మేరు పర్వతం – మనిషి అంతరంగం

మేరు పర్వతం అంటే మీకు తెలుసా ? మన పురాణాల ప్రకారం, మేరు పర్వతం విశ్వం మధ్యన నెలవుండి 84,000 యోజనాల ఎత్తుంటుందంట. అంటే 10.8 లక్షల కిలోమీటర్లు. పోలికకి, భూమిపైనున్న అతి పెద్ద పర్వతం ఎవరెస్టు ఎత్తు కేవలం 8.8 కిలోమీటర్లు.  మేరు పర్వతం గురించి మరికొన్ని విశేషాలు :  సూర్య చంద్రులు, విభిన్న గ్రహాలు, నక్షత్రాలు రోజూ మేరు పర్వతం చుట్టూనే ప్రదిక్షణ చేస్తాయట. ఈ పర్వతం పైభాగాలలో ఇంద్రాది దేవతలు నివశిస్తుంటారట. ఈ పర్వతం అష్ట దిక్కులలో అష్ట దిక్పాలకులు రాజ్యం చేస్తుంటారట. కనుక, ఈ మేరు పర్వతం ఆషామాషీ పర్వతం ఏమీ కాదు. లెక్కకు మిక్కిలి మంది చారిత్రీకులు మేరు పర్వతానికిదే మూలం అంటూ వేరు వేరు పర్వతాలను సూచించారు. కానీ ఇవేమీ దీనికి సరిపోవు.  ఖగోళ పరిశోధకుడు, జ్యోతిష్యుడైన వరాహమిహిరుడు 5వ శతాబ్దంలో మేరు పర్వతం అంటే ఉత్తర ధృవం అని ప్రతిపాదించాడు. అదికూడా పోలికకి సరిపోదు.

ఈ బ్లాగుపోస్టులో, మేరు పర్వతం అంటే ఏమిటో రహస్యం మీకు వివరింప ప్రయత్నం చేస్తాను. భారతీయ సంస్కృతి, ఆచారాలు, ఇతిహాసాలు, కళాకృతులు, భక్తిప్రవృత్తులు, తత్వ సిద్ధాంతాలకు అన్నింటికీ ఈ మేరు పర్వతం కథయే మూలం. (ఈ విషయం మీకు బ్లాగులో మరింత స్పష్టమవుతందని నా ఆశ.) కానీ చిత్రమేమిటంటే, భారతీయులకి కొద్దిమందికి కూడా దీని గురించి అవగాహన లేదు ! గుళ్ళూ గోపురాలకి వెళ్ళేవాళ్ళు; వ్రతాలు, ఉపవాసాలు చెసేవాళ్ళు; వాస్తు, జ్యోతిష్యం పాటించేవాళ్ళు; దినదినం దేవతలకి పూజచేసేవాళ్ళు; పితృదేవతలకి ప్రణామం చేసేవాళ్ళు – వీరెవ్వరు దీని గురించి పట్టించుకోరు. కానీ ఈ నియమాలన్నింటికీ మేరుపర్వతం కథయే మూలం ! అతి చిత్రమైన విషయం ఏమిటంటే మా ఇంట్లో ఇవేమీ చెయ్యరు. నేను వ్యావహారికంగా నాస్తికుణ్ణి. కేవలం కుతూహలం కొద్దీ ఈ చిహ్నాలని అధ్యయనం చేశాను.

ఇంతకీ మేరు పర్వతం అంటే ఏమిటి ? మేరు పర్వతం అంటే మనిషి అంతరంగం, మరేమీ కాదు.

ప్రాచీన కాలంలో మన పూర్వీకులైన ఋషులు చేసినదేమన్నా ఉంటే అది తపస్సు (5 వేల సంవత్సరముల మునుపు హరప్పా నాగరికత కాలం నుండే, తపస్సుకి యోగ ముద్రలకి ఆధారాలు లభ్యం అవుతున్నాయి). ఈ ఋషులు యోగ నియమాలు పాటిస్తూ, ఓపికగా క్రమంగా అంతరంగ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఈ శాస్త్రానికి చక్కని చిహ్నమే మేరు పర్వతం.

