వింత పశువుల వీధిపోరాటాలు

ఆంధ్రజ్యోతి పత్రిక పైకి కృష్ణ మాదిగ అనుచరులు దాడికి దిగడం, తరువాత ఎడిటర్ని పొలీసులు అరెస్టు చెయ్యడం వంటి పరిణామాల వల్ల ఈ మధ్యన బ్లాగులోకంలో దళిత హక్కులపై చర్చ జరుగుతోంది. దళిత రక్షణ చట్టం ఎలా అపహాస్యం చేస్తున్నారో తాడేపల్లి గారు నిర్మొహమాటంగా వివరించారు. మహేశ్ కుమార్ గారు దీనికి ప్రతిగా సమాధానమిచ్చారు.

మరో ప్రక్క పొలీసులను నక్సలైట్లు హత్యచెయ్యడంపై చదువరి, మహేశ్, దిలీప్ గారి బ్లాగులలో కథనాలు వచ్చాయి.

మన సమాజంలో సమానత లేదు. ఇటువంటి పరిస్థితిలో, అణగారిన వర్గాలు పోరాటం చేసి వారి హక్కులను సంపాదించుకొంటారు అని మనం చాలామంది నమ్ముతున్నాం.”నేను దళిత పక్షపాతిని” అని అంటే “నేను బడుగువర్గాల పోరాటాన్ని సమర్ధించుతాను” అని అర్థం. కానీ, ఈ పోరాటమనేది ఎంతవరకూ నిజం ?

నా దృష్టిలో ఈ పోరాటాలకు అర్థం లేదు. విద్యలేని వాడు తన హక్కుల గురించి ఎలా తెలుసుకోగలడు ? ఏది సాధ్యమో తెలియకుండా, ఎటువంటి ఆశయం అర్థవంతం అయినదో తెలియకుండా, ఎవరన్నా పోరాటం చెయ్యగలరా ? వీధిలో పశువులు ఒకదానితో ఒకటి కలబడి కుమ్ముకోవడానికి ఈ పోరాటాలకి తేడా ఏమిటి ?

“విద్యలేనివాడు వింత పశువు” అని మన నానుడి. పశువులకి కూడా బుర్ర ఉంటుంది, మెదడు ఉంటుంది. మనిషికీ పశువుకీ తేడా ఎక్కడ అంటే విజ్ఞానం వద్ద. పరిపూర్ణ మానవత్వం సంపాదించుకోవాలంటే విద్యావంతులు అయివుండాలి. ఇటువంటి కనీస మానవత్వం కూడా మన దేశపౌరులకి మనం ఇవ్వకుండా ఇంకేమి హక్కుల గురించి అడగగలం ? నా దృష్టిలో విద్యకి దూరం చెయ్యడమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన. మన ప్రభుత్వం దీనికి పరిపూర్ణ నైతిక బాధ్యత వహించాలి. చదువులేని పశువులకి కులం తప్ప మరేదీ కనపడదు.

దళిత ఉద్యమ మేధావులని చెప్పుకుంటున్నవారు వారి మందీ మార్బలంలో విద్యావంతులు ఎంతమందో చెప్పగలరా ? లేదు. వారే కాదు, రాజకీయ నాయకులని తిరుగుతున్నవారిలో ఎవ్వరూ వారి అనుచరగణంలో విద్యావంతులు ఎందరో చెప్పరు. నక్సలైట్లలోనూ ఇదే సంగతి. వీరి వెనక ఉన్న దండు మనుషులందరివీ గొర్రె-బుర్రలు. “డూ డూ బసవన్న” అని డబ్బుతో పిలిస్తే డూ అని తలాడించే తలకాయలు. మన సమాజంలో అతిపెద్ద గౌరవం తెచ్చిపెట్టేది ధనబలం. ప్రజలు విద్యావంతులు కానంతవరకూ ఇదిలాగే సాగుతుంది.

కృష్ణమాదిగకి వ్యతిరేకంగా రాసినంతమాత్రాన ఆంధ్రజ్యోతి దళిత వ్యతిరేకి అయిపోతుందా ? డబ్బులేని దళితుల జీవితం ఎలావుంటుందో పరిశీలించాలి. భూస్వాముల కింద నొక్కితే నొక్కినట్టు పడి ఉండాలి వీళ్ళు. పిలిస్తే వచ్చి లెట్రిన్లు కడిగిపెట్టాలి. వాళ్ళ అమ్మాయిలని అల్లరిచేస్తే మూసుకుని పడివుండాలి. కించపరిస్తూ జోకులు వేస్తే “అహహో” అని నవ్వాలి. ఒక తెలివైన విద్యార్థిని జాతి పేరుతో వెకిళి చెయ్యడం కంటే దరిద్రమైన విషయం నేను చూడలేదు. పేదవాళ్ళైన దళితులు ఎన్నిసార్లు ఇది అనుభవించారో లెక్కలేదు. ఏ దళిత హక్కుల చట్టం వీరిని కాపాడుతుంది ? డబ్బు, చదువే వీరిని కాపాడగలవు. దీనినే కామన్ సెన్సు అంటారు.

