Category Archives: విద్య

ఎమర్జెన్సీ రూములో విద్యా రంగం

మా అమ్మనాన్నలిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు. పచ్చని గోదావరి జిల్లాలలో పనిచేస్తున్నారు. ఇక్కడ అక్షరాస్యత శాతం కేవలం 70% (అంటే 30% మందికి చదవడం, వ్రాయడం కూడా చేతనవదు అన్నమాట). మా అమ్మనాన్నలు పనిచేసే స్కూళ్ళలో తరగతికి 100 మందికి పైబడి విద్యార్థులు. ఇక్కడ కూర్చోడానికి బల్లలు లేవు. పిల్లలకి తినడానికి సరైన ఆహారం లేదు. ఏమాత్రం వర్షాలొచ్చినా స్కూలు ప్రాంగణం బురదమయం. వ్యవసాయంలో కోతపనులు జరిగేటప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళ ఇళ్ళలో సాయంచేయడానికి స్కూలు ఎగ్గొడతారు. ప్రతి తరగతికి ఒక 10% మంది పై తరగతికి వెళ్ళకుండానే బడి మానేస్తుంటారు. చివరికి పదవ తరగతి పాస్ అయ్యేది కేవలం సగం మంది మాత్రమే. ఆడపిల్లలో అయితే చాలామంది పదవ తరగతికి ముందునే పెళ్ళిల్లు చేసుకుంటారు. మా అమ్మనాన్నలకి పెళ్ళి శుభలేఖలు వస్తుంటాయి.

మా అమ్మగారి స్కూలులో చాలామంది హాస్టలు పిల్లలు. చాలా వెనకబడిన సామాజిక తరగుతులనుండి వచ్చినవారు. హాస్టలులో నడిచే రాజకీయాలు, అవకతవకలు చాలా ఎక్కువ. చదువుపై శ్రద్ధ లేకపోవడం వలన ఈ పిల్లల ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువ. ప్రభుత్వం అందించే టెక్స్టు పుస్తకాలని వీరిలో కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్మివేస్తుంటారు. ఇలాంటి పిల్లలు ఇంజనీరింగు, వైద్యం లాంటి వృత్తి విద్యలను చేజిక్కించుకోగలరా ? ప్రవేశ పరీక్షలలో గెలుపొందగలరా ? మనదేశంలో 90% పిల్లలు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు.

రిజర్వేషన్లను విమర్శించేముందు ఒకసారి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వీటివల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసేముందు, మనదేశంలో విద్యారంగాన్ని సమూలంగా అభివృద్ధిచెయ్యడానికి మనకి ఒక ఐడియా కావాలి.

విద్య – మనదేశానికి ఆఖరి ఛాన్సు :

మన దేశ జనాభాలో పెక్కుమంది యువతరం. వీరికి సరైన విద్యనందిస్తే దేశం పెనువేగంగా అభివృద్ధి చెందుతుంది. జనాభా పెరుగుదల మందగించగానే, సమాజంలో వృద్ధులు మరీ ఎక్కువైపోతారు. మనం వృద్ధులమయ్యాక మనకి పెన్షన్లు ఇవ్వడంకోసమై మన తరువాతి తరం వాళ్ళు పనిచెయ్యాల్సి వస్తుంది. దేశ ఆర్థిక ప్రగతి విపరీతంగా కుంటుపడుతుంది.

చైనాలో ఇప్పుడు ఇదే ప్రోబ్లం వస్తోంది. కానీ, ఆ దేశం ఇప్పటికే విద్యారంగంలో బాగా పెట్టుబడి పెట్టి 100% అక్షరాస్యత సాధించింది. అభివృద్ధి రేసులో చివరి అంకంలో వారి ఆర్థిక వృద్ధి రేటు 10%గా మరికొంత కాలం కొనసాగుతుంది.

మనదేశంలో చాలామందికి అర్థంకాని విషయం ఏమిటంటే, మనంకూడా రేసు చివరి అంకంలో ఉన్నాం. రాబోయే 30 ఏళ్ళలో మనం పేదరికాన్ని నిర్మూలించలేకపోతే, వృద్ధుల శాతం పెరగడం వల్ల, మనదేశం చిరకాలం పేదదేశంగా మగ్గిపోతుంది. మాలవాడు కానీ, బ్రాహ్మణుడు కానీ – చదువు విడిచిపెడుతున్న ప్రతి చిన్నారికి మన గుండె కళుక్కుమనాలి. ఈ విషయంలో మన తరం ఒక్కరిని కూడా అలక్ష్యం చెయ్యడానికి వీలులేదు.

