Category Archives: రాజకీయం

వింత పశువుల వీధిపోరాటాలు

ఆంధ్రజ్యోతి పత్రిక పైకి కృష్ణ మాదిగ అనుచరులు దాడికి దిగడం, తరువాత ఎడిటర్ని పొలీసులు అరెస్టు చెయ్యడం వంటి పరిణామాల వల్ల ఈ మధ్యన బ్లాగులోకంలో దళిత హక్కులపై చర్చ జరుగుతోంది. దళిత రక్షణ చట్టం ఎలా అపహాస్యం చేస్తున్నారో తాడేపల్లి గారు నిర్మొహమాటంగా వివరించారు. మహేశ్ కుమార్ గారు దీనికి ప్రతిగా సమాధానమిచ్చారు.

మరో ప్రక్క పొలీసులను నక్సలైట్లు హత్యచెయ్యడంపై చదువరి, మహేశ్, దిలీప్ గారి బ్లాగులలో కథనాలు వచ్చాయి.

మన సమాజంలో సమానత లేదు. ఇటువంటి పరిస్థితిలో, అణగారిన వర్గాలు పోరాటం చేసి వారి హక్కులను సంపాదించుకొంటారు అని మనం చాలామంది నమ్ముతున్నాం.”నేను దళిత పక్షపాతిని” అని అంటే “నేను బడుగువర్గాల పోరాటాన్ని సమర్ధించుతాను” అని అర్థం. కానీ, ఈ పోరాటమనేది ఎంతవరకూ నిజం ?

నా దృష్టిలో ఈ పోరాటాలకు అర్థం లేదు. విద్యలేని వాడు తన హక్కుల గురించి ఎలా తెలుసుకోగలడు ? ఏది సాధ్యమో తెలియకుండా, ఎటువంటి ఆశయం అర్థవంతం అయినదో తెలియకుండా, ఎవరన్నా పోరాటం చెయ్యగలరా ? వీధిలో పశువులు ఒకదానితో ఒకటి కలబడి కుమ్ముకోవడానికి ఈ పోరాటాలకి తేడా ఏమిటి ?

“విద్యలేనివాడు వింత పశువు” అని మన నానుడి. పశువులకి కూడా బుర్ర ఉంటుంది, మెదడు ఉంటుంది. మనిషికీ పశువుకీ తేడా ఎక్కడ అంటే విజ్ఞానం వద్ద. పరిపూర్ణ మానవత్వం సంపాదించుకోవాలంటే విద్యావంతులు అయివుండాలి. ఇటువంటి కనీస మానవత్వం కూడా మన దేశపౌరులకి మనం ఇవ్వకుండా ఇంకేమి హక్కుల గురించి అడగగలం ? నా దృష్టిలో విద్యకి దూరం చెయ్యడమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన. మన ప్రభుత్వం దీనికి పరిపూర్ణ నైతిక బాధ్యత వహించాలి. చదువులేని పశువులకి కులం తప్ప మరేదీ కనపడదు.

దళిత ఉద్యమ మేధావులని చెప్పుకుంటున్నవారు వారి మందీ మార్బలంలో విద్యావంతులు ఎంతమందో చెప్పగలరా ? లేదు. వారే కాదు, రాజకీయ నాయకులని తిరుగుతున్నవారిలో ఎవ్వరూ వారి అనుచరగణంలో విద్యావంతులు ఎందరో చెప్పరు. నక్సలైట్లలోనూ ఇదే సంగతి. వీరి వెనక ఉన్న దండు మనుషులందరివీ గొర్రె-బుర్రలు. “డూ డూ బసవన్న” అని డబ్బుతో పిలిస్తే డూ అని తలాడించే తలకాయలు. మన సమాజంలో అతిపెద్ద గౌరవం తెచ్చిపెట్టేది ధనబలం. ప్రజలు విద్యావంతులు కానంతవరకూ ఇదిలాగే సాగుతుంది.

కృష్ణమాదిగకి వ్యతిరేకంగా రాసినంతమాత్రాన ఆంధ్రజ్యోతి దళిత వ్యతిరేకి అయిపోతుందా ? డబ్బులేని దళితుల జీవితం ఎలావుంటుందో పరిశీలించాలి. భూస్వాముల కింద నొక్కితే నొక్కినట్టు పడి ఉండాలి వీళ్ళు. పిలిస్తే వచ్చి లెట్రిన్లు కడిగిపెట్టాలి. వాళ్ళ అమ్మాయిలని అల్లరిచేస్తే మూసుకుని పడివుండాలి. కించపరిస్తూ జోకులు వేస్తే “అహహో” అని నవ్వాలి. ఒక తెలివైన విద్యార్థిని జాతి పేరుతో వెకిళి చెయ్యడం కంటే దరిద్రమైన విషయం నేను చూడలేదు. పేదవాళ్ళైన దళితులు ఎన్నిసార్లు ఇది అనుభవించారో లెక్కలేదు. ఏ దళిత హక్కుల చట్టం వీరిని కాపాడుతుంది ? డబ్బు, చదువే వీరిని కాపాడగలవు. దీనినే కామన్ సెన్సు అంటారు.

డబ్బున్న దళితులు ఎన్ని అవమానాలు భరించివుంటారు జీవితంలో ? ఏవో అరాకొరా, అసలు కొరగావు. డబ్బు ఉన్న దళితులు చేసే ఇబ్బందులు సాకుగా చూపించి దళితులందరినీ ఒక్కగాటన కట్టివేసి తాడేపల్లి గారు సంబోధిస్తున్నారు. ఇది అసలు సమంజసమేనా ?

