నల్లటి సీతాకోకచిలుకలు
రాత్రి బాధలన్నీ కమ్ముతుండగా
గుండెనిండుగా ప్రేమిస్తాం
ఎప్పటికీ మాయమైపోవనివి
నల్ల సీతాకోకచిలుకలు
నల్ల సీతాకోకచిలుకలు
నల్ల సీతాకోకచిలుకలు
వేరే అమ్మాయిలు నిన్ను కవ్విస్తున్నారు
వేల దివ్వెలతో, జిగేలుమనే నగలతో
రాత్రినడుమన ఆకర్షిస్తున్నాయి
నల్ల సీతాకోకచిలుకలు
నల్ల సీతాకోకచిలుకలు
నల్ల సీతాకోకచిలుకలు
మసకగా ప్రొద్దుటి వేకువ వెలుగున
అద్దంలో కదలాడే అలజడి జలాన
ఆకస్మికంగా నిన్ను నువ్వు కలిసినప్పుడు
మొత్తమంతా నల్లగా
మొత్తమంతా నల్లగా
మొత్తమంతా నల్లగా
ఆపై నీ చొక్కాపై చూశావు నువ్వు
నీ గుండెకి దగ్గరగా పెట్టిన చొక్కాపై
కోటు వేసుకునే ముందున జేబుపై
నల్ల సీతాకోకచిలుకని
నల్ల సీతాకోకచిలుకని
నల్ల సీతాకోకచిలుకని
సార్జ్ గేన్స్బూర్ అను ఫ్రెంచి గాయకుడు, కవి వ్రాసిన “లే పాపియ్యోన్ నువార్” (నల్లటి సీతాకోకచిలుకలు) అను ఈ పాట 1966వ సంవత్సరంలో విడుదలయ్యింది. ఈ పాటని గేన్స్బూర్తో కలిసి ఆలపించింది మిచేల్ ఆర్నో అను గాయని. ఈమె మునుపు ఫ్రాన్సుదేశం తరుపున యూరోవిజన్ అను ఐరోపాస్థాయి గానస్పర్ధాకార్యక్రమంలో పాల్గొంది. ఈ పాట ఈ గాయనీగాయకులిద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. గేన్స్బూర్ అప్పటికే పేరొందిన సంగీతకారుడిగా, కవిగా గుర్తింపులోకి వచ్చాడు. ఇతని పాటలు పొరలుపొరలుగా నిమిడిన గూఢమైన సాహిత్యంతో, వివిధ ప్రాసాలంకారాలతో ఫ్రెంచిభాష పాటవ్యాన్ని ప్రదర్శిస్తుంటాయని అభిమానుల ప్రశంస. ఈ నల్లటి సీతాకోకచిలుకలు అన్న పాట వివాహేతర రంకుసంబంధాన్ని నిగూఢంగా వర్ణిస్తోంది. సీతాకోకచిలుకలు ప్రణయానికి, వైవాహికబంధానికి ఐరోపాసంస్కృతిలో చిహ్నం. అటువంటిది నల్లటి సీతాకోకచిలుకలు అంటే ఏదో తప్పు పని చేస్తున్న సమయానికి కలిగే భావనలకు చిహ్నంగా గేన్స్బూర్ సూక్ష్మంగా సూచిస్తున్నాడు.
ఇదే పాట “బిజూ” (మణి, ప్రేమికుడు) అను ఒక సంగీతబృందం కూడా గేన్స్బూర్ తో కలిసి పాడింది. ఆ ఆలాపనని క్రింద చూడవచ్చు.