ఎన్ని రకాలుగా ఇసకలో తల దూర్చగలదో, అన్ని రకాలుగాను దూర్చాలంట. ఇలా చేస్తే, మన తెలుగుకున్న ఆపద పోతుందంట. తలసరి-సాంస్కృతిక-దిగుబడి తిరిగి వర్ధిల్లుతుందంట. ఇలాంటి వాళ్ళతో పోలుస్తున్నందుకు, ఉష్ట్రపక్షులు ఎంత ఫీల్ అవతుంటాయో !

ఏమన్నా పోలిక చూసుకోవాలంటే, మనవాళ్ళకి దక్షిణాన అరవం, పశ్చిమాన కన్నడం మించి కనపడదు. అక్కడ ఛాందసులు ఏదో భాషా సేవ చేసేస్తున్నారు – దుకాణాల సైను బోర్డులని తిరగరాసేస్తున్నారు, బస్సుల నంబర్లని తిరగరాసేస్తున్నారు .. ఎక్కడో మనం వెనకపడిపోతున్నాం అని బెంగ. నేను చెప్పిన తలసరి-సాంస్కృతిక-దిగుబడి లో అటు కన్నడం కానీ, ఇటు తమిళం కానీ మనకన్నా ఏమన్నా ముందంజలో ఉన్నాయా ? ఉహుం, అంత సీనులేదు. మనమందరం ఒకే లెవెల్లో ఉన్నాం.

ప్రపంచంలో ఇంగ్లీషు తప్ప మిగతా భాషలన్నీ మనలాగే అంతరించిపోతున్నాయా ? లేదు. జపనీసు భాషలో కామిక్సు చదువుకోవడానికి అమెరికాలో జపనీసు నేర్చుకుంటున్నారు. స్కాండినావియా దేశాలలో రాక్-సంగీతం అర్థం చేసుకోవడం కోసం జపానులో స్వీడిషు భాష నేర్చుకుంటున్నారు. ఈ దేశాల్లో, ఇంగ్లీషు భాషని బహిష్కరించారా ? లేదు. స్వీడన్లో, ఇంగ్లీషుని ప్రతీ ఒక్కరు యాస కూడా లేకుండా మాట్ళాడగలరు. టీవీ లో ఇంగ్లీషు కార్యక్రమాలే అనువాదం లేకుండా చూస్తారు. మరి అయినా, వారి భాషలో ఎలాగ సంస్కృతి పరిఢవిల్లుతోంది ? తలసరి-సాంస్కృతిక-దిగుబడి ఎలాగ ఉరకలు పరవళ్ళు వేస్తోంది ?

కారణం తెలుసుకోవాలంటే, భాషని పక్కని పెట్టి, తెలుగులో కానివ్వండి / హిందీలో కానివ్వండి / చివరికి ఇంగ్లీషులో కానివ్వండి. అసలు మనదేశంలో తలసరి-సాంస్కృతిక-దిగుబడి ఎంత ? ఇంచుమించు సున్న. దోషం అక్కడ ఉంది. భాషలో కాదు. కళాకారులు విజృంభించితే, మేఘాల నుండి అమృతవర్షం కురిసినట్టు. భాషలు నదులవంటివి. వాన పడగా, నదులన్నీ ఒకేసారి నిండుతాయి. భూమి పులకరిస్తుంది. వాన పడనంత కాలం కరువు తప్పదు.

వరుణుడు అనుగ్రహించాలంటే, మనం ఏమి చెయ్యాలి ? బస్సులపై తింగర-తింగరగా నంబర్లు రాస్తే సరిపోతుందా ? గవర్నమెంటు జీవోలు జారీ చేస్తే సరిపోతుందా ? తెలుగుకి ప్రాచీన హోదా కల్పించితే సరిపోతుందా ?

ఒకసారి ఉష్ట్రపక్షి వైనం విడనాడి ఇసక నుండీ తల బయటకి తీస్తే, ప్రమాదం ఎక్కడుందో గమనిస్తే, బయటపడడానికి మార్గం ఇట్టే అగుపడుతుంది.

 • కళాకారులకి ప్రోత్సాహం కల్పించాలి. డబ్బులు వెచ్చించాలి.
 • కళామందిరాలు స్థాపించాలి.
 • విద్యాలయాల్లో రచన, నటన, సంగీతం, చిత్రలేఖనం – మొదలైన కళలు అభ్యసించేవారికి సరైన మొత్తంలో స్కాలర్షిప్పులు కల్పించాలి. ఒక్క తెలుగు డిపార్టుమెంటుకి మాత్రమే కాదు
 • కళాత్మక సినిమాలు తియ్యడానికి ప్రభుత్వం/ప్రజలు డబ్బులు వెదజల్లాలి.
 • రచయితలకి సంపాదనా మార్గం కల్పించాలి. ఉదాత్తమైన పత్రికలు స్థాపించాలి.
 • ఇంటర్నెట్టు యుగంలో ప్రజలు ఒకరితో ఒకరు సుళువుగా తెలుగులో మాట్లాడుకునే సౌకర్యం కల్పించాలి.
 • డిస్కషన్ బోర్డులు ఏర్పడాలి.
 • తెలుగు పాఠకులను తెలుగు కళాకారులకు దగ్గర చెయ్యగలగాలి.

ఒక భాషకి అవశేష దశ నుండి సంపూర్ణంగా పునరుజ్జీవన చేసిన ఘటన ఇజ్రాయెల్ దేశంలో ఒకటి జరిగింది. నాజీల వేధింపుల నుండి బయటపడి ఇజ్రాయెల్ కి వచ్చిన యూదులకు, వారి సంస్కృతిపై విపరీతమైన ప్రేమ కలగడం సహజం. కానీ, హీబ్రూ భాషని వారు పునర్మించిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యున్నతమైన వారి శాస్త్రవేత్తలు శాస్త్ర-సంబంధిత-పదాలను హీబ్రూవే వాడతారు. వారి కళాకారులు హీబ్రూలోనే సంగీతం ఆలపిస్తారు. కేవలం 70 యేళ్ళ క్రిందట, పురాతనమైన తాల్ముడ్ గ్రంథాల ఆథారంగా ఈ భాషని ఇటకపై-ఇటక వేసి నిర్మించారు అంటే మరి ఆశ్చర్యం కలగదా ? ఇజ్రాయెలీలు చేసిన మొదటి పని వారి భాషకి ఒక ఆధునిక నిఘంటువు నిర్మించడం. ఈ నిఘంటువును ప్రతీ ఏడాది తాజాకరించడం. రెండవ పని ప్రజలు హీబ్రూలో మాట్లాడాలి – ఇది ఒక ఆత్మగౌరవప్రదమైన విషయం – అని అందరూ భావించడం.

