మిరపకాయల మహాత్యం

మన తెలుగువాళ్ళు కారం తినడంలో ఘటికులు. మాది తూర్పుగోదావరి జిల్లా, కారాలు తినడం చాతకాని జిల్లా అని నవ్వులపాలవుతూ వుంటాం. అందులోనూ మాది బ్రాహ్మణ కుటుంబమాయే, పప్పుసుద్దలని పేరు.

అలాంటిది, దేశం బయటికొస్తే నేనే కారాలతో వీరంగం ఆడేస్తాను. ఈ జోరు తట్టుకోలేక మా ఫ్రెండ్సు అందరు నా వంట తినడానికి తెగ జంకుతుంటారు. ఈ రోజు, కొన్ని తమాషా విశేషాలు మీతో చెప్పుకోవాలి.

మొదటిసారి నేను వంట చేసింది అమెరికాలోని పిట్స్ బర్గు నగరంలో. రోజూ వీధిలో పడి తింటుంటే డబ్బులు అయిపోతున్నాయని, వంట చెయ్యక తప్పదని, ఒకరోజు మొదలుపెట్టాను. అంతకుముందు కూడా కొంత ప్రవేశం ఉంది కాని, ఎప్పుడూ సరిగా వచ్చేది కాదు. అవసరం ఎన్ని కళలైనా నేర్పుతుంది అని, మొత్తం మీద ఒక లెవెలుకి వచ్చింది నా వంట. కానీ ఈ మసాలా జోరుకి, మా అంతస్తు మొత్తం గుభాలించేది, లిఫ్టు ఆరవ ఫ్లోరుకి వచ్చిందంటేనే ఇక్కడెవడో తెలుగువాడు బసుంటున్నాడని తెలిసిపోయేది.

ఓరొజు, పొయ్యి మీద పోపు పెట్టి మర్చిపోయా సంగతి. వెనక్కి వచ్చి చూసే సరికి అంతా పొగ. ఇంతలోనే, రై అని సైరను మొదలైంది. లిఫ్టు పనిచెయ్యడం ఆగిపోయింది (12 అంతస్తుల మేడ అది). జనాలందరు ఒకటే పరుగులు, “ఏంట్రా సంగతి” అని ఆలోచిస్తుంటే కొంతమంది ఫైరుమాన్లు మా ఇంటి తలుపు కొట్టి లోపలికి జొరబడ్డారు. సీను చూసి “వారి జిమ్మడా” అని అప్పుడు సైరను ఆపారు. అప్పటి నుండి నాకు పోపు పెట్టడం అంటే ఒకటే టెన్షను.

ఇప్పుడు ఫ్రాన్సుకొచ్చిన తరువాత కొంత కారాలు తగ్గించాను. లేదంటే “చీజు, వైను” రుచి తెలియదు అని. కాని, ఇప్పుడు కూడా మా రూముమేట్లు ఈ కారాల ధాటికి భయపడుతూ ఉంటారు. ఒకోసారి మిరపకాయలు నూనిలో వేయిస్తూ ఉంటే కిటికీ తలుపులన్నీ తెరిచివుంచినా పాపం మా రూముమేట్లకి ఒకటే దగ్గులు !

అప్పుడోసారి, ఇటాలియన్ రెస్టారెంటుకి వెళ్ళి పిజ్జా ఆర్డరు చేసాం కొంతమంది ఫ్రెండ్సు. అన్నట్టు, ఇక్కడి ఇటాలియన్ రెస్టారెంట్లలో ఒక కారం-నూని ఉంటుంది (మిరపకాయలు, ఆలివ్ ఆయిలు కలిపినది) నాకదంటే భలే ఇష్టం. సరే, ఈ రెస్టారెంట్లో మనదేశం వాడొకడు పనిచేస్తున్నట్టున్నాడు. నన్ను చూసి వీడెవడో ఇండియా నుండి వచ్చాడు అని, నన్ను మెప్పించడానికి పిజ్జాతో పాటు ఒక మాంచి మిరపకాయ పక్కన పెట్టి ఇచ్చాడు. నేనది చూసి ” వార్నీ, ఇప్పుడు నా దేశభక్తి చూపించుకోవాలా !”, అని ఆశ్చర్యపోయి, సరేలే అని ఆ మిరపకాయ తిన్నాను. అది చూసి మా ఫ్రెండ్సు కళ్ళు తిరిగి గగ్గోలు పెట్టారు. ఇంతకీ, ఒట్టి బుడతకాయి ఆ మిరపకాయి. మనకెందుకు పనికి వస్తుంది.