మనదేశంలో విద్య దౌర్భాగ్యం :

రాజ్యాంగంలో విద్యకి బడ్జెట్లో కనీసం 6% ఇవ్వాలి అని రాసివుంది. నా దృష్టిలో విద్య అనేది అతి ముఖ్యమైన సమస్య, కనీసం 10% ఖర్చుపెట్టాలి. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంత, ఎంత వేగంగా అయితే అంత – మన ప్రజలని విద్యావంతులని చెయ్యాలి. కానీ ఎప్పుడూ మనదేశ బడ్జెట్లో 4% మించి విద్యకి డబ్బులు కేటాయించలేదు. ఇప్పటి కేంద్రీయ బడ్జెట్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యకోసం అంతా కలిపి ఇచ్చినది 24,115 కోట్ల రూపాయిలు. అదే రక్షణకోసమై 1,00,0000 కోట్ల రూపాయిలు. రైతులకి వ్యవసాయ రుణాల మాఫీపై ఇచ్చిన సబ్సిడీ 60,000 కోట్ల రూపాయిలు.

విద్య అంటే ఇంత నిర్లక్ష్యం ఉండడం వలననే మనదేశానికి స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళయినా ప్రతి భారతీయునికి ప్రాథమిక హక్కైన విద్యని అందించలేకపోతున్నాం.

100 మంది పిల్లలకి కనీసం ఒక ఉపాధ్యాయుడు కూడా లేడు. ఇంతమంది విద్యార్థులను పర్యవేక్షించడం మన ఉపాధ్యాయులకి చేతగాని పని. ఎన్నికలకి, ప్రభుత్వ పండగలకి ఈ ఉపాధ్యాయులచే వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. పబ్లిక్ పరీక్షలప్పుడు వేలకొద్దీ జవాబుపత్రాలను దిద్దిస్తుంటారు. ఇంతటి ఒత్తిడి తట్టుకుని పనిచెయ్యడం అసాధ్యం. చాలామంది టీచర్లు అందుకనే వారి ఉద్యోగ ధర్మాన్ని మొత్తంగానే అలక్ష్యం చేస్తున్నారు.

మన ప్రభుత్వ విద్యా బడ్జెట్టు 90% టీచర్లకి జీతాలివ్వడానికే సరిపోతోంది. ఇంత తక్కువమందికి చాలీచాలని జీతాలిస్తూంటేనే, ఉన్న డబ్బులు అయిపోతున్నాయి. అంటే విద్యకి ఎంత తక్కువ ఖర్చుపెడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. చాలా స్కూల్లలో త్రాగునీరు, టాయిలెట్ సదుపాయాలు లేవు. ఆటస్థలం ఉండదు. కొన్నిసార్లు చెప్పుకోవడానికి ఒక భవనం కూడా స్కూలుకి ఉండదు. దేశంలో 9.54% స్కూళ్ళలో స్కూలు మొత్తానికీ ఒకటే గది ! దేశంలో 10 కోటి స్కూళ్ళు ఉండగా, లక్ష స్కూళ్ళలో బ్లాక్ బోర్డు లేదు. 20 వేల స్కూళ్ళలో ఒక ఉపాధ్యాయుడు కూడా లేడు. మరి వీటిని స్కూలు అని పిలవడం ఎందుకో.

ప్రాథమిక విద్య కందకం లోతుల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఉన్నత విద్య పాతాళంలోనే అఘోరిస్తోంది.

