నగరాలు వర్ధిల్లాలి

నాగరికత తొలిగా బుడి బుడి అడుగులు పెట్టిన దేశం మనది. నాగరికత అంటే నగరాలలో నివశించడం. అతి పురాతనమైన హరప్పా నాగరికతలో మన పూర్వీకులు సామాజిక జీవనం చేసారు. ఈజిప్టు, మెసోపొటామియా నాగరికతలకి హరప్పా తోబుట్టువు. కానీ మిగతా నగరాలలో మహారాజులు పిరమిడ్లు కడితే హరప్పాలో పౌరప్రజలు సామాజిక ధాన్యాగారాలు, స్నాహ్నశాలలు కట్టారు. సామరస్యానికి మొదటి పుట్టినిల్లు ఈ భూమియే. హరప్పా నాగరికతలోని నగర నిర్మాణం చూస్తే ఇప్పటి ఇంజనీర్లకే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అతిచక్కగా ఆలోచించి అన్ని అవసరాలనూ తీర్చేటట్లు మన పూర్వీకులు నగరాలు నిర్మించారు.

వీరికి మనం ఇప్పుడు వారసులు కావాలి. మన జనాభాని అతివేగంగా నగరాలలోకి మళ్ళించాలి. అద్భుతమైన ప్లానింగుతో మహానగరాలు నిర్మించాలి.

ఈ మధ్యన చాలామంది పత్రికలలో, బ్లాగులోకంలో నగరాలు వచ్చి మన పల్లెటూళ్ళను చెడగొడుతున్నాయని వాపోతున్నారు. పచ్చని పంటచేలు, పిచ్చుకలు అంటూ కవిత్వం చెబుతున్నారు. నగరాలు వచ్చి అన్నింటినీ మంట కలిపేస్తున్నాయి అని గోలచేస్తున్నారు. విచిత్రంగా పర్యావరణవాదం ముందుకి తెస్తున్నారు. ఈ అపోహని చూసి ఇక బ్లాగు వ్రాయక తప్పదని నేను నిర్ణయించుకున్నాను.

పర్యావరణానికి ప్రాణస్నేహితులు ఎవరో తెలుసా ? నగరాలు.

పర్యావరణానికి అతిపెద్ద శత్రువు ? వ్యవసాయం.

ఇదేమి నేను చెప్తున్నది కాదు. ప్రపంచంలోని పర్యావరణవేత్తలు అందరూ మూకుమ్మడిగా చెప్తున్న విషయం. నమ్మకం కుదరకపోతే గ్రిస్టు సైటులోకి వెళ్ళి శోధించండి.

పర్యావరణంలోని జీవవైరుధ్యం అతి భయంకరంగా హత్య కావించబడినది మనిషి వ్యవసాయం చెయ్యడం నేర్చిన తరువాత. అడవులు నరికివేసి వన్యప్రాణులని అంతం చేసాడు మనిషి. అభివృద్ధి చెందిన దేశాలలో పల్లెటూళ్ళలో ఇంధన వినియోగం చూస్తే కళ్ళు తిరుగుతాయి. నగరప్రజలకి పది రెట్లు ఎక్కువ ఇంధనం వాడుతారు అక్కడ. దీనిద్వారా కాలుష్యం, గ్లోబల్ వార్మింగు మరింత పెరిగిపోతాయి.

మనుషులందరూ ఆకాశహర్మ్యాలలో నివశిస్తూ, ఇంధనానికి సోలార్ విద్యుత్తును వినియోగించుకుంటూ, కొద్దిపాటి భూమిలో వారి వ్యవసాయ అవసరాలు తీర్చుకుంటూ, మిగతా భూమినంతటినీ వన్యప్రాణులకి వదిలిపెడితే ఎలాగ ఉంటుందో ఊహించుకోండి !

ఇదే మనకి కావలిసిన భవిష్య నాగరికత. ఇదే పర్యావరణవాదం. నగరాలు దీనికి జీవనాధారం.

భారతదేశం పల్లెటూళ్ళలో నడుస్తుంది అని, మన సంస్కృతి పల్లెటూళ్ళలో క్రోడీకృతమై ఉంది అని చాలామంది ప్రచారం చేస్తుంటారు. ఇది పచ్చి అబద్ధం.

