మంత్రగత్తెల రాత్రులు
నిజమే, నిజమే, అబద్ధం కాదు, ఊగు ఊగు
మన సొంతపు పాత భాషలో, ఊగు ఊగు
మన సొంతపు పాత భాషలో, ఊగు!
నడివేసపు రాత్రిపూట కన్నెపిల్లలౌతారు, ఊగు ఊగు
మంత్రగత్తెలుగా మాయతోడేళ్ళుగా, ఊగు ఊగు
మంత్రగత్తెలుగా మాయతోడేళ్ళుగా, ఊగు!
ఈ రాత్రి ఈ రాత్రి నడివేసవి, ఊగు ఊగు
ఎవరిది ఈ రాత్రి నడివేసవి, ఊగు ఊగు
ఎవరిది ఈ రాత్రి నడివేసవి, ఊగు!
మంత్రగత్తెలది మాయతోడేళ్ళది, ఊగు ఊగు
వాళ్ళది సొత్తు నడివేసవి, ఊగు ఊగు
వాళ్ళది సొత్తు నడివేసవి, ఊగు!
గాలిలో ఎగిరింది మంత్రగత్తె, ఊగు ఊగు
మా ఇంటి వాకిట్లో కాదు, ఊగు ఊగు
మా ఇంటి వాకిట్లో కాదు, ఊగు!
మా ముంగిటి ఇనుములకొలిమి, ఊగు ఊగు
మా పెంకులపై మేకులు మేకులు, ఊగు ఊగు
మా పెంకులపై మేకులు మేకులు, ఊగు!
మా పెంకులపై మేకులు మేకులు, ఊగు ఊగు
తెప్ప వాట్లో చిక్కుకుంది, ఊగు ఊగు
తెప్ప వాట్లో చిక్కుకుంది, ఊగు!
మేకులు మొత్తం గుచ్చుకున్నాయి, ఊగు ఊగు
తెప్ప కాస్తా చిరిగిపోయింది, ఊగు ఊగు
తెప్ప కాస్తా చిరిగిపోయింది, ఊగు!
పారింది నది మజ్జిగలాగ, ఊగు ఊగు
మా ఆవులు మేసే పచ్చికదొడ్లో, ఊగు ఊగు
మా ఆవులు మేసే పచ్చికదొడ్లో, ఊగు!
అక్కడ వేటగాడి మెడవిరిగింది, ఊగు ఊగు
తొమ్మిది మంత్రగత్తెలు నుంచున్నారు, ఊగు ఊగు
తొమ్మిది మంత్రగత్తెలు నుంచున్నారు, ఊగు!
మునిగిపోతోంది లౌమాగత్తె, ఊగు ఊగు
సాయంత్రం సూర్యుడు లేక, ఊగు ఊగు
సాయంత్రం సూర్యుడు లేక, ఊగు!
లాట్వియా దేశపు గాయనీబృందం “తౌతూమెయితాస్” పాడిన “రగనూ నాక్ట్స్” (మంత్రగత్తెల రాత్రులు) అన్న ఈ పాట ఆ దేశపు జానపదసంస్కృతిని ప్రజల నమ్మకాలని ప్రస్తావిస్తోంది. నడివేసవి సమయంలో ప్రకృతి అంతా మాయామంత్రభరితం అవుతుందని, అప్పుడు మంత్రగత్తెలు తిరుగుతూ ఉంటారని అక్కడి ప్రజల నమ్మకాలు. లౌమా అను ఒక రాక్షసి అడవుల్లో తిరుగుతూ మగవాళ్ళని పట్టుకుతింటుందని, చిన్నపిల్లలను ఎత్తుకుపోతుందని ప్రతీతి. కానీ అదే రాక్షసి చిన్నపిల్లలని దీవించగలదని, లేదా శపించగలదని కూడా నమ్మకం. ఈ లౌమా యక్షిణులకు ఆవుపాలు, మజ్జిగ గుర్తు. ఈ పాటలో ఈ యక్షిణుల, మంత్రగత్తెల ప్రస్తావన ఉంటుంది. లాట్వియా భాషలో “లీగ్వ” అంటే “ఊగు” అని అర్థం. కానీ, ఇదే పదం నడివేసవి సమయంలో జరిగే పండుగ సంబరాలని కూడా సూచిస్తుంది.