ఇంధనాల భవిష్యత్తు

మన దేశ భవిష్యత్తుకి 3 ప్రధాన అడ్డంకులున్నాయి : ఇంధన కొరత, నీటి కొరత, విద్య కొరత. నా బ్లాగులో ఈ మూడింటిపైన మూడు పోస్టులు వ్రాద్దామని నిశ్చయించుకున్నాను. నా మాట ఎంతమందికి వినపడుతుందో తెలియదు, కానీ నా చేతనయ్యింది నేను చెయ్యాలి కదా.

మొదటగా ఇంధన కొరత గురించి వ్రాస్తాను.

ఇంధనం ధరలు మార్కెట్లో అన్ని ధరలని నియంత్రిస్తాయి. సరుకులని రవాణా చెయ్యాలంటే ఇంధనం కావాలి. ఫ్యాక్టరీలు నడపాలంటే ఇంధనం కావాలి. విద్యుత్తు ఉత్పత్తి చెయ్యాలంటే ఇంధనం కావాలి. ఆధునిక ప్రపంచం ఇంధనం లేకుండా నడవలేదు. మనదేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన వనరులు పుష్కలంగా కావాలి.

కానీ, సంప్రదాయ ఇంధన వనురులు అంతరించిపోతున్నాయి. పెట్రోలు ధర రోరోజుకీ పెరుగుతుంది తప్ప తగ్గదు. మనం వాడుతున్న రేటులో పెట్రోలు వాడుకుంటూ పోతే మరో వందేళ్ళలో అంతా హరించుకుపోతుంది. కానీ ధరలు ఆకాశాన్నంటడానికి అంతవరకూ ఆగనక్కర్లేదు. సంవత్సరానికోసారి ధర రెట్టింపు అవుతుంది.

దీని దెబ్బ పడేది సామాన్యుడి పైనే. రోజువారీ వస్తువులు లారీల్లో మునుపటిలాగా రవాణా చెయ్యలేరు, కారణంగా ధరలు ఆకాశాన్నంటుతాయి. ఈ దెబ్బకి దేశాలు అతలాకతోలమైపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. ప్రజల్లో అశాంతి పెరిగిపోతుంది.

శిలాజ ఇంధనాలు :

మన భూమిలో మిగిలి ఉన్న శిలాజ ఇంధనాలు ఇంచుమించు ఇంత (ZJ : జిలియన్ జౌల్సు)

 • పెట్రోలు – 18.4 ZJ
 • నాచురల్ గ్యాసు – 15.7 ZJ
 • బొగ్గు – 290 ZJ

పోలికకి 2004లో ప్రపంచం మొత్తం వినియోగించిన ఎనర్జీ మొత్తం 0.5 ZJ. ఇందులో, శిలాజ ఇంధనాల వాటా 86.5%, అందులోనే పెట్రోలు వాటా 37%. ఇది త్వరలో మరింత పెరుగుతుంది (చైనా, ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కనుక).

వీటిలో పెట్రోలు మాత్రమే ప్రస్తుతం వాహనాలు నడపడానికి డైరెక్టుగా పనికివస్తుంది. ఈ మధ్యన కొన్ని రకాల బస్సులను, కార్లను గ్యాస్ తో నడుపుతున్నారు. కానీ, అంతిమంగా ఇవన్నీ రద్దు చెయ్యక తప్పదు. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చెయ్యవచ్చు, దానిపై కరెంటుతో నడిపగలిగిన వాహనాలు ట్రెయిన్లు, కొన్ని కొత్త మోడల్ కార్లు. ఇవి మరింకొంతకాలం నడపవచ్చు, ధరలు ఆకాశాన్నంటే ముందు.