డబ్బున్న దళితులు ఎన్ని అవమానాలు భరించివుంటారు జీవితంలో ? ఏవో అరాకొరా, అసలు కొరగావు. డబ్బు ఉన్న దళితులు చేసే ఇబ్బందులు సాకుగా చూపించి దళితులందరినీ ఒక్కగాటన కట్టివేసి తాడేపల్లి గారు సంబోధిస్తున్నారు. ఇది అసలు సమంజసమేనా ?

బడుగువర్గాలని సమర్ధించే వారు కూడా విద్య యొక్క ఆవశ్యకతని పట్టించుకోవట్లేదు. మనిషిని పశువు కంటే ఎక్కువ చేసేది శ్రమ కాదు, విద్య. సమాజంలో మార్పు తీసుకురావాలంటే వచ్చేది శ్రామిక వర్గం నుండి కాదు, విద్యావంతుల నుండి. ప్రపంచం ఏమిటో తెలియకుండా, విజ్ఞానం లేకుండా తుపాకీలిచ్చినంత మాత్రాన ఎవ్వరు హక్కులు తెచ్చుకోగలరు ?

మనిషి శ్రమజీవి అంటారు. ఇంధనంతో ఇంజనులు నడపడం నేర్చిన తరువాత మనిషి శ్రమకి కాలం చెల్లింది. ఏ విధమైన శారీరిక శ్రమ చెయ్యకుండానే ప్రపంచంలోని మనుషులందరూ గడపవచ్చును. దీనికి సరిపడ ఇంధనం మన వద్ద ఉంది (ప్రస్తుతానికి న్యూక్లియర్ విద్యుత్తు, మన జనాభా తగ్గించుకుంటే కేవలం సోలార్ విద్యుత్తు). ఉండవలసినది సరైన దిశా నేతృత్వం, పట్టుదల మాత్రమే. విద్యుత్తుతో ప్రతీ పనిని చేయపించి మనిషులందరూ విశ్రాంతి తీసుకోవచ్చును. ఇదే తరువాతి యుగం.

పారిశ్రామిక విప్లవం అనేది మనిషిని పశువునుండి పూర్తిగా వేరుచేసింది. శ్రమకి అవసరం తీసివేసింది. కానీ, ప్రస్తుతం ఈ ఫలితాలను కేవలం కొంతమంది మాత్రమే అనుభవిస్తున్నారు. వీరిని ధనిక వర్గాలు అంటారు – ఏ పనీ చెయ్యకుండా కులాశాగా గడపుతున్నారు వీళ్ళు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇదేవిధంగా ప్రతి మనిషీ ఉండవచ్చును. పారిశ్రామిక విప్లవం తరువాత మొదటి సారిగా కొన్ని సమాజాలలో పేదరికం నిర్మూలింపబడింది. ప్రజలందరికీ సమానంగా వైద్య, ఆహార సదుపాయాలు దొరికాయి. మునుపటి సమాజంలో కేవలం కొందరికే ఇది దక్కింది. ప్రపంచంలోని మానవ సమాజాలన్నింటినీ పారిశ్రామికం చెయ్యడం ద్వారా మనం మరో యుగంలోకి వెళ్తాం. ఇప్పటి సమస్యలు ఆ యుగంలో హాస్యాస్పదంగా ఉంటాయి.

మనిషి బుద్ధి జీవి. ప్రతి మనిషీ ఈ విధంగా ఉండగలిగేటట్లు మనం ప్రయత్నించాలి. ఇదే అసలైన మానవత్వం. దానికి కనీస అవసరం ప్రజలందరినీ విద్యావంతులు చెయ్యడం. దీనిని గుర్తించక అడ్డదిడ్డమైన ఆశయాలకోసం పనిచెయ్యడం కాలయాపన, మూర్ఖత్వం.

ప్రకటనలు

3 responses to “వింత పశువుల వీధిపోరాటాలు

  1. చాలా బాగా చెప్పారు.

  2. చాలా సమతూకంతో రాయడానికి ప్రయత్నించారు. బాగుంది.

    పోరాటాలు సైద్ధాంతిక పరంగా జరిగి, చర్చలో లేక వాదనల ద్వారా ఫలితాల్ని సాధించినంతవరకూ నాకు సమంజసమే. అంబేద్కర్ కూడా ఇదే పద్ధతి అవలంభించాడని నా నమ్మకం.

    ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అభిలషణీయం కాకపోవడానికి కారణాలు external అని అందరికీ తెలిసినా, దీన్ని సాకుగా చూపించి ‘మొత్తం దళితులందరూ ఇంతే!’ అనే వితండవాదాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తాను.

  3. విద్య లేని వాడు వింత పశువు అని ఎరిగి కూడా ‘మనం’ చాలా మందిని విద్యకు దూరంగా వుంచాం శతాబ్దాలుగా. హూఁ. ఇదేదో కుట్రలా వుంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s