పైకి చంద్రునివైపుకి
ఎడమచేయి భూమిని పట్టుంది
కుడిచేయి ఆకాశాన్ని పట్టుంది
నా అరచేతిరేఖలపై బద్దలయ్యింది
అన్నివైపులా మెరుపులాడుతూ
కాలమనే కెరటాన్ని ఏరుకుని
సంవత్సరాలుగా ఇట్టే పూతపోసి
మూడువేల జన్మలు సాంతం గడిచినా
ఇంకా మనం కలుసుకోలేదన్నట్టుగా
ఎడమచేయి ఒక పువ్వుని త్రెంచింది
కుడిచేయి ఒక ఖడ్గాన్ని ఆడించింది
ఆ కనుబొమ్మలకి మధ్యన జారింది
ఓ వేయి సంవత్సరాల మంచురేఖ
ఒక అశ్రుబిందువు
ఆహా ఆహా
నేను అవతరించాను
ఆహా ఆహా
ఎడమచేయి తాళం మ్రోగించింది
కుడిచేయి వీణాస్వరాలని మీటింది
మరుపు అనే ఓ మహానది జలాలపై
ఒక నావ తేలుతూ వెళ్తోంది
దుఃఖపులోతుల్లోనుండి కూడా
ఒక అరుణపద్మం పుట్టగలదు
ఆగవద్దు, నా మనసును కదుపు
లోలోపల పెనవేసుకున్న భావాలని
ఎడమచేయి చంద్రునివైపుకు చూపిస్తోంది
కుడిచేయి విధి యొక్క ఎర్రటిదారాలని చుడుతోంది
మనం కోరుకున్న ప్రేమని దేవతలు
నీకూ నాకూ వరమందించుగాక
మిణుకులాడుతున్నా ఈ వెన్నెలలో
ఆహా ఆహా
నువ్వూనేనూ ఒకటై కలిసిపోగా
ఆహా ఆహా
ఎడమచేయి ఒక ఈకలాగ మారింది
కుడిచేయి ఒక చేపమొప్పులాగా
కొన్ని జీవితాలు ఆకాశంలో మబ్బులవాటున
కొన్ని జీవితాలు కారడవుల్లోని నీడలచాటున
సంతోషంగా నిన్ను అనుసరిస్తాను
ఒక చిన్నటి మట్టినలకలా మారుతాను
ఈ మనుష్యలోకపు సంసారంలో
అన్ని అంచులనా తేలుతూ సాగుతూ
ఎడమచేయి నిన్ను గట్టిగా పట్టుంది
కుడిచేయి నిన్ను వదిలివేసి పోనిచ్చింది
నా చేతులు గుప్పిట్లో బిగిస్తే
నీ రూపం తిరిగి నా హృదయంలోకొస్తుంది
ఒక సాంబ్రాణి ధూపంలా
ఆహా ఆహా
నువ్వూ నేను ఐక్యమయ్యాం
అవిచ్ఛిన్నంగా అనంతంవరకూ
సా-డింగ్-డింగ్ అను చీనేయ గాయని పాడిన “జువోషు జీ యువే” (ఎడమచేయి చంద్రునివైపుకి) అన్న ఈ పాట “షియాంగ్మీ చెంచెన్ జిన్రూ షువాంగ్” (ప్రేమయొక్క భస్మాలు) (ఆంగ్లంలో: ఏషెస్ ఆఫ్ లవ్) అనే చీనాదేశపు టివీ కథా కార్యక్రమంలో ప్రచురిచతమయ్యింది. ఈ కథలో అమరలోకంలో ఒక దేవతాకన్యగా జన్మించిన జిన్మీ అనే పూలదేవతకి షుఫెంగ్ అను ఒక అగ్నిదేవతాకుమారునికి మధ్యన ప్రణయగాథ నడుస్తుంది. పదివేల ఏళ్ళవరకూ ఈ ఇద్దరూ అనేకానాక ఘట్టాల నడుమ ప్రేమని ఐక్యంచేసుకోలేకపోతారు. వివిధ దేవదానవమానవరూపాలలో జన్మనెత్తుతారు. చివరికి విధినిక్షేపితమైన ప్రేమని అందుకొని ఐక్యం అవగలుగుతారు. మన భారతదేశపు సంస్కృతివలనే చీనా సంస్కృతిలో కూడా ప్రాకృతికదేవతా ప్రభావం, కర్మసిద్ధాంతము, జన్మ-పునర్జన్మలతో నిండిన సంసారము, అంతిమంగా మోక్షసాధన .. వీటన్నింటిపైనా నమ్మకాలు ఉన్నాయి. ఇటువంటి పోలికలు అనాదికాలం నుండీ ఈ రెండు సంస్కృతులలోనూ ఉన్నా, బౌద్ధమతం చీనాలో వ్యాపించిన తరువాత అనేక భారతీయ సాంస్కృతిక చిహ్నాలు కూడా అక్కడ నెలకొన్నాయి.
