లేదు, పరితాపమేదీ లేదు
లేదు అసలేదీ లేదు
లేదు నాకు పరితాపం లేదు
వాళ్ళు నాకు చేసిన మంచిని కాని
కీడుని కాని, అదంతా నాకు సమానమే
లేదు అసలేదీ లేదు
లేదు నాకు పరితాపం లేదు
అదంతా భరించాను, తుడిచిపెట్టేసాను, మరిచిపోయాను
గతమంటే వెఱ్ఱి, నాకు లెక్కలేదు
నా జ్ఞాపకాలతో
నిప్పు రాజేస్తాను నేను
నా దుఃఖాలతో, నా సుఖాలతో
వాటిమీద అవసరంలేదు నాకు
తుడిచిపెట్టేసి ప్రణయాలన్నీ
వాటి అలజడులన్నీ
ఎప్పటికీ తుడిచిపేట్టేసి
సున్నాపై మొదలౌతాను నేను
లేదు అసలేదీ లేదు
లేదు నాకు పరితాపం లేదు
వాళ్ళు నాకు చేసిన మంచిని కాని
కీడుని కాని, అదంతా నాకు సమానమే
లేదు అసలేదీ లేదు
లేదు నాకు పరితాపం లేదు
ఎందుకంటే నా జీవితం, నా ఆనందం
ఈరోజు మొదలౌతోంది నీతోనే
ఎదిత్ పియాఫ్ అను మహాగాయని 1956వ సంవత్సరంలో ఫ్రెంచిభాషలో పాడిన “నోన్, జ న రెగ్రెత రియాన్” (లేదు, నాకు పరితాపమేదీ లేదు) అను ఈ పాట ఫ్రాన్సుదేశంలోనేకాదు, విశ్వవ్యాప్తంగా అతిప్రాచుర్యంలోకి వచ్చిన గీతాలలో ఒకటి. ఈ పాటని చార్ల్ ద్యుమోన్ అను సంగీతకారుడు ఎదిత్ పియాఫ్ కోసమనే కృతిచేశాడు. అప్పటికే ఆమె బాగా పేరొందిన గాయని. మొదట్లో ద్యుమోన్ ని కలవడానికి సమయంలేదని, శరీరం నీరసపడివుందని నిరాకరించిన పియాఫ్ ఈ పాటని ఆయన పియానోపై వాయిస్తే ఒకసారి విని, “మహాద్భుతం, కచ్చితంగా ఈ పాటని పాడతాను. కచ్చితంగా ఈ పాటతోనే ప్రజలందరి మనసుల్లోను గుర్తుండిపోతాను” అని అందట. ఆమె గొంతుతో, లోలోపల నుండి వచ్చిన శక్తితో నిజంగానే ఈ పాటని మధురాతిమధురంగా ఆలపించింది. ఫ్రెంచిభాషలో రెగ్రెత్ అంటే పశ్చాత్తాపం. కానీ, “జె న రెగ్రెత్ రియాన్” (నేను పశ్చాత్తాపపడట్లేదు) అంటే పదాల వెనుక ఇంకో భావం ఉంది. నేను తప్పుచేసాను అనిగాక, ఇతరులు చేసిన పనులు నాకు ఇబ్బంది కలిగించవు అని. అందుకని “పరితాపమేదీ లేదు” అను నేను తెలుగులో అనువదించాను.
ఎదిత్ పియాఫ్ జీవితంపై ‘ల మోమ్” (కుర్రది) అను ఒక సినిమా కూడా 2007వ సంవత్సరంలో విడుదలయ్యింది. పియాఫ్ పాత్రని మారియోన్ కోతియార్ అను ప్రముఖమైన ఫ్రెంచి అభినేత్రి పోషించింది. ఎదిత్ పియాఫ్ జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులను, బాధలను, ఉల్లాసాలను, అలల్లాంటి అలజడిగా సాగిన వైనాలను హృద్యంగా చిత్రీకరించారు ఈ చిత్రికలో. పాటలు కూడా ఆవిడే పాడింది. ఈ సినిమాలో “నోన్ రియాన్ ద రియాన్” అను పాటను ఆవిడ తిరిగి జీవంపోసిన వైనం క్రింద చూడవచ్చు.