ఇప్పుడు మన తెలుగులో మాట్లాడాలన్న ఆశ ఉన్నా, ప్రక్కవాళ్ళతో మాట్లాడడానికి పనికివచ్చే ఒక నిఘంటువు లేదు. మనతో చర్చ సాగించడానికి ప్రస్తుతం శ్రీనాథుడు, లక్ష్మణకవి మన ముంగిట్లో తిష్టించుకుని లేరు కదా ! మరి, మన నిఘంటువులు ఇంకా అదే భాష పట్టుకుని వేలాడుతున్నాయేమిటి ? ఈ నిఘంటువులు పనికివచ్చేది ఎవరికి ? పాప్ సంగీతం వ్రాద్దామనుకుంటే పనికివస్తాయా ? తెలుగులో అద్భుతమైన ఉపన్యాసం ఇద్దాం అనుకుంటే పనికివస్తాయా ? ఒక శాస్త్ర-సంబంధమైన వ్యాసం వ్రాద్దాం అంటే పనికివస్తాయా ? కళాకారులకి ఒక నోరు ఇవ్వకుండా నొక్కిపెట్టి, ఏదో భాషని ఉద్ధరించేద్దాం అనుకుంటే ఏమి సాధించగలం చివరికి ?

మన ఆర్థిక మంత్రి రోశయ్య ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్టు అక్షరాలా లక్ష-కోటి రూపాయలది. పాకీస్తాను దేశం బడ్జెట్టుని మించిన లెవలు అది. మన తెలుగువారికి డబ్బు లేమి ఏమీ లేదు. ఇదిగాక, ప్రవాసాంధ్రుల సంపాదన కూడా కలిపి చూస్తే, మనం ఎంతో ఔన్నత్యంలో ఉన్నవాళ్ళం. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో సగం మంది మన తెలుగువాళ్ళు ! మన పరిస్థితి 70 ఏళ్ళ క్రిందటి ఇజ్రాయెల్ పరిస్థితితో పోల్చిచూస్తే, అమోఘంగా ఉంది. కానీ, వాళ్ళు సాధించినట్టు మనం ఆ అద్భుతాన్ని సాధించగలమా ?

ఉష్ట్రపక్షులని అడగాలి సమాధానాల కోసం !

మిషెల్ సెర్ వ్యాఖ్యానం : కొత్త టెక్నాలజీలు – సాంస్కృతిక, సంజ్ఞాన విప్లవాలు (1 : కాలం)

నేను పనిచేస్తున్న పరిశోధనా సంస్థ (INRIA) 40వ వార్షికోత్సవ సభలు డిసెంబరులో జరిగాయి. కార్యక్రమంలో భాగంగా పలువురు శాస్త్రవేత్తలు, రాజనీతిజ్ఞులు, తత్వవేత్తలు కంప్యూటరు పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ విషయాలపై ప్రసంగించారు. వారిలో మిషెల్ సెర్ అన్న తత్వవేత్త చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఫ్రెంచి మూలం నుండి తెలుగులోకి అనువదించడానికి ఇది నా ప్రయత్నం.

ప్రసంగీకుడని ప్రవేశపెట్టింది INRIA లో ప్రధాన – పరిశోధనా మరియు పరిజ్ఞాన నిరోహణా – నిర్దేశకునిగా పనిచేస్తున్న మాలిక్ ఘాలిబ్.

మాలిక్ ఘాలిబ్

మిషెల్ సెర్ ను ప్రవేశపెట్టడం నాకు గొప్ప గౌరవం. మాట ఆయనకు అందించే ముందు, నేను చెప్పదలుచుకుంటున్నాను – విజ్ఞాన శాస్త్రములలో నా ఉత్సుకతను ఎంతో పెంపొందించినవి మిషెల్ సెర్ రచనలు. ఈయన యొక్క ఉత్సాహభరితమైన దార్శనికత్వం నాకు చాలా తీపి. ఇది మనం నడుపుతున్న శాస్త్రీయ ప్రవృత్తికి చాలా అవసరం అని నా అభిప్రాయం. ఈయన మంత్రానికి అనుగుణంగానే, “జనులలో కొందరు సాంస్కృతికులు, మిగిలన జనులు సంస్కారం లేని శాస్త్రవేత్తలు” గా ఉండబోవకుందుకు మన సంస్థ ఇథోవిధంగా శాస్త్రీయ పరిజ్ఞాన ప్రచారణకు కృషిచేస్తోంది. ఇక్కడ మనం నమ్మదగ్గ విషయం ఏమిటంటే “ఒక సంస్కృతి అనేది విజ్ఞాన శాస్త్రాన్ని వీడి ప్రత్యేక అస్థిత్వంతో ఉండలేదు” అని. మిషెల్ సెర్ ప్రసంగం మనకి ఈ విషయం మరింత భేషుగ్గా అవగాహన చేసుకునేందుకు ఉపకరిస్తుంది అని నా మెప్పు.

మిషెల్ సెర్

స్కూలులో చదువుకునేటప్పుడు సంవత్సరానికి ప్రతీసారి “తిరగబెట్టే” ఒకరోజు వచ్చేది, ఎప్పుడైతే స్కూలులోని బుడతలు పెద్దవాళ్ళని “బుడతలకింద” మార్చివేస్తారో. కానీ, ఈ తిరగమోత ఎప్పుడూ కూడా క్లాసులోని అతి-మొద్దు-అబ్బాయి క్లాసులోని మేటివారికి, మాష్టారికే గణితము, శాస్త్రాలూ తెలియజెప్పేటట్లు తీసుకురాలేదు. ప్రియమైన మిత్రులారా, ఆ రోజు చివరికి ఇప్పుడు వచ్చేసింది. నా దేశంలోని అత్యున్నత శాస్త్రవేత్తలకి కొత్త టెక్నాలజీల గురించి, ఈ వయసులో, నేను మాట్లాడవలసి వస్తుంది అని నేనెప్పుడూ ఊహించలేదు. కనుక ఈ గంటసేపు ఒక చేదైన అనుభవం మీరు తెచ్చుకోబోతున్నారు.