బడుగువర్గాలని సమర్ధించే వారు కూడా విద్య యొక్క ఆవశ్యకతని పట్టించుకోవట్లేదు. మనిషిని పశువు కంటే ఎక్కువ చేసేది శ్రమ కాదు, విద్య. సమాజంలో మార్పు తీసుకురావాలంటే వచ్చేది శ్రామిక వర్గం నుండి కాదు, విద్యావంతుల నుండి. ప్రపంచం ఏమిటో తెలియకుండా, విజ్ఞానం లేకుండా తుపాకీలిచ్చినంత మాత్రాన ఎవ్వరు హక్కులు తెచ్చుకోగలరు ?

మనిషి శ్రమజీవి అంటారు. ఇంధనంతో ఇంజనులు నడపడం నేర్చిన తరువాత మనిషి శ్రమకి కాలం చెల్లింది. ఏ విధమైన శారీరిక శ్రమ చెయ్యకుండానే ప్రపంచంలోని మనుషులందరూ గడపవచ్చును. దీనికి సరిపడ ఇంధనం మన వద్ద ఉంది (ప్రస్తుతానికి న్యూక్లియర్ విద్యుత్తు, మన జనాభా తగ్గించుకుంటే కేవలం సోలార్ విద్యుత్తు). ఉండవలసినది సరైన దిశా నేతృత్వం, పట్టుదల మాత్రమే. విద్యుత్తుతో ప్రతీ పనిని చేయపించి మనిషులందరూ విశ్రాంతి తీసుకోవచ్చును. ఇదే తరువాతి యుగం.

పారిశ్రామిక విప్లవం అనేది మనిషిని పశువునుండి పూర్తిగా వేరుచేసింది. శ్రమకి అవసరం తీసివేసింది. కానీ, ప్రస్తుతం ఈ ఫలితాలను కేవలం కొంతమంది మాత్రమే అనుభవిస్తున్నారు. వీరిని ధనిక వర్గాలు అంటారు – ఏ పనీ చెయ్యకుండా కులాశాగా గడపుతున్నారు వీళ్ళు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇదేవిధంగా ప్రతి మనిషీ ఉండవచ్చును. పారిశ్రామిక విప్లవం తరువాత మొదటి సారిగా కొన్ని సమాజాలలో పేదరికం నిర్మూలింపబడింది. ప్రజలందరికీ సమానంగా వైద్య, ఆహార సదుపాయాలు దొరికాయి. మునుపటి సమాజంలో కేవలం కొందరికే ఇది దక్కింది. ప్రపంచంలోని మానవ సమాజాలన్నింటినీ పారిశ్రామికం చెయ్యడం ద్వారా మనం మరో యుగంలోకి వెళ్తాం. ఇప్పటి సమస్యలు ఆ యుగంలో హాస్యాస్పదంగా ఉంటాయి.

మనిషి బుద్ధి జీవి. ప్రతి మనిషీ ఈ విధంగా ఉండగలిగేటట్లు మనం ప్రయత్నించాలి. ఇదే అసలైన మానవత్వం. దానికి కనీస అవసరం ప్రజలందరినీ విద్యావంతులు చెయ్యడం. దీనిని గుర్తించక అడ్డదిడ్డమైన ఆశయాలకోసం పనిచెయ్యడం కాలయాపన, మూర్ఖత్వం.

ప్రకటనలు

పెట్రోలు ధరలపై నీచ రాజకీయం

మీలో ఎవ్వరైనా పెట్రోలు ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా రోడ్డుపై నిరశన ప్రదర్శనలు జరిపారా ? అయితే, తక్షణంగా ఈ పోస్టు చదవండి.

రాష్ట్రంలో జరుగుతున్న నీచ రాజకీయాలు చూసి నాకు కొంత మాట మూగవోయింది. రాయాలనుకున్న పోస్టు రాయలేకపోయాను. కానీ “పర్ణశాల” బ్లాగులో ఒక కామెంటు వ్రాసాను. ఇప్పటికి దీనితో సరిపుచ్చుతాను.

పర్ణశాల బ్లాగులో క్రూడు పెట్రోలు ధర లీటరుకి 25 రూపాయలు, శుద్ధికి 2 రూపాయలు, రవాణాకి 10 రూపాయలు కలుపుకున్నా 37 రూపాయలే ఉంటుంది. మిగిలిన సొమ్మంతా ప్రభుత్వం పన్నులుగా దండుకుంటోంది అని వ్రాసారు. గుండెలు మండుతున్నాయి అని వ్రాసారు. మొన్న నీచ రాజకీయాలకి ప్రతిరూపమైన ఈనాడు పత్రికలోనూ ఇదే విధంగా సంపాదకీయం వచ్చింది.

ఒకసారి నిజాలని వెలికి చూద్దాం.

1 లీటరు క్రూడు ఆయిలు శుద్ధిచేసిన తరువాత 1 లీటరు పెట్రోలు వచ్చేస్తుందా ? రాదు. కొంత భాగం పోతుంది. శుద్ధి చేసిన పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి కారణం అది.

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు ధర పెరగడానికి కారణం డాలరు విలువ క్షీణించడం (పెట్రోలు అమ్మకాలన్నీ డాలర్లలో నడుపుతున్నారు అమెరికా ఒత్తిడి మూలంగా).

ఫ్యూచర్ ట్రేడింగు ద్వారా పెట్రోలు ధరలని స్పెక్యులేటర్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇంకో రెండేళ్ళలో క్రూడు ధర బేరెల్ కి 200 డాలర్లు చేరుకుంటుందని ఉవాచా (అంటే పెట్రోలు ధర రెట్టింపు అవుతుందన్నమాట).

ప్రభుత్వం పన్నులన్నీ తీసిపడేసినా పెట్రోలు ధరలు పెరగడం ఖాయం. దీనికి మూలకారణం మన భూమిలో శిలాజ ఇంధన నిల్వలు చాలా పరిమితంగా ఉండడమే (మహా వస్తే పెట్రోలు మరో 60 ఏళ్ళు, బొగ్గు మరో 200 ఏళ్ళు వస్తాయి). దీనికి తోడు గ్లోబల్ వార్మింగు బెడద పొంచి ఉంది.

