
గత సంవత్సరం నుండి కేంద్రప్రభుత్వం వారి చొరవ వలన వివిధ వృత్తివిద్యలను భారతీయభాషలలో విద్యార్థులకు అందించాలని గొప్ప ఉద్యమం మొదలైనది. బెనారస హైందవ విశ్వవిద్యాలయం వంటి కొన్ని ఉన్నతవిద్యాసంస్థలు సాహసాత్మకంగా యంత్రనిర్మాణ (ఇంజనీరింగ్) విద్యావిభాగాలను హిందీ భాషలో అందించడానికి మొదటి అడుగు వేసాయి. వృత్తివిద్యలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను అనువదించడము, క్రొత్త పుస్తకాలను భారతీయభాషలలో రచించడము, ఉపన్యాసాలను చిత్రికామాధ్యమంగా అభిలేఖించడము ఇత్యాది కార్యవిశేషాలను కేంద్రీకృతముగా నడుపుటకు, భారతీయభాషామాధ్యమంలో విద్యాబోధనను అభివృద్ధి చేయుటకు క్రొత్త క్రొత్త ప్రభుత్వసంస్థలు ఏర్పడ్డాయి. ఈ ఉద్యమం అతి ఆలస్యముగా మొదలైనను, భాషాస్థిత్వానికి కొసంతన్నా రక్షణగా ఇలా ఒక్క క్రొత్త ఆశ చిగురించింది. మన ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వము వారు కొన్నేళ్ల క్రిందటనే తెలుగుమాధ్యమానికి పూర్తిగా పాడి కట్టాలని యోచన తలపెట్టారు. దానితో పోలిస్తే ఈ భారతీయభాషామాధ్యమం యొక్క చిగురాకులు భాషాభిమానులకు రవ్వంత స్వాంతనము కలుగజేసేవే!
గత వారంలో ఈ భాషోద్యమంలో భాగంగానే మధ్యప్రదేశ రాష్ట్రంలో వైద్యవిద్యలను కూడా హిందీభాషలో అందించుటకు అక్కడి ప్రభుత్వము నడుము కట్టింది. త్వరలోనే వైద్యవిద్యాగ్రంథాలను బోధనాసామగ్రిని హింద్యాది భారతీయభాషలలో అనువదించుటకై కేంద్రప్రభుత్వము నుండి ఉత్తరువులు ఇవ్వబడినవి. ఈ ఉద్యమానికి ప్రజాబాహుళ్యం నుండి అభినందనలు ఆశీస్సులు లభిస్తున్నా, కొన్ని వర్గాల నుండి మాత్రము విపరీతమైన విమర్శలు, నోతివిరుపులు తప్పుట లేదు. ఈ వ్యాసంలో ఈ విమర్శలకు ప్రత్యుత్తరమిచ్చి భారతీయభాషామాధ్యమంలో విద్యాబోధన యొక్క భవిష్యత్తు ఎలా ఎదగగలదో వివరిస్తాను.
మన చేపట్టిన పనిముట్లవలే మనము రూపొందుతాము. ముందుగా మనము మన పనిముట్లను మలుచుతాము. తరువాత అవి మనలను మలుచుతాయి.
