పెట్రోలు ధరలపై నీచ రాజకీయం

మీలో ఎవ్వరైనా పెట్రోలు ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా రోడ్డుపై నిరశన ప్రదర్శనలు జరిపారా ? అయితే, తక్షణంగా ఈ పోస్టు చదవండి.

రాష్ట్రంలో జరుగుతున్న నీచ రాజకీయాలు చూసి నాకు కొంత మాట మూగవోయింది. రాయాలనుకున్న పోస్టు రాయలేకపోయాను. కానీ “పర్ణశాల” బ్లాగులో ఒక కామెంటు వ్రాసాను. ఇప్పటికి దీనితో సరిపుచ్చుతాను.

పర్ణశాల బ్లాగులో క్రూడు పెట్రోలు ధర లీటరుకి 25 రూపాయలు, శుద్ధికి 2 రూపాయలు, రవాణాకి 10 రూపాయలు కలుపుకున్నా 37 రూపాయలే ఉంటుంది. మిగిలిన సొమ్మంతా ప్రభుత్వం పన్నులుగా దండుకుంటోంది అని వ్రాసారు. గుండెలు మండుతున్నాయి అని వ్రాసారు. మొన్న నీచ రాజకీయాలకి ప్రతిరూపమైన ఈనాడు పత్రికలోనూ ఇదే విధంగా సంపాదకీయం వచ్చింది.

ఒకసారి నిజాలని వెలికి చూద్దాం.

1 లీటరు క్రూడు ఆయిలు శుద్ధిచేసిన తరువాత 1 లీటరు పెట్రోలు వచ్చేస్తుందా ? రాదు. కొంత భాగం పోతుంది. శుద్ధి చేసిన పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి కారణం అది.

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు ధర పెరగడానికి కారణం డాలరు విలువ క్షీణించడం (పెట్రోలు అమ్మకాలన్నీ డాలర్లలో నడుపుతున్నారు అమెరికా ఒత్తిడి మూలంగా).

ఫ్యూచర్ ట్రేడింగు ద్వారా పెట్రోలు ధరలని స్పెక్యులేటర్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇంకో రెండేళ్ళలో క్రూడు ధర బేరెల్ కి 200 డాలర్లు చేరుకుంటుందని ఉవాచా (అంటే పెట్రోలు ధర రెట్టింపు అవుతుందన్నమాట).

ప్రభుత్వం పన్నులన్నీ తీసిపడేసినా పెట్రోలు ధరలు పెరగడం ఖాయం. దీనికి మూలకారణం మన భూమిలో శిలాజ ఇంధన నిల్వలు చాలా పరిమితంగా ఉండడమే (మహా వస్తే పెట్రోలు మరో 60 ఏళ్ళు, బొగ్గు మరో 200 ఏళ్ళు వస్తాయి). దీనికి తోడు గ్లోబల్ వార్మింగు బెడద పొంచి ఉంది.

పెట్రోలు ధరలపై పన్ను అధికంగా ఉండడం వల్ల ఇతర ఇంధనాల వినియోగం ప్రోత్సహించగలుగుతాము. మన భవిష్యత్తుకి ఇది అత్యవసరం. పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం పెట్రోలు లాభాలని కొంత ప్రజలకి తిరిగి మళ్ళించగలుగుతోంది (అవినీతితో ఈ డబ్బులు హుళుక్కి అయిపోతున్నది వేరే విషయం). సమాజంలో ధనిక వర్గాలు పెట్రోలుని మరింత ఎక్కువగా వినియోగించుతారు. సామాన్య ప్రజానీకంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందుకని పెట్రోలు భారం పడేది ధనిక వర్గం పైనే, మధ్యతరగతి వర్గంపై కూడా కొంత పడుతుంది. కానీ పేదవర్గంపై అతి తక్కువ. థియరీలో, ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు పేదలపై ఖర్చు పెట్టవచ్చు.

బుర్ర ఉన్న కమ్యూనిస్టులు ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ఎందుకు డిమాండు చేస్తారు ? పేదలపై ప్రేమ ఉంటే ధనికులకి సబ్సిడీ ఇవ్వడమేమిటి ? వాతావరణాన్ని నాశనం చెయ్యమని డబ్బు బాబులకి ప్రోత్సాహం ఎందుకు ? ప్రస్తుతం అంతా సిగ్గులేని రాజకీయం నడుస్తోంది.

ప్రజలపై పెట్రోలు భారం తగ్గించాలంటే అత్యవసరమైన పని రైలు నెట్వర్కుని ఆధునీకరించడం. మొత్తం విద్యుత్తుతో నడిపిస్తే పెట్రోలు భారం సరుకుల రవాణాపై పడదు. అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. ద్రవ్యోల్పణం అదుపులోకి వస్తుంది. దీర్ఘకాలికంగా, మన దేశానికి ఇది అత్యవసరం.