పెట్రోలు ధరలు పెరగడంతోనే మిగిలిన ఇంధన ధరలు కూడా వెనువెంటనే పెరిగిపోతాయి. ఎందుకంటే, చివరకి అన్ని రకాల ఇంధనం ఒకే రకంగా వాడతాం కాబట్టి. ప్రపంచం మొత్తం ఈ శిలాజ ఇంధనాల ఆధారంగా పనిచేస్తోంది కనుక ఈ వనరులు ఉన్న దేశాలు ఆడింది ఆటగా పాడింది పాటగా చెలామణీ అవుతోంది. వీటిలో తమ వాటా రక్షించుకొనేందుకు అమెరికా మధ్య-ఆసియా మొత్తం కన్నువేసి ఉంచగా, చైనా సుడాను, వెనిజులా దేశాలను మచ్చిక చేసుకొంటోంది. మన భారతదేశం వీటిపై పెద్దగా ఆలోచించట్లేదు ఇంకా. మనదేశంలో కొద్దిపాటుగా బొగ్గు ఉంది, మరింకేమీ లేదు. అటు ఇరానుని, ఇటు బర్మాని కొంత సాయమడగాలని మనవాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంధన వనరులు పుష్కలంగా ఉన్నదేశాలన్ని మానవ హక్కులను రెండుకాళ్ళతో నొక్కి నేలకు రాస్తున్నాయి. మిగతా ప్రపంచం నోరు మూసుకుని గప్-చుప్ అంటోంది.

కానీ చివరికి ఈ శిలాజ ఇంధన వనరులను ఏ దేశమైనా నమ్ముకోలేదు.

శిలాజ ఇంధనాలు వాడడం వలన మరో ప్రమాదం గ్లోబల్ వార్మింగు. బొగ్గు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోలు కావచ్చు – భూమిలో ఇంధనరూపంలో మగ్గుతున్న కార్బన్ నిల్వలని మనం ఆకాశంలో కార్బన్ డయాక్సైడుగా హుష్ కాకీ అని ఊదేస్తున్నాం. ఇది వాతావరణాన్ని వేడెక్కించేసి, ప్రపంచంలో పెనుమార్పులు తెస్తోంది. శిలాజ ఇంధనాలు మొత్తం వాడేసే ముందుగానే, గ్లోబల్ వార్మింగు రూపంలో మానవాళికి ముప్పు వాటిల్లవచ్చు.

గాలి-నీరు-వెలుతురు తో విద్యుత్తు :

సరుకుల రవాణాకు వీలైనంతగా కరెంటు ట్రెయిన్లు, కరెంటు కార్లు వాడుకుంటే విద్యుత్తుని మరికొన్ని విధాలుగా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ మార్గాలు ఎల్లప్పిటికీ తెరిచే ఉంటాయి, ఎందుకంటే సూర్యుడు ఉన్నంతకాలం వీటికి డోఖా ఉండదు కాబట్టి. వీటితో గ్లోబల్ వార్మింగు బెడద కూడా ఉండదు.

కానీ వీటితో మనం తెచ్చుకోగల విద్యుత్తు అతి పరిమితమైనది. మన అవసరాలకు కనీసం 5% కూడా సరిపోదు. గాలిమరలు, సూర్యరశ్మి-పానెల్లు కట్టడానికి చాలా ఖర్చుతో కూడినవి. నీటి విద్యుత్తు ముఖ్యంగా భారీ డ్యాముల ద్వారా వస్తుంది. కట్టడానికి వీటి ఖర్చు ఎక్కువే, అదిగాక వీటివలన ప్రజలు నిరాశ్రయులవుతారు, పర్యావరణానికి చెట్టు చేమకు ఎంతో హాని.

ఏచూరి సీతారాం గారు మొన్న పార్లమెంటులో అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందానికి విరుద్ధంగా ప్రసంగిస్తూ జల విద్యుత్తును 3 రెట్లు మెరుగ్గా ఉపయోగించుకోవాలి అని సూచించారు (ప్రస్తుతం మనం 3వ వంతు మాత్రమే ఉపయోగిస్తున్నాం). అంటే 3 రెట్లు మరిన్ని డ్యాములు నిర్మించాలని వారి ఉద్దేశ్యం. ఒకవేపు నర్మదా-బచావో-ఆందోళన చేస్తున్నవారితో సై అంటారు, మరొకవేపు ఇలాంటి సూచనలు చేస్తారు.