మన దేశ జనాభాలో పట్టభద్రులు 0.5%. వీరిలోనే సగం మంది ఏ విధమైన ఉద్యోగానికి పనికిరాని వారు. మిగిలిన 0.25% మందిలో ఇంటర్నెట్టు ఉపయోగించడం తెలిసినవారు కేవలం 5%, అంటే మొత్తం జనాభాలో 0.01% అన్నమాట. దేశంలో సాఫ్టువేరు పరిశ్రమ వెలుగు జిలుగులు చూసి సంబరపడిపోయేముందు తెలుసుకోవలసింది ఏమిటంటే ఇది ఉపాధి కల్పించేది కేవలం 0.01% జనాభాకి అని. రాబోయే పదేళ్ళలో కంప్యూటరు పరిశ్రమకి సరిపడే మనుషులు దొరక్క కంపెనీలన్నీ ఫిలిప్పీన్సు, చైనా లాంటి దేశాలు తరలిపోగలవని నాస్కాం ఇప్పటికే హెచ్చరికలు మోగిస్తోంది. మనుషుల కొరత వలననే సాఫ్టువేరు కంపెనీ ఉద్యోగుల జీతాలు కూడా అసాధారణంగా 20% పెరుగుతున్నాయి.

మన దేశంలో 10,000 మందికి ఒక డాక్టరు ఉన్నాడు. అమెరికాలో అయితే ఇంతమందికి 546 డాక్టర్లున్నారు. మనం 1/500 అన్నమాట. అర్జెంటుగా మనదేశానికి 6 లక్షల డాక్టర్లు కావాలి.

ఏ పరిశ్రమ చూసినా చదువుకున్న నిపుణుల కొరత మన దేశంలో అత్యధికంగా ఉంది. ఇలాంటి దేశంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎవ్వరు ముందుకు వస్తారు ? పరిస్థితి ఇలావుంటే, విద్యలో నాణ్యత తగ్గిపోతోంది అంటూ వృద్ధాచార్యులు పేపర్లలో సంపాదకీయాలు వ్రాస్తున్నారు – ‘కాలేజీలు ఇష్టమొచ్చినట్లు కట్టేస్తున్నారు, వీటి నాణ్యత మరుగుపడిపోతోంది” అని. నాణ్యత అదేవస్తుంది, ముందు సాధ్యమైనన్ని వృత్తివిద్య కాలేజీలు కట్టాలి.

నేను రీసెర్చి విద్యార్థిని గనుక, చివరిగా కొంత పరిశోధనా రంగం గురించి కూడా చెబుతాను. మన దేశంలో అన్నిరకాల ఇంజనీరింగు విభాగాలు కలిపి పీ.హెచ్.డి పట్టా పొందేవారు ఎంతమందో తెలుసా ? ఏడాదికి 400 ! ఇందులో అత్యధికులు సరైన పరిశోధనా పత్రాలు సమర్పించకుండానే పట్టా పొందుతున్నారు. ఐ.ఐ.టీ లాంటి మేటి సంస్థలలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు గలిగిన పరిశోధనా పత్రాలు అతి తక్కువ. చైనాను గమనిస్తే, ఈ దేశం ఇప్పటికే అమెరికా కంటే ఎక్కువ పీ.హెచ్.డి పట్టాలను తయారుచేస్తోంది. పరిశోధన నైపుణ్యంకూడా అంతర్జాతీయ ప్రమాణాలలో ఉంది.

ప్రజాస్వామ్యానికి విద్య అవసరం :

చైనా కంటే మనం ఎందులో గొప్ప, అని అడిగితే ఠక్కున చెప్పే జవాబు – మనం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని. కానీ అబ్రహాం లింకన్ అన్నట్లు “విద్య లేని ప్రజాస్వామ్యం మితం లేని వంచన”. ప్రజాస్వామ్యమనేది పనిచెయ్యాలంటే ప్రజలకి చదువు వచ్చి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా నిరక్షరాస్యులతో ప్రజాస్వామ్యం పనిచెయ్యలేదు. పైకి షోకు చెప్పుకోవడమే కానీ, మనదేశంలో నిజంగా నడుస్తున్నది కులస్వామ్యం. ఒకరకమైన ఫ్యూడల్ రాజ్యం. ప్రజల్లో 100% అక్షరాస్యత వచ్చేవరకు ప్రజాస్వామ్యపు ఆలోచనలు వారికి అర్థం కావు.

ప్రపంచంలోని పెనువిప్లవాలు అన్నీ విద్య-సమాచారం ఆధారంగా వచ్చాయి.

