ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు అనొచ్చా ?

పదాహారవ శతాబ్దంలో నికోలా దా కొంతి అనే ఒక ఇటలీ వర్తకుడూ సాహసికుడు భారతదేశానికి ప్రయాణించి వచ్చాడు. ఎన్నో ప్రయాసలనోర్చి, బందిపోట్లనెదుర్కుని అతడు సాగించిన ఈ సాహసయాత్ర తరువాతి తరాలలో చాలమందికి ప్రేరణనిచ్చింది. నికోలా మొదట సిరియాలోని డమాస్కసులో స్థిరపడి ముస్లిము మతం స్వీకరించాడు. ఆ పై, భారతదేశం గురించి ఎన్నో కథలు విని ఇక్కడికి ప్రయాణం కట్టాడు. అరేబియా సముద్రం దాటి గుజరాతులో అడుగెట్టాడు. తిరిగి తిరిగి విజయనగర సామ్రాజ్య రాజధానికి చేరుకున్నాడు. దక్షిణభారతం అత్యుత్తమ దశలో ఉన్న సమయమది. బ్రిటీషువారి పాలన ఇంకో వంద ఏళ్ళకు కాని మొదలవదు. ఆ సమయంలో నికోలా విజయనగర వీధులలో నడుస్తుండగా వర్తకులు రత్నాలను రాళ్ళవలే అమ్ముతున్నారట. చూసి విస్తుపోయాడు. ఈ విజయనగర దేశం ప్రపంచం మొత్తంలోనే అత్యున్నతమైన సంస్కృతి, ధనరాశి, వైభవాలతో వెలుగొందుతోందనిి, ఒక్క ఇటలీ దేశం తప్ప ఈ సంస్కృతితో పోల్చదగ్గ దేశమేలేదని పేర్కొన్నాడు. ఆ పదహారవ శతాబ్దంలో రెనైజాన్సు అనే ఉద్యమం ఇటలీ లోని ఫ్లోరాన్సు పట్టణంలో మొదలైంది. అద్భుతమైన కట్టడాలు, శిల్పకళా వైభవాలు ఐరోపాఖండంలో ఇక్కడే మొదలయ్యాయి. మైఖలాంజెలో, లెయొనార్డో దావించీ మొదలైన కళాకారులు ఈ సమయంలోనే పుట్టారు. ఇటువంటి ఇటలీదేశం ఐరోపాఖండానికే సాంస్కృతిక రాజధాని. దానికి సరితోడు ప్రపంచం మొత్తంలోను విజయనగరమేనని నికోలా చెప్పడం చూడాలి.

మధురమైన తెలుగు భాషని విన్న తరువాత, అతడికి తన మాతృభాషైన ఇతాలియానా గుర్తొచ్చింది. కారణం మన తెలుగులో ఇటాలియన్నుకు మళ్ళే కఠువైన పదాంతాలుండవు. అన్నీ అచ్చులతో ముగిస్తాము తప్ప, హళ్ళులతో కాదు. ఇటాలియన్ను కూడా ఇట్లాగే ఉంటుంది. ఈ పద్ధతివల్ల భాష వీనులవిందుగా, మాట్లాడుతుంటే సంగీతం పాడుతున్నట్టుగా ఉంటుంది.

తెలుగుభాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు అన్నది నికోలాయో కాదో తెలీదు కాని, రెండువందల ఏళ్ళ పిమ్మట మచిలీపట్నంలో అడుగిడిన ఐరోపా వర్తకులు అక్కడి జాలర్ల భాషని చూసి ఇదే మాట అన్నారు. ప్రస్తుతమున్న తెలుగు భాష ఈ బిరుదుని కోల్పోతోందని నాభిప్రాయం. కారణం ఏమిటంటే పదాలను హళ్ళులతో ముగించడం పాటి అవుతోంది. ఎక్కువగా ఇంగ్లీషుపదాలని ఈవిధంగా పలుకుతున్నారు జనాలు. తెలుగు పద్ధతి ప్రకారం “కంప్యూటరు” అని పలకాలి, కానీ “కంప్యూటర్” అని కఠువుగా పలుకుతున్నారు. కారణం ఏమిటంటే న్యూసుపేపర్లు ఈవిధంగా పొల్లుతో అంతిస్తున్నాయి పదాలని – “పార్లమెంట్, లీడర్, మినిస్టర్” అంటూ. ప్రజలు ఇలాగే పలకడానికి ప్రయత్నిస్తున్నారు. క్రమేణా, తెలుగుభాష తీయదనం కోల్పోతోంది.

భారతదేశాన్ని బ్రిటిషువాడు కాకుండా ఇంకేదేశం వాడు స్వాధీనం చేసుకున్నా, ఆదేశం ప్రపంచంలో అగ్రగామి అయ్యుండేది. ఒకవేళ ఫ్రెంచివాడు స్వాధీనుంచుకుంటే ప్రపంచమంతా ఇప్పుడు ఫ్రెంచి మాట్లాడేవాళ్ళం ! ఇటలీవాడు స్వాధీనుంచుకుంటే ఇటాలియన్ను మాట్లాడేవాళ్ళం. ఈ లాటినుభాషలు మనదేశ భాషలకి మరింతగా పోలివుంటాయని నాభిప్రాయం. ఉదాహరణకి కొన్ని పదాలు తెలుగు-హిందీ-ఫ్రెంచి భాషలలో “రెండు – దో – దూ”, “ఏడు – సాత్ – సెత్”, “పది – దస్ – దిస్”, “జనాలు -జన్- జాన్”, “ఏమిటి -క్యా- క్వా”. ఆర్యభాషలలోని పోలిక అది. ఇంగ్లీషులోకొచ్చేసరికి పదాలన్ని కఠువుగా మారతాయి కనుక పోలిక తెలియదు. మనతెలుగులో యూరపు భాషలలో చాలావాటినుండి పదాలని తీసుకున్నాం. తాళానికి చెవి ఎలా వచ్చిందని మీకెప్పుడూ డౌటురాలేదా ? పోర్చుగీసు భాషలో “చాబిస్” అంటారు, తెలుగులోకి దిగి “చెవి” అయ్యింది. అన్నట్టు పవన్ కళ్యాణ్ పాట “ఏయ్ చికీతా, కొమేస్తాస్” అంటే స్పానిషు భాషలో “ఏయ్ పిల్లా, ఎలా ఉన్నావ్” అని. “మొహ్రబా..” అని ప్రేమికుడు సినిమాలో “ఊర్వశి ఊర్వశి” పాట మొదలవుతుంది. ఆ పదానికి టర్కిషు భాషలో “నమస్తే” అని అర్థం. మన తెలుగుకి పదాలని తీసుకోవడంలో బిడియాలు లేవు.నా ఉద్దేశ్యంలో, మిగతా భాషలతో పోల్చి చూస్తే ఇటాలియన్ను భాషైతే మరింత తీపిగా ఉంటుంది. దీనినుంచి తీసుకోవాలి పదాలని.

నేను ప్రస్తుతముంటున్నూరు ఇటలీ బోర్డరుకి అతిసమీపంలో ఉంటుంది. కొందరు ఇటాలియను ఫ్రెండ్సున్నారు నాకు. వారి భాష అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీదానికి పాడుతూ మాట్లాడతారు. ఎగ్జాక్టుగా చెప్పాలంటే అమలాపురం యాసలా ఉంటుంది. ఎల్బీ శ్రీరాము కారెక్టరు ఉంది కదా ఓ సినిమాలో, అలాగ. మాది గోదావరి జిల్లా కాబట్టి ఆ యాస ఎలా ఉంటుందో నాకు బాగ ఎరుక “ఏంటో, వచ్చేత్తన్నాది వచ్చేత్తనాది అంటన్నారు కానీ ఎంంంంంంంత సేపటికీ రాదేంటి ఈ ట్రెయినూ”, “ఏంంంంంంంంటండీీ మమ్మల్ని బొత్‌త్‌త్‌త్‌త్‌త్‌తిగా మర్చేపోయారూ.”, “ఓలమ్మో, ఈ రంగులరాట్నం ఎక్కితే నాకు కళ్ళు గిర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌రన తిరిగేత్తాయి” అలాగ అన్నమాట.