వారి ప్రసంగంలో వెల్లడించిన వివరాలు : భారతదేశం ఏడాది కరెంటు వాడకం (కేవలం కరెంటు మాత్రమే, పెట్రోలు మొదలైన ద్రవ ఇంధనాలు కాదు)

 • ప్రస్తుతం 2007 : 127 GW(గిగావాట్లు) (1ZJ = 30,000 GW)
 • 2016-17 నాటికి మన అవసరాలు : 330 GW
 • 2007 నీటి విద్యుత్తు ఉత్పత్తి : 33 GW
 • మొత్తం ఉపయోగించుకోగల నీటి విద్యుత్తు వనరులు : 150 GW
 • మిగులు విద్యుత్తు (330-127=173 GW)ఎలా తెచ్చుకోగలం : నీరు (150-33=117GW) మరింత బొగ్గు కాల్చడం (173-117=56GW)

వారి ఉద్దేశ్యంలో బొగ్గు విద్యుత్తు అన్నింటికన్నా చవక గనక, నీటి విద్యుత్తు బదులు బొగ్గునే వీలైనంత ఎక్కువ కాల్చెయ్యాలి. కానీ ఎంతకాలం ఇలా మనం కంటిన్యూ అవగలమో ఆయన మాట్లాడలేదు.

బయో ఇంధనాలు :

పంటల ద్వారా కార్బనుని తయారు చేసి దానిని ఇంధనంగా వాడవచ్చు. ప్రస్తుతం ఎక్కువగా చెరుకు, జొన్న పంటలనుండి బయో-ఇథనాలు (పెట్రోలు లాంటి ద్రవ ఇంధనం) తయారు చేస్తున్నారు. దీని వలన గ్లోబల్ వార్మింగు ఉండదు. ఎందుకంటే, ఉత్పత్తి చేసిని కార్బన్ డయాక్సైడు ని తిరిగి పంటమొక్కలు కార్బనుగా వాతావరణం నుండి వెనక్కి తీసుకుంటాయి.

బయో-ఇంధనాల కోసం పంటలు పెంచడం వలన పంట భూమి హరించుకుపోయి ఆహార ధరలు పెరిగిపోతాయని పలువురు హాహాకారాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కొంతవరకూ నిజమే.

కానీ, బయో-ఇంధనాలను పండిస్తున్నది ముఖ్యంగా అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు. వాటికి ఆహార కొరత లేదు. అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండు, జపాను మొదలైన దేశాలలో రైతులకి విపరీతమైన సబ్సిడీలనందించి పంటలు పండిస్తున్నారు. ఇది ఒక రకంగా విపరిమాణం. ఈ సబ్సిడీలను పుచ్చుకోవడం వలన (ముఖ్యంగా దండుకొనేది చిన్న రైతులు కాదు, భారీ ఫార్మింగు సంస్థలు) ఈ దేశాలలోని ఆహారం మిగిలిన దేశాల కంటే చౌకగా తయారయ్యింది. అతి విచిత్రంగా అభివృద్ది చెందిన దేశాలు ఆహారాన్ని పేద దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

పేద దేశాలలో ఖర్చులు తక్కువ గనక ఇక్కడి పంటలు సహజంగానే తక్కువ ఖరీదు ఉంటాయి. ధనిక దేశాలు సబ్సిడీలను ఇవ్వకపోయినట్లైతే పేద దేశాలే వాటికి ఆహారం ఎగుమతి చెయ్యగలవు. పంటలు వెయ్యడానికి భారీ పెట్టుబడి అవసరం లేదు గనక, ఇది సుళువుగా పేద దేశాలకు విదేశీ మారక ద్రవ్యం తేవగలదు. ఈ డబ్బుతో పేద దేశాలు మరింత అభివృద్ధి అవగలవు. కానీ, ప్రస్తుతం ఇలా జరగట్లేదు.

పేద దేశాలే ధనిక దేశాలపై ఆహారం కోసం ఆధారపడుతున్నాయి. ఉదాహరణకి, మెక్సికో జొన్న కోసమై అమెరికా పై ఆధారపడుతోంది. అమెరికాలో జొన్నని బయొ-ఫ్యూయెల్ చేస్తే సహజంగానే మెక్సికోలో జొన్న ఖరీదు పెరుగుతుంది. దీనివలన విపరీతమైన చెడు ప్రచారం వచ్చింది. మొన్న, ఆంధ్రజ్యోతి పత్రికలో బయో-ఫ్యూయెల్స్కి విరుద్ధంగా ఘాటుగా వ్యాసం వ్రాసేసారు.