ఫ్రాన్సులో చాలా మంది అరబ్బుదేశాల వాళ్ళుంటారు. ఉత్తర-ఆఫ్రికాలోని ట్యూనీసియా, అల్జీరియా మొదలైన అరబ్బు దేశాల ఫ్రెండ్సున్నారు నాక్కొందరు. ఒకసారి, ఫ్రెండ్సుని భోజనానికి పిలిచాను. వారిలో ఒకడు జర్మనీ నుండి, ఇంకొకడు ఇటలీ నుండి వున్నారు. మాటల మధ్యలో, ఇటలీవాడు అమాయకుడు ” బీరు అంటే బెల్జియం బీరే బీరు, అన్నింటికన్నా అదే రుచికరంగా ఉంటుంది” అన్నాడు. నేను ముందు-వెనుకలు చూడక ” ” కరెక్టే, బెల్జియం బీరు అంటే నాకు చాలా ఇష్టం. బెస్టు అది”, అని చెప్పాను. ఇదివిని, జర్మనీవాడికి పిచ్చికోపం వచ్చింది. ” నా బొంద, జర్మనీలోనే అన్నింటికన్నా బాగుంటుంది” అని వాడు దెబ్బలాట మొదలుపెట్టాడు. “తేడావచ్చింది రోయ్” అని మాట మళ్ళించడానికి నేను “సరేలే, బీరంటే మీ జర్మన్లకు గర్వకారణం. మా తెలుగువాళ్ళకు కారం అంటే గర్వం అన్నట్టు. అసలు, మాకంటే ఎవడు కారం తింటాడు ?”, అని అన్నాను.

గుంపులో ట్యూనీసియా ఫ్రెండు ఒకడు ఉన్నాడు. వాడది విని “ఛీ, అంత సీను లేదు. మా దేశంలోనే అంతకంటా కారం తింటాం”, అని పోటీకి దిగాడు. సరే చూద్దాం అని పోటీ మొదలైంది. వాడు “హరీసా” అని ఒక కారం పచ్చడి తెచ్చాడు నాకు. మన కొరివీకారం టైపులో ఉంటుంది, కాని అంత సీను లేదు లెండు. నేను సింపులుగా ఒక ఆవకాయ తెరిచాను అమ్మ చేసింది. నేనా హరీసా అవలీలగా లాగించేసాను. వాడు మా ఇంటి ఆవకాయ తిని “వాలమ్మో” అన్నాడు. “దీనికే ఇలాగంటే, ఇక గుంటూరని ఒక ఊరుంటుంది. అక్కడ అసలు-సిసలు తడాఖా కారాలు ఎలా తినగలవు ?” అని వాడికి హితబోధ చేసాను. ఆ గుంటూరు వంటలంటే నాకే దడ, ఒకసారి తిన్నా, ఆ దెబ్బ ఇంకా గుర్తుంది !

అసలు సంగతి ఏమిటంటే మొన్నీ మధ్య ఒక మిరపకాయ కనిపెట్టాను ఇక్కడ మార్కెట్లో. గుండ్రంగా చూడడానికి ఒకటైపు టమాటాలా ఉంది. కాని తింటే నిజంగానే గూబ గుయ్యిమంది. ఆఫ్రికానుండి ఇంపోర్టు చేసారంట దానిని. బహుశా ట్యూనీసియా నుండేమో, మా ఫ్రెండు మాటల్లో కూడా కొంత నిజం ఉండి ఉండవచ్చు.

12 responses to “మిరపకాయల మహాత్యం

 1. ఓ సారి నేను కర్నూలు వెళ్ళినాను

  మా స్నేహితుడు వాళ్ళ అమ్మ మేము తిన గలుగుతామో, లేదో అని కారం తక్కువ వేసి వంట చేశారంట

  నేను (మేము?) అదే తినలేక పొయినాము!

  అదే వాళ్ళు మామూలుగా రోజూ వండే కారం వేస్తే?

  ఏ మాట కా మాటే చెప్పుకోవాలి నేను కూడా కారం బాగానే తింటాను, పులిహారలో మిరపకాయలు, కూరల్లో పచ్చి మిరపకాయలు జనరల్గా వదలను మరీ మూడ్ లేకపోతే తప్ప

 2. హబనీరోలు మీరింకా ట్రై చేయనట్టున్నారే..స్కోవిల్ స్కేలులో (http://en.wikipedia.org/wiki/Scoville_scale) టాప్ టైరులో ఉండే మిరపకాయాలలో అది ఒకటి (పొట్టిగా ఆరంజి రంగులో ఉంటుంది)

 3. మావారు మా ఇంటికి భోజనానికి వస్తె అమ్మ కారాలు చాలా….తక్కువ వేసి వండుతుంది.ఆ కారానికే కళ్ళంటా నీళ్ళతో తింటారు మావారు.నేను చాలా తక్కువ వేస్తుంటాను మా వారి కోసం.మా నాన్నగారు నా వంటలు తిని చిన్నపిల్లలు తినే తిండిలా వుంది అని నవ్వుతారు.ఇంతకీ విషయం చెప్పేదేమిటంటే నా వంట తింటూ మా వారి చెళ్ళెళ్ళు ముక్కు ఎగబీలుస్తూనే వుంటారు.కిరణ్ గారూ మాదీ తూర్పుగోదావరేనండి.