అంతరంగానికి ఐదు తలాలు

మనిషికి పంచ కోశాలు (శరీరాలు) ఉన్నాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. బొమ్మలో చూపించిన వృత్తాలవలే ఇవి ఒకదానిలో మరొకటి ఒదిగి ఉంటాయట. అన్నిటికంటే బయట వుండేది (ఊదారంగులో చూపించిన) 3D వ్యాప్తిలో ఉండే ఐహిక శరీరం. దీనినే మనం సాధారణంగా శరీరం అని అంటాం, దీనినే వైద్యులు చికిత్స చేస్తారు. దీనిలోపల వేరే సూక్ష్మ శరీరాలు వేరే సూక్ష్మ-తలములలో ఉంటాయట. ఈ ఐదు తలాలకి సంస్కృతంలో చక్కని పేర్లున్నాయి. అవేమిటంటే,

అన్నమయం : ఇది భౌతిక తలం – అంటే అణువులు, శక్తి తరంగాలతో కూడి ఉన్న 3D వ్యాప్తి. దీనినే భౌతిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. నిర్జీవ పదార్థాలైన రాళ్ళు, రప్పలు కేవలం ఈ తలంలోనే నిమిడి ఉంటాయి. సంస్కృతంలో “అన్నం” అనగా నిర్జీవ పదార్థం అని అర్థం. ఏదైనా తిండి భుజించేటప్పుడు దానికి జీవం ఉండదు కాబట్టి దానిని అన్నం అని అంటాం.

ప్రాణమయం : ప్రాణంతో నివశించే మొక్కలు, వృక్షాలు అన్నమయ తలంతో పాటు ప్రాణమయ తలంలో ఉంటాయట. కనుక వీటికి రెండు కోశాలు (శరీరాలు). మునుపటి తలం ఈ తలం కన్నా హెచ్చింపు వ్యాప్తి కలిగి ఉంటుంచి. విశ్వం యొక్క పరిణామంతో పోలిస్తే ప్రాణులు నివశించే ప్రదేశం (ప్రస్తుతానికి భూమి తక్కించి వేరే గ్రహాలు మనకు తెలియవు) అతిచిన్నది కదా ! ప్రాణమయ తలం అంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. వ్యాప్తిలో చిన్నదైనా, ప్రాణమయతలం అన్నమయతలంతో పోలిస్త్ హెచ్చింపు క్లిష్టమైనది. ఇది జీవ అణుసముదాయాల క్లిష్టత్వంలో మనకు కనపడుతుంది.

మనోమయం : మెదడు కలిగి ఉండే జంతువులు ఈ మూడవ తలంలోకి సారించి ఉంటాయి. జీవశాస్త్రంలో దీనిని ఇంద్రియ-యాంత్రిక వలయం అని అంటారు. అంటే పరిశరాలని గ్రహించి వెనువెంటనే ప్రతికృతి చెయ్యడం అన్నమాట. వ్యాప్తిలో చిన్నదైనా, మనోమయం ప్రాణమయం కంటే హెచ్చింపు క్లిష్టమైనది. జంతువుల మెదడులోని నరాల అల్లికలో ఈ క్లిష్టత్వం మనకి కనపడుతుంది.

విజ్ఞానమయం : విజ్ఞానం అనగా భాషతో వ్యక్తీకరింపగలిగే జ్ఞానం అని అర్థం. ప్రకృతిలోని వస్తుధర్మాలను వేటినైనా మానవ భాషలలో వివరించవచ్చు. ఈ భావాలను ఆవృత్తి చేసుకోగలరు గనక మనుషులు విజ్ఞానమయతలంలో సారించి నివశించుతుంటారు. ఈ తలం మనోమయతలం కన్నా హెచ్చింపు క్లిష్టమైనది. మానవ భాషలలోని పదాల పొందికలోను, మనుషుల మధ్య సందేశాల పొడవులోను ఈ క్లిష్టత్వం మనకు అగుపడుతుంది. కంప్యూటరు భాషలు కూడా పెక్కు క్లిష్టమైనవి కనుక మనం కంప్యూటర్లను కూడా ఈ తలంలో ఊహించుకోవచ్చు.