కానీ వెనక్కి నక్కి ఉన్న విషయమేమిటంటే, పేద దేశాల్లో పంట భూములని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఉదాహరణకి, మన భారతదేశంలో ఎకరా భూమికి వచ్చే దిగుబడి అమెరికాతో పోలిస్తే సగమే ! దీనికి ముఖ్య కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు లేకపోవడం వలన, ఆధునిక పద్ధతులని మనం అనుసరించకపోవడం వలన. మన వ్యవసాయ ఉత్పత్తులని ధనిక దేశాలకి ఎగుమతి చేసే అవకాశం వస్తే, సహజంగానే వ్యవసాయ రంగం బాగా వృద్ధి చెందుతుంది. ఇది మనలాంటి దేశానికి చాలా మంచిది. బయో-ఫ్యూయెల్స్ వలన మనకి చివరికి మంచే గానీ చెడు కాదు.

మన ప్రపంచంలోని భూములను సరిగ్గా ఉపయోగించుకుంటే, ప్రపంచ జనాభాకి అందరికి ఆహారం తీర్చడంతో పాటు 20% ఇంధన అవసరాలను కూడా మన పంట భూములు తీర్చగలవు. ఈ దిశగా మనం పావులు కదపాలి, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాలి, ఈ సంధి-దశలో ఎక్కడా ఆకలి చావులు లేకుండా జాగ్రత్త పడాలి.

చెరకు వంటి పంటలను కాకుండా, భవిష్యత్తులో సెల్లులోజు పంటలచే బయో-ఇంధనాలను తయారు చెయ్యడానికి జన్యు-రసాయన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వీటి వలన బయో-ఇంధనాలు మరింత సమర్థవంతమవుతాయి. పంట భూముల బదులు, సముద్రంపై ఆల్గేను పెంచి, వాటితో బయో-ఫ్యూయెల్స్ తాయారు చేసేందుకు కూడా కృషి జరుగుతోంది.

న్యూక్లియర్ విద్యుత్తు :

న్యూక్లియర్ విద్యుత్తు ఒక్కటే ప్రపంచ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చగలిగే వనరు. మన భూమిలో ఉన్న యురేనియం నిల్వలు 2500 ZJ (బొగ్గు కంటే 10 రెట్లు ఎక్కువ !) వీటికి థోరియం నిల్వలు కలుపుకుంటే మరింత ఎక్కువ. ప్రపంచం మొత్తానికి వేయి, 2వేల సంవత్సరాలు నిక్షేపంగా విద్యుత్తు సరఫరా చెయ్యగల నిల్వలు ఇవి. ఈ అనంతమైన కాలంలో మన శాస్త్రవేత్తలు మరెన్నో ఆవిష్కరణలు చేస్తారు. ఇతర గ్రహాలలో మానవులు నివాసాలు కడతారు.

న్యూక్లియర్ విద్యుత్తు గ్లోబల్ వార్మింగు చెయ్యదు. వాతావరణంలో డైరెక్టుగా కాలుష్యం వెదజల్లదు. కానీ, దీనికున్న అతిముఖ్యమైన సమస్య – రేడియో ఏక్టివ్ చెత్త. ఈ చెత్తని చాలా జాగ్రత్తగా పదిలపరచాలి. ఎక్కడైనా బయటకి కలిస్తే పర్యావరణానికి, మానవాళికి విపరీతమైన హాని కలుగుతుంది. అంతేకాక, ఈ టెక్నాలజీ ఉంటే ఆటం బాంబులు తయారు చెయ్యడం కూడా అతి సుళువు. రేడియో ఏక్టివ్ చెత్త నుండి కూడా బాంబులు చెయ్యవచ్చును. ప్రపంచమంతా ఏకమై ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తప్ప ఇలాంటి సున్నితమైన సమస్యలను పరిష్కరించలేము. ఇది మన భవిష్యత్ తరాలకి ఒక ఛాలెంజి.