ఇటాలియన్ను భాషలో ఇటలీని “ఇతాలియా” అంటారు. మనలాగే ఇతాలియానోలు కూడా భోజనప్రియులు. యూరోపు మొత్తమ్మీద మసాలాలతో రుచికరంగా వండుకుతినేది ఇతాలియానోలే. ఇతాలియా టీవీ చానెళ్ళు పెడితే ఎప్పుడూ డాన్సు ప్రోగ్రాములే. వాళ్ళకో వీరపిచ్చి అబ్బాయి-అమ్మాయి డాన్సులంటే. జనాలు ఎప్పుడూ గెంతుతూ తెగ హుషారుగా ఉంటారు. చాల స్నేహస్వభావులు మనకు మళ్ళే. కాని, గోదావరి జిల్లాల వాళ్ళలాగ మృధుస్వభావులు కాదు. నా ఇతాలియన్ను ఫ్రెండు ఒకడు ఇలా చెప్పాడు “ఫ్రెంచివాళ్ళు రూల్సు పాటించరు అని మిగతా యూరపువాళ్ళు గోలపెడుతుంటారు. ఇటలీకొస్తే తస్సాదియ్యా, రూల్సు గురించి ఎత్తేవాడిని ముందే చితగ్గొడతారు. రోడ్డుమీద అడ్డంగా నడిచివెళ్తుంటే వెనకొస్తున్న లారీ వాడు హారనుకొట్టి ఏంటని అడిగితే ‘నా ఇష్టం, నే రోడ్డుమీదనే నడుస్తా, మీ అమ్మదగ్గరకెళ్ళి చెప్పుకో’ అని అంటారు”, అని చెప్పాడు. ఇటలీకింకా వెళ్ళలేదు నేను, వెళ్ళినప్పుడు చూడాలి ఆ సంగతులు 🙂

18 responses to “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు అనొచ్చా ?

 1. చాలా బాగుంది……కానీ..హళ్ళులు కాదండీ…….హల్లులు

 2. ఎప్పుడో, ఎక్కడో చదివాను, మన పేర్లు, స్వభావ ఆచారాలు కూడా కొంత కలుస్తాయట(?)! మచ్చుకు:- మన పేర్లు సీతయ్య, రామయ్యల్లాగే వాళ్ళు కూడా కొద్దిపాటి మార్పు చేర్పులతో ఆడ మగా పేర్లను అటూ ఇటూ వాడతారట.

  ఇక నా తరపు పరిశోధన ఏమిటంటే: వాళ్ళు వాటికన్‌ను, మనం తిరుపతిని గాఠ్ఠిగా పట్టుకొని కూర్చున్నాము :))

 3. తెలుగు, ఇతాలీ భాష గురించి చక్కటి వివరణ ఇచ్చారు. మీ బ్లాగు rss feed article length తగ్గించండి. కూడలి లో చాలా space occupy చేస్తుంది.

 4. అందరికీ హలో
  మీ కామెంట్లకి చాల థాంక్సు 🙂 ఇటాలియను సంస్కృతి నిజంగానే భలే పసందైనది. మామూలుగా మాఫియా గురించో, పాస్తా గురించో, లేదా ఫుట్బాలు గురించో తప్ప ఇటలీని ప్రస్తావించరు. కానీ, ఇటాలియన్లు చాలా చలాకీవాళ్ళు. వారి భాష తెలుగులాగే చాలా బాగుంటుంది.

