మాతృభాషకి ఉష్ట్రపక్షుల సేవలు

ostrich bury head ఉష్ట్రపక్షి అంటే నిప్పుకోడి, ఆస్ట్రిచ్ పక్షి. దీని గురించి ఒక వింతైన నానుడి ప్రచారంలో ఉంది. ఎప్పుడైనా క్రూరమృగాలు వేటాడుతున్నాయేమోనన్న భయం వేస్తే, ఇది మహా తెలివిగా తన బుర్రకాయని ఇసకలో దాచేసుకుంటుంది. తనకి ఏమీ కనపడకపోతే, తను ఎవ్వరికీ కనపడనేమోనని దాని ధైర్యం. ఇది కేవలం నానుడి అయినా, మన తెలుగుభాషని రక్షించుకోవడం కోసం భాషాభిమానుల పాట్లని ఈ విధంగా వర్ణించక తప్పదు.

మొన్న మాతృభాష ఉత్సవాలు అని ఏదో హడావుడి నడిచింది. పనిలోపనిగా, పత్రికలన్ని ఎవరికో పురమాయించాయి – తెలుగు ఉద్ధరించడం ఎలా అంటూ వ్యాసాలు వ్రాయండంటూ. మనవాళ్ళు వివిధ రకాలుగా రెచ్చిపోయారు. మూల సారాంశం ఏమిటంటే, ప్రభుత్వం ఏదో నడుం బిగించాలి, శాసనసభల్లో తెలుగు మాట్లాడాలి, జివోలు తెలుగులో జారీ చెయ్యాలి, తెలుగు మీడియంలో పిల్లలని చదివించెయ్యాలి. ఇలా చేస్తే మన తెలుగు విరాజిల్లుతుందంట. ఉష్ట్రపక్షులకి ఒకసారి జిందాబాద్.

దేశ ఆర్థిక పరిపుష్టికి ఒక తలమానిక తలసరి ఆదాయం. అలాగే, ఒక భాష యొక్క పరిపుష్టికి సరైన తలమానిక తలసరి-సాంస్కృతిక-దిగుబడి. కృష్ణదేవరాయలు పాలించిన స్వర్ణయుగంలో, తెలుగు భాష ఒకానొక ఉచ్ఛదశకి చేరిందనుకుందాం. అప్పుడు, తెలుగువాళ్ళు ఎంతమంది ? మచ్చుకి జనాభా 30 లక్షలకి మించదు. ప్రస్తుతం దీనికి 30 రెట్లు ఎక్కువమంది ఉన్నాం. అంతాకలిపి 8 కోట్లకి పైమాటే మన జనాభా. కేవలం జనాభా ఒకటే కాదు, సగటు మనిషి ఆదాయం/జీవనా విధానం కూడా 30 రెట్లు మెరుగైంది. అతిముఖ్యంగా, జనాభాలో అక్షరాస్యత శాతం 30 రెట్లు మెరుగైంది. ఈ మూడు దిశలని కూడిపెట్టుకుంటే, మన తెలుగు కళాకారుల దిగుబడి 30*30*30 = 27,000 రెట్లు పెరగాలి. కానీ, మొత్తం దిగుబడి అప్పటితో పోలిస్తే ఇంకా తగ్గువగా కుదించుకుపోయింది. అందులోనూ, కళ యొక్క నాణ్యత ఎంత ఉంది అంటే ముక్కుపై వేలేసుకోవాలి.