ఒకప్పుడు న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు చాలా ప్రమాదభరితంగా ఉండేవి (చెర్నోబిల్ ఉపద్రవం గురించి అందరికీ తెలుసు). ప్రస్తుతం ఆధునిక శాస్త్ర పద్ధతుల వల్ల ఇది చాలా మారింది. భావి తరాలకి ఇంధన అవసరాలను సమర్ధంగా తీర్చగలిగే సాధనం ఒక న్యూక్లియర్ విద్యుత్తు మాత్రమే. ఫ్రాన్సు దేశం ఈ విషయంలో ఎంతో ముందడుగు వేసి తన విద్యుత్ అవసరాలలో 79% న్యూక్లియర్ విద్యుత్నే వాడుకుంటోంది (ఫ్రాన్సులో నేను ఈ బ్లాగు వ్రాయడానికి, నా కంప్యూటరు కూడా న్యూక్లియర్ కరెంటునే వాడుతోంది) . మన భారతదేశం ప్రస్తుతం కేవలం 3% అవసరాలకు న్యూక్లియర్ విద్యుత్ను వాడుతోంది.

దీనిని త్వరగా మనం చాలా పెంచుకోవలసిన అవసరం ఉంది. సరుకుల రవాణాకు కూడా కరెంటు ట్రెయిన్ల వాడకం పెంచాలి. లేదంటే, భవిష్యత్తులో సామాన్య పౌరుడు పెట్రోలు ధరలను తట్టుకోలేడు.

మొదట్లో, న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలను ఏర్పరచడం ఖర్చుతో కూడిన వ్యవహారమే. కానీ దూరాలోచనతో యోచిస్తే, ఇది ఎంతో భేషైన పని. మన కమ్యూనిస్టులు అమెరికా వ్యతిరేకతతో మరొకసారి మూర్ఖంగా ఈ అవకాశానికి అడ్డు తగిలారు.

న్యూక్లియర్ విద్యుత్తును ప్రస్తుతం ఫిషన్ (విచ్ఛేధన) ప్రకారం తెచ్చుకుంటున్నాము. పరిశోధన బాగా నడిపితే భవిషత్తులో ఫ్యూజన్ (సమ్మేళనం) పద్ధతిలో కూడా తెచ్చుకోవచ్చు. ఇది పర్యావరణానికి మరింత అణువైనది, అంతేగాక ఇంధన వనరులు (హైడ్రోజన్ అణువులు) ఎప్పటికీ తరగవు ! ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది కానీ విజయవంతమైతే ఇదొక అనంతమైన శక్తి యంత్రము. మన భారతదేశం ఈ దిశలలో ఆలోచించాలి.

9 responses to “ఇంధనాల భవిష్యత్తు

 1. కిరణ్ గారు: చాలా గొప్ప మరియు వేనవేల విధాల ప్రశంసార్హమైన వ్యాసమిది. తేట తెలుగులో చక్కగా వివరించినందుకు, మీ ఆలోచనలకు, విశ్లేషణా పటిమకు హృదయపూర్వక అభినందనలు మరియు ఇక్కడ ప్రచురించి అందరితో పంచుకున్నందులకు ధన్యవాదములు.

  సూచన : ఈ వ్యాసంలో ప్రచురించిన విషయాలను కొంచెం వైవిధ్యంగా … అంటే కనీసం మనం ఆచరించ(చేయ)వలసిన వాటిని points గా పెట్టి bullets తో present చేసి ఉంటే చదువరులకు బాగా స్పష్టత వచ్చి ఇంకా బాగుండేదేమో అనిపించింది…

  మిగతా వాటి కోసం ఎదురు చూస్తూ …

 2. కిరణ్ గారు : ఒకదానికొకటి complement గా అనిపించే ఈ రోజే ప్రచురించబడిన మూర్తి గారి బ్లాగ్ లో ఉన్న

  రాబోతున్న ఎనర్జీ కొరత

  లంకెను చూడండి.

 3. చక్కగా వ్రాసినారు,

  కానీ నేను బయో ఇంధనాన్ని వ్యతిరేకించేవాళ్ళలో ఒక్కడిని. మీరు చెప్పినట్టు ఆకలి చావులు మరింత పెరక్కుండా బయో ఇంధనాన్ని ఉత్పత్తి చెయ్యడాం అసాధ్యం! ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం బలవంతుడిదే రాజ్యం, ఇదేమీ ఉతోపియా కాదు ముందు తిండి తరువాత ఇంధనం అనడానికి డబ్బున్నవాడు, నాలుగు బాంబులు ఉన్నవాడు మరళా పేద దేశాలను బానిసలుగా చేసి కేవలం బయో ఇంధనం మాత్రం ఉత్పత్తి చేయి అని తేలిగ్గా అనవచ్చు.