ఇప్పటి నగరాలలో ప్రపంచానికే అతిప్రాచీనమైనది వారణాసి. ఇది మా ఇంటిపేరు, నేను భారతీయుడిని. పల్లెటూరి వాదాన్ని పటాపంచలు చెయ్యడానికి ఇది సరిపోతుందా ?

పల్లెటూళ్ళని పొగుడుకునే వారు ఒక ముఖ్యమైన విషయం మరిచిపోతుంటారు – మన దేశ జనాభా. వేదాలు వ్రాసినప్పుదు మన జనాభా 40 వేలు, కాళిదాసు కాలానికి 40 లక్షలు, స్వాతంత్ర్య సమయానికి 30 కోట్లు, ఇప్పుడు 110 కోట్లు. దీనిని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని అంటారు. మన సంస్కృతి అంటూ చిలక పలుకులు చెప్పేముందు ఒకసారి దీనిగురించి ఆలోచించాలి.

ఇంతమంది జనాభాని పల్లెటూళ్ళలో పెడితే నెమళ్ళకి, చిరుతపులులకి, ఎలుగుబంట్లకి స్థలం మిగలదు ! జనాభా పెరుగుదల కూడా పల్లెటూళ్ళలో ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయ పనులకి పిల్లలు పనికివస్తారు కనుక. నగరాల్లో పిల్ల సైన్యం అవసరం ఉండదు కనుక ఎక్కువ పిల్లలని కనరు.  ప్రజలందరినీ తీసుకొచ్చి నగరాలలో పెడితే జనాభా పెరుగుదల ఆటోమేటిక్కుగా ఆగిపోతుంది.

న్యూక్లియర్ విద్యుత్తుని వ్యతిరేకించేవారు కూడా మన జనాభా గురించి మరిచిపోతుంటారు. పారిశ్రామిక యుగంలో సుఖజీవనానిికి ప్రతి మనిషికి ప్రతి రోజుకి 125 KWH కావాలి అని డేవిడ్ మెకేయ్ లెక్కగట్టారు (ఆయన బ్లాగులో, పుస్తకంలో పర్యావరణం గురించి వింత సూచనలు చేసే వారి చెవి గిల్లిపెట్టారు. చదివి ఆనందించండి). 110 కోట్లమందికి సోలార్ విద్యుత్తుతో ఇంధన అవసరాలు సమకూర్చాలంటే మనదేశం మొత్తం గాలిమరలతో, సోలార్ పానెళ్ళతో నింపెయ్యాలి. అప్పుడు కానీ, దేశ పర్యావరణం మొత్తం సర్వనాశనం కాదు.

అందుకే ముక్కు మూసుకుని మనం ప్రస్తుతం న్యూక్లియర్ విద్యుత్తు వినియోగించుకోవాలి. ప్రజలందరినీ నగరాలకి రప్పించి ఆకాశ హర్మ్యాలు కట్టాలి. మన ప్రజలందరికీ 20 వేల ఏళ్ళకు పైగా సరిపడే థోరియం నిల్వలు మన దేశంలో ఉన్నాయి. వీటితో విద్యుత్తు తెచ్చుకుని మన పనులు చేయపించుకుంటే కాయకష్టం చెయ్యవలసిన అవసరం ఏ భారతీయుడికి ఉండదు.

ఒకసారి ధనికులమైనాకా, జాగ్రత్తగా ఓ 500 ఏళ్ళలో మన జనాభాని 10వ వంతుకి తగ్గించుకోవచ్చు. అప్పుడు ఇంక మనకి న్యూక్లియర్ విద్యుత్తు అవసరమే ఉండదు . కేవలం సోలర్ విద్యుత్తుతోటే గడపవచ్చు !

ఈ ఆధునిక భారతీయ నాగరికత మన ఆశయం కావలి. అప్పుడే మనం మన పూర్వీకులకి వారసులం అని అనిపించుకోగలం.