పెట్రోలు ధరలపై పన్ను అధికంగా ఉండడం వల్ల ఇతర ఇంధనాల వినియోగం ప్రోత్సహించగలుగుతాము. మన భవిష్యత్తుకి ఇది అత్యవసరం. పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం పెట్రోలు లాభాలని కొంత ప్రజలకి తిరిగి మళ్ళించగలుగుతోంది (అవినీతితో ఈ డబ్బులు హుళుక్కి అయిపోతున్నది వేరే విషయం). సమాజంలో ధనిక వర్గాలు పెట్రోలుని మరింత ఎక్కువగా వినియోగించుతారు. సామాన్య ప్రజానీకంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందుకని పెట్రోలు భారం పడేది ధనిక వర్గం పైనే, మధ్యతరగతి వర్గంపై కూడా కొంత పడుతుంది. కానీ పేదవర్గంపై అతి తక్కువ. థియరీలో, ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు పేదలపై ఖర్చు పెట్టవచ్చు.

బుర్ర ఉన్న కమ్యూనిస్టులు ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ఎందుకు డిమాండు చేస్తారు ? పేదలపై ప్రేమ ఉంటే ధనికులకి సబ్సిడీ ఇవ్వడమేమిటి ? వాతావరణాన్ని నాశనం చెయ్యమని డబ్బు బాబులకి ప్రోత్సాహం ఎందుకు ? ప్రస్తుతం అంతా సిగ్గులేని రాజకీయం నడుస్తోంది.

ప్రజలపై పెట్రోలు భారం తగ్గించాలంటే అత్యవసరమైన పని రైలు నెట్వర్కుని ఆధునీకరించడం. మొత్తం విద్యుత్తుతో నడిపిస్తే పెట్రోలు భారం సరుకుల రవాణాపై పడదు. అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. ద్రవ్యోల్పణం అదుపులోకి వస్తుంది. దీర్ఘకాలికంగా, మన దేశానికి ఇది అత్యవసరం.

ఇది జరగాలంటే విద్యుత్తు ఉత్పత్తి అతివేగంగా పెరగాలి. దీనికి రెండే మార్గాలు – ఒకటి బొగ్గు, రెండు న్యూక్లియర్ విద్యుత్తు. బొగ్గు 200 ఏళ్ళు మాత్రమే వస్తుంది. మన దేశ అవసరాలకి లక్ష ఏళ్ళు సరిపడేంత థోరియం నిల్వలు మన దేశంలో నిమిడి ఉన్నాయి. థోరియం వినియోగించుకుంటే ప్రపంచంలోనే మనదేశం అతి ధనిక దేశం అన్నమాట. సౌదీ అరేబియాకి తాతలం మనం. గ్లోబల్ వార్మింగుపై మనం నిజాయితీగా ఉంటే బొగ్గుని మనం విడిచిపెట్టి న్యూక్లియర్ విద్యుత్తుని ప్రోత్సహిస్తాము. ఈ విషయం లోనూ కమ్యూనిస్టులు ప్రజా శ్రేయస్సుకి రివర్సులో పనిచేస్తున్నారు.

ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బులన్నీ (పెట్రోలుపై లక్షల కోట్లు నష్టాపోతోంది ప్రభుత్వం) సబ్సిడీలంటూ చివరకి ధనిక, మధ్యతరగతి వర్గాలకి అప్పగిస్తే ఇంక భవిష్యత్తు సంగతేమిటి ?

కుతూహలమ్మ ద్రౌపదియా, శిఖండినా ?

శాసన సభలో జరుగుతున్న వీర తమాషా మరో అంకంపైకి వచ్చింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటూ ఒక డ్రామా మొదలుపెట్టారు. సరుకు తక్కువ, సణుగుడు ఎక్కువ – సభంతా గోల గోల అయ్యింది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, చొక్కాలు చించుకోవడమే తరువాయి, మిగిలిందంతా ముగించారు. “స్పీకర్ వచ్చే వరకు సభ జరపనివ్వం. డెప్యూటీ స్పీకర్కి సభ నిర్వహించే హక్కు లేదు”, అంటు చంద్రబాబు ఏదో లా పాయింట్లు లేవనెత్తాడు. డెప్యూటీ స్పీకర్ కుతూహలమ్మగారు దళిత మహిళ అయినందువల్ల, కాంగ్రెసువాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది. “ఉత్సవ విగ్రహం లాంటి కుతూహలమ్మనే అవమానిస్తావా ? కులహంకారి”, అంటూ విరుచుకుపడ్డారు. “తేడా వచ్చిందిరో అబ్బాయ్”, అంటూ తెలుగుదేశం వాళ్ళు వెనక్కి తగ్గారు.

“కౌరవ సభలో ద్రౌపదిలా ఫీల్ అయ్యాను”, అంటూ కుతూహలమ్మ కొసమెరుపు. కానీ, కౌరవసభలో మెజారిటీ కౌరవులది, ఇక్కడ శాసనసభలో మెజారిటీ ఎవ్వరిదో ? సరైన పోలిక ద్రౌపదితో కాదు, శిఖండితో. భీష్ముడిని ఎదుర్కోలేక అడ్డుగా శిఖండిని పెట్టుకుని యుద్ధం చేస్తారు పాండవులు. ఒకప్పటి ఆడది అయిన శిఖండితో పోరు చెయ్యలేక భీష్ముడు విల్లు విడుస్తాడు. ఇక్కడ, మన భారతదేశంలో దళితుల విలువ శిఖండికి సమానంగా జమకట్టారు మన రాజకీయనాయకులు. ఎవ్వరూ వీరితో పోరుపెట్టుకోరాదు. ఇది రూలు.