మార్షల్ మక్లుహాన్, కెనడాదేశస్థుడైన తాత్వికుడు మాధ్యమసిద్ధాంతీకరుడు
భాష మనిషి చైతన్యానికి ప్రతీక మరియు ఆనబద్ద. భాష ద్వారానే భావవివేచనము కలుగుతుంది. మనిషి యొక్క విలువలు, ఆశయాలు మాట్లాడే భాష ద్వారానే రూపొందుతాయి. కనుక భాషనే సర్వ సాంస్కృతిక వికాసానికి పునాది అని అనవచ్చును. కెనడాదేశస్థ తత్వవేత్త యైన మార్షల్ మక్లుహాన్ మనిషి చైతన్యపరిక్రమకు తను వినియోగించే పనిముట్లను ఆనగా పేర్కొన్నాడు. ఈ సాధనసంపత్తిలో సర్వోత్తృష్టమైనది సూక్ష్మాతిసూక్ష్మకారకమైనది భాష. ఈ వివేకము భారతీయజ్ఞానపరంపరలో అనాదిగా పొదిగియున్నది. భర్తృహరి తన వాక్యపదీయములో భాష అనే మాధ్యమం గుండా చైతన్యము యొక్క ఉజ్జీవనము ఎలా జరుగుతుందో విస్తృతముగా వివరించియున్నాడు. ఈ వివేకము జీర్ణించిననాడు వృత్తివిద్యలు ఉన్నతవిద్యలు మాతృభాషలో ఎందుకు ఉండాలి యన్న ప్రశ్నయే ఉదయించదు. ఎందుకనగా భాష కోల్పోయిననాడు మనిషి అస్థిత్వమే అక్కడ ప్రశ్నాస్పదమగుతుందని అభిజ్ఞాతమవుతుంది. కానీ ఈనాటికాలంలో అర్థార్జనే ధర్మానికి ఆద్యంతములన్న మూఢాతిశయసంభ్రమము చెందినవారే అధికులు. కనుక వారి వాదనలకు క్రమానుక్రమంగా ప్రతివాదనలు ఇవ్వక తప్పదు.
ఆంగ్లమాధ్యమం ఆర్థిక ప్రగతికి అవసరము: ఈ వాదన చేస్తున్నవారు ప్రపంచములో ఆర్థిక ప్రగతిని గడించిన తూర్పు ఆసియా దేశాలను పట్టించుకోరు. వారంతా తమ స్వీయమాతృభాషలలోనే వృత్తివిద్యలనభ్యసించి యాంత్రీకరణము, ఎగుమతులనందించే పరిశ్రమలు, సేవారంగములు యావత్తూ తమ స్వంతభాషలలోనే నడుపుకుంటున్నారు. మన భారతదేశంలో ఉన్నతపరిశ్రమలు ఆంగ్లములో నడుపుతున్న కారణాన 90% ప్రజలు వీటిలో పాలుపంచుకోలేకపోతున్నారు. ఆంగ్లములో మాట్లాడగలువారు సైతము భాషాప్రతిభ లేని కారణాన తమ కార్యనిర్వహణలో సృజనశీలురుగా రాణించలేకపోతున్నారు. ఇది స్వీయ తప్పిదమే! మన ఆర్థికప్రగతి గతిలో కనీసము 3-5% పాళ్లు ఈ ఆంగ్లపు సంకెళ్ల ద్వారా కోల్పోతున్నట్లు మనము గ్రహించాలి. ఇటువంటి భాషాబానిసత్వము తదోత్పన్నమైన ఆర్థికవైకల్యము వలసకారుల వశీకరణకు వశమైన దేశాలనన్నింటిలోను చూడవచ్చును. మన దేశము వీటికి విరుద్ధము కాదు. స్వీయభాషాల సముద్ధరణము నిర్వశీకరణకు అతిప్రధానమైన అంశము.
భాషాబాహుళ్యమున్న మనదేశానికి అనుసంధానభాష అవసరము, అది ఆంగ్లమే: ఈ అనుసంధానభాష వృత్తివిద్యలలో ఎటువంటి భాష మాధ్యమముగా ఉండాలన్న అంశానికి లంబకోణముగా సంబంధరాహిత్యముగానున్న అంశము. అనాది చరిత్రగల మనదేశ సాంస్కృతిక పరంపర, సారస్వతవారసత్వము ఇటువంటి అనుసంధానభాష లేకనే వచ్చాయా? పరాయి భాషలైన ఆంగ్లము, పారశీకము ప్రజానీకాన్ని సాంతము అనుసంధానింపగలవా? ఇది మూఢాతిమూఢమైన వాదన, కానీ భావదాస్యము వలన మేధావులు అనేకులు ఇలా ఆంగ్లపక్షపాతులై వాదిస్తున్నారు. మన దేశానికి నిస్సందేహముగా అనుసంధానభాష సంస్కృతము. దానికి తోడుగా కాలానుగతముగా ఏదో ఒకానొక ప్రాకృతము పండితపామరబేధము లేకుండా ప్రజలనందరినీ కలుపుతూ వచ్చింది. ఈనాటి కాలంలో ఇది నిస్సందేహముగా కౌరవీ ప్రాకృతము, అనగా హిందీ భాష. ఈ హిందీ-సంస్కృత భాషాద్వయము చేతనే యావత్భారతము అనుసంధానింపబడగలదు. కానీ మునుపు వాదించినట్లు ఈ అనుసంధానభాష విద్యామాధ్యమభాష కానేరదు. సర్వ ప్రజలు తమ తమ మాతృభాషలలోనే అత్యున్నత విద్యాప్రతిభ పొందగలరు, ఆపై వివిధ ఆర్థికరంగములలో ఆచారవ్యవహారములలో రాణించగలరు.