చిన్మయం : “ఇది నేను” అని తర్కించగల నేర్పథ్యం మనుషులకి కలదు. దీనిని సంస్కృతంలో అహంకారం అని అంటారు (“అహం” అనగా “నేను”). ఈ తలం విజ్ఞానమయ తలం కన్నా హెచ్చింపు క్లిష్టమైనది. ఎందుకంటే మునుపటి తలంలో కేవలం వస్తుధర్మాలనే తర్కించగలము, ఈ తలంలో స్వధర్మాలను కూడా తర్కించవచ్చు. మనుషులు ఆలోచించి అమలుజరపగల పథకాలలో ఈ క్లిష్టత్వం మనకు అగుపడుతుంది. అహంకారం అనేది మనిషి జ్ఞప్తికి ముడిపడి ఉంటుంది. ఇది అతిసూక్ష్మ శరీరం. దీనిపైన వేరువేరు వివేచన కార్యాలను ఒకదానికి మించి మరొకటి క్లిష్టమైనవి విడగొట్టవచ్చు. చాందోగ్య ఉపనిషత్తులో వీటినిలా వివరిస్తారు : నామం, వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, ఆత్మ విజ్ఞానం, బలం, స్మరణ, ఆశ, శ్రద్ధ, నిష్ట, కృతి, సుఖం.

ఈ ఐదు తలాలలోను మనిషి వేటిమీదనైనా దృష్టిపెట్టి ఫలం పొందవచ్చును. కానీ, క్రింది తలాలకన్నా పై తలాలలో సుఖం హెచ్చింపు దొరుకుతుందట. ఆ ఫలం పరిణామం బట్టి ఈ ఐదు వృత్తాలను ఒక పర్వతం వలే ఊహించుకోవచ్చు (ఈ శిఖరాగ్రం పైనుండి చూస్తే ఈ పర్వతం ఐదు వృత్తాలవలే కనపడుతుంది). ఇదే మేరు పర్వతం.

ఈ విశ్వంలోని ప్రతి జీవరాశి అధికమైన సుఖం ఆశిస్తూ ఈ పర్వతం పైకి ఎక్కటానికి ప్రయత్నం చేస్తుంటుందంట. ఈ వృత్తాల మధ్యనున్న బిందువే ఈ పర్వతం యొక్క శిఖరం. ఆ చిన్న బిందువు చుట్టూ మేరు పర్వతం విరిగిపోయిందట. అంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ బిందువు వద్ద దొరికే సుఖం అనంతమైనది అన్నమాట. ఈ అనంత సుఖమునే “ఆనందం” అని మన పూర్వీకులు అన్నారు. ఆ బిందువు చుట్టున్న వలయాన్ని ఆనందమయం అని అన్నారు.

ఈ సిద్ధాంతం అనాది కాలం నుండీ భరతఖండంలో ప్రాచుర్యంలోనున్నది. బౌద్ధమతంలో కూడా ఈ మేరుపర్వతం అతి ముఖ్యమైనది. బౌద్ధులు వారి స్థూపాలను మేరుపర్వతం వలే మలచుకొన్నారు. ఏ బౌద్ధస్థూపముకన్నా అందుకనే ఐదు తలాలు గలవు. బౌద్ధం తరువాత శైవ, వైష్ణవ మతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వారి ఆలయాలను కూడా స్థూపములవలే మేరుపర్వతానికి ప్రతిబింబం వలే కట్టుకున్నారు. అందుకనే ఏ హైందవ దేవాలయం చూసినా  గుడి గోపురం మేరుపర్వతానికి ప్రతిబింబంవలే ఉంటుంది. గోపురం చుట్టు వేరు వేరు తలాలలో వివిధ మృగాల, రాక్షసుల, మనుషుల, దేవతల విగ్రహాలు ఉంటాయి. గోపురం పైన కళశం బ్రహ్మానందానికి చిహ్నమై అమరి ఉంటుంది. సరిగ్గా కళశం క్రింద గర్భ గుడిలో ఈశ్వరుని విగ్రహం ఉంటుంది – ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నట్టు. గుడిలోని భక్తులు విగ్రహం చుట్టు ప్రదిక్షణ చేస్తారు – మేరు పర్వతం చుట్టూ సూర్యచంద్రాది దేవతలు ప్రదిక్షణ చేసినట్టే. కానీ అసలు రహస్యం – ఈ పర్వతం ఒక మనిషి అంతరంగంలోనే చూడవచ్చన్నమాట.