నాకు ఒక్క ప్రాణి తెలియదు, దేన్నైతో మనమది సమాచారాన్ని కూర్చి, పరిమార్చి, ప్రసరించి, సేకరిస్తుంది అని చెప్పలేమో ! చతుర్విధమైన ఈ లక్షణం ప్రాణులలో ఎంత స్వయం సాధారణమంటే, “జీవమంటే ఈ లక్షణమే” అని నిర్వచించడానికి మనం ప్రేరేపింపబడవచ్చు. కానీ, ప్రత్యుదాహరణ కింద, ప్రపంచంలోని ఏ వస్తువు నాకు తెలియదు – దేన్నైతో మనమది సమాచారాన్ని కూర్చి, పరిమార్చి, ప్రసరించి, సేకరిస్తుంది అని చెప్పలేమో ! చతుర్విధమైన ఈ లక్షణం ప్రపంచంలోని ప్రతి వస్తువులోని స్వయం సాధారణం – జీవులలోను, నిర్జీవులలోను. మన “దృఢ” విజ్ఞాన శాస్త్రాలు ఏవైతో మునుపు బలము, శక్తి అని మాట్లాడేవో, ఇటీవలనే మాట్లాడుతున్నాయి, వేటినైతో మనం “మృధువు”లని పిలవవచ్చో. ఇది చెప్పిన తరువాత, మరి చెప్పవలసినది, నాకు ఒక మానవ కూటమి తెలియదు, దేన్నైతో మనమది సమాచారాన్ని కూర్చి, పరిమార్చి, ప్రసరించి, సేకరిస్తుంది అని చెప్పలేమో ! కనుక, ఇది ఒక పరిసాధారణమైన లక్షణం – సామాజిక శాస్త్రాలలోను, “దృఢ” శాస్త్రాలలోను. ఎంత సాధారణమంటే, ఒక రోజు మనం సమాచారాన్ని కూర్చి, పరిమార్చి, ప్రసరించి, సేకరించే ఒక పనిముట్టుని కనిపెట్టామో – ఇక్కడ నేను కంప్యూటరుని సూచిస్తున్నాను – మనమొక విశ్వవ్యాపితమైన పనిముట్టుని కనిపెట్టాము. ఇది విశ్వవ్యాపితమైనది ఎందుకంటే విశ్వంలోని ప్రతి వస్తువు యొక్క ధర్మముని ఇది అనుకరిస్తుంది గనుక.

సాంస్కృతిక లేదా సంజ్ఞాన విప్లవం అన్నింటికన్నా ముందు ఒక వ్యవహారిక మార్పు. మునుపు, ఒక కొట్టంలో నేను కాలిడగానే, బయటి గమనింపుతోటే ఒక వ్యక్తియొక్క వృత్తిని గుర్తించగలిగేవాడిని. ఉదాహరణకు, ఒక తోలు తొడుగు వేసుకుని ఉలితో సమ్మెటపై కొడుతున్న ఒక వ్యక్తిని నేను చూస్తే, అతడు ఒక కొమ్మరి అని నేను కనితెచ్చేవాడిని. ఈనాడు, నేనెక్కడికివెళ్ళినా కంప్యూటరు తెరపై వాలి ఉండి పనిచేస్తున్న వ్యక్తి కనపడుతున్నాడు. వృత్తులను మునుపటిలా విడమర్చడం ఇక నాకు కాని పని. ఈ విశ్వవ్యాపనీయత మనమందరం గుర్తించగలిగే మెట్టుపై ఉంది. వృత్తులపై వ్యవహారిక పరిణామాన్ని మోపినట్టే, ఈ విప్లవం భాషలపై సాంస్కృతిక పరిణామాన్ని మోపుతోంది. ఏవిధంగానంటే, అకాదెమీ ఫ్రాన్సేజి వారి పురాతన నిఘంటువులకు వారి సరికొత్త నిఘంటువుకు మధ్య బేధం 20,000 పదాల దరిలో ఉంది. ఇటువంటి తేడా ఎప్పుడూ, ఏ భాషలోనూ అస్థించలేదు. ఈ పదాలలో పెక్కుభాగం వృత్తి సంబంధిత పదాలు మరియూ శాస్త్రీయ పదాలు.

మీ ముందు నేను మూడు విధాలుగా ఈ విప్లవంపై సమాలోచిస్తాను. మొదట దీనిని కాలంలో వర్ణించి, తరువాత తలంలో వర్ణించి, చివరగా ఈ కొత్త టెక్నాలజీలని ఉపయోగిస్తున్న వ్యక్తులపై దాని ప్రభావాన్ని వర్ణిస్తాను.

కాలం (1)

నేను సమాచారం యొక్క చతుర్విధమైన లక్షణం గురించి మాట్లాడినప్పుడు ఆధారం మరియు సందేశం మధ్య గల లంకె నా దృష్టిలో ఉండినది. ఈ లంకెకి ఒక చరిత్ర ఉంది, మీరు నాతో కలిసి అది గమనించవలసినదని కోరుతున్నాను.

వాచ్య దశలో (నిర్వచణ భాషా శాస్త్రం ప్రకారం తీసుకొనబడినది, ఫ్రాయిడ్ యొక్క మనస్తత్వ విశ్లేషణా శాస్త్రం ప్రకారం కాదు) మనిషి యొక్క మెదడు, అతని శరీరం ఆధారంగా వర్తించాయి. సమాచారం యొక్క కూర్పు శరీరానికి, పరిమార్పు జ్ఞప్తికి, ప్రసరింపు గాత్రానికి సరికుదిరాయి.

క్రీస్తు పూర్వం మొదటి సహస్రాబ్ది వరకూ మనం ముందుకి పయనించి వస్తే, వ్రాతకి సంబంధించి ఒక విప్లవం జనించడం చూస్తాం.జంతుచర్మంపై, తాళపత్రంపై, లేదా ప్యాపిరస్ పత్రాలపై – వ్రాత అనేది మనిషి శరీరానికి బయలుగా సమాచారానికి అస్థించిన మొట్టమొదటి ఆధారం. ఇప్పుడు, ఆధారం-సందేశం మధ్యగల లంకె పరివర్తనకి లోనైన ఈ ఘడియనుండి, మన నాగరికతలో సమస్తమూ చలించాయి. వ్రాత రావడంతో పలువిధములైన సంచలనాలను తెచ్చిపెట్టింది.