  పేర్ల విషయానికొస్తే, మీరు చెప్పింది నిజమే. పౌలా అనేది అమ్మాయి పేరైతే, పౌల్ అనేది అబ్బాయి పేరు. కాని, ఇది ఐరోపావాసులందరికీ కూడా వర్తిస్తుంది. మన భారతదేశం లో (ఉత్తరభారతంలో ముఖ్యంగా) పేర్లకి ఒక భావం, ఒక కల్పనా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. కానీ, ఈ మధ్య, దేవుళ్ళకి మొక్కులు ఎక్కువైపోయి పేర్లన్ని శ్రీనివాసు అనో, వెంకటేశు అనో తయారవుతున్నాయి 🙂 తిరుపతివాడి దయ.

 5. మీ ఆంగ్ల బ్లాగు , మీ తెలుగు బ్లాగు, మీరు తెలుగుపదం గుంపులో చేసిన వ్యాఖ్యానాలు చూస్తుంటే, మీకు కూడా నాలాగే కొన్ని పరిశీలించదగ్గ మరియు పరిష్కరించుకోవలసిన విషయాలు ఉన్నాయనిపస్తుంది.
  చాలా సార్లు మీరు వ్రాసినదానికి మీరే కొంత వ్యతిరేకంగా వేరే చోట వ్రాస్తున్నట్టు అనిపించింది.
  చాలా ఆవేధన ఉంది, ఎదోకటి చెయ్యలి అనే తత్వం ఉంది. కొన్ని రోజుల తరువాత మీ ఆలోచనలు నికరానికి చేరుకుంటాయని నా అంచనా.
  పై వన్ని నా అభిప్రాయాలు మాత్రమే, నేను పూర్తిగా తప్పయ్యుండవచ్చు.
  రాకేశ్వర

 6. కిరణ్ మీ సమాచారము చాలా బావుంది . నా పేరు అరుణ కుమార్ , అరుణ అని పిలిచేవారు ఇంటిలొ . మీరు ఇటాలియన్స్ భాష కోసం చెప్పారు . వారి సాంప్రదాయం పెద్దలును గౌరవించెతీరు , పెద్ద కుటుంబం , కుటుంబ ప్రేమానురాగాలు మనకు చాల దగ్గరిగ వుంటాయి . మన వాళ్ళు చాలా మంది వారితొ వివాహిక సంబందాలు ఏర్పర్చుకుంటున్నారు . వారు పిల్లలును పెంచె తీరు కూడ మనకి మల్లే వుంటుంది .

 7. ఆ మధ్య ఒక వీడియో Italy vs remaining Europe అని చూశాను. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడం, బస్సు మనుషులున్న దగ్గర ఆగకపోవడం ..ఇలాంటివన్నీ చూస్తే అది India vs Europe అనబోయి అలా అన్నారా అనిపించింది.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 8. రాకెశ్ గారు
  “చాలా సార్లు మీరు వ్రాసినదానికి మీరే కొంత వ్యతిరేకంగా వేరే చోట వ్రాస్తున్నట్టు అనిపించింది” అని రాశారు. ఇంకొంత వివరంగా ఎక్కడ మీకు విరుద్ధంగా అనిపిస్తొందో చెప్పండి. మనిషికి 25 ఏళ్ళు నిండిన తరువాత, అభ్హిప్రాయాలన్ని దృడమైపోయి, మార్పే వీలుకాదన్నట్టు తయారవుతాడంట. నాకింక నెల రోజులుంది ఈ గడువు పూర్తవడానికి, చాల భయంగా ఉంది నాకు.

  ఒక విధమైన ఇజానికి అలవాటు పడిపోతే, మార్పుకి దూరంగా తయారైతే, ఆలోచనలకి అప్పుడే మరణం సిద్ధించినట్టు. నా ఉద్దేశ్యంలో, ప్రతీ నిమిషంలోనూ మార్పుకి సన్నిహితంగా ఉండే మెదడే జీవం ఉన్న మెదడు. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే.