పర్వతం ఎక్కడానికి మూడు అడుగులు

పైకి : అధికమైన సుఖం కావాలంటే పర్వతంపైకి ఎక్కడం మంచి తరహానే. దీనినే రాజస గుణం అని అంటారు. కానీ ఏ తలంలో ఉన్నా, ఆ తరువాతి తలం హెచ్చింపు ఎత్తులో ఉంటుంది. ఎంత ఎక్కప్రయత్నం చేసినా, తలందాటి ముందుకు వెళ్ళలేము. కనుక, ఈ రాజస గుణం ఎక్కువైతే, పర్వతం యొక్క అసలునైజం (ఇది మన అంతరంగంలోనే ఉంటుందని) మరచిపోయి సంపాదన కోసం (లోభి) జీవితం గడుపుతాము. ఈ సంపాదన ఎప్పటికి నిజమైన ఆనందం అందించలేదు. ఈ అతి-రాజసత్వాన్ని అన్నమయతలంలో కామం అని, మనోమయతలంలో లోభం అని, చిన్మయతలంలో గర్వం అని అంటారు. రాజసగుణానికి చక్కని ప్రతిబింబం సర్పం. తిన్న తిండిని బట్టి సర్పం పొడవు పెద్దదవుతూ ఉంటుంది. కానీ దాని జీవిత చరమకాలం వచ్చేటప్పటికి, ఎంత సర్పమైనా చావక తప్పదు.

లోనికి : ఒక తలంలో నుండి బయటపడి పై తలంలోకి ప్రవేశించాలంటే అంతరంగంలోకి దృష్టి సారించాలి. దీనినే సాత్విక గుణం అని అంటారు. భారతదేశంలో కనుగొన్న గణక పద్ధతి దీనికి చక్కని ఉపమానం చూపిస్తుంది. అంకెలు 1,2,3,.. తీసుకోండి. పైతలంలోకి అంకె ప్రవేశించాలంటే మునుపటి తలాలలో సున్నా పెట్టాలి – 9, 10, 11,… 99, 100, .. ఇదే విధంగా మన ప్రాచీనులు మనిషి ఆ తలాలలో సుఖాన్ని సన్యసించి తరువాతి తలం యొక్క సుఖం ఆశించాలని అభిప్రాయపడ్డారు. అందుకని ఈ అడుగుని లోనికి, లేదా క్రిందకు అనికూడా అనవచ్చు. గమ్మత్తుగా క్రిందకు వస్తే మరింత వేగంగా మేరు పర్వతం పైకి వెళ్ళవచ్చు !విపరీతమైన కామం తప్పించుకొనాలంటే తరువాతి మనోమయతలంలోని ఆస్తిని ఆశించాలి. విపరీతమైన లోభాన్ని తప్పించుకోవాలంటే తరువాతి చిన్మయతలంలోని (పలువురిలో) గుర్తింపుని ఆశించాలి. విపరీతమైన గర్వాన్ని తప్పించుకోవాలంటే ఆత్మజ్ఞానాన్ని వాంఛించాలి. సత్వగుణం తనంత తను ఉండలేదు, కొంత (పైతలంలోని) రాజసగుణం తోడ్పుకావాలి. సత్వగుణానికి చక్కని ప్రతిబింబం సూర్యుడు. తన లోపల తనని తపించుకోవడం వల్ల ప్రపంచానికి అంతటికీ కాంతిని ప్రసరిస్తాడు.