ఇది జరగాలంటే విద్యుత్తు ఉత్పత్తి అతివేగంగా పెరగాలి. దీనికి రెండే మార్గాలు – ఒకటి బొగ్గు, రెండు న్యూక్లియర్ విద్యుత్తు. బొగ్గు 200 ఏళ్ళు మాత్రమే వస్తుంది. మన దేశ అవసరాలకి లక్ష ఏళ్ళు సరిపడేంత థోరియం నిల్వలు మన దేశంలో నిమిడి ఉన్నాయి. థోరియం వినియోగించుకుంటే ప్రపంచంలోనే మనదేశం అతి ధనిక దేశం అన్నమాట. సౌదీ అరేబియాకి తాతలం మనం. గ్లోబల్ వార్మింగుపై మనం నిజాయితీగా ఉంటే బొగ్గుని మనం విడిచిపెట్టి న్యూక్లియర్ విద్యుత్తుని ప్రోత్సహిస్తాము. ఈ విషయం లోనూ కమ్యూనిస్టులు ప్రజా శ్రేయస్సుకి రివర్సులో పనిచేస్తున్నారు.

ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బులన్నీ (పెట్రోలుపై లక్షల కోట్లు నష్టాపోతోంది ప్రభుత్వం) సబ్సిడీలంటూ చివరకి ధనిక, మధ్యతరగతి వర్గాలకి అప్పగిస్తే ఇంక భవిష్యత్తు సంగతేమిటి ?

ప్రకటనలు

11 responses to “పెట్రోలు ధరలపై నీచ రాజకీయం

 1. కొంతవరకూ తర్కబద్ధంగానే వుందిగానండీ, పెట్రోల్ ధరలపెంపు పేద ప్రజలనెట్లా తాకకుండా వుంటుందో కొంచెం వివరిస్తారా? పెట్రోల్ ధర పెరగడం ఆలస్యం, నిత్యావసర వస్తువుల రవాణా ఛార్జీలు వాటితోపాటే ఉప్పు పప్పుల ధరలూ పెరుగుతాయి. మరి ఈ ప్రభావం బీదా, గొప్పా అందరిపైనా వుంటుంది కదా? అణు విద్యుత్ విషయంలో మాత్రం మీతో వంద శాతం ఏకీభవిస్తాను.

 2. బ్లాగాగ్ని గారు

  ప్రభావం ఉండదని అనట్లేదు. కానీ, పెట్రోలు ధరల వల్ల ఎక్కువగా నష్టపోయేది ధనిక, మధ్య తరగతి ప్రజలే. పేదవర్గం నష్టపోతుంది నిజమే, కానీ పరిమితంగానే. సరుకుల రవాణాకై ప్రస్తుతం డీజిలు వాడుతున్నారు, ప్రభుత్వం డిజిలు ధరలు పెంచినా పెట్రోలు అంతగా పెంచలేదు.

  సబ్సిడీ ఇస్తోంది అంటే అది ఎంత సూటిగా ప్రజలకి చేరుతోందనేది ముఖ్యం. ఉన్న డబ్బులని పెట్రోలు సబ్సిడీలకై ఖర్చుపెట్టే బదులు డైరెక్టుగా ఆహారం, నిత్యావసర వస్తువులపైనే ఖర్చుపెట్టవచ్చు కదా. ఉన్న రేషన్ కార్డుల వ్యవస్థని మరింత మెరుగు పరిచి ధరలు తగ్గించవచ్చు కదా.

  నిజానికి, మన ప్రభుత్వం ఈ రంగంలో బాధ్యతని మరిచిపోయి ప్రైవేటీకరణ చేస్తోంది. ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఇలా మాట్లాడవచ్చు. పెట్రోలు గురించి గోల పెట్టడమెందుకు ?

  దీర్ఘకాలికంగా, సరుకుల రవాణా మొత్తం విద్యుత్తుపై నడవాలి. డీజిలుని కూడా మనం నమ్ముకోలేము. అందుకనే, ఉన్న డబ్బులని పెట్రోలు సబ్సిడీ కింద ఖర్చుచేసేబదులు రైలు ఆధునీకరణపై వెచ్చించాలి. బ్రిటీషు వాడి పుణ్యమా అని ఒక మంచి రైల్వే వ్యవస్థ ఇప్పటికే ఉంది. దీనిని ఆధునిక యుగంలోకి రప్పించాలి. దీనికి ఇంచుమించు 200 బిలియన్ డాలర్లు వెచ్చించాలి.

  పెట్రోలుని సబ్సిడీ చెయ్యడం ద్వారా ఈ అవకాశం మనం నష్టపోతున్నాము.

 3. చాలా కాంప్లెక్స్ సమస్య ఇది. నాలాంటి మట్టిబుర్రకి ఇంకా సరిగ్గా అర్థంకూడా కాలేదు.