పత్రికలకి పత్రికలు, టీవీలకి టీవీ ఛానళ్ళు, సినిమాలకి సినిమాలు, సంగీతానికి సంగీతం – మన సంస్కృతిలో నాణ్యత అనేది మృగ్యం. తెలుగు అనేదే ఈ అఘోరమైన పరిస్థితిలో ఉంటే, “మీ కోస్తా తెలుగు మా తెలంగాణ తెలుగుని దెబ్బతీస్తోంది”, అని వాపోతున్నారు మన సోదరులు కొంతమంది. మొత్తం (కోస్తా తెలుగు + తెలంగాణ తెలుగు )దిగుబడిని మన జనాభాతో భాగించుకుంటే వచ్చే సంఖ్య 0.0000001

పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించాలంటే, ఒకసారి ఇంగ్లండు దేశంతో మనల్ని పోల్చి చూసుకుందాం. కేవలం ఇంగ్లండు వారి జనాభా 6 కోట్లు (మన తెలుగు వారికంటే తక్కువమంది). కళా-సాంస్కృతిక రంగాలలో వారి దిగుబడి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఈ చిన్న దీవి నుండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పత్రికలు (టైంసు, గార్డియన్), టీవీ ఛానళ్ళు (బీ.బీ.సీ) పాప్ గాయకులు (బీటిల్స్, పింక్ ఫ్లాయిడ్, లెడ్ జెప్పెలిన్ …) నటులు (ప్రస్తుత ఆస్కారు విజేత సహా), రచయితలు, విద్యాలయాలు (ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జి) – ఏ విధంగా చూసినా తలసరి-సాంస్కృతిక-దిగుబడి మన తెలుగువారికి పోల్చి చూస్తే 1,000,000 రెట్లు అధినంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది ?

ఇలాంటి అతి భయంకర ప్రమాదంలో మన భాష ఉంటే, మనవాళ్ళు ఉష్ట్రపక్షులకి మల్లే గవర్నమెంటు అనే ఇసకలో వాళ్ళ తలకాయలని దూర్చేసుకుని ఏదో గట్టెక్కేస్తామని అనుకుంటున్నారు.

తెలుగుకి ప్రాచీనభాష హోదా ఇవ్వాలంట. ఇది మూల కోరిక. అంటే, ఏదో పురాతత్వ శాస్త్రం చదువుకునేవాళ్ళు తవ్వకాలు చేసుకోవడానికి మన తెలుగుని అప్పగించాలన్నమాట. ఆ పై,గవర్నమెంటు జీవోలని తెలుగులో వ్రాయించాలంట. ఇంగ్లీషు మీడియం బడులని మూయించెయ్యాలంట. గవర్నమెంటు ఎన్ని రకాలుగా ఇసకలో తల దూర్చగలదో, అన్ని రకాలుగాను దూర్చాలంట. ఇలా చేస్తే, మన తెలుగుకున్న ఆపద పోతుందంట. తలసరి-సాంస్కృతిక-దిగుబడి తిరిగి వర్ధిల్లుతుందంట. ఇలాంటి వాళ్ళతో పోలుస్తున్నందుకు, ఉష్ట్రపక్షులు ఎంత ఫీల్ అవతుంటాయో !

ఏమన్నా పోలిక చూసుకోవాలంటే, మనవాళ్ళకి దక్షిణాన అరవం, పశ్చిమాన కన్నడం మించి కనపడదు. అక్కడ ఛాందసులు ఏదో భాషా సేవ చేసేస్తున్నారు – దుకాణాల సైను బోర్డులని తిరగరాసేస్తున్నారు, బస్సుల నంబర్లని తిరగరాసేస్తున్నారు .. ఎక్కడో మనం వెనకపడిపోతున్నాం అని బెంగ. నేను చెప్పిన తలసరి-సాంస్కృతిక-దిగుబడి లో అటు కన్నడం కానీ, ఇటు తమిళం కానీ మనకన్నా ఏమన్నా ముందంజలో ఉన్నాయా ? ఉహుం, అంత సీనులేదు. మనమందరం ఒకే లెవెల్లో ఉన్నాం.