  మీ లెక్క ప్రకారం కూడా బయో ఇంధనం కంటే న్యూక్లియర్ ఇంధనమే మరింత కాలం మన్నేది, మరింత ఉపయోగకరమైనది, ఇహ బయో ఇంధనం కోసం మనం ఎందుకు ఇన్ని ప్రాణాలను ఫణంగా పెట్టి పరిశోధనలు చేయాలి?

  http://oremuna.com/blog/?p=1158

  ఈ కథ చదవండి!

 4. కిరణ్ గారు,

  బయో ఇంధనం వల్ల గ్లోబల్ వార్మింగు ఉండదన్నది ఒక భ్రమే. ఒక చక్కని వ్యాసం “టైము” మ్యాగజైనులో గత వారమే ప్రచురించారు. అందరూ వెర్రిగా బయో ఇంధనము వైపుకి పోయేప్పటికి అక్కడ మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈ కథ చదవండి!

  http://www.time.com/time/magazine/article/0,9171,1725975,00.html

 5. @తెలుగు’వాడి’ని గారు : మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. బత్తీబంద్ బ్లాగులో నిన్ననే ఒక కామెంటు వ్రాసాను. ఇంకా అది awaiting moderation. ఆ తరువాతనే, నా బ్లాగులో పోస్టు వ్రాసాను. ఒక కాంప్లెక్సు టాపిక్కుని ఇలా బ్లాగులో వివరించడం చాలా కష్టమే. తిప్పగా, తిప్పగా బంతి నున్నగా తయారవుతుంది అన్నట్టు – నేర్పుగా వివరించడానికి చాలా అనుభవం కావాలి. తరువాతి పోస్టులు ఇంకొంత సుళువుగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

  @చావాకిరణ్ గారు : మీ అభ్యంతరాలు సహేతుకమైనవే. ప్రపంచంలో ఉన్నవాడిదే రాజ్యం. కానీ పేదరికాన్ని, ఆకలిచావులను నిర్మూలించాలి అంటే డబ్బుని చాలా ఫోకస్ గా ఉపయోగించాలి. జెఫ్రీ సాక్స్ గారి పుస్తకాన్ని ఒకసారి చదవండి. ఆయన చాలా విలువైన సూచనలు చేసారు. ప్రస్తుతం ధనిక దేశాలు వ్యవసాయదారులకి బిలియన్ డాలర్ల సబ్సిడీలను ఇస్తున్నాయి. ఇవి ఒక రకంగా ప్రపంచంలో ఆకలిని తగ్గిస్తున్నాయని చెప్పొచ్చు. కానీ, ఈ సబ్సిడీలు హేతుబద్ధమైనవి కావు. ఇవే డబ్బులని మరింత తెలివిగా ఖర్చుపెట్టవచ్చు. బయో-ఫ్యూయెల్స్ వలన ఈ సబ్సిడీలు తగ్గుతున్నాయి, తద్వారా మిగిలే డబ్బులని పేదదేశాల్లో ఖర్చుపెడితే (ఆ దేశాల వ్యవసాయంలో పెట్టుబడులు, మైక్రో ఫైనాన్సులు, విరాళాలు కింద ఇస్తే) ఆకలిని నిర్మూలించవచ్చు. కానీ, ఇది జరగడానికి మీరన్నట్టు మనం యుటోపియాలో లేము.

  @వికటకవి గారు : టైము మాగజీను అంటే నాకు చాలా డవుటు, ఎందుకంటే “వార్నర్” కంపెనీకి సంబంధించిన పత్రిక ఇది. దీంట్లో వచ్చే వ్యాసాల వెనుక చాలా పెద్ద ముఠా రాజకీయాలు ఉంటాయి.