ప్రభుత్వపరంగా సమస్యలను పరిష్కరించుటకు దేశవ్యాప్తముగా సామరస్యము పొందుటకు వృత్తివిద్యలయందు ఏకభాషనే ఉండవలెను: ఇది సంపన్నహీనమైన రాజ్యములయందు ఒకానొక కాలములో చెల్లుబాటైన వాదనే, కానీ ఈనాటి మన ఆర్థికపరిపుష్టికి అందుబాటులోనున్న సంగణక సాంకేతికసాధనాసామాగ్రికి సమయోచితము కాదు, కేవలము జంకుబాటు. ప్రపంచములో అనేక దేశములలో ప్రభుత్వయంత్రాంగము న్యాయవాదయంత్రాంగము బహుభాషామాధ్యములలో లభ్యమవుతున్నాయి. మేలైన ఉదాహరణ స్విస్ దేశము, అక్కడ మూడు భాషలు సమానాధికారము కలిగి సర్వప్రభుత్వసదుపాయాలను పౌరులకు అందిస్తున్నాయి. అట్లే ఐరోపా ఐక్యసమితిలో వివిధ ఐరోపాభాషలలో ప్రజలకు సేవలు అందుతున్నాయి. మనదేశములో సంస్కృతభాషావారసత్వఫలము వలన ఇది మరింత సులభతరమైన అంశము. ఉచ్ఛన్యాయస్థానాలు, ప్రభుత్వవ్యవస్థలు ఆంగ్లములోనే సేవలనందించడం దాస్యభావన మాత్రమే. ఇది ఇప్పటికీ కొనసాగడము, వృత్తివిద్యలు మాతృభాషల్లో అందలేకపోతుండము మన దౌర్భాగ్యము. ఇది మూర్ఖత్వము తప్ప మరేదీ కాదు.
భాషోద్ధారణము మంచిదే, కానీ పాఠ్యపుస్తకాలేవి? విద్యావనరులు లేకుండా భారతీయభాషామాధ్యమాలలో వృత్తివిద్యలు ప్రవేశపెట్టుట మూర్ఖసాహసము: ఇది సహేతుకమైన వాదనే, కానీ విజయవంతముగా స్వీయభాషామాధ్యమాలలో వృత్తివిద్యలను నడుపుకుంటున్న ఐరోపావాసులు లేదా తూర్పు ఆసియావాసులు ఎలా పాఠ్యపుస్తకాలను విద్యావనరులను తమ భాషల్లో తెప్పించుకుంటున్నారు, ఆ ప్రక్రియలు మన భారతీయభాషలకు కూడా అన్వయించుకోవచ్చునా అని పరిశీలించాలి. ఆశ్చర్యావహమైన విషయమేమిటంటే పాఠ్యపుస్తకాలు ఎల్లప్పుడూ విద్యావ్యవస్థ మాతృభాషల్లో మల్లిన తరువాతనే వస్తాయి, మునుపున కాదు. విశ్వవిద్యాలయాల్లో విద్యాక్రమము నడుస్తుండగా, ఆచార్యులు ఉపన్యసిస్తుండగా, విద్యార్థులు తమ విద్యావిభాగాలలో పరీక్షలు మరియు పరిశోధనాపత్రాలు వ్రాస్తుండగా, ప్రయోగశాలలో పరిశోధనలు జరిగి శాస్త్రీయపత్రాలు విషయసమీక్షలు సర్వము మాతృభాషల్లో జన్మిస్తుండగా, ఇలా కాలక్రమేణా పాఠ్యపుస్తకాలు కూడా మాతృభాషల్లో ప్రచురింపబడుతుంటాయి. సంగణనశాస్త్రం సూక్ష్మజీవాణుశాస్త్రం వంటి ప్రచండవేగంతో ఉద్గమిస్తున్న వైజ్ఞానికరంగాలలో నూతన పాఠ్యపుస్తకాలు కాలానుక్రమముగా వస్తూ ఉండాలి. మొదట ఇటువంటి పుస్తకాలు ఆంగ్లములోనే ఉన్నా విద్యాబోధనము మాత్రము