కంప్యూటర్లు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఈ యుగంలో, ఆ పెనగలుపు నుండి ఎక్కడి సినిమాలనైను ఎక్కడివారైనా దించుకుని చూసుకోవచ్చు. మన సంస్కృతి, వారి సంస్క్కృతి అన్న అడ్డుగోడలింకేమీ లేవు. నాసిరకం సినిమాలను, సంగీతాన్ని మనదేశంలో చెల్లుబాటు చెయ్యవచ్చు, పిచ్చివాళ్ళవలే కేరింతలు కొట్టే వీర ఫేనులు ఉన్నారు. కానీ ఇదే సరుకుని మిగతా దేశంవాళ్ళ విమర్శలనుండి వేర్పెట్టలేము. ఇది యూట్యూబు యుగం. ఎవ్వడైనా వీడియోలు పెట్టవచ్చు, మరింకెవ్వడైనా వాటిని దిలోడించుకోవచ్చు. ఎలాంటి కామెంట్లైనా పబ్లిగ్గా రాసుకోవచ్చు.
మన చిరంజీవి ప్రస్తుతం యూట్యూబులో మహా పాపులర్ అయ్యివున్నాడు. ఏదన్నా మంచి విషయమా అంటే కాదు. 1980లో ఎప్పుడో దొంగ అనే సినిమాలో మనవాళ్ళు మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ వీడియోని మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం పాట పాడేశాడు, చిరంజీవి డాన్సు ఆడేసాడు. వీర ఫేనులు జైజైలు కొట్టేసారు. కానీ, పాతికేళ్ళ తరువాత సీను ఇలా తయారవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు, ఆ వీడియోలో ప్రతీ అడ్డమైనవాడు “భలే ఉంది, చింపాంజీ డాన్సు. సిగ్గులేని ఇండియన్లు, కాపీ కొట్టడంలో కూడా నాసిరకమే” అంటూ వందలకొద్దీ కామెంట్లు.
ఏదో సరదాగా తెలుగు పాటలు చూసుకుందాం అని యూట్యూబు తెరిచిన నాలాంటి వాళ్ళకి ఇదీ కనపడేది. మన సంస్కృతి పరువు మర్యాదలని ఇలా తేరగా గంగలో కలుపిన ఆ డైరెక్టరుని ఏం చెయ్యాలి ? తమ అభిమాన హీరో పరువుని ఆ వీర ఫేనులు ఎలా కాపాడుకుంటారో వారికే తెలియాలి ఇప్పుడు. రుద్రవీణ, స్వయంకృషి లాంటి మంచి సినిమాలు చేసిన చిరంజీవిని చివరికి ప్రపంచమంతా చూసేది ఈ వీడియో ద్వారా.
పదేళ్ళనాటి సంగతి. కాకినాడలో ఇంటర్ చదువుకునే రోజులు. ఓసారి బాలకృష్ణ సినిమా ఒకటి, చిరంజీవి సినిమా ఒకటి ఒకేసారి థియేటర్లలో రిలీజయ్యాయి. వీరఫేనులు ఒకరితో ఒకరు తెగ దెబ్బలాట పెట్టుకున్నారు. వారితో ఆగితే బానే ఉండేది. రోడ్డుమీద వెళ్తున్న మనుషులని పట్టుకుని “నువ్వు చిరు ఫేన్వా, బాలయ్య ఫేన్వా ? ” అని అడిగేవారు. తప్పు ఆన్సరు చెప్తే నాలుగు ఉతుకులు ఉతికేవారు ! ఈ దెబ్బకి జడిసి రోడ్డుమీద నడిచివెళ్ళాలంటే భయమేసి కూర్చున్నారు అందరు. చివరికి, పొలీసులకి తిక్కరేగి రౌడీమూకల్ని తన్ని బొక్కలో తోసారు కొన్ని రోజులు.
ఇదేదో పిచ్చ ఫేనుల వెర్రి అనుకున్నాను నేను. తరువాత తెలిసింది, దీనికి ఇంకా లోతు ఉందని. చిరు ఫేన్లందరు కాపులు, బాలయ్య ఫేన్లు కమ్మవాళ్ళు. కులపోరుని ఇలాగ రోడ్డుమీదకి తెచ్చి వాళ్ళ హీరోలకి అంటగట్టారు. ఏవనాలి వీళ్ళని !!? ఇప్పుడు వీరందరికీ రోజూ ఆ యూట్యూబు పేజీలు చూపించాలి.