  కానీ, మీరు సూచించిన వ్యాసంలో ఒక సహేతుకమైన అభిప్రాయం ఉంది – అడవులు నరికివెయ్యడం వల్ల వాతావరణంలో చాలా కార్బన్ డయాక్సైడు విడుదలవుతోంది. ఇది గ్లోబల్ వార్మింగుని పెంచుతుంది. కానీ, అసలు సమస్య అది కాదు. దీనికంటే పెద్ద సమస్య – ఎన్నో చెట్టుచేమలు అంతరించిపోతున్నాయి. అడవులు మన అపురూప సంపదలు, వీటిని మనం కాపాడుకోవాలి. కానీ, అడవుల నరికివేతకు బయో ఫ్యూయెల్సే కారణమా ? అసలు కారణం జనాభా పెరుగుదల. మనిషి అత్యాశ. బయో ఫ్యూయెల్స్ ఆగిపోయినా అడవుల నరికివేత కొనసాగుతూనే ఉంటుంది.

  అడవులలో నిక్షిప్తమైన కార్బన్ నిల్వలు చాలా తక్కువ, వీటివలన గ్లోబల్ వార్మింగుకి పెద్దగా తేడా రాదు. ఇథనాల్, సెల్లులోజు పంటలలో కార్బను ఇంకా ఎక్కువగా నిలవ ఉంటుంది. వీటిని పెంచడం వలన వాతావరణం నుండి కొంత కార్బనుని వెనక్కి తీసుకోవచ్చు. మొత్తం మీద బయో-ఫ్యూయెల్స్ జీరో-కార్బన్ పంటలు. ఇది నిస్సందేహం.

  బయో-ఫ్యూయెల్స్ మొదలైన ఇతర ఇంధనాల వినియోగానికి విరుద్ధంగా ఆయిల్-కంపెనీలు చాలా రాజకీయం నడుపుతున్నాయి. వారి లాభాలను కాపాడుకోవడం కోసం ఈ టెక్నాలజీని ఆదిలోనే తుంగలోకి తొక్కేద్దామని యత్నిస్తున్నాయి. అడవుల నరికివేత వీరికి ఒక మంచి ఆయుధంగా దొరికింది. జనాలని తప్పుదోవ పట్టించేందుకే ఈ “టైంసు” వ్యాసం.

  పత్రికల్లో వచ్చే వ్యాసాలను కొంత జాగ్రత్తతో చదువుకోవాలి. ఈరోజు బొజ్జా తారకం గారు ఆంధ్రజ్యోతిలో అణు ఇంధనం ముఖ్యమా : అన్న వస్త్రాలు ముఖ్యమా ? అంటూ ఒక చిత్రమైన లాజిక్కుతో ప్రశ్న వదిలారు. “మింగడానికి మెతుకులేనప్పుడు మీసాలకు సంపెంగ నూని ఎందుకు” అని సామెతలు ఉటంకించారు. కానీ, అణు ఇంధనం ఉపయోగించుకోకపోతే పెట్రోలు ధరలతో పాటు అన్న వస్త్రాల ధరలు పెరిగిపోతాయి ! చివరికి వీటి దెబ్బ తగిలేది సామాన్యుడికే. ఆత్మవంచన చేసుకుని రాస్తారో, లేదా బ్రెయిన్-డెడ్ అయ్యి రాస్తారో కానీ ఇలాంటి ప్రచారాన్ని తట్టుకోవడం మనదేశంలో చాలా కష్టంగా ఉంది.

 6. కిరణ్ గారు,

  చాలా చక్కటి వ్యాసం. మీరు అనుమతిస్తే మీ వ్యాసాన్ని బత్తీ బంద్ బ్లాగులో కూడా పోస్టు చేస్తాను.

 7. రాకేశ్వరరావు గారు

  ఒకప్పుడు “కరెంటు తీగ పట్టుకుంటే వెంటనే మృత్యువాత పడుతుంది, ఇదేమి టెక్నాలజీ” అని జనాలు హాహాకారాలు చేస్తున్నారు.

  ఇప్పుడు “ఏమన్నా తేడా వస్తే న్యూక్లియర్ రేడియేషన్ ముంచెత్తుతుంది. ఇదేమి టెక్నాలజీ” అని జనులు హాహాకారాలు చేస్తున్నారు.

  మీరు “జనాలను” నమ్మవచ్చు, లేదా రేయింబవళ్ళూ కృషిచేస్తూ పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలను నమ్మవచ్చు, అంతా మీ ఇష్టం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s