స్వీయభాషలలో నడుస్తుంది. ఒకసారి పాఠ్యపుస్తకాలు ప్రచురింపబడిన పిదప కూడా వివిధ ఆంగ్లగ్రంథాలు, శాస్త్రీయపత్రాలు సంప్రదింపుకై విద్యార్థులకు సూచింపబడుతూ ఉంటాయి. విద్యార్థులు కూడా ఆంగ్లములో ప్రవేశము కలిగియున్నప్పటికీ భావవ్యక్తీకరణలో సౌలభ్యము కొరకు తమ మాతృభాషలనే మెగ్గుచూపుతూంటారు. ఈ బోధనాపద్ధతులు, వ్యవహారాలు ఆంగ్లేతర సమాజంలోని ఎటువంటి దేశానికి వెళ్లి దర్శించినా అవగతమవుతుంది. దురదృష్టవశాత్తూ మన “మేధావులకు” ఇటువంటి ఆంగ్లేతర విశ్వవిద్యాలయందు పరిచయము అత్యల్పము. నేను పదిహేనేళ్లకు పైగా ఐరోపాలో నివశించుట వలననూ, ఫ్రెంచి జర్మన భాషలలో విద్యాబోధనావిధానములను సునిశితముగా చూసినవలననూ ఇది నాకు తేటతెల్లముగా వ్యక్తమగుతున్నది. గత నాలుగేళ్లుగా వైకల్పితవాస్తవికము, కృత్రిమమేధ వంటి అతిపురోగతమైన పాఠ్యాంశాలను స్వయముగా జర్మనభాషలో జర్మన విద్యార్థినీవిద్యార్థులకు బోధించిన మూలముగా ఈ విధానాలు స్వీయాచరణచే కూడా నాకు తెలిసి వచ్చాయి. కానీ ఈ దృష్టి రావడానికి నాకు కూడా పదేళ్లు పట్టినది. ఇక ఆంగ్లభాషాదాస్యములో మునిగితేలుతున్న మన మేధావులకు ఈ స్పృహ కలుగకపోవుటలో ఏమాత్రము ఆశ్చర్యము లేదు.
భాషోద్ధారణమనగా ఏ భాషలకు, మాండలికాలకు చెయ్యాలి? ఆంగ్లము బదులు మరొకరి భాషను రుద్దడము సామాజిక అన్యాయము కాదా?: ఈ వాదన బ్రిటిషువారి కపట రాజనీతి వలన మన దేశములో చొచ్చుకువచ్చిన కులకుంపటి వలన మరీ చెలరేగిపోతున్నది. అంబేద్కరు వంటి మహాశయుడు కూడా ఆంగ్లమును సామాజిక పురోగమనానికి సమానత్వానికి వారధిగా చూసాడు. అది మన దురదృష్టము, నిజచరిత్రలో ఆంగ్లేయుల అమానుషాలకు అణగారిన నిమ్నవర్గాల స్మృతికి ఇటువంటి వాదనము అపరాధము. కానీ అంబేద్కరు విశిష్టమేధావి గనుక ఆయన అదే క్రమంలో సంస్కృతమును ద్వేషభావనతో చూడలేదు, దేశ సామరస్యానికి సారస్వతవారసత్వానికి నిజాయితీయైన దేశభాషగా సంస్కృతమొక్కటే మనగలదని ఆయన విశ్వసించాడు. కానీ ఆంగ్లేయులు రుద్దిన మరొక జాడ్యము ఆర్యుల వలస సిద్ధాంతము. మూలముగా పచ్చి జాత్యహంకారము నుండి బయలుదేరిన ఈ సిద్ధాంతము బిషప్ కాల్డ్వెల్ వంటి జాతివాదుల చలువ చేత భాషాశాస్త్రములో కూడా అడుగిడింది. పెరియార్ మొదలుకొని అనేకులైన ద్రవిడజాతీయవాదులను ప్రభావితం చేసింది. నిజానికి సంస్కృతశబ్దకోశములో ఇతర ప్రాపంచికభాషల