  అరుణ గారు, ప్రసాద్ గారు
  మీరు చెప్పిన విశేషాలు నిజమే ! స్వయంగా ఇటలీ వెళ్ళి అక్కడి సంగతులు చూడాలి 🙂

 9. నాకు ఇటీవలే 27 నిండాయి. ప్రస్తుతానికి నాలో దృఢమైపోయిన అభిప్రాయం ఏమిటంటే – మన ప్రతి అభిప్రాయమూ కాలంతోపాటు మార్పుకులోనయ్యేదేనని.

  “క్రమేణా, తెలుగుభాష తీయదనం కోల్పోతోంది.” — బ్లాగులున్నాయి, అంతర్జాలంలో తెలుగు విప్లవంతో వార్తాపత్రికల భాషే తెలుగుభాషకు నమూనా అయ్యే పరిస్థితి మారుతోంది. ఆ ప్రమాదం రాకుండా మనమే కాపాడుకోవచ్చు. కానీ ఇక్కడ కిరణ్, రాకేశ్ లాంటివన్నీ హలంతాలేనాయె 😉

 10. నా అనుభవం నుంచి నేను చెబితే తప్పు లేదనుకుంటా-ఇది కిరణ్ గారి బ్లాగే అయినా

  1. సామాన్యంగా మనిషెప్పుడూ కరుడుగట్టడు, అప్పసం మారుతూనే ఉంటాడు. అయితే వయసు మీద మార్పు వేగం కొంచెం మందగిస్తుందంతే ! మారాల్సినంత మారనివ్వని ఫ్యాక్టర్లు కొన్ని తర్వాత్తర్వాత కొంచెం పనిచెయ్యడం మొదలుపెడతాయి. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలూ, కెరీరు వగైరా !

  2. మనుషుల్ని మాటలతో/మాటల్లో అర్థం చేసుకుంటున్నంత కాలమూ వాళ్ళ ప్రకృతి పరస్పర విరుద్ధంగానే కనిపిస్తుంది. కాని వాళ్ళ అనుభవాలు మనకూ అయినప్పుడు పరస్పర విరుద్ధత ఏమీ లేదని గుర్తిస్తాము.

 11. కిరణ్, నాగరాజా (తెలుగునేల) బ్లాగు చూస్తూ అక్కడి మీ వ్యాఖ్యలు చదివి అలా ఇక్కడికొచ్చాను. మీ రెండు భాషల బ్లాగులూ బాగున్నాయి. ఆంగ్ల బ్లాగుని కూడా తెలుపు మీద నలుపు అక్షరాలుగా పెట్టండి దయచేసి – కళ్ళు నెప్పెడుతున్నాయి.

 12. అసలు విషయం రాయడం మర్చిపోయాను. ఒకానొక కాలంలో “సినిమా పారడీజో”తో మొదలు పెట్టి తెగ ఇటాలియను సినిమాలు చూశాను. శ్రద్ధ పెట్టకుండా అలవోకగా వింటే ఏదో యాస తెలుగులాగా అనిపించేది. వాళ్ళేం చెబుతున్నారో అని మాట మీద శ్రద్ధ పెట్టేప్పటికి చెయ్యిజారిపోయేది 🙂

 13. really excellent!!! even i have some of those words which are interlinking between german – sanskrit and other european languages.
  really excellent,

 14. పింగుబ్యాకు: iTali song! | సోది sOdi

 15. చాలా చక్కటి వివీరాణ ఇచారు. మన తెలుగు ప్రభావం ఈ మధ్య కాలం లో ఇంకా పెరుగుతుంది. thanks to http://www.quillpad.in/telugu. ఈ వెబ్సీతెస్ వలన తెలుగులో వ్రాయడం చాలా సులబంగా ఉంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s