దళితుల ఆత్మగౌరువం రక్షించే పనులా ఇవి !!? అసలు పవరు ఏ కులాల మధ్యన ఉందో అందరికీ తెలుసు. ఈ కామెడీ జనాలు అర్థం చేసుకోలేరా ?

చైనాకి జిందాబాదు కొడుతున్న కమ్యూనిస్టులు

చరిత్రలో చిరకాలం మిత్రులూ ఉండరు. శత్రువులూ ఉండరు. భౌగోళిక-రాజకీయ ప్రభావాలు మారుతూ ఉండడం వల్ల నిన్నటి శత్రువులు ఈనాటి మిత్రులవవచ్చు. నిన్నటి మిత్రుడు ఈరోజు శత్రువూ కావచ్చు. ఈ విషయం గుర్తించలేక ఒక కరడుగట్టిన సిద్ధాంతానికి దాసులవలే సేవచేసేవాళ్ళను ఛాందసులంటారు. మూర్ఖులంటారు. ఈ కాలంలో – డబ్బుకి అమ్ముడిపోయి ఆత్మవంచన చేసుకుని వ్యాసాలు వ్రాసేవారు కొందరు అయితే, సైద్ధాంతిక మత్తులో కళ్ళు కమ్ముకిపోయినా బాకాలు వాయించడం ఆపనివారు మరికొందరు. మొత్తమ్మీద భావకాలుష్యంతో చెవులు పిక్కటిళ్ళుతుంటే, సరైన దిశానిర్దేశ్యం చేసే నాయకులు లేరు మనకి.

కమ్యూనిస్టు సోదరి అంటూ చైనాకి రష్యానే ఆటం బాంబు ఇచ్చిపెట్టింది. తర్వాత సరిహద్దు గొడవలు తలెత్తడంతో శత్రువు అయ్యింది. 1960లలో “అమెరికాతో సంధిచేసుకుని కమ్యూనిస్టు ఉద్యమానికి రష్యా ద్రోహం చేస్తోంది” అని నిందమోపిన చైనాయే, 1970లలో అమెరికాతో చెలిమిచేసింది. రష్యాకి ముకుతాడు వెయ్యడానికి అమెరికాయే ఒకవైపు చైనాకి మరోవైపు పాకీస్తానుకి తాయిలాలు అందిచ్చింది. అమెరికాకి చేసిన ఎగుమతులతోనే చైనా వృద్ధిరేటు సాధిస్తోంది. ప్రపంచం తీరుతెన్నులు ఇంత వేగంగా మారుతున్నా వీరకమ్యూనిస్టులు మనవాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నారు. టిబెట్లో బౌద్ధ సన్యాసులు చైనాకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చెయ్యడం కూడా వాళ్ళకి నచ్చదు. వీళ్ళ దృష్టిలో దీనంతటి వెనకా అమెరికా మోసం ఉంటుంది. సీ.ఐ.ఏ కుట్ర ఉంటుంది. హిందూ, ఫ్రంట్ లైను లాంటి పత్రికలంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఇప్పుడు వాటిలోని సంపాదకీయాలు చూసి వెగటు వస్తోంది.

ప్రపంచంలో ఎక్కడా చైనాని శ్రామికవాద ప్రతినిధిగా చూడట్లేదు. పేరుకిమాత్రమే కమ్యూనిస్టు దేశంకానీ, పెట్టుబడిదారీ దేశంగా చైనా ఎప్పుడో ఫిరాయించేసింది. కానీ, కమ్యూనిస్టు దేశంలో ఉండే ఆంక్షలు, సీక్రెట్ పోలీసులు, విపరీతమైన దేశాభిమానం అన్నీ ఇంకా చైనాలో కలిసిపుచ్చుకుని ఉన్నాయి. ఇప్పటి చైనా నిక్షేపంగా ఒక ఫాసిస్టు దేశం. శ్రామికవాద పత్రికగా పేరుగాంచిన “గార్డియన్” పత్రికలో కూడా చైనాపై విమర్శలేకానీ, మెచ్చుకోలు కనిపించవు.

కానీ, మన కమ్యూనిస్టు పాత్రికేయులు, వ్యాఖ్యాతలు అలుపెరగకుండా ఇంకా చైనాకే ఊడిగం చేస్తున్నారు. వీరి వెర్రి ఎంత దూరం వెళ్ళిందంటే దలైలామా నిజాయితీని హత్యచేసేంతవరకూ. ఈ విచిత్రాన్ని అర్థంచేసుకోవాలంటే ఒకసారి టిబెట్ని మన కాశ్మీరు సమస్యతో పోల్చిచూద్దాం.