పాలు అత్యల్పము. దాక్షిణాత్యభాషలలో క్రియాపదాలు సహితము శబ్దకోశమంతా సంస్కృతముతో పెనవేసుకుని ఉన్నది. ఈ శబ్దజాలమంతా భారతభూభాగంలో జనించినదే, మునుపు చెప్పినట్లు ఐరోపాభాషలతో సహసాంగత్యము కల పదాలు వ్రేళ్లతో లెక్కించబడునట్లవి. కనుక ఆర్యులు ఎక్కడనుండి వచ్చారన్న విషయం భారతీయభాషా పరంపరకు సంబంధించినంత వరకు సందర్భాతీతమైనది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన శాస్త్రకావ్యసంపత్తి మన భాషలకు సొంతము, ఆ పరంపరను చూస్తే మన భాషలన్నింటా సంస్కృతము యొక్క ప్రభావము, ఇచ్చిపుచ్చుకలు అనాదికాలం నుండి కనపడుతాయి. కనుక ఇది క్రొత్త విశేషమేమీ కాదు. స్వభావతః మనము భారతీయులము సంస్కృతము యొక్క పుత్రులము. ఈ నైజమునే నూతన శాస్త్రీయ వైజ్ఞానిక శబ్దనిర్మాణమునకు రప్పించడము అతి సహజమైన విషయము. అలాగని దేశ్యగ్రామ్య పదజాలాలను చులకన చూడనవసరము లేదు. ఇవన్ని పదాలు మన సంస్కృతి యొక్క చిహ్నాలే, మన పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వమే. ఇది మంచిది అది కాదు అని గిరి గీసుకోవడమే వెఱ్ఱితనము. ఎటువంటి భాషలోనన్నా సందర్భానుసారముగా పర్వతాల వంటి ప్రౌఢమైన శబ్దజాలమో, పైరగాలి వంటి తేలికైన మాటలనో వాడతాము. ఈ రెంటినీ రంగరించి సొంపైన మాటల కూర్పు చేయువాడే సుకవి. ఇది ఆంగ్లములోనూ కనపడుతుంది, కానీ శాస్త్రీయ పరిభాషను దినదినము ఆంగ్లములో వినుట వలన గ్రీకు లాటిను ఇత్యాది వారి పారంపరిక భాషల నుండి జనితమైన ఆ శబ్దాలు మనకు మొరటుగా ఆనవు. మన భాషలోనే పుట్టించిన శబ్దాలు మొదటితనం మూలముగా కరుకుగానో మోటగానో అనిపిస్తాయి: అవి దేశ్యశబ్దముల నుండి జన్మించినా, శ్రేష్టసంస్కృతసమములైనా. ఈ మొదటిదనపు ఎడబాటును దాటి భాషాప్రవాహానికి కంచె తీయాలి. అప్పుడు అన్ని దేశీయ భాషలు, అన్ని మాండలికాలు పైకి లేస్తాయి. ప్రామాణికమైన ప్రౌఢమైన భాష సహజముగానే ఒకటి స్థిరపడుతుంది. కానీ భాషను మాట్లాడే ప్రతివాడు తన స్వీయదృష్టిని వ్యక్తీకరణాస్వేచ్ఛను ప్రదర్శించకపోడు. ఇందులో కొందరు అక్కడక్కడా పరభాషాపదాలను కూడా వాడవచ్చు, తప్పేమీలాదు. కానీ స్వీయవారసత్వాన్ని కాలదన్నడము, సంస్కృతము ద్వారా భారతీయభాషల మధ్యనున్న అన్యోన్యతను గుర్తించకపోవడము సొంత అమ్మను దూషించడం వంటివి. ఈ వెఱ్ఱివేషాలను భాషాభిమానులు మానుకోవాలి.
