నువ్వూనేను (మన్ ఓ తో)
అరుగునీడలో సేదతీరుతుండగా మధురమైనక్షణంలో.. నువ్వూనేను
ఇద్దరు వ్యక్తులు ఇద్దరి ముఖాలు, కానీ ఒకటే మనసు.. నువ్వూనేను
మాయావ్యామోహాలనుండి విముక్తులై బ్రహ్మానందంతో.. నువ్వూనేను
నువ్వూనేను, ఈ రెండిటీ అవతల పరమానందంలో ఐక్యమయ్యాము
ఫార్సీ భాషలోని “మన్ ఓ తో” (నువ్వూనేను) అను ఈ కవిత ఎలెక్ట్రానిక్ సంగీతంతో మేళవించి అనూష్ అరాష్ అను ఇద్దరు పారసీక (ఫార్సీ) యువకులు జర్మనీలోని బెర్లిన్ నగరంలో విడుదల చేశారు. ఈ ముద్రణ “ను” అన్ డీజే సంగీతం సమకూర్చగా బెర్లిన్ నగరంలోను, ఆపై ప్రపంచవ్యాప్తంగాను విపరీతమైన ప్రాచుర్యం పొందింది. ఎలెక్ట్రానిక్ సంగీతంపై మమకారంతో ఇరాన్ దేశంలో ప్రభుత్వం చేస్తున్న కట్టడిని తట్టుకోలేక తెగించి దేశం విడిచి జర్మనీకి పలాయనం చేశారు ఈ యువకులు. ఈ కవిత సాహిత్యం ముందుగా ఇరానుదేశపు కవి జలాలుద్దీన్ రూమీ రచించాడట. అతని “దివాన్-ఎ-షంస్” అను కవితాసంపుటినుండి స్వీకృతమయ్యింది. ఈ రూమీ సూఫీ సాహిత్యం విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం అందరికీ విదితమే.
పూర్తి కవితను క్రింద అనువదించుతున్నాను.
అరుగునీడలో సేదతీరుతుండగా మధురమైనక్షణంలో.. నువ్వూనేను
ఇద్దరు వ్యక్తులు ఇద్దరి ముఖాలు, కానీ ఒకటే మనసు.. నువ్వూనేను
తోటలోని సడి పక్షుల కిలకిల మనకి ప్రాణం నింపుతున్నాయి
ఇలా ఈ తోటలోకి అడుగిడగా.. నువ్వూనేను
ఆకాశంలో నక్షత్రాలు వస్తున్నాయి, మనల్ని చూద్దామని
వారికి ప్రేమబింబమైన చంద్రుడిని చూపిస్తున్నాం.. నువ్వూనేను
నువ్వూనేను, ఈ రెండిటీ అవతల పరమానందంలో ఐక్యమయ్యాము
మాయావ్యామోహాలనుండి విముక్తులై బ్రహ్మానందంతో.. నువ్వూనేను
స్వర్గంలో చిలుకలన్నీ పలకడం మొదలుపెట్టాయి
ఈ విధంగా మనం ఒకరితోఒకరు కలిసి నవ్వుతుండగా
దానికన్నా విలువైనది నువ్వూనేను ఈ ఏకాంతపు చోట
ఒకే క్షణంలో ఇరాక్ లోను ఖొరాసాన్ లోను.. నువ్వూనేను
ఇలా ఈ భూమిపై ఈ వ్యక్తిరూపంలో ఉన్నాము, ప్రతివ్యక్తిరూపంలోనూ
అనంతమైన స్వర్గంలో ఆనందం నిండిన తలంలో.. నువ్వూనేను