ఇప్పుడు ఈ చిరంజీవి యూట్యూబు వైభోగం చూసి బాలయ్య ఫేన్లకి పారాహుషార్గా ఉండుంటుంది. ఇంకా బాలయ్య తొడకొడితే ట్రెయిను వెనక్కి పరిగత్తే సీను కనుగొనలేదు జనాలు. దాన్ని చూసిన తరువాత ఎవ్వడికన్నా నోరు పెగుల్తుందా ?
ఇంతకీ ఇదా మన తెలుగు సంస్కృతి, మనం చూసి గర్వపడాల్సినది ? మనకేమన్నా బ్రెయిను డామేజీయా ఇలాంటి సరుకుని మార్కెట్లో ఆడించడానికి ? ఇంకా 80లే నయము. ప్రస్తుతమున్న తెలుగు సినిమాలు చూస్తుంటే వాంతి వస్తోంది. నేను బొత్తిగా సినిమాలే చూడడం మానేసాను. ఎప్పుడో బస్సులో హైదరాబాదు నుండి ఇంటికి కాకినాడ వెళ్తుంటే టీవీ పెట్టేసేవారు, గత్యంతరం లేక చూడాల్సివచ్చింది కొన్ని ఆణిముత్యాలని.
ఎనభై మిలియన్లమంది జనాలట తెలుగువాళ్ళు. ఇంతమంది కలిసి సాధించేది ఏమిటి ? ఇన్ని డబ్బులు సంపాదించుకుని అమెరికాలలో కులుకుతున్న వాళ్ళందరూ ఈ చివాట్లు, అగచాట్లు పడాల్సిందేనా ? మనకేమి తక్కువ, ఐఐటీ ప్రవేశ పరీక్షలలో అన్ని రాంకులు కొట్టేది మనమేగా. ఐఏయెస్ పరీక్షలో ఈసారి ఫస్టు రాంకు కొట్టింది మనవాడే.
ప్రతి తెలుగువాడికి నేను చేసే విన్నపం ఏమిటంటే బుర్ర ఉపయోగించండి. ఏమాత్రం టాలెంటు ఉన్నా ఖాలీగా కూర్చోవద్దు. సృజనాత్మకమైన జీవితమే సరైన జీవితం. మూసపద్ధతిలో బండిలాగడానికి మనమేమి చాకలోడి గాడిదలం కాదు. మెదడున్న మనుషులం.
ఇంక కులం సంగతికొస్తే ఇది మనకి అతి సిగ్గుచేటు. ఏంటి మనలో మనకి తేడాలు ? ఈ రోజుల్లో ? ఇంకా ప్రతీవొక్కడు వాడి కులం అమ్మయిలనే పెళ్ళి చేసుకుంటున్నాడు. వాళ్ళ కులం నాయకులకే ఓట్లు వేస్తున్నాడు. వాళ్ళ కులం వారికే ఉద్యోగాలిస్తున్నాడు. ఇక వాడికులం హీరోకే జైజైలు కొడుతున్నాడంటే పిచ్చి ఎంతముదిరి ఉందో తెలిసొస్తుంది.
నా అదృష్టం బాగుండి ఒక మంచి ఇంజనీరింగు కాలేజీలో పడ్డాను. మా ఫ్రెండ్సు కులమేమిటో ఇప్పటికీ తెలియదు. కానీ ఇంటర్ ఫ్రెండ్సు చెప్పేవారు వాళ్ళ కాలేజీలలో సంగతి – రాగింగు టైములో అడిగే మొదటి ప్రశ్న “ఏంట్రా నీ బ్రాండు ?” అని. అదేంటో వెనకేసిన స్టాంపు లాగ. ఇలాంటి వాళ్ళు బతికి ప్రయోజనం ఏమిటి, వెంటనే చచ్చిపోవడం మేలు, కొంత జనాభా తగ్గుతుంది.
శ్రీశ్రీ పుట్టిన రాష్ట్రమేనా మనది ? కందుకూరి వీరేశలింగం పుట్టింది ఇక్కడేనా ? కులం పేరుతో పెళ్ళి ప్రకటనలేంటి ? ఇది ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచించి చూడండి.