 • నగరాలయొక్క సంఘటితం సాధ్యమయ్యింది, లిఖించబడిన న్యాయశాసనం క్షేమమా అని. ఇది రాజ్యం యొక్క ఆవిష్కరణకి నాంది పలికింది.
 • డబ్బు కనిపెట్టబడింది. డబ్బు అనగా ఒక కంచు లేదా రాగి ఆధారంపై ఒక ఖచ్చితమైన విలువ యొక్క వ్రాత. ఇది ఇచ్చిమార్పిడుల బాదరబందీలకి తెరదించి, వాణిజ్యం యొక్క సౌలభ్యాన్ని తెరిచింది.
 • రేఖగణితం (జ్యామితి) యొక్క కనిపెట్టుక వ్రాతకి పుత్రిక వంటిది.
 • గ్రంథములపై ఆధారపడు ఏకేశ్వరోపాసక మతాల కనిపెట్టుక (తోరా, క్రైస్తవ త్యాగుల రచనలు, ఖురాను) బహుళేశ్వరోపాసక మతాల ప్రపంచంలో ఒక ఉరుముపాటు వలే ధ్వనించింది.
 • చివరగా, విద్యాబోధన కూడా వ్రాతకి ఒక పుత్రిక మాత్రమే. ఎందుకంటే, ప్రతి గురువు ఇప్పటినుండి తన అందుబాటులో మిక్కిలి గ్రంథములు కలిగియుండి, తానుగా అన్ని అంశాలను బట్టీయం చెయ్యవలిసిన అవసరం నుండి విడబడ్డాడు. అందువలన, తన శిష్యులకు బహువిధములైన అంశాలను బోధించగలిగాడు.

ఈ పరివ్యాప్తి యొక్క సంపూర్ణతని వినియోగించి చూస్తే, మీరు మన నాగరికత మొత్తం వ్రాతకి పుత్రికగా జన్మించిందని అర్థం చేసుకోగలరు. ఈ విప్లవం యొక్క పరివ్యాప్తి అద్వితీయమైనది.

ఇది ఎంత స్థిరమైనది, ప్రథానమైనది అంటే ఇటువంటి మరో విప్లవం మరో రెండువేల సంవత్సరాల పిదప మాత్రమే ఆవిష్కృతమయ్యిందని నేను చెప్పబోతున్నాను. 15వ శతాబ్దిలో ముద్రణాయంత్రం కనిపెట్టబడినప్పుడు, ఈ తృటి నుండి, ఈ రెండవ టెక్నాలజీకి సంబంధించిన విప్లవం, నేను చిత్రించిన పరివ్యాప్తిలో, యధాత్తుగా మొదటిదానినే అనుసరించింది. వెనిస్ నగరం ఈ యుగంలో ఒక ప్రాపంచిక నగరంగా రూపొందింది. అనేకమైన మార్పులు కొత్తగా ఈ యుగంలోకి నడివచ్చాయి.

 • చెక్కు, బ్యాంకు మొదలైన కనిపెట్టుకలతో ధనంతో నమ్మకస్త్వం ఎలాంటిదో కోడీకరింపబడగా, వాణిజ్యం మొత్తం పునరావిష్కృతమయ్యింది.
 • పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ యుగంలోనే జన్మించింది.
 • అతి ముఖ్యంగా, ముద్రణాంగం ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి, అనగా ప్రయోగ నిర్ధారిత విజ్ఞాన శాస్త్రానికి, జన్మనిచ్చింది. వ్రాతకి పుత్రికయైన, గ్రీకుల యొక్క అశరీర విజ్ఞాన శాస్త్రం ఇదిక ఎంతమాత్రమూ కాదు.
 • వెనుచూపుగా, మనం మతరంగంలో ఒక అసమాన్యమైన చిచ్చుని గమనించవచ్చు. “చేతిలో బైబిలు ఉండగా ప్రతి మనిషీ పోపుకి సమానుడే”, అంటూ లూథర్ క్రైస్తవంలో పునరాకృతి ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ముద్రింపబడిన బైబిలు ప్రతీఒక్కని అందుబాటులోకి వచ్చింది. ఇది అతనికి ఒక సంఘటిత మత పెద్దరికం వైపు పరిచూడవలసిన అవసరం మాంపి, స్వేచ్ఛగా ఉండగల్పింది.
 • ఇదే విధమైన స్వేచ్ఛ రాజకీయ రంగంలోని వర్ణక్రమంపై ప్రశ్నలకి పురిగొల్పి, ఆధునిక తాత్పర్యం ప్రకారం ప్రజాస్వామ్యానికి నాంది పలికింది.

కనుక, ఆధారం-సందేశం లంకెకి సంబంధించిన రెండవ విప్లవంలో మనం మరొకసారి సంస్కృతి, నాగరికత సాంతంలో ఒక పరిపూర్ణమైన పరివర్తనని రుచిచూసాము.

నా అనుమితి బహుసుళువుగా బయటపడుతుంది. మనం ఆధారం-సందేశం మధ్యగల అదే లంకెపై మోపుతున్న మరో విప్లవానికి సమకాలికులుగా ఉండినట్లైతే, మన సంస్కృతి-నాగరికత ఇదేవిధమైన అతావితలమైన పునరాకృతికి లోనుకావడం చూడబోతున్నాము.

 • ప్రపంచీకరణ మన ముందుకి వడి వడిగా నడచి వస్తోంది.
 • చంచలాత్మక ధనం (ఏ.టి.యెం, ఇంటెర్నెట్టు కొనుగోలు) డబ్బు మరియు వాణిజ్యంలో ఒక సంపూర్ణమైన మార్పుని తెచ్చిపెట్టింది.
 • విజ్ఞాన శాస్త్ర విప్లవం ఆఘమేఘాలపై విరుచుకుపడుతోంది. కళాశాలలో ఒక ఆచార్యుడు ఈరోజు ఉపదేశించే అంశాలలో 70% అతడు తానుగా విద్యాలయ తరగతులలో నేర్చుకోనివే.
 • ఈ పరిస్థితిలో విద్యాబోధనలోని చిచ్చుని నియంత్రించడం బహు కష్టంగా మారింది.
 • ఇక మతరంగంలో ప్రస్తుతమున్న చిచ్చును వర్ణించడం నాకు అవసరం అనిపించడం లేదు. ఎందుకనగా, గత పదేళ్ళుగా పత్రికలన్నీ దీని గురించే మాట్లాడుతున్నాయి.

మనం జీవిస్తున్న ప్రపంచం దాని అతలావితలంలో ముందు నేను వివరించిన రెండు విప్లవాలకి పోలి ఉంది. ఈ మూడు విప్లవాలలోను బయటకి వచ్చే పరిణామాల పరివ్యాప్తి ఒకేవిధంగా ఉంటుంది.

పాఠశాలలో మనం గొప్ప విప్లవాలన్నీ “దృఢ” మార్పులకి సంబంధించినవి అని నేర్చుకున్నాము. మచ్చుకి, ఆర్థిక, పారిశ్రామిక విప్లవాలను గాలిమరలు, ఆవిరి యంత్రాలు తెచ్చి పెట్టాయని చదువుకున్నాము. కానీ, “మృధు” విప్లవాల వల్ల తెచ్చిపడిన మార్పులతో పోలిక చూస్తే, “దృఢ” విప్లవాలు అసందర్భమైన పిల్లకోళ్ళ వంటివి. ఎప్పుడైతో సమాచారానికి సంబంధించిన విప్లవాలు వచ్చాయో, నాగరికతలు అతలావితలమయ్యి ఒక నూతనమైన పద్ధతిలో తిరిగి రూపొందించబడ్డాయి.