 1. కాశ్మీరులో వేరే భారతీయులు ఇళ్ళు నిర్ముంచుకునే హక్కు లేదు. టిబెట్లో రోరోజుకీ ప్రవాసీయులు పెరిగిపోతున్నారు. లాసా నగరంలో ఇప్పుడు 40% చైనీయులే.
 2. కాశ్మీరులో హిందీభాషని నిరోధించడం కోసం ప్రత్యేక హక్కులు ఉన్నాయి. కాశ్మీరీ భాష పరిరక్షణకై మన రాజ్యాంగానికి మించి హక్కులు ఉన్నాయి. టిబెట్లో, ప్రాథమికాభ్యాసం తరువాత చదువుకోవాలంటే చైనా భాష నిర్బంధం. టిబెట్ భాష అంతరించిపోయే పరిస్థితిలో ఉంది.
 3. కాశ్మీరులో ఆమ్నెస్టీ మొదలైన అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్నాయి. మానవహక్కుల పరిరక్షణకి కృషి చేస్తూ భారతసైన్యం యొక్క తప్పులని ఎండగడుతూ ఉంటాయి. దినపత్రికలు, వార్తాపత్రికలు సంపూర్ణ స్వేఛ్ఛతో ప్రచురించబడుతాయి. అందులో సగం భారతదేశానికి బహిరంగంగా వ్యతిరేకమైనవి. టిబెట్లో అయితే కాలుపెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రభుత్వమే పత్రికలను అచ్చువేయిస్తుంది.
 4. కాశ్మీరులో ప్రజాస్వామ్యంగా అందరూ వోటు వెయ్యవచ్చు. వారు స్వయంగా ముఖ్యమంత్రిని ఎన్నుకోవడమేగాక ప్రత్యేక కాశ్మీరు పతాకాన్ని కూడా ఎగురవేసుకోవచ్చు. టిబెట్లో అయితే ముఖ్య అధికారిని బీజింగు నియమిస్తుంది.
 5. కాశ్మిరులో విభజనకోసమై సాయుధపోరాటం చేస్తున్నారు. వీటికి లోపల చెరబడిన విదేశీ ఉగ్రవాదులు నాయకత్వం వహిస్తున్నారు. అన్యాయంగా లక్షలకొద్ది కాశ్మీరీ పండిట్లను హతమార్చారు. ఆస్తులు స్వాధీనం చేసుకుని తరిమివేసారు. టిబెట్లో “స్వాతంత్ర్యం” అడగనుకూడా అడగట్లేదు. మైనారిటి టిబెటన్లు (ముస్లిము టిబెటన్లు, ఐయ్ఘర్ టిబెటన్లు) ఎటువంటి జాతివేషమ్యం ఎదుర్కోలేదు. అయినా, అక్కడ “అదృశ్యమైన” టిబెటన్లు ఇక్కడ కాశ్మీరులో మరణించిన తీవ్రవాదులకి సమాపంగా ఉన్నారు.
 6. పాకీస్తానులో ఉగ్రవాద శిబిరాలకి సైన్యం సాయూతనిస్తుంది. అటువంటి పాకీస్తానుకే ఆటంబాంబును, మిస్సైళ్ళను ఇచ్చిపెడుతోంది చైనా. మన భారతదేశంలో ప్రతి పౌరునికి హక్కైన శాంతియుత ప్రదర్శనకూడా జరపనివ్వలేదు మనం అతిథులైన టిబెటన్లని. అయినా మనం ఏదో తప్పుచేసామన్నట్లు, చైనా మన భారత రాయబారికి దారుణంగా అర్థరాత్రి 2 గంటలకి సమన్లు పంపించింది.
 7. “మాకు స్వాతంత్ర్యం వద్దు. సరైన భావ,కళా స్వాతంత్ర్యం చాలు. హింసాయుత ఆందోళన ఆపకపోతే రాజీనామా చేస్తా”, అని అంటున్న దలైలామాని చైనా ఒక ఉగ్రవాదిగా చూస్తోంది. కనీసం చర్చలకి కూడా అంగీకరించడం లేదు. మన భారతదేశం హత్యలు చేసిన ఉగ్రవాదులతో కూడా చర్చలకు స్వాగతం చెబుతోంది.

మన కమ్యూనిస్టుల దృష్ఠిలో 1970లో మనపైకి చైనా దొంగచాటు యుద్ధం మోగించడానికి కారణం మనం దలైలామాకి ఆశ్రయం ఇవ్వడమే. ఇప్పుడు, ఈ బౌద్ధ సన్యాసులనందరినీ మన దేశం నుండి తరిమివెయ్యాలంట ! అమెరికా సమర్థించినంత మాత్రాన టిబెటన్లు ఉగ్రవాదులైపోతారా ? మన ప్రజలకి బుర్రలేదనుకుంటున్నారా ? మనదేశంలో కమ్యూనిస్టులు చైనాకి బానిసలవలే వ్రాతలు వ్రాస్తున్నారు. శాంతికాముకుడైన బుద్ధుని మనం మరచిపోయినా, మన సంస్కృతిని పెంచుతున్న టిబెటన్లు మనకి సోదరులవంటి వాళ్ళు. ఈ పాత్రికేయులు, వ్యాఖ్యాతలు ఎంత విషం వెదగక్కినా భారతీయులు ఆ అనుబంధాన్ని ఎప్పటికీ మరచిపోరు.

మనదేశంలో ఆర్.ఎస్.ఎస్ లాంటి సంస్థలు వేళ్ళూనుకోవడానికి ఈ కమ్యూనిస్టు మూర్ఖత్వమే కారణం.

జాత్యహంకారి ఉండవల్లి

బుర్ర ఉన్న రాజకీయవేత్త ఎవ్వడైనా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తాడా !? అందులోనూ, రామోజీరావుకే హడలుపెట్టించిన ఉండవల్లి లాంటి ఉద్ధండుడు ఇంతటి వెర్రి పని ఎందుకు చేస్తాడు ? పైగా, పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో గనక ఒకటికి నాలుగుసార్లు వెనకా ముందూ చూసుకోవాలి, ఇలాంటి ప్రకటనలు చేసే ముందు. ఉండవల్లికి అలాగ మాట్లాడే ఉద్దేశ్యం ఇసుమంతైనా ఉండదు. లోలోపల దళితులపై ప్రేమ ఉన్నా, అసహ్యమున్నా పైకి మాత్రం మల్లెలంత మృధువుగా మాట్లాడడం ఆయన అస్థిత్వానికి అవసరం. మరి ఇలాంటి దిక్కుమాలిన స్థితిలోకి ఎలా ఇరుక్కుంటాడు ?