  1. వ్రాత అనేది కనుగొనేముందు సమాజంలో అక్షరాస్యుల శాతం 0%. మనుషుల ఆలోచనలన్నీ తిరిగినవి జాతి, తెగ, గోత్రం మీదనే.
  2. వ్రాత కనుగొన్న తరువాత మతం పుట్టింది. రాజ్యం పుట్టింది. డబ్బు అనేది పుట్టింది. సమాజంలో అక్షరాస్యుల శాతం 5%. సమాజం ఫ్యూడల్ పద్ధతిపై నడిచేది.
  3. పుస్తకాలు ముద్రించడం మొదలు పెట్టిన తరువాత ప్రజలలో అక్షరాశ్యత మొదటిసారిగా 100% అయ్యింది. ఈ దెబ్బకి రాచరికం పోయింది. ఫ్యూడల్ ప్రభువులు పోయారు. ప్రజాస్వామ్యం వచ్చింది. పెట్టుబడిదారీ సమాజం తయారయ్యింది.

మనదేశంలో కులం ప్రకారం పార్టీలు తయారవుతున్నాయి. రాజకీయ నాయకులు మత ఉద్రేకాలను రెచ్చగొడుతున్నారు. ప్రజలు గొర్రెలవలే ఓట్లు వేస్తూ తోడేళ్ళ లాంటి నాయుకులను కుర్చీలనెక్కిస్తున్నారు. ఇవన్నీ ఏమీ ఆశ్చర్యం కలిగించే అంశాలు కావు. వ్రాత తెలియని వాడు జాతి-కులం గురించే ఆలోచిస్తాడు. పుస్తకాలను ఎరగని వాడు మతాన్నే నమ్ముతాడు.

జ్ఞాన యుగంలోకి 100% మంది అడుగుపెడితే, అటువంటి సమాజం ఆలోచించే విధానమే తేడాగా ఉంటుంది. మనం బ్లాగర్లు కనుక అటువంటి సమాజంలో ఉన్నాం అనుకోవచ్చు. కానీ, తప్పు. మనం జీవితంలో 60% నుండి 99% వరకు అజ్ఞానులతో సంభాషణ సాగిస్తున్నాం. ఈ ప్రభావం మన ఆలోచనా-సరళిపై ఉంటుంది. నేను సమాజాన్ని మార్చాలనుకుంటున్నాను. సంపూర్ణమైన సహనం, స్వేఛ్ఛ కలిగిన మనుషులమధ్య ఉండాలనుకుంటున్నాను. ఇది జరగాలంటే, ఒకటే మార్గం. ప్రజలందరూ విద్యావంతులు కావాలి. అసలైన విప్లవం ఇదే. కమ్యూనిస్టులదీ కాదు. ప్రాంతీయవాదులదీ కాదు. మతోద్రేకులదీ కాదు.

అతివేగంగా భారతీయులను విద్యావంతులను చెయ్యడం ఎలా ?

చరిత్రలో సమాచారం చేరవెయ్యడానికి కొత్త మార్గాలు కనుగొన్న ప్రతిసారీ, విద్యా రంగంలో ఒక విప్లవం వచ్చింది.

వేదాలు వల్లించే కాలంలో వ్రాత కనుగొనబడలేదు. అందుకని, వేదం మొత్తం బట్టివేసేవారు. వ్రాత కనుగొన్న తరువాత, మొదటిసారిగా టీచరు అనే వృత్తి అవతరించింది. కానీ, గ్రంథాలయాలు ఎక్కడనో కానీ ఉండేవి కావు. బట్టీవెయ్యడం అనేది ఇంకా కొనసాగింది. పుస్తకాలు ముద్రించిన తరువాత మొదటిసారిగా ఒక టీచరు వివిధ సబ్జెక్టులని వివరించడం మొదలయ్యింది. విద్యాబోధనలో పుస్తకాలని సంప్రదించగలిగిన తరువాత తప్పులకి ఆస్కారం తక్కువ. యూరపు-అమెరికా విద్యలో పుస్తకాల ఇంపార్టెన్సుని గుర్తించింది. చారిత్రిక కారణాల వల్ల మనదేశంలో ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకి, అమెరికాలో ఓపెన్-బుక్ పరీక్షలు ఎక్కువ (పరీక్షలో నువ్వు నీకు కావలసిన పుస్తకం పట్టుకు వెళ్ళవచ్చు). మనదేశంలో బట్టీవెయ్యగలిగిన వాడే పరీక్షలో నెగ్గగలడు.