సమతలంగా : సమతలంగా ఉండటం అంటే ఏ అడుగు వెయ్యకపోవడం. దీనినే తామస గుణం అని అంటారు. మనిషి జీవితకాలం పరిమితమైనది కనుక, ఈ గుణానికి అర్థం ఒకటే – చావు. కనుక, ఇది మంచిది కాదని మన ప్రాచీనుల అభిప్రాయం.కానీ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, ఏ అడుగు వెయ్యకపోయినా మనం మేరు పర్వతం చుట్టూ ప్రదిక్షణ చేస్తాము. ఈ విశ్వంలో ప్రతీ వస్తువుకి ఒక అవధికాలం ఉంటుంది. ఆ సమయం ముగిసిన తరువాత మళ్ళీ అదే ప్రవర్తన కొనసాగుతుంది. దీనికి చక్కని ఉదాహరణ ఊపిరి (ప్రాణ వాయువు).ఈ ఊపిరిలో మనసు లీనమైతే మేరుపర్వతం ఒక భ్రమవలే మాయమవుతుందట.

ఈ మూడు గుణాలు ఏవీ చెడ్డవి కావు, మంచివి కావు. అతిదేంట్లోనన్నా ఎక్కువైతే అది చివరికి చేటు చేస్తుంది. సృష్టిలోని ఏ వస్తువైనా మేరుపర్వతంలో ఏదో ఒక తలంలో వశిస్తూ, ఈ గుణాలను ఒక మోతాదులో కలిగి ఉంటుంది. ఈ గుణాల పొందికవల్ల పైకో క్రిందకో కదుల్తుంది. దీనినే సాంఖ్య సిద్ధాంతం అని అంటారు. వేరు వేరు దేవతలు ఈ గుణాలనే కలిగి మేరు పర్వతం పైతలాలలో నివశిస్తారట. వీరే రకరకాలైన రాజసమూర్తులైన సర్పదేవతలు (నాగులు), సత్వమూర్తులైన సూర్యదేవతలు (ఆదిత్యులు), తామసమూర్తులైన వాయుదేవతలు (మారుతులు) – వేదాల్లోను, పురాణాల్లోను కనపడతారు. రాజస గుణం అతి ఎక్కువైతే నాగులు కాస్తా అసురులుగాను, యక్షులు కాస్తా రాక్షసులు గాను మారుతారు. అతి ఎక్కువైతే ఆదిత్యులు (ఉదాహరణకి కర్ణుడు), మారుతులు కూడా చెడ్డవారవుతారు.

మేరు పర్వతం శిఖరాగ్రం వద్ద ఈ మూడు గుణాలు అనన్యమైన దేవతాముర్తులవుతాయి. వీరినే త్రిమూర్తులంటారు – బ్రహ్మ (రాజస), విష్ణు (సత్వ), శివ (తామస). వీరి సతీమణులు వీరి ప్రతిబింబాలు – భర్తలు క్రియాకారులైతే భార్యలు వారి క్రియాశక్తులు. వాక్కు (సరస్వతి) అతి గొప్ప సర్పము – ఇంతకన్నా వేగంగా ఏదీ పెద్దదవలేదు. విష్ణువు ఆదిత్యులలో అనన్యుడు. శివుడు మారుతుల్లో అనన్యుడు. ఈ త్రిమూర్తులు మేరుపర్వతంపైన శిఖరాగ్ర బిందువు వద్దనుండంవల్ల ఒకరికొకరు కలిసిపోయి ఉంటారు. మిగిలిన గుణాలను కూడా వారి ఆభరణాలవలెనో (శివుని ఆభరణమైన సర్పము, విష్ణువు ఆభరణమైన శంఖము / వాయువు), అనుచరులవలెనో (విష్ణువు పవళించే ఆదిశేషుడు, శివుని కుమారుడైన కార్తికేయుడు ఆదిత్యులకు సేనాపతి) కలిగి ఉంటారు. అందుకనే శివకేశవులు ఒకరికొకరు ప్రతిబింబాలని అంటారు. బ్రహ్మ రాజసమూర్తి గనుక అతనిని విష్ణువుతో (సత్వము) కలిపి మాత్రమే భక్తులు ఊహిస్తారు. శివుడు తామస స్వరుపుడు గనుక విశ్వాంతములో కూడా తనే మార్పులేక నిశ్చలముగా ఉంటాడు – త్రిమూర్తులు ముగ్గురు శివునిలోనే అంతర్ధానమవుతారు.