ప్రపంచంలో ఇంగ్లీషు తప్ప మిగతా భాషలన్నీ మనలాగే అంతరించిపోతున్నాయా ? లేదు. జపనీసు భాషలో కామిక్సు చదువుకోవడానికి అమెరికాలో జపనీసు నేర్చుకుంటున్నారు. స్కాండినావియా దేశాలలో రాక్-సంగీతం అర్థం చేసుకోవడం కోసం జపానులో స్వీడిషు భాష నేర్చుకుంటున్నారు. ఈ దేశాల్లో, ఇంగ్లీషు భాషని బహిష్కరించారా ? లేదు. స్వీడన్లో, ఇంగ్లీషుని ప్రతీ ఒక్కరు యాస కూడా లేకుండా మాట్ళాడగలరు. టీవీ లో ఇంగ్లీషు కార్యక్రమాలే అనువాదం లేకుండా చూస్తారు. మరి అయినా, వారి భాషలో ఎలాగ సంస్కృతి పరిఢవిల్లుతోంది ? తలసరి-సాంస్కృతిక-దిగుబడి ఎలాగ ఉరకలు పరవళ్ళు వేస్తోంది ?

కారణం తెలుసుకోవాలంటే, భాషని పక్కని పెట్టి, తెలుగులో కానివ్వండి / హిందీలో కానివ్వండి / చివరికి ఇంగ్లీషులో కానివ్వండి. అసలు మనదేశంలో తలసరి-సాంస్కృతిక-దిగుబడి ఎంత ? ఇంచుమించు సున్న. దోషం అక్కడ ఉంది. భాషలో కాదు. కళాకారులు విజృంభించితే, మేఘాల నుండి అమృతవర్షం కురిసినట్టు. భాషలు నదులవంటివి. వాన పడగా, నదులన్నీ ఒకేసారి నిండుతాయి. భూమి పులకరిస్తుంది. వాన పడనంత కాలం కరువు తప్పదు.

వరుణుడు అనుగ్రహించాలంటే, మనం ఏమి చెయ్యాలి ? బస్సులపై తింగర-తింగరగా నంబర్లు రాస్తే సరిపోతుందా ? గవర్నమెంటు జీవోలు జారీ చేస్తే సరిపోతుందా ? తెలుగుకి ప్రాచీన హోదా కల్పించితే సరిపోతుందా ?

ఒకసారి ఉష్ట్రపక్షి వైనం విడనాడి ఇసక నుండీ తల బయటకి తీస్తే, ప్రమాదం ఎక్కడుందో గమనిస్తే, బయటపడడానికి మార్గం ఇట్టే అగుపడుతుంది.

 • కళాకారులకి ప్రోత్సాహం కల్పించాలి. డబ్బులు వెచ్చించాలి.
 • కళామందిరాలు స్థాపించాలి.
 • విద్యాలయాల్లో రచన, నటన, సంగీతం, చిత్రలేఖనం – మొదలైన కళలు అభ్యసించేవారికి సరైన మొత్తంలో స్కాలర్షిప్పులు కల్పించాలి. ఒక్క తెలుగు డిపార్టుమెంటుకి మాత్రమే కాదు
 • కళాత్మక సినిమాలు తియ్యడానికి ప్రభుత్వం/ప్రజలు డబ్బులు వెదజల్లాలి.
 • రచయితలకి సంపాదనా మార్గం కల్పించాలి. ఉదాత్తమైన పత్రికలు స్థాపించాలి.
 • ఇంటర్నెట్టు యుగంలో ప్రజలు ఒకరితో ఒకరు సుళువుగా తెలుగులో మాట్లాడుకునే సౌకర్యం కల్పించాలి.
 • డిస్కషన్ బోర్డులు ఏర్పడాలి.
 • తెలుగు పాఠకులను తెలుగు కళాకారులకు దగ్గర చెయ్యగలగాలి.