మాతృభాషమాధ్యమంలో విద్యాబోధన ప్రాథమికవిద్యలోనే అవసరము, ఉన్నతవిద్యలకు వృత్తివిద్యలకు అనవసరము. అంతగా కల్పించాలనుకుంటే సాంఘికశాస్త్రాలలోనో సాహిత్యశాస్త్ర విభాగాలలోనో పెట్టాలి, యంత్రనిర్మాణ వైద్యశాస్త్రాలలో పెడితే విద్యాప్రమాణాలు దెబ్బ తింటాయి: ఈ వాదన చేసేవారు కూడా అత్యధికులు ఆంగ్లేతర దేశాలలో విశ్వవిద్యాలయాలు పనిచేసే తీరును దర్శించినవారు కాదు. కేవలం ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో ఉండినట్లైతే విద్యార్థులకు సహజముగానే తమ మాతృభాషపై న్యూనతాభావము ఏర్పడుతుంది. సమాజములో గుర్తింపుకు, ధనార్జనకు పనికొచ్చే వృత్తివిద్యలు ఏ భాషలో లభ్యమవుతుంటే ఆ భాషకు మర్యాద లభిస్తుంది. స్వాభిమానం కల ఏ జాతియైనా యోచించవలసిన విషయమేమిటంటే తమ మాతృభాషకు ఎందుకు ఆ మర్యాద దక్కలేదు అని. ముఖ్యముగా కోట్లాది ప్రజలు మాట్లాడు భాషలు, సమృద్ధమైన ప్రాకృతికసంపత్తి, ఆర్థికప్రతిపత్తి గల భాషలు అన్ని వృత్తివిద్యలను శ్రేష్టాతిశ్రేష్టమైన విశ్వవిద్యాలయాలను కలిగియుండాలి. అవి లేవు అంటే ఆ భాషను మాట్లాడే ప్రజల న్యూనతాభావనకు భావదాస్యానికి నిదర్శనలు. ఇజ్రాయెల్ దేశంలో ప్రాచీన హీబ్రూ భాషను పునరిద్ధరించినప్పుడు, మాట్లాడే ప్రజల సంఖ్య ఎంతనో లేకున్ననూ ఆ దేశపు అత్యున్నత విద్యాస్థానమైన టెక్నియాన్ యంత్రనిర్మాణవిద్యావిభాగాలను హీబ్రూభాషలో రూపొందించింది. యాంత్రీకరణ ద్వారా దేశం ఆర్థికప్రగతి సాధిస్తూండగా, ఈ భాషాప్రవాహం అన్ని సాంస్కృతిక విభాగాలకు, వాణిజ్యవిభాగాలకు చేరింది. మన భారతీయభాషల పునరుద్ధరణ మరింత సులభతరమైన కార్యము. కానీ ఇదే విధంగా పారిశ్రామీకరణము, ఆర్థిక పురోగతి సాధించుటకు మూలసాధనాలైన అన్ని విద్యావిభాగాలయందు అత్యున్నత స్థాయిలో అత్యున్నత విశ్వవిద్యాలయందు మాతృభాషలో విద్యాబోధన జరగాలి, కనీసం ప్రత్యుమ్నాయంగా లభ్యమౌతూ ఉండాలి. లేదంటే ఆత్మన్యూనత, స్వాభిమానలోపము వలన పౌరులందరిలో మాతృభాషాపాటవము కృశించి క్రమక్రమముగా ఆంగ్లపుటెంగిలి చొరబడుతుంది. ఇదే వైపరీత్యాన్ని ఈనాడు మనము మన ఉన్నతవర్గాలవారియందు అంతటా గమనిస్తున్నాము. కానీ ఇదేమీ మన పూర్వకర్మనిర్దేశితము కాదు, స్వంత చేష్టలతో చేజేతులా మనమే కల్పించుకున్నది. మిగతా దేశాలవారు అనేకులు మనలాగ మూఢులు కాదు. మనం కూడా వారిలాగే భాషలో చేతనత్వం రప్పించుకోగలము. వెనువెంటనే రాకున్నా క్రమంగా కొన్ని దశాబ్దాలకు రాగలదు. ఆ దిశలో శుభం భూయాత్ !