ఇది మేరు పర్వతం కథ !

12 responses to “మేరు పర్వతం – మనిషి అంతరంగం

 1. కిరణ్ గారు

  మేరు పర్వతం గురించి మీ వివరణ బాగుంది. నేను గతంలో దీని గురించి చదివానుగాని గుర్తులేదు. మణిద్వీప వర్ణనలో మేరువు గురించి ఉంటుంది. కాని కొంచెం విభిన్నంగా ఉంటుంది. మాది రాజమండ్రి. అంతకుముందు రావులపాలెంలో ఉండేవాళ్ళం.

  శ్రీవాసుకి

 2. శ్రీవాసుకి గారు, నమస్కారం. మేరుపర్వతం గురించి నా వివరణ కొంత వరకూ స్వమూలమైనది. విభిన్నంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు 🙂 మీ ప్రోత్సాహానికి కృతజ్ఞుణ్ణి.

 3. మీరు చెప్పిన కోశాలకి సంబంధించే భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్రాణాయస్వాహా, వ్యానాయస్వాహా, ఉదానాయస్వాహా, అపానాయస్వాహా, సమానాయస్వాహా అని అంటారు. రామాయణం లో కూడా అంజనేయుడు సీతాన్వేషణ ఘట్టంలో “అంనందానికి పరమావధి” ఐన మేరువుపై విశ్రాంతిని తీసుకోవడానికి నిరాకరించడం, అగస్త్యుడు దక్షిణ ప్రాంతం నుండి వచ్చేంతవరకు తలవంచుకునే ఉండాలని అదేశించడం……. మీరు చెప్పిన ’మనిషి’అంతరంగానికి సరిపోయింది. (నేను పేర్కొన్న పర్వతం ’మేరువు’ అన్న ఉద్దేశ్యం లోనే రాస్తున్నను. తప్పయితే క్షమించాలి. మీ వివరణ బావుంది

 4. meru parvatham gurinchi neevu rasindi chadivi chala santhoshinchanu. naku ilanti vishayalu telusukovadam chala ishtam. nee telugu ku, nee elivi ki abhinandanalu. aa vishayam gurinchi naku koncham, chala koncham knowledge undi. nuvvu rasindi telusukovalante na knowledge saripodu anipinchindi. inka chala sralu chadivi ademito telusukovali anipinchindi. maa pillalu maa kalla munde meruvulauthunte entho aanandam anipinchindi. ippati na mind status ki aa vishayam naku poorthiga ardham kadu.
  nuvvu chala vishayalu rasavu.. anni chadavalani unnaprasthutham na mind ki antha sthirathvam ledu…
  abhinandanalu….
  pavan’s mother

 5. నమస్తే ఆంటీ,

  మీ మాటలు చూసి చాలా సంతోషంచాను. మీరంటే మా అమ్మగారితో సమానం 🙂 నేను ఈ బ్లాగులో అంత సవరంగా వ్రాయలేదు.. అన్నీ కలిపి కలగాపులగంగా తయారైంది.. తెలుగులో ఖచ్చితంగా, అప్పుడప్పుడైనా, ఏదో వ్రాయాలని ఈ బ్లాగు మొదలుపెట్టాను. కానీ, తెలుగు వ్రాసే అలవాటు పోయి, ఒక పట్టాన నా ఆలోచనలకి మాటలు పట్టట్లేదు. ముఖ్యంగా, ఈ బ్లాగులో చాలా విషయాలు కుదించి వ్రాసాను; అందుకని చదవడానికి చాలా ఇబ్బంది కలిగించి ఉంటుంది. తరువాతి సారి మరికొంత సరళంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను..