ఒక భాషకి అవశేష దశ నుండి సంపూర్ణంగా పునరుజ్జీవన చేసిన ఘటన ఇజ్రాయెల్ దేశంలో ఒకటి జరిగింది. నాజీల వేధింపుల నుండి బయటపడి ఇజ్రాయెల్ కి వచ్చిన యూదులకు, వారి సంస్కృతిపై విపరీతమైన ప్రేమ కలగడం సహజం. కానీ, హీబ్రూ భాషని వారు పునర్మించిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యున్నతమైన వారి శాస్త్రవేత్తలు శాస్త్ర-సంబంధిత-పదాలను హీబ్రూవే వాడతారు. వారి కళాకారులు హీబ్రూలోనే సంగీతం ఆలపిస్తారు. కేవలం 70 యేళ్ళ క్రిందట, పురాతనమైన తాల్ముడ్ గ్రంథాల ఆథారంగా ఈ భాషని ఇటకపై-ఇటక వేసి నిర్మించారు అంటే మరి ఆశ్చర్యం కలగదా ? ఇజ్రాయెలీలు చేసిన మొదటి పని వారి భాషకి ఒక ఆధునిక నిఘంటువు నిర్మించడం. ఈ నిఘంటువును ప్రతీ ఏడాది తాజాకరించడం. రెండవ పని ప్రజలు హీబ్రూలో మాట్లాడాలి – ఇది ఒక ఆత్మగౌరవప్రదమైన విషయం – అని అందరూ భావించడం.

ఇప్పుడు మన తెలుగులో మాట్లాడాలన్న ఆశ ఉన్నా, ప్రక్కవాళ్ళతో మాట్లాడడానికి పనికివచ్చే ఒక నిఘంటువు లేదు. మనతో చర్చ సాగించడానికి ప్రస్తుతం శ్రీనాథుడు, లక్ష్మణకవి మన ముంగిట్లో తిష్టించుకుని లేరు కదా ! మరి, మన నిఘంటువులు ఇంకా అదే భాష పట్టుకుని వేలాడుతున్నాయేమిటి ? ఈ నిఘంటువులు పనికివచ్చేది ఎవరికి ? పాప్ సంగీతం వ్రాద్దామనుకుంటే పనికివస్తాయా ? తెలుగులో అద్భుతమైన ఉపన్యాసం ఇద్దాం అనుకుంటే పనికివస్తాయా ? ఒక శాస్త్ర-సంబంధమైన వ్యాసం వ్రాద్దాం అంటే పనికివస్తాయా ? కళాకారులకి ఒక నోరు ఇవ్వకుండా నొక్కిపెట్టి, ఏదో భాషని ఉద్ధరించేద్దాం అనుకుంటే ఏమి సాధించగలం చివరికి ?

మన ఆర్థిక మంత్రి రోశయ్య ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్టు అక్షరాలా లక్ష-కోటి రూపాయలది. పాకీస్తాను దేశం బడ్జెట్టుని మించిన లెవలు అది. మన తెలుగువారికి డబ్బు లేమి ఏమీ లేదు. ఇదిగాక, ప్రవాసాంధ్రుల సంపాదన కూడా కలిపి చూస్తే, మనం ఎంతో ఔన్నత్యంలో ఉన్నవాళ్ళం. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో సగం మంది మన తెలుగువాళ్ళు ! మన పరిస్థితి 70 ఏళ్ళ క్రిందటి ఇజ్రాయెల్ పరిస్థితితో పోల్చిచూస్తే, అమోఘంగా ఉంది. కానీ, వాళ్ళు సాధించినట్టు మనం ఆ అద్భుతాన్ని సాధించగలమా ?

ఉష్ట్రపక్షులని అడగాలి సమాధానాల కోసం !

23 responses to “మాతృభాషకి ఉష్ట్రపక్షుల సేవలు

 1. దిగుబడి లేని ఉష్ట్రపక్షులూ జిందాబాద్.. గవర్నమెంటు లంకెబిందెలు కోసం ఇసకలో తలదూర్చి వేచి చూసే ఉష్ట్రపక్షులూ జిందాబాద్…తల పైకెత్తి అసలు సిసలయిన మార్గాలు వెతకలేని ఉష్ట్రపక్షులూ జిందాబాద్..అధికార భాషా సంఘం మీదే బోలెడు అభాండాలు ఉన్నాయి..ఇక చెప్పేదేముంది …ఇదే అంశం మీద నేను ఒక టపా రాయలనుకున్నా, ఇది చూసాక ఆ ఆవేశం నుంచి విముక్తి కలిగి ఒక ప్రశాంతత లభించింది..