ప్రస్తుతం ఎంతటి అసమాన్యమైన కొత్తదనమున్న కాలంలో మనం పయనిస్తున్నామో, బహుశా మనకి అవగతం లేదు.

స్వతంత్ర భారత చరిత్రలో తెలుగువాడి గొప్పదనం

మన తెలుగువాళ్ళకి భారతదేశం పార్లమెంటులో మెజారిటీ లేకపోవచ్చు. పలుకుబడి ఇంతింతమాత్రమే కావచ్చు. కానీ, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మూల స్తంభాలు నాటినవాళ్ళు అందరు తెలుగువాళ్ళే. ఒకసారి, వారిని గుర్తు చేసుకుని గర్వపడదాం.

పింగళి వెంకయ్య : స్వతంత్ర భారతానికి గుర్తుగా రెపరెపలాడే మన మువ్వన్నెల పతాకం రూపొందించింది ఒక తెలుగువాడే. దేశభక్తి కాదుకానీ, ప్రపంచంలోని పతాకాలన్నింటిలోనూ, బహు సుందరంగా ఉండేది మన దేశ పతాకమే ! కళా దృష్టిలో చూస్తే, దీనికొక విశేష ప్రాథాన్యత ఉంది. ఇంద్రధనుస్సులోని రంగులలో స్పష్టంగా మూడోవంతు అటు, మూడోవంతు ఇటూ ఉండే రంగులు కాషాయమూ, ఆకుపచ్చ వర్ణాలు. మధ్యలోని తెలుపు రంగు స్పష్టమైన కాంతి, దీనిని పట్టికలోకి పంపిస్తే విడేది ఇంధ్రధనుస్సు ! మన భారతదేశంలోని వైవిధ్యానికి, ఐక్యతకి మరొక్క గుర్తు ఇంకేమి ఉంటుంది చెప్పండి ? ఇక, మధ్యలోని అశొకచక్రం చిరకాలం నిలిచివుండే మన ప్రాచీన నాగరికతకి గుర్తు.

పొట్టి శ్రీరాములు : మన భారతదేశ మాపు ఈ విధంగా ఉంది అంటే దానికి కారణం ఈయనే. భాషా ప్రాతిపదిక మీద రాష్ట్ర విభజన జరగాలి, అప్పుడు అన్ని భాషలు స్వచ్ఛంగా అభివృద్ధి చెంది సంస్కృతి విరాజిల్లుతందనే శాస్త్రీయ సిద్ధాంతం కోసం పోరాడిన ఘనత ఆంధ్రులదే. దేశంలోని భాషలన్ని ఆంధ్రులకి ఈ విధంగా ఎన్నటికీ రుణపడి ఉంటాయి. ముఖ్యంగా, అమరజీవి గాంధీగారి ప్రియ శిష్యుడు అయిన పొట్టి శ్రీరాములు అందరికీ, ఎన్నటికీ పూజనీయూడే.

సర్వేపల్లి రాధాకృష్ణ : మన దేశ ప్రాచీన తత్వశాస్త్రాన్ని సగర్వంగా చాటిచెప్పిన మహనీయుడితడు. ఉదారవాదం, తత్వశాస్త్రం, విజ్ణాన శొధనం పాశ్చాత్యుల సొత్తుకాదు. మన భారతీయులు వీరికెన్నడూ తీసిపోలేదు అని నిరూపించిన వాడితడు. అప్పటివరకు భారతీయులంటే, కేవలం దైవపూజలో నిమిత్తులై ప్రపంచానికి పట్టింపులేని మూఢులు అని విపరీత ప్రచారం ఉండేది, ఇప్పటికీ ఉంది. కాని రాధాకృష్ణుడు దీనిని పటాపంచలు చేశాడు. విజ్ణాన శొధనలో గ్రీకులకి భారతీయులు ఎన్నడూ తీసిపోలేదు,మన తత్వశాస్త్రమూ వారికి ఎన్నడూ తీసిపోలేదు. పైపెచ్చు, మనమే నాలుగంకెలు ముందున్నాము అని నిరూపించి మన నాగరికత ఔన్నత్యాన్ని మళ్ళీ నిలబెట్టిన ఘనత ఈ తత్వవేత్తదే.

జిడ్డు కృష్ణమూర్తి : ఆధునిక తత్వవేత్తల్లొ ఆధ్యుడిగా ప్రపంచమంతా ప్రశంసలు పొందిన జ్ణాని ఇతడు. భారతీయుల తత్వశాస్త్రం పురాతనంలో మిగిలిపోలేదు, ఆధునికంలో కూడా ఎప్పటికీ ముందంజ వేస్తూనే ఉంటుంది అని నిరూపించినవాడితడు. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవనయాన లక్ష్యం, మానవసంబంధాలు మొదలైనవాటిమీద విశేషంగా ప్రవచించిన ఇతని రచనలు ప్రపంచమంతా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధునికజీవితంలోని ఇబ్బందులు, ప్రజలమధ్య ఎడబాట్లు – వీటిని అర్థం చేసుకోవడానికి సరైన సిద్ధాంతాలకు రూపకల్పన జరుగుతోంది అంటే దానికి ఆధ్యుడు మన కృష్ణమూర్తే.

పాములపర్తి నరసింహారావు : భారతదేశంలో ఎప్పటికైనా పేదరిక నిర్మూలన జరుగుతుంది అంటే దానికి కారణం ఇతడే. సరళికృత ఆర్థికవిధానాలకు మార్గాలు తెరిచి స్వతంత్రభారత చరిత్రలో అతిముఖ్యమైన ఘట్టానికి సూత్రధార్యం చేసింది మన పీవీనే. విజ్ణానుల్లో పెక్కుమంది అభిమానించే భారతదేశ ప్రథాని ఎవ్వరంటే, నిస్సందేహంగా పీవీనే అని సమాధానం వస్తుంది. సామాన్య ప్రజానీకానికి తెలిసిలేకపోవచ్చుగాక, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, సూటిపోట్లను చూసివుండవచ్చుగాక – కానీ, చరిత్రలో పీవీ ఎప్పటికీ ఒక మహనీయుడుగా మిగిలిపోతాడు. ఇంతటి బహుభాషాప్రావీణ్యం, తెలివితేటలు, అపర చాణుక్యం కలిగిన దేశనేత మరొకరు ఇప్పట్లో మనదేశానికి లభించడం కల్ల. పీవీ సూత్రధారిగా నడిపించిన మరికొన్ని అతిముఖ్యమైన ఘటనలు – ఆంధ్రదేశంలో వ్యవసాయభూములను సంస్కరించడం, భారతదేశ రక్షణా విభాగంలో చైతన్యం తేవడం. ఆధునికయుగంలోకి భారతదేశం ప్రయణిస్తోంది అంటే ఆ మార్గం సూచించిన పీవీ చలవే !

