భుర్జవృక్షం
భుర్జవృక్షం పెరిగింది బండరాతిపైన, బండరాతిపైన
వెండిరంగులో మెరుస్తున్న ఆకులతోను, ఆకులతోను
లాగాలనిపించింది ఒక ఆకునన్నా, ఒక ఆకునన్నా
కిందపడ్డాయి ఆకులు ఘల్లుమని అన్నీ, ఘల్లుమని అన్నీ
భుర్జూ, ఎవరు కప్పారు నున్నగా నిన్ను, నున్నగా నిన్ను?
బూజులాంటి ఉన్నినేతతోటి , ఉన్నినేతతోటి
మంచు, మంచు, ప్రొద్దుటి జల్లు, ప్రొద్దుటి జల్లు
వసంతకాలం కురిసే వాన, కురిసే వాన
భుర్జూ, పెరిగావు నువ్వు గుబురుగా గుబురుగా, గుబురుగా గుబురుగా
కొమ్మలు రెమ్మలు అన్ని నేలకు ఆని, నేలకు ఆని
అక్కా, నీవి ఎంత చక్కటి నగలు, చక్కటి నగలు
భూమిని శుద్ధిగా చేస్తూ నడుస్తూ, చేస్తూ నడుస్తూ
భుర్జవనం గుండావెళ్ళా, ఒక్క రెమ్మనైనా తెంపాలేదు
భుర్జవనం గుండావెళ్ళా, ఒక్క రెమ్మనైనా తెంపాలేదు
ఒక్కరెమ్మని తెంపానంటే, నేను మొత్తం వెండైపోతా
ఒక్కరెమ్మని తెంపానంటే, నేను మొత్తం వెండైపోతా
లాట్వియా దేశానికి చెందిన “తౌతూమైతాస్” అనే ఈ బృందం ఆలపించిన “బెర్జిన్స్” అనే పాట, లాట్వియా భాషలోని ఒక జానపదగీతం. తౌతూమైతాస్ అంటే పడుచుకన్యలు అని అర్థం. కానీ ప్రస్తుతం ఈ పదాన్ని లాట్వియాదేశంలో సంప్రదాయబద్ధంగా దుస్తులుధరించి అలంకరించుకున్న స్త్రీలకు వాడుతున్నారు. ఈ బృందం జానపదుల పాటలతో పాటు, లాట్వియా దేశ సంస్కృతికి మునుపునుండీ పెనవేసుకువున్న ప్రకృతి ఆరాధన మతానికి సంబంధించిన క్రతువులు, పండగలకు సంబంధించిన గీతాలు కూడా పాడి ప్రజల మెప్పుగొన్నారు. లాట్వియా దేశం కేవలం ఎనిమిది శతాబ్దాలక్రితమే క్రైస్తవమతంలోకి మార్చబడింది. ఈ దేశానికి పశ్చిమాన ఉన్న జర్మను రాజ్యమైన ప్రషియా వీరిని ఆక్రమించి మతమార్పిడి చేసింది. అప్పటివరకు ఈ ప్రజలు వారి పురాతన సంస్కృతిని, దానికి అనుగుణమైన ప్రకృతిమతాలనే పాటించేవారు. ఇప్పటికీ కూడా ఈ భాషలోను, సంస్కృతిలోను ఒకనాటి ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయి. లాట్వియా దేశపు భాష, పొరుగున ఉన్న లిథువానియా దేశపు భాష సంస్కృతానికి దగ్గరపోలిక కలిగి ఉంటాయి. భరతఖండం నుండి కొన్ని వేల సంవత్సరాల మునుపు ఐరోపా వలసవెళ్ళిన ఆర్యజాతులు ఈ భాషలకు పునాది కల్పించాయి. కనుక ఈ ప్రకృతి ఆరాధనా సంస్కృతి కూడా మనదేశపు పండగలను, క్రతువులను కొంత పోలి ఉంటుంది. లాట్వియా చాలా చిన్నదేశం. ఈ లాట్వియా భాష మాట్లాడే ప్రజలు ప్రస్తుతం 15-20 లక్షలకు మించి లేరు. కానీ వారి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు అన్నీ వారి మాతృభాషలోనే నడుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా వారి భాష, వారి సంస్కృతి ఏకీకృతమైపోతున్న ఈ ప్రపంచసంస్కృతిలో తనదిగా నెలదొక్కుకొంటాయని, తన అస్థిత్వాన్ని పోషించుకుంటాయని నా ఆశ.
“బెర్జిన్స్” అనే ఈ పాటలో ఈ యువతులు భుర్జవృక్షంతో మాట్లాడుతూ ఉంటారు. భుర్జవృక్షవనాలు ఉత్తర ఆసియా, ఐరోపా ప్రాంతమంతా విరివిగా ఎమరిఉంటాయి. మనదేశంలో కూడా హిమాలయప్రాంతంలో ఈ చెట్లు ఉంటాయి. శరదృతువులో ఆకులు రంగుమారి, హేమంతఋతువులో ఆకులు రాలుస్తాయి ఈ చెట్లు. ఈ ఆకులు ఒకవైపు ఆకుపచ్చ రంగులోను, మరోవైపు తెల్లటి వెండిరంగులోను ఉంటాయి. గాలి వీస్తున్నప్పుడు ఆకులు అటూ ఇటూ తిరుగుతూ కలకలలాడుతూ ఉంటాయి. ఈ పాటలో గాయనిలందరూ కలిసి గుంపుగా పాడడం మన జానపదాలలోని పల్లెపడుచుల పాటలను గుర్తుకు తెస్తాయని నా అభిప్రాయం. ఈ పాటలో చెట్లపై గౌరవం, ప్రకృతిని మనస్సుకి దగ్గరగా పెట్టుకోవడం కనిపిస్తాయి. ఒకచోట యువతి చెట్టుని “అక్కా, ఎంత చక్కగా ఉన్నాయి నీ నగలు” అని చెట్టు కొమ్మలని, రెమ్మలని ప్రశంసిస్తుంది. ఇది మన భారతీయ సంస్కృతిలో మనం చాలా బాగా అన్వయించుకోవచ్చు.
క్రింద వీడియోలో ఈ “తౌతూమైతాస్” బృందాన్ని టీవీలో పరిచయం చేస్తుండగా, ఈ లాట్వియా దేశపు భాషని వినవచ్చు. ఈ అమ్మాయిలు వాయిస్తున్న వాయులీనం, బూరా వంటి వాద్యపరికరాలను చూడవచ్చు. వీరు ఐరోపా సంప్రదాయకసంగీతాన్ని అధ్యయనం చేసినప్పటికీ, జానపదగేయాలు పాడాలనుకోవడం మెచ్చుకోదగ్గ విశేషం. ఇలా మన తెలుగుసీమలో కూడా పడుచు అమ్మాయిలు “తౌతూమైతాస్” వంటి పాప్ సంగీత బృందం చేసి, తేటతెలుగులో పాడుతూ సంస్కృతి పునరుజ్జీవింపచేసే తరుణం వస్తుందంటారా? ఆ తరుణం మొత్తం ముగిసిపోయిందంటారా?