 2. అద్భుతం. (చప్పట్లు). అయితే నాకొక సందేహం. కళలని ఒక వృత్తిగా స్వీకరించగల ధైర్యమూ, ఆర్ధిక వెలుసుబాటూ, ప్రోత్సాహమూ తెలుగునాట ఏర్పడుతున్నదా? మనం ఎంత ఆర్ధికంగా అభివృధ్ధిచెందుతున్నామని చెప్పుకుంటున్నా, అధికశాతం మందికి పొట్టకోసం, బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలకోసం పరుగులుపెట్టడంతోనే సరిపోతోందికానీ, ఒక కవిగానో, రచయితగానో, కళాకారుడిగానో చాలా గొప్పగా బతకచ్చు అన్న పరిస్థితి ఎక్కడ ఉంది? మనం తెలుగువాళ్ళం, తెలుగుదనం గొప్పది అన్న స్పృహ గట్టిగా కలిగితే తప్ప కళలకు గౌరవం ఇవ్వడం ప్రారంభమవ్వదు. మనవాళ్ళకి ఎంతసేపూ ఇంకోడి దగ్గర ఉద్యోగం కావాలి అన్న వెంపర్లాట పోయేంతవరకూ ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం కలగవు. ఒక జాతిగా మన సమస్య అక్కడ ఉన్నది అని నా అభిప్రాయం. అది పోయేంతవరకూ ఈ దీనస్థితి తప్పదు

  • నాగమురళి గారూ! వ్యాసం కంటే మీ స్పందనలోని సారాంశమే పరిష్కారానికి దగ్గరలో ఉంది. నడుస్తున్న చరిత్ర సరిగ్గా చెప్పారు. పొట్టకూటి వెంపర్లాటలో మాతృభాషకు ప్రాధాన్యం ఎలా ఇచ్చుకోవాలో ఎవరికివారే ఆలోచించుకొని ఆచరించాలి.
   రాజా.

 3. మీరన్నది సమంజసమే. నా ఊహ ప్రకారం తెలుగు రాసే లేదా ఇప్పుడిప్పుడే రాయాలన్న ఆశ ఉన్న ఇంత మంది బ్లాగర్లలో ఎక్కువ శాతం తెలుగు మాధ్యమంలోనే పదవ తరగతి వరకు చదివిన వాళ్ళు ఉంటారు. అందులో నేనూ ఒకణ్ణి. కాలేజీలో అప్పుడప్పుడూ అయ్యో ఇంగ్లీషులో చదివితే బాగుడేదే అనిపించిన రోజులున్నా, ఇప్పుడు తెలుగులో చదివటం ఎంతో మంచిదయిందని సంతోషిస్తున్నాను. ఒకవేళ, ఇంగ్లీషు మీడియంలో చదివి తెలుగులో బ్లాగుతున్న వారుంటే వారికి శతవందనాలు.

  నేచెప్పొచ్చేదేమంటే, ప్రాధమిక దశలో తెలుగు చదవకపోతే ఆ తరువాత ఎన్నెన్ని తాయిలాలు చూపించినా ఉపయోగం లేదు. ఆంగ్ల మాధ్యమం వాళ్ళకి రెండవ భాషగా ఆ స్పెషల్ ఇంగ్లీషో లేదా హిందీనో తీసెయ్యాలి. బలవంతంగా అయినా సరే వాళ్ళకి తెలుగు పూర్తిగా నేర్పలేకపోయినా కనీసం అక్షరాలు గుర్తయినా పడతారు. నా మేనళ్ళుళ్ళు ఇలానే చదివి, తెలుగు మాట్లాడటమే తప్ప రాయలేని, చదవలేని స్థితిలో ఉన్నారు. రేప్పొద్దున అన్ని ఐహిక సుఖాలు అనుభవించిన తరువాత అప్పుడు వాళ్ళకి సాహిత్యమో లేదా భాష మీదో మక్కువ పుట్టినా, అప్పటికి అన్నీ లేటే.