రాజ్‌రెడ్డి : ఆధునిక భారతదేశ చరిత్ర కంప్యూటర్ విప్లవంతో ముడివడి ఉంది. తరువాయి 50 ఏళ్ళలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది, దానికి కారణం సమాచార-సాంకేతిక రంగంలో కీర్తిపతాకలెగరవేస్తున్న భారతీయులే. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే, భారతదేశంలోని పాతికశాతం ఇంజనీర్లు ఆంధ్రులే. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో 50 శాతం మంది ఆంధ్రులు ! దీనినిబట్టి సమాచార విప్లవంలో చక్రం తిప్పుతున్నది ఎవ్వరో గ్రహించవచ్చు. కంప్యూటర్ రంగంలో నోబెల్ ప్రైజు అంతటి కీర్తి గలది ట్యూరింగు అవార్డు. ఈ అవార్డు ఇప్పటివరకు ఒక్క భారతీయుడినే వరించింది. ఆ శాస్త్రవేత్తే రాజ్‌రెడ్డి. రోబోటిక్సు, కృతిమ మేధస్సు రంగాలలో ఆధ్యుడిగా పరిశొధనలు నిర్వహించి, ఎందరికో దారిచూపిన ఇతడు ఎక్కడివాడో మీకు సందేహంగా ఉందా ? ముమ్మూటికీ మన తెలుగువాడే. ఇలాంటి శాస్త్రవేత్తలు ఎందరో మన తెలుగువాళ్ళు, వాళ్ళందరికీ జైజేలు 🙂

తరలి రాద తనే వసంతం ?

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగు కదా ?
వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగు కదా ?
ఎల్లలు లేని చల్లని గాలి, అందరికోసం అందును కాదా ?

ప్రతీమదిని లేపే ప్రభాతరాగం, పదే పదే చూపే ప్రథాన మార్గం ..

ఏదీ సొంతంకోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం !

ఇది తెలియని మనుగడ కథ – దిశలెరుగని గమనము కద !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

బ్రతుకునలేని శృతికలదా ? ఎదసడిలోనే లయలేదా ?
బ్రతుకునలేని శృతికలదా ? ఎదసడిలోనే లయలేదా ?

ఏ కళకైనా, ఏ కళకైనా జీవితరంగం వేదికకాదా ?

ప్రజాధనం కాని కళావిలాసం, ఏ ప్రయోజనం లేని వృధా విలాపం.

కూసే కోయిల పోతే రాగము ఆగిందా ? పారే ఏరై పాడే మరో పదం రాదా ?

మురళికిగల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?
గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

నాకు బాగా ఇష్టమైన సినిమా పాట 🙂

సినిమాలలో కూడా కులజాడ్యం

కంప్యూటర్లు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఈ యుగంలో, ఆ పెనగలుపు నుండి ఎక్కడి సినిమాలనైను ఎక్కడివారైనా దించుకుని చూసుకోవచ్చు. మన సంస్కృతి, వారి సంస్క్కృతి అన్న అడ్డుగోడలింకేమీ లేవు. నాసిరకం సినిమాలను, సంగీతాన్ని మనదేశంలో చెల్లుబాటు చెయ్యవచ్చు, పిచ్చివాళ్ళవలే కేరింతలు కొట్టే వీర ఫేనులు ఉన్నారు. కానీ ఇదే సరుకుని మిగతా దేశంవాళ్ళ విమర్శలనుండి వేర్పెట్టలేము. ఇది యూట్యూబు యుగం. ఎవ్వడైనా వీడియోలు పెట్టవచ్చు, మరింకెవ్వడైనా వాటిని దిలోడించుకోవచ్చు. ఎలాంటి కామెంట్లైనా పబ్లిగ్గా రాసుకోవచ్చు.

మన చిరంజీవి ప్రస్తుతం యూట్యూబులో మహా పాపులర్ అయ్యివున్నాడు. ఏదన్నా మంచి విషయమా అంటే కాదు. 1980లో ఎప్పుడో దొంగ అనే సినిమాలో మనవాళ్ళు మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ వీడియోని మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం పాట పాడేశాడు, చిరంజీవి డాన్సు ఆడేసాడు. వీర ఫేనులు జైజైలు కొట్టేసారు. కానీ, పాతికేళ్ళ తరువాత సీను ఇలా తయారవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు, ఆ వీడియోలో ప్రతీ అడ్డమైనవాడు “భలే ఉంది, చింపాంజీ డాన్సు. సిగ్గులేని ఇండియన్లు, కాపీ కొట్టడంలో కూడా నాసిరకమే” అంటూ వందలకొద్దీ కామెంట్లు.

ఏదో సరదాగా తెలుగు పాటలు చూసుకుందాం అని యూట్యూబు తెరిచిన నాలాంటి వాళ్ళకి ఇదీ కనపడేది. మన సంస్కృతి పరువు మర్యాదలని ఇలా తేరగా గంగలో కలుపిన ఆ డైరెక్టరుని ఏం చెయ్యాలి ? తమ అభిమాన హీరో పరువుని ఆ వీర ఫేనులు ఎలా కాపాడుకుంటారో వారికే తెలియాలి ఇప్పుడు. రుద్రవీణ, స్వయంకృషి లాంటి మంచి సినిమాలు చేసిన చిరంజీవిని చివరికి ప్రపంచమంతా చూసేది ఈ వీడియో ద్వారా.

పదేళ్ళనాటి సంగతి. కాకినాడలో ఇంటర్ చదువుకునే రోజులు. ఓసారి బాలకృష్ణ సినిమా ఒకటి, చిరంజీవి సినిమా ఒకటి ఒకేసారి థియేటర్లలో రిలీజయ్యాయి. వీరఫేనులు ఒకరితో ఒకరు తెగ దెబ్బలాట పెట్టుకున్నారు. వారితో ఆగితే బానే ఉండేది. రోడ్డుమీద వెళ్తున్న మనుషులని పట్టుకుని “నువ్వు చిరు ఫేన్వా, బాలయ్య ఫేన్వా ? ” అని అడిగేవారు. తప్పు ఆన్సరు చెప్తే నాలుగు ఉతుకులు ఉతికేవారు ! ఈ దెబ్బకి జడిసి రోడ్డుమీద నడిచివెళ్ళాలంటే భయమేసి కూర్చున్నారు అందరు. చివరికి, పొలీసులకి తిక్కరేగి రౌడీమూకల్ని తన్ని బొక్కలో తోసారు కొన్ని రోజులు.