  మీకో సారి గుర్తుందో లేదో, నాతోటి పవన్ తోటి దేవుడు గురుంచి మీరు మాట్లాడుతున్నారు. మీరెన్ని రకాలుగా చెప్పినా నేను మాత్రం “దేవునిపై నమ్మకం అనేది కేవలం ప్రతి మనిషి తనంతట కల్పించుకునే ఆలోచన, మరో మనిషితో వీటిపై మాట్లాడలేము, నమ్మకం కలిగించలేము” అని సమాధానపరచడానికి ప్రయత్నిస్తున్నాను. చివరగా మీరు “సరే కిరణ్, దేవునిపై నమ్మకం ఉందో లేదో అనవసరం.. నీ మీద నీకు నమ్మకం ఉందా ?” అని గుచ్చి అడిగారు. నేను ఆశ్చర్యపోయాను – టాపిక్ మార్చారేమిటని . “అవును ఆంటీ, నా మీద నాకు నమ్మకం ఉంది” అని అంటే, మీరు “అది చాలు బాబు. నీమీద నీకు నమ్మకం ఉండడమే ప్రధానం” అన్నారు.

  ఈ మాటలు అర్థం కావడానికి నాకు చాలా టైం పట్టింది 🙂

 6. కిరణ్ గారూ ఇవాళే మీ బ్లాగ్ చూడడం. చాలా ఆనందంగా ఉంది. మేరు పర్వతం గురించి అత్యద్భుతంగా వివరించారు. దీని మీద మీకున్న జిజ్ఞాసకి శతకోటి వందనాలు. మేరు పర్వతం ఎత్తు గురించి, దానిని మనవ అంతరంగంతోను, గుడి గోపురంతోను, బౌద్ధ స్థూపాలతోను చాలా చక్కగా పోల్చారు. మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా.ఇది నా మనవి మాత్రమే సుమా! మీరు ఎత్తుని పోల్చినట్టే లోతుని (16,000 యోజనాలు) కూడా చక్కగా పోల్చి వర్ణిస్తే చదవాలని ఉంది. ధన్యవాదములు

 7. కిరణ్ గారూ శ్రిచక్రాన్ని గురించిన వివరణ ఇచ్చారు చాలా బాగుంది. మన ఋషులు సత్యాన్ని దర్శించి మనకు తెలియజేశారు. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికే మనం ఇబ్బంది పడుతున్నాము. మనము మన బయట, మనము మన లోపల అనే విషయాన్ని తెలుసుకోగలిగితే అదే బ్రహ్మజ్ఞానము. అనంతమైన విశ్వరహస్యమే శ్రీచక్ర స్వరూపం అదే మీరు చెప్పిన మేరు పర్వతం. ఈ సృష్టి సమస్తం ఆ మహా శక్తి స్వరూపమైన బిందు స్వరూపం చుట్టూనే తిరుగుతోందని శ్రి చక్ర రూపాన్ని మనకు ప్రసాదించారు మన ఋషులు. మీరు చాలా వరకు దాన్ని విశదీకరించడం లో కృతకృత్యులయ్యారనే నేను భావిస్తున్నాను శుభం.

 8. Thanks for sharing this article, it very helpful to me, thanks again 🙂

 9. చాలా బాగుంది!
  నేనూ ఒకప్పుడు నాస్తికుణ్ణే:-)
  సనాతన్ అధర్మలో ఉన్న మ్యాజిక్కే అది,
  ఎజెండా అంటూ లేకపోతే నాస్తికత్వాన్న్ని కూడా సాగించుకోవచ్చు.

 10. చాలా బాగుంది!
  నేనూ ఒకప్పుడు నాస్తికుణ్ణే:-)
  సనాతన ధర్మంలో ఉన్న మ్యాజిక్కే అది,
  ఎజెండా అంటూ లేకపోతే నాస్తికత్వాన్న్ని కూడా సాగించుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s