ముగ్గురు కుర్ర నావికులు
ముగ్గురు నావికులు యువకులు, లాలలా లాలలలలా..
ముగ్గురు కుర్రనావికులు నావ నడుపుతూపోయారు
అలా సముద్రంపై వెళ్తూపోయారు, అలా సముద్రంపై వెళ్తూపోయారు
గాలి వాళ్ళని తోసుకునిపోయింది, లాలలా లాలలలలా..
గాలి వాళ్ళని నవద్వారతీరంవరకూ తోసుకొనిపోయింది
అలా నవద్వారతీరంవరకూ, నవద్వారతీరంవరకూ
గాలిమర బండరాతిపక్కన, లాలలా లాలలలలా..
గాలిమర బండరాతిపక్కన లంగరువేసారు
అలా వేసారు లంగరు, అలా వేసారు లంగరు
ఆ గాలిమర మిల్లులో, లాలలా లాలలలలా..
ఆ గాలిమర మిల్లులో ఉంది ఒక కన్నె పనమ్మాయి
ఉంది ఒక కన్నె పనమ్మాయి, ఉంది ఒక కన్నె పనమ్మాయి
తను అడిగింది నన్ను, లాలలా లాలలలలా..
తను ఆడిగింది నన్ను ఎప్పుడు కలిసాం మనం అని
ఎప్పుడు కలిసాం మనం మునుపు? ఎప్పుడు కలిసాం మనం మునుపు?
నాంత్ నగరంలో సంతలో, లాలలా లాలలలలా..
నాంత నగరం సంతలో ఒక ఉంగరం వెతుక్కున్నాం మనం
ఫ్రాన్సుదేశానికి వాయువ్యదిశలో ఉండే బ్రెతాజ్ఞ్ అను ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునే భాషను బ్రెతోన్ భాష, లేదా బ్రయిఝ్ భాష అంటారు. ఈ భాష ఫ్రెంచిభాషనుగాక, పశ్చిమ ఐరోపా భాషలైన కెల్టిక్ భాషలను పోలివుంటుంది. దీని సోదరభాషలు ఐర్లండులోను, స్కాట్లండులోను, వేల్సులోను, స్పెయిందేశపు పశ్చిమాన ఉన్న గల్లీసియాలోను ప్రజలు మాట్లాడుతారు. చాలామటుకు ఈ భాషలు కృశించిపోయినా ఇంకా పూర్తిగా అంతరించిపోలేదు. ఆ బ్రయిఝ్ భాషలోని “త్రి మార్తలోద్” అను జానపదగానం 18వ శతాబ్దిలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏ కవి వ్రాసాడో తెలియదు, కానీ ఆ కాలంలో బ్రెతాజ్ఞ్ ప్రజలు నావికులవలే దేశదేశాలు తిరిగివెళ్తుండగా వారి జీవనతీరులను వివరిస్తోంది. ముగ్గురు కుర్రనావికులు నడుపుతున్న నావ గాలిలో సముద్రంపై కెనడా వరకూ కొట్టుకుపోయి అక్కడీ “న్యూఫౌండ్ లేండ్” (నవద్వారతీరం) చేరుకుంటుంది. ఈ ప్రాంతాన్ని బ్రయిఝ్ భాషలో “దువర్ నెవెజ్” అంటారు, అందుకే “నవద్వార” అని అనువదించాను (ఈ ఐరోపాభాషలన్నింటికీ సంస్కృతభాషతో కొంత సారూప్యం ఉంటుంది). ఆ నవద్వారదేశంలో మునుపు ఎక్కడో చూసి పరిచయమైన అమ్మాయి కనపడుతుంది ఒక నావికుడికి. అలా మళ్ళీ తిరిగి కలుసుకుంటారు కథలో.
ఈ పాటను పైన పాడింది నోల్వెన్ లెరోయ్ అను ఫ్రాన్సుదేశపు (బ్రెతోన్ జాతికి చెందిన) గాయని. ఈమె మునుపు ఈ పాటని చాలామంది గాయకులు గానం చేశారు. అందులో, అలాన్ స్టివెల్ అను గాయకుడి ఆలాపన చాలా పేరొందింది. అది క్రిందన వినవచ్చు.