జరిగిందేమిటంటే, ఆయన వ్యాఖ్యలని ఈనాడు పత్రిక అమోఘంగా వక్రీకరించింది. “రాజ్యాంగం రచించడం అయిపోయింది. మేము అంతా రాజ్యాంగానికి అనుగుణంగానే చేస్తున్నాం, అది మీ దురదృష్టం” అని అనాల్సింది పోయి, “దురదృష్టవశాత్తు అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు, దానికి అనుగుణంగానే మేం చేశాం” అన్నాడు. పప్పులో కాలేసాడు. భలే భలే !

అసలు, అంబేద్కర్ పేరుని వాడాలంటే, చదరంగం మల్లే ఎత్తులు-పైయెత్తులు ఉపయోగించి అప్పుడు వాడాలి. మన ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉన్నది పేరుకి మాత్రమే. చాలా పదాలు నిషిద్ధాలు – ఆచి తూచి మాట్లాడాలి. నిజాము/ముస్లిము/దళితులు/అంబేద్కరు/జిన్నా/… ఇలా లెక్కకు మిక్కిలి. ఏమన్నా తప్పుగా నోటినుంచి దొర్లితే, దిష్టిబొమ్మలు దహనం చెయ్యడానికి రెడీగా వీధుల్లో ఉంటారు మనదేశంలో, పనీపాటాలేని దేశభక్తులు.

మొత్తం మీద కొంచెం కామెడీ లభించింది జనాలకి :))

————————————————————————-

కామెడీ అనుకున్నా, అంతవరకూ బానే ఉంది. కానీ, జరుగుతున్న అల్లర్ల వైఖరి చూస్తుంటే నిజంగా సిగ్గేస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్సు లోనే వెనక నుండి పొడిచేందుకు రెడీగా ఉన్న అమలాపురం హర్షకుమార్ లాంటి వాళ్ళు దీన్ని భీకరంగా రాజకీయం చేస్తున్నారు.

 1. అంబేద్కర్ పై విమర్శలు చేస్తే ఆటోమెటిగ్గా దళితులకి వ్యతిరేకుడైపోతాడా ? దళితులకి అన్యాయం చేస్తున్న అసలు పెద్దమనుషులు ఎవరు ? అంబేద్కర్ నెత్తి మీద పాలు చిలకరించినంత మాత్రాన దళిత-బాంధవులైపోతారా ? ఏవో రెండు పథకాలకి అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన దళితులని ఉద్ధరించినట్లా ?
 2. దేశప్రజలు నిజంగా ఇంత వెర్రివాళ్ళు అని భావిస్తున్నారా మన రాజకీయనాయకులు ? అసలు ఫ్యూడల్ పద్ధతిలో ఆలోచిస్తున్నదెవరు ?
 3. సరే అంబేద్కర్ని విమర్శించాడనే అనుకుందాం. కానీ, ఎం.పి పదవికి రాజీనామా ఎందుకు చెయ్యాలి ? ఈ విధమైన డిమాండు చెయ్యడంలో అర్థం ఏమిటి ? ఇటువంటి డిమాండు మరేదేశంలోనైనా (అమెరికా, ఇంగ్లాండు, జపాను..) ఎవ్వరైనా చెయ్యగలరా ? ప్రజా ప్రతినిధులకు భావ స్వాతంత్ర్యం లేదా మన భారతదేశంలో ? ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం ఏమిటి ?
 4. తెలుగుదేశం వాళ్ళు మూతులకి నల్లటి తొడుగులు ధరించి ఊరేగింపు చెయ్యడం ఏమిటి !? వీళ్ళ నోర్లు ఎవరన్నా నొక్కేసారా ? జరిగిందంతా రివర్సులో కదా.
 5. దళిత ఉద్యమాల్లో పనిచేస్తున్న మేధావులందరూ ఒకసారి సద్విమర్శ చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ళకు కూడా మీరు దళితల బ్రతుకుల్లో ఎందుకని ఏమీ మార్పూ తీసుకురాలేకపోతున్నారు ? అంబేద్కర్కి వారసులమని గుండె మీద చెయ్యవేసుకుని చెప్పుకోగలరా ?
 6. దేశ జనాభాలో 15% శాతం ప్రజలకి అంబేద్కర్ మించి ఒక ఆరాథ్యుడు / మార్గదర్శి లేడా ? దళిత రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు – వీరిలో ఎంతమందికి విగ్రహాలు కట్టించారు, పాలాభిషేకాలు చేస్తున్నారు ? ఒక మహాసముద్రం లాంటి ప్రజానీకాన్ని ఇలాగ ఒక మనిషితో స్టీరియోటైపు చెయ్యడం ఎంతవరకు సమంజసం ? ఈ స్టిరియోటైపు మించి ఆలోచించలేని వారా మనకు నాయకులు ?
 7. ప్రజలు నిజంగా అంత మొద్దులని భావిస్తున్నారా మన నాయకులు ? కొంత కళ్ళు తెరిచి చూడడం మంచిది. దేశం మారుతోంది. ప్రజలు విద్యావంతులవుతున్నారు. మనం మరో యుగంలో ఉన్నాం. వందేళ్ళ కిందటి ఫ్యూడల్ మనస్తత్వాలతో రాజకీయం నడపడం ఇప్పుడు చేతనవదు. కొంత, వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడడం మంచిది.

కుల-మ్యూజికలు-ఛైర్సు

తెలుగునేలమీద బ్రతికే కమ్మవాల్లకి నమస్కారాలు,రెడ్డి కులస్తులకి విడిగా వేరొక నమస్కారాలు, కాపులకి నమస్కారాలు, శెట్టి-బలిజ కులస్తులకి నమస్కారాలు. మాలవారికి నమస్కారము, మాదిగలకు విడిగా మరొక నమస్కారము, బ్రాహ్మణులకి (మిమ్మలినెలా మర్చిపోతాము) నమస్కారాలు. చిన్నపాటి సంఖ్యలతో వేగుతూ మెజారిటీ లేని “వగైరా” కులస్థులకి వేవేల ప్రత్యేక నమస్కారాలు.