చంద్రుడు అనగా అమరత్వానికి, మోక్షప్రదమైన పరమానందానికి చిహ్నం. ఈ చిహ్నం చీనా సంస్కృతిలో ఉన్నట్టే, మన భారతదేశంలో కూడా ఉంది (సోమరూపంలో చంద్రుడిని చూసినప్పుడు). మన భారతదేశం యొక్క అసలు పేరు “ఇందు” అని, ఈ పేరు కొన్నిచోట్ల పలకలేక “హిందు” అంటారని, కానీ ఈ అసలు పేరు యొక్క అర్థం “చంద్రుడు” అని షువెన్ ఝాంగ్ (హ్యువెన్ త్సాంగ్) అను భారతదేశంలో పన్నెండేళ్లు గడిపిన చీనా బౌద్ధయాత్రికుడు పేర్కొన్నాడు. ఈ “ఇందు” అన్న పదం వైదికక్రతువులలో సోమరసం పట్టే యూపపాత్ర ద్వారా వచ్చిందని కొందరి విజ్ఞుల అభిప్రాయం. ఈ వైదిక యజ్ఞం ద్వారా ఆకాశంలో నక్షత్రాల గమనాన్ని లెక్కించి, సంవత్సరంలో తిరిగి కాలం పునరారంభం అయ్యే నూతన యుగాది ఘడియను మన జ్యోతిషశాస్త్రం గణిస్తుంది. ఇటువంటి ఖగోళ పరిశీలనలు, నక్షత్రాలు గ్రహాల యొక్క చలనకక్ష్యావిశేషాలు భారతీయశాస్త్రజ్ఞులు అనాదికాలం నుండి గణిస్తూవున్నారు. ఈ నక్షత్రపరిశీలనము కాలగణనము ద్వారానే వ్యవసాయవృత్తిని నడుపుకుని ఆర్థికవృద్ధిని సాధించడము నావికా అన్వేషణం ద్వారా వ్యాపారార్జన చెయ్యడము సాధ్యమయ్యింది. అదే భారతీయ సంస్కృతి, అందువలన “ఇందు” (అనగా చంద్రుని గమన గణనం) మన దేశానికి పేరునే ఇచ్చిపెట్టింది. చీనేయులు మనుష్యులు ఎంతో పుణ్యం సంపాదించిన తరువాతే భారతదేశంలో మానవజన్మనెత్తుతారని, ఈ “ఇందు” దేశం అమరలోకమైన స్వర్గం తరువాత అత్యున్నతమైన లోకమని నమ్మేవారు. ఈ నమ్మకాలు ఇటివలి శతాబ్దాలలో మనదేశం పరాయిపాలనలో బానిసత్వంపాలైన తరువాత లేచిపోయాయనుకోండి, అది వేరే విషయం. పై పాటలో “చంద్రుడు” అని వర్ణించిన చోట వెనుక మోక్షసాధన అన్న అర్థం ఉందని మాత్రం మనం గమనించాలి.
సా-డింగ్-డింగ్ అను చీనేయగాయని పాడిన అనేక పాటలు అక్కడ మహత్ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈమె ఒక సంస్కృతశ్లోకాన్ని కూడా పాటగా మునుపు పాడింది. ఆ పాట రేపు అనువదిస్తాను.
ఈ క్రింద చిత్రికలో టివీ కార్యక్రమంలోని కథలోని కొన్ని అంశాలను ఒక అభిమాని గ్రహించి పాటకు తోడుగా పెట్టాడు. అది కూడా చూడండి.
చీనాభాషను ఇతరదేశాలవాళ్లు పలకడానికి వీలుగా రోమకలిపిని ఆధారంచేసుకుని పిన్యిన్ అను లిపి ఉపయోగిస్తారు. ఆ లిపిలో ఈ పాట సాహిత్యం క్రింద చూడవచ్చు. రోమకలిపిని వారి భాషకి అనుగుణంగా మలుచుకుని, గుణింతాలని పోలిన వివిధ సుడికారాలను ఏర్పరుచుకున్నారు. మన భారతీయభాషలలో కూడా అంతర్జాతీయ సంస్కృతలీపీకరణం (ఐ.ఏ.ఎస్.టి) అను ఒక రోమకలిపి ఉన్నది. ఆ సుడికారాలను (ఏక్సెంట్) మనం తరుచుగా వినియోగించుకుంటే మన భాషలలోని పదాలకు కూడా ఆంగ్లంలో వ్రాసినప్పుడు సందిగ్ధం ఉండదు. దురదృష్టవశాత్తూ భారతీయులు ఈ లిపిని వినియోగించక, మూర్ఖులైన ఆంగ్లేయులు మనపై రుద్దిన బండలిపి అయిన ఆంగ్లలిపిలోనే మనుష్యుల నగరాల పేర్లను వ్రాస్తున్నాము. చీనా మొదలైన అనేక దేశాలవలనే మనం కూడా మనకు సమ్మతమైన రోమకలిపిని త్వరలోనే వినియోగించుకుంటామని నా ఆశ.