6 responses to “నగరాలు వర్ధిల్లాలి

 1. ఆలోచింపచేసేటట్టే వుంది మీ టపా. వాడుకలో ఉన్న అభిప్రాయాలకి పూర్తిగా భిన్నంగా ఉంది.

  ఏది ఏమైనా, చాల చక్కగా రాస్తున్నారు. అభినందనలు.

 2. చిన్నమయ్య గారు
  మీ ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు 🙂

 3. మీదేఁవుంది పారిస్‌లోనో కాన్స్‌లోనో కూర్చుని కబుర్లు చెబుతారు.

  ఇక్కడ, భారతదేశానికి అతి పాషు నగరమైన బెంగుళూరులో, మన దైన సాన్‌ఫ్రాన్సిస్కోలో.
  మీరు రోడ్డు మీదకు అడుగుపెడితే, ఎన్నో వేల మంది మిమ్మల్ని చంపడానికి మీ వైపే అతి వేగంగా కత్తులు పట్టిన పిచ్చివారి వలే వస్తూంటారు. దురదృష్టవసాత్తు వారి వాహనాలు కత్తుల కంటే శక్తిమంతమైనవి. రోజూ రోడ్ల మీద ఏదోక గొడవే! కొందరు కండక్టర్లనే కొడతారు.

  ఇక నగరవాసులు వ్యవసాయం మీద ఎలా ఆధారపడరో నాకు అర్థంకాలేదు గానీ, తక్కువ మంది పిల్లల్ని కంటారంటే నాకు పూర్తిగా నమ్మకం కుదురుతుంది.
  నగరంలో వత్తుళ్ళకు నర్మసు జడిస్తుందంటే ఆశ్చర్యంలేదు. అది ఎప్పుడూ పేపర్లలో చదివేదే.
  ఉదా – మీరు మీ భార్యనో, లేకపోతే ఇంకవరినో ముద్దు పెట్టుకుందామని ప్రక్కకు వొరిగినప్పుడు, ఆమె కళ్ళల్లో చూస్తూ ప్రపంచాన్నే మైమరచి పోయినప్పుడు,
  మీరు ఎక్కడ సంపర్కం చేసి మీ నాగరికతను ఉల్లంఘిస్తారో అని నగరం భయపడి.
  కీఈఈఈఈఈఈఈఈఈఈఈఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌
  అని ధర్మ-హార్ను మోగించి మీ శృంగారానికి భంగం కలిగించి సంతోషపడుతుంది. మీరు కూడా మీ నాగరికత్వం నిలబడినందుకు పరమానందం పొందుతారు.
  కానీ అప్పుడప్పుడూ నాగరికతను ఉల్లంఘించి శలవలకు ప్రశాంతమైన చోట్లకు వెళ్ళి పశువులుగా ప్రవర్తిస్తూంటారు.

  ఇక ఈ నగరాలలో ‘పొరబాటున’ పుట్టిన పిల్లలు కూడా, ఇఱుకు సందుల్లో పాఠశాలల ప్రక్కనే వున్న ప్లే గ్రౌండ్‌లలో (ಸಾರ್ವಜನಿಕ ಆಟದ ಮೈದಾನలలో) ఆడుకోబోతే అక్కడ తమకోసం ఎదురు చూస్తున్న ప్లాస్టిక్ చెత్తను చూసి మురిసి … నాకింక ఇక్కడ మాటలు రావట్లేదు …

  ప్రపంచంలోని అతి ప్రాచీన నగరం స్థాపించనవారు ఇప్పుడు బ్రతికి లేరు. ఇప్పుడు ఉన్న వారికి నగరాలలో బ్రతికడానికి పాటించాల్సిన కనీస నియమాలు కూడా తెలియవు.

  కొన్ని నాగరికతల నాగరికతాలేమికి నగరాలకన్నా పల్లెలే సరిపోతాయి.

  మా ఇంటి పేరు ఆచంట. అది గోదావరి తీరాన ఒక చిన్న వూరు. కాబట్టి మీలా వారణాశి వంటి మహానగరాల వారితో మాట్లాడడానికి కావలసిన జ్ఞానం నా దగ్గర లేకుంటే, నాగరికత్వం గలవారై పెద్ద మనసు చేసుకొని మన్నించగలరు. మా వూరికి బస్సు సైతం వెళ్ళకపోయినా దాని పేరులో నగరం అని వుంది. అది ఏఁవైనా అర్హత అవుతుందేమో చూడాలి.