 4. రవి గారు

  నేను తిన్న మిరపకాయ స్కాచ్ బొన్నెట్ అయ్యుంటుంది, ఇప్పుడే మీరిచ్చిన వికిపీడియా లింకులో ఫొటో చూసా. ఇంకా హాబనేరోలు తినలేదు, ఓసారి తిని చూడాలి 🙂

  ఆ స్కోవిల్లు రేటింగులో అతి ఘాటైన మిరపకాయలు మాత్రం ఇండియాలోవే ! నాగ జొలొకియ / భూత జొలోకియా అని అస్సాం లో ఉంటుందంట.

 5. పులిహోరా మిరపకాయలు అని చెప్పి నోరూరించారు చావా కిరణ్గారు, ఇది బాగాలేదు 🙂 నాకు చాల ఇష్టం అవంటే. ఇక కర్నూలు వాళ్ళు, గుంటూరు వాళ్ళు ఇంచుమించు ఒకటైపే అనుకుంటా 🙂 జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో !

  రాధిక గారు
  తూర్పుగోదావరి వాళ్ళయ్యుండి కారాలు బాగా తింటున్నారంటే, అది మనకి గర్వకారణం. 🙂 వెరీ గుడ్ !

 6. “నూని” కాదండి…నూనె…మీ అనుభవం బాగుంది

 7. బాబు
  ఎండలు మండే రోజుల్లోకూడా మేము సాయంత్రం అలా షికారుకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు చమటలు కక్కుతూ తిని గొక్కెడు టీ తాగి వస్తం. అది గుంటూరువారి దెబ్బ.
  మొన్న మాఆవిడ పండుమిరపకాయ పచ్చడ్లో తిరగమాతవేసి ఆఫీసుకి డబ్బా పెట్టింది. తెల్లనాయాళ్ళు ఆ వాసనకే కందిపొయ్యారు. మన దేశీగాల్లు రుచి చూస్తాం అని నోట్టోపెట్టుకొని 5 కిలోల పందార తిన్నారు పాపం.
  ఏమైన గుంటూరు గుంటూరే!!
  మీకు తెలుసో తెలీదోకానీ గుంటూర్ జిల్లాలో పల్నాడు అని ఒక తాలూకా ఉంది. ఇంక అక్కడి కారాలు మీరు తింటే!!!!! అంతే సంగతులు..
  అన్నట్టు మాది ఆ వీర పల్నాడేలేండి..

  ధన్యవాదములు

 8. గుంటూరు కారం ఎరుపెక్కువ మంచి ఘాటు కూడాను.
  ఆంతకన్నా కారం తినేవాల్లు మనదేశంలొ వున్నరా?

  వున్నారు….

  తెలంగానా వారు…వారు తినే ‘గాలి మిరపకాయలు ‘ గుంటూరు మిరపలాంటి ఎరుపుకాదుగాని…అవి తింటే మన శరీరం మూడ్రోజులపాటు మరుగు దొడ్డికి పరిమితం కావడం, బరువు తగ్గడం ఖాయం.

  గుంటూరు ఆవకాయను కూడా పెరుగుపచ్చడిలా తినగలిగే మా మిత్రరత్నానిది కరీం నగర్ జిల్లా, కనగర్తి గ్రామం