స్టేజిమీద పెద్దలందరికి పేరు పేరుగా దండాలు చెప్పడం మన సంప్రదాయం కనుక, ఒక బ్లాగుటపా రాసేముందు ఈ విధంగా బ్లాగోదండకం చదవక తప్పదు. క్షమించండి.

ఇక విషయమేమిటంటే, మన ఆంధ్రదేశంలోని రాజకీయకుళ్ళు యొక్క వెగటి వాసనలు ఎక్కడో దేశాలుదాటి బ్రతుకుతున్న మాలాంటివాళ్ళ ముక్కుప్రుటలని కూడా అధరగొట్టేస్తున్నాయి. అస్థిత్వం ఏమిటొ అర్థంకాక “మాజీ తెలుగువాళ్ళం” అయిపోతామేమోనన్న బెంగతో కాలం గడుపుతున్న మాలాంటివాళ్ళ నాలికలకు “అసలు తెలుగు అస్థిత్వం అనేదే లేదురా గురుడా” అనే నిఖార్సైన నిజం చాలా తీపిగా తగులుతోంది.

చిరంజీవి పార్టి పెడతడంట ! మంచిది. రానివ్వండి ముందుకి !! సీ.యెం అయ్యే హక్కు ఒక్క రెడ్డి కులానికి, కమ్మ కులానికి రాసిపెట్టిన హక్కు ఏమీకాదుగదా. దక్షిణాన ఉన్న తమిళనాడులో ఇప్పటికే మూడువేల మున్నేట్ర-కజిగాలు రాజకీయంలో రాటుదేలి ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో రెంటితో సరిపెట్టుకోవడం ఎందుకు ?

ఎప్పుడో అరవై ఏళ్ళకిందట, తెల్లవాడిముందు అందరూ సమానంగా సిగ్గుపడింది ఎవ్వడికి గుర్తుంటుంది ? ఆ అవమానాలు భరించడానికి రెడ్డి/కమ్మ/కాపు తారతమ్యం ఏమన్నా అడ్డొచ్చిందా ? మన స్వాతంత్ర్యపోరాటంలో, అందరూ కలిసికట్టుగా ఎదురునిల్చాము గనకే చివరికి ఒక భారతీయత అనేది దక్కింది. ఇంత సాధించిందెందుకు ? అరవై ఏళ్ళ తరువాత కూడా ఇలాగ కులాలంటూ ఎలెక్షను గేములు ఆడుకోవడానికి మరి !

చిన్నప్పుడు “మ్యూజికలు ఛెయిర్సు” అంటూ మూడు ఛైర్ల చుట్టూ నలుగురం పరిగెట్టేవారము. మ్యూజిక్కు ఆగిపోవగానే అందరూ చైర్లమీద పడతారు. ఒక్కడుు అభాగ్యుడు చైరులేక బయటకి పోతాడు. ఈ ఆట ఆడగా ఆడగా, ఒక్క లక్కీ ఫెలోకి రాజభొగ్యం లాంటి ఆఖరి చైరు దొరుకుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తమాష ఒక పెద్ద కుల-మ్యూజికలు-ఛైర్సు ఆటలాగ ఉంది. ప్రజాస్వామ్యము అంటూ డాంభికాలు పోవడమే తప్ప, కొద్దిగానన్నా ప్రజలచే పాలన చేయించడం ఇప్పటి సరుకుగాదు. కనీసం ఒక టార్గెట్టు కూడా కాదు.

కళాకారులన్నాక ఒక ఆశయంకోసం పనిచేయడం పాతపద్ధతి. బుర్రలో ఏమీ ఉండనవసరంలేదు. మాటగడసరితనం ఉంటే చాలు, రైటర్లయిపోవచ్చును. భావ వ్యక్తీకరణా లాస్యం అక్కర్లేదు, కొంత ఎర్రగా-బుర్రగా ఉంటే చాలు, ఏక్టర్లయిపోవచ్చును. రాజనీతి తెలియనక్కర్లేదు, సరైన చుట్టరికాలుంటే చాలు, మినిష్టర్లయిపోవచ్చును. ఇదీ ప్రస్తుతం మన తెలుగు సమాజ సంపద.

సినీ అభిమాన సంఘాలు కులసంఘాలు. ప్రవాసాంధ్ర సంఘాలు కుల సంఘాలు. ఇప్పుడు చివరికి న్యూసుపేపర్లు కూడ కుల పేపర్లుగా తయారవుతున్నాయి. ఇలాంటి ఔన్నత్యం వెలగబోస్తున్నందుకు వారి వారసులను చూసి, మన స్వాతంత్ర్య సమరయోధులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు అక్కడ స్వర్గంలో !!

తెలుగువాడినైనందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఈ బ్లాగుముందు, నా నమస్కారాలని అందిపుచ్చుకున్న వారందరికీ ఇందుకని కృతజ్ఞతలు.

కుల అస్థిత్వం చీదరించుకుని నా నమస్కారం పుచ్చికోనివారికి నా ఆలింగనలు.

ఇది ముగింపు కాదు

గోకుల్ ఛాట్ లో సమోసా రగడా తినడం, సాయంకాలపు చిరుగాలిలో హుస్సేన్ సాగరం వీక్షించడం.. నాకున్న చిన్నపాటి సంపదలు. తీపి జ్ఞాపకాలు. ఇవేమీ ఎవ్వరినీ హాని కలిగించేవి కావే ! వీటిని ప్రేమించడమే పాపమైపోయిందా ?

నిన్నటి న్యూసులో చదివినది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నలభై మంది అకాలమరణం చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారు మరెంతోమంది. శరీరానికి కాకపోయినా, మనసుకి గాయాలైనవారు ఇంకెంతమందో !

