శతాక్షర వజ్రసత్వమంత్రం
ఓం వజ్రసత్వ సమయమనుపాలయ
వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ
సుతోష్యో మే భవ
సుపోష్యో మే భవ
అనురక్తో మే భవ
సర్వసిద్ధిం మే ప్రయచ్ఛ
సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు
హూం
హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ
వజ్రీ భవ మహాసమయసత్వ
ఆః
సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు
హూం
హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ
వజ్రీ భవ మహాసమయసత్వ
ఆః
తెలుగులో అన్వయం:
ఓం వజ్రసత్వ సమయమనుపాలయ
ఓం వజ్రశక్తినిగలవాడా (ఇంద్రుడా) సాధకునికి దేవునికి మధ్యన గల యజ్ఞబంధమనే ఒప్పందాన్ని అనుపాలించు (పాటించు)
వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ
నీ వజ్రశక్తినిగలిగిన తత్వంతో నాతో దృఢంగా కలిసివుండు
సుతోష్యో మే భవ
నాయందు సంతుష్టుడై ఉండు
సుపోష్యో మే భవ
నాయందు సుపోషకుడివై ఉండు
అనురక్తో మే భవ
నాయందు అనురాగివై ఉండు
సర్వసిద్ధిం మే ప్రయచ్ఛ
అన్ని సిద్ధులు నాకు కల్పించు
సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు
అన్ని కర్మలయందు నాయందు శ్రేయస్సు (నిర్మలత్వము) కలిగిన చిత్తము (మనస్సు) కల్పించు
హూం
హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ
ఓ భగవంతుడా, అన్ని స్థితులయందు తఠస్థతతో నిండిన బౌద్ధతత్వం కల్పించు వజ్రతత్వముగలవాడా, నన్ను విడనాడకు
వజ్రీ భవ మహాసమయసత్వ
యజ్ఞబంధమనే ఒప్పందము ద్వారా వజ్రతత్వము కలిగి నాకు ప్రత్యక్షమవ్వు
ఆః
సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు
అన్ని కర్మలయందు నా చిత్తము నిర్మలముగా చేయి
హూం
హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ
భగవంతుడా, సర్వ తథాగత గుణంతో వజ్రతత్వం కలిగినవాడా, నన్ను విడనాడకు
వజ్రీ భవ మహాసమయసత్వ
మహాసమయసత్వముతో (యజ్ఞబంధముని అనుసరించిన తత్వముతో) వజ్రతత్వముగలవాడై నన్ను అనుగ్రహించు
ఆః
చీనేయగాయని సా-డింగ్-డింగ్ 2007వ సంవత్సరంలో విడుదలచేసిన “వాన్వూషెంగ్” (జీవించి ఉండడం: ఆంగ్లంలో “ఎలైవ్”) అను సంగీతముద్రణలోని ఒక సంస్కృతశ్లోకం ఇది. ఈ శ్లోకం శతాక్షర వజ్రసత్వమంత్రం అను బహుప్రసిద్ధమైన బౌద్ధమంత్రం. దీనిని గానరూపంలో ఈమె పాడి అలరించింది. ఈ మంత్రంలో వజ్రతత్వంకలిగిన ఇంద్రుని అనుగ్రహం సాధకుడు అడుగుతున్నాడు. వజ్రం ఇంద్రుని ఆయుధం కదా. ధ్యానచింతనలో ఈ “వజ్రం” అంటే ప్రగాఢమైన జ్ఞానాన్ని మనసులోకి ప్రత్యక్షింపజేసే అంతర్దృష్టి. అజ్ఞానాన్ని ఛేదించి మనోపలకాలపైన దివ్యమైన కాంతిరూపంలోని జ్ఞానాన్ని మెరుపులా ప్రత్యక్షింపజేసేదే ఈ వజ్రాయుధం. బౌద్ధమతంలో ఈ వజ్రశక్తిని కలిగిన దేవతను వజ్రసత్త్వుడని పిలుస్తారు. తనని ఒక ఉత్కృష్ఠమైన బుద్ధావతారంగా కొలుస్తారు. అటువంటి దేవతను సాధకుడు యజ్ఞబంధం అనుసరించి, నిష్ఠగా ధ్యానంచేసిన భక్తునిపై కచ్చితంగా అనుగ్రహించు అను వేడుతున్నాడు. బౌద్ధమతంలో అత్యున్నత ధ్యానతత్వాన్ని “తథాగత” అంటారు. “తఠత” అంటే ఎట్లు ఉన్నదో తఠస్థంగా అట్లే మనసులో అంగీకరించడం అని, మనోవికారాలు ఏమీ లేకుండా అన్నింటిపైన వైరాగ్యంతో కూడిన నిర్మలతత్వంతో ఉండడం అన్నమాట. మరి “గత” అంటే కదులుతూ ఉండడం, ఈ స్థితి నిదానంగా ఉండేది కాదు. ఋతుక్రమంలో కదులుతూ సమయం ముందుకువెళ్తున్నా మనస్చిత్తం మాత్రం నిర్మలంగా అట్లే ఉంటూ కదలడం అన్నమాట. అందుకని బుద్ధుడిని “తథాగతుడు” అని కూడా పిలుస్తారు.
చీనేయగాయని పాడిన స్వరాలలో సహజంగానే సంస్కృతోచ్ఛారణలో అపస్వరాలు దొర్లుతాయి, కానీ వాటికి ఇబ్బందులు పడకుండా పాటని, అనుబంధమైన చిత్రికను ఆస్వాదించండి.