  పెట్రోకనామిక్సూ, పెట్రోపాలిటిక్సూ సామాన్య మానవులకి అంత సాధారణంగా అర్థమవ్వవు. తెలిసేదల్లా, ఇంటి ఖర్చు పెరగడం -గృహ బడ్జట్టు చెయ్యిదాటడం. ఇక కోపం కాపాడవలసిన ప్రభుత్వం మీదకాక ఇంకెవరిమీద చూపగలరు?

 4. మహేష్ గారు

  మీ బ్లాగు చాలా బాగుంది. మిగిలిన పోస్టులు కూడా చదివాను. కానీ, మీరు పెట్రోలు విషయంపై పొరబడ్డారు. ఇలా జరగడానికి ఒక కారణం మన మీడియా తప్పుడు సమాచారంతో ప్రజలని ముంచివెయ్యడం. ఈనాడు పత్రిక వెయ్యికోట్ల ఎకరాలకి (రామోజీ ఫిల్ము సిటీ స్థలం) చంద్రబాబుకి అమ్ముడుపోయిందని అందరికీ తెలుసు. కానీ, జనం మూర్ఖంగా ఈ పత్రిక చెప్పేదంతా నమ్ముతూ వస్తున్నారు. రామోజీ వారి హుండీలో డబ్బులు సమర్పించుకుంటూ ఆయన సుపుత్రుడు సుమనుచే టీవీలో శఠగోపం పెట్టించుకుంటున్నారు.

  వెనక రాజకీయం ఎలా నడిచిందో నాకు తెలియదు కానీ , ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయంపై కొంత నిజాయితీగా వ్యవహరించింది.

  పెట్రోలు ధరలు పెరిగినా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా కట్టడి చెయ్యవచ్చును. దీనికి మంచి మార్గాలున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ మెరుగుపరచడం అందులో మొదటిది. మనం ప్రభుత్వంపై ఈ విధంగా ఒత్తిడి తేవాలి.

 5. మీ విశ్లేషణ బాగుంది.
  నూక్లియర్ ఇంధన వినియోగంపై ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నారో ఇదివరలో రెండుమూడు కామెంట్లలో అభ్యర్ధించాను. ఎవరూ స్పందించలేదు. మీకు వీలైతె వివరించండి.
  http://sangharshana.blogspot.com/2008/06/blog-post_05.html

  మీ ఆఖరు పేరాలోని అంశాలతొ సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.

 6. Good one. You could have touched up on solar power and other non conventional power systems also.

 7. పెట్రోల్ ధర పెంపు సబబు అయినప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలొ మాత్రం తగ్గింపు ఎందుకు(రాష్ట్ర పన్నులు తగ్గిస్తారట), ఓకవేళ అలా తగ్గిస్తే ఆ రాష్ట్ర ఖజాన పైనా బారం పడదా! అది ఎవరు భరిస్తారు…మళ్ళి ప్రజలే కదా… ఇక్కడ రాజకీయం ఎవరిది?

 8. చైతన్య గారు
  నా బ్లాగు పార్టీలను విమర్శించడానికి కాదు, సమస్యలపై ఆలోచించేలా విద్యావంతులని ప్రోత్సహించడం నా ఉద్దేశ్యం. కాంగ్రెస్సు వాళ్ళంటే నాకేమీ లవ్వు లేదు. పందికొక్కుకి పెరట్లో తినడం నేర్పక్కర్లేదు, కాంగ్రెసువారికి రాజకీయం నేర్పక్కర్లేదు. వెన్నతో పోసిన విద్య. ఎవ్వరికెవ్వరూ తీసిపోరు.

  సూర్యుడు గారు
  ఉష్ణ దేశమైన మనదేశంలో సోలార్ విద్యుత్తుకి అద్భుతమైన అవకాశాలున్నాయి. ఎండాకాలంలో ఎండల్ని మనం ఏ.సీ లను తిప్పేందుకు ఉపయోగించాలి. కానీ మన అవసరాలన్నింటికీ సోలార్ విద్యుత్తు సరిపోదు అని నా గట్టి అభిప్రాయం, దీనిపై మరొక పోస్టులో వివరంగా వ్రాస్తాను.

  బొల్లోజు బాబా గారు
  న్యూక్లియర్ విద్యుత్తు విమర్శించడానికి వేల కారణాలున్నాయి; కొన్ని నిజమైన కారణాలు కొన్ని అపోహలు. మరొక పోస్టులో వివరిస్తాను.

 9. పెట్రోలు ధరల మీద బాగా రాసారు. కమ్యూనిస్టులు పెరిగిన పెట్రోలు మీద హడావిడి చూసి చాలా చిరాకుగా అనిపించింది. ఈనాడు ప్రవర్తన గురించి కుడా చక్కగా చెప్పారు. మనకి తోరియం నిల్వలు బాగా ఉన్నాయని తెలియదు, ఒక కొత్త విషయం తెలుసుకున్నాను.

 10. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం

 11. పింగుబ్యాకు: జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం | Poddu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s