తెల్ల కుందేలు
ఒక మాత్ర నిన్ను పెద్దదిగా చేస్తుంది, ఒక మాత్ర చిన్నదిగా చేస్తుంది
నీ అమ్మ నీకిచ్చే మాత్రలు మాత్రం, ఏవీ ఏమీ చెయ్యవు
ఏలిస్ ని అడుగు, తను పదడుగుల పొడువైనప్పుడు
కుందేళ్ళని వెదుక్కునే వేటలో నువ్వు, ఎప్పుడు క్రింద పడతావో తెలియదు
వాళ్ళకి చెప్పు హుక్కా కాలుస్తున్న ఓ గొంగళీపురుగు నిన్ను పిలిచిందని
ఏలిస్ని పిలిచాడు, తను చిన్నదిగా ఉన్నప్పుడు
చదరంగం బల్లపై మనుషులు లేచి నీకు ఎటు వెళ్ళాలో చెప్పినప్పుడు
ఏదో పుట్టగొడుగుని నివ్వు తిన్నప్పుడు, నీ మతి నెమ్మదిగా కదుల్తుంటే
వెళ్ళు, ఏలిస్ని అడుగు, తనకి తెలుసనుకుంటాను
తర్కపరిమాణాలు చచ్చిపడుండగా
తెల్లశకటం యోధుడు తిరగేసి మాట్లాడుతుండగా
ఎరుపు రాణి తలకాయి లేకుండా తిరుగుతుండగా
గుర్తించుకో పందికొక్కు ఏం చెప్పిందో
నీ తలకాయికి తిండిపేట్టు, నీ తలకాయకి తిండిపెట్టు
జెఫర్సన్ ఎయిర్‌ప్లేన్ (జెఫర్సన్ విమానం) అనే అమెరికాదేశపు సంగీతబృందం 1967వ సంవత్సరంలో విడుదలచేసిన “తెల్ల కుందేలు” అనే గీతం ఇది. ఈ సంగీతం మనోలోలిత (సైకడెలిక్) సంగీతచరిత్రలో ఒక పునాదిరాయిగా పేర్కొంటారు. గ్రేస్ స్లిక్ అను గాయని పాడిన ఈ పాట సాహిత్యం ఎల్.ఎస్.డి మొదలైన మనోలోలిత పదార్థాలు మింగిన తరువాత కళ్ళముందు కనపడే వింత అనుభూతులని వర్ణిస్తోంది. పాట సాహిత్యంలో లూయిస్ కారొల్ అను రచయిత రచించిన “ఏలిస్ ఇన్ ద వండర్లేంద్” (వింతప్రపంచంలో ఏలిస్) అను ఒక చిన్నపిల్లల కథని అనేకమార్లు ఉల్లేఖిస్తున్నారు. ఈ కథలో తర్కశాస్త్రంలోని గణితశాస్త్రంలోని కిటుకైన విషయాలను గమ్మత్తైన కథాసందర్భాలు సృష్టించి వాటిద్వారా వ్యాఖ్యానిస్తాడు రచయిత. ఈ కథావిషయాలను, అక్కడ మాట్లాడే జంతువులు, జరిగే వింత సందర్భాలను ఈ పాట మనోలోలిత భ్రాంతిలో కనపడే దృశ్యాలతో పోల్చిచూస్తోంది.