ఏమిటీ అఘాయిత్యం ! మొన్నటికి మొన్న మక్కా మసీదులో బాంబులు. ఇప్పుడు నగరమంతా పేళుల్లు. ఎక్కడికి పోతోంది మన భాగ్యనగరం ? భారతదేశం ఆధునిక యుగంలోకి ముందడుగు పెట్టే కుడికాలు ఈ హైదరాబాదు నగరమని కలలు కన్నామే. ఈ కాలుని నరికేద్దాం అనుకుంటున్నారా ? ఎవ్వరు ఈ రాక్షసులు ?

మన నాయకులందరు కులాలు అంటూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. కమ్మ, రెడ్డి, కాపు .. ఎవిరికివారు వేరు పత్రికలు, వేరు రాజకీయ పార్టీలు, వేరు సినీ తారలు. వీటితో చాలదన్నట్టు మతం కోసం పార్టీలు (మజ్లిస్, భాజపా) తెలంగాణాఅంటు ఇంకొకళ్ళు (తెరాస) అమెరికాని ఎదిరించాలంటూ ఇంకొకళ్ళు (కమ్యూనిస్టులు) మన నాయకత్వ శిఖామణులు ఏమి సాధిస్తున్నారు ? ఎవ్వరిని సాధిస్తున్నారు ?

ఎక్కడో గుజరాతులో ఎలక్ట్రానిక్సు చదువుకుంటూ హైదరాబాదుకి టూరు వేసుకుని వచ్చారు విధ్యార్థులు కొందరు. అందులో నలుగురు మృతి. ఇంజనీరింగులో రాంకు తెచ్చుకుని, కాలేజీలో సీటు ఖరారు చేసుకుని అకాలంగా చనిపోయినవాడు ఇంకొకడు. మెడిసిను పూర్తి చేసుకుని దేశానికి వైద్యసేవలందించాల్సినవాడు ఇంకొకడు మృతి. రాఖీ కొనుక్కుందామని వెళ్ళిన అన్నాచెల్లెళ్ళు ఇద్దరు. కోఠీలో పుస్తకాలు కొనుక్కుందామని వెళ్ళి బలైన విద్యార్థులు ఇంకొందరు. సరదాగా గోకుల్ ఛాట్ తిందామనుకోవడమే పాపమైపోయిందా ? ఇలాంటి పసివాళ్ళను, భావి భారత ఆశాకిరణాలను చంపేసారు ఎవ్వరో ఈ రాక్షసులు !!

ఎవ్వరు మనకి ఈ ప్రప్రథమ శత్రువులు ? సర్వమత సామరస్యానికి వేదికై, పేదవాళ్ళు కూడా ప్రజాస్వామ్యం నిలుపుకోగలరు అని నిరూపించిన మన భారతదేశం అభివృద్ధిని చూసి ఓర్వలేని ఈ రాక్షసులు ఎవ్వరై ఉంటారు ? నాయకులమని చెప్పుకుంటున్నవారు కొంత బుర్రపెట్టి ఆలోచించాలి.
ఇది ఒక యుద్ధం. మన భారతదేశానికి స్వాతంత్ర్యం తేరగా రాలేదు. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలిన కూడా తేరగా రాబోదు. రాబందులలాంటి శత్రువులు ఎప్పటికీ కాపేసి ఉంటారు. ఈ బాంబు పేళుల్లు ముగింపు కాదు, ఇలాంటివింకెన్నో కష్టాలు మనం భరించక తప్పదు.

కులాలు, మతాలు లాంటి వేషమ్యాలు విడిచిపెట్టి మనం కొంత స్వాతంత్ర్య స్ఫూర్తిని చూపించాలి. ముఖ్యంగా హైదరాబాదులో ఉన్న ముస్లిం సోదరులని దగ్గర చేసుకోవాలి. ఇస్లాంకి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి అంతరంగానికి సంబంధించిన మతం. రెండోది పరుషమైన రాజకీయ రంగం. ఈ రెండింటినీ విడదీయాలి. ఇస్లాంతో రాజకీయం చేస్తున్నవారు అందరూ పాముతో చెలగాటమాడుతున్నవాళ్ళు. ఈ పార్టీలను వెంటనే నిర్మూలించాలి – మజ్లిస్ లాంటి పార్టీలను, స్టూడెంటు పార్టీలను, లైబ్రరీలు అంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న పార్టీలను అందరినీ నిర్మూలించాలి. ముస్లిం ప్రజలను ప్రథాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావాలి. ముస్లిం అవ్వడం భారతీయతకు ఏమాత్రం అవరోధం కాదని, వారందరూ పదహారణాల భారతీయులని నమ్మకం కలిగించాలి. లేదంటే ముస్లిం చంచా పార్టీలు – వెనకాల ఊపందించే పాకిస్తాను, బంగ్లాదేశు – ఆ చెంచాలకి పాలుపెట్టి పోషిస్తున్న అరేబియ, చైనా ఇంకా మిగతా దేశాలు – వాటికి ఆకర్షితులవుతారు. ఇది చెయ్యలేని పార్టీలు ఉండి దండగ. కులాలు అంటు కొట్టుకోవడం తప్ప నిజమైన శత్రువులని ఏమాత్రం ఎదిరించలేని చేతగాని దద్దమ్మలు మన రాజకీయ నాయకులు.

ఒకనాటి స్వాతంత్ర్య పోరాటంలో కులాలు అంటూ కొట్టుకుని వుంటే బ్రిటీషువారిని ఎప్పటికైనా ఎదిరించగలిగి ఉండేవాళ్ళమా ? టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి, అల్లూరి సీతారామరాజు లాంటివాళ్ళు కావాలి మనకి నాయకుల క్రింద.