  • వికటకవి గారూ! సరిగ్గా చెప్పారు. మీ మేనల్లుళ్ళ పరిస్థితే ఇప్పటి చాలామందిది. రానున్న కాలం మరింత గడ్డు కానుండడమే అసలు విషాదం. పరిష్కారాలలో ఒకటి, మీరుచెప్పిన ‘తెలుగును రెండవ భాషగానయినా తప్పనిసరి’ చెయ్యాలి.
   రాజా.

 4. మీ వ్యాసం బాగుంది. కొత్త విషయాలను తెలియజేసినందుకు నెనెర్లు.

 5. మహానుభావా,
  ఇది సరికొత్తగావుంది. బహుశా ఈవిధంగా మరెవరూ ఆలోచించివుండరు. అద్భుతం!

 6. ఒక్కసారి వెనక్కి వెళ్తే, దాదాపు ఆంగ్లేయుల పాలనాంతం వరకూ చాలా భాషలు వాటి యునికిని యేమాత్రమూ కోల్పోకుండా నిలబడ్డాయ్ ముఖ్యంగా దేశభాషల్లో లెస్సగా పేర్కొనబడిన మన తెలుగుభాష. త్యాగరాజుగారుకూడా ఆంగ్లేయుల పాలనాకాలానికి చెందినవారే. ఆయన వ్రాయలేదా అద్భుతమైన కృతులూ, పద్యాలూ? ఒక విషయంలో నేను కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి మల్లే పూర్వకవిత్వాహ్లాదిని. నా యభిమతమేమంటే వొకప్పుడు కనీసం పూర్వకవిత్వాన్ని చదవటానికైనా తెలుగుభాషను క్షుణ్ణంగా నేర్చుకునేవారు శబ్దవ్యుత్పత్తులతో సహా. ఐనా వ్యావహారికభాషోద్యమానికి నాంది యేమిటి? అందరూ అన్నీ చదవి అర్థంజేస్కోలేకపోతున్నారనే కదా? ఇప్పుడు మాత్రం పరిస్థితి యే మాత్రం మెరుగుపడింది? ఇంకా దిగజారిందే తప్ప! మనం మన భాషా సంస్కృతులని అచ్చువోసి గాలికి వదిలేశామాయె. ఒకసారి వాయుదేవుడికి దానమిచ్చాక మళ్ళీ వెనక్కి వస్తుందా? పోనీ “భాషాదానం తుభ్యమహం సంప్రదదే న మమ” అని గాలికి వదిలేశాం కదా అని పూర్తిగా పాశ్చాత్యసంస్కృతిని అలవరచుకున్నామా అంటే అదీలేదు. మనని మనం యేం వుద్ధరించుకోగలిగాం? మన పద్ధతులని వదలలేక క్రొత్త పద్ధతులకి అలవాటు పడలేక అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోడానికే అలవాటుపడిపోయాం తప్ప. కాబట్టి మీరన్నట్టు ప్రభుత్వం చేసేదేమీ లేదు. ఏది మొదలైనా మనతోనే మనలోనే మొదలవ్వాలి.

 7. మీ కామెంట్లకి కృతజ్ఞతలు. 🙂

  వికటకవి గారు
  నేను ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవాడిని. అయినా తెలుగు మీద ప్రేమ లేకపోలేదు. నాలాంటివాళ్ళు కోకొల్లలు.

  రాఘవ గారు
  వ్యవహారిక తెలుగు / గ్రాంథిక తెలుగు మధ్య కాదు పోటీ. సంస్కృతిని ప్రోత్సహించడం కోసం డబ్బులు కల్పించట్లేదు – అని నా వాదన. ఇది జరగనప్పుడు, మనలో మనం ఎంత పోట్లాడుకున్నా ప్రయోజనం శూన్యం. త్యాగరాజుగారి కాలంలో, మొక్కుబడికైనా రాజులు, జమీందార్లు కళాకారులకి కొంత ధనసహాయం చేసేవారు. కర్ణాటక సంగీతం తంజావూరు సంస్థానంలోనే ఎందుకు విజృంభించింది ? తంజావూరు ప్రభువులని అడిగితే సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు, ఇటువంటి ప్రోత్సాహం కుదించుకుపోయింది. ఫలితంగా భాష ద్రవించుకుపోయింది. కారణం వ్యవహారిక తెలుగుని వాడడం వల్లగాదు.