ఇదేదో పిచ్చ ఫేనుల వెర్రి అనుకున్నాను నేను. తరువాత తెలిసింది, దీనికి ఇంకా లోతు ఉందని. చిరు ఫేన్లందరు కాపులు, బాలయ్య ఫేన్లు కమ్మవాళ్ళు. కులపోరుని ఇలాగ రోడ్డుమీదకి తెచ్చి వాళ్ళ హీరోలకి అంటగట్టారు. ఏవనాలి వీళ్ళని !!? ఇప్పుడు వీరందరికీ రోజూ ఆ యూట్యూబు పేజీలు చూపించాలి.

ఇప్పుడు ఈ చిరంజీవి యూట్యూబు వైభోగం చూసి బాలయ్య ఫేన్లకి పారాహుషార్గా ఉండుంటుంది. ఇంకా బాలయ్య తొడకొడితే ట్రెయిను వెనక్కి పరిగత్తే సీను కనుగొనలేదు జనాలు. దాన్ని చూసిన తరువాత ఎవ్వడికన్నా నోరు పెగుల్తుందా ?

ఇంతకీ ఇదా మన తెలుగు సంస్కృతి, మనం చూసి గర్వపడాల్సినది ? మనకేమన్నా బ్రెయిను డామేజీయా ఇలాంటి సరుకుని మార్కెట్లో ఆడించడానికి ? ఇంకా 80లే నయము. ప్రస్తుతమున్న తెలుగు సినిమాలు చూస్తుంటే వాంతి వస్తోంది. నేను బొత్తిగా సినిమాలే చూడడం మానేసాను. ఎప్పుడో బస్సులో హైదరాబాదు నుండి ఇంటికి కాకినాడ వెళ్తుంటే టీవీ పెట్టేసేవారు, గత్యంతరం లేక చూడాల్సివచ్చింది కొన్ని ఆణిముత్యాలని.

ఎనభై మిలియన్లమంది జనాలట తెలుగువాళ్ళు. ఇంతమంది కలిసి సాధించేది ఏమిటి ? ఇన్ని డబ్బులు సంపాదించుకుని అమెరికాలలో కులుకుతున్న వాళ్ళందరూ ఈ చివాట్లు, అగచాట్లు పడాల్సిందేనా ? మనకేమి తక్కువ, ఐఐటీ ప్రవేశ పరీక్షలలో అన్ని రాంకులు కొట్టేది మనమేగా. ఐఏయెస్ పరీక్షలో ఈసారి ఫస్టు రాంకు కొట్టింది మనవాడే.

ప్రతి తెలుగువాడికి నేను చేసే విన్నపం ఏమిటంటే బుర్ర ఉపయోగించండి. ఏమాత్రం టాలెంటు ఉన్నా ఖాలీగా కూర్చోవద్దు. సృజనాత్మకమైన జీవితమే సరైన జీవితం. మూసపద్ధతిలో బండిలాగడానికి మనమేమి చాకలోడి గాడిదలం కాదు. మెదడున్న మనుషులం.

ఇంక కులం సంగతికొస్తే ఇది మనకి అతి సిగ్గుచేటు. ఏంటి మనలో మనకి తేడాలు ? ఈ రోజుల్లో ? ఇంకా ప్రతీవొక్కడు వాడి కులం అమ్మయిలనే పెళ్ళి చేసుకుంటున్నాడు. వాళ్ళ కులం నాయకులకే ఓట్లు వేస్తున్నాడు. వాళ్ళ కులం వారికే ఉద్యోగాలిస్తున్నాడు. ఇక వాడికులం హీరోకే జైజైలు కొడుతున్నాడంటే పిచ్చి ఎంతముదిరి ఉందో తెలిసొస్తుంది.

నా అదృష్టం బాగుండి ఒక మంచి ఇంజనీరింగు కాలేజీలో పడ్డాను. మా ఫ్రెండ్సు కులమేమిటో ఇప్పటికీ తెలియదు. కానీ ఇంటర్ ఫ్రెండ్సు చెప్పేవారు వాళ్ళ కాలేజీలలో సంగతి – రాగింగు టైములో అడిగే మొదటి ప్రశ్న “ఏంట్రా నీ బ్రాండు ?” అని. అదేంటో వెనకేసిన స్టాంపు లాగ. ఇలాంటి వాళ్ళు బతికి ప్రయోజనం ఏమిటి, వెంటనే చచ్చిపోవడం మేలు, కొంత జనాభా తగ్గుతుంది.

శ్రీశ్రీ పుట్టిన రాష్ట్రమేనా మనది ? కందుకూరి వీరేశలింగం పుట్టింది ఇక్కడేనా ? కులం పేరుతో పెళ్ళి ప్రకటనలేంటి ? ఇది ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచించి చూడండి.

మిరపకాయల మహాత్యం

మన తెలుగువాళ్ళు కారం తినడంలో ఘటికులు. మాది తూర్పుగోదావరి జిల్లా, కారాలు తినడం చాతకాని జిల్లా అని నవ్వులపాలవుతూ వుంటాం. అందులోనూ మాది బ్రాహ్మణ కుటుంబమాయే, పప్పుసుద్దలని పేరు.

అలాంటిది, దేశం బయటికొస్తే నేనే కారాలతో వీరంగం ఆడేస్తాను. ఈ జోరు తట్టుకోలేక మా ఫ్రెండ్సు అందరు నా వంట తినడానికి తెగ జంకుతుంటారు. ఈ రోజు, కొన్ని తమాషా విశేషాలు మీతో చెప్పుకోవాలి.

మొదటిసారి నేను వంట చేసింది అమెరికాలోని పిట్స్ బర్గు నగరంలో. రోజూ వీధిలో పడి తింటుంటే డబ్బులు అయిపోతున్నాయని, వంట చెయ్యక తప్పదని, ఒకరోజు మొదలుపెట్టాను. అంతకుముందు కూడా కొంత ప్రవేశం ఉంది కాని, ఎప్పుడూ సరిగా వచ్చేది కాదు. అవసరం ఎన్ని కళలైనా నేర్పుతుంది అని, మొత్తం మీద ఒక లెవెలుకి వచ్చింది నా వంట. కానీ ఈ మసాలా జోరుకి, మా అంతస్తు మొత్తం గుభాలించేది, లిఫ్టు ఆరవ ఫ్లోరుకి వచ్చిందంటేనే ఇక్కడెవడో తెలుగువాడు బసుంటున్నాడని తెలిసిపోయేది.