  ఈ వ్యాసం చదివాక ఎవరో ఎక్కడో వాడిన ‘రవ్వదోస కంటే ఎక్కువ చిల్లులన్నాయి’ అనే పదప్రయోగం గుర్తుకువస్తుంది.

  ప్రకృతిని గౌరవించి నంత కాలం ఎంత పెద్ద వూరిలో బ్రతికినా ఒకటే. అది లేనినాడు బృహన్ముంబయిలే మన బృహన్నాగరికతావస్త్రంలో దాయలేని బృహన్‌బొక్కలవుతాయి. క్షమించాలి బృహద్బొక్కలవుతాయి(జస్త్వ సంధి).

 4. వ్యాసకర్త,మరియు రాకేశుడూ కొన్ని విషయాలను గుంభనంగా వ్యాఖ్యానించారా అన్న అనుమానమొస్తుంది.వివరించగలరు.

 5. రాకేశ్ గారు

  నగరాల్లో ప్రశాంతత ఉండదు నిజమే. అందుకే శెలవలకు ప్రకృతిలోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా చెత్తాగిత్తా పారెయ్యకుండా జాగ్రత్తగా మసులుదాం.

  మన జనాభా ఎక్కడున్నా అక్కడ ప్రశాంతత నాశనం గాక తప్పదు. ఉన్న జనాభాని ఎంత తక్కువ ప్రదేశంలో కంట్రోలు చెయ్యగలిగితే అంత మంచిది.

  మన దేశంలో urban planning గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు planningఅనేది లేదు. జరిగే planning అంతా real estateవ్యాపారంతో జరుగుతుంది. జనాలకి సరిపోయే రోడ్లు ఉన్నాయా, అపార్ట్మెంట్లు ఉన్నాయా, ట్రాములు, బస్సులు ఉన్నాయా అని ఆలోచించరు. ప్రతీఒక్కడు కార్లు, మోటర్బైకులు కొంటాడు. ఇవి నగరజీవనానికి అస్సలు సరిపోవు. ట్రాఫిక్ జాములు అయ్యి మొత్తం అందరికీ సమయం వృధా అవుతుంది. నన్నడిగితే సింగపూరులా కార్లని బహిష్కరించి, public transport అభివృద్ధి చెయ్యాలి.

  ఇది జరగడానికి చాలా టైము పడుతుంది లెండి. కానీ మన ప్రాచీన సింధు నాగరికతలోని నగరాలను చూస్తే ఇప్పుడు ఇంతనీచంగా ఎలా దిగజారామా అని సిగ్గువెయ్యడం తప్పదు.

  > మా ఇంటి పేరు ఆచంట. అది గోదావరి తీరాన ఒక చిన్న వూరు. కాబట్టి మీలా వారణాశి వంటి మహానగరాల వారితో

  నేనేదో జోకువేసాను. మీరు ఒకసారి ఇప్పుడు వారణాసికి వెళ్ళివస్తే అక్కడ గంగా నది మురికి కాలవ వలే ఉండి, రోడ్లంతా కంపుమయంగా ఉండి, మా ఆచంటే అదుర్సు అని అంటారు 🙂

  రాజేంద్ర గారు

  నేను గుంభనంగా ఏమీ మాట్లాడలేదు, కానీ రాకేశ్ గారు అక్కడక్కడా నన్ను వారి జోకులతో దెబ్బిపొడిచారు. మన బ్లాగులలో ఇవి తప్పవు లెండి 🙂

 6. అర్బన్ ప్లానింగు అనునొక మరీచిక మీద ఒక మంచిటపా వదలగలరు,వీలున్నప్పుడల్లా వాళ్ళని బూతులుతిట్టటం తప్ప అ ఆలు కూడా తెలియవు నాకు.కాబట్టి ఆపనేదో కాస్త త్వరగా….:)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s