 8. మీ బాధ సరియైనదే. కొద్ది రోజులలో అమెరికా వెళ్ళిపొయ్యే నా మిత్రుడు ఒకసారి నా దెగ్గర ఒక ప్రశ్న వేశాడు. “తెలుగు నేర్చుకోవటం వల్ల నాకు కలిగే ఉపయోగం ఏంటి” అని. వాడికేం చెప్పాలో నాకైతే అర్థం అవ్వలేదు. మీరు చెప్పినట్టుగానే తెలుగుకు ప్రాచీన భాష హోదా కలిగిస్తే ఏం లాభం ?

  • భాస్కర రెడ్డి ద్వారం

   చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు.. భాష ను ప్రయోజనార్థం కాకుండా నేర్చుకోలేమా .. ప్రతి అంశాన్ని ప్రయోజన దృష్టి లో చూడకూడదు కదా..తెలుగును నేర్చుకునే విషయంలో మరీ ముఖ్యంగా…

 9. ఇంతకీ పోతన తెలంగాణావాడా రాయలసీమవాడా, నన్నయ అసలు కవా, ఆయన రాసినది కవిత్వమా లాంటి సమస్యలతో తెలుగు వాళ్ళు సతమతమౌతుంటే మీరేదో వేరే విషయాలు చెప్తున్నారే. ప్రాచీనహోదా కల్పిస్తే డబ్బులొస్తాయిట- మీకు తెలియదనుకుంటా.
  మంచివిషయాన్ని తేటతెల్లంగా చెప్పారు. సమస్య మూలాన్ని పట్టుకున్నారు.

 10. మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.

  భాషని ఉద్ధరించడానికీ, సంస్కరించడానికీ భాషా సంఘాలు, ప్రాచీన భాషా పట్టాలు అవసరం లేదు. మామూలు మనుషులు చాలు.

 11. సమస్యని కొత్త కోణం లో నుంచి చాల బాగా చూపించేరు. సానుకూలమవుతుందని ఆశిస్తాను.

 12. మీ అలోచనలు బాగున్నాయి. నిజానికి తెలుగు కళాకారులే కాదు కళను జీవనాధారంగా చేసుకోవడం ఏ భాషా కళాకారునికైనా అంత తేలికైన విషయం కాదు. ఇది కేవలం తెలుగు/భారతీయ కళాకారులకేనన్న తర్కం నాకెందుకో సరిగా నప్పదు అనిపించింది. ధనసంపాదన అనే కళ తెలిసినవాడికే ఏ కళైనా!! ఒక జె.కె.రౌలింగుకు మిలియను మంది వెలుగుచూడని కళాకారులుంటారు.

 13. రవి గారు

  మీరన్నది కొంతవరకూ నిజమే. కళాకారులకి ఈ యుగంలో (పెట్టుబడిదారీ మార్కెట్టులో) ప్రోత్సాహం తగ్గింది. దీని గురించి నా ఇంగ్లీషు బ్లాగులో చర్చించాను.

  కానీ, ప్రస్తుతం కళాకారులకి లభిస్తున్న ఆర్థిక ప్రోత్సాహంలోనే (గవర్నమెంటు + ప్రైవేటు వ్యక్తుల సహాయం) మన భారతదేశానికి, యూరపు/అమెరికా దేశాలకీ మధ్య విపరీతమైన వ్యత్యాసం గమనించవచ్చు. ఆ దేశాల్లో ప్రతి చిన్న పట్నంలోనూ వుండే డ్రామా థియేటర్లు, మ్యూజియంలు, ఒపేరా హాల్సు గమనిస్తే ఈ దేశాలవారు కళా ప్రోత్సాహానికి ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుస్తుంది.