ఓరొజు, పొయ్యి మీద పోపు పెట్టి మర్చిపోయా సంగతి. వెనక్కి వచ్చి చూసే సరికి అంతా పొగ. ఇంతలోనే, రై అని సైరను మొదలైంది. లిఫ్టు పనిచెయ్యడం ఆగిపోయింది (12 అంతస్తుల మేడ అది). జనాలందరు ఒకటే పరుగులు, “ఏంట్రా సంగతి” అని ఆలోచిస్తుంటే కొంతమంది ఫైరుమాన్లు మా ఇంటి తలుపు కొట్టి లోపలికి జొరబడ్డారు. సీను చూసి “వారి జిమ్మడా” అని అప్పుడు సైరను ఆపారు. అప్పటి నుండి నాకు పోపు పెట్టడం అంటే ఒకటే టెన్షను.

ఇప్పుడు ఫ్రాన్సుకొచ్చిన తరువాత కొంత కారాలు తగ్గించాను. లేదంటే “చీజు, వైను” రుచి తెలియదు అని. కాని, ఇప్పుడు కూడా మా రూముమేట్లు ఈ కారాల ధాటికి భయపడుతూ ఉంటారు. ఒకోసారి మిరపకాయలు నూనిలో వేయిస్తూ ఉంటే కిటికీ తలుపులన్నీ తెరిచివుంచినా పాపం మా రూముమేట్లకి ఒకటే దగ్గులు !

అప్పుడోసారి, ఇటాలియన్ రెస్టారెంటుకి వెళ్ళి పిజ్జా ఆర్డరు చేసాం కొంతమంది ఫ్రెండ్సు. అన్నట్టు, ఇక్కడి ఇటాలియన్ రెస్టారెంట్లలో ఒక కారం-నూని ఉంటుంది (మిరపకాయలు, ఆలివ్ ఆయిలు కలిపినది) నాకదంటే భలే ఇష్టం. సరే, ఈ రెస్టారెంట్లో మనదేశం వాడొకడు పనిచేస్తున్నట్టున్నాడు. నన్ను చూసి వీడెవడో ఇండియా నుండి వచ్చాడు అని, నన్ను మెప్పించడానికి పిజ్జాతో పాటు ఒక మాంచి మిరపకాయ పక్కన పెట్టి ఇచ్చాడు. నేనది చూసి ” వార్నీ, ఇప్పుడు నా దేశభక్తి చూపించుకోవాలా !”, అని ఆశ్చర్యపోయి, సరేలే అని ఆ మిరపకాయ తిన్నాను. అది చూసి మా ఫ్రెండ్సు కళ్ళు తిరిగి గగ్గోలు పెట్టారు. ఇంతకీ, ఒట్టి బుడతకాయి ఆ మిరపకాయి. మనకెందుకు పనికి వస్తుంది.

ఫ్రాన్సులో చాలా మంది అరబ్బుదేశాల వాళ్ళుంటారు. ఉత్తర-ఆఫ్రికాలోని ట్యూనీసియా, అల్జీరియా మొదలైన అరబ్బు దేశాల ఫ్రెండ్సున్నారు నాక్కొందరు. ఒకసారి, ఫ్రెండ్సుని భోజనానికి పిలిచాను. వారిలో ఒకడు జర్మనీ నుండి, ఇంకొకడు ఇటలీ నుండి వున్నారు. మాటల మధ్యలో, ఇటలీవాడు అమాయకుడు ” బీరు అంటే బెల్జియం బీరే బీరు, అన్నింటికన్నా అదే రుచికరంగా ఉంటుంది” అన్నాడు. నేను ముందు-వెనుకలు చూడక ” ” కరెక్టే, బెల్జియం బీరు అంటే నాకు చాలా ఇష్టం. బెస్టు అది”, అని చెప్పాను. ఇదివిని, జర్మనీవాడికి పిచ్చికోపం వచ్చింది. ” నా బొంద, జర్మనీలోనే అన్నింటికన్నా బాగుంటుంది” అని వాడు దెబ్బలాట మొదలుపెట్టాడు. “తేడావచ్చింది రోయ్” అని మాట మళ్ళించడానికి నేను “సరేలే, బీరంటే మీ జర్మన్లకు గర్వకారణం. మా తెలుగువాళ్ళకు కారం అంటే గర్వం అన్నట్టు. అసలు, మాకంటే ఎవడు కారం తింటాడు ?”, అని అన్నాను.

గుంపులో ట్యూనీసియా ఫ్రెండు ఒకడు ఉన్నాడు. వాడది విని “ఛీ, అంత సీను లేదు. మా దేశంలోనే అంతకంటా కారం తింటాం”, అని పోటీకి దిగాడు. సరే చూద్దాం అని పోటీ మొదలైంది. వాడు “హరీసా” అని ఒక కారం పచ్చడి తెచ్చాడు నాకు. మన కొరివీకారం టైపులో ఉంటుంది, కాని అంత సీను లేదు లెండు. నేను సింపులుగా ఒక ఆవకాయ తెరిచాను అమ్మ చేసింది. నేనా హరీసా అవలీలగా లాగించేసాను. వాడు మా ఇంటి ఆవకాయ తిని “వాలమ్మో” అన్నాడు. “దీనికే ఇలాగంటే, ఇక గుంటూరని ఒక ఊరుంటుంది. అక్కడ అసలు-సిసలు తడాఖా కారాలు ఎలా తినగలవు ?” అని వాడికి హితబోధ చేసాను. ఆ గుంటూరు వంటలంటే నాకే దడ, ఒకసారి తిన్నా, ఆ దెబ్బ ఇంకా గుర్తుంది !

అసలు సంగతి ఏమిటంటే మొన్నీ మధ్య ఒక మిరపకాయ కనిపెట్టాను ఇక్కడ మార్కెట్లో. గుండ్రంగా చూడడానికి ఒకటైపు టమాటాలా ఉంది. కాని తింటే నిజంగానే గూబ గుయ్యిమంది. ఆఫ్రికానుండి ఇంపోర్టు చేసారంట దానిని. బహుశా ట్యూనీసియా నుండేమో, మా ఫ్రెండు మాటల్లో కూడా కొంత నిజం ఉండి ఉండవచ్చు.