సహనం సంస్కృతికి ఆధారం

మనిషికి అతిపెద్ద శత్రువులు అరి షడ్వర్గాలు అని మన పురాణాలు చెబుతాయి. కోపం, కామం వగైరా .. అట్లే, క్రైస్తవంలో 7 అతి పెద్ద పాపాలున్నాయంటారు.

కానీ, రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఏమని చెబుతాడు అంటే “మనిషికి గల పాపాలు కేవలం రెండే – అసహనం, అత్యాశ. అత్యాశ ద్వారా అతడు స్వర్గానికి దూరమయ్యాడు. అసహనం వల్ల అతను ఎప్పటికీ స్వర్గం చేరలేకపోతున్నాడు.” ఇలా చెప్పిన వెనువెంటనే కాఫ్కా అంటాడు. “కాదు, అసలు మనిషికి గల పాపం ఒక్కటే – అసహనం. అసహనం ద్వారానే అతను స్వర్గానికి దూరమయ్యాడు, అసహనం ద్వారానే తిరిగి స్వర్గం చేరలేకపోతున్నాడు”.

జీవితంలో ఏమి సాధించాలన్నా సహనం కావాలి. సహనశీలి అయినవాడు మనుషుల్లో అత్యుత్తముడు. ఓర్పుగలవాడు మేరుపర్వతంతో పాలసముద్రాన్నే మధించగలడు.

మనదేశ సంస్కృతిలో అతి గొప్ప విషయం మన సహనం. ఈ సహనం ఉండవల్లే భిన్న మతాలు, భాషలు, కళలు, సంగీతాలతో మనదేశం వెలుగొందుతోంది. ఇంతటి అద్భుతం ప్రపంచం మొత్తంలో ఎక్కడా మీకు కనపడదు. సహనానికి సరైన సూత్రం మన దేశచిహ్నంలోనే ఉంది. “సత్యమేవ జయతే”, అనే ఈ వాక్యం ముండక ఉపనిషత్తు నుండి సంగ్రహించి మన దేశ చిహ్నంలో పొందుపరిచారు. “సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండు, దేనికీ తొందరపడకు”, అని దీని అర్థం.

మనకు నిజంగా ఈ వాక్యం పై నమ్మకం ఉంటే “ఏదో ఆకాశం వచ్చి మీదపడిపోతోంది, మన సంస్కృతి నశించిపోతోంది, చీడపురుగులని తగలబెట్టాయాలి”, అంటూ ఆవేశపడిపోము. ఈ ఆవేశమే అన్ని అనర్థాలకు మూలదాయకం. “హుస్సేన్ కళాచిత్రాలు మన సంస్కృతిని కించపరుస్తున్నాయి.”, అని ఒకడు. “తస్లీమా నస్రీన్ మా మతాన్ని కించపరుస్తోంది”, అని ఇంకొకడు, ఇలా మనం రెచ్చిపోము.

సహనం అంటే ఏమిటి ? ఇది అర్థం చేసుకోవడం చాలా సుళువు. బయట ప్రపంచం మీ ఆలోచనలకి అనుగుణంగా లేదు, కలియుగమో ఏమో కానీ అంతా తల్లకిందులవుతోంది. మీ మాట ఎవ్వరూ వినట్లేదు. మీరు అనుకున్నట్టు, ప్రయత్నిస్తున్నట్టూ ఏమీ జరగట్లేదు. మీకు చిర్రెత్తుకొస్తోంది. ఈ సమయంలో మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వడమే సహనం అంటే.

ఈ సద్గుణం మీకు ఉంటే మిగిలిన మనుషులు ఏమి చేసినా మీ మనోనిర్మలం చెదరదు. చెప్పడానికి సుళువుగానే చెప్పేసినా ఇది ఆచరించడం అంత సుళువు కాదు.

మీరు మిమ్మల్ని సహనశీలురు అని అనుకున్నా, కొన్ని హద్దులు దాటి ఉండలేరు. ఉదాహరణలు :

  • మీ అమ్మాయి తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాను అంది.
  • పోనీ, మీకు కులం మీద పట్టింపు లేదు అనుకుందాం, మీ అమ్మాయి ఒక అవిటివాడిని ముసలివాడిని, బీదవాడిని ప్రేమించింది. అప్పుడు, మీరు ఒప్పుకోగలరా ?
  • మీ అమ్మాయి నాకు పెళ్ళి ఇష్టం లేదు, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అంది. అప్పుడు మీరు ఒప్పుకోగలరా ?
  • మీ అబ్బాయి మతం మార్చుకుని, వేరే దేశం అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అన్నాడు. ఒప్పుకుని ఆశిర్వదించగలరా ?
  • మీ అబ్బాయి స్వలింగ సంపర్కం తప్ప స్త్రీలపై ఇష్టం లేదు అని చెప్పాడు. అప్పుడు ఒప్పుకోగలరా ?
  • మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. వారిని మీరు ఆదరించగలరా ?
  • మీ చెల్లెలు పెళ్ళికి ముందు గర్భవతి అయ్యింది. ఆదరించగలరా ?

