మొదటిచూపులోనే నీకు మనసిచ్చాను
మారో, క్రోకీనామామయ్య కూతురా, మొదటిచూపులోనే మనసిచ్చాను నీకు
చెప్పు మరి, నువ్వు లేకుండా ఆనందంగా ఎలా ఉండగలను నేను
ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను
దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నావు, ఇంక ఇక్కడెలా ఉండేది మనము?
పద పోదాం తిబిలీసీకి, అక్కడ కాలేజీకి పోయి చదువుకుందాం
ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను
దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
తిబిలీసీకొచ్చాక, అక్కడొక వాటా అద్దెకి తీసుకుందాం
ఎన్నెన్నో జోళ్ళు జిగేళుమనే గాజు దీపాలు కొనుక్కుందాం
ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను
దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
నువ్వు కాలేజీకి పోతే, నేను ఇంటిదగ్గరుంటా
సాయంత్రంపూట ప్లెఖానోవ్స్కీ పార్కులో సరదాగా నడుద్దాం
ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను
దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
జార్జియాదేశానికి చెందిన జానపదగీతం “ఎర్తీ నఖ్విత్” (మొదటిచూపులోనే ప్రేమించాను) అన్న పాట ఇది. ఈ పాట పైన వాయించింది చ్వేనేబురేబి అను సంగీతబృందం. చిత్రిక మధ్యలో వచ్చిన అమ్మాయి “త్రియో మందిలి” అనే వేరొక గాయనీబృందంలో ఒకతె. ఈ గాయనీబృందం కూడా ఈ పాటను ఆలపించారు. క్రింద చూడండి. త్రియో మందిలి బృందం పాడిన మరికొన్ని పాటలను నిన్న అనువదించాను.
జార్జియా సంస్కృతిలో చర్చిలో అందరూకలిపి బృందగానం పాడడం ఆనవాయితీ. క్రైస్తవసన్యాసుల మఠాలలో ఈ సంయుక్తగానం పాడే సంస్కృతి మొదలయ్యింది. ఇదే సంస్కృతి జానపదులలో కూడా వ్యాప్తిచెందింది.