 9. ఓహోహో మిరపకాయల జ్ఞాపకాలు ఎన్నని చెప్పను. విశ్వవిద్యాలయంలో తెల్ల మెషినిస్టు ఒకడు మంచి స్నేహంగా ఉండేవాడు. వాడికి కారం అంటే చాలా ఇష్టం – మనవంటాలన్నీ అవలీలగా తినేసేవాడు. వాడు చెప్పాడీ కథ – తన స్నేహితుడైన ఒక రైతు ఇంటికి వెళ్ళాట్ట. ఆ రైతు గారు వివిధ పంటలతో పాటు రకరకాల మిరపకాయలు కూడా పెంచుతారట. ఐతే నువ్వు పెంచే వాటిల్లో అతి కారమైనది పెట్టమన్నాట్ట మా వాడు. ఆయన ఏవో రకాలు తెచ్చి పెడితే వీడు అన్నీ తాంబూలంలా నవిలేసి ఇంతేనా అన్నాట్ట. ఆయన ఉండు, అన్చెప్పి ఒక లేహ్యాన్ని తెచ్చాట్ట. ఆ లేహ్యం ఒక్క చుక్క నాలిక్కి తగలంగానే మా వాడూ ఎఇగిరి పడి తల టాపుకి గుద్దుకుంది. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ “ఏంటది?” అనడీగాడు వీడు – ఆ సీసా మీద “only for use as pesticide – not for human consumption” అని రాసుంది. 🙂 అదేం మిరపకాయో చెప్పాడు – ఇప్పుడు నాకు గుర్తు లేదు.

 10. నెను Andhra University లొ చదువుకున్న రొజుల లొ SKD hostel లొ వుండెవాడిని , ప్రతి సాయంత్రం చినవాల్తెర్ లొ వంకాయ బజ్జి మిరపకాయ బజ్జి తిని టీ తాగితె వుంటుంది మజా , ఇప్పటికి ఇక్కడ పొడుగు మిరప కాయాలు దొరికినప్పుడ్డు మా ఆవిడను మిరప కాయబజ్జీలు వేయ మంటాను .
  మాది వైజాగ్ మా అత్త గారిది కాకినాడ , మా ఇద్దరికి ఎప్పుడు గొడవె ఆవిడ కారం తగ్గించదు నాకు అంత కారం పడదు , ఇప్పటికి ఇదే వరస నాకు పెళ్ళి అయి 17 yrs అయిన .
  ఇంకా దారుణం ఎమిటి అంటే మాతొ 3 months వుండడానికి వచ్హి ఒక్క రొజు కూడ వంట చెయలేదు ఎందుకు అంటె మీ ఆయనకు సరిపొయినట్లు నెను చెయ లెను నువ్వె చెసుకొ అంది మా ఆవిడతొ .

 11. బావుంది, మిరపకాయ భాగోతం! ఆవకాయ గురించి మా ప్రైవేటు పంతులు గారు ఓ ప్రహసనం చెప్పేవాడు… ఆయన కల్పించిందే అది. ప్రశస్తమైన వంటల పోటీలో సకల దేశాల వాళ్ళూ పాల్గొని తమ తమ వంటలను ప్రదర్శించారట. మనవాడు ఆవకాయ తీసుకెళ్ళాడు. ఏమిటిది అని అడిగాడంట అమెరికా వాడు. “ఆవకాయ అనీ స్వీటు లే, తినిచూడొకటి” అని అన్నాడట. అమెరికావోడు నూనె లో మునకలేస్తున్న ముక్కనోదాన్ని స్పూనుతో తీసుకుని నోట్లో వేసుకుని…

  అమెరికా అంటే ఆయనకు మంటగా ఉండేది. ఆ మంటను అలా చల్లార్చుకునేవాడు.

 12. రామకృష్ణ రోహిణీ కుమార్

  నమస్కారమండి,
  మీలాగే మాది కూడా తూర్పుగోదావరి జిల్లానే, మాది కూడ బ్రాహ్మణ కుటుంబమే, కాని ఒక్కటే తేడా, మేము పూర్తిగా కారాలలొ ములిగి తేలుతూ ఉంటాం. ఆసలు ఈ కారాలు మాకు మా అమ్మమ్మ గారి నుంచి అలవాటు అయ్యాయి అని చెప్పుకొవాలి. చిన్నప్పుడు మేము (నేను మా అన్నయ్య) స్కూల్లొ చదువుకునే రొజుల్లొ మా అమ్మమ్మ గారి ఇంట్లొ భోజనం చేసే వాళ్ళం. (అమ్మ, నాన్నగారు టీచర్స్ గా పనిచెస్తూ ఉండేవారు వేరే స్కూల్లొ) అదిగో అప్పట్నుంచి మాకు కారాలు అలవాటు.ఇప్పటికి నేను మా అమ్మమ్మ గారు చెసిన వంకాయ పచ్చిమిరపకాయ కారం కూర మర్చిపొలేను, ఎందుకంటే ఆకూర తిన్నాక మాకు కళ్ళు, ముక్కు, చెవుల్లొంచి పొగలు వచ్చేవి 🙂
  మొత్తానికి మీ బ్లాగ్ మా చిన్ననాటి ఙాపకాలు గుర్తు తెచ్చింది.
  ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s