మన సమాజంలో ఇటువంటి ప్రశ్నలు రోజూ ఎదురుపడుతున్నాయి. ఇవి ఏమీ ఇష్టం లేకపోయినా వీటిని అధిగమించి మనుషలని ప్రేమించగలడం చాలా కష్టం. మనుషుల్లో అత్యుత్తములే దీనిని చెయ్యగలరు. వీళ్ళు ఏసుక్రీస్తుకు, గౌతమ బుద్ధునికి, మహ్మద్ ప్రవక్తకి, శ్రీరామునికి ప్రతిబింబాలు.

ఇంతటి కఠినమైన ప్రశ్నలు రాకపోయినా, చిన్నవాటికే అసహనం తెచ్చుకునే వారు కోట్లమంది ప్రజలు. వీరు రెడ్లు అయితే కమ్మవారంటే పడదు. వీరు హిందువులైతే ముస్లిములంటే పడదు. ఎవ్వరైనా బట్టలు కురచగా వేసుకునే స్త్రీలంటే పడదు. ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళంటే పడదు, తెలుగు మాట్లాడే వాళ్ళంటే పడదు. వేరే ప్రదేశం నుండి వలస వచ్చిన వాళ్ళంటే పడదు. స్వలింగ సంపర్కులంటే పడదు.

అన్ని రకాల వారు వచ్చి సమాజాన్ని కలుషితం చేసేస్తున్నారని ఒకటే టెన్షను. నిజానికి అసలు సమస్య బయట వాళ్ళ దగ్గర కాదు, మన మెదడులోనే ఉంది, అదే అసహనం.అసహనం అనేది ఒక వ్యాధి వంటిది. ఈ తెగులు పట్టిన సమాజం అక్కడే ముగిసిపోతుంది.

సహనం అనేది కళకి, సంస్కృతికి ములాధారం. కొత్తని స్వాగతించాలి, అప్పుడే కొత్త కొత్త కళలు, సంగీతాలు పుడతాయి. పుట్టినవన్నీ గొప్పవి కాకపోవచ్చు, కానీ వేలలో ఒకటి మంచిది బయటకి వస్తుంది. కానీ, ఇది రావాలి అంటే ముందు అన్నింటికీ స్వాగతం చెప్పాలి.

ఆధునిక యుగంలో లోకం వెనువేగంగా మారిపోతోంది. ప్రతి రోజు ఒక కొత్త ఆవిష్కరణ వచ్చి సమాజాన్ని ముంచెత్తుతోంది. మన గమ్యం ఎటు పోతున్నామో ఏమీ అర్థం కాదు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి మనిషికి ఇంత తీవ్రంగా ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇటువంటి సమయంలో సహనం యొక్క అవసరం మరింత పెరిగి ఉంది. అంతేకాక, సహనం కోల్పోతే దారుణమైన ప్రాణహాని చెయ్యడానికి సరిపోయే తుపాకులు, బాంబులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక, మనం మరింత జాగ్రత్తతో ఉండాలి.

చదువుకున్నవారు కూడా సమాజం ఎంతవేగంగా మార్పు చెందుతోందో అంచనా వెయ్యలేకపోతున్నారు. నేను చెప్పేవి ఏవో సైన్సు ఫిక్షనులాగ అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మన జీవితకాలంలోనే జరుగుతాయి.

  1. వర్చువల్ రియాలిటీ ద్వారా సుదూర ప్రాంతాల నుండే స్త్రీపురుషులు సెక్సు అనుభవించగలుగుతారు. అప్పుడు భార్య-భర్త అన్న పదాలకి నిర్వచనం ఏమవుతుంది ?
  2. జన్యు టెక్నాలజీ ద్వారా పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో, ఎలాంటి రోగాలకి నివారణ ఉండాలో తల్లిదండ్రులు ముందే డిసైను చెయ్యగలుగుతారు. అప్పుడు జాతి, ఆచారాలకి అర్థం ఏముంటుంది ?
  3. ఒక బిడ్డ జన్యువులు కేవలం తల్లి నుండి, తండ్రి నుండే కాక మొత్తం మానవ జీనోము నుండీ వస్తాయి. అప్పుడు తల్లి, తండ్రి అన్న సంబంధానికే అర్థం ఏముంటుంది ? మానవజాతి మొత్తం బిడ్డకి తల్లి కాదా ?
  4. ఒక స్త్రీ చిత్రం / వీడియో చూసి, ఆమె నగ్న సౌందర్యం ఎలా ఉంటుందో అంచనా వెయ్యగలిగే సాఫ్టువేరు తయారవ్వుతాయి. అప్పుడు ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చర్చకి అర్థం ఏమిటి ?
  5. మీరు ఒకసారి వీడియోలో మాట్లాడితే, మిమ్మల్ని మరో మనిషిగా మార్చివేసి అతడు మాట్లాడాడు అని మోసం చెయ్యగల సాఫ్టువేరు వస్తుంది. ఈ పరిస్థితిలో ఎవ్వరు చెప్పేది నిజమో. అతడు నిజంగా అనుకున్న మనిషో కాదో, ఎలా తెలుసుకోగలం ?