  భాషని రక్షించుకోవాలంటే, మనం కనీసం దీనిని అధిగమించాలి. మన స్థోమతకి తగినంత మనం కూడా ఖర్చుపెట్టాలి.

 14. అదిరింది మీ వ్యాసం. ఇంత వినూత్నంగా ఆలోచించగలిగారంటే, మీలో ఎంత వేదన ఉండి ఉండాలి. ఒకప్పుడు రాజులే కళలని గౌరవించి ప్రోత్సాహించేవారు. ధనిక వర్గం అందుకు సహాయపడేది. ఒక నదిని శుభ్రపరచటానికి ఎంత శ్రమ, ఖర్చు అవుతుందో మన భాష, సంస్కృతి ని కూడా ఒక దారికి తేవాలంటే కూడా అంతే. దీనికి ఇసుకలో తల దాచుకునే ఉష్ట్రపక్షుల సాయం కూడా కావాలి. ఎందుకంటే అవి ఎంత తలదాచుకున్నా, ప్రమాదం ఎదురైనప్పుడు దాని కాలి దెబ్బకి సింహం కూడా భయపడుతుంది.

 15. చాలా చక్కగా రాసారు. సమస్య మూలాన్ని శోధించారు. అదృష్టవశాత్తు కళలను ప్రోత్సహించాలి అన్న నిర్ణయంతో తగిన నిధులు వున్నా, ఆ తాయిలాల్ని అవినీతి రాబందులు ఎగరేసుకుపోతాయి. అందుకు నంది అవార్డులే సాక్ష్యం.

  ప్రసాదం

 16. వాట్ ఆల్ అఫ్ యూ అర్ సేయింగ్ ఈజ్ బాష్!
  ఈ లింకులు చూడండి!
  http://itre.cis.upenn.edu/~myl/languagelog/archives/003766.html
  http://news.bbc.co.uk/1/hi/education/4404998.stm

  కేంద్ర సాహిత్య అగాధమీలు, సంగీత నాటక అగాధమీలు, తెగులు విశ్వవిద్యాలయాలు చేయలేని పనిని మీరు చెయ్యగలరా?
  గతమెంతో ఘనకీర్తిగలిగిన పెద్దవారు చెయ్యలేనిది, మీరు ఏం
  చెయ్యగలనని అనుకుంటున్నారు?
  మీకు మీ భాష మీద మమకారమున్నది – వెతుక్కుని మరి ఈ బ్లాగులెమమ్మట పరిగెడుతున్నారు? తెలుగు, నా తెలుగని యాగి చేసుకుంటున్నరు. అంత ప్రేమ మిగతవాళ్ళకి కూడా ఉంటే వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుని, మాట్లాడుతు, వ్రాస్తు దాని వ్యాప్తికి కష్టపడతారు.
  తెలుగువారు చెయ్యగలిగినది, తమ పిల్లలకి, తెలుగు భాష మీద మమకారం పెంచడం. భావి తరాలకి తెలుగుని అందించడం. అంతే!
  “కలాపొసన” కి సొమ్ము కరుసేడితేనో, కలాపొసకురాలిని, వాడిని పొసిస్తేనొ – తెలుగు రాదు!!! ఆ!

 17. వ్యాసం చాలా బాగుంది.ఏదయినా పత్రికకి పంపితే మరింత మందికి చేరువవుతుంది కదా

 18. hmm bagane chepparu…………….kani naku enko abiprayam vundhi……adhi enti ante

  MODERENISATION OF TELUGU ……ante eppudu vasthunna kothhaga vasthhuna techinologyni manam telugu loki anuvadindhali appudu mana basa manugada ki yelanti doka vundadhu…..

  mukyamga vayavasa aadaritha technolgy antha teluguloki vasthe chalaa baguntundhi danniki dabbu kaavali

  ithe prachina baasa hoda vasthe every year 100 kottlu basani improve cheyyadaniki vasthayata……..

  kaaani yedi yemaina eppatiki thaggatuga basani abivruddi parachali …….ala ithe chala baguntundhi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s