ప్రస్తుతం మనం పుస్తకాలని కూడా వెనక్కి పెట్టేసి ఒక సరికొత్త ఇంటర్నెట్టు యుగంలోకి అడుగుపెట్టాము. విద్యార్థికి ఇప్పుడు తరగతి గదిలో కూర్చుని పాఠం నేర్చుకోవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్టులో సెర్చి చేసి అనేక విషయాలను తనంతట తానే తెలుసుకోగలుగుతున్నాడు.

డబ్బులు ఎక్కువగా లేని మనదేశంలో విద్యని పెంపొందించడానికి సాధ్యమైనంత పదునుగా బాణాలు సంధించాలి. ఉన్న డబ్బుని అతిజాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. ఇప్పుడు దేశంలో మంగళివాడు మొదలుకొని పాలవాడివరకూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఇదే విధమైన విప్లవం విద్యలో కూడా కలిగించాలంటే ఏది మార్గం ?

ప్రతి గ్రామానికి ఆప్టికల్-ఫైబరు కలిపితే అయ్యే ఖర్చు, రోడ్లు వెయ్యడానికి అయ్యే ఖర్చులో 1%. ఇంటర్నెట్టు వాడుకకి మనదేశంలో ముఖ్య సమస్య విద్యుత్ సరఫరా. సరైన కరెంటు ఉన్నంతకాలం ప్రజలు దీనిని అద్వితీయంగా ఉపయోగించుకోగలరు.

ప్రస్తుతం డిజిటల్ వీడియో కెమారాల వలన, ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నప్పుడు దానిని వీడియోలో బంధించడానికి అయ్యే ఖర్చు అతి తక్కువ. హార్డు డిస్కులు చవుక గనుక, ఇటువంటి వీడియోలు సేకరించి, సర్వర్లలో పొందుపరచడం కూడా చాలా సుళువు. మన స్కూళ్ళలో టీచర్లు విపరీతమైన కొరతలో ఉన్నారు. చాలా మందికి విద్యాబోధనలో అలక్ష్యం. వారి సబ్జెక్టు మీద వారికే సరైన అవగాహన లేదు. ఇటువంటి పరిస్థితిలో, ఈ వీడియోలు అద్భుతంగా పనికివస్తాయి.

ఆప్టికల్ ఫైబరు లేనంతవరకూ, పట్టణాలలో ఔత్సాహికులు ఇటువంటి వీడియోలను సీ.డీ.ల్లో భద్రించి పల్లెటూళ్ళకి తిరిగి స్కూళ్ళకి అప్పగించవచ్చు. వికిపీడియా నిర్మించడానికి మన తెలుగు బ్లాగర్లు కృషిచేసినట్లే, ఒక వీడియో వికిపీడియాని ఆవిష్కరించవచ్చు.

కానీ, వీడియోలు చూపించినంత మాత్రాన చదువు ఎవ్వరికీ అబ్బదు. విద్యార్థులతో ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకుని సంభాషణ నడపగలిగే మెంటర్లు కావాలి. విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చెయ్యగలుగుతూ ఉండాలి. ప్రశ్నలకి “వీడియో/వెబ్ వికిపీడియాలలో” సమాధానాలు ఎలా వెతుక్కోవచ్చో పిల్లలకి నేర్పగలగాలి.

కార్నెగీమెలన్లో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజ్ రెడ్డిగారు ఈ విషయంపై ఇప్పటికే చాలా ఐడియాలు ఆచరణలోకి పెట్టారు. కొంతకాలం ఆయన స్టుడెంటుగా పనిచేసిన అదృష్టం నాది. ఈ విద్యాబోధనని “లెర్నింగ్ బై డూయింగ్” అంటారు.

ప్రస్తుతం “21వ శతాబ్ది గురుకులం” అని మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో కంప్యూటర్ పర్జిజ్ఞానాన్ని మాస్టర్ డిగ్రీగా అందిస్తున్నారు. ఒకసారి డిగ్రీ పుచ్చుకున్న తరువాత, ప్రతీ విద్యార్థి మెంటరు క్రింద పనిచెయ్యవచ్చు. టిచర్ల కొరతని కొంతవరకూ ఇలా భర్తీ చెయ్యవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మనదేశంలోని కంప్యూటర్ నిపుణుల కొరతని అరికట్టవచ్చు.

ఇదేవిధమైన ఆలోచనలు పాఠశాల-కళాశాల లెవల్లో కూడా మనం అమలు జరపాలి.