నేను చెప్పింది నమ్మకపోతే మీరు సెర్చిచేసి తెలుస్కోండి. (4) ఇప్పటికే తయారయ్యి ఉంది, నేను వెళ్ళబోయే కాంఫరెన్సులో ఒక విద్యార్తి దీనిపై తన పరిశోధనని సమర్పించబోతున్నాడు. ఇక (5) మీద నేను స్వయంగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 7-8 కెమేరాలు ఉండే ఒక గదిలో పనిచేస్తోంది. మరో ఐదేళ్ళలో సాధారణ వీడియోపై పనిచెయ్యగలదు.

మేము పనిచేసే చిన్నపాటి టెక్నాలజీలతోనే ఇన్ని పెద్ద మార్పులు వస్తుంటే ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు పనిచేస్తున్న టెక్నాలజీలు అన్నీ ఎలాంటి మార్పులు తేగలవో ఊహించగలరా ? ఇలాంటి టెక్నాలజీలు మనల్ని ముంచెత్తినప్పుడు మనకి మరో మార్గం ఉండదు. అందుకని, ఇప్పటినుండే సహనం అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం.

6 responses to “సహనం సంస్కృతికి ఆధారం

  1. మనం నమ్మిందే సరైందని, మిగతాదంతా తప్పని అనుకునే మనస్తత్వం వదిలితేగాని సహనం రాదనుకుంటా. టెక్నాలజీలు ముంచెత్తినా, కులము, మతము, సంస్కృతి పట్ల వున్న పాత భ్రమలుపోయినా కొత్తవి వస్తాయి. They may just regroup under different labels.

    కొద్దిలో తప్పింది కాని లేకపోతే ఈ సంవత్సరం ECCV లో మిమ్మల్ని కలిసేవాడిని.

  2. వికటకవి గారు, RSG గారు,
    మీ అభిమానానికి చాలా thanks 🙂

    హై చైతన్య
    తరువాతి కాంఫరెన్సులో కలుద్దాం మరి 🙂 తెలుగు బ్లాగర్లలో ఇంకో vision researcher ని చూడడం ఆనందంగా ఉంది.

    సహనం అనేది టెక్నాలజీ ద్వారా రాదు, మనిషే జాగ్రత్తగా అలవర్చుకోవాలి. టెక్నాలజీలు అసహనాన్ని పెంచుతాయే తప్ప తగ్గించవు, అందుకని ఉన్న సమస్య పెద్దదవుతుంది తప్ప తగ్గదు.

  3. 1. మీరు చెప్పిన సహనం సంయమనాకి ఇచ్చిన పరిమితులు/హద్దులు మీకు లేవని మీరు నమ్ముతున్నారా…
    అక్కడ ..మీ అనే దానికంటే మన అని రాయటం సబబేమో …
    2. వీళ్ళు ఏసుక్రీస్తుకు, గౌతమ బుద్ధునికి, మహ్మద్ ప్రవక్తకి, శ్రీరామునికి ప్రతిబింబాలు : – అత్యుత్తములే – సహనం
    ఏసుక్రీస్తు,గౌతమ బుద్ధునికి సహనం బోలెడు , కానీ మిగిలిన ఇద్దరికి సహనం కొద్దిగ మాత్రమే ఉంది అని చెప్పాలి .. ( రామాయణం , ఖురాను ప్రామాణికం గా భావించినట్టయితే … ) – సర్వమత సహనం అన్నదృష్టితో ఈ వ్యాసం రాస్తున్నాను కనుక మతానికి ఒక్కరి పేరు పెట్టాను అంటార … సొభగు సొభగు …

    3. మీరు రాసిన ఈ టపా చాల విజ్ఞాన దాయకంగా వుంది… ఇలాంటి భవిష్య సమాజ నిర్మాణ యోచితమయిన టపాలు అభినందపాత్రములు …

  4. చంద్రమౌళి గారు

    మాట పొరబాటు అయ్యింది. నేను సగటు మనిషినే. మిగతా మనుషులకంటే నా సహనం ఏమీ గొప్పది కాదు. వ్రాయడానికి “మీరు” అని వ్రాసాను. అంతే 🙂

    శ్రీరామునికి మహ్మద్ ప్రవక్తకి సహన గుణానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. కొంతమంది ముస్లిం మిత్రులు ఒకప్పుడు నాకు హాడిత్లోని ఉదాహరణలు ఇచ్చారు. ప్రస్తుతానికి గుర్తు లేదు.

    ఏది ఏమైనా, నా ఉద్దేశ్యం మనం ఏ మతం వారిమైనా మనం అభిమానించే ఆదర్శమూర్తులు చాలా సహనగుణం కలవారు అని అందరికీ గుర్తుచెయ్యడమే 🙂

Leave a reply to RSG స్పందనను రద్దుచేయి